Narayana Educational Institutions
-
మాకు ఇదేమి ఖర్మ నారాయణా..!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: భారీగా ఫీజులు చెల్లించి తమ విద్యా సంస్థల్లో పిల్లలకు మంచి విద్యను అందించాల్సిన టీడీపీ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ తన స్కూళ్లు, కాలేజీలను రాజకీయాలకు వేదికగా మార్చేశారు. చంద్రబాబు బినామీగా, టీడీపీ నేతగా, మాజీ మంత్రిగా చిరపరిచితుడైన నారాయణ ఈసారి ఎన్నికల్లో టీడీపీ తరపున నెల్లూరు నగర అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో నారాయణ విద్యా సంస్థల్లోనే రాజకీయ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. సంస్థలో ఉద్యోగులు, ఉపాధ్యాయులతో ఎన్నికల పనులు చేయిస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకుని పిల్లలకు పాఠాలు చెప్పడానికి వచ్ఛిన ఉపాధ్యాయులను ఎన్నికల ప్రచారం కోసం విద్యార్థుల ఇళ్లకు పంపుతున్నారు. ఈ దఫా ఓటు టీడీపీకే వెయ్యాలని ప్రాథేయపడేలా చేస్తున్నారు. బలవంతంగా ఎన్నికల ఉచ్చులోకి.. 2019 ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఓడిపోయిన నారాయణ నాలుగున్నరేళ్లపాటు నెల్లూరుకు ముఖం చాటేశారు. ఆయనపై టీడీపీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి ఉంది. దీంతో ఈసారి టీడీపీకి ప్రచారం చేయడం కోసం తన విద్యాసంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులను బలవంతంగా ఎన్నికల ఉచ్చులోకి లాగారు. ఇప్పటికే కొందరు ఉపాధ్యాయులు, ఉద్యోగులను రోజువారీ విధుల నుంచి తప్పించి ఎన్నికల విధులు అప్పజెప్పినట్లు సమాచారం. దాదాపు 500 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులను కలిపి నారాయణ టీం (ఎన్ టీం)గా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆ బృందంతో గతంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో ఓటర్ల వెరిఫికేషన్ చేయించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా సమాచారం, వారి మొబైల్కొచ్చే ఓటీపీ అడగడంతో ప్రజలు వారికి దేహశుద్ధి చేసిన ఘటనలు ఉన్నాయి. అయినా, నారాయణ ఇప్పుడు ఎన్నికల ప్రచారం కోసం వారిని ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గాల్లో ప్రచారం చేయిస్తున్నారు. ప్రతి రోజూ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి.. ఎంపిక చేసిన ఉపాధ్యాయులు ఆ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థుల అడ్రెస్లు సేకరించి, ఒక్కొక్కరూ రోజుకు ముగ్గురు విద్యార్థుల ఇళ్లకు వెళుతున్నారు. తల్లిదండ్రులతో ఎన్నికలపై చర్చిస్తున్నారు. ఈ దఫా ఓట్లు టీడీపీకే వేయాలని వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే తమ యాజమాన్యం ఒత్తిడిపై వచ్చామని, ఏమీ అనుకోవద్దని ప్రాధేయపడుతున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లను సందర్శించినట్లు ఫొటోలు దిగి విద్యా సంస్థల వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తున్నారు. మాట వినకపోతే డిస్మిస్ లేదా బదిలీ ఉన్నత చదువులు చదివిన తమకు వేతనం తక్కువైనప్పటికీ గౌరవప్రదమైన ఉద్యోగం అని చెప్పుకునేందుకు ఎక్కువ మంది నారాయణ విద్యా సంస్థల్లో చేరుతున్నారు. ఏళ్ల తరబడి అదే సంస్థలో పని చేస్తున్నారు. నారాయణ ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్ఛిన 2019 నుంచి నారాయణ సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులను రాజకీయ పనులకు వాడుకుంటున్నారు. ఉద్యోగులను భయపెట్టి మరీ ఎన్నికల పనులు చేయిస్తున్నారని విద్యాసంస్థ ఉద్యోగులు, ఉపా«ద్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు తిరస్కరించిన ఉద్యోగులను పలు సాకులతోఉద్యోగం నుంచి తొలగించడమో, సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడమో చేస్తున్నారని ఓ ఉద్యోగి వాపోయారు. -
‘నారాయణ’లో వడ్డీ దుకాణం!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ డబ్బు వసూళ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వడ్డీ ఆశ చూపించి రాబోయే ఎన్నికల కోసం నెల్లూరు, ప్రకాశం జిల్లాల వ్యాపారుల నుంచి వందల కోట్లు వసూలు చేసిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. నారాయణకు చెందిన నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాల కేంద్రంగా ఈ వసూళ్లు జరిగాయి. దీనికోసం ఈ కాలేజిలో వారం క్రితం 4 కౌంటర్లు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా రూ.650 కోట్లు వసూలు చేసి, రహస్య ప్రదేశానికి తరలించినట్లు సమాచారం. రూ.5 వడ్డీకి .. విద్యా సంస్థల అధినేత అయిన నారాయణకు మార్వాడీలు, వ్యాపారులతో మంచి సంబంధాలు ఉన్నాయి. విద్యా సంస్థల కోసం వ్యాపారులతో తరచూ లావాదేవీలు నిర్వహించేవారు. దీంతో గత ఎన్నికల్లోనూ ఇలాగే రూ.2 వడ్డీకి రూ.400 కోట్లు వసూలు చేసినట్లు ప్రచారం జరిగింది. ఈసారి 2 రూపాయల వడ్డీకి వ్యాపారులు ముందుకు రాకపోవడంతో ఐదు రూపాయలకు పెంచారు. ఈమేరకు ప్రకాశం, నెల్లూరు జిల్లాల వ్యాపారులు, మార్వాడీలకు సమాచారమిచ్చారు. వడ్డీ పెరగడంతో అనేక మంది వ్యాపారులు, మార్వాడీలు క్యూ కట్టారు. ఇలా నాలుగు రోజుల్లోనే రూ.650 కోట్లు సేకరించినట్లు సమాచారం. వ్యాపారులే కాకుండా, నారాయణ సంస్థలో పనిచేసే ఉద్యోగుల నుంచి కూడా నగదు సేకరించారు. ఈ సొమ్ముకు ఆధారాలు ఉండకూడదన్న ఉద్దేశంతో ఎవరికీ రశీదులు ఇవ్వలేదు. అందుకు బదులుగా టోకెన్ల ద్వారా లావాదేవీలు నిర్వహించారు. వ్యాపారులు నగదు చెల్లించగానే టోకెన్లు ఇచ్చారు. వడ్డీ కావాల్సిన వారికి ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తామని, లేదంటే ఏడాది తర్వాత అసలు, వడ్డీ కలిపి ఇస్తామని వ్యాపారులకు చెప్పారు. నారాయణ కళాశాలలో వడ్డీ వ్యాపారం బయటకు పొక్కడంతో దుకాణాలు మూయించేశారు. నగదును రహస్య ప్రాంతంతో దాచేశారు. అక్కడి నుంచి పార్టీ అధినేత సూచనల మేరకు అభ్యర్థులకు చేరవేస్తారు. నారాయణ ఇష్టారాజ్యం చంద్రబాబుతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి, ఆయన బినామీగా ఉన్న నారాయణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే చంద్రబాబు ఆర్థిక వ్యవహారాలు చూసుకునేవారు. ప్రతి ఎన్నికల సమయంలో తన విద్యా సంస్థల నుంచే డబ్బు సేకరించి చంద్రబాబుకు పంపుతుంటారు. అంతేకాదు తన విద్యా సంస్థల ఉద్యోగుల ద్వారానే సర్వేలు చేయించేవారు. 2014లో చంద్రబాబు సీఎం కాగానే నారాయణకు ఎమ్మెల్సీ కట్టబెట్టి ఏకంగా మంత్రిని చేశారు. చంద్రబాబు కేబినెట్లో కీలక మంత్రిగా ఉంటూ ఆయన బినామీగా నారాయణ రాజధాని భూసేకరణ నుంచి అన్నింటా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడిన విషయం తెలిసిందే. నారాయణ విద్యా సంస్థల్లోనూ విద్యార్థులపై అమానుష ఘటనలు పలుమార్లు వెలుగుచూశాయి. విద్యార్థుల బలవన్మరణాలకూ దారి తీశాయి. ఇటీవలి కాలంలో నారాయణ వైద్య కళాశాలలో డ్రగ్స్ కూడా విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. రెండేళ్ల క్రితం ఓ వైద్యుడు మత్తు ఇంజక్షన్ చేసుకొని మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల విద్యార్థులు అనేక మంది మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని తల్లిదండ్రుల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయి. కళాశాలలో నిషేధిత మందుల విక్రయాలు జరుగుతున్నట్లు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం జిల్లా ఔషధ నియంత్రణ అధికారులు కాలేజీలో సోదాలు చేశారు. -
నారాయణ విద్యాసంస్థల్లో బయటపడ్డ భారీ కుట్ర
-
నారాయణ విద్యా సంస్థలపై ఎన్నికల కమిషన్ కు వైఎస్సార్ సీపీ ఫిర్యాదు
-
నారాయణ విద్యా సంస్థలపై ఈసీకి ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: నారాయణ విద్యా సంస్థలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. నారాయణ విద్యా సంస్థలు ద్వారా ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. విద్యార్థుల వ్యక్తిగత, సున్నిత సమాచారాన్ని నారాయణ విద్యాసంస్థల సిబ్బంది సేకరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్ధుల కుటుంబాల వివరాలను మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ సేకరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల వ్యక్తిగత డేటా తీసుకోవటం ప్రజాప్రాతినిత్య చట్టం 1951, ఆర్టికల్ 19, 21 ప్రకారం నేరమంటూ పేర్కొన్నారు. విద్యా సంస్థలపై, నారాయణపై చర్యలు తీసుకోవాలని కోరారు. చదవండి: AP: పార్టీ ఫిరాయించారు.. వేటేనా? ఇదేం పని నారాయణా?.. క్లిక్ చేయండి -
ఇదేమి పని ‘నారాయణా’
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నారాయణ విద్యా సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులు టీడీపీ ఎన్నికల ఉచ్చులో ఇరుక్కున్నారు. తమ విద్యాసంస్థల అధినేత, టీడీపీకి చెందిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ రాజకీయంలో సమిధలైపోతున్నారు. వారి చేత నారాయణ ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇలా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్న నారాయణ సిబ్బంది, ఉపాధ్యాయులకు ప్రజలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగిస్తున్నారు. మూడురోజుల క్రితమే నెల్లూరు నగరం మూలాపేట డివిజన్లో ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్న నారాయణ సంస్థ ఉద్యోగినికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తాజాగా మంగళవారం నగరంలోనే 42వ డివిజన్ మన్సూర్‌నగర్‌లో ఇదే తరహాలో నారాయణ విద్యా సంస్థల ఉపాధ్యాయుడు ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో వ్యక్తిగత సమాచారం సేకరిస్తుండగా స్థానికులు ఆగ్రహించి అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఎన్ టీంగా ఏర్పాటు నారాయణ టీడీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ఆయన 2024 ఎన్నికల్లో నెల్లూరు నుంచి మరోసారి బరిలోకి దిగేందుకు సమాయత్తం అవుతున్నారు. నాలుగున్నరేళ్ల పాటు నెల్లూరుకు ముఖం చాటేసిన ఆయనపై టీడీపీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఆయన కోసం పనిచేయడానికి టీడీపీ నేతలెవరూ ముందుకు రావడంలేదు. దీంతో తన విద్యా సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులను రంగంలోకి దింపుతున్నారు. దాదాపు 150 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులతో నారాయణ టీం (ఎన్ టీం)గా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆ బృందంలోని వారితో నెల్లూరు నగరంలో ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారం తీసుకుంటున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా సమాచారం, వారి మొబైల్‌కు వచ్చే ఓటీపీని కూడా అడుగుతుండడంతో స్థానికుల్లో ఆందోళన ఏర్పడింది. తమ ఓట్లు తొలగిస్తారని స్థానికులు వారిని అడ్డుకుంటున్నారు. నెల్లూరు నగరంలో మూడు రోజుల్లోనే ఇద్దరు ఉపాధ్యాయులు దేహశుద్ధి చేయించుకొన్నారు. ఇదేం ఖర్మ నారాయణా.. అంటున్న ఉద్యోగులు నారాయణ విద్యా సంస్థల్లో అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులుగా అనేక మంది పనిచేస్తున్నారు. 2014 ఎన్నికల వరకు నారాయణ టీడీపీకి ఆర్థికంగా తోడ్పాటు అందిçస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు బినామీగా వ్యవహరించేవారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో నారాయణను చంద్రబాబు ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి ఇచ్చారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి నారాయణ సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులను రాజకీయ ఉచ్చులోకి దింపుతున్నారు. ఒకవేళ ఎవరైనా నిరాకరిస్తే ఏదో ఒక సాకుతో ఉద్యోగం నుంచి తొలగించడం.. లేదా దూర ప్రాంతాలకు బదిలీ చేయడం చేస్తున్నట్లు ఓ ఉద్యోగి వెల్లడించారు. ఇప్పుడు ఉద్యోగులు ప్రజల చేతిలో తన్నులు తింటున్నారు. మాకు ఇదేం ఖర్మ అంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నారాయణ క్వాష్ పిటిషన్‌పై రిజిస్ట్రీ అభ్యంతరం
సాక్షి, అమరావతి: పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో తన బెయిల్‌ను రద్దు చేస్తూ చిత్తూరు సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నారాయణ విద్యా సంస్థల అధినేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తింది. సెషన్స్ కోర్టు ఉత్తర్వులపై క్వాష్ పిటిషన్ దాఖలుకు వీల్లేదని, రివిజన్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని తెలిపింది. రిజిస్ట్రీ అభ్యంతరంపై న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు మంగళవారం విచారణ జరిపారు. నారాయణ తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ.. సీఆర్పీసీ సెక్షన్ 482 కింద క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంపై నిషేధం లేదని అన్నారు. సెషన్స్ కోర్టు ఉత్తర్వులపై దాఖలు చేసే క్వాష్ పిటిషన్‌కు విచారణార్హత ఉందంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించారు. దీంతో రిజిస్ట్రీ అభ్యంతరాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. నారాయణ పిటిషన్‌కు నంబరు కేటాయించాలని ఆదేశించారు. లూత్రా వాదనలు కొనసాగిస్తూ.. బెయిల్‌ను రద్దు చేస్తూ జిల్లా, సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని అన్నారు. అన్ని ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసిందన్నారు. పైగా, అవి తాత్కాలిక ఉత్తర్వులేనని తెలిపారు. తాత్కాలిక ఉత్తర్వులపై పోలీసులు రివిజన్ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదని, దానికి విచారణార్హత లేదని వివరించారు. నారాయణ పబ్లిక్ సర్వెంట్ కాదని, అందువల్ల ఐపీసీ సెక్షన్ 409 కింద విచారణకు వీల్లేదన్నారు. పోలీసుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్‌రెడ్డి స్పందిస్తూ.. ఈ కేసులో అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తారని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని కోరారు. దీంతో న్యాయమూర్తి తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. -
నారాయణకు చుక్కెదురు
చిత్తూరు అర్బన్: టీడీపీ నేత, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణకు చిత్తూరు జిల్లా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల సమయంలో ప్రశ్నపత్రాల మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణకు మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసింది. ఈ మేరకు చిత్తూరులోని 9వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30లోపు నారాయణ కోర్టులో లొంగిపోవాలని న్యాయమూర్తి శ్రీనివాసులు ఆదేశాలిచ్చారు. నారాయణ కోర్టులో లొంగిపోయిన అనంతరం ఆయనను జుడీషియల్ రిమాండ్‌కు తరలించాలని తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో తెలుగు కాంపోజిట్ ప్రశ్నపత్రాన్ని తిరుపతి నారాయణ పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ ఎన్.గిరిధర్‌రెడ్డి ‘చిత్తూరు టాకీస్’ అనే వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చిత్తూరు డీఈవో పురుషోత్తం ఇచ్చిన ఫిర్యాదుతో వన్‌టౌన్ సీఐ నరసింహరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏప్రిల్ 29న తిరుపతి జిల్లా చంద్రగిరిలోని శ్రీకృష్ణారెడ్డి చైతన్య ప్రిన్సిపాల్ పి.సురేష్, తిరుపతి ఎన్ఆర్ఐ అకాడమీ ఆంగ్ల ఉపాధ్యాయుడు కె.సుధాకర్, తిరుపతి చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ ఆరిఫ్, డీన్ కె.మోహన్, గిరిధర్‌రెడ్డిలతోపాటు గంగాధర నెల్లూరు మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పవన్‌కుమార్‌రెడ్డి, బి.సోమును అరెస్టు చేశారు. వీరిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు మినహా మిగిలినవాళ్లంతా గతంలో నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసినవాళ్లే కావడం గమనార్హం. గిరిధర్‌రెడ్డి, సుధాకర్, సురేష్, పవన్‌కుమార్‌రెడ్డిలను మే 9న కస్టడీకు తీసుకుని విచారించారు. టీడీపీ నేత నారాయణ ఆదేశాలతోనే తాము ఇదంతా చేసినట్లు నిందితులు అంగీకరించారు. నారాయణ ఆదేశాలతో ఆ సంస్థ సిబ్బంది మరికొందరు కార్పొరేట్ విద్యాసంస్థల ప్రతినిధులతో కలిసి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారని వెల్లడైంది. దీంతో నారాయణను మే 10న ఐపీసీ 5 రెడ్‌విత్ 8, 10 ఎగ్జామినేషన్ మాల్‌ప్రాక్టీస్ యాక్టు 408, 409, 201, 120 (బి) ఐపీసీ, 65 ఆఫ్ ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో చిత్తూరులోని నాలుగో అదనపు ఇన్చార్జ్ మేజిస్ట్రేట్ సులోచనరాణి.. నారాయణకు బెయిల్ మంజూరు చేశారు. దీనిపై పోలీసులు చిత్తూరు జిల్లా కోర్టులో సవాలు చేశారు. ఇదే కేసులో మిగిలిన నిందితులకు జుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించారని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తాజాగా తీర్పును వెలువరించింది. -
మంచి ర్యాంక్‌కు మాక్ టెస్టులు
సాక్షి మీడియా గ్రూప్, నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్(తెలంగాణ)/ ఈఏపీసెట్(ఆంధ్రప్రదేశ్), నీట్ మాక్ టెస్టులు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం.. ఇంజనీరింగ్, లేదా మెడిసిన్. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజనీరింగ్/మెడికల్ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు. అందుకోసం ఖర్చులకు వెనుకాడకుండా పిల్లలను కోచింగ్‌కు పంపిస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ‘నీట్’.. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్/అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో అడ్మిషన్ కల్పించే ఎంసెట్/ఈఏపీసెట్ కోసం లక్షల మంది సన్నద్ధమవుతున్నారు. వీరికి చేయూతనిచ్చేలా నిపుణుల ఆధ్వర్యంలో రూపొందించిన ఎంసెట్/ఈఏపీసెట్, నీట్ మాక్ టెస్టులను నిర్వహించనున్నారు. పరీక్షకు ముందు వాస్తవ పరీక్షలాంటి వాతావరణంలో జరిగే ‘సాక్షి’ మాక్ టెస్ట్ రాయడం ద్వారా.. విద్యార్థులు తమ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకొని, మరింత మెరుగుపడవచ్చు. అలాగే ‘సాక్షి’ మాక్ టెస్టుల్లో ఉత్తమ ప్రతిభను చూపిన టాప్ టెన్ ర్యాంకర్లు ఆకర్షణీయ బహుమతులూ గెలుచుకోవచ్చు. ఆన్లైన్ టెస్ట్‌లకు టెక్నాలజీ పార్ట్నర్గా‘MY RANK’ వారు వ్యవహరిస్తున్నారు. ►సాక్షి మాక్ ఎంసెట్ (ఇంజనీరింగ్) /ఈఏపీసెట్ పరీక్ష 30.06.2022. ►ఎంసెట్ / ఈఏపీసెట్ అగ్రికల్చర్ పరీక్ష 01.07.2022 తేదీల్లో ఆన్లైన్లో జరుగుతుంది. ►సాక్షి మాక్ నీట్ పరీక్ష 03.07.2022 ఆఫ్‌లైన్ విధానంలో జరుగుతుంది. ►ఒక్కో పరీక్షకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.250. అభ్యర్థులు http://www.arenaone.in/mock ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. విజయవంతంగా దరఖాస్తులు పూర్తిచేసిన అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్ మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్‌కు వస్తుంది. పరీక్ష కేంద్రం: విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, దేశ్ముఖి గ్రామం, పోచంపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 25.06.2022 వివరాలకు సంప్రదించాల్సిన నంబర్: 9666013544 -
వారి వ్యాజ్యాలకు విచారణార్హతే లేదు
సాక్షి, అమరావతి: పదో తరగతి ప్రశ్నపత్రం మాల్ ప్రాక్టీస్ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు పొంగూరు సింధూర, శరణి, అల్లుడు కె.పునీత్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లకు అసలు విచారణార్హతే లేదని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. నారాయణ విద్యా సంస్థపై పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ వివరాలన్నింటినీ కోర్టు ముందుంచుతామని ఆయన వివరించారు. ప్రశ్నాపత్రం మాల్ ప్రాక్టీస్ కేసులో పిటిషనర్లు అసలు నిందితులు కాదని, అలాంటప్పుడు వారు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడంలో అర్థం లేదన్నారు. కేవలం ఆందోళన ఆధారంగా దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలను కొట్టేయాలని కోరారు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు.. పదవ తరగతి ప్రశ్నపత్రం మాల్ ప్రాక్టీస్ కేసులో పోలీసులు తమను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అందువల్ల తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు పొంగూరు సునీత, పొంగూరు శరణి, అల్లుడు కె.పునీత్, నారాయణ మామ రాపూరు కోటేశ్వరరావు, నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ డిప్యూటీ జనరల్ మేనేజర్ జె.కొండలరావు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మాలేపాటి కిషోర్, సొసైటీ సభ్యులు వీపీఎన్‌ఆర్ ప్రసాద్, మరో ఆరుగురు హైకోర్టులో వేర్వేరుగా గత ఆదివారం పిటిషన్లు దాఖలు చేశారు. హౌస్ మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరిపిన న్యాయమూర్తి, పిటిషనర్ల విషయంలో ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు ఐపీసీ వర్తించదు.. బుధవారం ఈ వ్యాజ్యాలు న్యాయమూర్తి జస్టిస్ కుంభజడల మన్మధరావు ఎదుట విచారణకు రాగా పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ప్రత్యేక చట్టం కింద కేసు నమోదు చేసినప్పుడు తిరిగి ఐపీసీ కింద కేసు నమోదు చేయడానికి వీల్లేదని ఇదే హైకోర్టు చెప్పిందన్నారు. పదో తరగతి ప్రశ్నపత్రాల మాల్ ప్రాక్టీస్‌కు సంబంధించి ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (మాల్ ప్రాక్టీస్, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక ) చట్టం కింద కేసు నమోదు చేశారని, ఇది ప్రత్యేక చట్టమని తెలిపారు. అందువల్ల ఐపీసీ సెక్షన్ల కింద కేసు పెట్టడానికి వీల్లేదన్నారు. సెక్షన్ 41ఎ ప్రకారం నడుచుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. దీనిని పోలీసుల తరఫున హాజరైన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం నడుచుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. అదనపు పీపీ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, కౌంటర్‌ను పరిశీలించాక పిటిషన్లపై నిర్ణయం వెలువరిస్తామని తెలుపుతూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
నారాయణకు నోటీసులు.. అడిషనల్ ఏజీ వాదనలతో ఏకీభవించిన కోర్టు
-
నారాయణ బెయిల్ రద్దు చేయాలంటూ చిత్తూరు కోర్టులో పిటిషన్
-
నారాయణకు నోటీసులు.. అడిషనల్ ఏజీ వాదనలతో ఏకీభవించిన కోర్టు
సాక్షి, చిత్తూరు: మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేయాలంటూ చిత్తూరు కోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ వ్యవహారం లో ఈ నెల 10న నారాయణ అరెస్టయిన విషయం తెలిసిందే. 11వ తేదీ తెల్లవారుజామున నారాయణకు చిత్తూరు నాల్గవ అదనపు జడ్జి బెయిలు మంజూరు చేశారు. టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నారాయణ కుట్ర ఉందని, బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. చదవండి: నారాయణ ‘లీక్స్’.. వెలుగులోకి నివ్వెరపోయే విషయాలు.. నారాయణకు నోటీసులు.. నారాయణ బెయిల్ రద్దు పిటిషన్‌పై చిత్తూరు కోర్టు మధ్యాహ్నం విచారణ జరిపింది. అడిషనల్ ఏజీ పొన్నవోలు వాదనలతో కోర్టు ఏకీభవించింది. నారాయణకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న కేసుపై వాదనలు జరగనున్నాయి. -
నారాయణ ‘లీక్స్’.. వెలుగులోకి నివ్వెరపోయే విషయాలు..
అనంతపురం క్రైం/చిత్తూరు అర్బన్: పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం, సేకరించిన ఆధారాలతోనే నారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారని డీఐజీ ఎం.రవిప్రకాష్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కేసును పకడ్బందీగా, క్షుణ్నంగా విచారించడంతో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేలా, ప్రతిభావంతులైన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేలా నారాయణ యాజమాన్యం వ్యవహరించిందన్నారు. నారాయణ ఆదేశాల మేరకు డీన్, వైస్ ప్రిన్సిపాళ్లు, ప్రిన్సిపాళ్లు కలసి కొందరు స్వార్థపరులైన ఉపాధ్యాయులను, సిబ్బందిని డబ్బులతో లోబర్చుకున్నట్లు వెల్లడైందన్నారు. ఈ విషయాన్ని వారే పోలీసు విచారణలో ఒప్పుకున్నట్లు తెలిపారు. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి వాట్సాప్ ద్వారా తెప్పించుకుని నారాయణ విద్యా సంస్థల హెడ్ ఆఫీస్‌కు పంపారని చెప్పారు. దర్యాప్తులో ఇవన్నీ నిర్ధారణ కావడంతో నారాయణతో పాటు మరో తొమ్మిది మందిని అరెస్టు చేశామన్నారు. ఈ కేసులో నారాయణకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సాక్ష్యాధారాలతో కోర్టులో అప్పీల్ చేస్తామని చెప్పారు. కాగా, చిత్తూరు మేజిస్ట్రేట్ న్యాయస్థానం మాజీ మంత్రి నారాయణకు ఇచ్చిన బెయిల్‌పై హైకోర్టులో అప్పీలు చేయనున్నట్టు చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పదో తరగతి పరీక్షల మాల్ ప్రాక్టీస్ ఘటనలో నిందితులు ఎంతటివారైనా వదిలేది లేదని పేర్కొన్నారు. -
నారాయణ నాటకాలు!
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం, రెండు నాలుకల ధోరణిని నారాయణ విద్యా సంస్థల అధినేత, మాజీ మంత్రి పి.నారాయణ కూడా పుణికిపుచ్చుకున్నారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులో ప్రధాన నిందితుడైన నారాయణ న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించి తప్పుడు సమాచారం, బోగస్ డాక్యుమెంట్లను సమర్పించి బెయిల్ పొందినట్లు స్పష్టమవుతోంది. నారాయణ విద్యాసంస్థలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, 2014లోనే ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు తాజాగా మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలమిచ్చిన నారాయణ.. దాదాపు రెండు నెలల క్రితం ఈటీవీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాత్రం మూడేళ్లుగా తానే నారాయణ విద్యాసంస్థలను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించడం గమనార్హం. ఇంటర్వూ చేస్తున్న యాంకర్ కూడా స్వయంగా నారాయణ విద్యా సంస్థల చైర్మన్ అంటూ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ మేరకు నారాయణ ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిబట్టి ఇప్పటికీ ఆయనే నారాయణ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్లు తేలిపోతోంది. ఇదే విషయాలను చంద్రబాబుకు సైతం చెప్పానంటూ అందులో నారాయణ పేర్కొనడం గమనార్హం. నారాయణ వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకునే మేజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. వాట్సాప్‌లో ప్రశ్నపత్రం లీక్ కావడం, ఆధారాలతో సహా నారాయణ విద్యాసంస్థల డీన్, ప్రిన్సిపాల్ దొరకడం, నేరాన్ని అంగీకరిస్తూ నారాయణ ఆదేశాలతోనే ఇదంతా చేసినట్లు వారు వెల్లడించడం, ఆ తర్వాతే పోలీసులు నారాయణను అరెస్టు చేయడం తెలిసిందే. తమ విద్యాసంస్థకు సంబంధించి ఏ నిర్ణయమైనా పైస్థాయిలో నారాయణే స్వయంగా తీసుకుంటున్నారని ఉద్యోగులు కూడా వెల్లడించారు. సంస్థ వ్యవహారాల్లో ఆయన ఇంత చురుగ్గా పాలు పంచుకుంటున్నట్లు స్పష్టం అవుతుండగా తప్పుడు సమాచారం ఇచ్చి బెయిల్ పొందడంపై న్యాయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. రెండు దశాబ్దాలకుపైగా టీడీపీతో.. 2000 సంవత్సరం నుంచి తాను టీడీపీతో సంబంధాలు కొనసాగించానని, రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో చంద్రబాబు తనకు ఉత్తరాంధ్ర జిల్లాల ఎన్నికల బాధ్యతను అప్పగించడమే కాకుండా గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇచ్చినట్లు పేర్కొన్నారు. మంత్రి పదవిని చేపడుతుండటంతో 2014లో నారాయణ ఫౌండర్ చైర్మన్ పదవికి రాజీనామా చేసినా ఆ విద్యా సంస్థలతో సంబంధం కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. తాను మున్సిపల్ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని 2,000 మునిసిపల్ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడమే కాకుండా నారాయణ టెక్నో స్కూల్స్ సిలబస్‌ను ప్రవేశపెట్టానన్నారు. పదో తరగతిలో 11 మంది మున్సిపల్ స్కూల్స్ విద్యార్థులు పదికి పది పాయింట్లు సాధించగా, నారాయణ స్కూళ్లలో 2,000 మంది పదికి పది పాయింట్లు తెచ్చుకున్నారని నారాయణ చెప్పారు. -
నారాయణ ‘లీక్స్’: చంద్రబాబుకు మైనస్.. ఎలాగంటే?
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పి.నారాయణ పదో తరగతి పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో అరెస్టు అవడం, తెల్లవారేసరికల్లా ఆయన బెయిల్‌పై విడుదల కావడం జరిగిపోయాయి. నారాయణ బెయిల్‌పై విడుదల కాగానే తెలుగుదేశంకు చెందిన కొన్ని మీడియా సంస్థలు ఇదంతా ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘనతేనని ప్రచారం చేయడం విశేషం. నారాయణ విడుదల అయ్యేంతవరకు చంద్రబాబు క్షణం, క్షణం పరిస్థితిని మోనిటర్ చేశారని, లాయర్లతో నిరంతరం సంప్రదింపులు జరిపారని కూడా ఆ మీడియా తెలిపింది. ఇది ఆసక్తికరమైన విషయమే. చంద్రబాబుకు ఈ విషయంలో ఉన్న సమర్దత గురించి మరోసారి చెప్పకనే చెప్పేశారు. చదవండి: కార్పొరేట్ విద్యా మాఫియా అధిపతి నారాయణ చరిత్ర ఇదే.. దేశంలో అనేక చోట్ల ఎందరో ప్రముఖులు ఆయా కేసులలో అరెస్టు అయ్యాక, బెయిల్‌పై విడుదల కావడానికి, రోజులు, వారాలు పడుతుంటే, నారాయణ కనీసం జైలు వరకు వెళ్లకుండానే రావడం గొప్పతనమే అవుతుంది. ఇందుకు నారాయణను అభినందించాలో, చంద్రబాబును పొగడాలో తెలియదు. ఈ విషయంలో కొందరు కొన్ని చమత్కార వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు వద్ద అంత గట్టి లీగల్ టీమ్ ఉందన్న సంగతి తెలిస్తే విజయ్ మాల్యా, చోక్సి, నీరవ్ మోడీ వంటివారు దేశం వదలిపారిపోకుండా ఆయన సలహాలు పొందేవారేమోనని వారు అంటున్నారు. కాని, లక్షలాది మంది విద్యార్ధుల భవితవ్యానికి సంబంధించిన కేసులో ఇలా బెయిల్ రావడం మాత్రం అంత స్వాగతించవలసిన అంశం కాదు. టీడీపీ లాయర్ల సమర్ధతో, ఇంత పెద్ద పోలీసు యంత్రాంగం, ప్రాసిక్యూషన్ వ్యవస్థ ఉన్నప్పటికి ప్రభుత్వం ఇలాంటి కేసులలో నిందితులుగా పేర్కొన్నవారిని జైలుకు కూడా పంపలేని పరిస్థితి ఏర్పడడం ప్రభుత్వానికి కూడా కాస్త ఇబ్బందే అని చెప్పాలి. కాని రాజకీయంగా చూస్తే ఇది జగన్‌కు ప్లస్ అవుతుంది. చంద్రబాబుకు మైనస్ అవుతుంది. ఎలాగంటే విద్యారంగంలో పాతుకుపోయిన తిమింగలాలను పట్టుకోవడం ఎవరి వల్ల కాదని, ఆ మాఫీయా దెబ్బకు ఎవరైనా లొంగిపోవల్సిందేనని ప్రజలు భావిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం నారాయణను టచ్ చేయడమే కాకుండా, కేసు నమోదు చేయగలిగింది. ప్రశ్నాపత్రాల లీకేజీలో నారాయణ ప్రమేయం ఉందని ఆధార సహితంగా పోలీసులు చెప్పగలిగారు. చదవండి: ఏది నిజం: రామోజీ చెప్పిన ‘కరెంటు కత’ నారాయణ కాలేజీల సిబ్బందే ఈ లీకేజీల వ్యవహారంలో కీలక భూమిక పోషించడం, అలా పట్టుబడ్డవారు ఇందులో నారాయణ పాత్ర గురించి వెల్లడించడం జరిగింది. అయితే నారాయణ ఆ విద్యా సంస్థలకు ఇప్పుడు చైర్మన్‌గా లేరంటూ రాజీనామా లేఖను కోర్టులో పెట్టి బెయిల్ పొందగలిగారు. నిజంగానే అది నిజమైన రాజీనామానా?లేక ఉత్తుత్తి రాజీనామానా అన్నది ప్రజలందరికి తెలుసు. ఆయనకు సంస్థతో సంబంధం లేకపోతే పరీక్షలకు ముందు వీడియో కాన్ఫరెన్స్‌లు పెట్టి తన సిబ్బందికి ప్రశ్నాపత్రాల లీకేజీ ఎలా చేయాలన్న దానిపై, ప్రభుత్వ టీచర్లను ఎలా ప్రలోభ పెట్టాలన్నదానిపై ఎందుకు క్లాస్ తీసుకున్నారో వివరించవలసి ఉంటుంది. సాంకేతిక కారణాలతో కోర్టు బెయిల్ ఇచ్చినా, ప్రజల దృష్టిలో ఈయన తప్పు చేసినట్లే లెక్క. కాకపోతే వేల కోట్ల అధిపతి, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అయిన నారాయణ ఎలాగైనా తన లాయర్ల ద్వారా బెయిల్ పొందగలిగారు. వ్యక్తుల హక్కులను,స్వేచ్ఛను కాపాడడంలో న్యాయ వ్యవస్థ ముందు ఉండవలసిందే. ఎవరికైనా ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే కోర్టులు నిరోధించవలసిందే. కాని ఇలాంటి వ్యవస్థీకృత కేసులలో నిందితుడు కనీసం జైలుకు కూడా వెళ్లకపోతే సమాజం ఎలా చూస్తుందన్నది అన్ని వ్యవస్థల వారు ఆలోచించాలి. కొన్ని కేసులలో ఇదే రకమైన వాదన ఎందుకు నిలబడలేదో తెలియదు. ఉదాహరణకు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు విజయవాడలో ఒక కేసులో సంబంధిత సంస్థకు తాను యజమానిని కానని నిందితుడు చెప్పినా, పోలీసులు అంగీకరించకుండా అరెస్టు చేశారు. న్యాయ వ్యవస్థ కూడా దానిని ఓకే చేసింది. . కాని అదే న్యాయ వ్యవస్థ ప్రశ్నాపత్రాల కేసులో నారాయణ చైర్మన్ పదవిలో లేడన్న వాదనను పరిగణనలోకి తీసుకుంది. మరి వీటిలో ఏది రైట్ అంటే ఏమి చెబుతాం. ఏపీలో గత నెలాఖరులో ప్రశ్నాపత్రాల లీకేజీ పెద్ద సంచలనంగా మారింది. వాట్సప్‌ల ద్వారా లీక్ చేసే కొత్త సంస్కృతికి కార్పొరేట్ కాలేజీలు తెరదీశాయి. మామూలు రోజులలో పోటీ ఉన్నట్లు వ్యవహరించే ఈ సంస్థలు ప్రశ్నాపత్రాల లీక్‌లో మాత్రం కలిసికట్టుగా ఉండడం గమనించవలసిన పరిణామం. ఈ విషయం చిత్తూరు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు అత్యంత పకడ్బందీగా కేసును డీల్ చేస్తే చంద్రబాబుకు మాత్రం ఇది కక్షగా కనిపించింది. తొలుత ఈ మాల్ ప్రాక్టీస్ మీద గగ్గోలు పెట్టిన చంద్రబాబునాయుడు ఇందులో తమకు సంబంధించిన నారాయణ స్కూల్స్ పాత్ర ఉందని తెలియగానే మాట మార్చేశారు. దీనిని మాస్ కాపీయింగ్ గాను, పరీక్షలను ప్రభుత్వం సరిగా నిర్వహించని విషయంగానూ మార్చేశారు. లక్షలాది మంది విద్యార్దులకు ఎంతో మానసిక ఆవేదన కలిగించే ఇలాంటి ఘటనలలో పద్నాలుగేళ్ల పాటు సీఎంగా, పదిహనేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి అనుసరించవలసిన పద్దతి ఇదేనా? ఎవరిది తప్పు ఉన్నా సహించవద్దని చెప్పవలసిన పెద్ద మనిషి, ఈ రకంగా కార్పొరేట్ కాలేజీల కొమ్ముకాయడం, దానికి ఒక వర్గం మీడియా అండగా నిలవడం దారుణమైన సంగతే. ఆయనకు ఇదేమీ కొత్తకాదు. తన హయాంలో 2017లో కూడా నెల్లూరులో నారాయణ సంస్థ నుంచి పేపర్ లీక్ అయింది. అప్పుడు ఈనాడు పత్రికలోనే దీనికి సంబంధించిన వార్త వచ్చింది. కాని ఆనాడు కనీసం కేసు కూడా పెట్టలేదు. దానికి కారణం నారాయణ తన క్యాబినెట్లో మంత్రి, ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రి కావడమే వేరే చెప్పనక్కర్లేదు. నారాయణతో చంద్రబాబుకు అంత లోతైన సంబంధాలు ఉన్నాయని అంటారు. 2014 ఎన్నికల సమయంలో నారాయణ, సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు మూడు ప్రాంతాలలో టీడీపీ వ్యవహారాలను పర్యవేక్షించారు. ఆర్ధిక విషయాలు మొత్తం వారి అజమాయిషీలోనే ఉండేవని చెబుతారు. విశాఖతో సహా ఉత్తరాంధ్ర బాధ్యతలు నారాయణ చూశారని చెబుతారు. ఆ సందర్భంలో వందలకోట్ల వ్యయం జరిగిందని ప్రచారం అయింది. అంతేకాక తన విద్యా సంస్థల నుంచి విద్యార్ధులను తీసుకు వచ్చి తెలుగుదేశంకు అనుకూలంగా, వైసిపికి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేయించారని అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి. ఆ ఎన్నికలలో గెలవగానే చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి అయిపోయారు. ఆయన అప్పటికీ ఎమ్మెల్యే కాదు. ఎమ్మెల్సీ కాదు. మంత్రి అయ్యాక ఎమ్మెల్సీ అయ్యారు. తదుపరి రాజధాని భూముల విషయంలో ఎలాంటి డీల్స్ జరిగాయో అప్పట్లో పుంఖానుపుంఖాలుగా కథనాలు వచ్చాయి. అలాంటి సంబంధాలు ఉన్న నారాయణ ఈ లీకేజీ కేసులో జైలుకు వెళ్లకుండా చూడడానికి చంద్రబాబు బాధ్యత తీసుకోవడం ఆశ్చర్యం ఏమి ఉంటుంది? అసలు ఈ కేసు బయటకు రావడంలోనే మతలబు ఉన్నట్లు కనిపిస్తుంది.మామూలుగా అయితే ఈ కార్పొరేట్ కాలేజీల వారు తమ వాట్సప్ గ్రూపులలో ఈ ప్రశ్నాపత్రాలను షేర్ చేసుకుని కామ్‌గా ఉండిపోయేవారు. కాని ఒక వైపు తమ సంస్థలకు అక్రమ ప్రయోజనం పొందుతూనే, మరో వైపు ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న వారి దుష్ట తలంపుతో మొత్తం కేసు బయటకు వచ్చింది. నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ ఈ ప్రశ్నాపత్రాన్ని చిత్తూరులోని విలేకరుల బృందానికి కూడా లీక్ చేయడంతో మొత్తం తేనెతుట్టి కదిపినట్లయింది. ఆ విషయం అర్థం కాక, తెలుగుదేశం మీడియా తొలుత ప్రభుత్వంపై బురద వేయడానికి విశ్వయత్నం చేసింది. తీరా అదంతా తమ వాళ్ల మహిమే అని తెలియగానే, టీడీపీతో పాటు ఈ వర్గం మీడియా కూడా మొత్తం స్వరం మార్చేసింది. ఇంత గొప్ప నారాయణను అరెస్టు చేయడమా అన్నట్లు వార్తలు ఇచ్చాయి. అదే సమయంలో నారాయణ కాలేజీలో లీకేజీ అక్రమాలు జరగలేదని మాత్రం వీరెవరూ ఖండించలేకపోతున్నారు. నారాయణ పాత్ర గురించే సిబ్బందే వాంగ్మూలం ఇవ్వడంతో ఈ కేసు ఆయన వరకు వెళ్లింది. కాని దానిని టీడీపీ మీడియా, చంద్రబాబు సహించలేకపోయారు. వెంటనే ఖండోపఖండనలు ఇచ్చేశారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అయితే నారాయణను పోలీస్ స్టేషన్ గోడలు బద్దలు కొట్టి బయటకు తీసుకువస్తామని హెచ్చరించారు. ఇది రాజద్రోహమో, ప్రజాద్రోహమో అవుతుందో లేదో తెలియదు. మహారాష్ట్రలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఠాక్రే ఇంటి వద్ద హనుమాన్ చాలీసా చదువుతానని ప్రకటించినందుకే కేసుకు గురై వారం రోజులపాటు జైలులో ఉండవలసి వచ్చింది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ట్వీట్ చేసిన గుజరాత్ ఎమ్మెల్యేని అసోంలో అరెస్టు చేసి రోజుల తరబడి జైలులో ఉంచారు. ఇలా కొన్ని రాష్ట్రాలలో ఉంటే, మరికొన్ని రాష్ట్రాలలో న్యాయవ్యవస్థలోని వారిని కించపరిచారని నెలల తరబడి జైలులో ఉంచారు. అదే ముఖ్యమంత్రిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో వ్యక్తికి అడ్వాన్స్ బెయిల్ వచ్చింది. న్యాయ వ్యవస్థలో ఇలాంటి వ్యత్యాసాలు లేకుండా ఉంటే సమాజానికి మంచిదని చెప్పాలి. ఏది ఏమైనా లక్షల మంది విద్యార్ధులను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేసిన లీకేజీ ఘటనల వంటివాటిలో ప్రభుత్వ వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థలు మరింత బాధ్యతగా ప్రవర్తించి ఉంటే బాగుండేదేమో! కొమ్మినేని శ్రీనివాస రావు సీనియర్ జర్నలిస్టు -
కార్పొరేట్ విద్యా మాఫియా అధిపతి నారాయణ చరిత్ర ఇదే..
పొంగూరు నారాయణ.. జిల్లాకు చెందిన ఈయన విద్యాసంస్థల్లో జరుగుతున్న అక్రమాలకు అంతేలేదు. పేపర్ లీకేజీలు చేయించి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారు. ఒత్తిడి తట్టుకోలేక ఆ కాలేజీల్లో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నారాయణ ప్రస్తుతం టెన్త్ పేపర్ లీకేజీ, అమరావతి ల్యాండ్ పూలింగ్‌లో అవినీతి కేసులో కీలక నిందితుడిగా పోలీస్ రికార్డుల్లోకెక్కారు. దీంతో ఈ మాజీ మంత్రి అవినీతి, అక్రమాల చరిత్ర చర్చనీయాంశంగా మారింది. సాక్షి, నెల్లూరు: పొంగూరు నారాయణకు ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేకున్నా చంద్రబాబు 2014 సంవత్సరంలో ఏకంగా రాష్ట్ర మంత్రి పదవిని కట్టబెట్టారు. అంతేకాకుండా టీడీపీ అమరావతి రాజధాని భూములు వ్యవహారాన్ని అప్పగించారు. రాజధాని ఏర్పాటు ముసుగులో ల్యాండ్ పూలింగ్‌లో అక్రమాలు అలాగే ఇన్నర్ రింగ్‌రోడ్‌లో అవకతవకలు చేసినట్లు గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. అందులో ఏ2 నిందితుడిగా నారాయణ ఉన్నారు. టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఆయన్ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఆది నుంచి వివాదాలే.. నారాయణ ఆయన విద్యా సంస్థలపై మొదటి నుంచి వివాదాలున్నాయి. విద్యార్థులపై అధిక ఒత్తిడి తెస్తారనే ఆరోపణలున్నాయి. తమ విద్యాసంస్థల్లో లక్షల మందిని జాయిన్ చేసుకుంటారు. కొంచెం బాగా చదివే వారిని ఎంచుకుంటారు. వారి కోసం పరీక్షల సమయంలో పేపర్ లీకేజీ చేయించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు తెప్పించి పబ్లిసిటీ చేయించుకోవడం పరిపాటిగా మారిందని అనేకమంది చెబుతున్న మాట. ఆ విద్యాసంస్థల్లో నిర్భంద విద్యతో మానసిక ఒత్తిడికి లోనైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలున్నాయి. గత టీడీపీ హయాంలోనే పదుల సంఖ్యలో విద్యార్థులు బలవన్మరాణానికి పాల్పడ్డారు. మంత్రిగా ఉన్న నారాయణపై ఎలాంటి కేసుల్లేకుండా చేసుకోవడంపై అప్ప›ట్లో ప్రభుత్వంపై ఆరోపణలొచ్చాయి. చదవండి: (ఏపీ సీఐడీ అదుపులో మాజీ మంత్రి నారాయణ) ప్రలోభాలకు గురిచేసి.. జిల్లాలో ఉన్న అన్ని విద్యాసంస్థల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు, అలాగే ఎంపిక విద్యార్థులు టాపర్లుగా రాణించేందుకు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. పలు సెంటర్లో ఇన్విజిలేటర్లను ప్రలోభాలకు గురిచేశారని ప్రచారం ఉంది. ఇందుకు గానూ పలువురు విద్యార్థుల నుంచి రూ.5 వేలు చొప్పున వసూలు చేశారని చెబుతున్నారు. గుర్తింపు రద్దు చేయాలి నెల్లూరు(టౌన్): పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బాధ్యులుగా తేలిన నారాయణ విద్యాసంస్థల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు యశ్వంత్‌సింగ్ డిమాండ్ చేశారు. ఆ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లీకేజీకి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ధర్నా నిర్వహించిన యశ్వంత్‌సింగ్ తదితరులను అరెస్ట్ చేసి దర్గామిట్ట పోలీసుస్టేషనుకు తరలించారు. చదవండి: (అప్రూవర్‌గా మారిన వైస్ ప్రిన్సిపల్ గిరిధర్.. నారాయణ ప్రోద్బలంతోనే..) నారాయణ చరిత్ర ఇది.. ► 1979లో సాధారణ కోచింగ్ సెంటర్ ప్రారంభం. ► మూడేళ్లపాటు ట్యూషన్ చెప్పుకుంటూ 1983లో నారాయణ స్కూల్, కాలేజీలకు అనుమతులు తెచ్చుకున్నారు. ► నెల్లూరులోనే స్కూల్, కాలేజీలను నిర్వహించుకుంటూ అనంతరం దేశస్థాయిలోనే 970 బ్రాంచ్‌ల ఏర్పాటు. ► ఎనిమిది ప్రొఫెషనల్ కాలేజీలు, ఒక మెడికల్ కాలేజీ, రెండు ఇంజినీరింగ్ కాలేజీలు, ఒక డెంటల్ కాలేజీ, ఒక నర్సింగ్ కాలేజీ, ఒక ఫార్మసీ కాలేజీ ఏర్పాటు చేసుకుని విద్యారంగాన్ని శాసించే స్థాయికి ఎదిగారు. ► ఇద్దరి భార్యలు, ఇద్దరి కుమార్తెలతో ట్రస్టు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి విద్యను వ్యాపారంగా మార్చుకుని రూ.వేల కోట్లకు అధిపతిగా మారారు. ► టీడీపీ అధినేత చంద్రబాబుకు బినామీగా ఉంటూ 2014 ఎన్నికల్లో రూ.వందల కోట్లను పార్టీకి ఫండ్‌గా ఇచ్చి మూడు జిల్లాల పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సహకారం అందించారు. ► 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు తన బినామీ నారాయణకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా అవకాశం కల్పించారు. టీడీపీ నేతల డ్రామా విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుకున్న మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌పై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తుంటే టీడీపీ నేతలు మాత్రం అక్రమ అరెస్ట్ చేశారంటూ డ్రామా చేశారు. దీంతో జిల్లా వాసులు వారి తీరును అసహ్యించుకుంటున్నారు. జిల్లాలో కార్పొరేట్ విద్య పేరుతో మాఫియాగా ఏర్పడి తల్లిదండ్రుల నుంచి అడ్డగోలు దోపిడీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా టెక్నో, ఈ–టెక్నో, ఒలింపియాడ్ అంటూ ప్రత్యేక కోర్సులు, ఐఐటీలో ర్యాంకులు అంటూ ప్రతి విద్యార్థి వద్ద రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. పుస్తకాలు, యూనిఫాం పేరుతో ఇంకా వసూలు చేస్తుంటారు. నారాయణ అరెస్ట్‌ను తమ రాజకీయ స్వార్థం కోసం టీడీపీ వాడుకోవడంపై జిల్లావాసులు మండిపడుతున్నారు. చంద్రబాబుకు సన్నిహితుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న నారాయణ గతంలో ఆ పార్టీ ఆర్థిక వ్యవహారాలు చక్కబెడుతుంటారు. అలాగే విద్యాసంస్థల ఉద్యోగులచే సర్వేలు చేయించి చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడిగా మారాడు. దీంతో 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే తనకు బినామీగా ఉన్న నారాయణకు మంత్రి పదవి కట్టబెట్టి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. జిల్లాలో ఎందరో సీనియర్ నేతలు ఉన్నా వారిని కాదని నారాయణకు పదవి ఇచ్చారు. ఫలితాలను హైజాక్ చేస్తున్నారు కార్పొరేట్ పాఠశాలలు అవ కాశమున్న చోట్ల పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్ చేయిస్తూ తమ స్కూళ్ల విద్యార్థులచే అన్ని జవాబులు రాయించి తెలి వైన విద్యార్థులున్న ప్రభుత్వ పాఠశాలల ఫలితాలను హైజాక్ చేస్తున్నారు. వారి వ్యాపారం పెంచుకునేందుకు దారుణమైన పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఇటీవల పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాలు లీక్ కావడం అందులో భాగమే. ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించాల్సిందే. – ఎం.రవిబాబు, టీచర్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి, చేజర్ల కార్పొరేట్ల వల్ల విద్యావ్యవస్థ నాశనం కార్పొరేట్ విద్యాసంస్థలు వ్యాపార కోణంలో ఉంటూ విద్యావ్యవస్థను దెబ్బతిసేలా పబ్లిక్ పరీక్షలను సైతం తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. రాజకీయ పలుకుబడితో ఎన్నో అరాచకాలు చేసిన కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రభుత్వం కట్టడి చేయాల్సి ఉంది. ఈ సంస్థల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లోని తెలివైన విద్యార్థులు మానసికక్షోభకు గురవుతున్నారు. దీనికి పుల్‌స్టాఫ్ పెట్టాలి. – తోపుగుంట మోహన్, హెచ్ఎం, చేజర్ల మెయిన్ పాఠశాల దోషులపై చర్యలు తీసుకోవాలి ప్రశ్నపత్రం లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పూర్తిస్థాయిలో విచారణ జరిపి దీనివెనుక ఉన్న దోషులపై కేసులు నమోదు చేయాలి. ఉపాధ్యాయులు తప్పు చేశారంటే నమ్మలేకున్నాం. వారిపై చర్యలు ఉపసంహరించుకోవాలి. భవిష్యత్‌లో ఈ రీతిలో జరగకుండా విద్య, పరీక్ష ప్రణాళికలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. – అల్లంపాటి సురేంద్రరెడ్డి, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఏపీటీఎఫ్ లీకేజీకి పాల్పడడం తప్పే.. పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడడం పెద్ద తప్పు. ఈ లీకేజీ వెనుక ఎంతటివారున్నా విచారించి వారిని కఠినంగా శిక్షించాలి. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలి. – నాటకం తిరుమలయ్య, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ ప్రభుత్వ చర్యలు అభినందనీయం పరీక్షల్లో ఎప్పటినుంచో జరుగుతున్న లీకేజీ బాగోతాన్ని ఇప్పటి ప్రభుత్వం బయటపెట్టింది. గతంలో జరిగినా అప్పటి ప్రభుత్వాలు మిన్నకున్నాయి. ఇప్పటి ప్రభుత్వం నిష్పక్షపాతంగా శిక్షించే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటుమాడుతున్న ప్రయివేట్ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలి. – కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ శాఖ -
అంతా నారాయణ ఆదేశాలతోనే..
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లాలో పదో తరగతి ప్రశ్నపత్రాల మాల్ ప్రాక్టీస్ వ్యవహారంలో మొత్తం చక్రం తిప్పింది టీడీపీ మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ అని చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి తెలిపారు. నారాయణ ఆదేశాలు, ప్రణాళికను ఆ విద్యా సంస్థ వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్‌రెడ్డి పక్కాగా అమలు చేశారని వెల్లడించారు. ఈ వ్యవహారంలో టీడీపీ నేత నారాయణను హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అరెస్టు చేశామన్నారు. అక్కడ నుంచి తీసుకొచ్చి చిత్తూరులోని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచామని వివరించారు. అలాగే తిరుపతి నారాయణ విద్యాసంస్థల డీన్ బాలగంగాధర్ (36)ను కూడా అరెస్టు చేశామని చెప్పారు. ఈ మేరకు చిత్తూరులో ఎస్పీ రిషాంత్‌రెడ్డి, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఏమన్నారంటే.. నిందితులు నారాయణ డీన్ బాలగంగాధర్, వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్‌రెడ్డి ఫోన్‌తో ఫొటో.. వాట్సాప్ గ్రూపులో షేరింగ్.. ఏప్రిల్ 27న ప్రారంభమైన పదో తరగతి పరీక్షల్లో తెలుగు కాంపోజిట్ ప్రశ్నపత్రాన్ని తిరుపతి నారాయణ పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ ఎన్.గిరిధర్‌రెడ్డి ‘చిత్తూరు టాకీస్’ అనే వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. దీనిపై చిత్తూరు డీఈవో పురుషోత్తం ఇచ్చిన ఫిర్యాదుతో వన్‌టౌన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. ఏప్రిల్ 29న తిరుపతి జిల్లా చంద్రగిరిలోని శ్రీకృష్ణారెడ్డి చైతన్య ప్రిన్సిపాల్ పి.సురేష్, తిరుపతి ఎన్ఆర్ఐ అకాడమీ ఆంగ్ల ఉపాధ్యాయుడు కె.సుధాకర్, తిరుపతి చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ ఆరిఫ్, డీన్ కె.మోహన్, గిరిధర్‌రెడ్డితోపాటు గంగాధర నెల్లూరు మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పవన్‌కుమార్‌రెడ్డి, బి.సోమును అరెస్టు చేశాం. వీరిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు మినహా మిగిలినవాళ్లు గతంలో నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసినవారే. మరికొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలతో కలిసి.. నిందితులు.. గిరిధర్‌రెడ్డి, సుధాకర్, సురేష్, పవన్‌కుమార్‌ను ఈ నెల 9న కస్టడీకి తీసుకుని విచారించాం. నారాయణ ఆదేశాలతోనే ఇదంతా చేసినట్లు వారు అంగీకరించారు. నారాయణ ఆదేశాలతో ఆ సంస్థ సిబ్బంది మరికొన్ని కార్పొరేట్ విద్యాసంస్థల ప్రతినిధులతో కలిసి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారు. నారాయణలో ఓ మోస్తరు మార్కులు వచ్చే విద్యార్థికి జిల్లా, రాష్ట్ర స్థాయి మార్కులు తెప్పించడం, ఫెయిల్ అయ్యే విద్యార్థిని పాస్ చేయడం వీళ్ల లక్ష్యం. ఇందుకోసం నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్‌రెడ్డి.. ప్రభుత్వ ఉపాధ్యాయుడు పవన్‌కుమార్‌రెడ్డికి పలుమార్లు నగదు ఇచ్చాడు. పవన్ తన స్నేహితుడైన సోము అనే ఇన్విజిలేటర్ గదికి వెళ్లి ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి గిరిధర్‌రెడ్డికి వాట్సాప్‌లో పంపించాడు. దీన్ని గిరిధర్.. నారాయణ స్కూల్ డీన్ బాలగంగాధర్‌కు, మరికొందరికి వాట్సాప్‌లో పంపాడు. నారాయణ హెడ్ ఆఫీసులో సమాధానాల రూపకల్పన బాలగంగాధర్ దీన్ని నారాయణ హెడ్ ఆఫీస్‌కు వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు. అక్కడ సమాధానాలను రూపొందించారు. అక్కడ నుంచి పరీక్ష కేంద్రాల్లోని ఇన్విజిలేటర్లు, వాటర్ బాయ్స్, ఆయాల ద్వారా విద్యార్థులకు చేరతాయి. మంచి ఫలితాలు వస్తే నారాయణ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పెరుగుతాయనే ఇలా ప్రణాళిక రచించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.. పలు కీలక సాంకేతిక ఆధారాలు సేకరించాం. నేరం రుజువైతే గరిష్టంగా పదేళ్ల జైలుశిక్ష పడుతుంది. -
పేపర్ లీకేజీ కేసు: బురద జల్లాలనుకున్నారు.. వాళ్లే దొరికిపోయారు
సాక్షి, తాడేపల్లి: చట్టం అందరికీ ఒకేలా ఉంటుంది అనేది నమ్మే వ్యక్తి వైఎస్ జగన్ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వంపై బురద జల్లడానికి కొందరు చేసిన ప్రయత్నం.. వాళ్లకే బెడిసి కొట్టిందని ప్రతిపక్ష టీడీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టెన్త్ పేపర్ల లీకేజ్ పరిణామాలపై తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సజ్జల మీడియాతో మాట్లాడారు. ‘‘పది పరీక్షల్లో జరిగిన అక్రమాలపై ఎప్పుడూ జరగని విషయం అన్నట్లు చంద్రబాబు మాట్లాడారు. కానీ, ఇవాళ దీనికి ప్రధాన కారణమైన వాళ్ల పార్టీ నాయకుడు నారాయణనే అరెస్ట్ అయ్యారు. నారాయణ సంస్థ ప్రమేయంతో లీక్ వ్యవహారం ప్రారంభం అయ్యిందని దృష్టికి రాగానే ప్రభుత్వం తక్షణమే స్పందించింది. కానీ, ప్రభుత్వంపై బురద జల్లడానికి వాళ్లు(టీడీపీ) ప్రయత్నం చేస్తే.. ఈ రోజు వాళ్లే దొరికిపోయారు. రాష్ట్రంలో మొదటిసారిగా ఇలాంటి వ్యవహారం బద్దలైంది.. అరెస్టులు జరిగాయి. మాస్ కాపీయింగ్, పేపర్లు లీక్ కు స్పెషలిస్టులుగా మారిపోయారు వాళ్లు. చదువుకుని పోటీ తత్వంతో పిల్లలు ఎదగాలి తప్ప ఇలా అడ్డదారుల్లో కాదని వైఎస్సార్సీపీ ప్రభుత్వం భావించింది. అందుకే ఈ వ్యవహారం వెనుక ఉన్న తీగలాగింది. ఫలితం.. వారికి సహకరించిన వారి డొంక కదిలి దొరికిపోయారు. ఇలాంటి వ్యక్తినా? చంద్రబాబు మంత్రిగా పెట్టుకుంది!. లక్షల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించారు అంటూ మాజీ మంత్రి, నారాయణ సంస్థల వ్యవస్తాపకుడు నారాయణపై మండిపడ్డారు సజ్జల. పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఛాలెంజ్ గా తీసుకున్నారు. ప్రతిపక్షం ‘ఇదంతా రాజకీయ కక్ష సాధింపు’ అంటుందని ముందే ఊహించాం. కానీ, నిందితులు ఎవరైనా సరే కఠినంగానే వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం. ఎవర్నీ అన్యాయంగా, అక్రమంగా పోలీసులు అరెస్టులు చేయలేదు. చట్టం ముందు అంతా సమానమే. పూర్తి పారదర్శకంగా వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి సమీప బంధువు కొండారెడ్డిపై ఆరోపణలు వచ్చినా.. సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. చట్టం అందరికీ ఒకేలా ఉంటుంది అనేది నమ్మిన వ్యక్తి జగన్. అది నారాయణ కావచ్చు.. కొండారెడ్డి కావొచ్చు.. విషయం ఏంటన్నది విచారణలో తేలుతుంది. దీన్ని కక్ష సాధింపు అంటే ఎవరూ ఒప్పుకోరు. పైగా ఇటువంటి నేరాన్ని(పేపర్ లీకేజీ) వ్యవస్తీకృతం చేసిన వ్యక్తి నారాయణ. గతంలో వనజాక్షి విషయంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తనవాళ్ళని మందలించకుండా నిస్సిగ్గుగా రాజీ చేశారు. బొండా ఉమా కొడుకు కారు యాక్సిడెంట్ చేస్తే కేసు కూడా లేదు. ఇవన్నీ భరించలేకే ప్రజలు.. వాళ్ళని(టీడీపీని ఉద్దేశించి..) చెత్తబుట్టలో పడేశారు అన్నారు సజ్జల. చదవండి👉: నాలుగు రోజులుగా ఫోన్ స్విచ్ఛాప్ చేసి అజ్ఞాతంలో నారాయణ! -
‘పది’.. పాపమంతా ‘నారాయణ’దే
చిత్తూరు అర్బన్: రాష్ట్రంలో ప్రశాంతంగా జరుగుతున్న పదో తరగతి పరీక్షలను రాజకీయం చేసేందుకు, తమ స్వలాభం కోసం నారాయణ విద్యాసంస్థ చేసిన కుట్ర బట్టబయలైంది. తిరుపతిలో తెలుగు కాంపోజిట్ పరీక్ష ప్రశ్నపత్రాలను ఫొటో తీసి వాట్సాప్‌లో పెట్టిన ప్రధాన నిందితులు నారాయణ సిబ్బందేనని గుర్తించిన పోలీసులు మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. తిరుపతి నారాయణ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్‌రెడ్డి ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ చేసిన వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు. గతంలో నారాయణలో పనిచేసి ప్రస్తుతం ఎన్ఆర్ఐ విద్యా సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషించడం చూస్తుంటే ప్రభుత్వంపై తెరవెనుక జరుగుతున్న కుట్ర బట్టబయలవుతోంది. రెండు రోజుల క్రితం ప్రారంభమైన పది పరీక్షల్లో తెలుగు కాంపోజిట్ ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడం, దీనికి కొనసాగింపుగా గురువారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి హిందీ పేపర్ లీకేజీ వార్తలు ప్రచారం చేయడం ఇందుకు నిదర్శనం. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారాయణ విద్యా సంస్థలు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డాయి. చంద్రబాబు హయాంలో కీలక శాఖలకు మంత్రిగా చక్రం తిప్పిన నెల్లూరు జిల్లా టీడీపీ నేత పొంగూరి నారాయణ ఈ విద్యా సంస్థల అధిపతి అనే విషయం తెలిసిందే. పిల్లల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. వాట్సాప్‌లో ప్రశ్నపత్రం వైరల్ కావడంపై చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. చిత్తూరు నుంచే.. పరీక్ష ప్రారంభమయ్యాక తెలుగు కాంపోజిట్ ప్రశ్నపత్రం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. దీన్ని చిత్తూరు టాకీస్ అనే వాట్సాప్ గ్రూపులో.. తిరుపతి నారాయణ పాఠశాల వైస్ ప్రిన్స్‌పాల్ గిరిధర్‌రెడ్డి పోస్టు చేశాడు. తొలుత తనకు రైల్వేకోడూరు నారాయణలో పనిచేసిన సుధాకర్ అనే వ్యక్తి ప్రశ్నపత్రాన్ని పంపాడని చెప్పి గిరిధర్‌రెడ్డి కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగుచూసినట్లు సమాచారం. చిత్తూరు నగరంలోని పదో తరగతి పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్‌గా పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి.. నారాయణ సిబ్బంది డబ్బు ఆశ చూపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి కక్కుర్తిపడ్డ ఉపాధ్యాయుడు నారాయణ వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్‌రెడ్డికి ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా నారాయణ సిబ్బంది నుంచి పలువురికి ప్రశ్నపత్రం ఫార్వర్డ్ అయినట్లు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పోలీసులు తెలుసుకున్నారు. ఆ మేరకు 90 శాతం కేసును ఛేదించారు. పెద్ద ముఠా.. ఈ వ్యవహారంలో నారాయణ వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్‌రెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయుడితో పాటు మరో 10 మంది నారాయణ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివే పిల్లలకు నూటికి నూరు మార్కులు వచ్చేలా చేయడానికి.. నారాయణతో పాటు పలు పేరొందిన విద్యాసంస్థలు లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఫలితంగా పరీక్ష ప్రారంభమైన గంటలోపు ప్రశ్నపత్రం బయటకు తీసుకురావడం, వాటికి సమాధానాలు రాసి కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివే పిల్లలకు పంపడానికి ఓ ముఠానే పనిచేస్తున్నట్లు సమాచారం. కొలిక్కివచ్చిన ఈ కేసులో శుక్రవారం నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నంద్యాల జిల్లా అంకిరెడ్డిపల్లెలో 12 మంది అరెస్ట్ కొలిమిగుండ్ల: నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డ 12 మంది ఉపాధ్యాయులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం పదిన్నర గంటల సమయంలో మూడో నంబర్ గదిలోని ఓ విద్యార్థికి చెందిన ప్రశ్నపత్రాన్ని సీఆర్పీ రాజేష్ తన సెల్ఫోన్లో ఫొటో తీశాడు. అదే స్కూల్లోనే క్రాఫ్ట్ టీచర్ రంగనాయకులకు సెల్‌ఫోన్ ఇచ్చి సమీపంలోని రూములో ఉన్న టీచర్లకు ఇవ్వమని చెప్పాడు. సెల్‌ఫోన్‌ను టీచర్లు నాగరాజు, నీలకంఠేశ్వరరెడ్డికి రంగనాయకులు అందించాడు. వారు రాజేష్ సెల్‌ఫోన్ నుంచి ప్రశ్నపత్రాన్ని తొమ్మిది మంది ఉపాధ్యాయులకు వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేశారు. తర్వాత టీచర్లంతా కలిసి వాట్సాప్‌లో వచ్చిన ప్రశ్నలకు జవాబులు తయారు చేసి అదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతూ వాటర్ బాయ్స్‌గా అవతారమెత్తిన ఈశ్వర్, భగీరథ, చంద్రకిరణ్, విజయ్‌కుమార్ ద్వారా తొమ్మిది గదుల్లోకి ఆయా ఇన్విజిలేటర్ల అనుమతితో స్లిప్‌లు పంపారు. ఉపాధ్యాయులతో పాటు మరొక సీఆర్పీ మద్దిలేటి సెల్‌ఫోన్‌కు క్వశ్చన్ పేపర్ రాగానే ఆన్సర్లు తయారు చేసి పంపించాడు. పోలీసులు, విద్యాశాఖాధికారులు వెంటనే రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో విచారణ చేయడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. తహసీల్దార్ షేక్ మోహిద్దీన్ ఫిర్యాదు మేరకు 12 మందిపై కోవెలకుంట్ల సీఐ నారాయణరెడ్డి కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తలారి రాజేష్ (సీఆర్పీ), నీలకంఠేశ్వరరెడ్డి (గొర్విమానుపల్లె), నాగరాజు (అబ్దులాపురం), మధుసూదనరావు (చింతలాయిపల్లె), వెంకటేశ్వర్లు(అంకిరెడ్డిపల్లె), దస్తగిరి (అంకిరెడ్డిపల్లె), వనజాక్షి (కనకాద్రిపల్లె), లక్ష్మీదుర్గ(రామకృష్ణ స్కూల్), ఆర్యభట్ట (అబ్దులాపురం), పోతులూరు (గొర్విమానుపల్లె), రంగనాయకులు (క్రాఫ్ట్ టీచర్ అంకిరెడ్డిపల్లె), మద్దిలేటి (సీఆర్పీ) పోలీసుల అదుపులో ఉన్నారు. -
విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గుర్తింపు లేని కాలేజీలు ఉన్నాయని, వాటిల్లో వేల మంది విద్యార్థులు చదువుతున్నారంటూ ఇంటర్ బోర్డు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన తీరు చూస్తుంటే గుర్తింపు లేకుండా కాలేజీలను నిర్వహిస్తున్న సంస్థల పక్షాన ఇంటర్మీడియెట్ బోర్డు ఉన్నట్లుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఆ కాలేజీలతో చేతులు కలిపినట్లు, కుమ్మక్కైనట్లుగా ఉందని ఘాటు వ్యాఖ్యలు చే సింది. గుర్తింపు లేని కాలేజీలు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై ఏ చ ర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఇంటర్ బోర్డుతోపాటు ప్ర భుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలు అనుమతుల్లేకుండా కాలేజీలను నిర్వహిస్తున్నాయని, సెలవుల్లోనూ కాలేజీలను నడుపుతున్నాయని, వీటిపై ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ఉత్తర్వులివ్వాలని కోరుతూ ఉప్పల్‌కు చెందిన రాజేష్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం విచారించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం కనీసం 20 వేల మంది విద్యార్థులు గుర్తింపు లేని కాలేజీల్లో చదువుతున్నారని, వాళ్ల జీవితాలతో ఆడుకునే అవకాశం ఇంటర్ బోర్డు క ల్పించినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించింది. వచ్చే విద్యా సంవత్స రం ప్రారంభంలోనే కాలేజీలకు గుర్తింపు దరఖాస్తులపై నిర్ణయం తీసుకుంటామని ఇంటర్‌బోర్డు చెప్పడంపై ధర్మాసనం స్పందిస్తూ.. హత్య చేసిన వ్యక్తి ఇక ముందు హత్యలు చేయబోనని లిఖితపూర్వకంగా హామీ ఇస్తే హంతకుడ్ని వదిలేస్తామన్నట్లుగా ఉందంది. జరిమానాలు వసూలు చేశాం..: హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఇంటర్ బోర్డు కార్యదర్శి కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ‘అగ్నిమాపక శాఖ నుంచి ఎన్వోసీలు లేకుండా ఉన్న భవనాల్లో నారాయణ 28, శ్రీచైతన్య 18 చొప్పున కాలేజీలు నిర్వహిస్తున్నాయి. ఇంటర్ బోర్డు అనుమతి లేకుండానే వాటిలో కాలేజీ లు నిర్వహిస్తున్నాయి. ఇందులో నారాయణ 4, శ్రీచైతన్య 2 కాలేజీలు ఉన్నాయి. ఒక్కో కా లేజీకి రూ.లక్ష చొప్పున పెనాల్టీ వసూలు చే శాం. ఆ తర్వాతే వాటిని వేరే చోటకు తరలించేందుకు అనుమతి ఇ చ్చాం. సెలవుల్లో కూడా ఆ కాలేజీలు తరగతులు నిర్వహించడంతో రోజుకు రూ.50 వేలు చొప్పున జరిమానా విధించాం. రూ.17 లక్ష లు నారాయణ, రూ.10 లక్షలు శ్రీచైతన్యలకు జరిమానాగా వసూలు చేశాం. నారాయణ, శ్రీచైతన్యలకు 52 హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్స్‌పై హైకోర్టులో మరో కేసు విచారణలో ఉంది. హైకోర్టు ఆదేశాలిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో నారాయణ 79, శ్రీచైతన్య 71 కాలేజీల్లో తనిఖీలు చేశాం’ అని కౌంటర్ పిటిషన్లో పేర్కొన్నారు. జరిమానాలు విధించి వదిలేస్తారా? ప్రభుత్వం తరఫున ప్రత్యే క న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ వాదిస్తూ, అఫిలియేషన్ లే కుండా కాలేజీలు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసు కుంటామని చెప్పారు. నారాయణ 79, శ్రీచైతన్య 71 కాలేజీల అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే 46, 49 చొప్పున కా లేజీలకు అనుమతిచ్చామని, మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయ న్నారు. మార్చిలో వార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో చట్ట ప్రకారం అనుమతులు పొందాలని ఆయా కాలేజీలకు నో టీసులిచ్చినట్లు తెలిపారు. గుర్తింపు లేని కాలేజీలపై ఏ చర్యలు తీసుకున్నారో ఇంటర్ బోర్డు అఫిడవిట్లను దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం విచారణను 27కి వాయిదా వేసింది. -
చెరుకు తోటలోకి దూసుకుపోయిన స్కూల్ బస్సు
-
ఆ పాఠశాలలపై చర్యలకు ఆదేశాలివ్వండి
సాక్షి, అమరావతి: ఏపీ విద్యా సంస్థల చట్ట నిబంధనలకు విరుద్ధంగా తమ పాఠశాలల్లో అధిక ధరలకు పుస్తకాలు, యూనిఫామ్‌లు అమ్ముతున్న నారాయణ, శ్రీ చైతన్య, నెల్లూరు రవీంద్రభారతి, భాష్యం, డాక్టర్ కేకేఆర్ గౌతమ్ తదితర పాఠశాలలపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని ముందడుగు ప్రజా పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఎన్.గ్రేసీ దాఖలు చేశారు. ఇందులో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్, పలు జిల్లాల విద్యా శాఖాధికారులతోపాటు పైన పేర్కొన్న పాఠశాలలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. రాష్ట్రంలో అన్ని ప్రైవేటు, అన్ ఎయిడెడ్, కార్పొరేట్ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి, చట్ట నిబంధనలను ఉల్లంఘించిన పాఠశాలల గుర్తింపును రద్దు చేసేలా విద్యాశాఖాధికారులను ఆదేశించాలని పిటిషనర్ తన పిటిషన్లో కోర్టును కోరారు. ప్రైవేటు పాఠశాలలు అసాధారణ ఫీజులను వసూలు చేస్తూ దోచుకుంటున్నాయని, ఈ విషయంలో అధికారులు తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. చట్ట నిబంధనల ప్రకారం.. ప్రతి స్కూల్లో గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయాలని, ఇందులో తల్లిదండ్రులకు సైతం స్థానం కల్పించడం తప్పనిసరన్నారు. ఏ పాఠశాల తమ పాఠశాలల్లో ఎటువంటి పుస్తకాలు, స్టేషనరీ, ఇతర వస్తువులు అమ్మరాదంటూ కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి ఈ నెల 11న సర్క్యులర్ జారీ చేశారని తెలిపారు. అయితే.. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు ఈ సర్క్యులర్‌ను ఖాతరు చేయడం లేదన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. -
‘నారాయణ’ దోపిడీ రూ.104 కోట్లు!
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో గత మూడేళ్లలో మున్సిపల్ స్కూళ్లలో అప్పటి మంత్రి పి.నారాయణ చేపట్టిన ప్రయోగాల పుణ్యమా అని రూ.104 కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగమైంది. మున్సిపల్ పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన కెరీర్ ఫౌండేషన్ కోర్సులు, అకడమిక్ ఫౌండేషన్ కోర్సులు, స్పార్క్ బ్యాచులు, స్టార్ బ్యాచులతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు లాభపడ్డారు తప్ప విద్యార్థులకు ఒరిగిందేమీ లేదని నిపుణులు పేర్కొంటున్నారు. నారాయణ విద్యాసంస్థల్లో రకరకాల పేర్లతో బ్యాచులు ఉంటాయి. అలాంటి విధానాన్నే మున్సిపల్ స్కూళ్లలోనూ ప్రవేశపెట్టారు. ఇందుకోసం నారాయణ విద్యాసంస్థల సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి, భారీగా గౌరవ వేతనాలు చెల్లించారు. ఈ కోర్సులు బోధించేందుకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, గైడ్లు, ఇతర మెటీరియల్ అంతా నారాయణ విద్యాసంస్థలకు చెందినదే. ఆయా పుస్తకాల కోసం రూ.కోట్లు ఖర్చు చేశారు. అంతేకాకుండా అర్బన్ లోకల్‌బాడీ కో–ఆర్డినేటర్లు, కన్సల్టెంట్లు, ఏఎఫ్సీ టీచర్లు, సీఎఫ్‌సీ టీచర్లు, ఔట్సోర్సింగ్ సిబ్బంది.. ఇలా వేలాది మందిని నియమించారు. వారికి రూ.వేలల్లో జీతాలు చెల్లించారు. దోచుకున్న వాళ్లకు దోచుకున్నంత ఫౌండేషన్ కోర్సుల కోసం నారాయణ విద్యాసంస్థలకు చెందిన పాఠ్యపుస్తకాలనే వినియోగించారు. నేరుగా నారాయణ విద్యాసంస్థల మెటీరియల్‌గా చూపించకుండా వాటి అట్టలను మార్చేసి, వాటిని వేరే సంస్థల నుంచి కొనుగోలు చేసినట్లు చూపించారు. ఇందుకోసం ఏకంగా రూ.8.50 కోట్లు వెచ్చించారు. మున్సిపల్ స్కూళ్లలో ‘నో బ్యాగ్ డే’ను అమలు చేయాలని మున్సిపల్ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. నో బ్యాగ్ డే సందర్భంగా వివిధ కార్యక్రమాల నిర్వహణకు మున్సిపల్ శాఖ నుంచి రూ.85.15 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులు స్కూళ్లకు చేరలేదని, టీడీపీ ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి వెళ్లిపోయాయని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థుల సమాధాన పత్రాలను(ఓఎమ్మార్) స్కాన్ చేయడానికి స్కానింగ్ యంత్రాలు, నెట్ చార్జీలు, కంప్యూటర్ ఆపరేటర్ల కోసం ప్రతిఏటా రూ.54.51 లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు. ఈ నిధులన్నీ పక్కదారి పట్టాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరే... మున్సిపల్ స్కూళ్లలో చేపట్టిన ప్రయోగాత్మక బోధనకు భారీ ఎత్తున నిధులు చెల్లించేశారు. ప్రైమరీ యూఎల్బీ కో–ఆర్డినేటర్ల పేరిట ఏడాదికి రూ.38.25 లక్షల చొప్పున మూడేళ్ల పాటు డ్రా చేశారు. ప్రైమరీ కన్సల్టెంట్ల హానరోరియం కింద ఏడాదికి రూ.23.76 లక్షల చొప్పున చెల్లించారు. హైస్కూల్ యూఎల్బీ కో–ఆర్డినేటర్ల పేరిట ఏడాదికి రూ.4.64 కోట్లు, ఎఎఫ్సీ ఏవో టీచర్ల హానరోరియం కింద రూ.1.26 కోట్లు, సీఎఫ్‌సీ టీచర్ల హానరోరియం కింద రూ.10.90 లక్షలు, స్పార్క్ క్లాసుల కోసం రూ.5.83 కోట్ల నిధులు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపిస్తున్నారు. ఏడాదికి రూ.34.85 కోట్లు చొప్పున మూడేళ్లలో రూ.104.55 కోట్ల మేర నిధులు వెచ్చించారు. ఈ నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఎస్సీఈఆర్టీ నిబంధనలు బేఖాతర్ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ పరిధిలో మున్సిపాల్టీల్లో 2,110 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 300 ఉన్నత పాఠశాలలు, 160 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ‘నారాయణ’ తరహా బోధనను ప్రయోగాత్మకంగా చేపట్టారు. వాస్తవానికి మున్సిపల్ స్కూళ్లలో నిర్వహణ బాధ్యతల వరకే మున్సిపల్ శాఖకు అధికారం ఉంటుంది. అకడమిక్ వ్యవహారాలన్నీ విద్యాశాఖ పరిధిలోనే కొనసాగాలి. కానీ, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మున్సిపల్ స్కూళ్ల విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు. విద్యా శాఖతో సంబంధం లేకుండానే అకడమిక్ వ్యవహారాలను మున్సిపల్ శాఖ చేపట్టింది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ) నిబంధనలతో సంబంధం లేకుండానే మున్సిపల్ స్కూళ్లలో నారాయణ తరహా సిలబస్, బోధనను అమల్లోకి తీసుకొచ్చారు. -
‘నారాయణ’ సిబ్బందితో నగదు పంపిణీ!
నెల్లూరు (క్రైమ్): ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ నేతలు అరాచకాలకు తెరలేపారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఓట్లు రాబట్టుకు నేందుకు భారీ నజరానాలు ముట్టజెప్పే పనిలో నిమగ్నమయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 10 అసెంబ్లీ.. రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలను పంపిణీ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో మంత్రి నారాయణకు చెందిన నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసే సిబ్బంది ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వీరిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. వారు బృందాలుగా విడిపోయి నగర నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో గత కొద్ది రోజులుగా మకాంవేసి ఓట్ల సర్వే నుంచి నగదు పంపిణీ వరకు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఓటర్లకు కోట్లాది రూపాయల నగదు పంపిణీ వీరి ద్వారా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఆదివారం ‘నారాయణ’ సిబ్బంది మూడు బృందాలుగా ఏర్పడి 43వ డివిజన్లోని జెండా వీధి, కుమ్మర వీధి ప్రాంతాల్లో నగదు పంపిణీకి చర్యలు చేపట్టారు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న వైఎస్ఆర్సీపీ నేతలు కుమ్మర వీధిలోని తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లారు. అక్కడ నగదు లెక్కిస్తున్న వారిని పట్టుకున్నారు. వీరిలో ఓ వ్యక్తి పరారయ్యాడు. పట్టుబడ్డ వారిలో నారాయణ విద్యాసంస్థల ఏజీఎం రమణారెడ్డితోపాటు మరో ఉద్యోగి సమ్మద్ ఇంకొకరున్నారు. ఈ విషయమై ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు సమాచారం అందించారు. స్క్వాడ్ ఇన్చార్జ్ రాజేంద్రకుమార్‌సింగ్ వీరి నుంచి రూ.8.30 లక్షల నగదును స్వాధీనం చేసుకుని ఆ ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పరారైన వ్యక్తి వద్ద రూ.35 లక్షలు ఉన్నట్లు సమాచారం. కాగా, టీడీపీ నేతల తప్పుడు ఆరోపణల విచారణకే సమయం కేటాయిస్తున్న నగర పోలీసులు తాయిలాల పంపిణీలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా టీడీపీ నేతలు, అనుచరులు, సానుభూతిపరులు నగదు పంచుతూనో, తాయిలాలు పంచుతూనో దొరికిపోతే మాత్రం వారి వివరాలను ఎంతో గోప్యంగా ఉంచుతున్నారు. పోలీసులపై ఒత్తిడి ఇదిలా ఉంటే, టీడీపీ నేత పట్టాభిరామిరెడ్డి తన అనుయాయులను పోలీస్‌స్టేషన్‌కు పంపి తమ వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పోలీసులు అందుకు రంగం సిద్ధంచేశారు. నిజానికి ఎన్నికల సమయంలో వీరు నగదుతో దొరికినందున ఈ సమాచారాన్ని ముందుగా ఎన్నికల సంఘానికి తెలిపి వారి ఆదేశాలతో కేసు నమోదు చేసి నగదు మూలాలను గుర్తించాలి. కానీ, ఇక్కడ మంత్రి పలుకుబడితో.. పట్టుబడిన వారికి వెంటనే బెయిల్ ఇచ్చేలా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. నోటు పంపిణీ విషయంపై సమాచారం అందుకున్న నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్ చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని విచారణను నిష్పక్షపాతంగా జరిపి సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐ షేక్ కరీముల్లాను కోరారు.