Public school
-
డిసెంబరు 7న హైదరాబాద్ ఇంటర్నేషనల్ జాజ్ ఫెస్టివల్ 2024
హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్, గోథే-జెంట్రమ్ హైదరాబాద్‌తో కలిసి హైదరాబాద్ ఇంటర్నేషనల్ జాజ్ ఫెస్టివల్ 2024 ప్రదర్శన జరగనుంది. ఈ ఫెస్టివల్ హైదరాబాద్‌లోని పబ్లిక్ స్కూల్లో డిసెంబర్ 7, శనివారం సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు జరుగుతుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా, ఇండియా, యూరప్ ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాండ్లతో ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ ఫెస్టివల్‌కు ప్రవేశం ఉచితమని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ ది నేటివ్ జాజ్ క్వార్టెట్‌ను స్పాన్సర్ చేస్తోంది. వివిధ సంస్కృతులకు చెందిన బ్యాండ్ సభ్యులు, ఇతర నిపుణులు పాల్గొంటారు. ముఖ్యంగా డ్రమ్మర్ ఎడ్ లిటిల్‌ఫీల్డ్ లింగిట్ తెగకు చెందిన అలస్కాన్ నేటివ్, ఫిలిపినో-అమెరికన్ పియానిస్ట్ రీయుల్ లుబాగ్ ; జాజ్ ట్రంపెట్ కళాకారుడు నవజో సంతతికి చెందిన డెల్బర్ట్ ఆండర్సన్, వాషింగ్టన్‌లోని సియాటిల్‌కు చెందిన బాసిస్ట్ మైఖేల్ గ్లిన్ పాల్గొంటారు. ఇంకా ఈ ఉత్సవంలో జర్మనీ ,స్విట్జర్లాండ్ నుండి మాల్స్ట్రోమ్తో సహా ప్రదర్శనలు కూడా ఉంటాయి; పోర్చ్‌గీస్ ఆర్టిస్ట్ కాచా ముండిన్హో, ఇద్దరు భారతీయ సంగీతకారులతో పాటు డచ్ కళాకారుడు స్జాహిన్ డ్యూరింగ్ నేతృత్వంలోని బ్యాండ్; హైదరాబాద్‌కు చెందిన జార్జ్ హల్ కలెక్టివ్ కళాకారులు తమ ప్రదర్శన ఇవ్వనున్నారు.వరుసగా ఆరోసారి హైదరాబాద్ ఇంటర్నేషనల్ జాజ్ ఫెస్టివల్‌ను కోస్పాన్సర్ చేశామని హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ తెలిపారు. ఈ కచేరీకి U.S. ఆర్ట్స్ ఎన్వోయ్ ప్రోగ్రామ్ కూడా సపోర్ట్ చేస్తోంది. ఉత్తమ అమెరికా కళలను, సంస్కతిని ప్రపంచంతో పంచుకోవడం, క్రాస్-కల్చరల్ అవగాహన , సహకారాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. అమెరికన్ ఆర్ట్స్ నిపుణులతో ఇంటరాక్ట్ కావాలనుకునే ఔత్సాహికులకు ఇదొక గొప్ప అవకాశమని నిర్వాహకులు తెలిపారు. -
World Architecture Festival 2024: స్కూలు భవనం.. బహు బాగుంది
గది అంతటా సూర్యకాంతి ప్రసరించేలా రంపం పళ్లను ఆకారంలో రూఫ్.. ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడే ఆవరణలు.. పెద్ద బాస్కెట్‌బాల్ కోర్టు.. అందమైన కమ్యూనిటీ గార్డెన్.. ఓపెన్ ఎయిర్ టెర్రస్.. లోపలి వ్యక్తుల ప్రైవసీకి భంగం కలగకుండా చుట్టూ వంపులు తిరిగిన మెటల్ స్క్రీన్స్.. ఇంకా మరెన్నో ప్రత్యేకతలు. ఇదేదో రియల్ ఎస్టేట్ సంస్థ ప్రకటన కాదు! ఓ స్కూల్ భవన విశేషాలివి. దాంతో ఆకాశహర్మ్యాలను, మ్యూజియాలను, అందమైన విమానాశ్రయాలను కూడా తలదన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ భవనంగా ఎంపికైంది. సింగపూర్‌లో జరిగిన ప్రపంచ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ (డబ్ల్యూఏఎఫ్)లో ఈ ఘనత సాధించింది. దీని పేరు డార్లింగ్టన్ పబ్లిక్ స్కూల్. సిడ్నీలోని చిపండేల్లో ఉంది. సాంస్కృతిక పరిరక్షణ దక్షిణ సిడ్నీ ప్రాంతంలో ఉన్న ఈ స్కూలు నిజానికి ఆ్రస్టేలియా మూలవాసులతో బలమైన సంబంధాలున్న కమ్యూనిటీ పాఠశాల. 1970 నాటి పాత భవనం శిథిలావస్థకు చేరడంతో కొత్తది నిర్మించాలనుకున్నారు. ఎఫ్‌జెడ్‌సీ స్టూడియో ఆ బాధ్యతలు తీసుకుంది. మూలవాసులతో బంధాన్ని ప్రతిబింబించేలా పాఠశాల హాల్, ఎంట్రన్స్ రిసెప్షన్, తరగతి గదుల్లో స్వదేశీ కళను చిత్రీకరించి సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించారు. పాత పాఠశాల గోడలపై ఉన్న ఆదిమ కుడ్యచిత్రాలను కొత్త భవనంలో పుననర్న్మించారు. ఆ స్ఫూర్తితోపాటు కొత్త, సమకాలీన అభ్యాస వాతావరణాన్ని సృష్టించారు. ప్రీసూ్కల్, కిండర్ గార్టెన్, ప్రైమరీ స్కూల్‌తో 500 మందికి పైగా విద్యార్థుల సామర్థ్యం ఈ కొత్త క్యాంపస్ సొంతం.ఆరోగ్యం, ఆహ్లాదం ప్రాధమిక పాఠశాల భవనంలో కాంతికోసం ప్రత్యేకంగా విద్యుత్ అక్కరలేదు. ప్రత్యేకమైన టెర్రస్ ప్రతి గదికీ సూర్యకాంతిని ప్రసరింపజేస్తుంది. అది బాగా వేడిగా కూడా ఉండదు. మృదువైన కాంతి స్థానిక కాసురినా చెట్ల ఆకుల మధ్య నుంచి జాలువారుతున్నట్లుగా ఉంటుంది. ఈ సహజకాంతి విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పాఠశాల భవనానికి అనుసంధానించి ఉన్న కమ్యూనిటీ హాల్, లైబ్రరీ విద్యార్థులను సమాజంలో భాగం చేస్తున్నాయి.175 మంది మనసు గెలుచుకుని.. క్రీడలు, రవాణా, ఆరోగ్యం, గృహనిర్మాణం వంటి 18 కేటగిరీల్లో డబ్ల్యూఏఎఫ్ అవార్డులు ఇస్తుంది. 175 మంది ఫెస్టివల్ డెలిగేట్ల ప్యానెల్ అన్ని కేటగిరీలకు చెందిన విజేతల నుంచి ‘వరల్డ్ బిల్డింగ్ ఆఫ్ ది ఇయర్’ ను ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది నేషనల్ స్టార్ అబ్జర్వేటరీ ఆఫ్ సైప్రస్, పోలండ్‌లోని ప్రఖ్యాత బస్ స్టేషన్, టర్కీలోని సోలార్ పవర్ ప్లాంట్ వంటి 220 ప్రాజెక్టులు అవార్డు కోసం పోటీపడ్డాయి. వాటన్నింటినీ తలదన్ని ఒక చిన్న పాఠశాల నెగ్గుకురావడం అసాధారణమని ఎఫ్జేసీ స్టూడియో అసోసియేట్ అలెస్సాండ్రో రోసీ అన్నారు. భవనంలో సమయాన్ని గడిపే పిల్లలే నిజమైన విజేతలని అభిప్రాయపడ్డారు. గతేడాది కూడా చైనాలోని ఓ బోర్డింగ్ స్కూల్ ఈ టైటిల్‌ను గెలుచుకోవడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏపీలో విద్యా విధానం భేష్
మధురవాడ (భీమిలి): ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానం, పాఠ్య ప్రణాళిక (కరికులమ్)బాగున్నాయని ఐబీ సిలబస్ అంతరాత్జీయ ప్రతినిధులు యూఎస్ఏకి చెందిన సీనియర్ కరికులమ్ డిజైన్ మేనేజర్ ఆర్డర్, యూకేకి చెందిన అసోసియేట్ మేనేజర్ మైఖేల్ ప్రశంసలు కురిపించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఐబీ సిలబస్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో నార్త్ డివిజన్లో 10 రోజుల పర్యటనలో భాగంగా విశాఖ మహానగరంలోని చంద్రంపాలెం జెడ్పీ హైస్కూల్‌ను బుధవారం సందర్శించారు. ఇక్కడ కరికులమ్, కంప్యూటర్ విద్య, వసతులను పరిశీలించారు. ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారు, విద్యార్థులు పాఠాలను ఎలా అర్థం చేసుకుంటున్నారనే తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఐఎఫ్‌పీ ప్యానల్స్, ట్యాబ్స్ ఉపయోగం, పిల్లల టాలెంట్స్‌ను పరిశీలించారు. బైలింగ్యువల్ టెక్ట్స్‌బుక్స్ పిల్లలకు ఎలా ఉపయోగపడుతున్నాయనే విషయాలతోపాటు బోధన తీరును కూడా పరిశీలించారు. సైన్స్‌డేని పురస్కరించుకుని విద్యార్థులు తయారు చేసిన మోడల్స్, వాటి గురించి వివరిస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్ఈఆర్టీ ఆచార్యులు శ్రీనివాసరావు, డీఈఓ ఎల్.చంద్రకళ మాట్లాడుతూ.. ఐబీ సిలబస్ ప్రతినిధులు ఇక్కడి విద్యావిధానం బాగుందని చెప్పారన్నారు. రాష్ట్రంలో విద్యా విధానాన్ని పరిశీలించి ఆకళింపు చేసుకున్న ఐబీ ప్రతినిధులు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినట్టు చెప్పారు. ఇందులో భాగంగా వేర్వేరు పాఠశాలలు, తరగతులను పరిశీలిస్తున్నారన్నారు. -
పనిమనిషిపై అత్యాచారం కేసులో మురళీ ముకుంద్ అరెస్ట్
బంజారాహిల్స్: హైదరాబాద్‌లో పేరొందిన ఒక స్కూలుకు ఒకప్పుడు చైర్మన్‌గా పనిచేసిన ఒక విద్యాధికుడు అత్యంత హీనమైన చర్యకు పాల్పడ్డాడు. తన ఇంటిలో పనిచేసే యువతిని బెదిరించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక స్కూలుకు మార్గదర్శకునిగా వ్యవహరించిన ఆ వ్యక్తి ఇటువంటి దుర్మార్గానికి పాల్పడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12, మిథులానగర్‌లో నివాసముంటున్న జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్ మురళీముకుంద్ తన ఇంట్లో పని చేసే యువతిని బెదిరించి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టు న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. బాధితురాలు ఈ నెల 18న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన దరిమిలా పోలీసులు మురళీ ముకుంద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మురళీ ముకుంద్‌కు 14 రోజుల పాటు జ్యుడీషీయల్ రిమాండ్‌ను విధించారు.ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా, పరారీలో ఉన్న కుమారుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
సరికొత్త ప్ర‘యోగం’!
విశాఖ విద్య: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను సైన్స్ ప్రయోగాలకు కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. విద్యార్థులకు ప్రయోగాలపై ఆసక్తిని పెంపొందించి సమాజానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల సైన్స్ అధికారులు (డీఎస్వో), ఎస్సీఈఆర్టీ, యునిసెఫ్, అటల్ టింకరింగ్ ల్యాబ్, సమగ్ర శిక్ష విభాగాలకు చెందిన నోడల్ అధికారులతో కూడిన బృందాన్ని మహారాష్ట్రలోని పుణే సమీపాన పాబల్ అనే గ్రామంలో ఉన్న విజ్ఞాన ఆశ్రమానికి పంపించింది. కేంద్ర గ్రామీణ అభివృద్ధిశాఖ నిర్వహిస్తున్న విజ్ఞాన ఆశ్రమంలోని సైన్స్ ప్రయోగాలకు సంబంధించిన ఫ్యాబ్ ల్యాబ్‌లో సోమవారం ప్రారంభమైన ప్రతిష్టాత్మక వర్క్‌షాప్‌లో ఈ బృందం పాల్గొన్నది. నాలుగు రోజులు నిర్వహించనున్న ఈ వర్క్‌షాప్‌లో నిపుణుల అనుభవాలు, సూచనలు తెలుసుకోవడంతోపాటు ఫ్యాబ్ ల్యాబ్‌లో స్థానికంగా లభించే ముడిసరుకుతో విద్యార్థులు వినూత్న పరికరాలను ఎలా తయారు చేయాలి... అవి స్థానిక ప్రజలకు ఎలా ఉపయోగపడతాయి... అనే అంశాలపై జిల్లా సైన్స్ అధికారులు అధ్యయనం చేయనున్నారు. అనంతరం జిల్లా సైన్స్ అధికారుల నేతృత్వంలో అన్ని జిల్లాల్లోనూ డివిజన్, మండలాల వారీగా పాఠశాలల్లో సదస్సులు ఏర్పాటుచేసి ఫ్యాబ్ ల్యాబ్‌లో అధ్యయనం చేసిన ఉత్తమ నమూనాలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ విధంగా రాష్ట్రంలోని 26 జిల్లాల సైన్స్ అధికారులు ఇతర రాష్ట్రాలకు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లడం విద్యాశాఖ చరిత్రలో ఇదే తొలిసారి అని ఉమ్మడి విశాఖ, కృష్ణా జిల్లాల సైన్సు అధికారులు కప్పాల ప్రసాద్, మైనం హుస్సేన్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల ల్యాబ్‌లలో ఉత్తమ ఫలితాలు రాష్ట్రంలోని 713 ప్రభుత్వ పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యాన ఇప్పటికే అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కో పాఠశాలలో రూ.20లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన ఈ ల్యాబ్‌లలో సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, గణితం వంటి అంశాల్లో విద్యార్థులను వినూత్న ఆలోచనలవైపు మళ్లించేలా తర్ఫీదు ఇస్తున్నారు. ఈ ల్యాబ్‌ల ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం మరొక అడుగు ముందుకేసి ‘నాడు–నేడు’ ద్వారా అభివృద్ధి చేస్తున్న అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తోంది. తద్వారా ఇంగ్లిష్ మీడియం చదువుతోపాటు సైన్స్, టెక్నాలజీ రంగాల్లో విద్యార్థులు రాణించేలా పాఠశాలల్లోని ల్యాబ్‌లు ఉపయోగపడతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ను విజిట్ చేసిన హీరో నాగార్జున
-
మూసీనది ఆక్రమణలతోనే వరదలు
సాక్షి, హైదరాబాద్: మూసీనది ఆక్రమణలకు గురికావడం వల్లే హైదరాబాద్‌లో వర్షాలు కురిసినప్పుడు వరదలు పోటెత్తుతున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం రామంతాపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్వర్ణోత్సవాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రకృతి చాలా ముఖ్యమైనదని, నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదమని అన్నారు. నదుల ఆక్రమణలను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిదని పేర్కొన్నారు. దేశంలోని ఉన్నతమైన విద్యాసంస్థల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒకటని కొనియాడారు. క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, కృషితోనే మంచి భవిష్యత్ సాధ్యమని విద్యార్థులకు సూచించారు. వ్యాయామం అవసరం శారీరకంగా దృఢంగా ఉంటేనే మానసిక ఉల్లాసం లభిస్తుందని, ప్రతిరోజు శరీరానికి వ్యాయామం అవసరమని వెంకయ్యనాయుడు సూచించారు. యోగా అనేది మోదీది కాదని, వ్యాయామానికి కులమతాల భేదాలు లేవని అన్నారు. సంగీతం, సాహిత్యం రోజువారీ జీవితంలో భాగం కావాలని, ప్రకృతిని, సంస్కృతిని ఆరాధిస్తూ జీవితాన్ని సాఫీగా గడపాలన్నారు. చదువు కోసం చాలామంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారని, అనంతరం దేశం కోసం పనిచేయడానికి తిరిగి రావాలన్నారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వి.కరుణ, ప్రిన్సిపాల్ డాక్టర్ నర్సింహారెడ్డి, హెచ్పీసీ అధ్యక్షుడు శ్యామ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలు
కొత్తూరు: ప్రమాదవశాత్తు ఐదేళ్ల విద్యార్థికి మంటలంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కొత్తూరు మండలంలోని ఇన్ముల్‌నర్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం చోటు చేసుకుంది. ఎంఈవో కృష్ణారెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఇమామ్, షభానాబేగంలకు ముజామిల్ (5)తో పాటు మూడేళ్ల వయస్సున్న కూతురు ఉంది. ముజామిల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే పాఠశాలకు వెళ్తున్న క్రమంలో 9.30 గంటల సమయంలో పాఠశాల ప్రహరీ పక్కన విద్యార్థికి మంటలు అంటుకోవడాన్ని గమనించిన ఉపాధ్యాయులు, స్థానికులు మంటలను ఆర్పేసి విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. వారు షాద్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు, షాద్‌నగర్ ఆర్డీఓ రాజేశ్వరితో పాటు ఎంఈవో కృష్ణారెడ్డి ఆస్పత్రికి వెళ్లి విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలకు చేరుకొని జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. పాఠశాల సమీపంలో చెత్తకు పెట్టిన నిప్పు వద్ద బాధిత విద్యార్థితో పాటు మరో బాలుడు ఆడుతున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు ఎంఈవో తెలిపారు. -
‘సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం అభినందనీయం’
కాచిగూడ (హైదరాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్వాగతించారు. మంగళవారం కాచిగూడలోని అభినందన్ గ్రాండ్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 24 వేల టీచర్ పోస్టులను, ఎయిడెడ్ పోస్టులను, గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 12 వేల టీచర్ పోస్టులను, కస్తూరిబా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 1,500 టీచర్ పోస్టులు, ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 2 వేల టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేసి విద్యాభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
9 మందిని బదిలీ చేస్తే చదువెట్లా?
జన్నారం (ఖానాపూర్): అసలే ఉపాధ్యాయుల కొరత ఉన్న తరుణంలో ఒకేసారి తొమ్మిదిమందిని బదిలీచేస్తే తామెలా చదువుకునేదంటూ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం రోడ్డెక్కారు. పాఠశాల నుంచి కిలోమీటరు దూరం నడుచుకుంటూ వచ్చి మందపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించారు. వీరికి గ్రామ మాజీ సర్పంచ్ సీదర్ల రమేశ్, ఎన్ఎస్యూఐ మండల నాయకులు సోహెల్, అజ్మత్‌ఖాన్, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ గాజుల మల్లేశ్ తదితరులు మద్దతుగా కూర్చున్నారు. విద్యార్థులు మహేందర్, నిక్షిత మాట్లాడుతూ పాఠశాలలో 650 మంది విద్యార్థులకు 28 ఉపాధ్యాయులు పనిచేయాల్సి ఉండగా.. 17 మంది మాత్రమే ఉన్నారని, వీరిలో ఇప్పుడు తొమ్మిదిమందిని బదిలీ చేశారని తెలిపారు. బదిలీ అయి న వారి స్థానంలో ఆరుగురే రానున్నారన్నారు. మరో మూడు నెలల్లో పరీక్షలున్నాయని, ఉపాధ్యాయుల్లేకుండా ఎలా చదువుకోవాల ని ప్రశ్నించారు. విషయాన్ని ఇదివరకే కలెక్ట ర్, జిల్లా విద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. డీఈవో వచ్చి హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని భీష్మించారు. ఎస్సై మధుసుదన్‌రావు, మండల విద్యాధికారి విజయ్‌కుమార్ ఎంత చెప్పినా విద్యార్థులు వినిపించుకోలేదు. ఎమ్మెల్యే పాఠశాల దుస్థితిని అర్థం చేసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. మూడు గంటలపాటు రాస్తారోకో చేసిన విద్యార్థులకు ఎంఈవో నచ్చజెప్పడంతో చివరికి సాయంత్రం 5.20కి ఆందోళన విరమించారు. విద్యార్థుల ఆందో ళనతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచి ప్రయాణికులు ఇబ్బందులుపడ్డారు. -
పాఠాలు.. ప్రాక్టికల్‌గా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చదువుకు మరింత పదును పెట్టేందుకు విద్యా శాఖ నడుం బిగిస్తోంది. అర్థమయ్యే బోధనా విధానాలే కాకుండా, ఏమాత్రం కష్టం లేని పరీక్ష పద్ధతులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్రం ఇప్పటికే జాతీయ విద్యా విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. స్థానిక అవసరాలకు అనుగుణంగా రాష్ట్రాలు ఈ విధానాన్ని మార్చుకుంటున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) సరికొత్త విద్యా విధానంపై కసరత్తు మొదలు పెట్టింది. కరోనా కారణంగా పాఠశాలల్లో బోధన, పరీక్ష విధానాలను మార్చుకోవడం అనివార్యమైంది. గడిచిన రెండేళ్లుగా సిలబస్‌ను కుదించడం, ఐచ్ఛిక ప్రశ్నలతో పరీక్షలు నిర్వహించడం తప్పని సరైంది. నిజానికి ఈ తరహా బోధన పద్ధతులను సీబీఎస్సీ ఇప్పటికే అమలు చేస్తోంది. తరగతి పాఠాల కన్నా, సృజనాత్మకత పెంచే ప్రాజెక్టులను చేపట్టింది. ఇవన్నీ సత్ఫలితాలు ఇస్తున్నాయని అధికారులు గుర్తించారు. ముందున్న సవాళ్లు ఎన్నో.. రాష్ట్రంలో ఆధునిక బోధన విధానం ప్రస్తుతం అమల్లో ఉన్నా, ఆచరణలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని అధికారులు అంటున్నారు. నిజానికి పాఠశాల విద్యలో నాలుగు ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులోనే విద్యార్థి సృజనాత్మకతను అంచనా వేస్తారు. ప్రాజెక్టు వర్క్, రాత పని విధానం, ఏ కోణంలో ఆసక్తిగా ఉన్నారో తెలుస్తుంది. ప్రతి పాఠ్యాంశం ముగిసిన తర్వాత ప్రాజెక్టు వర్క్ ఇస్తారు. దీన్నే కీలకం చేయాలని కేంద్ర విద్యా విధానం చెబుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న అరకొర మౌలిక వసతులు దీనికి అడ్డంకిగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు 6వ తరగతిలో సంఖ్యా విధానం బోధిస్తారు. దీన్ని ప్రాక్టికల్‌గా తెలుసుకునేందుకు విద్యార్థులు గ్రామ పంచాయతీకి వెళ్లి, అక్కడ మ్యాప్ ద్వారా ఏ గ్రామానికి ఎంత దూరం ఉందనేది లెక్కించాలి. ఈ పని కోసం విద్యార్థులను తీసుకెళ్లేందుకు వాహనం కావాలి. ఒక రోజంతా ఉపాధ్యాయుడు వెచ్చించాలి. పాఠశాల విద్యలో సైన్స్ సబ్జెక్టులో భూసార పరీక్ష గురించి ఉపాధ్యాయుడు బోధిస్తాడు. భూసార పరీక్ష లేబొరేటరీకి వెళ్లి పరీక్ష విధానాన్ని స్వయంగా విద్యార్థులు పరిశీలించాలని, దీనికే ప్రాధాన్యం ఇవ్వాలని కొత్త విద్యా విధానం చెబుతోంది. పరిష్కారం ఏమిటి? సృజనాత్మక విద్యా విధానం అమలుకు సాంకేతికతను జోడించడమే సరైన మార్గమని విద్యా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు గ్రామాల మధ్య దూరం తెలుసుకోవడానికి పంచాయతీ దాకా వెళ్లే బదులు స్కూల్లోనే ఇంటర్నెట్ ద్వారా గూగుల్ మ్యాప్స్‌తో పరిశీలించే విధానం ప్రవేశపెట్టాలని సూచిస్తున్నారు. ఇది సాధ్యపడాలంటే హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలి. అధ్యాపకులకు సాంకేతిక శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కోణంలోనూ ఆలోచన చేస్తున్నామని ఎస్సీఈఆర్టీ అధికారి ఒకరు తెలిపారు. అదే విధంగా క్షేత్రం స్థాయిలో నేర్చుకునే సృజనాత్మకతనే పరీక్షగా భావించి, దానికే ఎక్కువ మార్కులు ఉండేలా చూడాలని ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సాధ్యమైనంత వరకు క్షేత్రస్థాయిలో ఎక్కువ నేర్చుకుని, పాఠ్యాంశాలు తక్కువగా ఉన్నప్పుడు పరీక్షల్లో మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలు ఎక్కువ ఇవ్వడం మంచిదని పేర్కొంటున్నారు. స్కూళ్లకు నిధులివ్వాలి నేటి అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు అవసరమే. ఇప్పటికే మన పాఠ్య ప్రణాళిక ప్రొగ్రెసివ్‌గానే ఉంది. కార్యాచరణలో దాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు స్కూళ్లకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి. మారుమూల పల్లెల్లోనూ సాంకేతిక విద్యా బోధన, ఆన్లైన్ విధానాలను తీసుకురావాలి. రాజా భానుచందర్ ప్రకాశ్, రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు) -
నన్ను కొట్టాడు సార్... !.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బాలుడు
జూలూరుపాడు: ‘ఆడుకుంటుం టే నన్ను అనవసరంగా కొట్టా డు సార్’అంటూ ఓపదేళ్ల బాలు డు ధైర్యంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు లోని న్యూకాలనీకి చెందిన కాశిమళ్ల రవిబాబు ఐదో తరగతి చదువుతున్నాడు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆడుకుంటుండగా అదే కాలనీకి చెందిన 14ఏళ్ల కుర్రాడు అతని తలపై కొట్టాడు. దీంతో రవిబాబు ఏడుస్తూ నేరుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో తానే నేరుగా పోలీసుస్టేషన్‌కు వచ్చానని బాలుడు తెలిపాడు. అనంతరం హోంగార్డును పంపించి బాలుడిని కొట్టిన కుర్రాడికి సర్దిచెప్పారు. (చదవండి: చేపలు, గొర్రెలతో ఉపాధి కల్పిస్తే ఉద్యోగం కాదా? ) -
స్వల్పంగా పెరిగిన విద్యార్థుల హాజరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యా సంస్థలు ప్రారంభమైన రెండోరోజు గురువారం విద్యార్థుల హాజరు స్వల్పంగా పెరిగింది. ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా హాజరయ్యారు. అధిక శాతం ప్రైవేట్ పాఠశాలలు ఆన్లైన్ పాఠాలకే మొగ్గు చూపాయి. ఆన్లైన్ పాఠాలకు ప్రభుత్వం అనుమతించడంతో విద్యార్థులు దీన్నే ఆప్షన్‌గా ఎంచుకున్నారు. ఫలితంగా ప్రైవేటు సంస్థల్లో విద్యార్థుల హాజరు తక్కువగా ఉంది. నగరాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు పాఠశాలలకు ఎక్కువగా హాజరవుతుండటం గమనార్హం. మహబూబాబాద్ జిల్లాల్లో 50 శాతం మంది విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు హాజరయ్యారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం గురువారం ప్రభుత్వ స్కూళ్ళలో 38.82 శాతం, ప్రైవేటు స్కూళ్ళలో 21.74 శాతం, ఎయిడెడ్ పాఠశాలల్లో 15.04 శాతం హాజరు నమోదైంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్లు కలిపి సగటు హాజరు శాతం 25.2గా నమోదైందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. బుధవారం సగటున 21.77 శాతం హాజరు నమోదైంది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య 52,22,174 మంది కాగా గురువారం 14,76,874 మంది హాజరయ్యారు. హాజరు క్రమంగా పెరిగే అవకాశం! పట్టణ, గ్రామీణ ప్రాంతాలు రెండింటిలోని ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థుల హాజరు శాతం ఆశాజనకంగా ఉంది. తల్లిదండ్రుల నుంచి పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కావడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. సీజనల్ జ్వరాలు, ఇతరత్రా అస్వస్థతతో ఉన్న వాళ్ళను మాత్రం స్థానిక ప్రజాప్రతినిధులు కట్టడి చేశారు. విద్యార్థుల హాజరు శాతం క్రమంగా పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. టీచర్‌కి కరోనా.. పాఠశాల మూసివేత ►వారం రోజులు సెలవులు ప్రకటించిన ఎంఈవో పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని గోవిందాపు రం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలికి కరోనా నిర్ధారణైంది. బుధవారం విధులకు హాజరై న ఆమెకు గురువారం నలతగా ఉం డటంతో పరీక్ష చేయించుకున్నారు. అం దులో కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో ఆమె వెంటనే ఎంఈవో వీరస్వామికి సమాచారమిచ్చారు. దీంతో పాఠశాలకు వారంరోజులు సెలవులు ప్రకటించినట్లు వీరస్వామి తెలిపారు. పాఠశాల సిబ్బందితో పాటు విద్యార్థుల్లో ఎవరికైనా లక్షణాలుంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలని సూచించారు. -
నోటీసులపై స్పందించిన జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన క్రమంలో అధికారులు గురువారం స్కూల్లో తనిఖీలు చేపట్టారు. అవకతవకలు జరిగాయని గుర్తించిన విద్యాశాఖ అధికారులు జూబ్లీహిల్స్ పబ్లిక్, గీతాంజలి స్కూళ్లకు నోటిసులు పంపించారు. పూర్తి రికార్డులు సమర్పించాలని తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించిన స్కూళ్ల యాజమాన్యాలు డీఈవోకు రికార్డులు సమర్పించారు. స్కూళ్ల యజమాన్యాలు ఇప్పటికే జీవో నెంబర్ 46ను ఉల్లంఘించాయని అధికారులు తెలుసుకున్నారు. వీటితో పాటు మెరిడియన్, నీరబ్ పబ్లిక్ స్కూళ్లల్లో కూడా నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు అధికారులు గుర్తించారు. రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించిన తరువాత వారిపై చర్యలు తీసుకుంటామని డీఈఓ తెలిపారు. చదవండి: ‘జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్’ దొరికిపోయింది! -
‘జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్’ దొరికిపోయింది!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు స్కూల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో డీఈఓ తనిఖీలు నిర్వహిస్తుంటే స్కూల్ ముందు యాజమాన్యం నిఘా పెట్టింది. స్కూల్ గురించి మీడియా, తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునేందుకు యాజమాన్యం కెమెరాలలో రికార్డ్ చేసుకుంటోంది. స్కూల్ ఆవరణంలో ముగ్గురు మనుషులతో నిఘా పెట్టగా, వారిలో ఇద్దరు కెమెరాలతో రికార్డు చేస్తుంటే మరొకరు వాకీటాకీలతో అక్కడ జరుగుతున్న సమాచారాన్ని స్కూల్ యాజమాన్యానికి చేరవేస్తున్నారు. మీడియా స్కూల్ పేరెంట్స్‌తో మాట్లాడిస్తున్న సందర్భంలో వారి కెమెరాలతో రికార్డు చేస్తున్నారు. ఈ దృశ్యాలు చిత్రీకరిస్తున్న సమయంలో మీడియాకు అడ్డంగా దొరికిపోయారు. (జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో విద్యాశాఖ అధికారుల విచారణ) -
క్లాస్మేట్స్.. స్నేహ హస్తాలు
లక్ష్మిస్ నాయక్ పదహారేళ్ల కుర్రాడు. బెంగళూరు, రాజాజీ నగర్‌లోని ఈస్ట్–వెస్ట్ పబ్లిక్ స్కూల్‌లోపదవ తరగతి చదువుతున్నాడు.ఆ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న కుర్రాళ్లు చాలామందే ఉన్నారు. అయితే లక్ష్మిస్ నాయక్ మాత్రంఆ స్కూల్‌కి ప్రత్యేకం. ఎందుకు ప్రత్యేకం అంటే... పదేళ్లుగా ఒక అందమైన దృశ్యానికి ఆ స్కూల్ ప్రత్యక్షసాక్షిగా ఉంటూ వస్తోంది. అయితే ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలతోపాటే మనసును తాకే ఆ దృశ్యం కూడా కనుమరుగు కాబోతోంది. ఒక స్నేహబృందం చెల్లాచెదురు అయిపోవాల్సిన సమయం వచ్చేసింది. ‘‘టెన్త్ పూర్తయిన తర్వాత పిల్లలు ఎవరికి ఇష్టమైన కోర్సుల్లో వాళ్లు చేరతారు. లక్ష్మిస్ నాయక్ స్నేహబృందంలోని కుర్రాళ్లు కూడా ఒక్కొక్కరు ఒక్కో కాలేజ్‌లో చేరిపోతారు’’ అంటూ.. ఆ స్కూలుకే ప్రత్యేకమైన లక్ష్మిస్ నాయక్ గురించి స్కూల్ టీచర్ గ్రేస్ సీతారామన్ తెలిపారు. అంతా టెన్త్‌కి వచ్చేశారు లక్ష్మిస్ నాయక్‌ను ఇప్పటివరకు స్నేహితుల హస్తాలే నడిపించాయి. నాయక్ ఏడాది పిల్లాడిగా ఉన్నప్పుడు పోలియో బారిన పడ్డాడు. తనకై తాను నడవలేడు. మొదట్లో వాళ్ల అమ్మానాన్న రోజూ స్కూల్లో దించేవాళ్లు. ఆ తర్వాత నాయక్ స్నేహితులు ఆ బాధ్యత తీసుకున్నారు. అందరూ చిన్న పిల్లలే. కానీ అందరిదీ పెద్ద మనసు. ఏడెనిమిది మంది పిల్లలు రోజూ నాయక్‌ను ఇంటినుంచి స్కూలుకు తీసుకెళ్తారు. వీల్ చైర్లో కూర్చోబెట్టి స్కూలు ఆవరణంతా తిప్పుతారు. చేతులతో ఎత్తి పై అంతస్థులోని క్లాస్ రూమ్‌కు తీసుకెళ్తారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా కొన్నేళ్లుగా జరుగుతోంది. ఇప్పుడు వాళ్లంతా పదవ తరగతికి వచ్చారు. పరీక్షలైపోగానే విడిపోక తప్పదని ఆవేదన చెందుతున్నారు. పై అంతస్తులోని తరగతి గది నుంచి లక్ష్మిస్ నాయక్‌ను కిందికి తీసుకొస్తున్న స్నేహితుడు వాడిని వదిలేసి వెళ్లలేం ఓ రోజు ఓ టీచర్ ఆ పిల్లల్ని ‘‘రోజూ ఇలా చేతులతో ఎత్తుకుని తీసుకెళ్లడం కష్టంగా అనిపించడం లేదా’’ అని అడిగారు. అప్పుడు ఆ కుర్రాళ్లు చెప్పిన మాట ‘‘అందరం షేర్ చేసుకుంటాం. కాబట్టి బరువు అని కానీ, కష్టం అని కానీ అనిపించదు. వాడిని తీసుకెళ్లకుండా మేము ఎక్కడికైనా వెళ్లినప్పుడు కూడా వాడే గుర్తుకు వస్తుంటాడు’’ అన్నాడు ఆ స్నేహబృందంలోని సిద్ధార్థ. మరో స్టూడెంట్ మయూర్ అయితే... ‘‘మేము వాడిని మోసుకు పోవడమే కనిపిస్తుంది. వాడు మాకు ఎన్ని సబ్జెక్టుల్లో సహాయం చేస్తాడో తెలుసా? క్లాస్‌లో మాకు అర్థం కాని సందేహాలను వాడు చక్కగా క్లియర్ చేస్తాడు. నాయక్ కామర్స్ చదవాలనుకుంటున్నాడు. నేను ఏదైనా డిప్లమో కోర్సులకు వెళ్లాలనుకుంటున్నాను. వేరే వేరే కాలేజీలకు వెళ్లక తప్పదు’’ అని ఆవేదన చెందాడు. ‘నాకూ దిగులేస్తోంది’ ‘‘నాయక్ ఫిజికల్లీ చాలెంజ్డ్ అని బయటి వాళ్లు అనుకోవాల్సిందే తప్ప మాకు అలా అనిపించదు. స్కూల్లో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ మా అందరితోపాటు నాయక్ కూడా ఉంటాడు’’ అన్నారు కుర్రాళ్లందరూ ముక్తకంఠంతో. నాయక్ మాత్రం ‘‘ఇప్పటి వరకు నన్ను చేతుల్లో పెట్టుకుని చూసుకున్న నా స్నేహితులకు దూరం కావాల్సి వస్తోంది. ఒకరి సహాయం లేకుండా కృత్రిమ సాధనాల సహాయంతో నడవడానికి నేను సిద్ధమే. కానీ పదవ తరగతి పరీక్షల తర్వాత ఎదురయ్యే ఒంటరితనం ఇప్పటి నుంచే గుర్తుకొస్తోంది’’ అని దిగులుగా అంటున్నాడు.– మంజీర -
గందరగోళంగా విద్యార్థుల లెక్కలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల లెక్కలపై గందరగోళం నెలకొంది. ఎంతమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి తగ్గిపోతున్నారో.. ఎంత మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో పెరుగుతున్నారో, ప్రభుత్వ గురుకులాల్లో ఎంతమంది చేరుతున్నారో, ఎంతమంది డ్రాపవుట్ అవుతున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. విద్యాశాఖ వేస్తున్న ఒక లెక్కతో మరో లెక్కకు పొంతన కుదరడం లేదు. 2016–17 విద్యా సంవత్సరంతో 2017–18 విద్యా ఏడాది లెక్కలను పోల్చి తే 1.34 లక్షల మంది విద్యార్థులు ఒక్క జిల్లా పరిషత్, మండల పరిషత్ మేనేజ్మెంట్ పాఠశాలల్లోనే తగ్గిపోయారు. అదే ప్రైవేటులో 85,565 మంది విద్యార్థులు పెరిగారు. అధికారిక లెక్కల ప్రకారం 2017–18లో ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్ పాఠశాలల్లో మొత్తంగా 5.69% విద్యార్థులు డ్రాపవుట్స్ ఉన్నారు. అంటే 1,58,982 మంది విద్యార్థులు బడి మానేసినట్లు విద్యాశాఖ లెక్కలు వేసింది. 2017– 18 విద్యా ఏడాదిలో కొత్తగా ఏర్పాటుచేసిన 470 గురుకులాల్లో 1,50,400 మంది విద్యార్థులు చేరినట్లు సంక్షేమ శాఖలు లెక్కలు వేశాయి. అయితే బడి మానేసిన వారంతా గురుకులాల్లో చేరారా? అదే నిజమైతే ప్రైవేటు పాఠశాలల్లో పెరిగిన 86,565 మంది విద్యార్థులు ఎలా వచ్చారన్నది అర్థంకాని ప్రశ్నగానే మిగిలిపోతోంది. 2016–17లో ప్రభుత్వ స్కూళ్ల లో 6,74,748 మంది విద్యార్థులు ఉంటే ఆ సంఖ్య 2017–18 విద్యా ఏడాదిలో 7,58,132కు పెరిగినట్లు లెక్కలు వేసింది. అంటే 83,384 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగినట్లు తేల్చింది. రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లలో చేరిన విద్యార్థుల సంఖ్య, ప్రైవేటు పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య కలిపితే పెరిగిన విద్యార్థుల సంఖ్య 1.70 లక్షలకు చేరుకుంది. అందు లో జెడ్పీ స్కూళ్లలో తగ్గిపోయిన 1.34 లక్షల మందిని తీసేసినా మిగతా 36 వేల మంది విద్యార్థులు ఎక్కడినుంచి వచ్చారన్నది అర్థంకాని పరిస్థితి నెలకొంది. -
ఆక్సిజన్ సిలిండర్‌తో పరీక్షకు..
తుర్కయంజాల్: లక్ష్యం ముందు ఎంత పెద్ద సమస్య అయిన చిన్నదే అని నిరూపించింది ఆ విద్యార్థిని. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్కు చెందిన బాలయ్య, వసంతల కూతురు నవీన ఇంజాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. నవీన మూడు నెలలుగా ఆస్తమాతో బాధ పడుతోంది. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నప్పటికీ ఇంకా నయం కాలేదు. ఆస్తమా తీవ్ర స్థాయిలో ఉండటంతో నవీనకు 24 గంటలూ ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో శ్వాస అందించాల్సి ఉంది. కాగా, నవీన శనివారం రాగన్నగూడలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి తెలుగు పరీక్షకు సిలిండర్ ద్వారా శ్వాస తీసుకుంటూనే హాజరైంది. ఎంత కష్టమైనా పరీక్ష రాస్తానని తమ కూతురు చెప్పిందని, అందుకే పరీక్ష రాసేందుకు తీసుకువచ్చామని తల్లి వెల్లడించింది. -
వేర్వేరు సెక్షన్లలో హిందూ–ముస్లిం విద్యార్థులు
న్యూఢిల్లీ: మతం ఆధారంగా విద్యార్థులపై ఓ ప్రభుత్వ పాఠశాల వివక్షను చూపింది. హిందూ విద్యార్థులను ఓ సెక్షన్లో, ముస్లిం విద్యార్థులను మరో సెక్షన్లో కూర్చోబెట్టింది. ఈ ఘటన దేశరాజధానిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. బీజేపీ పాలిత ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్డీఎంసీ) పరిధిలోకి వజీరాబాద్ ప్రాథమిక పాఠశాలలో హెడ్మాస్టర్ ఇటీవల బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టిన అధ్యాపకుడు సీబీ సింగ్ సెహ్రావత్ ఈ దారుణానికి తెరతీశారు. ఓ జాతీయ ఆంగ్లపత్రికలో ఈ వ్యవహారంపై కథనం రావడంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దీంతో ప్రాధమిక విచారణ జరిపిన ఎన్డీఎంసీ కమిషనర్ మధుప్ వ్యాస్.. ఆరోపణలు నిజమని తేలడంతో పాఠశాల ఇన్‌చార్జ్‌ను సెహ్రావత్‌ను సస్పెండ్ చేశారు. ఇది ఊహించలేని, క్షమించరాని నేరమని వ్యాఖ్యానించారు. -
ఫర్నిచర్‌లోనూ ‘ఫలహారం’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు అవసరమైన కుర్చీలు, టేబుళ్లు వంటి ఫర్నిచర్ కొనుగోలులో కూడా కమీషన్లు మింగేస్తున్నారు. విద్యార్థుల కోసం కేటాయిస్తున్న కోట్లాది రూపాయల సొమ్ము పక్కదారి పడుతోంది. ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, అధికారులు కలిసి వాటాలు పంచుకుంటున్నారు. గతంలో పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలు రాసేందుకు దాదాపు రూ.20 కోట్లతో బెంచీలు, టేబుళ్లు, కుర్చీలు కొనుగోలు చేశారు. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా వీటిని పాఠశాలలకు పంపిణీ చేశారు. ప్రైవేట్ ఏజెన్సీలు సరఫరా చేసిన బెంచీలు, కుర్చీలు, టేబుళ్ల నాణ్యత అంతంత మాత్రంగానే ఉండడంతో అవి నాలుగు రోజులకే మూలకు చేరాయి. ఈ ఫర్నిచర్ కొనుగోలుకు సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) రూ.10 కోట్లు, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) రూ.10 కోట్లు భరించాల్సి ఉంది. ఎస్ఎస్ఏ ఇప్పటికే సగానికి పైగా నిధులు విడుదల చేసింది. ఆర్‌ఎంఎస్‌ఏ నిధులు విడుదల చేయలేదు. నాసిరకం ఫర్నిచర్ సరఫరా చేసిన ప్రైవేట్ ఏజెన్సీకి అధికారులు నోటీసులు జారీ చేశారు. పాత ఫర్నిచర్ స్థానంలో నాణ్యమైన ఫర్నీచర్‌ను సర ఫరా చేయాలని ఎస్ఎస్ఏ పేర్కొంది. అప్పటివరకు బిల్లుల చెల్లింపును నిలిపివేశారు. ఈలోగా ఉన్నతాధికారులు ఆర్ఎం ఎస్ఏ నుంచి రూ.10 కోట్ల నిధులను విడుదల చేయించారు. మరో రూ.20 కోట్లకు ఎసరు! గతంలో రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఫర్నిచర్ వృథాగా పడి ఉండగా, మళ్లీ 630 హైస్కూళ్లకు అవసరమైన ఫర్నీచర్ కొనుగోలుకు పాఠశాల విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రూ.20.88 కోట్లతో ఈ ఫర్నీచర్ కొనాలని నిర్ణయించారు. ఎస్ఎస్ ఇంజనీర్స్, సాయి డేటా క్రియేషన్, లక్ష్మీ ప్రసన్న ఎంటర్ప్రైజెస్, శ్రీ సిద్ధివినాయక ఇండస్ట్రీస్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ సంస్థల ద్వారా ఈ ఫర్నిచర్ కొనుగోలుకు ఉత్తర్వులిచ్చారు. డెమో టేబుళ్లు, స్లాటెడ్ యాంగిల్ రాక్స్, స్టీల్ టూల్స్, టీచర్లకు ఛైర్లు, టేబుళ్లు, డ్యూయెల్ డెస్కులు, అల్మరాలు, కంప్యూటర్ టేబుళ్లు ఇందులో ఉన్నాయి. రాష్ట్రంలోని పాఠశాలల్లో రూ.4,800 కోట్లతో పూర్తిస్థాయిలో ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ప్రతి పాఠశాలలో ఫర్నిచర్, కంప్యూటర్లు, తరగతి గదులు, మంచినీరు, మరుగుదొడ్లు ఇలా అన్ని సదుపాయాలు కల్పిస్తారు. అయినా మళ్లీ కొత్తగా రూ.20.88 కోట్లతో ఫర్నిచర్ కొనుగోలు వెనుక లోగుట్టు ఏమిటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
సర్దుబాటుకు ససేమిరా !
ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత నివారించేందుకు విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం ఉపాధ్యాయులను అవస్థల్లోకి నెట్టింది. ప్రస్తుతం ఒక ప్రాంతంలో సెటిలైన వారిని ప్రభుత్వ సౌలభ్యం కోసం ఉన్నఫళంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో కొందరు నూతన బాధ్యతల్లో చేరగా.. మిగిలిన వారు చేరేందుకు ససేమిరా అంటున్నారు. సాక్షి, మచిలీపట్నం: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరతను తాత్కాలికంగా నివారించాలని ప్రభుత్వం, విద్యాశాఖ తలచింది. ఈ నేపథ్యంలో పని సర్దుబాటు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గత నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులను అనుసరించి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత లేకుండా చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పొందుపరిచారు. జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ నేటి వరకు పూర్తి కాలేదు. ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి మరికొన్ని రోజుల వ్యవధి పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డీఈవో పూల్‌లో 20 మంది మిగులు ఉపాధ్యాయులున్నా వారిని ఇతర స్థానాలకు సర్దుబాటు చేయకుండా అలానే ఉంచారు. డీఈవోపై ఒత్తిడి... జిల్లాలోని వివిధ ఉన్నత పాఠశాలల్లో 73 సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 40 మంది మాత్రం అతికష్టం మీద సర్దుబాటు చేసినట్లు సమాచారం. మిగిలిన 33 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సర్దుబాటుకు సుముఖంగా లేని ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. తమకు అనుకూలమైన రాజకీయ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో డీఈఓపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. శుక్రవారం నిర్వహించిన ఓ సమావేశంలో డీఈఓ సైతం ఉపాధ్యాయులు తమకు కేటాయించిన పాఠశాలల్లో తప్పకుండా చేరాలని, చేరని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమస్యల భయంతో వెనకడుగు... ఉపాధ్యాయులు సర్దుబాటు ప్రక్రియను వ్యతిరేకించేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ప్రస్తుతం ఓ ప్రాంతంలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన అయ్యవార్లకు ప్రభుత్వం నిర్ణయించిన కాలపరిమితి అనంతరమే బదిలీలు ఉంటాయి. అలా కాదని తమకు ఇష్టమైన ప్రదేశాలకు బదిలీ కోరితే అందుకు అనుమతించరు. అలాంటి తరుణంలో ప్రభుత్వం, విద్యాశాఖకు ఇష్టమైనప్పుడు మాత్రం ఇలాంటి పద్ధతికి తెర తీయడం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జిల్లాలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ సర్దుబాటు ప్రక్రియ తాత్కాలికమే అని విద్యాశాఖ స్పష్టం చేస్తోంది. వివిధ పాఠశాలలకు సర్దుబాటు అయ్యే ఉపాధ్యాయులు 2018–19 విద్యా సంవత్సరం ముగిసేవరకు మాత్రమే ఆయా పాఠశాలల్లో కొనసాగుతారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి తిరిగి గత పాఠశాలలకు వచ్చేస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం డీఎస్సీ ఎప్పుడు నిర్వహిస్తారన్న అంశంపై స్పష్టత కరువైంది. ఒక వేళ ఇప్పుడు నోటిఫికేషన్ వెలువరించినా.. పరీక్షల నిర్వహణ, ఉద్యోగాలకు ఎంపిక చేయాలంటే కనీసం ఆరు నెలల వ్యవధి తప్పనిసరి. తర్వాత కొద్ది కాలానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సర్దుబాటుకు వెళ్లిన ఉపాధ్యాయులు రెండేళ్ల పాటు తప్పనిసరిగా కొనసాగాల్సి అవసరం ఉంది. రవాణా ఖర్చులు సైతం తడిసి మోపెడు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న నివాసం నుంచి కేటాయించిన పాఠశాలకు వెళ్లాలంటే చార్జీల రూపంలో అదనపు ఖర్చులు తప్పవు. ఈ కారణాల దృష్ట్యా సర్దుబాటుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. ప్రమోషన్లు వస్తే పూర్వ స్కూల్‌కే... ఒక వేళ సీనియార్టీ ప్రకారం ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తే తాత్కాలిక ప్రాతిపదికన సర్దుబాటు అయిన ఉపాధ్యాయులు మధ్యలోనే వారు పనిచేసిన పూర్వ పాఠశాలలకు వచ్చేయాల్సి ఉంటుంది. లేదా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ కొలువులు భర్తీ చేస్తే సర్దుబాటు ప్రక్రియ ద్వారా వేర్వేరు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు గత పాఠశాలలకు రావాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ ప్రకటన జారీ చేస్తే జిల్లాలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ కొలువుల్లో 30 శాతం మాత్రమే డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన 70 శాతం ఉపాధ్యాయ కొలువులను పదోన్నతుల ద్వారా కల్పిస్తారు. ప్రస్తుతం ఈ రెండు పద్ధతులు అమలయ్యే సూచనలు ఇప్పట్లో అగుపించడం లేదు. ప్రశ్నార్థకంగా యూపీ పాఠశాలలు... విద్యార్థికి క్షేత్ర స్థాయిలో మెరుగైన విద్య అందితే ఉన్నత స్థాయిలో రాణించే అవకాశం ఉంటుంది. ప్రస్తుత విద్యాశాఖ చర్యలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. క్షేత్ర స్థాయిలో బోధించే ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలలకు కేటాయిస్తే యూపీ పాఠశాలల్లో పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో సర్దుబాటు ప్రక్రియ ద్వారా ఉపాధ్యాలను నియమించడం కాకుండా ఆయా స్థానాల్లో విద్యావలంటీర్లను నియమించాలన్న డిమాండ్ నెలకొంది. దీని ద్వారా కాస్త ఉపశమనం కలుగుతుంది. ఇలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లుపై దృష్టి పెట్టకుండా ఉపాధ్యాయులను ఇబ్బందులు పెట్టే ప్రక్రియకు ఉపక్రమించడం దారుణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
విద్యా వలంటీర్లను నియమించండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల బదిలీలతో ఏర్పడిన ఖాళీల స్థానంలో విద్యా వలంటీర్లను నియమించుకోవాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖను ఆదేశించారు. దీనికి త్వరితంగా నోటిఫికేషన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. విద్యాశాఖ అధికారులతో సోమవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. యూనిఫాం, పాఠ్యపుస్తకాల పంపిణీతో పాటు ఉపాధ్యాయ ఖాళీలు తదితర అంశాలపై చర్చించారు. ఈ నెల 20లోపు యాజమాన్యాల వారీగా విద్యావలంటీర్ల నియామకం పూర్తి చేయాలన్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో సాధారణ బదిలీల వల్ల ఖాళీ అయిన చోట కాంట్రాక్టు లెక్చరర్లను తిరిగి నియమించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి, గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను విద్యాశాఖ వెబ్సైట్లో పొందుపర్చాలని స్పష్టం చేశారు. -
లవ్ లెటర్ చించేశాడని పెట్రోల్ పోసి నిప్పంటించాడు
అర్ధవీడు(గిద్దలూరు): ఓ యువతికి ఇచ్చిరమ్మన్న లవ్ లెటర్‌ను చించేశాడనే కోపంతో పాఠశాల విద్యార్థిపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణం శనివారం ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. అర్ధవీడు మండలం అంకభూపాలేనికి చెందిన మెట్ల శేఖర్, వెంకటలక్ష్మమ్మ దంపతుల కుమారుడు రవితేజ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం భోజనం తరువాత స్కూలులో నిరుపయోగంగా ఉండే గదిలోంచి రవితేజ పెద్దగా కేకలు వేయడంతో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు పరుగున అక్కడికి వెళ్లారు. మంటల్లో కాలుతున్న రవితేజ ఒంటిపై దుప్పటి కప్పి నీళ్లు చల్లి మంటలార్పారు. అనంతరం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. ఘటనపై అనుమానాలెన్నో... గాయపడిన రవితేజ కంభం ప్రభుత్వ వైద్యశాలలో విలేకర్లతో మాట్లాడుతూ తాను మూత్ర విసర్జన కోసం పాఠశాల బయటకి రాగా రంజిత్ అనే ఇంటర్ విద్యార్థి తనకు ఒక చీటీ (లవ్‌లెటర్)ఇచ్చాడని, స్కూలు ప్రాంగణంలోనే ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే ఓ యువతికి ఇచ్చిరమ్మన్నాడని చెప్పాడు. తాను ఆ కాగితాన్ని చించి వేయడంతో రంజిత్ తన వెంట తెచ్చుకున్న బాటిల్లోని పెట్రోల్‌ను తనపై పోసి, నిప్పంటించాడని తెలిపాడు. ఇదిలా ఉండగా రవితేజ ఇంటి నుంచే పెట్రోలు తెచ్చుకున్నాడని, తనే కాల్చుకొని ఉండొచ్చని స్కూలు హెచ్ఎం వెంకటేశ్వర్లు చెబుతుండటం అనుమానాలకు తావిస్తోంది. ఆయన మాటలను బాధితుడి తల్లిదండ్రులు ఖండిస్తున్నారు. తమ కుమారుడికి ఏదైనా జరిగితే టీచర్లే బాధ్యత వహించాలని చెప్పారు. నిందితుడి గుర్తింపు.. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ రవీంద్రారెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నిందితుడు అదే ప్రాంగణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదవుతున్న మాదార్సు రంజిత్‌కుమార్‌గా గుర్తించారు. సీఐ భీమానాయక్ నిందితుడిని అదుపులోకి తీసుకుని మార్కాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా పెట్రోల్ రంజిత్ పోశాడా.. రవితేజ తెచ్చాడా..? లేదా ఆ యువతిపై పోసేందుకు రంజితే తెచ్చాడా..? అనే అంశాలపై విచారణ చేస్తున్నారు. -
ఐదు వేదికలు.. ఆరు ప్లీనరీలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సాహిత్యోత్సవ ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. శుక్రవారం నుంచి 3 రోజులపాటు బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. 3 రోజులపాటు 5 వేదికలపైన ఆరు ప్లీనరీలను నిర్వహించనున్నట్లు హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ కన్వీనర్ విజయ్‌కుమార్ తెలిపారు. తొలిరోజు ఉదయం ‘కన్నడ సాహిత్యం అప్పుడు– ఇప్పుడు’ అనే అంశంపై ప్రముఖ రచయిత్రి ప్రతి భానందకుమార్ ప్రధాన ప్రసంగం చేస్తారు. మధ్యాహ్నం ‘లైఫ్ ఇన్ ఏ డ్యాన్స్’పై ప్రముఖ నృత్యకారిణి సోనాల్‌మాన్‌సింగ్ మాట్లాడుతారు. 27న ‘సిటిజన్’ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు సీమా ముస్తఫా ‘బీయింగ్ ఏ సెక్యులర్ ముస్లిం ఇన్ ఇండియా’పై ప్రసంగించనున్నారు. బాలీవుడ్ నటుడు శశికపూర్ కూతురు సంజనా కపూర్ నాటక రంగం, థియేటర్ ఆర్ట్ తదితర అంశాలపై తన అనుభవాలను వివరిస్తారు. 28న ‘మీడియా టుడే’ పై సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ మాట్లాడతారు. సాయంత్రం జరిగే ప్లీనరీలో సమా చార హక్కు చట్టం కార్యకర్త అరుణారాయ్ ప్రసం గించనున్నారు. వీటితోపాటు విభిన్న సామాజిక, సాహిత్య, సాంస్కృతిక అంశాలు, కళలపై మరో 30కిపైగా సదస్సులు, వర్క్‌షాపులు నిర్వహిస్తారు. తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక జీవితాన్ని ప్రతి బింబించే కళారూపాలనూ ప్రదర్శించనున్నారు. ఆకట్టుకోనున్న సాంస్కృతిక కార్యక్రమాలు వైవిధ్యభరితమైన సాంస్కృతిక, కళారూపాలను సమున్నతంగా ఆవిష్కరించే లక్ష్యంతో 2010 నుంచి ఏటా నగరంలో సాహిత్యోత్సవాలను నిర్వహిస్తున్నా రు. ఈసారి స్పెయిన్ కళాకారుల జానపద నృత్యం ‘ఫ్లెమెంకో’ ఆకర్షణగా నిలవనుంది. కన్నడంలో ప్రముఖ దర్శకుడు గిరీష్ కాసర వల్లి దర్శకత్వంలో వెలువడిన ‘ఘటశ్రాధ’, ‘గులాబీ టాకీస్’, ‘ద్వీప’, శశికపూర్ ‘షేక్సిపీరియానా’, ‘టామాల్టన్’ సినిమాలు ప్రదర్శిస్తారు. వంట చేస్తూ చెప్పే ఉ.సరస్వతి రామాయణం కథ, ‘నన్న నుక్కడ్’ (చిన్నారుల వీధి మలుపు), హైదరాబాద్ దక్కనీ హాస్య కవితాసమ్మేళనం, ‘బాంబే బైరాగ్’, వికలాంగుడైన కళాకారుడు బందే నవాజ్ నదీఫ్ ఫుట్ అండ్ మౌత్ పెయింటింగ్, తెలంగాణ విమెన్ రిసోర్స్ సెంటర్ మహిళా చిత్రకారుల ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ముస్తాబవుతున్న వేదికలు పబ్లిక్ స్కూల్లోని ‘తెలంగాణ టూరిజం పెవిలియర్’ వేదికపై 6 ప్లీనరీలు, కార్వే క్యానోసీ, టాటా, గోథె గ్యాలరీల్లో పలు రకాల కార్యక్రమాలు జరుగుతాయి. వేడుకలకు స్పెయిన్ అతిథిగా హాజరుకానుంది. సాహిత్యోత్సవాలకు ఆ దేశ మేధావులు, రచయితలు, కళాకారులు, అమె రికా, బ్రిటన్, కొలంబియా, కెనడా, ఇజ్రాయెల్ ప్రతినిధులు తరలిరానున్నారు. ఉత్సవాలకు ప్రముఖ కన్నడ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ కంబారా హాజరుకానున్నారు. బెంగ ళూర్‌లో ప్రఖ్యాత రంగశంకర్ థియేటర్ నిర్మాత అరుంధతి నాగ్, ప్రముఖ దళిత సామాజిక కార్యకర్త ఉ.సరస్వతి, దివంగత పాత్రికేయు రాలు గౌరీ లంకేష్ స్నేహితురాలు, ఆర్టిస్టు పుష్పమేలా పలు అంశాలపై ప్రసంగిస్తారు. ప్రముఖ గాయని గిరిజాదేవి, బాలీవుడ్ దిగ్గజం శశికపూర్, మరో నటుడు టామాల్టర్, ప్రముఖ పాత్రికేయురాలు గౌరీలంకేష్‌లను స్మరిస్తూ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభంకానుంది. -
సర్కారీ బడుల్లో దాహం.. దాహం
బండరాళ్లు, మురికి నీళ్ల మధ్య ప్లేట్లు కడుక్కుంటున్న వీరంతా స్కూలు పిల్లలు. బడిలో 1,350 మంది చదువుతున్నా ఉన్నది ఒకే ఒక్క బోరు. అందులోంచి సరిపడ నీళ్లు రావడం లేదు. దీంతో స్కూలు ప్రహరీ గోడ దూకి పక్కనే ఉన్న పబ్లిక్ కుళాయి వద్దకు వెళ్లి ఇలా ఇబ్బందులు పడుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండల కేంద్రంలో పరిస్థితి ఇది. ఇక్కడ బాలురు, బాలికలు, ప్రాథమికోన్నత పాఠశాల.. మూడు ఒకే ఆవరణలో కొనసాగుతున్నా తాగునీటికి తిప్పలు తప్పడం లేదు! – సాక్షి, హైదరాబాద్ అన్ని బడుల్లో ఇదే దుస్థితి రాష్ట్రంలో అనేక ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు దాహంతో అల్లాడుతున్నారు. స్కూళ్ల సమస్యలపై తక్షణమే స్పందించాలని సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు చెబుతున్నా అధికారులు నిర్లక్ష్యం వీడటం లేదు. రక్షిత తాగునీటి కోసం విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నా కదలడం లేదు. ఏటా రూ.11 వేల కోట్ల బడ్జెట్. అందులో మౌలిక సదుపాయాల కల్పనకే దాదాపు రూ.3 వేల కోట్లు. అయినా విద్యార్థులకు రక్షిత తాగునీటి సదుపాయాన్ని విద్యాశాఖ కల్పించలేకపోతోంది. రాష్ట్రంలో 25 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. అందులో 10,768 స్కూళ్లకే నీటి సదుపాయం ఉంది. 14,763 పాఠశాలలకు నీటి సదుపాయం లేకపోవడంతో పిల్లలకు కష్టాలు తప్పడం లేదు. విద్యార్థులు ప్రతిరోజు ఇంటి నుంచి తాగునీటి బాటిళ్లను తీసుకెళ్లాల్సి వస్తోంది. కొన్ని స్కూళ్లలో చేతిపంపులు ఉన్నా వాటిల్లో వచ్చే నీటిని విద్యార్థులు తాగలేని పరిస్థితి ఉంది. మరికొన్ని చోట్ల మురికిగా ఉంటున్నా ఆ నీళ్లనే తాగుతుండటంతో అనారోగ్యం పాలవుతున్నారు. భద్రాద్రిలో అత్యధికం ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు కాదు కదా కనీసం విద్యార్థులు చేతులు కడుక్కోవడానికి నీరు లేని స్కూళ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా ఉన్నాయి. ఆ జిల్లాలో 1,047 పాఠశాలలు ఉండగా 824 పాఠశాలల్లో చేతులు శుభ్రం చేసుకునేందుకు కూడా నీటి సదుపాయం లేదు. ఈ కోవలో తర్వాతి స్థానంలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 786, సంగారెడ్డి జిల్లాలో 769 స్కూళ్లున్నాయి. తాగునీటి కష్టాలు.. మచ్చుకు కొన్ని.. ♦ మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండలంలోని మాధ్వార్ ప్రాథమిక పాఠశాలలో 210 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ మూడు నెలల కిందట బోరు పాడైనా ఇప్పటికీ బాగు చేయకపోవడంతో విద్యార్థులు తంటాలు పడాల్సి వస్తోంది. ఎలిగండ్ల, కన్మనూర్ పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ♦ పాలమూరు జిల్లా నవాబ్‌పేట మండల కేంద్రంలోని కేజీబీవీలో వాటర్ ఫిల్టర్ రెండు నెలలుగా మొరాయించటంతో విద్యార్థులకు తాగునీటికి ఇబ్బంది పడ్డారు. దీంతో పాఠశాల ప్రిన్సిçపల్ బయట ఫిల్టర్ వాటర్‌ను కొనుగోలు చేసి విద్యార్థులకు అందిస్తున్నారు. ♦ జగిత్యాల జిల్లాలో విద్యార్థులకు రక్షిత తాగునీరు అందించే ఉద్దేశంతో గతంలో ప్రభుత్వం అన్ని స్కూళ్లకు జలమణి ప్లాంట్లు అందించింది. అయితే ఇవి ఎక్కడా పనిచేయడం లేదు. మరమ్మతు చేయకపోవడంతో మూలన పడేశారు. ♦ నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఇటిక్యాలలోని ప్రాథమిక పాఠశాలలో నీటివసతి లేక విద్యార్థులు ఇంటి నుంచే నీళ్లను తెచ్చుకుంటున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ♦ సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలో మాచవరం, శ్రీనివాసపురంలోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో రక్షిత తాగు నీటి పథకాలు లేవు. చేతిపంపు నీటిని తాగాల్సి వస్తోంది. దీంతో పిల్లలు అప్పుడప్పుడు అనారోగ్యం పాలవుతున్నారు. మూడుసార్లు బాటిళ్లు నింపుకొస్తాం పాఠశాలలో తాగునీరు లేక ఇంటి నుంచి బాటిళ్లలో తెచ్చుకుంటాం. రోజూ ఉదయం, ఇంటర్వెల్తోపాటు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బాటిళ్లలో నీళ్లు నింపుకొని వస్తున్నాం. నీళ్లకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. – సునీత, ఆరో తరగతి, బండగొండ, మహబూబ్‌నగర్ జిల్లా బోరునీళ్లు చిలుము వాసన వస్తున్నాయి మా స్కూల్లోని బోరులో నీళ్లు తుప్పు వాసన వస్తున్నాయి. వాటిని తాగలేకపోతున్నాం. ఇంటి దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతోంది. – బి.నాగేశ్వరి, ఐదో తరగతి, యూపీఎస్ శ్రీనివాసపురం, హుజూర్నగర్ మండలం, నల్లగొండ జిల్లా నీటి సమస్య తీర్చాలి మా పాఠశాలలో బోరుబావి ఎండిపోయింది. మధ్యాహ్న భోజనం సమయంలో తాగేందుకు నీళ్లను ఇంటినుంచే తెచ్చుకుంటున్నాం – రవి, పదోతరగతి, బొమ్మెన, కథలాపూర్ మండలం, జగిత్యాల