p.narayana
-
‘నారాయణ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచేందుకే పేపర్ లీక్’
సాక్షి, చిత్తూరు: నారాయణ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచేందుకే పేపర్ లీక్ చేశారని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చిత్తూరు ఎస్పీ మంగళవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఉద్దేశపూర్వకంగానే పేపర్‌ను లీక్ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. ‘టెన్త్ పేపర్ లీక్ కేసులో నారాయణను అరెస్ట్ చేశాం.ఉదయం హైదరాబాద్‌లో నారాయణను అరెస్ట్ చేశాం. గత నెల 27న టెన్త్ పేపర్ మాల్ ప్రాక్టీస్ జరిగింది. చిత్తూరు పీఎస్‌లో నమోదైన కేసులో నారాయణను అరెస్ట్ చేశాం. నిందితుల చైన్ లింక్‌లో చైర్మన్ నారాయణ వరకు ఆధారాలు లభించాయి. నారాయణ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచేందుకే పేపర్ లీక్. ఇన్విజిలేటర్ల వివరాలు ముందుగానే తీసుకుని మాల్ ప్రాక్టీస్. వీరి దగ్గర చదివే విద్యార్థులను రెండు విభాగాలుగా విభజిస్తారు. ముందే ఏ విద్యార్థులు ఎక్కడ పరీక్ష రాస్తారో తెలుసుకుంటారు. హెడ్ ఆఫీస్ నుంచి వెంటనే కీ తయారు చేసి విద్యార్థులకు పంపుతారు. నారాయణతో పాటు తిరుపతి డీన్ బాల గంగాధర్‌ను అరెస్ట్ చేశాం. నిందితుల వాంగ్మూలం, టెక్నికల్ ఆధారాలతోనే నారాయణను అరెస్ట్ చేశాం. అరెస్ట్ అయిన వారంతా 2008 నుంచి నారాయణ విద్యాసంస్థల్లో పని చేసిన వారే. గత నెల 27న వాట్సాప్‌లో లీకయినట్లు ఫిర్యాదు వచ్చింది. గతంలో కూడా ఈ తరహా అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. నారాయణను కోర్టులో హాజరుపరుస్తాం’ అని ఎస్పీ రిశాంత్ తెలిపారు. చదవండి👉పారిపోయే యత్నం చేసిన మాజీ మంత్రి నారాయణ! -
మాజీ మంత్రులపై ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు
సాక్షి, అమరావతి: ఏపీ రాజధాని భూముల కొనుగోళ్లలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రులు పొంగూరు నారాయణ, పత్తిపాటి పుల్లారావు సహా స్థానిక టీడీపీ నేత, వెంకటాయపాలెం మాజీ సర్పంచ్ బెల్లంకొండ నరసింహాపై కేసులు నమోదు చేసినట్లు సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. ఈ సందర్బంగా ఆమె గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. వెంకటాయపాలెంకు చెందిన పోతురాజు బుజ్జి అనే దళిత మహిళను మభ్యపెట్టి తన 99సెంట్ల భూమిని కొనుగోలు చేశారని సదరు మహిళా ఫిర్యాదు చేయడంతో వారిపై సెక్షన్ 420, 506,120(బి) కేసులను నమోదు చేసి విచారణ చేపట్టామని పేర్కొన్నారు. (చదవండి: ఇన్సైడర్ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణ) విచారణలో ఆసక్తికర విషయాలు: మాజీ మంత్రులపై ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంతో 797 మంది తెల్ల రేషన్ కార్డుదారులు రూ. 3 కోట్ల చొప్పున భూములు కొనుగొలు చేసినట్లుగా సీఐడీ అధికారులు గుర్తించారు. మొత్తం రూ. 220 కోట్ల విలువైన భూములను తెల్ల రేషన్ కార్డు కలిగినవారు కొనుగొలు చేసినట్లు గుర్తిచామని మేరీ ప్రశాంతి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నాలుగు బృందాలుగా ఏర్పడి ఈ రేషన్ కార్డుదారుల వివరాలపై ఆరా తీస్తున్నామన్నారు. (చదవండి: అమరావతిని చుట్టేశారు) అమరావతిలో 129 ఎకరాల భూమిని 131 మంది, పెద్దకాకానిలో 40 ఎకరాల భూమి 43 మంది, తాడికొండలో120 ఎకరాలను 188 మంది తెల్ల రేషన్ కార్డుదారుల పేరుపై రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. కాగా తుళ్లూరులో 133 ఎకరాల భూమిని 148 మంది తెల్ల కార్డుదారులు కొనుగొలు చేయగా, మంగళగిరిలో 133 ఎకరాలను 148 మంది కొన్నారని, తాడేపల్లిలో 24 ఎకరాల భూమిని, 49 మంది కొనుగొనులు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. కాగా ఈ కేసులో విచారణను మరింత వేగవంతం చేశామని ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. (చదవండి: తెల్లబోయే దోపిడీ) -
‘నారాయణ’ దోపిడీ రూ.104 కోట్లు!
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో గత మూడేళ్లలో మున్సిపల్ స్కూళ్లలో అప్పటి మంత్రి పి.నారాయణ చేపట్టిన ప్రయోగాల పుణ్యమా అని రూ.104 కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగమైంది. మున్సిపల్ పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన కెరీర్ ఫౌండేషన్ కోర్సులు, అకడమిక్ ఫౌండేషన్ కోర్సులు, స్పార్క్ బ్యాచులు, స్టార్ బ్యాచులతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు లాభపడ్డారు తప్ప విద్యార్థులకు ఒరిగిందేమీ లేదని నిపుణులు పేర్కొంటున్నారు. నారాయణ విద్యాసంస్థల్లో రకరకాల పేర్లతో బ్యాచులు ఉంటాయి. అలాంటి విధానాన్నే మున్సిపల్ స్కూళ్లలోనూ ప్రవేశపెట్టారు. ఇందుకోసం నారాయణ విద్యాసంస్థల సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి, భారీగా గౌరవ వేతనాలు చెల్లించారు. ఈ కోర్సులు బోధించేందుకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, గైడ్లు, ఇతర మెటీరియల్ అంతా నారాయణ విద్యాసంస్థలకు చెందినదే. ఆయా పుస్తకాల కోసం రూ.కోట్లు ఖర్చు చేశారు. అంతేకాకుండా అర్బన్ లోకల్‌బాడీ కో–ఆర్డినేటర్లు, కన్సల్టెంట్లు, ఏఎఫ్సీ టీచర్లు, సీఎఫ్‌సీ టీచర్లు, ఔట్సోర్సింగ్ సిబ్బంది.. ఇలా వేలాది మందిని నియమించారు. వారికి రూ.వేలల్లో జీతాలు చెల్లించారు. దోచుకున్న వాళ్లకు దోచుకున్నంత ఫౌండేషన్ కోర్సుల కోసం నారాయణ విద్యాసంస్థలకు చెందిన పాఠ్యపుస్తకాలనే వినియోగించారు. నేరుగా నారాయణ విద్యాసంస్థల మెటీరియల్‌గా చూపించకుండా వాటి అట్టలను మార్చేసి, వాటిని వేరే సంస్థల నుంచి కొనుగోలు చేసినట్లు చూపించారు. ఇందుకోసం ఏకంగా రూ.8.50 కోట్లు వెచ్చించారు. మున్సిపల్ స్కూళ్లలో ‘నో బ్యాగ్ డే’ను అమలు చేయాలని మున్సిపల్ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. నో బ్యాగ్ డే సందర్భంగా వివిధ కార్యక్రమాల నిర్వహణకు మున్సిపల్ శాఖ నుంచి రూ.85.15 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులు స్కూళ్లకు చేరలేదని, టీడీపీ ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి వెళ్లిపోయాయని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థుల సమాధాన పత్రాలను(ఓఎమ్మార్) స్కాన్ చేయడానికి స్కానింగ్ యంత్రాలు, నెట్ చార్జీలు, కంప్యూటర్ ఆపరేటర్ల కోసం ప్రతిఏటా రూ.54.51 లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు. ఈ నిధులన్నీ పక్కదారి పట్టాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరే... మున్సిపల్ స్కూళ్లలో చేపట్టిన ప్రయోగాత్మక బోధనకు భారీ ఎత్తున నిధులు చెల్లించేశారు. ప్రైమరీ యూఎల్బీ కో–ఆర్డినేటర్ల పేరిట ఏడాదికి రూ.38.25 లక్షల చొప్పున మూడేళ్ల పాటు డ్రా చేశారు. ప్రైమరీ కన్సల్టెంట్ల హానరోరియం కింద ఏడాదికి రూ.23.76 లక్షల చొప్పున చెల్లించారు. హైస్కూల్ యూఎల్బీ కో–ఆర్డినేటర్ల పేరిట ఏడాదికి రూ.4.64 కోట్లు, ఎఎఫ్సీ ఏవో టీచర్ల హానరోరియం కింద రూ.1.26 కోట్లు, సీఎఫ్‌సీ టీచర్ల హానరోరియం కింద రూ.10.90 లక్షలు, స్పార్క్ క్లాసుల కోసం రూ.5.83 కోట్ల నిధులు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపిస్తున్నారు. ఏడాదికి రూ.34.85 కోట్లు చొప్పున మూడేళ్లలో రూ.104.55 కోట్ల మేర నిధులు వెచ్చించారు. ఈ నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఎస్సీఈఆర్టీ నిబంధనలు బేఖాతర్ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ పరిధిలో మున్సిపాల్టీల్లో 2,110 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 300 ఉన్నత పాఠశాలలు, 160 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ‘నారాయణ’ తరహా బోధనను ప్రయోగాత్మకంగా చేపట్టారు. వాస్తవానికి మున్సిపల్ స్కూళ్లలో నిర్వహణ బాధ్యతల వరకే మున్సిపల్ శాఖకు అధికారం ఉంటుంది. అకడమిక్ వ్యవహారాలన్నీ విద్యాశాఖ పరిధిలోనే కొనసాగాలి. కానీ, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మున్సిపల్ స్కూళ్ల విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు. విద్యా శాఖతో సంబంధం లేకుండానే అకడమిక్ వ్యవహారాలను మున్సిపల్ శాఖ చేపట్టింది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ) నిబంధనలతో సంబంధం లేకుండానే మున్సిపల్ స్కూళ్లలో నారాయణ తరహా సిలబస్, బోధనను అమల్లోకి తీసుకొచ్చారు. -
టీడీపీ నేతల సిబ్బందే ఎన్నికల అధికారులు!
సాక్షి, గుంటూరు/సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీ నాయకులను ఓటమి భయం వెంటాడుతోంది. అందుకే పోల్ మేనేజ్మెంట్కు దిగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో పోలింగ్ సిబ్బంది కొరత ఉండటంతో అధికారులు ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు, లెక్చరర్లను నియమించుకుంటున్నారు. వారికి ఎన్నికల విధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థులు, ఆ పార్టీ నేతలు, సానుభూతిపరులు నడుపుతున్న విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారినే ఎన్నికల విధులకు నియమిస్తున్నట్లు తెలుస్తోంది. పోల్ మేనేజ్మెంట్లో భాగంగానే టీడీపీ నేతలు ఇదంతా చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేనా?..: గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొమ్మాలపాటి శ్రీధర్‌కు చెందిన అభినందన ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న విజయ విద్యా విహార్ పాఠశాల నుంచి ఏడుగురు ఉపాధ్యాయులను, అదే మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడి పాఠశాల నుంచి 12 మందిని, తాళ్లూరులో టీడీపీ నేత కొల్లి చంద్రశేఖర్‌రెడ్డికి చెందిన శ్రీవివేకానంద విద్యానికేతన్ నుంచి 20 మంది ఉపాధ్యాయులు, క్రోసూరు టీడీపీ నేత రవి గోవర్దన్‌రెడ్డికి చెందిన పద్మావతి పబ్లిక్ స్కూల్ నుంచి 11 మందిని ఎన్నికల విధుల కోసం నియమించుకోవడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. నరసరావుపేట పట్టణంలోని నారాయణ విద్యా సంస్థలు, టీడీపీ నేత కొల్లి బ్రహ్మయ్యకు చెందిన కృష్ణచైతన్య పాఠశాల నుంచి, టీడీపీ నాయకుడు మైనేడి శ్రీనివాసరావుకు చెందిన హిందూ స్కూల్, భావన, వాసవి కళాశాలల నుంచి సైతం ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు తీసుకున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలంలో గొట్టిముక్కల వెంకటేశ్వర్లుకు చెందిన ఇండియన్ జెమ్స్ స్కూల్ నుంచి 20 మంది ఉపాధ్యాయులను, పెదనందిపాడు టీడీపీ జెడ్పీటీసీ నగరాజకుమారి కోశాధికారిగా వ్యవహరిస్తున్న ఎల్‌ఎంహెచ్ స్కూల్ నుంచి 20 మంది ఉపాధ్యాయులను ఎన్నికల విధుల కోసం నియమించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు జిల్లాలో ఎన్నికల విధుల కోసం తీసుకున్న టీచర్లలో 70 శాతం మంది టీడీపీ నేతలు నడుపుతున్న పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న వారే కావడం గమనార్హం. ప్రభుత్వ స్కూళ్ల టీచర్లకు మొండిచేయి విజయనగరం జిల్లాలో టీడీపీ నేతలు, మంత్రి పి.నారాయణకు చెందిన నారాయణ విద్యాసంస్థలు, టీడీపీ ఎంపీ అభ్యర్థి పూసపాటి ఆశోక్‌గజపతిరాజు ఛైర్మన్‌గా ఉన్న మాన్సాస్ సంస్థకు చెందిన ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కాలేజీ అధ్యాపకులకు ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్(పీఓ), ఏపీఓ విధులు కేటాయించారు. వాస్తవానికి ముందుగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు పీఓ, ఏపీఓ ట్రైనింగ్ ఇచ్చారు. కానీ, రెండోసారి ట్రైనింగ్‌కు పిలవలేదు. వారికి పీఓ, ఏపీఓ డ్యూటీలు వేయలేదు. ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను సైతం పక్కనపెట్టి, ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే వారికి ఎన్నికల విధులు కేటాయించారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి. టీడీపీ నాయకుడి కాలేజీలో కౌంటింగ్ కేంద్రాలు నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ నాయకుడు మిద్దె శాంతిరాముడుకు చెందిన ఆర్జీఎం ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నంద్యాల, ఆళ్లగడ్డ, పాణ్యం, బనగానపల్లె, నందికొట్కూరు, డోన్, శ్రీశైలం అసెంబ్లీతోపాటు నంద్యాల పార్లమెంట్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపును ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో చేపట్టనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామ్మోహన్ మంగళవారం తెలిపారు. టీడీపీ నాయకుడు శాంతిరాముడు, ఆయన కుమారుడు మిద్దెశివరాంలు ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ నాయకులకు చెందిన ప్రైవేటు కాలేజీలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
సీఎం హామీల సంగతేంటి?
ఒంగోలు టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనలకు వచ్చిన సమయంలో ఇచ్చిన హామీల్లో కొన్ని ఇంతవరకు నెరవేరలేదు. ముఖ్యంగా తాగునీటి సమస్య నుంచి గట్టెక్కేందుకు ఇచ్చిన హామీలు ఏళ్లు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదు. పరిస్థితులు ఇదేవిధంగా ఉంటే రానున్న వేసవిలో ప్రజల తాగునీటి సమస్య తీవ్రంగా ఉంటుంది. నీటి రవాణాకు సంబంధించిన బిల్లులు 70కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ బిల్లులు చెల్లించకుంటే ఈసారి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ఎవరూ ముందుకురారు. జిల్లాకు చెందిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పి.నారాయణ వద్ద ఏకరువు పెట్టారు. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు స్థానిక శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గురువారం ఒంగోలులోని సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో శాసససభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పనులు చేయకపోతే రేపు మనం ప్రజల్లోకి ఎలా వెళ్లగలుగుతాం అంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రిని ప్రశ్నించారు. ఇగో ప్రాబ్లమ్స్లో లేట్ చేస్తున్నారు: ఎమ్మెల్సీ కరణం బలరాం ప్రపంచబ్యాంకు నిధులతో నాగార్జునసాగర్ కాలువ ఆధునీకరణ పనులకు సంబంధించిన ప్రపోజల్స్ సంవత్సరం నుంచి పైకి కిందకు తిరుగుతున్నాయని శాసనమండలి సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి ఇన్‌ఛార్జి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రపంచబ్యాంకుకు సంబంధించిన పనులు తెలంగాణ రాష్ట్రంలో పూర్తయితే, ఇక్కడి సెక్రటేరియట్లో ఇగో ప్రాబ్లమ్స్‌తో లేట్ చేస్తున్నారన్నారు. ఇప్పటికే నీటి పంపిణీలో, సాగర్ కాలువ ఆధునీకరణ పనుల్లో జిల్లాకు అన్యాయం జరుగుతోందన్నారు. 150కోట్ల రూపాయలతో పనులు చేస్తామంటూ సీఎం స్వయంగా ప్రకటించినా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదన్నారు. జిల్లాలోని అద్దంకి బ్రాంచ్ కెనాల్, దర్శి బ్రాంచ్ కెనాల్, ఒంగోలు బ్రాంచ్ కెనాల్లో లైనింగ్ పనులు చేపట్టి వచ్చే వేసవిలో నీటిని విడుదల చేసేనాటికి సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. 2015లో ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు: ఎమ్మెల్యే స్వామి 2015 సంవత్సరంలో కొండపి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలుకు నోచుకోలేదని ఆ నియోజకవర్గ శాసనసభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామి ఇన్‌ఛార్జి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మూసీనదిపై ఆరు చెక్‌డ్యామ్‌లు, పాలేరు నదిపై ఐదు చెక్‌డ్యామ్‌లను రూ.25కోట్లలతో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఎలాంటి కదలిక లేదన్నారు. ఆఫీసులతోపాటు సెక్రటేరియేట్ చుట్టూ తిరిగితేనే ఫైళ్లు వస్తున్నాయన్నారు. సీఎం పేషీ నుంచి సంవత్సరం క్రితం ఫైల్ వస్తే ఇంతవరకు పనులు చేపట్టలేదని అధికారుల తీరును ఎండగట్టారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎస్కేప్ ఛానళ్ల వద్ద బలవంతంగా నీళ్లు తెచ్చుకోవలసిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అనంతపురంలో కరువుపోయి పశ్చిమ ప్రకాశంలో వచ్చిందన్నారు. పనులు చేస్తేనే జనం వెళ్లగలుగుతాం : ఎమ్మెల్యే ముత్తుముల 2013 సంవత్సరంలో వచ్చిన తుఫాన్‌తో అంబవరం, పూసలపాడు, మోక్షగుండం చెరువులు తెగిపోయాయని, ఆ చెరువులకు వెంటనే ప్రతిపాదనలు పంపి పనులు చేస్తేనే రేపు మనం ఆ గ్రామాల్లోకి వెళ్లగలుగుతామని గిద్దలూరు శాసనసభ్యుడు ముత్తుముల అశోక్‌రెడ్డి ఇన్‌ఛార్జి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆ మూడు ప్రాంతాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ఉందని, 1200 అడుగుల లోతులో బోర్లు వేసినా నీరు పడటం లేదన్నారు. జిల్లావ్యాప్తంగా తాగునీటి సమస్య ఉండటంతో ట్యాంకర్ల ద్వారా నీటిని రవాణా చేశారని, దానికి సంబంధించి 70కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయని, అవి చెల్లించకుంటే ఈసారి నీటిని రవాణా చేసేవారు కూడా ఉండరన్నారు. గత ఏడాది తన నియోజకవర్గంలో 600బోర్లు నాన్ సీఆర్ఎఫ్ కింద చేస్తే ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. వైఎస్సార్ సీపీ వాళ్లు బోర్లు వేయించుకుంటున్నారు: మాజీ ఎమ్మెల్యే కందుల మార్కాపురం నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు బోర్లు వేయించుకుంటున్నారని, మనం వేసే పరిస్థితులు ఉండటంలేదని ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వాపోయారు. ఎంపీ గ్రాంట్ ఇస్తుండటంతో వాళ్లు బోర్లు వేయించుకుంటున్నారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు గ్రామాల్లో నీళ్లు తోలుకుంటున్నారన్నారు. కరువు కారణంగా మిర్చి పంట ఎండిపోతే, పక్క మండలాల్లో నష్టపరిహారం చెల్లించి తమ మండలాలకు చెల్లించలేదన్నారు. తర్లుపాడు, కొనకనమిట్ల మండలాలకు చెందిన రైతులు ఫసల్ బీమా కింద డబ్బులు కట్టినప్పటికీ వారికి బీమా వర్తించలేదన్నారు. ‘నోరున్నోడికే పనులు జరుగుతున్నాయని, నాలాంటి వాడికి కావడంలేదని’ నారాయణరెడ్డి వ్యాఖ్యానించడంతో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పెద్దగా నవ్వారు. వాళ్లు ఐదేళ్లు ఎమ్మెల్యేలు, మేము మూడేళ్లే.. : పాలపర్తి డేవిడ్‌రాజు నీరు–చెట్టు కింద వాళ్లు బాగా పనులు చేసుకుంటున్నారని, వాళ్లు ఐదేళ్లు ఎమ్మెల్యేలు, మేము మూడు సంవత్సరాల ఎమ్మెల్యేమని యర్రగొండపాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజు వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా సభలో నవ్వులు వెలిశాయి. మీరు ముందే రావచ్చు కదా అంటూ అధికారపార్టీ శాసనసభ్యులు వ్యాఖ్యానించారు. రేపటి నుండి తాము దళిత వాడల్లోకి వెళుతున్నామని, అక్కడి తాగునీటి సమస్యను అడుగుతారని, ప్రజలకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడకుండా బోర్లు మంజూరు చేయాలని ఇన్‌ఛార్జి మంత్రిని కోరారు. అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలో 13వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయని, రైతులు డీడీలు కట్టినప్పటికీ ఇవ్వలేదన్నారు. ముంపు గ్రామాల కాలనీలకు ఇళ్లు నిర్మాణ వ్యయాన్ని పెంచాలని ఇన్‌ఛార్జి మంత్రిని కోరారు. మాది ఏకాకి జీవితం: ఎమ్మెల్సీ మాగుంట జిల్లాలోని శాసనసభ్యులకు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. శాసనమండలి సభ్యులమైన తమది ఏకాకి జీవితమని ఎమ్మెల్యే మాగుంట శ్రీనివాసులరెడ్డి వ్యాఖ్యానించడంతో çసమావేశం ఒక్కసారిగా నవ్వులతో నిండిపోయింది. తమకు నియోజకవర్గాలు లేకపోయినప్పటికీ శాసనసభ్యుల సమస్యలను మా సమస్యలుగా భావించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నారాయణ పలువురు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు లేవనెత్తిన సమస్యలపై వెంటనే సంబంధిత ఉన్నతాధికారులతో సెల్ఫోన్లో మాట్లాడి నిర్ణీత గడువులోగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి శిద్దా రాఘవరావు, శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, పోతుల రామారావు, దామచర్ల జనార్ధన్‌రావు, శాసనమండలి సభ్యులు పోతుల సునీత, జాయింట్ కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్–2 మార్కండేయులు, సీపీఓ కేటీ వెంకయ్య, మాజీ శాసనసభ్యులు పాల్గొన్నారు. -
'కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం'
డక్కిలి: ఆంధ్రప్రదేశ్‌ను కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ అన్నారు. సోమవారం నెల్లూరు జిల్లా డక్కిలి మండలం తీర్థంపాడు, ఆమడూరు గ్రామాల్లో జరిగిన 'మీ ఇంటికి మీ భూమి' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతేడాది జిల్లాలో 8.5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించామని, ఈ ఏడాది అదనంగా మరో లక్ష ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పారు. ఎఫ్ఎస్, తెలుగు గంగ కెనాళ్లను అభివృద్ధి చేస్తామన్నారు. -
ఆదరించిన వారిపైనే తొలివేటు
సాక్షి, విజయవాడ బ్యూరో : ఆదరించిన వారిపైనే తొలి వేటు పడింది. అధికార పార్టీకి అండగా నిలిచినందుకు ఆ గ్రామాలను వదిలిపోవాల్సిన పరిస్థితి దాపురించనుంది. సీడ్ కేపిటల్ (తొలి దశ) కీలక నిర్మాణాలకు తమ గ్రామాలను ఎంపిక చేశారని తెలుసుకున్న వారంతా కలవరపడాల్సి వచ్చింది. ఉన్నపళంగా ఊరు, ఇళ్లు, గొడ్డూగోదా వదిలి పొమ్మంటే ఎలా అనే ఆందోళన వారి మదిని తొలిచేస్తోంది. ఇది రాజధాని ప్రాంతంలోని నేలపాడు, ఐనవోలు, శాఖమూరు, వెలగపూడి గ్రామస్తుల దయనీయ స్థితి. వ్యూహాత్మకంగా ప్రభుత్వం అడుగులు.. అబద్దాల పునాదులపై రాజధాని వ్యవహారాన్ని నెట్టుకొస్తున్న టీడీపీ సర్కారు వ్యూహాత్మకంగానే ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను నేలపాడు నుంచి మొదలెట్టింది. సొంత సామాజికవర్గం, టీడీపీకి అనుకూలవర్గం అధికంగా ఉన్న ఈ గ్రామాల నుంచే ల్యాండ్ పూలింగ్ ప్రారంభిస్తే ప్రజా వ్యతిరేకత లేకుండా తమ పని సజావుగా సాగుతుందన్నది ప్రభుత్వ ఎత్తుగడ. అనుకున్నట్టే ఆ నాలుగు గ్రామాల్లో భూ సమీకరణ పూర్తి చేసిన ప్రభుత్వం సీడ్ కేపిటల్‌కు వాటినే ఎంపిక చేయడం ఆయా గ్రామాల ప్రజలకు మింగుడు పడటంలేదు. ఆ నాలుగు గ్రామాలనే ముందుగా ఖాళీ చేయించి అక్కడి ప్రజలను వేరే ప్రాంతాలకు తరలిస్తామంటూ సీఆర్డీఏ వైస్ చైర్మన్, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ ప్రకటించడంతో కలకలం రేగుతోంది. తొలి దశలో పరిపాలన పరమైన కీలక నిర్మాణాలను చేపట్టి సీడ్ కేపిటల్‌గా అభివృద్ధి చేసేందుకు గ్రామాలను ఖాళీ చేయిస్తే అక్కడి ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగరేస్తారనడంలో సందేహం లేదు. ఈ నాలుగు గ్రామాల్లోను ఉన్న సుమారు 6,714 మంది ఇల్లు వదిలిపోవాలంటే ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను ఇబ్బంది పెట్టకుండా సీడ్ కేపిటల్ నిర్మించుకుంటే సరే.. లేకుంటే ప్రతిఘటనే అంటూ ప్రభుత్వానికి అక్కడి వారు అల్టిమేటం ఇస్తున్నారు. ఆ నాలుగు గ్రామాల్లో భూములు ఇలా... నాలుగు గ్రామాల్లోను రైతుల సొంత భూములు 5,601ఎకరాలు ఉండగా దాదాపు 5,450ఎకరాలను భూ సమీకరణ చేశారు. మిగిలిన గ్రామం కంఠం, అసైన్డ్భూములు, దేవాదాయ శాఖ భూములు ఎలాగు ప్రభుత్వం పరిధిలోకే వస్తాయి. ఈ నాలుగు గ్రామాల్లోను ఒక్క వెలగపూడిలోనే కొంత మేర భూమి సమీకరణ పూర్తి కాలేదు. మిగిలిన మూడు గ్రామాల్లోను పూర్తిస్థాయిలో భూ సమీకరణ చేయడం గమనార్హం. గ్రామాల వారీగా భూముల విస్తీర్ణం.. నేలపాడులో రైతు సొంత భూములు 1,222 ఎకరాలు, దేవాదాయశాఖ భూములు 30, చెరువులు 42, అసైన్డ్ భూములు 40, గ్రామ కంఠం 9.5 ఎకరాలు ఉంది. ఐనవోలులో రైతు సొంత భూములు 1,046 ఎకరాలు, దేవాదాయశాఖ భూములు 9.32, వక్ఫ్ భూములు 21.25, చెరువులు 41.85, అసైన్డ్ భూములు 10.78, గ్రామ కంఠం 23.29, రోడ్లు, డొంకలు, పిల్ల కాలువలు 45.21ఎకరాలు ఉన్నాయి. శాఖమూరులో రైతుల సొంత భూములు 1,510 ఎకరాలు, దేవాదాయశాఖ భూములు 7, చెరువులు 27, అసైన్డ్ భూములు 36, గ్రామ కంఠం 14, రోడ్లు, డొంకలు, చిన్నపాటి కాలువలు 32 ఎకరాలు ఉన్నాయి. వెలగపూడిలో రైతుల సొంత భూమి 1,823 ఎకరాలు, దేవాదాయ శాఖ భూములు 33, అసైన్డ్ భూములు 37 గ్రామ కంఠం భూములు 19, కాలువలు, డొంకలు, రోడ్లు 85 ఎకరాలు ఉన్నాయి. -
అదరం.. బెదరం..
మంగళగిరి : రాజధాని గ్రామాల్లో ఈ నెల 28వ తేదీ తరువాత ప్రభుత్వం భూ సేకరణకు దిగనుందని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ చేసిన ప్రకటనకు ఏ మాత్రం భయపడేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. వీరంతా న్యాయం కోరుతూ కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. మరో వైపు ప్రభుత్వం జరీబు భూములకు ప్యాకేజీ పెంచే ఆలోచన చేస్తోందనీ, దీనిపై ముఖ్యమంత్రి రైతులను కలవనున్నారని ఆయా గ్రామాల్లో అధికార పార్టీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని సైతం వారు తిప్పికొడుతున్నారు. రాజధాని నిర్మాణానికి తమ భూములను ఇచ్చే ప్రసక్తేలేదని చెబుతుంటే ఇక పరిహారం మాటలెందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) నేతృత్వంలో వైఎస్సార్సీపీ నేతలంతా అండగా నిలవటం, భూ సమీకరణకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మద్దతు లభించడంతో రైతులంతా తమ భూములను కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే అంగీకార పత్రాలు ఇచ్చిన రైతులు కూడా వాటిని వెనక్కు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పంటలు పండే భూములను తీసుకోకూడదని భూసేకరణ చట్టంలో ఉందనీ, మరో వైపు బహుళపంటలు పండే భూముల్ని ధ్వంసం చేస్తే ఆహార భద్రతకు ముప్పు వాటిల్లనుందనీ, ఇలాంటి పరిస్థితుల్లో భూములను లాక్కోజూడడం ఎంత వరకు న్యాయమని రైతులు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి పనుల పేరుతో ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు మంగళగిరి నియోజకవర్గంలోని నవులూరు, ఎర్రబాలెం, బేతపూడి గ్రామాల్లో భూసేకరణ జరిపిందనీ, మళ్లీ భూసేకరణ చేసే అవకాశం లేదని రైతులు చెబుతున్నారు. తమకు అండగా నిలుస్తున్న వైఎస్సార్ సీపీతో పాటు మిగిలిన అన్ని పార్టీలు, ప్రజాసంఘాల మద్దతుతో పోరాడి తమ భూములను కాపాడుకుంటాం కానీ, ఎట్టి పరిస్థితుల్లో భూములను ఇవ్వబోమని రైతులు ప్రతిజ్ఞలు చేస్తూ పోరాటాలకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా రైతుల ఆవేదన వారి మాటల్లోనే... -
మంత్రి వైఖరిపై మేయర్ అసంతృప్తి
సాక్షి, ప్రతినిధి, నెల్లూరు: జిల్లా మంత్రి పి.నారాయణ వైఖరిపై నెల్లూరు నగర మేయర్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. నగరంలో మంత్రి ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులతోపాటు నగరానికి చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. మేయర్ మాత్రం ముఖం చాటేయడం గమనార్హం. మంత్రి నారాయణ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని మేయర్‌కు తెలియజేసినప్పటికీ ఆయన గైర్హాజరయ్యారు. ఆదివారం తెల్లవారుజామున మంత్రి నారాయణ నెల్లూరుకు చేరుకున్నారు. ఉదయం మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి ఇంట్లో అల్పాహార విందులో పాల్గొన్నారు. అనంతరం నవాబుపేట ఆర్ఎస్సార్ స్కూల్ ప్రాంగణంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా, నగర నేతలు హాజరయ్యారు. ఆ సమయంలో మేయర్ నగరంలో ఉన్నప్పటికీ మంత్రి కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంపై ఆ పార్టీ నేతలు చర్చించుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే మేయర్ మంత్రి కార్యక్రమాలకు గైర్హాజరయ్యారని అనుకుంటున్నారు. మేయర్ మధ్యాహ్నం వరకు నగరంలో ఉన్నప్పటికీ తాను హైదరాబాద్‌లో ఒక వివాహానికి హాజరుకావల్సి ఉండగా రాలేనని తప్పించుకున్నట్టు టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మంత్రి ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీలో చేరిన మేయర్ ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిగా మారారని నాయకులు అంటున్నారు. రాజకీయంగా తనకు జన్మనిచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరినప్పటికీ కార్పొరేషన్‌కు ఒక పైసా నిధులు కూడా ప్రభుత్వం నుంచి రాకపోవడం అజీజ్ అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది. కార్పొరేషన్ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి లేకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శల దాడిని ఎదుర్కుంటున్నానని మేయర్ తన సన్నిహితుల వద్ద వాపోతున్నారని తెలిసింది. అధికార పార్టీలో చేరితే అభివృద్ధికి దోహదపడుతుందన్న తన అభిప్రాయానికి భిన్నమైన పరిస్థితులను అజీజ్ జీర్ణించుకోలేకపోతున్నారు. మున్సిపల్ కమిషనర్ చక్రధర్‌బాబు విషయంలో మంత్రి చొరవ తీసుకున్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇవ్వడంలేదనేది మేయర్‌ను ఇబ్బందికి గురిచేస్తుంది. -
పర్యాటక రంగ అభివృద్ధికి కృషి
కావలిఅర్బన్: జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ హామీ ఇచ్చారు. తుమ్మలపెంట పర్యాటక కేంద్రాన్ని కలెక్టర్ జానకితో కలసి ఆదివారం మంత్రి సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తుమ్మలపెంట పర్యాటక కేంద్రం కావలి పరసర ప్రాంత ప్రజల సందర్శనకు వీలుగా ఉంటుందన్నారు. అతి కొద్దిమంది జీవిస్తున్న సింగపూర్ వలే ఆంధ్రప్రదేశ్‌ను కూడా ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తారన్నారు. గుజరాత్ సముద్ర తీరం తరువాత ఆంధ్రప్రదేశ్‌కే 970 కిలోమీటర్ల పొడవున్న తీర ప్రాంతం ఉందన్నారు. తుమ్మలపెంట పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో మరో మూడున్నర ఎకరాల భూమిని తీసుకోనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహకారం తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో ఈ పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. మత్య్సకారుల నీటిని వాడుకుంటున్నారు తాము నిర్మించుకున్న పైపులైన్ ద్వారా వస్తున్న తాగునీటిని ఏపీ టూరిజం అధికారులు వాడుకుంటున్నారని మత్య్సకారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వేట సమయంలో తాగునీరు సరిపోక మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సోమశిల నీటితో తుమ్మలపెంట చెరువును నింపి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని కోరారు. తన దృష్టికి తెచ్చిన సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు మేయర్ అజీజ్, టీడీపీ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు పెంచలమ్మ, ఆర్డీఓ లక్ష్మీ నరసింహం, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, తహశీల్దారు సాంబశివరావు, పర్యాటక కేంద్రం మేనేజర్ చంద్రశేఖర్, నాయకులు దేవరాల సుబ్రహ్మణ్యం, కండ్లగుంట మధుబాబు పాల్గొన్నారు. -
‘సింగపూర్’కు సమస్త సమాచారం
పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు రాష్ట్రానికి వచ్చిన సింగపూర్ ప్రతినిధులు 13 జిల్లాలకు సంబంధించిన 500 ఏళ్ల చరిత్ర అడిగారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ చెప్పారు. వాళ్లు అడిగిన సమాచారం ఇప్పటికే 95 శాతం ఇచ్చామని, మిగతా 5 శాతం ఇస్రో నుంచి తీసుకోవాల్సి ఉందని అన్నారు. గురువారం సచివాలయంలో మంత్రితో పాటు వివిధ విభాగాల ముఖ్య కార్యదర్శులు, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, టౌన్‌ప్లానింగ్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో సింగపూర్ ప్రతినిధి బృందం సుమారు ఐదు గంటల పాటు సమావేశమైంది. మాస్టర్‌ప్లాన్ రూపకల్పనపై పలు కోణాల్లో చర్చించారు. సాయంత్రం మంత్రి నారాయణ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాష్ట్ర్ర పభుత్వం ఇచ్చిన సమాచారాన్ని చూసి సింగపూర్ బృందం ఉబ్బి తబ్బిబ్బయిందన్నారు. వారికి ఎలాంటి సమాచారం కావాలన్నా కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు తక్షణం స్పందించాలని సీఎం ఆదేశించారని మంత్రి చెప్పారు. సింగపూర్ బృందంతో సమన్వయంతో వ్యవహరించడానికి ముగ్గురు అధికారులను నియమిస్తున్నాం. ఈ ముగ్గురు సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పనిచేస్తారని తెలిపారు. -
ఒప్పందంలో లోపాలులేవు: మంత్రి నారాయణ
హైదరాబాద్: ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్‌పై చేసుకున్న ఒప్పందాలలో ఎటువంటి లోపాలు లేవని పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ చెప్పారు. సింగపూర్ ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా తీసుకున్నట్లు ఆయన తెలిపారు.ఇన్‌క్యాప్, ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ సింగపూర్ మధ్య ఎంఓయు జరిగినట్లు తెలిపారు. ఎంఓయులో పేర్కొన్న సంస్థలన్నీ సింగపూర్ ప్రభుత్వానికి చెందినవేనని చెప్పారు. సింగపూర్ బృందం ఏరియల్ సర్వే ముగిసిందని మంత్రి తెలిపారు. భవిష్యత్‌లో ఈ బృందం గ్రామాలవారీగా పర్యటిస్తుందని చెప్పారు. రేపు సాయంత్రానికి మాస్టర్ ప్లాన్‌పై యాక్షన్ ప్లాన్‌ను సింగపూర్ ప్రభుత్వం అందజేస్తుందని నారాయణ చెప్పారు. ** -
విమానాశ్రయంలో సింగపూర్ బృందం పడిగాపులు!
హైదరాబాద్: ఏపీ రాజధాని నిర్మించతలపెట్టిన ప్రాంతంలో సింగపూర్ బృందం ఏరియల్ సర్వే కార్యక్రమం తాత్కాలికంగా రద్దయింది. వారు వెళ్లవలసిన విమానం ఆలస్యంగా రావడం వల్లే ఏరియల్ వ్యూ కార్యక్రమం రద్దు చేశారు. ఏపీ మంత్రి పి.నారాయణ, సింగపూర్ నగర ప్రణాళిక విభాగం అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో దాదాపు గంటన్నరసేపు పడిగాపులు కాశారు. వారు వెళ్లవలసిన ఎయిర్ ఇండియా విమానం చాలా ఆలస్యంగా వచ్చింది. అయితే అప్పటికి వాతావరణం ఏరియల్ వ్యూకు అనుకూలంగా లేకపోవడంతో వారి పర్యటనను రద్దు చేశారు. రేపు ఉదయం 9 గంటలకు సింగపూర్ అధికారుల బృందం గుంటూరు జిల్లా అమరావతి, తుళ్లూరు,మంగళగిరి ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహిస్తుంది. ** -
'విశాఖలో మొక్కలు నాటే కార్యక్రమం'
విశాఖపట్నం: ఉద్యాన, అటవీ శాఖ అధికారులతో సంప్రదించి విశాఖ నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. నగరంలో ఎక్కడపడితే అక్కడ మొక్కలు నాటోద్దని స్థానిక ప్రజలకు ఆయన సూచించారు. ఒక పద్దతి ప్రకారం శాస్త్రీయంగా మొక్కలు నాటాల్సిన అవశ్యకతను నారాయణ ఈ సందర్భంగా వివరించారు. నగరంలోని ప్రతి డివిజన్‌కు ఓ ఉన్నతాధికారిని, అతనికి సహాయంగా బిల్ కలెక్టర్‌ను నియమిస్తామని చెప్పారు. నగరంలోని ప్రతి డివిజన్‌కు ఏఏ అధికారిని నియమిస్తామో జాబితాను సిద్ధం చేస్తున్నామని... ఈ నెల 30 నాటికి ఆ జాబితా విడుదల చేస్తామని నారాయణ వెల్లడించారు. -
వందలకొద్ది ఫిర్యాదులు వస్తున్నాయి
తిరుపతి : తిరుపతిలో పారిశుధ్యంపై మంత్రి నారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం ఆయన పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ తిరుపతిలో పారిశుధ్యంపై వందలకొద్ది ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. దీనిపై అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించుకోవాలని, మరోసారి ఫిర్యాదులు వస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో పట్టణాల ఆధునీకరణకు ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని నారాయణ తెలిపారు. పట్టణ ప్రజల మౌలిక వసతులు మెరుగు పరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. పట్టణాల్లో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని నారాయణ స్పష్టం చేశారు. -
4.16 లక్షల ఎకరాలకు సాగునీరు
నెల్లూరు(పొగతోట): జిల్లాలో మొదటి పంటకు 4,16,640 ఎకరాలకు సాగునీరు విడుదల చేయనున్నారు. అక్టోబర్ 25 నుంచి 43.376 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు ఐఏబీలో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. స్థానిక గోల్డెన్జూబ్లీహాల్లో మంగళవారం రాష్ట్రపురపాలక శాఖ మంత్రి పి.నారాయణ అధ్యక్షతన సాగునీటి సలహా మండలి సమావేశం (ఐఏబీ)లో నిర్ణయం తీసుకున్నారు. సమావేశం వాడీవేడిగా సాగింది. పనుల జాప్యంపై ఇరిగేషన్ అధికారులను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు నిలదీశారు. సోమశిల ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 37.803 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జిల్లాలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు కురుస్తాయి. వర్షాల ఆధారంగా డిసెంబర్ నాటికి సోమశిల ప్రాజెక్టులో 63.322 టీఎంసీల నీరు లభ్యమవుతుందని అధికారులు అంచనా వేశారు. డెడ్ స్టోరేజ్, తాగునీరు, నీటి అవిరి, కండలేరు రిజర్వాయర్‌కు నీరు విడుదల తదితర అవసరాలకు పోనూ సోమశిల ప్రాజెక్టులో నుంచి 43.376 టీఎంసీల సాగునీటిని విడుదల చేయనున్నారు. పెన్నార్ డెల్టా 2.47 లక్షల ఎకరాలు, కనుపూరు కాలువ 33 వేలు, కావలి కాలువ 72,489, జీకేఎన్ (ఎన్ఎఫ్సీ) కాలువ 34,257, సౌత్ఫీడర్కు 29,894 ఎకరాలకు సాగునీరు విడుదల చేయనున్నారు. 2013-14 సీజన్‌కు ఎన్ని ఎకరాలకు నీరు విడుదల చేశారో ఈ ఏడాది కుడా అలాగే విడుదల చేయనున్నారు. కాలువలో సిల్ట్ పేరుకుపోవడం, చివరి భూములకు నీరు చేరకపోవడం వల్ల వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు కోట్ల రూపాయలు నష్టపోతున్నారని అధికారులపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ధనం దుర్వినియోగం అవుతోందని మంత్రి దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు. నగరంలో పంట కాలువలు ఆక్రమించి అపార్టుమెంట్లు నిర్మించారని, ఫ్లాట్లు వేసి విక్రయిస్తుండటంపై అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించు కోవడం లేదని నెల్లూరు నగర, రూరల్ ఎమ్యెల్యేలు పి.అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి స్పందిస్తూ ఈ నెలాఖరులో ఎమ్మెల్యేలు, అధికారులందరినీ కలుపుకుని నగరంలో పంట కాలువలు పరిశీలించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కృష్ణపట్నం పోర్టుకు ఒక టీఎంసీ నీరు ఏ విధంగా విడుదల చేస్తారని ప్రశ్నించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి 4,16,640 ఎకరాలకు సాగునీరు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాలువలో సిల్ట్, గుర్రపునాడ తొలగించేందుకు రెండు రోజుల్లో అనుమతులు మంజూరు చేయిస్తామన్నారు. అక్టోబర్ 25 లోపు పనులు పూర్తి చేసి నీరు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోతిరెడ్డిపాడు పనుల విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఎన్.శ్రీకాంత్,జేసీ రేఖారాణి, ఇరిగేషన్ ఎస్ఈ కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఏపి కొత్త రాజధాని విశేషాలు!
హైదరాబాద్: సకల సౌకర్యాలతో ఏపి రాజధాని నిర్మిస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ చెప్పారు. ఏపి సచివాలయంలో ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొత్త రాజధానికి సంబంధించిన పలు విషయాలను చెప్పారు. భూసేకరణలో రైతులు కూడా లాభపడేవిధంగా నిబంధనలు రూపొందిస్తామన్నారు. అన్ని సౌకర్యాలతోపాటు జీవనానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించేవిధంగా రాజధాని నిర్మిస్తామని చెప్పారు. విజయవాడ పరిసరాలలో రాజధాని నిర్మిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. రాజధాని నిర్మాణం కోసం దేశంలోని పలు కొత్త రాజధానులను పరిశీలించినట్లు తెలిపారు. గాంధీనగర్, ఛండీగర్, నయారాయపూర్ నగరాలలో పర్యటించి, వాటి నిర్మాణం, అక్కడ భూసేకరణ తదితర విషయాలను అధ్యయనం చేసినట్లు వివరించారు. గాంధీనగర్‌లో 5వేల 700 హెక్టార్లలో నిర్మించినట్లు తెలిపారు. గుజరాత్లో మళ్లీ రెండువేల ఎకరాలలో నిర్మాణాలు చేపడుతున్నట్లు చెప్పారు. అన్నిచోట్ల రైతులను నుంచి భూమిని సేకరించినట్లు తెలిపారు. సేకరించిన భూమిలో ఒక్కో చోట ఒక్కో విధానాన్ని అనుసరించినట్లు తెలిపారు. ఒక చోట 50 శాతం భూమి రోడ్లకు, 5 శాతం ఓపెన్ ప్లేసెస్, పది శాతం అల్పాదాయ వర్గాల కోసం కేటాయించినట్లు వివరించారు. కొన్ని చోట్ల సేకరించిన భూమిలో డెవలప్ చేసిన తరువాత 50 శాతం రైతులకు ఇచ్చినట్లు తెలిపారు. ఛండీఘర్‌లో 25 శాతం రోడ్లకు వదిలారని చెప్పారు. నయారాయ్‌పూర్‌లో భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. భూసేకరణ, డెవలప్మెంట్కు సంబంధించి సమయం నిర్ణయించడం కూడా చాలా ముఖ్యం అని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఈ రోజు ఉన్న భూమి ధరను ఫిక్స్ చేస్తారని, మూడు సంవత్సరాలు తరువాత డెవలప్ చేసిన భూమి మార్కెట్ విలువను లెక్కిస్తారని వివరించారు. భూమి ఇచ్చిన రైతుకు నష్టం జరుగకుండా, రైతు కూడా లాభపడే విధంగా విధివిధనాలు రూపొందించవలసి ఉంటుందని తెలిపారు. సేకరించిన భూమిని జోన్లుగా విభజించవలసి ఉంటుందని తెలిపారు. విద్య, వైద్యం, వ్యాపారం, నివాసం...వివిధ విభాగాలుగా విభజించాలన్నారు. కొత్తగా నిర్మించే రాజధానిలో జీవనానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించవలసి ఉంటుందని తెలిపారు. కొత్తగా ఇతర చోట్ల రాజధానులలో జరిగిన తప్పులు ఇక్కడ జరుగకుండా చూస్తామని చెప్పారు. నయారాయపూర్‌లో జీవనానికి తగిన వసతులు లేకపోవడంతో సాయంత్ర అయ్యేసరికి అక్కడ ఎవరూ ఉండటంలేదని తెలిపారు. అలా నిర్మించి ప్రయోజనం లేదన్నారు. అందువల్ల అన్ని చోట్ల అధ్యయనం చేసి అటువంటి తప్పులు జరుగకుండా చూస్తామన్నారు. ఇంకా మరి కొన్ని చోట్ల కూడా అధ్యయనం చేయమని చెప్పారు. ** -
తాత్కాలికం అంటే శాశ్వతమని కాదు: కేఈ
విజయవాడపై నారాయణది తొందరపాటు ప్రకటన దాంతో ఆ ప్రాంతంలో ధరలు విపరీతంగా పెరిగాయి కానీ, మేం ప్రభుత్వ ధరల ప్రకారమే భూములు సేకరిస్తాం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజయవాడ తాత్కాలిక రాజధాని అంటే అర్థం అదే శాశ్వత రాజధాని అని కాదని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి స్పష్టంచేశారు. రాజధాని నగరం అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో ఉండే విధంగా మధ్యలో ఉండాలన్నారు. విజయవాడ, గుంటూరు మధ్యే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉంటుందని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదన్నారు. ఆయన తొందరపాటు ప్రకటనవల్ల ఆ ప్రాంతంలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయని అసంతృప్తి వ్యక్తంచేశారు. కర్నూలు లేదా రాయలసీమ ప్రాంతంలో రాజ దాని ఉండాలని కోరే వారి సంఖ్య తక్కువగా ఉందని, వారికి నాయకత్వం వహించే వారు కూడా లేరని చెప్పారు. ఆయన మంగళవారం అసెంబ్లీ లాబీల్లోని తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. విజయవాడ ఏపీ రాజధాని అని మంత్రి నారాయణ చెప్పింది అధికారికం కాదు. తాత్కాలిక రాజధాని ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసిన తరువాత స్థానికంగా భూములు ధరలు పెరిగితే మరోచోటికి మారుస్తాం. విజయవాడ ఇరుకు నగరం. అక్కడ ప్రస్తుతం ఎకరా భూమి ధర పది నుంచి పదిహేను కోట్లు ఉంది. రాజధాని ఏర్పడుతుందనే కారణంతో ధరలు పెరి గాయి. ఇప్పుడు అక్కడ రాజధాని ఏర్పాటు కాదని నేను ప్రకటిస్తే రిజిస్ట్రేషన్లు తగ్గిపోతాయి. విజయవాడలో నేను ఇల్లు అద్దెకు తీసుకున్నానన్న వార్తలు అవాస్తవం. విజయవాడ, గుంటూరు మధ్య ప్రభుత్వ భూమి కేవలం 500 ఎకరాలు మాత్రమే ఉంది. ఆ ప్రాంతంలో భూమి మార్కెట్ ధర ఎక్కువగా ఉంది. అయితే రాజధాని ఏర్పాటుకు అవసరమైన భూమిని ప్రభుత్వ ధర ప్రకారమే సేకరిస్తాం. ప్రస్తుతం ఎక్కువ ధరకు భూమిని ఇపుడు కొనుగోలు చేసిన వారు అపుడు ఇబ్బందులు పడతారు. మంత్రి నారాయణకు బాబు మందలింపు ఆంధ్రప్రదేశ్ పురపాలక మంత్రి పి.నారాయణపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా మంత్రి పదేపదే విజయవాడ, గుంటూరు మధ్యే రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ప్రజల్లో కోరికలు ఎక్కువగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతున్నారని, ఈ తరుణంలో ఒక ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించటం సరికాదని బాబు నారాయణకు సూచించారు. పార్టీలోని సీనియర్లందరినీ కలుపుకుని పోవాలని చెప్పారు. శివరామకృష్ణన్ నివేదిక తర్వాతే రాజధానిపై నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక అందిన తర్వాతే కొత్త రాజధాని ఎంపికపై నిర్ణయం తీసుకుంటామని శాసన మండలిలో ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ చెప్పారు. కమిటీ నివేదిక అందిన తర్వాత సభ్యులందరితో మాట్లాడి వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకున్న తర్వాతే రాజధాని ఎంపికపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. -
27న శివరామకృష్ణన్ నివేదిక: నారాయణ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం ఎంపికకు సంబంధించి కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఈ నెల 27వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించే అవకాశముందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించేందుకు దేశంలోని కొత్తగా నిర్మితమైన రాజధానులను ఈ నెలాఖరులో సందర్శించాలని నిర్ణయించామని సోమవారం చెప్పారు. వచ్చే నెలలో టీటీడీ కమిటీ: మంత్రి మాణిక్యాలరావు వచ్చే నెల రెండో వారంలోగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటుచేయనున్నామని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలి పారు. టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటుచేసే యోచనే లేదని స్పష్టంచేశారు. టీటీడీ ట్రస్టు బోర్డులో ఇలా 17 మందితో పాటు ఎక్స్అఫీషియో సభ్యునిగా మరో సభ్యున్ని నియమిస్తామని వివరించారు. -
'రాజధాని కోసం రాజధానుల అధ్యయనం'
-
'రాజధాని కోసం రాజధానుల అధ్యయనం'
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ప్రపంచంలోని ఆరు దేశాల రాజధానులతోపాటు దేశంలోని నాలుగు రాష్ట్రాల రాజధానులను అధ్యయనం చేయాలని నిర్ణయించినట్లు రాజధాని సలహా కమిటీ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం అందుకోసం ఏర్పాటు చేసిన సలహా కమిటీ భేటీ అయింది. అనంతరం ఆ భేటీ వివరాలను నారాయణ వివరించారు. బ్రెజిల్, ఇస్లామాబాద్, పుత్రజయ, ఆస్టిన్,దుబాయి, సింగపూర్లలో కమిటీ పర్యటిస్తుందని చెప్పారు. అలాగే దేశంలోని చంఢీగడ్, గాంధీనగర్, నయా రాయ్‌పూర్, నవీ ముంబయి ప్రాంతంలో కూడా కమిటీ పర్యటిస్తుందని తెలిపారు. తమ కమిటీకి అదనంగా టెక్నికల్ కమిటీ, ఇతర సబ్‌కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు నారాయణ చెప్పారు. రాష్ట్రంలోని 9 జిల్లాలలో 11 జాతీయ విద్యాసంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు నారాయణ వెల్లడించారు. -
అదృష్టమంటే ఆయనదేనండి ...
అదేమి విచిత్రమో ... ఒక్క బహిరంగ సభలో ప్రసంగించలేదు... ఎన్నికల ప్రచారంలో ఒక్కసారి కూడా పాల్గొనలేదు... అంతేందుకు ఒక్క ఓటరును కూడా తనకు ఓటు వేయండి అని అడగలేదు. అయితే నక్క తోక తొక్కినట్లు ఆయన్ని మంత్రి పదవి వరించింది. దాంతో ఆయన అదృష్టం వీల్ డిటర్జంట్ పౌడర్ యాడ్‌లో కనిపించే 'వీల్'లా గిరగిర తిరుగుతుంది. ఇంతకు ఎవరా అదృష్టవంతుడు అనుకుంటున్నారా ? ఆయనేనండి ప్రముఖ విద్యావేత్త, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ గారు. ఆయన ఏ సభలో సభ్యుడు కాడు అన్న విషయం తెలిసిందే. ఆయన త్వరలో రాష్ట్ర శాసనమండలికి ఎన్నిక కానున్నారు... ఆ విషయం కూడా తెలిసిందే. అయితే చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా నారాయణ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి (జూన్ 8వ తేదీ) మాంచీ ఊపు, ఉత్సాహంతో పని చేసుకుపోతున్నారు. ఎలా అంటే ఆయన తన సహచర మంత్రుల కంటే రేస్‌లో దూసుకు పోతున్నారు. అది ఆయన శాఖలో అనుకుంటే పప్పులో తప్పకుండా కాలేసినట్లు.... ఎలా అంటారా విషయంలోకి వద్దాం... బియాస్ సంఘటన జరిగిన వెంటనే అక్కడ వాలిపోయారు. సహాయక చర్యలు చేపట్టడం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తానైనట్లు మసలుకున్నారు. అంతేందుకు రాష్ట్ర రాజధాని ఎంపిక విషయంలో శివరామకృష్ణన్ కమిటీతోపాటు ... రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ దేశ ప్రతినిధులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే నారాయణ గారి 'పనితనం' కొండవీటి చాంతాడంతా జాబితా తయారవుతుంది. అయితే నిన్న కాక మొన్న వచ్చిన నారాయణ గారు .... ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని తానైనట్లు ప్రవర్తిస్తుడం పట్ల ఆయన సహచర కేబినెట్‌కు ఒంటికి కారం పుసుకున్నట్లుగా ఉంది. దాంతో ఎంతో కాలంగా పార్టీకి సేవ చేసుకుంటూ... ప్రజల మధ్య ఉండి... ప్రజల ద్వారా ఎన్నుకోబడిన తాము... తుప్పు పట్టిన ఇనుపముక్కలా ఓ పక్కన పడి ఉన్నామని మిగతా మంత్రులు తెగ కలత చెందుతున్నారు. ఎంతైనా ఆయన టైము బాగుంది అంటూ నారాయణకు పట్టిన అదృష్టాన్ని చూసి 'వారు' తమలోతాము గుసగుసలాడుకుంటున్నారు. -
విద్యకు పెద్ద పీట
వెంకటాచలం : తమ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శనివారం విక్రమ సింహపూరి యూనివర్సిటీకి సంబంధించి రూ.12కోట్లతో నిర్మించనున్న అకడమిక్ భవనానికి శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా, సీఎం చంద్రబాబు విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారని వివరించారు. యూనివర్సిటీల అభివృద్ధికి అవసరమైన వసతులు కల్పించుకునేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని సముద్ర తీరం పారిశ్రామిక కారిడార్ కానుందన్నారు. కృష్ణపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని, అందుకు అవసరమైన రీసెర్చ్‌లు చేయాలన్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ యూనివర్సిటీకి మహాకవి తిక్కన పేరు పెట్టాలని అప్పటి ప్రభుత్వంతో పోరాడినట్లు తెలిపారు. మన ప్రాంత మహాకవిని మనం గుర్తించుకోవాల్సి ఉందన్నారు. విద్యార్థుల్లో నైతికత, విద్యా ప్రమాణాలు ఉండే బోధనను యూనివర్సిటీ అందించాలన్నారు. కలెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ వీఎస్ యూనివర్సిటీ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా రూపాంతరం చెందాలని ఆకాం క్షించారు. ప్రపంచ పరిశోధన పత్రాలను ప్రచురితమయ్యేలా చూస్తే యూనివర్సిటీకి మంచి గుర్తింపు వస్తుందన్నారు. అవసరాలు గుర్తించి ముందస్తు ప్రణాళికలు చేపట్టాలి: కాకాణి యూనివర్సిటీ రూపాంతరానికి అవసరమైన ముందస్తు ప్రణాళికలు చేపట్టి అభివృద్ధి చేయాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కోరారు. యూనివర్సిటీకి జాతీయ రహదారి నుంచి రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు. ప్రభుత్వం యూనివర్సిటీకి ఇచ్చిన స్థలం చాలా వరకు ఉపయోగ పడదని, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని మరింత భూమిని సేకరించుకోవాలని సూచించారు. సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్, ఆక్వా కల్చర్‌కు అనుబంధమైన కోర్సులు పెట్టాలన్నారు. జిల్లాలో కృష్ణపట్నం పోర్టు, ఇతర అనుబంధ పరిశ్రమలు రానున్నాయని, భవిష్యత్ అవసరాలు గుర్తించి కోర్సులు, రీసెర్చ్‌లు జరగాలన్నారు. జిల్లాకు చెందిన ముప్పవరపు వెంకయ్యనాయుడు, పొంగూరు నారాయణ వంటి వివాద రహితులు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోరేవారు మంత్రులుగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో వీఎస్‌యూ ఉపకులపతి గొట్టిప్రోలు రాజారాంరెడ్డి, రిజిస్ట్రార్ కోటా నాగేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు పరసారత్నం, బీద మస్తాన్‌రావు, ఎం.శ్రీధర్‌కృష్ణారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, ఎంపీపీ తలపల అరుణ, ఎంపీటీసీ సభ్యుడు బాణాల వెంకమ్మ, సర్పంచ్ డబ్బుగుంట అమరావతి పాల్గొన్నారు. ప్రతి బిడ్డ ముత్యంలా ఎదగాలి కోవూరు: ప్రతి బిడ్డ ఒక ముత్యంలా ఎదగాలన్న తపన ప్రతి ఒక్కరిలో ఉంటుందని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కోవూరులో శనివారం ‘బడిపిలుస్తోంది’ ముగింపునకు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. మంత్రి మాట్లాడుతూ రాజకీయాలకు నెల్లూరు జిల్లా పుట్టినిల్లు అన్నారు. ఈ జిల్లా రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరన్నారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం చెప్పినట్టుగా విద్యాశాఖలో పెనుమార్పులు తీసుకురావాల్సిన అసరం ఉందన్నారు. రాష్ట్రంలో 19 శాతం డ్రాపవుట్స్ ఉండగా కేవలం నెల్లూరు జిల్లాలో 23 శాతం ఉన్నారన్నారు. డ్రాపవుట్స్‌లో నెల్లూరు జిల్లా ప్రథమస్థానంలో ఉందన్నారు. పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పుట్టగానే మేధావి కాదన్నారు. బాల్యం నుంచి పట్టుదల, క్రమశిక్షణతో ముందుకుపోతేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు క్రమశిక్షణతో చదువుకుంటే ఆ తర్వాత విద్యార్థి అనుకున్న లక్ష్యాన్ని చేరడం కష్టమేమీ కాదన్నారు. ఓ పాఠశాలను దత్తత తీసుకుని విద్యార్థులకు బోధిస్తున్నామన్నారు. గతంలో 23 మంది ఉన్న పాఠశాలలో ప్రస్తుతం 1 నుంచి 5 లోపు 150 మంది విద్యార్థులున్నారు. అదేవిధంగా కోవూరులో ఒక పాఠశాలను దత్తత తీసుకుని ఆ పాఠశాల విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ కల్పించేలా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కమిషనర్ ఉషారాణి, ఆర్జేడీ పార్వతి, అడిషనల్ జేసీ రాజ్‌కుమార్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, డీఈఓ ఉష, సర్వశిక్ష అభియాన్ పీఓ కోదండరామిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు వెంకటేశ్వర్లురెడ్డి, తహశీల్దార్ నరసింహులు, ఎంఈఓ చెంచురెడ్డి, ఎంపీడీఓ నాగరాజకుమారి, ఎంపీపీ గిద్దలూరు ఉమ, సర్పంచ్ కూట్ల ఉమ పాల్గొన్నారు. -
దొడ్డి దారిన నారాయణ..నారాయణ!
ముందొచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములే వాడిగా ఉంటాయనేది పాత సామెతే అయినప్పటికి.. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ వ్యహారాలకు అతికినట్టు సరిపోతుంది. కొద్ది రోజుల క్రితం వరకు పార్టీలో సీనియర్ నేతలమని చంకలు గుద్దుకున్న యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమకు గొంతులో వెలక్కాయ పడినంత పని చేస్తోంది కార్పోరేట్ విద్యా సంస్థల అధినేత పి.నారాయణ దూకుడు. ఎప్పుడొచ్చిందనేది కాదన్నా... అనే రీతిలో నారాయణ దూసుకుపోతున్న వైనం చూసి సీనియర్లైన ఇతర నేతలు ముక్కున వేలు వేసుకుంటే ఎవరైనా చూస్తే బాగుండదని మానుకుంటున్నారట. ఎన్నికల్లో పోటీ చేయకుండానే చంద్రబాబు మంత్రివర్గంలో తనదైన హస్తలాఘవంతో పట్టణాభివృద్ది శాఖను సొంతం చేసుకున్న నారాయణ ప్రస్తుతం పార్టీ సీనియర్ నేతలను వెనక్కి నెట్టి తన మార్కు రాజకీయాన్ని రుచి చూపిస్తున్నారట. 'ఫండర్ కమ్ ఫండ్ రైజర్' ట్యాగ్ లైన్ తో బ్యాక్ డోర్ ద్వారా పార్టీలోకి దూరిన ఆయన వ్యవహరిస్తున్న అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోందట. బియాస్ నది విషాదం, రాజధాని ఏర్పాటుపై నియమించిన కమిటికి ముఖ్యనేతగా పలు అవకాశాలను ఒంటి చేత్తో సొంతం చేసుకున్నారు. అలా ముందుకు పోతున్న నారాయణకు ఎమ్మెల్సీ చేయడానికి అధినేత నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ నేత వీరభద్ర స్వామి రాజీనామాతో ఏర్పడిన ఎమ్మెల్సీ ఖాళీకి ఆగస్టు 21 తేదిన జరిగి ఉప ఎన్నికలో విధాన పరిషత్ కు ఎన్నికవ్వడం లాంఛనప్రాయమే. ఇలా దూసుకుపోతున్న నేతను చూసి చేసేది ఏమి లేక సీనియర్ నేతలు నారాయణ..నారాయణ అని మూసుకుంటున్నారట. -
ఇకపై ఏటా ఆస్తిపన్ను పెంపు
మంత్రులు నారాయణ, గంటా విశాఖపట్నం: ఏటా భూముల ధరలు పెంచడం ద్వారా రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచుకున్నట్టే ఆస్తిపన్ను కూడా నిర్దిష్ట శాతం మేరకు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మున్సిపల్ మంత్రి పి.నారాయణ, మానవ వనరులు, విద్యాశాఖల మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. వారు సోమవారం విశాఖ నగరంలో విలేకరులతో మాట్లాడారు.రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పంచాయతీరాజ్ తదితర అన్ని సంస్థల్ని అనుసంధానిస్తూ రాష్ట్రంలో అధునాతన ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్‌వేర్‌ను ఆరు నెలల్లో అందుబాటులోకి తెస్తామని వారు వివరించారు.