new political party
-
Actor Vijay: ‘ఎదుగుదలకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు’
చెన్నై: ‘తమిళగ వెట్రి కళగం’పార్టీని ప్రకటించిన సినీనటుడు విజయ్ దళపతి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కమిటీలు, బృందాలను రంగంలోకి దించబోతున్నారని సమాచారం. తాజాగా విజయ్ ఒక లేఖను విడుదల చేశారు. ‘నా ఎదుగుదలకు సహకరించిన పెద్దలు అందరికీ ధన్యవాదాలు. సినీరంగ ప్రముఖులు, వివిధ రాజకీయపార్టీ నేతలు, అభిమానులు, అండగా నిలిచిన మీడియా అందరికీ కృతజ్ఞతలు. గుండెల్లో నింపుకున్న అభిమానులు అందిరికీ థ్యాంక్యూ. తమిళ ప్రజలు సంక్షేమం కోసం రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తున్నా.. విజయం సాధిస్తా..’ అని విజయ్ లేఖలో పేర్కొన్నారు. -
Tamil Nadu politics: రాజకీయాల్లోకి ‘దళపతి’ విజయ్
సాక్షి, చెన్నై: తమిళ రాజకీయ ముఖచిత్రంపై మరో అగ్రతార మెరిసింది. క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెడుతున్నట్లు తమిళ అభిమానుల ‘దళపతి’, ప్రముఖ నటుడు విజయ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదలచేశారు. ‘‘తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నాం. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం వద్ద దరఖాస్తు చేశాం. 2026లో తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయకేతనం ఎగరేయడమే మా లక్ష్యం. లోక్‌సభ ఎన్నికల్లో ఎవరికీ మద్దతివ్వబోం. అవినీతి, అధ్వాన్న పరిపాలన, విభజన రాజకీయాలతో పాలిటిక్స్‌ను భ్రషు్టపట్టించారు. నిస్వార్థంగా, పారదర్శకంగా, మార్గదర్శకంగా, అద్భుతమైన పరిపాలనకు బాటలు పరిచే రాజకీయ ఉద్యమం కోసం తమిళ ప్రజలు ఎదురుచూస్తున్నారు. కుల, మత విభేదాలకు అతీతంగా పాలించే అవినీతిరహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ’’ అని విజయ్ వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడు విజయ్, సీనియర్ నేతలు గత నెల 25వ తేదీన పార్టీ సర్వసభ్య మండలి, కార్యనిర్వాహణ మండలి సమావేశంలో పాల్గొని పార్టీ నియమావళి, నిబంధనలకు ఆమోద ముద్ర వేశారని పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎన్నాళ్లనుంచో సేవ చేద్దామనుకుంటున్నా ‘‘రాజకీయాల్లో మార్పులు తేగల సత్తా ప్రజా ఉద్యమానికే ఉంది. అది మాత్రమే తమిళనాడు పౌరుల హక్కులను కాపాడగలదు. కన్న తల్లిదండ్రులతోపాటు నాకు పేరు ప్రతిష్టలు తెచి్చన రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్నా. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి, విజయం సాధించి ప్రజలు కలలుగన్న రాజకీయ మార్పుకు బాటలు వేయడమే మా లక్ష్యం. ఈసీ నుంచి అనుమతులు వచ్చాక పార్టీ కార్యక్రమాలు మొదలుపెడతాం. లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాక పార్టీ కార్యకర్తలను సంఘటితం చేసి పార్టీ విధానాలు, పార్టీ జెండా, పార్టీ గుర్తు, ఇతర కార్యాచరణకు తుదిరూపునిస్తాం’’ అని విజయ్ స్పష్టంచేశారు. ‘‘ రాజకీయాలంటే సినిమా ప్రపంచం నుంచి నాకు ఒక విరామం కాదు. తపనతో రాజకీయాల్లోకి వస్తున్నా. రాజనీతి అంటే ప్రజలకు గొప్పగా సేవ చేయడం. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తిచేసి రాజకీయాలకు అంకితమవుతా’’ అని అన్నారు. -
రాజకీయాల్లోకి తమిళ నటుడు విజయ్?
చెన్నై: తమిళ నటుడు దళపతి విజయ్ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకుగాను త్వరలోనే కొత్తగా రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. చెన్నైలో గురువారం జరిగిన విజయ్ అభిమానుల సంఘం ‘విజయ్ మక్కల్ ఇయక్కమ్’సర్వసభ్య సమావేశం ఇందుకు ఆమోదం తెలిపింది. విజయ్ అధ్యక్షతన ఏర్పాటయ్యే పార్టీకి నియమ నిబంధనలను ఖరారు చేసే అధికారం కూడా ఈ సమావేశం విజయ్‌కే వదిలేసింది. నెలలోగా పార్టీ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారని సమాచారం. తమిళనాడుతోపాటు కేరళలోనూ విజయ్‌కు భారీగా అభిమానులున్నారు. ఆయన పలు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారు. స్థానిక ఎన్నికల్లోనూ విజయ్ అభిమానుల సంఘం పోటీ చేసింది. 2026 ఎన్నికల్లో రాజకీయాల్లోకి ప్రవేశిస్తానంటూ గతంలోనే ఆయన ప్రకటించారు. -
కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన ప్రజా గాయకుడు గద్దర్
-
కొత్త పార్టీ ప్రకటించిన గాలి జనార్దన్ రెడ్డి.. 2023లో అక్కడి నుంచే పోటీ!
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సొంత పార్టీని స్థాపించారు. కొద్ది రోజుల క్రితం తుమకూరు నగరంలో ఉన్న సిద్ధగంగా మఠాన్ని సందర్శించిన సందర్భంగా సొంత పార్టీపై సూత్రప్రాయంగా వెల్లడించిన గాలి జనార్దన్ రెడ్డి.. ముందుగా చెప్పినట్లుగానే డిసెంబర్ 25న కొత్త పార్టీ ప్రకటన చేశారు. ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’ పేరుతో నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు బీజేపీలో కొనసాగిన ఆయన.. నాయకత్వం బుజ్జగించినప్పటికీ కొత్త పార్టీవేపై మొగ్గు చూపారు. బీజేపీతో రెండు దశాబ్దాల బందానికి తెరదించారు. మరోవైపు.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొప్పల్ జిల్లాలోని గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ‘నేను ఆ పార్టీ సభ్యుడిని కానని దానితో ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ ఆ పార్టీకి చెందిన వాడినేనని ప్రజలు విశ్వసించారు. ఆ నమ్మకం అబద్ధమని తేలింది. నా సొంత ఆలోచనతో ఈ రోజు కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని ప్రకటిస్తున్నాను. మతం, కులం పేరుతో చేసే విభజన రాజకీయాలకు ఈ పార్టీ దూరంగా ఉంటుంది. నా జీవితంలో మొదలు పెట్టిన ఏ విషయంలోనూ విఫలం కాలేదు. నా చిన్నతనంలో గోళీలు ఆడుకునేప్పటి నుంచి ఇప్పటి వరకు పరాజయాన్ని ఆమోదించని వ్యక్తిని. ప్రజల ఆశిస్సులు ఉంటాయనే విశ్వాసం ఉంది. భవిష్యత్తులో కర్ణాటక కల్యాణ రాజ్యంగా(సంక్షేమ రాష్ట్రంగా) అవతరిస్తుంది.’ - గాలి జనార్దన్ రెడ్డి, కర్ణాటక మాజీ మంత్రి గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు 9 మందిపై 2009లో సీబీఐ కేసులు నమోదు చేసింది. 2011 సెప్టెంబర్‌లో జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. నాలుగేళ్ల తర్వాత 2015లో కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ను సుప్రీం కోర్టు మంజూరు చేసింది. కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్‌లోని కడప, అనంతపురంకు వెళ్లరాదని స్పష్టం చేసింది. అయితే, 2020లో మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్లగా ఆయా జిల్లాల ఎస్పీలకు తెలియజేసిన తర్వాత వెళ్లేందుకు వీలు కల్పించింది. ఇదీ చదవండి: పొలిటికల్ పార్టీపై మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి క్లారిటీ.. 'ఆ రోజే అన్ని చెబుతా' -
డిసెంబర్ కల్లా నేషనల్ హైవేపై కేసీఆర్ జాతీయ పార్టీ
సాక్షి, హైదరాబాద్: కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ప్రకటన ముహూర్తాన్ని వాయిదా వేసే యోచనలో ఉన్నారు. పార్టీ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు పూర్తిగా కొలిక్కి రాకపోవడం, జాతీయ స్థాయిలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణల దృష్ట్యా.. ముందు భావించినట్టు దసరాకు కాకుండా కొంత వెనక్కి జరపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పార్టీ ఏర్పాటు కసరత్తు కొలిక్కి వచ్చే అవకాశముందని టీఆర్ఎస్ వర్గాలు తాజాగా వెల్లడించాయి. జెండా, ఎజెండాపై లోతుగా చర్చ ప్రస్తుతం జాతీయ పార్టీ జెండా, ఎజెండా, పేరు సంబంధిత అంశాలపై, టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మార్చడంలో ఎదురయ్యే సాంకేతిక అవరోధాలపై లోతుగా చర్చిస్తున్నారు. తెలంగాణ మోడల్‌ను జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు అవసరమైన నిధులు, అనుసరించాల్సిన ప్రణాళిక తదితరాలపైనా ఆయా రంగాలకు చెందిన నిపుణులతో మంతనాలు కొనసాగుతున్నాయి. కొత్త జాతీయ పార్టీ ఎజెండాలో చేర్చే ప్రతి అంశాన్నీ ఆచరణ సాధ్యం చేసేందుకు తమ వద్ద ఉన్న ప్రణాళికలను కూడా వివరించాలని కేసీఆర్ నిర్ణయించారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి న్యాయ నిపుణులు, గతంలో ఎన్నికల సంఘంలో పనిచేసిన కొందరు కీలక అధికారులతో కూడిన బృందం సలహాలు కూడా తీసుకుంటున్నారు. విపక్షాలు, ప్రాంతీయ పార్టీల వైఖరి పరిగణనలోకి తీసుకుని లెక్కలు మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా హరియాణాలో ఈ నెల 25న జరిగిన సమ్మాన్ దివస్‌కు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, సీపీఎం నేత సీతారాం ఏచూరితో పాటు పలువురు విపక్ష నేతలు పాల్గొన్నారు. కాగా నితీష్‌తో పాటు పలువురు నేతలు కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు మొగ్గు చూపుతుండటంతో సీఎం కేసీఆర్ సమ్మాన్ దివస్‌కు దూరంగా ఉన్నట్లు తెలిసింది. బిహార్‌లో బీజేపీతో నితీష్ తెగతెంపులు, సోనియాతో భేటీ, మహారాష్ట్ర శివసేనలో చీలిక వంటి పరిణామాలను పార్టీ అధినేత నిశితంగా పరిశీలిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలతో సయోధ్యతో పనిచేస్తూనే కొత్త జాతీయ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై కేసీఆర్ విభిన్న కోణాల్లో కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రాంతీయ పార్టీల్లో చాలావరకు కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడంపైనే ఆసక్తి చూపుతుండటాన్ని పరిగణనలోకి తీసుకుని లెక్కలు వేసుకుంటున్నట్లు తెలిసింది. డిసెంబర్‌లోగానే ముహూర్తం..! కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉన్న పార్టీలు, నేతలతో వేదిక పంచుకుంటే ఎదురయ్యే పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే హరియాణా భేటీకి కేసీఆర్ దూరంగా ఉన్నట్లు తెలిసింది. అదే సమయంలో జాతీయ పార్టీ ఏర్పాటుపై ఇప్పటికే పలుసార్లు ప్రకటనలు చేసిన నేపథ్యంలో.. ఆ దిశగా అడుగులు ముందుకు పడకపోతే ప్రతికూల ప్రచారం జరిగే అవకాశముందని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ కారణంగానే ఈ ఏడాది డిసెంబర్‌లోగా పార్టీ ముహూర్తాన్ని ఖరారు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అప్పటివరకు వివిధ రంగాలు, వర్గాలకు చెందిన వారితో జాతీయ అంశాలపై భేటీలు, మంతనాలు కొనసాగించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రతి రాష్ట్రం నుంచి ఒకరిద్దరు పార్టీలో చేరేలా.. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటించే నాటికే అన్ని రాష్ట్రాల్లోనూ ఒకరిద్దరు బలమైన నేతలు కొత్త పార్టీలో చేరేలా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌తో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వఘేలా, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్‌తో రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ ఎంపీ ఎన్కే ప్రేమ్‌చంద్రన్ ఇటీవల భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్‌ను ఆహ్వానించడంతో పాటు తాము కూడా కొత్త పార్టీలో చేరేందుకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు. పార్టీలోకి వచ్చే వారిని ఆహ్వానిస్తూనే, చిన్నా చితకా పార్టీల విలీనం, వారి నుంచే వచ్చే డిమాండ్లను తట్టుకోవడం తదితరాలపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే దసరా నాటికి కొత్త జాతీయ పార్టీకి తుది రూపునివ్వడం కష్టమనే అభిప్రాయంతో టీఆర్ఎస్ అధినేత ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ పేరు ఇదే..
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. కాంగ్రెస్ మాజీ నేత, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీని స్థాపిస్తానని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ పేరును ఆయన సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఉర్దూ, సంస్కృతంలో దాదాపు 1500 పేర్లు పరిశీలించామని చెప్పారు. హిందూ, ఉర్దూ రెండూ కలిపితే హిందూస్థానీ అన్నారు. ప్రజాస్వామ్యం, శాంతి, స్వాత్రంత్ర్యాన్ని ప్రతిబించేలా పార్టీ పేరు ఉండాలనుకున్నామని ఆజాద్ చెప్పారు. అందుకే చివరగా 'డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ' పేరును ఖరారు చేసినట్లు ప్రకటించారు. ఈ పార్టీ జెండా నిలువుగా మూడు రంగుల్లో ఉంది. నీలం, తెలుపు, పసుపు రంగుల కలయికలో తీర్చిదిద్దారు. కశ్మీర్ ప్రజల సంక్షేమం, అభివృద్ధే తమ ఎజెండా అని ఆజాద్ అన్నారు. ప్రస్తుతం తన పార్టీ జమ్ముకశ్మీర్‌కే పరిమితం అవుతుందని, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా విస్తరించే విషయంపై ఆలోచిస్తానని ఆజాద్ ఇప్పటికే చెప్పారు. కాంగ్రెస్‌తో 50 ఏళ్ల అనుబంధానికి తెగదెంపులు చేసుకొని గత నెలలోనే పార్టీకి రాజీనామా చేశారు ఆజాద్. హస్తం పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 2017లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాక పార్టీలో సంప్రదింపుల ఆనవాయితీని తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌కు వైద్యుడు చికిత్స అందిచాల్సింది పోయి కాంపౌడర్లు చికిత్స చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చదవండి: రాజస్థాన్ సంక్షోభంపై రాహుల్ సమీక్ష.. హుటాహుటిన ఢిల్లీకి వేణుగోపాల్ -
త్వరలో మరో కొత్త రాజకీయ పార్టీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. కేంద్ర మాజీ మంత్రి దివంగత పి.శివశంకర్ తనయుడు, కాంగ్రెస్ నేత డాక్టర్ వినయ్ కుమార్ నేతృత్వంలో ఈ పార్టీ ఏర్పాటు కాబోతుంది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమం, సమగ్ర రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు వినయ్ కుమార్ వెల్లడించారు. బుధవారం బంజారాహిల్స్‌లోని ఓ ఫంక్షన్హాల్లో ఆయన తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఓటు బ్యాంకు రాజకీయాలే తప్ప ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వ పెద్దలు, రాజకీయ పార్టీల్లో కరువయ్యాయని అన్నారు. ప్రజలకు ఉచితంగా అందాల్సిన విద్య, వైద్యాన్ని వ్యాపారం చేశారని, ఆత్మాభిమానం గల రైతును రుణమాఫీ, ఇతర స్కీంల పేరుతో చేతులు చాచే స్థితికి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారని అన్నారు. నవంబర్‌లో కొత్త రాజకీయ పార్టీ పేరును ప్రకటిస్తామని పార్టీ వ్యవస్థాపక సభ్యులు నరహరి, విఠల్ తదితరులు తెలిపారు. -
Amarinder Singh: కెప్టెన్ ప్రభావమెంత?
పంజాబ్ ముఖ్యమంత్రి పదవి నుంచి నెల రోజుల క్రితం అవమానకర రీతిలో తప్పుకున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ (79) కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అధికారం నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ, గద్దెనెక్కడానికి శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ, తదితర పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. అమరీందర్ పార్టీ రాష్ట్ర రాజకీయాలను ఏమేరకు ప్రభావితం చేస్తుందన్న దానిపై అందరి దృష్టి నెలకొంది. అమరీందర్ పార్టీ బీజేపీతో, శిరోమణి అకాలీదళ్‌లోని చీలిక వర్గాలతో పొత్తు పెట్టుకొనే అవకాశం ఉన్నట్లు సంకేతాలిస్తోంది. పంజాబ్‌లో కొత్త పార్టీతో వచ్చే ఎన్నికల్లో ఎవరికి నష్టం? ఎవరికి లాభం? అన్న చర్చ మొదలయ్యింది. అమరీందర్ ఎత్తుగడలను బీజేపీ స్వాగతిస్తుండగా, అధికార కాంగ్రెస్ ఆయన కొత్తగా పార్టీ పెట్టి, సాధించేది ఏమీ ఉండదంటూ తేలిగ్గా కొట్టిపారేస్తోంది. ప్రధాని మోదీ సూచనల మేరకే అమరీందర్ కొత్త కుంపటి పెడుతున్నారని ఆప్ ఆరోపించింది. కెప్టెన్ వెంట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు! అమరీందర్ గత 50 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌తో ఆయనకు సుదీర్ఘ అనుబంధం ఉంది. పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్ సిద్ధూతో విభేదాలు, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ మంత్రాంగం వల్ల ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అయితే, ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు బలమైన అనుచర వర్గాన్ని తయారు చేసుకున్నారు. వ్యక్తిగతంగా కూడా అమరీందర్‌కు పంజాబ్ ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. మొత్తం 117 స్థానాలున్న శాసనసభలో కాంగ్రెస్‌కు 77 మంది సభ్యుల బలముంది. ఇందులో 12 మందికిపైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికీ అమరీందర్ సింగ్ మద్దతుదారులుగానే కొనసాగుతున్నారని, కొత్త పార్టీ స్థాపించగానే వారంతా వచ్చి, ఎన్నికల ముందు అందులో చేరుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కచ్చితంగా ఎంతమంది ఎమ్మెల్యేలు కెప్టెన్ వెంట నడుస్తారన్నది ఇప్పుడే తేలకపోయినా కాంగ్రెస్‌కు మాత్రం ఎంతోకొంత నష్టం తప్పదని చెప్పొచ్చు. అంటే అమరీందర్ కొత్త పార్టీతో మొదట నష్టపోయేది కాంగ్రెస్సే. మరోవైపు సిద్ధూతో కాంగ్రెస్ అధిష్టానానికి నిత్యం ఏదో ఒక తలనొప్పి ఎదురవుతూనే ఉంది. తన అనుచరుడే అయినప్పటికీ కొత్త దళిత సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీతో సైతం సిద్ధూకు పొసగడం లేదు. ఈ అంతర్గత కుమ్ములాటలు ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు తీవ్ర ప్రతికూలంగా పరిణమించే అవకాశాలున్నాయి. విసిగివేసారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా కనిపించినా.. ఆఖరి నిమిషంలో అమరీందర్ పార్టీలోకి జంప్ చేసే అవకాశాలను కొట్టిపారేయలేం. ఈ విషయం కాంగ్రెస్ నాయకులకు తెలిసినప్పటికీ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చతుర్ముఖ పోరు... సర్దార్ల రాష్ట్రం పంజాబ్‌లో అధికారం ఎప్పుడూ శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్ కూటముల మధ్యే చేతులు మారుతోంది. మరో కూటమికి అవకాశం దక్కడం లేదు. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) శక్తిమేర పోరాడి 23.7 శాతం ఓట్లు, 20 సీట్లతో అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. పంజాబ్‌లో తమకు అవకాశాలుంటాయని భావిస్తున్న ఆప్ చాలాకాలంగా ఈ రాష్ట్రంపై దృష్టి పెట్టి పనిచేస్తోంది. మరోవైపు పంజాబ్ జనాభాలో ఏకంగా 32 శాతం మంది దళితులే ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని శిరోమణి అకాలీదళ్... బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. 20 సీట్లను బీఎస్పీకి వదిలి... 97 స్థానాల్లో పోటీచేయనుంది. ఇప్పటికే సింహభాగం స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేసింది కూడా. ఈసారి కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీతోపాటు శిరోమణి అకాలీదళ్‌లోని చీలిక వర్గాలైన రంజిత్ సింగ్ బ్రహ్మపురా, సుఖ్‌దేవ్ ధిండ్సాతో చేతులు కలిపితే.. రాష్ట్రంలో మొత్తం నాలుగు రాజకీయ కూటములు తెరపైకి వస్తాయి. అప్పుడు ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతుందనడంలో సందేహం లేదు. గతంలో సొంత కూటమి ఫెయిల్ అమరీందర్ కొత్త రాజకీయ కూటమి ప్రయోగం చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆయన 1984లో కాంగ్రెస్‌ను వీడి శిరోమణి అకాలీదళ్‌లో చేరారు. 1992లో అకాలీదళ్ నుంచి బయటకు వచ్చారు. శిరోమణి అకాలీదళ్(పాంథిక్) పేరిట సొంతంగా ఒక పొలిటికల్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 1997లో తన కూటమిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అప్పటి నుంచి అదే పార్టీలో కొనసాగారు. రాష్ట్రంలో రెండు సార్లు (2002–07, 2017–22) కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం వెనుక కీలక పాత్ర పోషించారు. తనను అవమానించిన కాంగ్రెస్‌పై ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతీకారం తీర్చుకోవాలని అమరీందర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన రాజకీయం జీవితం ముగింపునకొచ్చినట్లేనని, ఇదే చివరి అవకాశమని పరిశీలకులు చెబుతున్నారు. కొత్త పొత్తు పొడిచేనా! అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ పట్ల సానుకూల ధోరణి కనబర్చారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను గట్టిగా సమర్థించారు. పాకిస్తాన్ భూభాగంలో నిర్వహించిన సర్జికల్ స్ట్రయిక్స్‌తోపాటు సరిహద్దుల్లో ఇటీవల బీఎస్ఎఫ్ పరిధిని పెంచడం మంచి పరిణామం అని కితాబిచ్చారు. అందుకే బీజేపీతో ఆయన పొత్తు పెట్టుకుంటారన్న వార్తలు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. బీజేపీతో కలిసి కూటమి కట్టడానికి అమరీందర్‌కు ఉన్న ఏకైక అభ్యంతరం మూడు నూతన వ్యవసాయ చట్టాలు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఈ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమిస్తోంది. రైతు సంఘాలతో చర్చలు జరపాలని, సాగు చట్టాల విషయంలో రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని అమరీందర్ సింగ్ కేంద్రాన్ని కోరుతున్నారు. కేంద్ర సర్కారు కొంత దిగివచ్చినా తమకు రాజకీయంగా లబ్ధి చేకూరుతుందని ఆయన లెక్కలు వేసుకుంటున్నారు. మితవాది అనే పేరు, సైనిక నేపథ్యం ఉండడం అమరీందర్‌కు బీజేపీతో జట్టు కట్టడానికి కలిసి వస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ, ఇతర పక్షాలను కలుపుకొని భారీ రాజకీయ కూటమిని ఏర్పాటు చేయాలన్నది అమరీందర్ ఆలోచనగా చెబుతున్నారు. నిజానికి ఎన్డీయేలోనే భాగస్వామ్య పక్షంగా ఉన్న శిరోమణి అకాలీదళ్ గత ఏడాది నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆ కూటమి నుంచి బయటకు వచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టీఆర్ఎస్ వ్యతిరేకులతో త్వరలో కొత్త పార్టీ
సాక్షి, తాండూరు టౌన్: టీఆర్ఎస్ వ్యతిరేకులతో కలిసి రాష్ట్రంలో కొత్త పార్టీ పెడతానని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ వ్యతిరేకులను కలుస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం తాండూరుకు వచ్చిన కొండా పలువురు స్థానిక నేతలను కలిశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను దారుణంగా దోచుకుంటోందని ఆరోపించారు. తాను టీఆర్ఎస్ తరఫున ఎంపీగా గెలిచినప్పటికీ పార్టీ తీరు నచ్చక కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు. అయితే కాంగ్రెస్ పోరాడే తత్వాన్ని మరిచిపోయిందని, అందుకే ఆ పార్టీని వీడానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ చేస్తున్న అరాచకాలను ప్రజల్లో ఎండగట్టేందుకు సిద్ధమయ్యానని, టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి తగిన బుద్ధి చెబుతానని హెచ్చరించారు. వీరందరూ కలిసొస్తే కొత్త పార్టీకి రెడీ అని, తానొక్కడిని మాత్రం పార్టీ పెట్టేది లేదని వెల్లడించారు. టీఆర్ఎస్ వ్యతిరేకులంతా ఏకం కాని పక్షంలో బీజేపీలో చేరుతానని తెలిపారు. ఇప్పటికే తాను కోదండరాం, తీన్మార్ మల్లన్న, చెరుకు సుధాకర్, మహబూబ్‌ఖాన్, దాసోజు శ్రావణ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులను కలిశానని, త్వరలోనే రేవంత్‌రెడ్డిని కలుస్తానని చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నారు. ఒకప్పటి కాంగ్రెస్ నేతలు సబితారెడ్డి, సుధీర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి వలె అమ్ముడుపోయే నేతలను కలుపుకొనిపోయే పరిస్థితి ఉండదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌లో అనేకమంది కోవర్టులు ఉన్నారని కొండా ఆరోపించారు. ఆయనతో పాటు టీజేఎస్ తాండూరు నేత సోమశేఖర్, కాంగ్రెస్ నేత రఘునందన్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
రాయలసీమ వేదికగా మరో రాజకీయ పార్టీ!
సాక్షి, కడప: రాయలసీమ వేదికగా మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రొద్దుటూరు జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన ఇంజా సోమశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ సమతా పార్టీ ఏర్పాటైంది. ఈ సందర్భంగా పార్టీ జెండా, లోగోను వ్యవస్థాపక అధ్యక్షుడైన ఇంజా సోమశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. విద్య, వైద్యం, సంక్షేమం ప్రధాన ఎజెండాగా పార్టీని స్థాపిస్తున్నట్టు ఆయన తెలిపారు. రాయలసీమ రాష్ట్ర ఏర్పాటు, అభివృద్ధి కోసం ప్రత్యక్ష రాజకీయాల ద్వారా కృషి చేస్తామని చెప్పారు. -
కొత్త పార్టీని స్థాపించిన సివిల్స్ టాపర్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి, 2010 సివిల్స్ టాపర్ షా ఫైజల్ ఆదివారం జమ్ము అండ్ కశ్మీర్ పీపుల్స్ మూమెంట్ అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నారు. రాజ్‌బాగ్ పట్టణంలోని గిండున్ గ్రౌండ్లో పార్టీని ఆవిష్కరించనున్నట్టు ఫైజల్ తెలిపారు. కశ్మీరీలపై నిరాటంకంగా కొనసాగుతున్న ఆకృత్యాలు, అణచివేతను నిరసిస్తూ యూపీఎస్సీ 2010 బ్యాచ్ టాపర్ అయిన ఫైజల్.. ఐఏఎస్ పదవికి ఈ ఏడాది జనవరిలో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కేంద్రం కీలక ప్రభుత్వ సంస్థలను నాశనం చేసేలా వ్యవహరిస్తున్నదని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహార తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముస్లిం, దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆయన పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటికీ నిరసనగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఫైజల్ ప్రకటించారు. రాష్ట్రంలో అవినీతిరహిత, పారదర్శక రాజకీయాల కోసం తనకు మద్దతుగా నిలువాలని కొంతకాలంగా యువతతోపాటు వివిధ వర్గాలను కలుస్తూ ప్రచారం చేస్తున్నారు. కశ్మీర్లో శాంతిని కోరుకుంటున్న పలువురు యువనాయకులు ఆయన పార్టీలో చేరే అవకాశం ఉంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై ఆయన ఎలాంటి ప్రకటన చేయ్యలేదు. -
మరో కొత్త రాజకీయపార్టీ
సాక్షి, గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): స్త్రీ అభివృద్ధే సమాజాభివృద్ధి నినాదంతో ‘నారీశక్తి’ పేరుతో నూతన జాతీయ రాజకీయపార్టీ ఆవిర్భవించింది. విజయవాడలోని జింఖానా మైదానం వద్ద ఉన్న కందుకూరి కళ్యాణ మండపంలో నూతన రాజకీయపార్టీ ఆవిర్భావ సభ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకురాలు కావూరి లావణ్య, ప్రవాసాంధ్రురాలు నారీశక్తి ఆవిర్భావం, లక్ష్యాలను వివరించారు. లావణ్య తల్లిదండ్రులు కావూరి కృష్ణమూర్తి, కారుణ్య దంపతులు నారీశక్తి లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ.. సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరమన్నారు. స్త్రీలకు భవిత కోసం పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు. న్యాయవాది లంకా పద్మజ మాట్లాడుతూ.. స్త్రీలపై లైంగిక దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, మహిళా ఐపీఎస్‌లకే భద్రతలేని పరిస్థితి నెలకొందని, నిర్భయ వంటి చట్టం వచ్చినా దాడులు ఆగడం లేదన్నారు. మాజీ మేయర్ మల్లికా బేగం మాట్లాడుతూ.. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే వాటిల్లో 15 మంది మహిళలు కూడా లేరన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు చంద్రికా నాయుడు, సుంకర నాగలక్ష్మీ, షబ్బీర్ అహ్మద్, ఎం.కొండయ్య, నారాయణరావు పాల్గొన్నారు. -
కొత్త పార్టీని ప్రారంభించిన కార్తీక్
పెరంబూరు(చెన్నై): సీనియర్ నటుడు కార్తీక్ కొత్త పార్టీని ప్రారంభించారు. ఇంతకుముందు, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరి ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వహించారు. ఆ తరువాత నాడాళుమ్ మక్కళ్ కట్చి పేరుతో సొంత పార్టీని నెలకొల్పారు. అప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీచేసి డిపాజిట్లు కోల్పోయారు. ఆ తరువాత కార్తీక్ కొన్ని సమస్యల కారణంగా రాజకీయాలకు దూరం అయ్యారు. ఇటీవలే మళ్లీ నటించడం మొదలుపెట్టిన కార్తీక్ మనిద ఉరిమై కాక్కుం కట్చి పేరుతో మరో రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆయనే శనివారం నెల్లైలో మీడియా సమావేశంలో వెల్లడించారు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరువాత తాను సొంతంగా ప్రారంభించిన నాడాళుం మక్కళ్ కట్చిలోని సభ్యులే తనకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అందుకే ఆ పార్టీని రద్దు చేసినట్లు చెప్పారు. -
యూపీపీ.. ఉపేంద్ర కొత్త పార్టీ
సాక్షి బెంగళూరు: విలక్షణ నటుడు ఉపేంద్ర కొత్త పార్టీని ప్రారంభించారు. ఉత్తమ ప్రజాకీయ పార్టీ (యూపీపీ)తో సరికొత్తగా రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. ఆరు నెలల క్రితం కర్ణాటక ప్రజ్ఞావంతర జనతా పార్టీ (కేపీజేపీ)కి గుడ్ బై చెప్పి కొత్త పార్టీ ఏర్పాటుపై ఉపేంద్ర దృష్టి సారించారు. పాలనలో జవాబుదారీతనం, ఆర్థిక పారదర్శకత ఉండాలనే లక్ష్యంతో ఉత్తమ ప్రజాకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రియల్‌స్టార్ ఉపేంద్ర మంగళవారం తన 51వ పుట్టిన రోజు సందర్భంగా ఇక్కడ తన నివాసంలో పార్టీని, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కులం, డబ్బు, వర్గం, ఆయుధాలను విడిచి జావాబుదారితనంతో కూడిన పాలన అందించడమే తమ పార్టీ ఆశయమని ఉపేంద్ర చెప్పారు. పల్లె, గ్రామం, నగరం తదితర రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల సమస్యలను మొబైల్‌తో చిత్రీకరించి పార్టీ వెబ్‌సైట్‌కు పంపించాలని సూచించారు. తాము ఆ వీడియో చూసి మేధావులతో చర్చించ పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. పార్టీలో చేరేవారికి పరీక్ష దూరదృష్టి కలిగి, ప్రజలకు సేవ చేయాలనుకునే వారికి తమ పార్టీలోకి ఆహ్వానం పలుకుతామని తెలిపారు. పార్టీలో చేరేవారికి తొలుత లిఖిత పరీక్ష నిర్వహిస్తామని ఉప్పి చెప్పారు. త్వరలోనే యాప్ విడుదల చేస్తామన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఇంకా ఆలోచించలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ఒకే రోజు ముగ్గురి పుట్టినరోజు.. మంగళవారం కన్నడ చిత్రసీమలో ఒకేరోజు ముగ్గురు నటుల పుట్టినరోజు. దివంగత విష్ణువర్ధన్, రియల్‌స్టార్ ఉపేంద్ర, నటి శృతి పుట్టినరోజులు జరిగాయి. బెంగళూరులో విష్ణువర్ధన్ సమాధి వద్ద అభిమానులు పెద్దెత్తున పుష్పాంజలి ఘటించారు. రక్తదానం, అన్నదానం నిర్వహించారు. -
మరో కొత్తపార్టీ!
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ కుటుంబం నుంచి మరో కొత్త పార్టీ శనివారం ఆవిర్భవించింది. అన్నా, ఎంజీఆర్ మక్కల్ కళగం పేరిట పార్టీని టీటీవీ భాస్కరన్ ఏర్పాటు చేశారు. నీలంకరైలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో పార్టీ పేరును, జెండాను భాస్కరన్ ప్రకటించారు. తమ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. తిరువారూర్ జిల్లా మన్నార్‌కుడి కేంద్రంగా చిన్నమ్మ శశికళ కుటుంబం ఒకప్పుడు సాగించిన రాజకీయదందా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమ్మ జయలలిత, నెచ్చెలి శశికళను అడ్డం పెట్టుకుని ఈ కుటుంబం మన్నార్‌కుడి మాఫియాగా ఎదిగిందని చెప్పవచ్చు. అయితే, జయలలిత మరణం తదుపరి పరిణామాలు, చిన్నమ్మ జైలు జీవితం వెరసి ఈ కుటుంబాన్ని కష్టాలపాలు చేశాయి. చిన్నమ్మ గుప్పెట్లో ఉన్న అన్నాడీఎంకే చేజారడం పెద్ద షాక్. ఆ తదుపరి పరిణామాలు చిన్నమ్మ ఫ్యామిలీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఐటీ దాడులు ఓ వైపు, పాత కేసుల విచారణలు మరోవైపు ఈ కుటుంబానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అదే సమయంలో రాజకీయ ఉనికి చాటుకునే రీతిలో చిన్నమ్మ ప్రతినిధిగా, ఆమె అక్క వనితామణి కుమారుడు దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఏర్పాటు చేశారు. అన్నాడీఎంకే కేడర్‌ను చీల్చడంలో సఫలీకృతుడైన దినకరన్, తన బలాన్ని చాటుకునేందుకు రంకెలు వేస్తున్నారు. ఈ పార్టీ రూపంలో చిన్నమ్మ సోదరుడు, మేనమామ దివాకరన్‌తో ఏర్పడ్డ విభేదాలు దినకరన్‌కు కొత్త చిక్కుల్ని తెచ్చి పెట్టాయి. చిన్నమ్మ కుటుంబం నుంచి మరో పార్టీ దివాకరన్ నేతృత్వంలో పుట్టుకు వచ్చింది. తన వారసుడు జై ఆనంద్‌ను రాజకీయంగా ఉన్న స్థానంలో కూర్చొబెట్టడం లక్ష్యంగా అన్నాద్రావిడర్ కళగంను దివాకరన్ ప్రకటించుకున్నారు. ఈయన సైతం తన బలాన్ని చాటే దిశగా కుస్తీలు పట్టే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో అన్నయ్య దినకరన్, మేనమామ దివాకరన్లనుఢీకొట్టే రీతిలో చిన్నమ్మ కుటుంబం నుంచి మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ఈ పార్టీని దినకరన్ సోదరుడు, నటుడు టీటీవీ భాస్కరన్ ప్రకటించారు. అన్నా, ఎంజీఆర్ మక్కల్ కళగం: కుటుంబ విభేదాల నేపథ్యంలో అన్నయ్య దినకరన్, మేనమామ దివాకరన్ బాటలో కొత్త పార్టీ ప్రకటనకు గత నెల భాస్కరన్ సిద్ధమయ్యారు. అయితే, భాస్కరన్ మహానాడును తలపించే రీతిలో తిరుత్తణి వేదికగా పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధం చేసుకున్నారు. అయితే, అధికార పక్షం భాస్కరన్‌కు చెక్ పెట్టే రీతిలో వ్యవహరించింది. హంగామాతో సత్తా చాటుకోవాలనుకున్న భాస్కరన్ మహానాడుకు అనుమతి నిరాకరించారు. దీంతో వెనక్కు తగ్గిన భాస్కరన్, హంగు ఆర్భాటాలు లేకుండా, నిరాడంబరంగా శనివారం నీలాంకరై వేదికగా తన కొత్త పార్టీని ప్రకటించుకున్నారు. ఉదయం తన నివాసంలో దురైరాజ్ – ఝాన్సీ దంపతులకు వివాహాన్ని తన చేతుల మీదుగా భాస్కరన్ జరిపించారు. అనంతరం కొత్త పార్టీని మద్దతుదారులు, అభిమానుల సమక్షంలో ప్రకటించారు. అన్నా జయంతిని పురస్కరించుకుని పార్టీని ప్రకటించాలన్న లక్ష్యంతో ఈ ప్రకటన చేస్తున్నట్టు వివరించారు. అన్నా, ఎంజీఆర్ మక్కల్ కళగంగా పార్టీ పేరును ప్రకటించారు. పై భాగంలో ఆరంజ్ (కమలా పండు) రంగు, మధ్య భాగంలో పచ్చ, కింది భాగంలో నలుపు వర్ణంతో కూడి మధ్య భాగంలో ఎంజీఆర్ ముఖ చిత్రంతో పార్టీ జెండాను ఆవిష్కరించారు. భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ భారీ ఎత్తున పార్టీని ప్రకటించాలని తాను సంకల్పించినా, అందుకు తగ్గ అనుమతుల్ని ఈ పాలకులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. తన పార్టీని చూసి పాలకులకే గుబులు పట్టుకుందంటే, ఇక, మిగిలిన పార్టీలకు తనను చూస్తే ముచ్చెమటలేనని ధీమా వ్యక్తం చేశారు. అన్నా జయంతి సందర్భంగా పార్టీని ప్రకటించాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం నిరాడంబర ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. త్వరలో పార్టీ కార్యవర్గం ప్రకటించనున్నట్టు తెలిపారు. తమ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా ముందుకు సాగుతుందని ప్రకటించారు. మోదీని మళ్లీ పీఎం చేయడం లక్ష్యంగా శ్రమిస్తామన్నారు. అవినీతి రహిత పాలన లక్ష్యంగా ముందుకు సాగే వాళ్లతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాని తెలిపారు. అన్నా, ఎంజీఆర్ మద్దతుదారులు, అభిమానుల్ని కలుపుకుని బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. కాగా, అన్నయ్య మద్దతుదారుల్ని ఇరకాటంలో పెట్టే రీతిలో తమ్ముడు పార్టీ పేరును ప్రకటించడం గమనార్హం. అన్నయ్య దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే)ను ప్రకటించుకున్నారు. ఇక అన్నా, ఎంజీఆర్ మక్కల్ కళగం (ఏఎంఎంకే)ను తమ్ముడు ప్రకటించడం గమనార్హం. -
త్వరలో కొత్త పార్టీ పెడతాం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఎన్.చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖర్‌రావులు బీసీలపట్ల అవలంబిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ త్వరలో రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. ‘ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ బహిరంగ సభ పెట్టినా బీసీలంతా మన కోసం పార్టీ పెట్టన్నా..’అని అడుగుతున్నారని చెప్పా రు. పార్టీ ఏర్పాటుపై చర్చలు సాగుతున్నాయన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొన్న గుంటూరు, నిన్న విజయవాడ, అంతకుముందు వరంగల్‌లో పెట్టిన సభల్లో చాలామంది ‘ఈ అగ్రకుల పార్టీల నేతలు మనకు సరైన ప్రాధాన్యతను ఇవ్వట్లేదు, ఎంతసేపు మనల్ని అడుక్కుతినే వాళ్లల్లానే చేస్తున్నారు, సీట్ల విషయంలో మొండిచెయ్యి చూపుతున్నారు, కాబట్టి నువ్వు పార్టీ పెట్టాల్సిందే’అని అంటున్నారని చెప్పారు. పార్టీ పెట్టాల్సిన పరిస్థితి వస్తే ఏపీలోనే పెడతాననిç Ü్పష్టం చేశారు. ఏపీలోనే బీసీలకు ఎక్కువ అన్యాయం జరుగుతోందన్నారు. ఈసారి ఎక్కడ నుంచి, ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే విషయాన్ని కార్యకర్తలతో చర్చించి వారంలోగా వెల్లడిస్తానన్నారు. రద్దు చేసి సీఎంగా కొనసాగడమా? టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. అసెంబ్లీని రద్దు చేసి 125 మంది ఎమ్మెల్యేలను రోడ్డున పడేసి, ఆయన మాత్రం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పీఠంలో కొనసాగడమేమిటని ప్రశ్నించారు. తక్షణం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో బీసీలకు 65 సీట్లు ఇవ్వాలని, లేదంటే బీసీలందరం కలసి ఓడిస్తామని వ్యాఖ్యానించారు. -
‘యువ తెలంగాణ’ ఆవిర్భావం
హైదరాబాద్ : రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులు పోటీలో ఉంటారని యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నారు. సామాజిక స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలనుకున్న వారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. యువతకు, మహిళలకు పెద్దపీట వేస్తామన్నారు. బుధవారం హోటల్ టూరిజం ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో యువ తెలంగాణ పార్టీ జెండాను ఆవిష్కరించిన జిట్టా.. పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను చిన్నచూపు చూస్తోందన్నారు. మంత్రి వర్గంలో వారికి చోటు లేకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. 1999లో యువజన సంఘాల సమితిని ఏర్పాటు చేసి యువజనుల ఉన్నతికి కృషి చేసినట్లు చెప్పారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువ తెలంగాణ పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా ఆవిర్భవించినట్లు ప్రకటించారు. పార్టీ బలోపేతానికి అక్టోబర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు. సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డ జయ శంకర్‌ను విస్మరించి హరికృష్ణకు స్మారక ఘాట్‌ను నిర్మిస్తామని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల్లో ట్యాంక్‌బండ్‌పై జయశంకర్ విగ్రహం పెట్టి స్మారక ఘాట్‌పై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించకపోతే ఇంటికో ఇటుకతో తామే విగ్రహాన్ని నిర్మించుకుంటామన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు.. పార్టీ రాష్ట్ర కమిటీని అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి ప్రకటించారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాణి రుద్రమ, యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రెసిడెంట్‌గా వేణుగోపాల్ కృష్ణ, 12 మంది సభ్యులను ప్రకటించారు. -
తొగాడియా కొత్త హిందూ పార్టీ
న్యూఢిల్లీ: విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) బహిష్కృత నేత ప్రవీణ్ తొగాడియా అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ (ఏహెచ్‌పీ) పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. వీహెచ్‌పీ నుంచి బహిష్కరణకు గురైన తొగాడియా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ‘హిందూ ప్రత్యామ్నాయం’గా తమ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. ‘2014 ఎన్నికల్లో బీజేపీ వెన్నంటి ఉండి గెలిపించిన హిందువులను మోదీ ప్రభుత్వం వంచించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం లేదు. యువతకు మాట ఇచ్చినట్లు 10 కోట్ల ఉద్యోగాలు రాలేదు. రైతులు రోజూ ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు’ అంటూ బీజేపీ, మోదీపై విరుచుకుపడ్డారు. -
ఆగస్టులో నూతన రాజకీయ పార్టీ
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్) : బీసీ ఉద్యమనేత, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో బీసీలకు నూతన రాజకీయ పార్టీ స్థాపించనున్నట్లు బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ నౌడు వెంకటరమణ తెలిపారు. త్వరలో ఆర్. కృష్ణయ్య పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తారన్నారు. పార్టీ పతాకం, విధివిధానాలు ప్రకటిస్తారన్నారు. ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జనాభాలో 52 శాతానికి పైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు బీసీలకు 100 సీట్లు కేటాయిస్తామని హామీలు ఇస్తున్నాయే తప్ప అమలు చేయడం లేదన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయన్నారు. బీసీలకు రాజ్యాధికారం వచ్చినపుడే అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందన్నారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వారిని చైతన్య పరిచేందుకు పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో పర్యటిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో 13జిల్లాలకు జేఏసీ అధ్యక్షులను నియమిస్తామన్నారు. రాష్ట్రంలోని ముఖ్యపట్టణాల్లో బీసీల రాజకీయపార్టీ ఆవిర్భావంపై మేధోమథన సదస్సులు నిర్వహిస్తామన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, మేధావులు, ప్రముఖుల సూచనలు , సలహాలు తీసుకుని పార్టీని ముందుకు తీసుకెళతామన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పాలేటి రామారావు, సంఘం ఉపాధ్యక్షుడు అరవ వెంకటసత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ మారేష్, మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ నూకాలమ్మ, ఉపాధ్యక్షురాలు సీతారత్నం, పరిటాల రాము, పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. -
శశికళ సోదరుడి సొంత పార్టీ.. ‘ఏడీకే’
మన్నార్గుడి: ఏఐఏడీఎంకే బహిష్కృత నేత వి.కె.శశికళ కుటుంబం నుంచి మరో రాజకీయ పార్టీ ఏర్పాటైంది. శశికళ సోదరుడు వి.దివాకరన్ ఆదివారం కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే శశికళ కుటుంబానికి చెందిన ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(ఏఎంఎంకే) పార్టీని స్థాపించారు. దినకరన్‌పై తీవ్ర విమర్శలు చేసిన దివాకరన్‌కు గత నెలలో శశికళ లీగల్ నోటీసులిచ్చారు. బహిరంగ సభల్లో తన పేరు వాడుకోరాదని అందులో హెచ్చరించారు. శశికళను ప్రస్తావించాల్సినప్పుడు సోదరిగా చెప్పుకోబోననీ, ‘తన మాజీ సోదరి’అని మాత్రమే అంటానని దివాకరన్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన ‘అన్న ద్రవిడార్ కళగం (ఏడీకే)’పార్టీని ఏర్పాటు చేశారు. ‘అన్నా’అని అందరూ పిలుచుకునే ద్రవిడ నేత సీఎన్ అన్నాదురై పేరుతో ఈ పార్టీని స్థాపించినట్లు ప్రకటించారు. -
2019 ఎన్నికల నాటికి కొత్త పార్టీ: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: బీసీలకు రాజ్యాధికారం కోసం 2019 శాసనసభ ఎన్నికల నాటికి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య వెల్లడించారు. శుక్రవారం వినాయక నగర్లో నిర్వహించిన గ్రేటర్ బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలను విస్మరిస్తే అన్ని పార్టీలకు ఇవే చివరి ఎన్నికలవుతాయని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు 50 శాతం సీట్ల కేటాయింపుతోపాటు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘ నాయకులు నరేశ్‌బాబు, భూపేష్ సాగర్, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా కొత్త పార్టీ
సాక్షి, విజయవాడ: బీసీలకు రాజ్యాధికారం లక్ష్యంగా కొత్త పార్టీని ప్రకటిస్తామని ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బీసీ సంఘాలతో చర్చించి త్వరలోనే పార్టీ, విధివిధానాలను ప్రకటిస్తామన్నారు. దేశంలో బీసీలను హీనంగా చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్నో పార్టీలు ఉన్నా కేవలం ఓట్ల కోసం బీసీలను వాడుకుంటున్నారన్నారు. అగ్రవర్ణాలకు ఓట్లు వేసి వారిని బిచ్చమెత్తుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఏపీలో బీసీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయం చేయలేదని విమర్శించారు. రాజ్యాధికారమే లక్ష్యంగా ఆత్మగౌరవ పోరాటం చేస్తామని కృష్ణయ్య పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలసికట్టుగా పోరాడాలన్నారు. జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం ఇవ్వాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలన్నారు. జస్టిస్ ఈశ్వరయ్య వ్యవహారంపై ఇంకా సమాచారం తెలుసుకోవాల్సి ఉందని, బీసీలకు అన్యాయం చేస్తే ఒప్పుకోమన్నారు. -
కొత్త రాజకీయ పార్టీ.. ‘బాప్’!
న్యూఢిల్లీ : రాజకీయాలంటేనే బురద..అందులోకి దిగడం అంటే ఊబిలోకి దిగినట్టే అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు దంచేవారు చాలా మందే ఉంటారు. కానీ మేము ఆ కోవకు చెందిన వాళ్లం కాదంటున్నారు ఐఐటీ పూర్వ విద్యార్థులు. తాము కేవలం మాటలకు పరిమితం కాదని.. లక్షల జీతాన్ని, విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధం అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజల హక్కులను కాపాడటమే ధ్యేయంగా పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ‘బహుజన్ ఆజాద్ పార్టీ’ పేరిట ఎన్నికల సంఘంలో రిజిస్టర్ చేయించామని బృంద నాయకుడు నవీన్ కుమార్ తెలిపాడు. 50 మందితో మా ప్రయాణం మొదలు.. ఐఐటీ పూర్వ పూర్వ విద్యార్థులైన 50 మంది బృందంగా ఏర్పడి రాజకీయ పార్టీ స్థాపించాలనే నిర్ణయానికి వచ్చామని నవీన్ కుమార్ తెలిపారు. ఎన్నికల సంఘం గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తమ పార్టీ రాజకీయ ప్రస్థానం మొదలుపెడతామని భవిష్యత్ ప్రణాళికను వెల్లడించారు. బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, ఏపీజే అబ్దుల్ కలాం వంటి మహనీయుల ఫొటోలతో కూడిన పోస్టర్ రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవడంపై దృష్టి సారిస్తామన్నారు. తమ పార్టీ ఏ పార్టీకి వ్యతిరేకం కాదని, సిద్దాంతపరంగా కూడా తమకు ఎవరితో విభేదాలు ఉండబోవని తెలిపారు. కాగా ఈ బృందంలో అత్యధిక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. -
టెక్నోక్రాట్ల రాజకీయ పార్టీ !
రాజకీయాల్లో మార్పు కోసం, అణగారిన వర్గాల హక్కుల్ని కాపాడడం కోసం ఒక కొత్త పార్టీ పురుడు పోసుకుంటోంది. ఇదేదో ఒక వ్యక్తి కనుసన్నుల్లో నడిచే పార్టీ కాదు. మహిళలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యంగా కొంత మంది ఐఐటీ నిపుణులు జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారు. ఢిల్లీ, ఖరగపూర్కు చెందిన 50 మంది ఐఐటీ నిపుణులు బహుజన్ ఆజాద్ పార్టీ (బీఏపీ) పేరుతో ఒక కొత్త పార్టీ స్థాపించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2015 సంవత్సరంలో ఢిల్లీ ఐఐటీలో పట్టా పొందిన నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ పార్టీ నడవబోతోంది. ’ పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న దాదాపు 50 మంది నిపుణులు ఉద్యోగాలకు రాజీనామా చేశారు. కొత్త పార్టీ విధివిధానాలపై భారీగా కసరత్తు చేస్తున్నారు. మాకు కొందరు సివిల్ సర్వీసు అధికారులు కూడా బయట నుంచి మద్దతు ఇస్తారు‘ అని నవీన్‌కుమార్ తెలిపారు. పార్టీకి సేవలందించేవారిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందినవారేనని, అందుకే వాళ్ల స్థితిగతులపై తమకు చాలా అవగాహన ఉందని నవీన్‌కుమార్ వెల్లడించారు. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కేంద్రం ఎన్నికల సంఘాన్ని కూడా సంప్రదించారు. 2020 బిహార్ ఎన్నికల్లో పోటీ అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలో ఆప్ రాజకీయాల్లో ఒక సంచలనాన్ని సృష్టించినట్టే బహుజన్ ఆజాద్ పార్టీ (బాప్) ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి మేధోమథనం జరుగుతోంది. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలుత పోటీ చేసి, ఆ తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విద్యా, న్యాయ రంగాల్లో అణగారిన వర్గాల పాత్ర చాలా పరిమితంగా ఉండడంతో వారి హక్కుల్ని కాపాడడంపైనే కొత్త పార్టీ ప్రధానంగా దృష్టి సారించనుంది. స్వాగతిస్తున్న వివిధ వర్గాలు రాజకీయాల్లో కుళ్లును కడిగేసే విధంగా ఒక ఉప్పెనలా కొత్త తరం రావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దళితులు, మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్న తరుణంలో వారి గళాన్ని వినిపించడం కోసం నవయువకులైన కొందరు ఐఐటీ నిపుణులు ముందుకు రావడంపై దళిత సంఘాలు, రాజకీయ విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘. కొంతమంది ఐఐటీ నిపుణులు ప్రధాన రాజకీయాల్లోకి రావడం అభినందించాల్సిన విషయం. రాజకీయాల్లో దిగ్గజాలైన కాంగ్రెస్, బీజేపీతో పోరాటం కోసం కాకుండా, బహుజనుల అభ్యున్నతి కోసం పోరాటం సాగిస్తే ఆ రాజకీయ పార్టీకి మంచి భవిష్యత్ ఉంటుందని‘ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు.