Quality
-
రూ. 5తో ‘రోల్స్ రాయిస్’ క్వాలిటీ చెక్!
రోల్స్ రాయిస్... అత్యంత ఖరీదైన ఈ కారును కొనుగోలు చేయాలని కొందరు కోటీశ్వరులు తహతహలాడుతుంటారు. అలాగే రోల్స్ రాయిస్ కార్ల కంపెనీ ప్రతీ కారును సంబంధిత వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా సిద్ధం చేస్తుంది. ఒక్కో రోల్స్ రాయిస్ కారు తయారీకి సుమారు ఆరు నెలల సమయం పడుతుంది.దీనికిగల కారణం.. రోల్స్ రాయిస్ కారులోని కొన్ని భాగాలకు చేతితో పెయింటింగ్ చేసి, వాటిని అసెంబుల్ చేస్తారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నకారణంగానే ఈ కారు ధర కోట్లలో ఉంటుంది. అయితే రోల్స్ రాయిస్ కారు క్వాలిటీని కేవలం ఐదు రూపాయల నాణెంతో చెక్ చేయవచ్చంటున్నారు ప్రముఖ యూట్యూబర్, స్టాక్ మార్కెట్ నిపుణుడు పీ ఆర్ సుందర్. ఈ కారుకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలను ఆయన మీడియాతో పంచుకున్నారు.రోల్స్ రాయిస్ చాలా అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటుందని, వీటి గురించి తెలిస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుందని ఆయన తెలిపారు. కారు ఇంజన్ ఆన్‌లో ఉన్నప్పుడు దానిపై ఐదు రూపాయల నాణెం ఉంచితే.. అది కదలి, కిందికు పడిపోదన్నారు. రోల్స్ రాయిస్ ఇంజన్ ఆన్‌లో ఉన్నప్పుడు కూడా దానిలో వైబ్రేషన్ రాదని సుందర్ తెలిపారు.రోల్స్ రాయిస్ కారును భారత్‌కు తీసుకురావాలంటే అధిక మొత్తంలో దిగుమతి పన్ను చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. భారతదేశంలో ఈ కారును నడపాలనుకుంటే, కారు కోసం ప్రత్యేకంగా పాస్‌పోర్ట్, వీసా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దుబాయ్‌లోని తన రోల్స్ రాయిస్‌ను భారత్‌కు తీసుకురావడానికి వీసా, పాస్‌పోర్ట్ పొందానని తెలిపారు. ఆరు నెలల తర్వాత తన కారును తిరిగి దుబాయ్‌కి తీసుకెళ్లాల్సి ఉంటుందని సుందర్ పేర్కొన్నారు. -
విద్యుత్ నాణ్యతలో ఏపీ నంబర్ 1
సాక్షి, అమరావతి: ఇంధన సామర్థ్యం.. విద్యుత్ పొదుపు.. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానంలో దూసుకుపోతోంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) శనివారం విడుదల చేసిన స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇండెక్స్ (ఎస్ఈఈఐ)–2023లో ఏపీ ప్రథమ స్థానం (గ్రూప్–2లో) దక్కించుకుంది. దేశంలోని అనేక పెద్ద రాష్ట్రాలను సైతం వెనక్కి నెట్టి ఏపీ ముందువరుసలో నిలిచింది. అలయన్స్ ఫర్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఎకానమీ (ఏఈఈఈ) సహకారంతో రూపొందిన ఈ ఇండెక్స్‌లో 5 మిలియన్ టన్నుల నుంచి 15 మిలియన్ టన్నుల చమురుకు సమానం (ఎంటీఓఈ) అయిన ఇంధనాన్ని ఆదా చేసిన రాష్ట్రాలను గ్రూప్–2గా విభజించగా, వాటిలో ఏపీ 83.25 పాయింట్లు తెచ్చుకుని ఈ ఘనత సాధించింది. 2022లో ఇదే ఇండెక్స్‌లో ఏపీ టాప్–5లో నిలిచింది. ఏడాదిలోనే వేగంగా మెరుగుపడి టాప్–1కి చేరుకుంది. 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో భవనాలు, పరిశ్రమలు, మునిసిపల్, రవాణా, వ్యవసాయం, విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లలో ఇంధన సామర్థ్య విధానాలు, కార్యక్రమాలు, పెట్టుబడులు వంటి దాదాపు 65 అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్వాహకులు ఈ పాయింట్లను నిర్థారించారు. ఏపీ విధానాల కారణంగానే అగ్రస్థానం 100కి 60 కంటే ఎక్కువ పాయింట్లు సాధించిన రాష్ట్రాలను ఫ్రంట్ రన్నర్, 50 నుంచి 59.75 పాయింట్లు వచ్చిన వాటిని అచీవర్, 30 నుంచి 49.75 పాయింట్లు వస్తే కంటెండర్, 30 కంటే తక్కువ పాయింట్లు వస్తే ఆస్పిరెంట్ రాష్ట్రాలుగా బీఈఈ విభజించింది. ఇందులో మన రాష్ట్రం అత్యధిక ప్రదర్శన కనబరిచింది. రాష్ట్రంలో ఇంధన సామర్థ్యానికి ప్రత్యేక విధానాలను రూపొందించడం ద్వారా అనేక విధానాలను అవలంబించడం, ఆర్థిక ప్రోత్సాహకాలు, సామర్థ్యాన్ని పెంపొందించడం, వివిధ సహకార కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ఏపీ ముందంజలో నిలిచింది. భవన నిర్మాణ రంగంలో ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్‌ను రాష్ట్రం తప్పనిసరి చేసింది. పట్టణ/స్థానిక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంధన సామర్థ్య ఉపకరణాలపై దృష్టి పెట్టింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో ఎనర్జీ ఆడిట్‌ను తప్పనిసరి చేసింది. రవాణా రంగంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ తీసుకువచ్చింది. విద్యుత్ వాహనాలు, చార్జింగ్ స్టేషన్లను ప్రోత్సహిస్తోంది. మునిసిపాలిటీల్లో విద్యుత్ ఆదా చేసే వీధి దీపాలు, నీటి పంపింగ్(ఎనర్జీ ఎఫిషియెన్సీ పంపుసెట్లు) సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ప్రసార, పంపిణీ నష్టాలను తగ్గించే చర్యలు తీసుకుంది. వ్యవసాయంలో సమీకృత నీరు, విద్యుత్ పొదుపు, పద్ధతులను ప్రోత్సహిస్తోంది. ఇలాంటి విప్లవాత్మక చర్యలు కారణంగా ఎనర్జీ ఇండెక్స్‌లో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. -
పాడి రైతుకు సంపూర్ణ రక్షణ
సాక్షి, అమరావతి: పాల సేకరణ, విక్రయాల్లో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాల సేకరణ (రైతు రక్షణ), నాణ్యమైన పాల వినియోగ చట్టం–2023 అమలుకు రంగం సిద్ధమైంది. చట్టం అమలుకు అవసరమైన ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) రూపకల్పన చేసింది. నియమ, నిబంధనలతో ఇటీవలే అధికారిక గెజిట్‌లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో ప్రతిరోజు 4.12 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. స్థానికంగా 1.42 కోట్ల లీటర్ల పాలు వినియోగమవుతుండగా, ఆర్గనైజ్డ్ డెయిరీలు 21.6 లక్షల లీటర్లు, ప్రైవేటు డెయిరీలు 47.6 లక్షల లీటర్లు సేకరిస్తున్నాయి. మిగిలిన పాలు వివిధ రూపాల్లో మార్కెట్‌కి వస్తుంటాయి. పాల సేకరణలో జరిగే మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తూనికలు–కొలతల చట్టం ప్రకారం తనిఖీ చేసే అధికారాలను స్థానిక పశు వైద్యులకు అప్పగించారు. అయితే మోసాలకు పాల్పడినట్టు నిర్ధారణ జరిగినప్పుడు మిల్క్ ఎనలైజర్స్, ఇతర పరికరాలను సీజ్ చేయడం, బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అధికారం లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తేవి. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ దేశంలోనే తొలిసారి పటిష్టమైన పాలసేకరణ, నాణ్యమైన పాల వినియోగ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. చట్టం అమలు బాధ్యత వీరిదే.. చట్టం అమలు, పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో మిల్క్ కమిషనర్‌గా, కార్యనిర్వాహక అధికారిగా పశుసంవర్ధక శాఖ సంచాలకులు వ్యవహరించనుండగా, జిల్లా స్థాయిలో ఆథరైజ్డ్ ఆఫీసర్స్‌గా జిల్లా పశుసంవర్ధక శాఖాధికారులు, మిల్క్ ఇన్స్పెక్టర్లుగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్, ఏవీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్లు వ్యవహరించనున్నారు. వీరు చట్టప్రకారం మిల్క్ ఎనలైజర్స్‌తో పాటు పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లు పనిచేసేలా పర్యవేక్షిస్తారు. పాలనాణ్యత పాటించకపోతే ఫుడ్ సేఫ్టీ, నాణ్యత ప్రమాణాల యాక్టు 2006 ప్రకారం చర్యలు తీసుకుంటారు. పాలల్లో ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతాన్ని బట్టి నిర్దేశించిన రేటు చార్ట్ ప్రకారం పాడి రైతుకు మద్దతు ధర దక్కేలా పర్యవేక్షిస్తారు. ఇందుకోసం సాఫ్ట్వేర్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. చట్టం అమలుపై రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసిన రిసోర్స్ పర్సన్స్‌కు ఇటీవలే శిక్షణ కూడా పూర్తి చేశారు. వీరి ద్వారా మండల స్థాయిలో మిల్క్ ఇన్స్పెక్టర్లుగా వ్యవహరించనున్న అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. మిల్క్ ఎనలైజర్స్కు లైసెన్సింగ్ తప్పనిసరి మిల్క్ ఎనలైజర్స్ కలిగి ఉన్న వారు రూ.1,000 చెల్లించి సంబంధిత ఆథరైజ్డ్ అధికారి నుంచి లైసెన్సు పొందాలి. ఆ తర్వాత ఏటా లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలి. అదే తయారీ దారులు, డీలర్లు ప్రతీ 2 ఏళ్లకోసారి రూ. 2 లక్షలు చెల్లించి మిల్క్ కమిషనర్ ద్వారా లైసెన్సు పొందాల్సి ఉంటుంది. లైసెన్స్ పొందిన తర్వాత మిల్క్ ఎనలైజర్స్‌ను 30 రోజులలోపు వారి పరిధిలోని మిల్క్ ఇన్స్పెక్టర్ వద్ద రూ. 500 చెల్లించి కనీసం ఏడాది పాటు చెల్లుబాటు అయ్యేలా వెరిఫికేషన్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. మిల్క్ ఎనలైజర్ లైసెన్స్, వెరిఫికేషన్ సర్టిఫికెట్‌ను పాలసేకరణ కేంద్రంలో ప్రదర్శించాలి. రికార్డులు, రిజిష్టర్లు విధిగా నిర్వహించాలి. క్రమం తప్పకుండా తనిఖీలు.. చట్టం ప్రకారం మిల్క్ ఇన్స్పెక్టర్లు.. పాల సేకరణ కేంద్రాలు, డెయిరీల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తారు. తేడా ఉన్నట్టుగా గుర్తిస్తే జరిమానా, లైసెన్సు రద్దు, కేసుల నమోదు వంటి చర్యలు తీసుకుంటారు. కల్తీ జరిగినట్టు గుర్తిస్తే తగిన చర్యల కోసం ఆహార భద్రత అధికారికి సమాచారమిస్తారు. మిల్క్ యూనియన్, డెయిరీ నిర్ధారించిన రేట్ చార్జి ప్రకారం పాలుపోసే వారికి పాలసేకరణ ధర చెల్లిస్తున్నదీ లేనిదీ కూడా పరిశీలిస్తారు. జిల్లా స్థాయిలో ఆథరైజ్డ్ అధికారిగా వ్యవహరించే అధికారులు ఈ మిల్క్ ఇన్స్పెక్టర్ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. మోసాలు, కల్తీలు జరిగినట్టుగా గుర్తిస్తే సంబంధిత రికార్డులు సహా ఆయా యూనిట్లను సీజ్ చేస్తారు. శిక్షార్హమైన నేరాలకు చట్టం ప్రకారం జరిమానాలు, కారాగార శిక్షలు విధిస్తారు. -
ఢిల్లీలో మరో మూడు,నాలుగు రోజులు విష గాలులే!
ఢిల్లీని మరోమారు పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ఫలితంగా విజిబులిటీ దెబ్బతినడమే కాకుండా జనం విషవాయువులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మంగళవారం రాజధానిలోని ఐదు ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 400 లేదా అంతకంటే ఎక్కువ అంటే ‘తీవ్రమైన’ విభాగంలోకి చేరుకుంది. మరో మూడు నాలుగు రోజులపాటు ఈ విషపూరితమైన గాలి నుంచి ఉపశమనం లభించే అవకాశం ఢిల్లీ ప్రజలకు లేదని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా గాలి దిశ, వేగం మారడంతో శని, ఆదివారాల్లో కాలుష్య స్థాయిలో కొంత మెరుగుదల కనిపించింది. అయితే ఇప్పుడు గాలిలో ఉధృతి ఏర్పడిన కారణంగా కాలుష్య స్థాయి మళ్లీ పెరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత సూర్యరశ్మి బలహీనంగా మారి వాతావరణంలో పొగమంచు కమ్ముకుంది. వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం సఫ్దర్‌జంగ్ వాతావరణ కేంద్రం వద్ద మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు దృశ్యమాన స్థాయి 1500 మీటర్ల వరకు ఉంది. సాధారణంగా రెండు వేల మీటర్లు ఉండాలి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఢిల్లీలో ఏక్యూఐ 372గా నమోదైంది. మంగళవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువగా ఉండగా, కనిష్ట ఉష్ణోగ్రత 11.5 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదైంది. గాలిలో తేమ స్థాయి 95 నుంచి 56 శాతంగా నమోదైంది. లోధి రోడ్డు అత్యంత శీతల ప్రాంతం. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 26.0 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 11.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. బుధవారం కూడా ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది కూడా చదవండి: అమేథీలో మళ్లీ రాహుల్ Vs స్మృతి? -
ఢిల్లీలో మరింత క్షీణించిన గాలి నాణ్యత.. ‘నాసా’ ఫొటోలలో కారణం వెల్లడి!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం మరింత దిగజారుతోంది. చలి తీవ్రమవుతోంది. ఢిల్లీతోపాటు ఎన్సీఆర్ ప్రాంతాల్లో గాలి నాణ్యత క్షీణిస్తోంది. పొరుగున ఉన్న పంజాబ్, హర్యానాల్లో పొల్లాల్లోని గడ్డిని తగలబెడుతూండటమే రాజధాని ప్రాంతంలో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) మరింత దిగజారేందుకు కారణమవుతోంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తాజాగా విడుదల చేసిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు, సమాచారం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. కొన్నేళ్లుగా నాసా వాతావరణ కాలుష్యంపై ఈ గడ్డి వాముల కాల్చివేత ప్రభావంపై అధ్యయనం చేస్తోంది. తాజాగా నాసా విడుదల చేసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో (దిగువన) ఎర్రటి చుక్కలు పంటపొలాల్లో కాలిపోతున్న గడ్డిని స్పష్టంగా చూపుతున్నాయి. నాసా సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ హిరెన్ జెత్వా మీడియాతో మాట్లాడుతూ పంజాబ్, హర్యానాలలో గడ్డివాములను కాల్చడం అధికమవుతున్నదని అన్నారు. కాలుష్య నియంత్రణ అధికారుల తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో గాలి నాణ్యత వరుసగా మూడవ రోజు పేలవ స్థాయిలో నమోదైంది. రాబోయే రోజుల్లో ఢిల్లీ ఏక్యూఐలో పెద్దగా మెరుగుపడే అవకాశాలు లేవు. బుధవారం ఉదయం పది గంటలకు నగరంలో సగటు వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) 238గా ఉంది. ఢిల్లీలోని సెంటర్ ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే నాలుగైదు రోజులలో నగరంలో గాలి నాణ్యత మరింత తగ్గే అవకాశం ఉంది. గాలి నాణ్యత సూచీ 500గా ఉంటే కాలుష్య స్థాయిని మరింత తీవ్రమైనదిగా పరిగణిస్తారు. గడచిన మే తర్వాత తొలిసారిగా ఆదివారం ఢిల్లీలో గాలి నాణ్యత పేలవమైన స్థాయిని చూపింది. ఉష్ణోగ్రతలు తగ్గడం, గాలి వేగం మందగించడం, పొలాల్లో గడ్డిని కాల్చడం మొదలైనవి ఢిల్లీలో కాలుష్య స్థాయి పెరగడానికి కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్‌పై గాజా ఉద్రిక్తతల ప్రభావం? ఉన్నతాధికారుల అత్యవసర సమావేశం -
‘గ్రీన్’ ప్రాజెక్టులకు రెడ్ కార్పెట్
సాక్షి, అమరావతి: వాతావరణ కాలుష్య రహిత, నాణ్యమైన విద్యుత్తు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న చర్యలతో రాష్ట్రం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం (హబ్)గా అవతరిస్తోంది. తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా, పెరుగుతున్న వాతావరణ కాలుష్యానికి విరుగుడుగా స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తేవడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో ఏపీ భాగం అవుతోంది. ఈ ప్రాజెక్టు కోసం గతేడాది కేంద్రం ఎంపిక చేసిన ఐదు రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఉంది. దీనికి అనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పాలసీ 2023ని రాష్ట్రం రూపొందించింది. తాజాగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) తయారు చేసిన నివేదిక శ్వేత పత్రాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. అందులోని వివరాలను ‘ఎన్ఆర్ఈడీసీఏపీ’ వీసీ, ఎండీ ఎస్.రమణారెడ్డి ‘సాక్షి’ ప్రతినిధికి వెల్లడించారు. సమగ్రంగా శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం సౌర, పవన విద్యుత్ వంటి స్వచ్ఛ ఇంధనాన్ని ప్రోత్సహిస్తోంది. హైబ్రిడ్ వ్యవస్థగా చెబుతున్న పంప్డ్ హైడ్రో స్టోరేజి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడుతోంది. ప్రస్తుతం రాష్ట్రానికి 9 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి స్థాపిత సామర్థ్యం ఉంది. అనేక ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో సౌర, పవన, పంప్డ్ హైడ్రో సిస్టం ప్రాజెక్టులు 24 గంటలూ విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. కొత్త టెక్నాలజీల ఆవిర్భావం, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ వంటి వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుంటోంది. తద్వారా రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ రంగంలో 10 బిలియన్ డాలర్ల నుంచి 15 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులకు అవకాశాలున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు మౌలిక సదుపాయాలు ఉన్నాయి. రాష్ట్ర అవసరాలతోపాటు ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ను ఎగుమతి చేయడానికి అవసరమైన గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్రం అనుకూలంగా ఉంది. రాష్ట్రంలో ఏటా 400 కిలో టన్నుల దేశీయ హైడ్రోజన్ డిమాండ్ ఉంది. దేశ పారిశ్రామిక హైడ్రోజన్ డిమాండ్‌లో ఇది దాదాపు 8 శాతం. ప్రతి ఏటా పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పాలసీ 2023 ప్రకారం 2030 నాటికి కనీసం 500 కిలో టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది.దీని సాయంతో శిలాజ ఇంధన వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని(డీకార్బనైజ్) భావిస్తోంది. ఇందుకోసం యాక్సిలరేటింగ్ స్మార్ట్ పవర్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ ఇండియా (ఆస్పైర్) ప్రోగ్రామ్ కింద ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ సాయంతో ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ హైడ్రోజన్ ఇన్వెస్ట్మెంట్ అవకాశాల నివేదిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం వ్యాపారాలకు, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం, పర్యావరణ వ్యవస్థలపై ‘వైట్‌పేపర్’లో వివరించారు. ఇది పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర సంసిద్ధంగా ఉందని శ్వేతపత్రంలో పొందుపరిచారు. కేంద్రం ఎంచుకున్న ఐదు రాష్ట్రాల్లో ఏపీ ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో ఐదు జాతీయ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లు ఏర్పాటు చేయాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. వీటిని 25 గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ క్లస్టర్లుగా విభజించి, వివిధ రంగాలకు ఉపయోగించుకునేలా ప్రణాళికలు రూపొందించింది. మొదటి తరం జాతీయ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులుగా పిలుస్తున్న వీటిలో పన్నెండు రసాయనాలు, రిఫైనరీ, ఉక్కు పరిశ్రమలలోని పారిశ్రామిక డీ–కార్బనైజేషన్ ప్రాజెక్టులు కాగా మూడు భారీ రవాణా ప్రాజెక్టులు, మరో మూడు సిటీ గ్యాస్ డ్రిస్టిబ్యూషన్ (సీజీడీ) ప్రాజెక్టుల్లో హైడ్రోజన్–బ్లెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. మిగిలిన ఏడు ప్రాజెక్టులు మునిసిపాలిటీల్లో వ్యర్థాల నుండి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసేవి. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో వీటి ద్వారా 2025 నాటికి 150 మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యానికి గ్రీన్ హైడ్రోజన్ పాలసీతో ఏపీ జీవం పోసింది. -
సీలింగ్ ఫ్యాన్లకు కొత్త నిబంధనలు.. అతిక్రమిస్తే భారీ జరిమానాలు
Quality Norms For Ceiling Fans: నాసిరకం వస్తువుల దిగుమతిని అరికట్టేందుకు, దేశీయంగా విద్యుత్ ఫ్యాన్ల తయారీని పెంచేందుకు ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్లకు ప్రభుత్వం తప్పనిసరి నాణ్యతా నిబంధనలను జారీ చేసింది. దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఆగస్టు 9న నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రిక్ సీలింగ్ టైప్ ఫ్యాన్స్ (క్వాలిటీ కంట్రోల్) ఆర్డర్- 2023 కిందకు వచ్చే వస్తువులు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) గుర్తును కలిగి ఉంటే తప్ప వాటిని ఉత్పత్తి చేయడం, విక్రయించడం, వ్యాపారం చేయడం, దిగుమతి చేయడం, నిల్వ చేయడం కుదరదు. ఈ నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుంచి ఆరు నెలల తర్వాత నుంచి ఇది అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్లకు ఇప్పటి వరకు ఎలాంటి బిస్ ధ్రువీకరణ నియమాలు లేవు. బిస్ చట్టం నిబంధనను ఉల్లంఘిస్తే, మొదటి నేరానికి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష లేదా కనీసం రూ. 2 లక్షల జరిమానా విధించవచ్చు. మరోసారి ఉల్లంఘనలకు పాల్పడితే కనీస జరిమానా రూ. 5 లక్షలకు పెరుగుతుంది. ఇది ఆయా వస్తువుల విలువ కంటే 10 రెట్లు వరకు ఉండవచ్చు. ఎంఎస్ఎంఈలకు సడలింపులు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ (QCO) అమలుకు సంబంధించి ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్లను తయారు చేసే దేశీయ సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు డీపీఐఐటీ సడలింపులు ఇచ్చింది. ఎంఎస్ఎంఈలకు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుంచి 12 నెలల తర్వాత ఇది అమల్లోకి వస్తుంది. -
‘ఏఐ’పంట!
కంచర్ల యాదగిరిరెడ్డి:నాగలి పోయి ట్రాక్టర్ వచ్చినప్పుడు.. యంత్రాలు సాగు చేస్తాయా? అన్నవాళ్లున్నారు.ట్రాక్టర్లకు హార్వెస్టర్లు, స్ప్రేయర్లు, ఇప్పుడు డ్రోన్లూ తోడవడంతో బాగున్నాయే అనుకున్నారు. ఆధునిక యంత్ర పరికరాల రాకతో వ్యవసాయం కొంత పుంజుకున్నా.. తర్వాతి తరాలు మాత్రం వ్యవసాయం అంటే అమ్మో అంటున్నారు.ఇలాంటి సమయంలోనే ‘చాట్ జీపీటీ’, దాని ఆధారితంగా మరిన్ని కృత్రిమ మేధ సాంకేతికతలు తెరపైకి వచ్చాయి. వ్యవసాయ రంగంపైనా ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఏఐ ఆధారిత పరికరాలు అందుబాటులోకి వచ్చాయి కూడా. మరి మొత్తంగా దీనివల్ల రైతులకు ఏం మేలు జరుగుతుంది? వ్యవసాయానికి ఏం ఒనగూరుతుంది? అంతిమంగా వచ్చేది లాభమా, నష్టమా? అన్న చర్చ సాగుతోంది. దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఇప్పటికీ వ్యవసాయం వాటా దాదాపు 50 శాతంపైనే. కోట్లమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న రంగం ఇదే. అయితే రుతుపవనాలు, మార్కెట్ పరిస్థితులు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభించకపోవడం వంటి అనేక కారణాలతో వ్యవసాయం ఇప్పటికీ ఆశల జూదంగానే మిగిలిపోయింది. ప్రభుత్వం రకరకాల పథకాలు, లాభాలు చేకూరుస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు తక్కువే. ఈ కారణంగానే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డ్రోన్లు, మెషీన్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీల వాడకం మొదలైంది. అయితే గత ఏడాది విడుదలైన ‘చాట్ జీపీటీ’ఈ ప్రస్థానాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లిందని చెప్పాలి. మైక్రోసాఫ్ట్‌కు చెందిన అజ్యూర్ ఓపెన్ ఏఐ సర్విస్ ద్వారా చాట్ జీపీటీ ఆధారంగా తయారైన‘జుగల్బందీ’చాట్‌బోట్ వీటిలో ఒకటి. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వేర్వేరు సంక్షేమ, సహాయ పథకాల వివరాలను అందిస్తుందీ సాఫ్ట్వేర్. వాట్సాప్ ద్వారా కూడా అందుకోగల ఈ చాట్ బోట్ ఇంగ్లిషులో ఉన్న ప్రభుత్వ సమాచారాన్ని పది భాషల్లోకి అనువదించి మరీ అందిస్తూండటం విశేషం. చాట్ జీపీటీ వంటి కృత్రిమ మేధ సాఫ్ట్వేర్లకు వ్యవసాయంతో ఏం పని? అని చాలామంది అనుకోవచ్చు. కానీ, దీని చేరికతో సాగు అన్ని రకాలుగా మెరుగవుతుందన్నది నిపుణుల అంచనా. సమాచారం ఎంత ఎక్కువగా ఉన్నా సెకన్లలో దానిని విశ్లేషించి రైతులకు ఉపయోగపడే కొత్త సమాచారాన్ని అందించగలగడం దీనితో సాధ్యం. నీరు, ఎరువులు, కీటకనాశనుల వంటి వనరులను అవసరమైనంత మాత్రమే వాడేలా చేయడం, పంట దిగుబడులు పెంచడంకోసం తోడ్పడగలదు. ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని తగిన సలహా, సూచనలు ఇవ్వగలదు. ప్రిడిక్టివ్ అనాలసిస్: వందేళ్ల వాతావరణ సమాచారం, మట్టి కూర్పు, పంటకు ఆశించే చీడపీడలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. వేసిన పంట ఎంత బాగా పండేది కచి్చతంగా చెప్పగలదు. దీన్నే ప్రిడిక్టివ్ అనాలసిస్ అంటారు. ఒకవేళ నష్టం జరిగే అవకాశముంటే దాన్ని వీలైనంత తగ్గించుకునే సూచనలూ అందుతాయి. గరిష్టంగా దిగుబడులు: నేల, వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు ఏ పంట వేస్తే గరిష్ట దిగుబడులు రాబట్టుకోవచ్చో గుర్తించగలదు. పంటల యాజమాన్య పద్ధతులను కూడా నిర్దిష్ట పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా సూచించగలదు. వేర్వేరు మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించి విశ్లేషించడం, సొంతంగా పంటల తాలూకు సిమ్యులేషన్లు తయారు చేసుకుని అత్యున్నత సాగు పద్ధతులు, పంటలను అంచనా వేయడం సాధ్యమవుతుంది. దీనిద్వారా పంట దిగుబడులు, వ్యవసాయ రంగ ఉత్పాదకత గణనీయంగా పెరిగే అవకాశం ఏర్పడుతుంది. ప్రిసిషన్ అగ్రికల్చర్: జనరేటివ్ ఏఐ ద్వారా వ్యవసాయంలో వ్యర్థాలను గణనీయంగా తగ్గించగల ప్రిసిషన్ వ్యవసాయం సాధ్యమవుతుంది. ఉదాహరణకు పంట పొలం మొత్తం తిరిగే డ్రోన్లు కలుపును గుర్తిస్తే.. అతితక్కువ కలుపునాశనులతో వాటిని తొలగించే ప్లాన్‌ను ఏఐ అందివ్వగలదన్నమాట. అలాగే ఏయే మొక్కలకు నీరు అవసరం? వేటికి ఎండ కావాలన్న సూక్ష్మ వివరాలను కూడా ప్రిసిషన్ అగ్రికల్చర్ ద్వారా గుర్తించి అందించవచ్చు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు, వాతావరణ సమాచారం, మట్టి కూర్పు వంటివన్నీ పరిగణించడం ద్వారా చేసే ప్రిసిషన్ అగ్రికల్చర్ ద్వారా ఖర్చులు తగ్గుతాయి. దిగుబడులు పెరుగుతాయి. కొత్త వంగడాల సృష్టి: వాతావరణ మార్పుల నేపథ్యంలో కరువు కాటకాలు, వరదల వంటివి పెరిగాయి. ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని మనగలిగిన కొత్త వంగడాల అవసరం పెరిగింది. సంప్రదాయ పద్ధతుల్లో జరిగే పరిశోధనల ద్వారా ఈ వంగడాల సృష్టికి చాలా కాలం పడుతుంది. కానీ జనరేటివ్ ఏఐను ఉపయోగిస్తే.. అధిక దిగుబడులిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకోగల వంగడాలను వేగంగా సృష్టించడం సాధ్యమని నిపు ణులు చెప్తున్నారు. జన్యు సమాచారాన్ని విశ్లేషించి ఏ రకమైన జన్యువులను తొలగిస్తే, చేరిస్తే లాభదాయకమో ఈ కత్రిమ మేధ సాఫ్ట్వేర్లు వేగంగా గుర్తించగలవు. చాట్బోట్లు.. కాల్‌సెంటర్లు భారత ప్రభుత్వం కూడా వ్యవసాయంలో జనరేటివ్ ఏఐ సామర్థ్యాన్ని గుర్తించింది. కేంద్ర ఐటీ, ఎల్రక్టానిక్స్ శాఖ వాట్సాప్ ఆధారిత చాట్‌బోట్ ఒకదాన్ని సృష్టించే ప్రయత్నాల్లో ఉంది. బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ సిద్ధం చేసిన ‘కిసాన్ ఏఐ (కిసాన్ జీపీటీ)’ఇప్పటికే పది భారతీయ భాషల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు సంబంధిత కార్యక్రమాలు, పథకాల వివరాలను అందిస్తోంది. దీంతోపాటే దిగుబడులు, ఆదాయాన్ని పెంచుకునేందుకు అవసరమైన సలహా, సూచనలు ఇస్తోంది. ప్రతినెలా కనీసం 40 వేల మంది రైతులు కిసాన్ ఏఐ ద్వారా లబ్ధి పొందుతున్నట్టు దాన్ని అభివృద్ధి చేసిన ప్రతీక్ దేశాయ్ తెలిపారు.వాధ్వానీ ఏఐ అనే స్వతంత్ర, లాభాపేక్ష లేని సంస్థ కూడా జనరేటివ్ ఏఐ సాయంతో రైతులకు వచ్చే సందేహాలను తీర్చేందుకు కిసాన్ కాల్‌సెంటర్ ఒకదాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది. వ్యవసాయ రంగ నిపుణుల అనుభవాన్ని జనరేటివ్ ఏఐతో అనుసంధానించేందుకు తాము ప్రయతి్నస్తున్నట్లు వాధ్వానీ ఏఐ తెలిపింది. డిజిటల్ గ్రీన్ పేరున్న అంతర్జాతీయ సంస్థ గూయీ ఏఐతో జట్టుకట్టి వాతావరణ మార్పులను తట్టుకునేలా రైతులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూండగా ఒడిశా వ్యవసాయ శాఖ ‘అమాకృష్ ఏఐ’ద్వారా పంటల నిర్వహణలో రైతులకు సమాచారం అందిస్తోంది. ప్రభుత్వ పథకాల వివరాలు, నలభైకు పైగా వాణిజ్య, సహకార బ్యాంకులు రైతులకు అందించే రుణ పథకాల వివరాలను ఈ చాట్‌బోట్ ద్వారా అందిస్తోంది. తెలంగాణలో ‘మిర్చి, పసుపు’ పరికరాలు మిర్చి, పసుపు పంటల్లో నాణ్యతను తేల్చేందుకు కృత్రిమ మేధ ఆధారిత పరికరాలను ఇప్పటికే వినియోగిస్తున్నారు. ఈ పంటలు ఏవైనా తెగుళ్లకు గురయ్యాయా? వాటిలోని రసాయనాల శాతం, రంగు, తేమ శాతం వంటి వాటిని నిమిషాల్లో తేల్చేస్తున్నారు. ఈ అంశాల ఆధారంగా మిర్చి, పసుపు పంటలకు గ్రేడింగ్ ఇస్తున్నారు. రైతులు తమ ఉత్పత్తులను త్వరగా మార్కెటింగ్ చేసుకోవడానికి, తగిన ధర పొందడానికి ఇది వీలు కల్పిస్తోంది. -
రంగుల్లో వరి వంగడాలు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రసాయన వ్యవసాయంలో హైబ్రిడ్ రకాల ప్రభావం పెరిగిపోతున్న ఈ రోజుల్లో దేశ వాళీ రకాల పరిరక్షణకు ఓ యువకుడు నడుం బిగించాడు. ఇంతింతై వటుడింతై అన్న చందంగా.. ఆరంభంలో ఐదు రకాల వరి వంగడాలతో సాగు మొదలుపెట్టి, నేడు 300 పైచిలుకు వరి విత్తనాలను సాగుచేస్తున్నాడు. ఎలాంటి లాభాపేక్షకు పోకుండా.. దేశవాళీ రకాలను దేశమంతా విస్తరింపజేయాలన్న సంకల్పంతో పదిమందికి పంచుతూ గొప్ప మనసు చాటుకుంటున్నాడు.. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం వ్యవసాయ విస్తరణ అధికారి యాదగిరి శ్రీనివాస్. వ్యవసాయంపై ఉన్న మక్కువకు తోడు సేంద్రియసాగులో పాలేకర్ ప్రభావంతో దేశీయవిత్తనాలను కాపాడాలనే లక్ష్యంతో తనకు ఉన్న మూడెకరాల వ్యవసాయభూమిలో సాగుచేస్తున్నాడు. పండించిన వరిధాన్యాన్ని తన అవసరాలకు పోగా, మిగిలిన వాటిని తెలుగు రాష్ట్రాల్లో వరి సాగు చేసే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా సాగుతున్నాడు. వివిధ రకాల దేశవాళీ వరి వంగడాలను ఇతర ప్రాంతాల నుండి సేకరించి ప్రకృతి వ్యవసాయ(సేంద్రీయవిధానంలో పండిస్తున్నాడు. ఇంద్రధనస్సు రంగులీనే ఈ వంగడాలు బాలింతల్లో పాల వృద్ధికి, పురుషుల్లో వీర్యవృద్ధికి ఉపయోగపడటం విశేషం. రసాయనాలు లేని సేంద్రియ సాగు చేయాలన్న ఆకాంక్షతో 2009లో పాలేకర్ శిక్షణ శిబిరానికి ఏఈవో శ్రీనివాస్ హాజరయ్యారు. దీనిలో భాగంగా మొదట్లో పరిమళ సన్నా(తమిళనాడు), పంచరత్న (ఈశాన్యరాష్ట్రాల) కాలబట్టి(బెంగాల్, దుదేశ్వర్, అంబేమహర్(మహారాష్ట్ర)లకు చెందిన ఐదు రకాల వరి వంగడాలను తీసుకొచ్చి సాగు మొదలు పెట్టాడు. దేశంలో ఒకప్పుడు ఐదువేలకుపైగా రకాలు సాగులో ఉండేవి. ఇవి మనిషి జీవితంలో బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అన్ని దశల్లోనూ కావాల్సిన పోషకాలను అందించగలవు. చిన్నారుల ఉగ్గు నుండి మొదలుకొని దేవుడి నైవేద్యం వరకు ప్రత్యేక రకాల వరి బియ్యం సాగులో ఉండేవి. ఆ రకాలను కాపాడాలన్న సంకల్పంతో ఇలా ఐదు నుంచి మొదలుపెట్టిన వరిరకాలు నేడు 300 వరివంగడాలకు చేరుకున్నాయి. శ్రీనివాస్ సాగు చేసే రకాలు.. 1) నల్లరంగు వడ్లు: పంచరత్న, కాలాబట్ట, బర్మాబ్లాక్, కరిగేజావలి, ఇల్లపు సాంబా, కరిజిద్దా, రమ్యగళి, నవార, కాకిరెక్కలు, కాలాజీరా, ముడిమురంగి, తలంగూర్, తైవాన్బ్లాక్, చిట్టిగ, కాజీసాల. 2) గోధుమ రంగు వడ్లు: మాపిళైసాంబా, కండసాగర్, ఆప్తోకల్, కస్మకుందా, హల్లబట్టా. 3) ఎరుపు రంగు వడ్లు: సేలం సన్న, చిన్న బైసి ల్మోర్, రాంశ్రీ, అరుకులోయ, కుంకుమసాలి. 4) పొట్టిగింజ వడ్లు: తులసీబాసో, డడ్డీగ, అంబేమోహర్, పరిమళ సన్న, నికో, బాలాజీ, రాధజీగేల్, బేళనాళా, జీరగసాంబా, టిక్కిమిస్రీ, సమేలీ బోగ్, బాస్ బోగ్, ఘని. 5) సువాసన వడ్లు: బాసుమతి(ఢిల్లీ, చంద్రగుప్తా, లోకల్), పరిమళ సన్న, సుగంధి, అంబేమొహర్. 6) సన్నవడ్లు: దూదేశ్వర్, చింతలూరి సన్న, ఛత్తీస్‌గఢ్, మచ్చ కాంత, డీఆర్కే2, రాణి కంద, సొనకడిక, నారాయణ కామిని, కమల్ సాంగ్రి, రత్న చోడి. 7) పొడవు వడ్లు: మల్లీపూల్, సన్నజాజులు. 8) దొడ్డు వడ్లు: నికో, బహురూపి, రెడ్ జాస్మిన్. సాగు చేసిన వాటిలో కొన్ని రకాల ప్రత్యేకతలు 1) పుంగార్: బాలింతలకు అధిక పాల వృద్ధికి దోహదపడుతుంది. 2) మపిలైసాంబా: యుక్త వయస్సు వారికి వీర్య వృద్ధికి తోడ్పడుతుంది. 3) కులాకార్: గర్బిణులకు సుఖ ప్రసవానికి ఉపయోగపడుతుంది. 4) నవారా: మధుమేహ వ్యాధి గ్రస్తులకు వ్యాధి నియంత్రణకు, నివారణకు ఉపయుక్తంగా ఉంటుంది. 5) బ్లాక్ రైస్: అన్ని రకాల నల్ల బియ్యం రోగనిరోధక శక్తి పెంపొందిస్తాయి. -
తనిఖీ అధికారి యమ.. స్పీడ్..! ఇట్టే పసిగడుతుంది..! వీడియో వైరల్..
సామాజిక మాధ్యమాల్లో కంటెంట్ ఒక్కోసారి విభిన్నరీతిలో వైరల్ అవుతోంది. ఒక్కోసారి చెప్పలేం ఏ కంటెంట్ వైరల్ అవుతుందో? ఎందుకు ఆ కంటెంట్‌ను వీక్షకులు ఇష్టపడుతున్నారో? తాజాగా ఓ క్యాలిటీ చెకింగ్ వీడియోకు గొప్పగా ఆదరణ లభించింది. కేవలం పది రోజుల్లోనే 25 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంతకూ ఈ వీడియోలో ఉన్న విషయం ఏంటంటే..? క్యాలిటీ చెకింగ్ ఆఫీసర్ పనేంటో తెలుసు కదా? పదార్థం నాణ్యతను తనిఖీ చేస్తుంటారు. వీడియోలో బియ్యం గోదాంలో బియ్యం క్వాలిటీని చెకింగ్ చేస్తుంది ఓ అమ్మాయి. అయితే.. కార్మికులు వరుసగా బియ్యం సంచులను మోసుకుంటూ వెళుతుండగా.. ఆవిడ ఒక్కరే అందరి సంచుల్లోని బియ్యాన్ని చాలా వేగంగా తనిఖీ చేస్తోంది. నాణ్యత సరిగా లేని బియ్యం సంచిని పక్కకు తీసుకురమ్మని ఆదేశిస్తోంది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈవిడ స్పీడ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Tech | Engineering | Gadgets (@techniiverse) ఇదీ చదవండి: ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్లనిపించేది ఇలాంటి సందర్భాల్లోనే కావొచ్చు..! -
మంచి మాట: నాణ్యతతో మాన్యత
నాణ్యత లేని మనిషి నాసిరకం మనిషి అవుతాడు. నాసిరకం మనిషి గడ్డిపోచకన్నా హీనం అవుతాడు. నాసిరకం మనిషి విలువలేని మనిషి, అనవసరం అయిన మనిషి అయిపోతాడు ఆపై అనర్థదాయకమైన మనిషిగానూ అయిపోతాడు. విద్య , సమాజం, సాహిత్యం, సంగీతం, కళలు, వృత్తులు, విధి నిర్వహణ... ఇలా అన్నింటా నాసిరకం మనుషులు కాదు నాణ్యమైనవాళ్లే కావాలి. నాణ్యత ఎంత కరువు అయితే అంత కీడు జరుగుతుంది. నాణ్యత ఎంత ఉంటే అంత మంచి జరుగుతుంది. నాణ్యత అన్నది సంస్కారం; మనిషికి ఉండాల్సిన సంస్కారం. నాణ్యత లోపిస్తే మనిషికి సంస్కారం లోపించినట్లే. నాణ్యత గురించి మనిషికి ఆలోచన ఉండాలి. మనిషికి నాణ్యమైన ఆలోచనలు ఉండాలి. నాసిరకం ఆహారం, నీరు తీసుకోవడంవల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది అని మనకు తెలిసిందే. నాసిరకం ఆలోచనాసరళివల్ల మన జీవితం చెడిపోతుంది అని అవగతం చేసుకోవాలి. నాణ్యమైన అభిరుచి, ప్రవర్తన, పనితీరు సాటివాళ్లలో మనకు గొప్పస్థాయిని ఇస్తాయి. చదువు నాణ్యమైంది అయితే అది వర్తమానంలోనివారికి, భావితరాలవారికి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. చదవు నాసిరకంది అయితే పెనునష్టం జరుగుతుంది. గత ఆరు దశాబ్దులుగా నాసిరకం వ్యక్తులు ఎం.ఎ., ఎం.ఫిల్., పిహెచ్.డి. పట్టభద్రులు అవడంవల్ల, నాసిరకం వ్యక్తులు సాహితీవిమర్శకులు, కవులు, అధ్యాపకులు అవడం వల్ల, నాసిరకం రచనలకు పురస్కారాలు వస్తూ ఉండడంవల్ల తెలుగుసాహిత్యం, కవిత్వం పతనం అవుతూ నిరాదరణకూ, ప్రజల ఏవగింపుకు గురి అయిపోవడం క్షేత్రవాస్తవంగా తెలియవస్తోంది; అంతేకాదు వీళ్లవల్ల తెలుగుభాష కూడా వికలం అయిపోతూ ఉంది. ఏది ప్రక్రియ అవుతుందో కూడా తెలియని నాసిరకం వ్యక్తులవల్ల మరేభాషలోనూ లేని ప్రక్రియల పైత్యం తెలుగుకవితలో ముదిరిపోయింది. నాసిరకం వ్యక్తులవల్ల మత, కుల, ప్రాంతీయత, వాదాల ఉన్మాదం తెలుగుసాహిత్యాన్ని, కవిత్వాన్ని, భాషను ధ్వంసం చేస్తోంది. ఒక నాసిరకం వైద్యుడివల్ల రోగులకు సరైన వైద్యం జరగకుండా కీడు జరుగుతుంది. నాసిరకం కట్టడాలు కూలిపోతే ప్రజలకు జరిగే నష్టం భర్తీ చెయ్యలేనిది. నాసిరకం భావజాలాలవల్ల పలువురి బతుకులు బలి అవుతూ ఉండడమే కాదు పలువురు దుష్టులై సంఘానికి హానికరం అయ్యారు, అవుతున్నారు. నాసిరకం మనస్తత్వం వల్లే అసమానతలు, నేరప్రవృత్తి వంటివి సమాజాన్ని నిత్యమూ బాధిస్తున్నాయి. నాసిరకం చదువుల వల్ల, పనితీరువల్ల, ఆలోచనలవల్ల, ప్రవర్తనలవల్ల, మనిషికీ, సమాజానికీ, ప్రపంచానికీ విపత్తులు కలుగుతూ ఉన్నాయి, ఉంటాయి. కొందరి నాసిరకం చింతనవల్ల, దృక్పథంవల్ల, పోకడవల్ల మామూలు మనుషులుగా కూడా పనికిరానివాళ్లు, సంప్రదాయానికి చెందని వాళ్లు దైవాలుగా అయిపోయి అహేతుకంగా, అశాస్త్రీయంగా ఆలయాలు, అర్చనలు, హారతులతో పూజింపబడుతూ ఉన్న దుస్థితి మనలో తాండవిస్తోంది. ఈ పరిణామం నైతికత, సంస్కృతి, ధార్మికతలకు ముప్పు అవుతోంది. ఇలాంటివి కాలక్రమంలో ప్రజల్లో చిచ్చుపెడతాయి. నాసి వాసికెక్కకూడదు; నాణ్యత మాన్యత చెరిగిపోదు. నాణ్యత ప్రతిమనిషికీ ఎంతో అవసరం. మనిషి నాణ్యతకు అలవాటుపడాలి. నాణ్యత తప్పకుండా కావాల్సింది, ప్రయోజనకరమైంది ఆపై ప్రగతికరమైంది. నాణ్యతను వద్దనుకోకూడదు, వదులుకోకూడదు. నాణ్యతను మనం అనుగమించాలి, అనుసంధానం చేసుకోవాలి. నాణ్యతతో మనం క్షేమంగానూ, శ్రేష్ఠంగానూ బతకాలి. నాణ్యమైన వృత్తికారులవల్ల వృత్తి పరిఢవిల్లుతుంది. నాణ్యమైన కళాకారులవల్ల కళ పరిఢవిల్లుతుంది. నాణ్యమైన క్రీడాకారులవల్ల క్రీడ పరిఢవిల్లుతుంది. నాణ్యమైన మనుషులవల్ల సంఘం పరిఢవిల్లుతుంది. నాణ్యతవల్ల నాణ్యత నెలకొంటుంది; నాణ్యతవల్ల భవ్యత వ్యాపిస్తుంది. మనుషులమై పుట్టిన మనం మళ్లీ మనుషులమై పుడతామో లేదో? కనుక ఈ జన్మలో నాణ్యతనే కోరుకుందాం; నాణ్యతనే అందుకుందాం. – రోచిష్మాన్ -
నాణ్యమైన మందులే లక్ష్యం.. సత్ఫలితాలనిస్తున్న ఏపీ సర్కార్ చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నూతన విధానం సత్ఫలితాలనిస్తోంది. ఈ నూతన విధానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను కూడా రూపొందించింది. దాని ఆధారంగా ఔషధ నియంత్రణ మండలి హోల్‌సేల్, రిటెయిల్ మందుల దుకాణాలు, మందుల తయారీ కంపెనీలలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడం, శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌లలో విశ్లేషించడం పకడ్బందీగా జరుగుతోంది. నాణ్యత తక్కువ ఉండే నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ (ఎన్ఎస్క్యూ) మందులను తయారు చేస్తున్న సంస్థలు, విక్రయిస్తున్న మందుల దుకాణాలపై చర్యలు తీసుకుంటోంది. దీని ఫలితంగా ఎన్ఎస్క్యూ మందులు రాష్ట్రంలో తగ్గిపోతున్నాయి. నాణ్యమైన మందులు ప్రజలకు లభిస్తున్నాయి. ఎన్ఎస్క్యూ మందులలో జాతీయ స్థాయికంటే రాష్ట్రస్థాయి సగటు తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా సగటున 4 శాతం ఎన్ఎస్క్యూ మందులు బయటపడుతుండగా, రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబరు నెలాఖరు వరకు విశ్లేషించిన నమూనాల్లో 2.5 శాతం లోపు మాత్రమే ఎన్ఎస్క్యూ నమోదు ఉంది. తనిఖీ ఎక్కడ చేయాలో యాప్ చెబుతుంది ఔషధ నియంత్రణ మండలి డ్రగ్ ఇన్స్పెక్టర్లు గతంలో వారి అభీష్టం మేరకు మందుల షాపులు, తయారీ యూనిట్లను ఎంపిక చేసుకొని తనిఖీలు చేసేవారు. ఈ విధానానికి చెక్ పెడుతూ ఎన్ఫోర్స్మెంట్లో నూతన విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. తనిఖీలు, శాంపిళ్ల సేకరణలో అధికారుల జోక్యాన్ని తగ్గించి ర్యాండమ్‌గా చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కంప్యూటర్ ఎయిడెడ్ సెలక్షన్ ఆఫ్ ఇన్స్పెక్షన్ యాప్‌ను రూపొందించింది. డ్రగ్ ఇన్స్పెక్టర్లు వారి పరిధిలోని ఏ షాప్‌లో తనిఖీ చేయాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో అలర్ట్ వెళుతుంది. వెంటనే వారు యాప్ సూచించిన షాపు, తయారీ యూనిట్లో తనిఖీలు చేసి, ఆ నివేదికలను యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. శాంపిల్స్ సేకరణలో 10కి పైగా ప్రమాణాలతో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ)ని రూపొందించారు. ఈ ఎస్‌వోపీకి అనుగుణంగా డ్రగ్ ఇన్స్పెక్టర్లు శాంపిళ్లు సేకరించి ల్యాబ్‌కు పంపాలి. దీనిద్వారా తనిఖీలు, శాంపిళ్ల విశ్లేషణ పకడ్బందీగా జరిగి, నాణ్యత తక్కువుండే మందుల తయారీ తగ్గుతోంది. తద్వారా ప్రజలకు మేలు జరుగుతోంది. 3370 నమూనాలు విశ్లేషణ రాష్ట్రంలో 353 మందుల తయారీ యూనిట్లు, 213 బ్లడ్ బ్యాంక్‌లు, 132 బ్లడ్ స్టోరేజ్ సెంటర్లు, 44,973 హోల్‌సేల్, రీటెయిల్ మందుల షాపులు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ నెలాఖరు మధ్య ఔషధ నియంత్రణ విభాగం మందుల షాపుల్లో 17,051 తనిఖీలు చేసింది. బ్లడ్ బ్యాంకులలో 289, మందుల తయారీ యూనిట్లలో 505 తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలు 3,370 నమూనాలను సేకరించి విశ్లేషించగా 2.49 శాతం అంటే 84 నమూనాలు ఎన్‌ఎస్‌క్యూగా తేలింది. ఈ ఘటనల్లో కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. చదవండి: ఎన్నికల ఏడాది 2023.. త్రిపుర నుంచి తెలంగాణ దాకా... వీలైనన్ని ఎక్కువ శాంపిళ్లు సేకరణ వీలైనన్ని ఎక్కువ శాంపిళ్లు సేకరించి, వాటిని విశ్లేషించడం ద్వారా ప్రజలకు నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచడంపై దృష్టి సారించాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పక్కాగా ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. దీంతో సత్ఫలితాలు వస్తున్నాయి. శాంపిళ్ల విశ్లేషణలో ఎన్‌ఎస్‌క్యూగా తేలినప్పుడు కేసులు నమోదు చేసి బాధ్యులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది 77 కేసులు నమోదు చేయగా, వాటిలో 36 కేసుల్లో ముద్దాయిలకు కోర్టు శిక్ష విధించింది. మిగిలిన కేసుల్లో పై కోర్టులను ఆశ్రయించి బాధ్యులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నాం. – రవిశంకర్ నారాయణ్, డైరెక్టర్ జనరల్ -
ఖరీదైన రెస్టారెంట్.. బిల్లుచూసి కళ్లు తేలేసిన నెటిజన్లు.. ఏకంగా రూ.1.3 కోట్లు!
టర్కీకి చెందిన ప్రముఖ చెఫ్ నుస్రెత్ గోక్సె.. 'సాల్ట్ బే'గా చాలామందికి సుపరిచితమే. రెస్టారెంట్లో ఆహార పదార్థాలపై మోచేతి పైనుంచి ఉప్పుచల్లే ఈయన తీరుతో బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు పలు దేశాల్లో రెస్టారెంట్లు కూడా నిర్వహిస్తున్నారు. వీటిలో ధర కాస్త ఎక్కువే. గతేడాది లండన్‌లో ఈయన రెస్టారెంట్‌లోని ధరలు చూసి అందరూ అవాక్కయ్యారు. మరీ ఇంత ఎక్కువా అని వాపోయారు. ఇప్పుడు అబుధాబిలోని సాల్ట్ బేకు చెందిన నుస్రే-ఈటీ రెస్టారెంట్లో ఓ బిల్లు చూసి నెటిజన్లు కంగుతిన్నారు. ఈ బిల్లు మొత్తం 6,15,065 దిర్హాంలు. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే.. అక్షరాలా రూ. కోటి 30 లక్షలు. మొత్తం 10 మంది కలిసి అబుధాబిలోని సాల్ట్ బే రెస్టారెంట్‌కు వెళ్లారు. ఎక్కువగా ఆల్కహాలే ఆర్డర్ చేశారు. అందులో చాలా ఫేమస్ అయిన పిట్రస్ వైన్ కూడా ఉంది. 2009 నాటి ఈ వైన్‌కే దాదాపు రూ.కోటి రూపాయల బిల్లు అయింది. ఇతర ఫుడ్, వ్యాట్‌తో కలిపి మొత్తం రూ.1.3 కోట్ల బిల్లు అయింది. ఈ బిల్లు రషీదును స్వయంగా తన ఇన్స్టాగ్రాం ఖాతాలో షేర్ చేశాడు సాల్ట్ బే. 'నాణ్యత ఎప్పుడూ ఖరీదైనది కాదు'ని రాసుకొచ్చాడు. దీంతో నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. మరీ ఆ రేంజ్లో ధరలు ఏంటని సాల్ట్బేను కొందరు ఏకిపారేశారు. కొంతమందైతే అతడ్ని అన్‌ఫాలో కూడా చేశారు. ఎందుకంత ధర..? అయితే ఈ బిల్లులో ఫ్రెంచ్ ఫ్రైస్ ధర 45 డాలర్లు(రూ.3,600)గా ఉంది. దీంతో ఓ నెటిజన్.. బంగాళాదుంపలు ఏమైనా చంద్రుడిపై కాస్తున్నాయా? ఎందుకంత ధర అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. హైన్కీన్ బీరు ధర కూడా 55 డాలర్లుగా ఉంది. ఇది ఒక్క బీరు ధరా? లేక 12 బీర్ల ప్యాక్కా? అని ఓ యూజర్ సెటైర్లు వేశాడు. మరో నెటిజన్ అయితే.. సాల్ట్ బేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. నవ్వు పేద కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి స్వతహాగా ఈ స్థాయికి చేరుకున్నావు. నిన్ను చాలా మంది ఆదర్శంగా తీసుకుంటారు. కానీ నీ రెస్టారెంట్లో ధరలు ఇంత ఎక్కువగా ఎందుకున్నాయి. కేవలం సంపన్నుల కోసమేనా. నువ్వు చెఫ్ కాదు చీప్ అంటూ ఫైర్ అయ్యాడు. మరోవైపు సాల్ట్ బే మాత్రం ఈ బిల్లుపై వస్తున్న విమర్శలు అసలు పట్టించుకోలేదు. తన స్టయిల్లోనే ముందుకు సాగుతున్నాడు. ఓ స్టీక్కు(కాల్చిన మాంసం ముద్ద) గోల్డ్ కోట్ చేసి ఉన్న ఫోటో షేర్ చేశాడు. ఫెడరల్ బ్యాంక్ 24 క్యారట్ల బంగారంతో ఈ స్టీక్కు కోటింగ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో నెటిజన్లు మరోసారి షాక్ అయ్యారు. చదవండి: కిక్కిరిసిన అభిమానులు.. భయానక పరిస్థితి.. కొంచెం అటు ఇటు అయినా.. -
చదువు వెనుక‘బడి’!
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్య నాణ్యత సూచీలో తెలంగాణ వెనుకబడింది. రాష్ట్రంలోని బడుల్లో మౌలిక సదుపాయాల లేమి, ఉపాధ్యాయుల కొరతతో విద్యా ప్రమాణాలు తగ్గిపోయాయని కేంద్రం వెలువరించిన ‘పర్ఫార్మెన్స్ ఇండెక్స్ గ్రేడ్ (పీఐజీ)’ నివేదిక తేల్చింది. దేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి చూస్తే.. పాఠశాల విద్య నాణ్యతలో తెలంగాణ 31వ స్థానంలో ఉన్నట్టు పేర్కొంది. గత ఏడాదికన్నా ఐదు పాయింట్లు తగ్గిపోయి దిగువ నుంచి ఏడో స్థానంలో నిలిచినట్టు తెలిపింది. వేలకొద్దీ స్కూళ్లలో ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని, బోధనతోపాటు పర్యవేక్షణ కూడా సరిగా లేదని పేర్కొంది. మనకన్నా వెనుక ఈశాన్య రాష్ట్రాలే.. పాఠశాలల్లో అభ్యసన ఫలితాలు, మౌలిక వసతులు, ప్రభుత్వ పాలన (గవర్నెన్స్), విద్యార్థుల నమోదు వంటి అంశాల ఆధారంగా ఏటా ‘పీఐజీ’ సూచీని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఆయా అంశాల ఆధారంగా 2020–21 సంవత్సరానికి సంబంధించి తెలంగాణకు 754 పాయింట్లు వచ్చాయి. అంతకుముందు 2019–20 పీజీఐలో రాష్ట్రం 759 పాయింట్లు పొందడం గమనార్హం. ఈసారి తెలంగాణకన్నా దిగువన సిక్కిం (751 పాయింట్లు), మణిపూర్ (741), నాగాలాండ్ (728), ఉత్తరాఖండ్ (719), మేఘాలయ (716), అరుణాచల్‌ప్రదేశ్ (669) మాత్రమే నిలిచాయి. కేరళ, మహారాష్ట్రలు 928 పాయింట్లతో అన్నింటికన్నా ముందంజలో ఉన్నాయి. బోధన, పర్యవేక్షణ రెండూ కొరతే! రాష్ట్రంలో పీఐజీ తగ్గడానికి మౌలిక వసతుల లేమి, ఉపాధ్యాయుల కొరత ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో (గురుకుల, రెసిడెన్షియల్ కాలేజీలు కలిపి) 69,15,241 మంది చదువుతున్నారు. ప్రభుత్వ రంగ విద్యాసంస్థల్లో 33,03,699, ఎయిడెడ్ 90,601, ప్రైవేటు సంస్థల్లో 35,14,380 మంది విద్యార్థులున్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ 18 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి స్కూల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉందని ఉపాధ్యాయ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి 22గా ఉన్నప్పటికీ.. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత, ప్రాథమిక పాఠశాలల్లో ఒకరిద్దరు టీచర్లతోనే నడిపించే పరిస్థితి ఉంది. 8,630 మంది భాషా పండితులు, పీఈటీ పోస్టులు స్కూల్ అసిస్టెంట్ స్థాయికి అప్‌గ్రేడ్ కాలేదు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం 4,207 పీఎస్ హెచ్ఎం పోస్టులుండగా.. 2,386 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగతావి 1,821 ఖాళీలున్నాయి. కొత్తగా 5,793 పోస్టులను మంజూరు చేయాల్సి ఉంది. ఇక పాఠశాల విద్యను పర్యవేక్షించాల్సిన డీఈవోలు, ఎంఈవోలు పూర్తిస్థాయిలో లేరు. ఇప్పటికీ 12 జిల్లాలకే డీఈవోలు ఉన్నారు. 21 జిల్లాలకు డీఈవో పోస్టులను మంజూరు చేసినా భర్తీ చేయలేదు. 602 మండలాలను ఎడ్యుకేషన్ బ్లాకులుగా చేశారు. అందులో కేవలం 20 మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలు ఉన్నారు. దీంతో హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయులకే అదనపు బాధ్యతలు ఇచ్చారు. అంతేకాదు ఒక్కో హెచ్ఎంకు ఆరేడు మండలాలు అప్పగించారు. దీనివల్ల పాఠశాలల్లో విద్యా బోధన, పర్యవేక్షణకు ఇబ్బంది కలుగుతోంది. మౌలిక వసతుల కరువుతో.. పర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లో మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ‘మన ఊరు–మనబడి’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది ఇంకా వేగం పుంజుకోలేదని.. రాష్ట్రంలోని ప్రతి స్కూల్లో సమస్యలు కనిపిస్తున్నాయని ఉపాధ్యాయ వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని 38వేల బడుల్లో శౌచాలయాలు ఉన్నా, వాటిలో 10వేల వరకు పనికిరాని స్థితిలో ఉన్నాయి. బాలికలు ఎక్కువగా ఉండే 5,700 స్కూళ్లలోనూ శౌచాలయాల పరిస్థితి దారుణంగా ఉంది. ఇది బాలికల గైర్హాజరు పెరగడానికి కారణం అవుతోంది. రాష్ట్రంలో దాదాపు 20వేల స్కూళ్లలో విద్యార్థులకు లైబ్రరీ అనేదే తెలియదు. లైబ్రరీ ఉన్నా అందులో పుస్తకాలు శూన్యం. 15వేల బడుల్లో ఆటస్థలాలు లేవు. దీనివల్ల విద్యార్థుల్లో మానసికోల్లాసం నష్టమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 40,437 స్కూళ్లకు విద్యుత్ సౌకర్యమున్నా.. 38,920 స్కూల్స్‌లోనే సరిగా సరఫరా జరుగుతోంది. డిజిటల్ విద్య వైపు దేశం అడుగులేస్తున్నా.. మన రాష్ట్రంలో ఇప్పటికీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేని స్కూళ్లు 20వేలకుపైగా ఉన్నాయి. ఇవన్నీ విద్య ప్రమాణాలపై ప్రభావం చూపుతున్నాయని పీఐజీ నివేదిక పేర్కొంది. కేంద్రం తీసుకున్న డేటా పాతది పీజీఐ నివేదికను పరిశీలించాం. వాళ్లు తీసుకున్న డేటా పాతది. అప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయి. మౌలిక వసతుల మెరుగుకు మన ఊరు–మన బడి ప్రారంభించాం. ఇప్పటికే చాలా స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నాం. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యలో అనేక మార్పులు చేస్తున్నాం. బోధనా ప్రమాణాలు మెరుగు పరుస్తున్నాం. వచ్చే ఏడాది మనం మంచి ర్యాంకు సాధిస్తాం. – వాకాటి కరుణ, విద్యాశాఖ కార్యదర్శి వచ్చే ఏడాది గ్రేడ్–1లో ఉంటాం ఈ నివేదిక మొత్తం కోవిడ్ కాలంలో జరిగిన పరిశీలనే. పర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లో పాయింట్స్ తగ్గినా మనం గ్రేడ్–2లోనే ఉన్నాం. కోవిడ్ సమయంలో స్కూల్స్ తెరవలేదు. అందుకే బయోమెట్రిక్ హాజరు వాడలేదు. దాన్ని కొలమానంగా తీసుకోలేం. అదీగాక కోవిడ్ వల్ల రాష్ట్రంలో విద్యా వలంటీర్లను కూడా నియమించలేదు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. కాబట్టి వచ్చే ఏడాది పీఐజీలో మనం గ్రేడ్–1లో ఉండటం ఖాయం. – దేవసేన, పాఠశాల విద్య డైరెక్టర్ టీచర్ల కొరత తీర్చితే నాణ్యత పెరుగుతుంది రాష్ట్రంలో టీచర్ల బదిలీలు, పదోన్నతులు కల్పించకపోతే ఉపాధ్యాయ కొరత ఎలా తీరుస్తారు? ప్రతి స్కూల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. ముందు దీన్ని పరిష్కరించాలి. అప్పుడు ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తే పాఠశాల విద్యలో నాణ్యత మెరుగుపడుతుంది. – చావా రవి, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పారదర్శకత పెంచాలి ప్రైవేటు స్కూళ్లకు అనుమతి ఇచ్చే క్రమంలో ఆన్లైన్ విధానం ఉండాలి. ఈ తరహా పారదర్శకత అవసరం. డిజిటలైజేషన్ చేపట్టాలి. సకాలంలో నిధులు ఇవ్వాలి. అప్పుడే విద్యాశాఖలో నాణ్యత పెరుగుతుంది. – పి.రాజాభానుచంద్ర ప్రకాశ్, హెచ్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం; రాళ్ల నాణ్యత పరిశీలన
పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వినియోగించే రాళ్ల నాణ్యత ప్రమాణాలను కేంద్ర జలసంఘంలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ సెంటర్ (సీఎస్ఎం ఆర్ఎస్) బృందం సభ్యులు పరిశీలించారు. సీఎస్ఎంఆర్ఎస్ సభ్యులు సందీప్ దనో త్, ఉదయ్ శుక్రవారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుని పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. గైడ్ బండ్(రాతి గోడ) నిర్మాణానికి ఉపయోగించే రాళ్లను పరీక్షించారు. ఒక కిలోమీటరు పరిధిలో 53 మీటర్ల ఎత్తున రాతి గోడ నిర్మించాల్సి ఉంది. ఇప్పటి వరకు 42 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణం పూర్తయింది. ఈ పనులు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయాన్ని కూడా వీరు ఆరా తీశారు. ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్న ల్యాబ్‌లో కొన్ని పరీక్షలు నిర్వహించారు. శనివారం కాఫర్ డ్యామ్ నిర్మాణ పనులను కూడా పరిశీలించనున్నారు. వీరి వెంట డీఈ శ్రీనివాసరావు, క్వాలిటీ కంట్రోల్, వ్యాబ్‌కోస్ అధికారులు ఉన్నారు. (క్లిక్: ‘బల్క్’ కుట్ర బహిర్గతం.. టీడీపీ పన్నాగం బట్టబయలు) -
మనబడి నాడు–నేడు.. నాణ్యతకు పెద్దపీట
సాక్షి, అమరావతి: మనబడి నాడు–నేడు పనుల్లో నాణ్యతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ స్కూళ్లలో చేపడుతున్న మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల నిర్మాణాలు కనీసం 80ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండేలా నాణ్యతకు పెద్దపీట వేస్తోంది. అంతేకాక.. వాటి నిర్వహణకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగా.. ఇప్పటికే స్కూళ్లు, టాయిలెట్ల నిర్వహణకు నిధులను అందుబాటులో ఉంచింది. అలాగే, పాఠశాలల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఓ ఐఏఎస్ అధికారిని సైతం ఇటీవలే నియమించింది. క్షేత్రస్థాయిలో పనుల నాణ్యత తనిఖీ ఇక గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏకంగా రూ.16,450 కోట్ల అంచనాలతో పనులను చేపడుతోంది. ఇప్పటికే మనబడి నాడు–నేడు తొలిదశలో 15,715 స్కూళ్లలో మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు వాటి రూపురేఖలను విజయవంతంగా మార్చింది. ఇప్పుడు రెండో దశలో ఏకంగా రూ.8వేల కోట్ల వ్యయంతో 22,344 స్కూళ్లలో మౌలిక సదుపాయాలు, అదనపు గదుల నిర్మాణాలను చేపట్టింది. వీటిని అత్యంత నాణ్యతతో చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడొద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. నాడు–నేడు కింద సమకూరుతున్న విద్యా సంస్థల ఆస్తులు కనీసం 80 ఏళ్ల పాటు మన్నికతో ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఇందులో భాగంగా ప్రతీ దశ పనుల్లోనూ క్షేత్రస్థాయిలో నాణ్యతను తనిఖీ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇందుకోసం.. పనులు అమలుచేస్తున్న ఏజెన్సీలు, తనిఖీలు చేసే ఇంజనీర్లకు స్పష్టమైన మార్గదర్శకాలను కూడా జారీచేసింది. మార్గదర్శకాలు ఇవే.. ⇒ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఎమినిటీస్ కార్యదర్శి తమ పరిధిలోని నూటికి నూరు శాతం స్కూళ్లలో నాడు–నేడు పనులను రోజు విడిచి రోజు తనిఖీ చేయాలి. ⇒మండల ఇంజనీర్ అన్ని స్కూళ్ల పనులను కనీసం 15 రోజులకోసారి సందర్శించి పనులను పరిశీలించాలి. ⇒డిప్యూటీ ఈఈ నెలలో కనీసం 30 స్కూళ్లను సందర్శించాలి. ⇒ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నెలలో 10 స్కూళ్లలో నాడు–నేడు పనుల నాణ్యతను తనిఖీచేయాలి. ⇒ఇక క్వాలిటీ కంట్రోల్ బృందాలు నెలలో 20 స్కూళ్లకు వెళ్లాలి. ⇒ఎస్ఈ, సీఈ నెలలో కనీసం ఐదు స్కూళ్లను పరిశీలించాలి. ⇒ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ రెండు శాతం పనులను, థర్డ్ పార్టీ రెండు శాతం పనులను తనిఖీలు చేయాలి. ⇒తనిఖీలు చేసే ఇంజనీర్లందరికీ మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులో ఉంచుతారు. ⇒తనిఖీల నివేదికలను ఈ అప్లికేషన్ ద్వారా సంబంధిత శాఖలకు పంపాలి. ⇒తనిఖీల సమయంలో తమ దృష్టికి వచ్చిన అంశాలను సంబంధిత క్షేత్రస్థాయి అధికారులకు, ఏజెన్సీలకు తెలియజేయాలి. చదవండి: మునుపెన్నడూ ఇటు చూడని పారిశ్రామిక దిగ్గజాలు.. ఇప్పుడు ఏపీకీ వస్తున్నారు -
Semicon India 2022: సెమికండక్టర్ల హబ్‌గా భారత్
బెంగళూరు: పారిశ్రామికవేత్తలు, తయారీదార్లకు కేంద్రం విధానపరంగా పూర్తి అనుకూల వాతావరణం కల్పిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశాన్ని ప్రపంచ సెమికండక్టర్ల హబ్‌గా మార్చాలని పరిశ్రమ వర్గాలకు పిలుపునిచ్చారు. అత్యున్నత సాంకేతికత, నాణ్యత, విశ్వసనీయతకు పెద్దపీట వేయాలన్నారు. శుక్రవారం బెంగళూరులో ‘సెమికాన్ ఇండియా–2020’ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధాని మాట్లాడారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో, సవాళ్లను స్వీకరించే విషయంలో భారత్ ముందంజలో ఉంటుందన్నారు. 2026 నాటికి దేశీయంగా 80 బిలియన్ డాలర్ల విలువైన, 2030 నాటికి 110 బిలియన్ డాలర్ల విలువైన సెమికండక్లర్ల అవసరమన్నారు. మరిన్ని ప్రోత్సాహకాలు గత ప్రభుత్వాలు సెమికండక్టర్ల డిజైనింగ్ పరిశ్రమను ప్రోత్సాహించలేదని మోదీ ఆక్షేపించారు. ‘‘ఈ పరిశ్రలో దేశంలో ప్రతిభకు కొదవ లేదు. ప్రపంచంలో సెమికండక్టర్ల డిజైన్ ఇంజనీర్లలో 20 శాతం మన దగ్గరే ఉన్నారు. భారత్‌ను సెమికండక్టర్ హబ్‌గా మార్చడానికి ఆచరణ యోగ్యమైన సలహాలు, సూచనలివ్వండి. 130 కోట్ల మంది భారతీయులను అనుసంధానించడానికి డిజిటల్ మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. 6 లక్షల గ్రామాలను బ్రాడ్‌బ్యాండ్‌తో కలుపుతున్నాం’’ అని తెలిపారు. 5జీ టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రాబోతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. సిక్కులపై ప్రధాని ప్రశంసలు న్యూఢిల్లీ: విదేశాలతో బంధాల బలోపేతానికి సిక్కు వర్గీయులు అనుసంధానంగా ఉన్నారంటూ మోదీ కొనియాడారు. ఇందుకు యావత్ దేశం గర్వపడుతోందన్నారు. సిక్కు ప్రతినిధి బృందానికి శుక్రవారం తన నివాసంలో ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా ఎర్ర తలపాగా చుట్టుకొని ఆకర్షించారు. -
ప్చ్.. వీళ్లింతే.!
ఆహార తనిఖీ ప్రత్యేక బృందం తమ తనిఖీలింతేనని మరోసారి చాటుకుంది. మంగళవారం జిల్లా కేంద్రంలో ప్రత్యేక బృందం మొక్కుబడి తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంది. ఇప్పటికే జిల్లాలో సదరు విభాగం ఖాళీలతో కునారిల్లుతుండగా.. ప్రత్యేక తనిఖీ బృందం నామమాత్రంగా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రవ్యాప్త తనిఖీల్లో భాగంగా ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయగా జిల్లాలో జరిగిన తనిఖీలు మాత్రం తూతూమంత్రంగా ముగించడం విడ్డూరం. మీడియాకు సమాచారమివ్వకుండా మొత్తానికి అయ్యిందనిపించారు. – కరీంనగర్ అర్బన్ మొక్కుబడిగా శాంపిళ్ల సేకరణ ఆయిల్ ట్రేడర్లు, బేకరీలు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, పండ్ల దుకాణాలు, కేఫ్‌లు, కూల్‌డ్రింక్ షాపులు, చిరుతిళ్ల తయారీ కేంద్రాలు, ఇతర నిత్యావసర సరుకుల కల్తీకి ముకుతాడు వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక తనిఖీలకు శ్రీకారం చుట్టింది. కానీ.. జిల్లా కేంద్రంలో జరిగిన తనిఖీలు మాత్రం నవ్విపోదురు గాక.. అన్నట్లు సాగింది. ప్రత్యేక బృందం మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ వాహనంతో అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి కేసులు నమోదు చేయాల్సి ఉండగా సదరు వాహనం జాడే లేకపోవడం విచిత్రం. మొక్కుబడిగా పలు దుకాణాలను తనిఖీ చేసినట్లు చేసి శాంపిళ్లను సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. 15 రోజుల అనంతరం సదరు ఫలితాలు రానుండగా అప్పుడు కేసులు నమోదు చేయనున్నారు. కల్తీరాయుళ్ల వైపు కన్నెత్తని అధికారులు కాగా.. తనిఖీలు ఒకరిద్దరి కనుసన్నలో సాగినట్లు తెలుస్తోంది. ప్రకాశంగంజ్లోని పలువురు వ్యాపారులు, బొమ్మకల్, తీగలగుట్టపల్లి, అల్గునూరు, కోతిరాంపూర్, పద్మనగర్, విద్యానగర్, రేకుర్తి పలు ప్రాంతాల్లో కల్తీ వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోంది. సన్ఫ్లయిర్ ఆయిల్‌కు కొరత ఏర్పడటంతో పెద్ద ఎత్తున సూపరోలిన్ ఆయిల్ కలుపుతున్నారు. లీటరు నూనెపై అదనంగా రూ.70–80 వరకు లాభం పొందుతున్నారు. ఇంత జరుగుతుంటే ప్రత్యేక టీమ్ మాత్రం తనిఖీలు చేశామన్నట్లు చేసి చేతులు దులుపుకున్నారు. సూపరోలిన్ ఆయిల్ అంటే పామాయిల్ బ్లెండింగ్ చేసి పామోలిన్ తయారు చేస్తారు. దీన్ని మరింత రిఫైన్ చేస్తే సూపరోలిన్ ఆ యిల్ వస్తుంది. ఇది చూడ్డానికి వాటర్ లాగే ఉంటుంది. సన్‌ఫ్లవర్ కంటే తక్కువ ధరకే లభిస్తుంది. పైగా అందులో కలిపినా ఎం తేడా కనిపించదు. విజృంభిస్తున్న కల్తీ మాఫియా శివారు ప్రాంతాల్లో గోడౌన్లను కేంద్రంగా చేసుకుని కల్తీకి పాల్పడుతున్నారు. పామాయిల్, తవుడు నూనెలను కలుపుతూ వేరుశనగ, పొద్దుతిరుగుడు నూనెల పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని పటిష్టం చేయడంలేదు. జిల్లా కేంద్రం జనాభా 3 లక్షలకు పైమాటే. జిల్లా జనాభా 10 లక్షలు కాగా.. ఆహార తనిఖీలో అన్ని పోస్టులూ ఖాళీగా ఉండటం ఆందోళనకర పరిణామం. అసలు తనిఖీలే లేవ్ ఆహార తనిఖీ విభాగం ప్రతీ నెలలో తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. ► గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు ఒక్కొక్కరికి నిర్ణీత లక్ష్యముంటుంది. ► ఆరు నెలలుగా అధికారే లేక కార్యాలయం వెలవెలబోతోంది. ► ఉన్న పోస్టులన్నీ ఖాళీయే కాగా ఇన్చార్జి అధికారితో నెట్టుకొస్తున్నారు. ► ఒక గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్తో పాటు ఇద్దరు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, ఒక క్లర్క్, ఇద్దరు అటెండర్లు కార్యాలయంలో విధులు నిర్వహించాల్సి ఉంది. ► అయితే 1985లో అప్పటి జనాభా ప్రాతిపదికన పోస్టులు మంజూరు చేయగా నేడు జనాభా పదింతలు పెరిగినప్పటికి అదే విధానం కొనసాగడం విడ్డూరం. పోనీ అప్పటి మంజూరు పోస్టుల ప్రకారం అధికారులూ లేరు ► దీంతో ఆహార తనిఖీ ప్రక్రియ అటకెక్కడంతో కల్తీ మాఫియా ప్రజల ప్రాణాలతో రాజ్యమేలుతోంది. ► ఇన్చార్జి పాలనతో ఎప్పుడొస్తారో.. ఎప్పుడుంటారో తెలియని పరిస్థితి. ► ఫిర్యాదు చేసినా ఆహార తనిఖీ అధికారులు పట్టించుకోని క్రమంలో రాష్ట్రస్థాయిలో ఫిర్యాదు చేయొచ్చు ఫోన్ నంబర్ 9100105795 చదవండి: మొదటి సారి దొంగతనం, అంతా అనుకున్నట్లే జరిగింది.. కానీ చివరిలో.. -
పీల్చే గాలిని సైతం విషంగా మార్చిన ఉక్రెయిన్ యుద్ధం!
Lot of smoke in Kyiv, people can't breathe properly: రష్యా ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. ప్రధాన నగరాలే లక్ష్యంగా పెద్ద ఎత్తున క్షిపణి దాడులు నిర్వహిస్తోంది. దీంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ మొత్తం దట్టమైన పొగ మేఘంతో కప్పబడి ఉంది. దీంతో ఉక్రెయిన్ అధికారులు గాలి నాణ్యత.. అనారోగ్యకరమైన స్థాయిలో ఉందని నివాసితులు తమ కిటికీలు తెరవవద్దని, అనవసరంగా తమ ఇళ్లను విడిచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక వాయు నాణ్యత మార్గదర్శక విలువ కంటే ప్రస్తుతం కీవ్‌లోని గాలిలో కాలుష్య కారకాల సాంద్రత 27.8 రెట్లు ఎక్కువగా ఉందని ఓ నివేదిక తెలిపింది. మార్చి19 నుంచి వాయు నాణ్యత ప్రమాదకరంగా ఉందని నివేదిక పేర్కొంది. అంతేకాదు కీవ్‌లో పొగ ఎక్కువగా ఉందని, ప్రజలు సరిగా ఊపిరి పీల్చుకోలేకపోతున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. అతేకాదు గాలిలో పొగలు కమ్ముకుంటున్నందున ప్రజలు తమ కిటికీలు తెరవవద్దని, అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని నగర పాలక సంస్థ కూడా ప్రజలను కోరింది. ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి కీవ్‌లో అనేక పేలుళ్లు, వైమానిక దాడులు జరుగుతున్నాయి. దీంతో దాదాపు అన్ని జిల్లాల్లో గాలి నాణ్యత గణనీయంగా పడిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. ఉక్రెయిన్- రష్యా వార్ ముఖ్యాంశాలు ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధం ప్రకటించి 24 రోజులైంది. ఐక్యరాజ్యసమిది నివేదిక ప్రకారం, 3.2 మిలియన్ల మంది ప్రజలు దేశం నుంచి పారిపోగా, మరో 6.5 మిలియన్ల మంది ఉక్రెయిన్‌లోని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఈ యుద్ధంలో వందలాది మంది పౌరులతో పాటు, 112 మంది పిల్లలు మరణించారని దాదాపు 13 వేల మంది రష్యా సైనికులు మృతి చెందారని ఉక్రెయిన్ పేర్కొంది. యుద్ధాన్ని ఆపడానికి, అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించాయి. అయితే, అధ్యక్షుడు జెలెన్స్కీ పదేపదే అభ్యర్థనలు చేసినప్పటికీ, నాటో నేరుగా పాల్గొనడానికి లేదా ఉక్రెయిన్‌పై నో-ఫ్లై జోన్‌ను ఏర్పాటు చేయడానికి నిరాకరించింది. ఉక్రెయిన్, రష్యాలు శాంతి చర్చలు జరుపుతున్నాయి. ఉక్రేనియన్ అధికారులతో చర్చలు జరుపుతున్న రష్యా ప్రతినిధి బృందం శుక్రవారం ఒక ఒప్పందానికి దగ్గరగా వచ్చాయని చెప్పారు. (చదవండి: పాపం మూగజీవాలు..యుద్ధం వల్ల మనుషులకే కాదు పశువులకు ఇబ్బందులే!) -
ఇండెక్స్ ఫండ్స్.. ఆప్షన్లు ఎన్నో..!
మ్యూచువల్ ఫండ్స్‌లో ప్యాసివ్ ఫండ్స్ (ఇండెక్స్ ఫండ్స్)కు ఆదరణ పెరుగుతోంది. రెండేళ్ల క్రితం ప్యాసివ్ ఫండ్స్ నిర్వహణలో రూ.8,000 కోట్ల ఆస్తులు ఉంటే.. అవి ఇప్పుడు రూ.50,000 కోట్లకు పెరగడం ఇందుకు నిదర్శనం. ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు, లార్జ్‌క్యాప్ యాక్టివ్ ఫండ్స్ పనితీరు అంత ఆశాజనకంగా లేకపోవడం, తక్కువ వ్యయాలు.. వెరసి ప్యాసివ్ ఫండ్స్‌కు ఆదరణ విస్తరిస్తోంది. ఆయా సూచీల్లోని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేవే ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ పనితీరు స్థాయిలో రాబడులను అందించడం వీటి ప్రత్యేకత. యాక్టివ్ ఫండ్స్‌తో పోలిస్తే వీటిల్లో నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. మరి రాబడులు సంగతి ఏమిటి? ఇండెక్స్ ఫండ్స్‌లో అసలు ఎన్ని రకాలున్నాయి? తమ లక్ష్యానికి అనుకూలమేనా? వీటికి సమాధానమే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం. నేడు వివిధ సూచీలను అనుసరించి పెట్టుబడులు పెట్టే ఇండెక్స్ ఫండ్స్ 50 వరకు ఉన్నాయి. లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్, మూమెంటమ్, క్వాలిటీ ఇలా ఎన్నో విభాగాల్లో ప్యాసివ్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్‌ను తీసుకుంటే.. ఈ పథకం నిఫ్టీ–50లోని కంపెనీల్లో వాటి వెయిటేజీకి తగినట్టు పెట్టుబడులు పెడుతుంది. ఇందులో ఫండ్ మేనేజర్ ప్రమేయం పెద్దగా ఉండదు. కానీ, యాక్టివ్ ఫండ్స్ అలా కాదు. ఆయా పథకం పెట్టుబడుల విధానాన్ని అనుసరించి ఇండెక్స్‌లో కాకుండా.. మంచి వృద్ధికి అవకాశం ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వీటిని యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్ అంటారు. వీటిల్లో రాబడులు ఫండ్స్ మేనేజర్ నైపుణ్యాలపైనే ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే పెట్టుబడులు ఎక్కడ పెట్టాలన్న స్వేచ్ఛ వారికి ఉంటుంది. మార్కెట్ పరిస్థితులు, కంపెనీల్లో జరిగే పరిణామాలు, ఆకర్షణీయమైన అవకాశాలకు అనుగుణంగా వీరు పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేస్తూ ఉంటారు. అధిక రాబడులను ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తుంటాయి. కనుక వీటిల్లో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంటుంది. ఎందుకనో గానీ, గతంతో పోలిస్తే మన మార్కెట్ కొంత పరిపక్వత సాధించిన నేపథ్యంలో ఏవో కొన్ని మినహాయిస్తే యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్ రాబడులు సూచీలతో పోలిస్తే ఏమంత మెరుగ్గా ఉండడం లేదు. అందు కనే ప్యాసివ్ ఫండ్స్ మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇండెక్స్ ఫండ్స్ మార్కెట్ గణనీయంగా ఉంటుంది. మన దగ్గరే ఇది ఇంకా మొగ్గ దశలోనే ఉంది. యూఎస్ మార్కెట్లో మొత్తం మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల్లో 35% ప్యాసివ్ ఫండ్స్ నిర్వహణలో ఉన్నాయి. లార్జ్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ అన్నింటిలోకి లార్జ్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్స్‌కు ఎక్కువ ఆదరణ ఉంది. ఎందుకంటే లార్జ్‌క్యాప్ విభాగంలోనే ఎక్కువ యాక్టివ్ ఫండ్స్ సూచీలకు మించి రాబడులను ఇవ్వలేకపోతున్నాయి. 2018లో సెబీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల పునర్వ్యవస్థీకరణ చేపట్టిన తర్వాత ఇది మరింత ఎక్కువైంది. ఫలితంగా ఈ విభాగంలో ప్యాసివ్ ఫండ్స్‌ను ఆశ్రయించే ఇన్వెస్టర్లు పెరుగుతున్నారు. నేడు లార్జ్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్స్‌లో (ప్యాసివ్ ఫండ్స్) ఎన్నో భిన్నమైన పథకాలు అందుబాటులో ఉండడాన్ని గమనించాలి. నిఫ్టీ 50 టీఆర్ఐ, నిఫ్టీ నెక్ట్స్ 50 టీఆర్ఐ, నిఫ్టీ 100 టీఆర్ఐ, ఎస్అండ్పీ బీఎస్ఈ సెన్సెక్స్ టీఆర్ఐ, లో వోలటాలిటీ ఇండెక్స్ ఫండ్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. టీఆర్ఐ అంటే మొత్తం సూచీ రాబడులుగా చూడాలి. నిఫ్టీ 50 టీఆర్ఐ, సెన్సెక్స్ టీఆర్ఐ ఫండ్స్ అన్నవి ఈ రెండు సూచీల్లోని అగ్రగామి లార్జ్‌క్యాప్ కంపెనీలను ప్రతిఫలిస్తాయి. గడిచిన పదేళ్లలో సగటున సూచీల స్థాయిలోనే ఇవి రాబడులు ఇచ్చాయి. అదే విధంగా సూచీలు ప్రతికూల రాబడులను ఇచ్చిన సందర్భాల్లోనూ ఈ పథకాల్లో నష్టాలు అదే స్థాయిలో ఉంటాయి. కనుక ఇన్వెస్టర్లు లార్జ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే ఈ రెండు సూచీలకు సంబంధించి ఏదేనీ పథకాన్ని ఎంపిక చేసుకోవచ్చు. తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న పథకాన్ని ఎంపిక చేసుకోవడం సరైనది అవుతుంది. ఇండెక్స్ ఫండ్స్‌కు సంబంధించి ట్రాకింగ్ ఎర్రర్ అని ఒకటి ఉంటుంది. సూచీతో పోలిస్తే పథకం ఇచ్చిన రాబడులకు మధ్య ఉన్న అంతరమే ట్రాకింగ్ ఎర్రర్. చాలా వరకు లార్జ్‌క్యాప్ ఫండ్స్‌కు ట్రాకింగ్ ఎర్రర్ 0.10–0.27 శాతం మధ్య ఉంటుంది. అంటే ఒక సూచీ ఏడాది కాలంలో 16 శాతం రాబడులను ఇస్తే, అదే సూచీని అనుసరించే ఇండెక్స్ ఫండ్ రాబడి 15.90 శాతం మేర ఉండొచ్చు. అప్పుడు 0.10 శాతాన్ని ట్రాకింగ్ ఎర్రర్‌గా పేర్కొంటారు. అందుకని ఇండెక్స్ ఫండ్స్‌లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉన్న దానిని ఎంపిక చేసుకోవాలి. దీర్ఘకాలంలో సూచీలతో పోలిస్తే తక్కువ ట్రాకింగ్ ఎర్రర్ ఉండి, తక్కువ ఎక్స్పెన్స్ రేషియో పథకం అయితే ఇంకా మంచిది. ఐడీఎఫ్సీ నిఫ్టీ ఫండ్‌లో ఎక్స్పెన్స్ రేషియో 0.08 శాతం మేర ఉంటే.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్‌లో 0.17 శాతం ఉంది. వీటి డైరెక్ట్ ప్లాన్లను ఎంపిక చేసుకోవచ్చు. అలాగే, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్ 0.16 శాతం మేర ఎక్స్పెన్స్ రేషియోను వసూలు చేస్తోంటే, నిప్పన్ ఇండియా ఇండెక్స్ ఫండ్ సెన్సెక్స్ ప్లాన్‌లో ఎక్స్పెన్స్ రేషియో 0.15 శాతంగా ఉంది. వీటి ట్రాకింగ్ ఎర్రర్ 0.16 శాతంలోపే ఉంది. ఇవన్నీ మూడేళ్లకు పైగా పనిచేస్తున్న పథకాలు. నిఫ్టీ 100 నిఫ్టీ 100 టీఆర్ఐ అన్నది మార్కెట్ విలువలో టాప్–100 కంపెనీలను ప్రతిఫలిస్తుంది. ఇవన్నీ లార్జ్‌క్యాప్ కిందకే వస్తాయి. ఈ లార్జ్‌క్యాప్ ఇండెక్స్‌ను ప్రతిఫలించే ప్యాసివ్ ఫండ్స్‌ను ఇటీవలే యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, ఐడీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ ఆవిష్కరించాయి. కనుక ఈ పథకాలకు దీర్ఘకాల చరిత్ర లేదు. అయినప్పటికీ సూచీల స్థాయిలో రాబడిని వీటి నుంచి ఆశించొచ్చు. ఎన్ఎస్ఈ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్లో నిఫ్టీ 100 కంపెనీల వాటా 70 శాతంగా ఉంది. నిఫ్టీ 50, సెన్సెక్స్ స్థాయిలోనే రాబడులు వీటిలో ఉండొచ్చు. నిఫ్టీ నెక్ట్స్ 50 మార్కెట్ విలువ పరంగా 51వ స్థానం నుంచి 100 వరకు ఉన్న కంపెనీలు నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీ కిందకు వస్తాయి. టాప్ 50 కంపెనీలు నిఫ్టీ 50 కింద ఉంటాయి. కానీ, నిఫ్టీ–50తో పోలిస్తే నెక్ట్స్ 50లో ఎక్కువ అస్థిరత కనిపిస్తుంది. కనుక రిస్క్‌ను సర్దుబాటు చేసుకునే, దీర్ఘకాల ఇన్వెస్టర్లు ఈ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, యూటీఐ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. వీటి ట్రాకింగ్ ఎర్రర్ 0.14 శాతం మేర ఉంది. ఈ రెండూ కూడా 0.30 శాతం, 0.33 శాతం మేర ఎక్స్పెన్స్ రేషియోను వసూలు చేస్తున్నాయి. ఒకవేళ ఇన్వెస్టర్లు ఎవరైనా నిఫ్టీ–50, నిఫ్టీ నెక్ట్స్50 పథకాల్లో విడిగా ఇన్వెస్ట్ చేసుకునేట్టు అయితే.. దీనికి బదులు నేరుగా నిఫ్టీ 100 ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే ఈ రెండు సూచీల్లో ఉండే కంపెనీలే నిఫ్టీ 100 సూచీలోనూ ఉంటాయి. కాకపోతే వెయిటేజీ పరంగా అంతరం చూడొచ్చు. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ అధిక రిస్క్‌ను భరించగలిగే ఇన్వెస్టర్లు మిడ్‌క్యాప్ విభాగంలో ఇండెక్స్ ఫండ్స్ కోసం చూస్తుంటే.. నిఫ్టీ 150 టీఆర్ఐను అనుసరించే నాలుగు పథకాలు ఉన్నాయి. ఇక్కడ యాక్టివ్, ప్యాసివ్ ఫండ్స్ గురించి ఒక విషయం చెప్పుకోవాలి. మిడ్‌క్యాప్ విభాగంలో ఒక్క యాక్సిస్ మిడ్‌క్యాప్ ఫండ్ మినహా మిగిలిన అన్ని యాక్టివ్ పథకాలు సూచీలకు సమానంగా, అంతకంటే అధిక రాబడులను ఇచ్చాయి. కానీ, ప్రతికూల పరిస్థితుల్లో సూచీలతో పోలిస్తే అధిక నష్టాలను కూడా పంచాయి. అందుకనే ఈ విభాగంలో ఇండెక్స్ ఫండ్స్ ఎంపిక మెరుగైనది అవుతుంది. ఉన్న నాలుగు ఇండెక్స్ ఫండ్స్‌లో మూడు 2021లో మొదలైనవి. మోతీలాల్ ఓస్వాల్‌కు చెందిన పథకం 2019లో ప్రారంభమైంది. కనుక వీటి రాబడులను విశ్లేషించడానికి కొంత సమయం ఇవ్వాల్సిందే. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ కూడా ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చినవే. వీటికి సంబంధించి దీర్ఘకాల ట్రాక్ రికార్డు లేదు. ఈ విభాగంలో మూడు పథకాలు ఉండగా, అన్నీ నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250టీఆర్ఐను అనుసరించేవే. స్ట్రాటజీ ఇండెక్స్ ఫండ్స్ (వ్యూహాత్మకమైనవి) ఇండెక్స్‌లోని కాంపోనెంట్స్లోనే కొన్ని అంశాల ఆధారంగా ఎంపిక చేసిన షేర్లలో ఇవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఉదాహరణకు నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్ అన్నది.. నిఫ్టీ 200 ఇండెక్స్‌లోని మూమెంటమ్ పరంగా టాప్ 30 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇందుకు ఆయా స్టాక్స్ ధరల కదలికలు ప్రామాణికం అవుతాయి. అలాగే, నిఫ్టీ 100 లో వోలటాలిటీ 30 ఇండెక్స్ కూడా ఒకటి. అంటే నిఫ్టీ 100 సూచీలోని 100 కంపెనీల్లో తక్కువ అస్థిరతలతో ఉన్న 30 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. నిఫ్టీ 50, నిఫ్టీ 100 ఇండెక్స్‌లకు సంబంధించి ఈక్వల్ వెయిట్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఇవేమి చేస్తాయంటే ఆయా సూచీల్లోని కంపెనీల్లో వాటికున్న వెయిటేజీ ప్రకారం ఇన్వెస్ట్ చేయవు. అన్ని కంపెనీలకు సమాన కేటాయింపులు చేస్తాయి. ఉదాహరణకు నిఫ్టీ 50లో ఒక్క రిలయన్స్ వెయిటేజీ 10.86 శాతంగా ఉంది. సాధారణ నిఫ్టీ 50 ఫండ్ అయితే తనవద్దనున్న నిర్వహణ ఆస్తుల్లో 10.86 శాతాన్ని రిలయన్స్‌కు కేటాయిస్తుంది. ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్ అలా కాదు. నిఫ్టీ 50 కంపెనీలకు ఒక్కో దానికి 2 శాతం చొప్పున కేటాయింపులు చేస్తుంది. దీనివల్ల ఒకటే రంగంలో ఎక్కువ పెట్టుబడులు పోగు పడవు. నిఫ్టీలో బ్యాంకింగ్ ఇండెక్స్‌కు వెయిటేజీ ఎక్కువ. ఈక్వల్ వెయిటేజీ ఇండెక్స్ ఫండ్‌కు వస్తే సమాన కేటాయింపులు చేస్తుంది కనుక దీన్ని నిరోధించొచ్చు. ఇండెక్స్ ఫండ్స్‌లోనే భిన్నమైన ఎక్స్పోజర్ కోరుకునే వారికి ఇవి అనుకూలంగా ఉంటాయి. నిఫ్టీ 100 క్వాలిటీ 30 ఇండెక్స్ క్వాలిటీ స్కోరు ఆధారంగా నిఫ్టీ 100 కంపెనీల్లో మెరుగైన 30 కంపెనీల్లో పెట్టుబడులు పెడతాయి. క్వాలిటీ అంటే.. అధిక లాభదాయకత ను చూపిస్తున్న కంపెనీలు. అంటే కంపెనీల రిటర్న్ ఆన్ ఈక్విటీ (ఆర్‌వోఈ) అధికంగా ఉంటుంది. ఈక్విటీతో పోలిస్తే తక్కువ రుణ భారం ఉన్నవి. అలాగే, ఆదాయం, లాభాల్లో పెద్దగా అస్థిరతలు లేనివి ఈ ఇండెక్స్ కిందకు వస్తాయి. క్వాలిటీ స్కోరు, ఫ్రీ ఫ్లోట్ మా ర్కెట్ క్యాప్ ఆధారంగా కేటాయింపులు ఉంటాయి. అయితే, నిఫ్టీ 100 క్వాలిటీ 30 ఇండెక్స్ రాబడులు.. నిఫ్టీ 100 కంటే గడిచిన 3–5 ఏళ్లలో తక్కువగా ఉన్నాయి. ఇక్కడ నాణ్యతకు, తక్కువ అస్థిరతలకు ప్రాధాన్యం ఉం టుంది. అందుకని రాబడి తక్కువ ఉన్నప్పటికీ, మార్కెట్ పతనాల్లో నషా ్టలు కూడా పరి మితంగా ఉంటాయని గమనించాలి. ఈ విభాగంలో ఎడెల్వీజ్ మ్యూచు వల్ ఫండ్ ఒక్కటే నిఫ్టీ 100 క్వాలిటీ 30 ఇండెక్స్ ఫండ్‌ను ఆఫర్ చేస్తోంది. ప్రారంభించి ఆరు నెలలే అయింది. ఎక్స్పెన్స్ రేషియో 0.27 శాతమే ఉంది. నిఫ్టీ 200 మోమెంటమ్ 30 ఇండెక్స్ ఇటీవలి కాలంలో మంచి పనితీరు చూపిం చిన కంపెనీలు ఈ ఇండెక్స్ పరిధిలోకి వస్తాయి. గడిచిన 6, 12 నెలల్లో నిఫ్టీ టాప్ 200 కంపెనీల్లో (లార్జ్ అండ్ మిడ్‌క్యాప్) అధిక రాబడులను ఇచ్చిన టాప్ 30 కంపెనీలను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేసేవే నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్స్. సూచీల కంటే ఈ పథకాల్లో రాబడి 6% అధికంగా ఉంది. యూటీఐ మ్యూచువల్ పండ్, మోతీలాల్ ఓస్వాల్ మ్యూ చువల్ ఫండ్ సంస్థలు ఈ పథకాలను అందిస్తున్నాయి. ఈ రెండూ గడచిన ఏడాది కాలంలో ఆరంభమైనవి. పెద్దగా ట్రాక్ రికార్డు లేదు. గమనిక యాక్టివ్ ఫండ్స్‌కు సంబంధించి స్మాల్‌క్యాప్ విభాగం ఒక్కటీ భిన్నంగా ఉంది. అన్ని పేరున్న స్మాల్‌క్యాప్ యాక్టివ్ పథకాలు సూచీలకంటే అధిక రాబడులిస్తున్నాయి. అంతేకాదు, అస్థిరతలూ తక్కువగా ఉంటున్నాయి. అధిక రిస్క్ భరించగలిగేవారు స్మాల్‌క్యాప్ విభాగంలో ఇండెక్స్ ఫండ్స్‌కు బదులు యాక్టివ్ స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు వెళ్లొచ్చు. వీటిలో ఎస్బీఐ, యాక్సిస్, నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ ఫండ్ మంచి పనితీరు చూపిస్తున్నాయి. -
ఆత్మ గౌరవం.. జీవన వనాన విరిసే ఆమని
ఆత్మగౌరవం మనిషికి నిజమైన ఆభరణంలా భాసిస్తుంది. ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకుని, నమ్మిన సిద్ధాంతం కోసం, విలువలకోసం రాజీ పడకుండా ముందుకు సాగే లక్షణానికి మనం చెప్పుకునే అందమైన పదభూషణం ‘ఆత్మ గౌరవం’. సమపాళ్ళలో కలిగి ఉండే ఈ లక్షణం సమాజంలో అగణ్యత, అగ్రగణ్యత సంపాదిస్తుందో లేదో తెలియదు కానీ, జీవన గమనానికి ఖచ్చితంగా నిజమైన నాణ్యతను సంతరిస్తుంది. ‘‘ఆయనకు చాలా ఆత్మగౌరవం ఎక్కువండీ.. ఎక్కడా రాజీ పడకుండా జీవిస్తాడు’’ అనే మాటను మనం కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి, మిగిలినవాళ్ళు మాట్లాడుకోవడం వింటూ ఉంటాం. అహంకారం ఉన్నవారు తమకోసం కాక, ఎదుటివాళ్ల దృష్టిలో తాము గొప్పగా వున్నట్లుగా భావన చేసుకుని జీవికను సాగిస్తారు. ఎవరైనా తన గురించి తక్కువ, ఎక్కువల తేడా చూపిస్తే చాలు, అవమానంతో రగిలిపోతారు. అహంకారంతో ఉండేవాళ్ళు, విలువలకోసం ప్రయత్నించక, పక్కవారి ముందు ఉన్నతులుగా గుర్తింపబడాలని కోరుకుంటారు. వీరిలో చెలరేగే అహంకారం వారిలో ఉన్న మంచిని కూడా ఎదుటివారిని చూడనీయకుండా చేస్తుంది. సంఘంలో మనకు ఎక్కువగా ఈ తరహా వ్యక్తులే తారసపడుతూ ఉంటారు. స్వల్పమాత్రపు భేదాన్ని మాత్రం మనం ఇక్కడ తప్పనిసరిగా గ్రహించాలి. అహంకారంతో వర్తించడం ఎటువంటి నేరమో, ఆత్మగౌరవాన్ని చంపుకోవడం అంతకుమించిన దోషం..!! మనం నమ్ముకున్న సూత్రాల విషయంలో అవలంబించే రాజీ ధోరణి తాత్కాలికంగా సుఖమయమనిపించినా, దీర్ఘకాలంలో తప్పనిసరిగా మనకు మానసిక క్లేశాన్ని కలిగిస్తుందని ఎన్నో ఉదాహరణలు తెలియజేస్తాయి. ఆత్మగౌరవం అనే భావన ఒక వ్యక్తి తన గురించి కలిగి ఉన్న విలువ, అవగాహనకు సంబంధించిన భావన.దీని ఆధారంగా, ఒక వ్యక్తి తోటివారితో సాగే గమనంలో విభిన్న విషయాల్లో తనకు ఎటువంటి స్థానం ఉందో కనుగొంటాడు. ఆత్మగౌరవానికి నిర్వచనాన్ని చెప్పవలసి వస్తే, దాదాపుగా స్వీయ–ప్రేమకు, ఈ పదాన్ని సమానంగా చెప్పవచ్చు. తన గౌరవాన్ని గురించి ఎవరైనా, ఏ సందర్భంలోనైనా ప్రకటించ వలసి వస్తే,ఆత్మగౌరవం అనే పదం వ్యక్తికి గల స్వీయ గౌరవం అనే పదానికి ప్రత్యక్ష అర్థంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. తనని తాను ప్రేమించడం స్వార్థం లేదా అనారోగ్యం కాదు; ఇది ఒక ప్రాథమిక భావన. తనని తాను ప్రేమించుకోవడం అనేది ప్రతి వ్యక్తీ చేసే పనే. తనకు మంచి జరగాలని కోరుకోవడమూ సహజమే.. అయితే, తనకే మంచి జరగాలని కోరుకోవడాన్ని స్వార్ధభావనగా మనం పేర్కొంటూ ఉంటాం. ప్రతికూల ఆలోచనలను అంతం చేయడం, జ్ఞానాన్ని పెంచే లేదా వ్యక్తికి మంచి అనుభూతిని కలిగించే కార్యకలాపాలు చేయడం, కొత్త విషయాలను నేర్చుకోవడం, చేసిన తప్పులను తెలుసుకోవడం మొదలైనవి మనలో మరింత ఆత్మగౌరవాన్ని పెంచుతాయి. ఆత్మగౌరవాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు మనకు గుర్తొచ్చే మరో పదం ‘అహంకారం’. పరిణతి చెందిన వ్యక్తులు సైతం తమ వైఖరిని వ్యక్తపరిచే సందర్భంలో, ఆ విధంగా మాట్లాడితే అహంకారులుగా తమను ఎదుటివారు భావిస్తారేమో అని సందేహించే సందర్భాలూ ఉంటాయి. అయితే, ఆత్మగౌరవానికీ, అహంకారానికీ మధ్య తేడా బాగానే ఉంది. సమాజం తీరును మనం నిశితంగా పరికిస్తే, అత్యాశలకు లోనైనప్పుడే, మనిషి జీవనశైలిలో ఉన్న సమతౌల్యం దెబ్బ తింటుంది. అనవసరమైన కోరికలనే గుర్రాలవెంట పరుగెడుతూ, వాటిని ఏ విధంగానైనా తీర్చుకోవాలనే తపన ప్రబలినప్పుడే, మనిషి తాను పాటించే విలువల విషయంలో, ఆత్మను వంచన చేసుకునేలా రాజీపడి, ఎదుటివాడి ముందు తలను వంచుతాడు. ఒకరకంగా దీన్నే నైతిక పతనానికి నాంది అని చెప్పవచ్చు. ఎందుకు ఈ అనవసరపు వెంపర్లాట..!! ఎవరికీ తలవంచకుండా, అధికమైన ఆశలతో ఎవరెవరినో ఆశించకుండా, దృఢమైన చిత్తంతో సాగుతూ, నిండుగా నిలుపుకునే ఆత్మగౌరవమే గుండెకు ఆనందరవం..!! జీవన వనాన విరిసే ఆమనిలో అదే మధురంగా కిలకిలమనే కోకిలారావం..!! ఆత్మగౌరవం అన్నది మనిషి ఉత్తమ ప్రవృత్తిని తెలియపరుస్తుంది. ఒక మంచి ప్రవర్తనకు జగతి లో అందే విలువను పరోక్షంగా ఆత్మగౌరవానికి నమూనాగా ప్రకటించవచ్చు. సంస్కారాలు, విలువలు, నియమాలతో కూడిన జీవన ఆచరణ కలిగినవారు ఒకరి ముందు తలవంచరు. దీనికి ధనంతో ఏమాత్రం పనిలేదు. సంస్కారాలకు ఉన్న మహత్తరమైన విలువ అలాంటిది. వీరు ఆదర్శ జీవనాన్ని జీవిస్తూ, ఉన్నంత లో ఎదుటివాళ్లచేత గుర్తింపును, గౌరవాన్ని పొందేవారుగా తమను తాము మలుచుకంటారు. అలాంటి వారు తమకు తాము కొన్ని హద్దులు పెట్టుకొని వాటిని దాటకుండా ఒక్కరిపైన ఆధారపడకుండా ఆత్మగౌరవంతో నిరంతరం జీవిస్తారు. – ‘‘వ్యాఖ్యాన విశారద’’ వెంకట్ గరికపాటి -
రూ. 3000 ఖరీదైన చీర రూ.300 కే!!
సుమతి (పేరు మార్చడమైనది) ఆన్లైన్లో పండగ ఆఫర్ల కింద వచ్చిన అప్లికేషన్స్ చూస్తూ ఉంటే మంచి కలర్ కాంబినేషన్ ఉన్న పట్టు చీర కనపడింది. ‘మూడు వేల రూపాయల చీర, మూడు వందలకే’ అని ఉండటంతో క్లిక్ చేసింది. ఆ చీర బుక్ అవ్వాలంటే అందులో ఇచ్చిన అకౌంట్లో డబ్బులు జమ చేయడంతోపాటు వివరాలన్నీ పొందుపరిచిన ఒక ఫారాన్ని నింపాలి. డబ్బు కట్టడంతోపాటు వివరాలన్నీ ఇచ్చింది. కానీ, ఎన్ని రోజులైనా ఆ చీర మాత్రం రాలేదు. ‘మా లక్కీ స్కీమ్‌లో పాల్గొనండి, ఐ ఫోన్ గెల్చుకోండి’ అని ఉన్న అప్లికేషన్‌ను శేఖర్ (పేరు మార్చడమైనది) క్లిక్ చేశాడు. ఆ లక్కీ డిప్లో పాల్గొనాలంటే రెండు వేల రూపాయలు చెల్లించి, స్కీమ్‌లో చేరాలని ఉంది. తన వివరాలతో పాటు, రెండు వేల రూపాయలు ఆన్లైన్ ద్వారా చెల్లించి, ఆ స్కీమ్‌లో చేరాడు. కానీ, శేఖర్‌కి ఫోన్ రాలేదు. ఆ డబ్బులూ తిరిగి రాలేదు. సబ్‌స్క్రైబర్స్‌ని పెంచుకోవడానికి ఆఫర్లు లైక్స్, కామెంట్స్, సబ్స్క్రిప్షన్స్ పెంచుకోవడానికి కొందరు ‘ఉచితం లేదా డిస్కౌంట్’ అనే పదాలను ఎరగా వేస్తుంటారు. ‘50,000 రూపాయల ధర పలికే గడియారాన్ని 5,000కే అమ్ముతున్నాను’ అనే ఆఫర్లు వస్తుంటాయి. మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం.. ‘ఆఫర్’ని ఎరగా వేసి వివరాలన్నీ సేకరించి, ఆ తర్వాత మోసానికి పాల్పడే వారుంటారు. వివరాలన్ని ‘డార్క్’వెబ్సైట్లలో పెడుతూ, మరో ఆన్లైన్ మోసాలకు ఉపయోగించడానికి ఆ డేటాను వాడుతుంటారు. ఒరిజినల్ అని చెప్పి, అమ్మడం ఇది మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం. బ్రాండెడ్ వస్తువులా అనిపించే రెప్లికా ఐటమ్ చూపించి అసలైనదే అని చూపుతారు. మీతో పాటు మరికొంతమందిని తమ స్కీమ్‌లో చేర్చితే ‘50,000 రూపాయల వస్తువు 5000 కు సొంతం చేసుకోవచ్చు అనే ఆశను చూపెడతారు. నాణ్యతలేని వస్తువులతో ఎర రెప్లికా వస్తువుల్లోనూ గ్రేడ్స్ ఉంటాయి. అవి చూడటానికే బాగుంటాయి కానీ, ఏ మాత్రం పనిచేయవు. అలాంటి వస్తువులను చూపి, డబ్బులు రాబట్టి మోసం చేస్తారు. ఆఫర్ల వర్షం దసరా, దీపావళి, సంక్రాంతి వంటి ముఖ్యమైన పండగల సమయంలో జనాల బలహీనతను దృష్టిలో పెట్టుకొని, బంపర్ ఆఫర్, వీల్ తిప్పడం, స్క్రాచ్ కార్డ్‌లు.. వంటి వాటితో ఆన్లైన్ మోసానికి దిగుతుంటారు. ఈ షాపింగ్ మోసాలు ఢిల్లీ చుట్టుపక్కల నుంచి అధికంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. వీటిల్లో ఎక్కువగా ఫోన్లు, వాచీలు, చీరలు, డ్రెస్సుల విషయాల్లో జరుగుతుంటాయి. ఆన్లైన్ షాపింగ్ మోసానికి ముందే హెచ్చరికలు ► ఒక వస్తువులు లేదా సేవ నమ్మశక్యం కాని తక్కువ ధరతో ప్రచారం చేయబడుతుంది అంటే ఆలోచించాలి. మోసానికి ముందు ఇదొక హెచ్చరిక అనుకోవాలి. ► ఆన్లైన్ చెల్లింపులు కాకుండా వస్తువు ఇంటికి వద్దకు వచ్చాకే చెల్లింపు అనే ఎంపిక మంచిది. ► డిస్కౌంట్ ఆఫర్‌ని పొందడానికి తమ వోచర్ కోసం ముందే చెల్లించాలనే ఎంపికలు ఉంటాయి. అలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ► నకిలీ సోషల్ మీడియా ఆధారిత కథనాలు కొత్తగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆన్ లైన్ లో చాలా తక్కువ ధరలకు ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి, అనేది నిజం కాదు. ► విక్రేత విదేశాల్లో ఉన్నప్పుడు పే మనీ లేదా క్రెడిట్/ డెబిట్ కార్డ్ లావాదేవీ వంటి సురక్షిత చెల్లింపు సేవ ద్వారా చెల్లింపును అనుమతించరు. వారు మిమ్మల్ని ౖఖ్కీ ని చెప్పమని లేదా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయాలని లేదా చెల్లింపులను స్వీకరించడానికి గూగుల్ ఫారమ్స్ లేదా చిన్న లింక్‌లను పూరించమని అడుగుతారు. ► కొత్తగా పుట్టుకు వచ్చిన వెబ్సైట్లలో నిర్ధారణకు రాకుండా కొనుగోళ్లు చేయకూడదు. వాటి తాలూకు ఫౌండర్స్ ఎవరనేది కూడా చూసుకోవాలి. బ్రాండ్ పేరుతో ఉన్న వెబ్‌సైట్స్ కూడా నకిలీ పేరుతో వస్తాయి. పండగల సమయాల్లో ఈ– తరహా మోసాలు ఎక్కువ. కాబట్టి, వాటి వాడుక, హెచ్టిటిపిఎస్, యుఆర్ఎల్ చెక్ చేసుకొని కొనాలి. షాపింగ్ మోసాల నుండి రక్షణ ► మీరు తీసుకోవాలనుకున్న వస్తువు ‘సమీక్ష (రివ్యూ)లు చదవండి. వాటి నాణ్యత, రిటర్న్ పాలసీల వంటివి ఉన్నాయేమో చూడండి. ► ఎప్పుడైనా (యాప్) అప్లికేషన్ అంతర్నిర్మిత సాధనాలతోనే కమ్యూనికేట్ చేయండి. అప్లికేషన్ వెలుపల కమ్యూనికేట్ చేయవద్దు. ► సురక్షిత నగదు చెల్లింపు కోసం https://URL చూడండి. ► అమ్మకం దారుకి మీ బ్యాంక్ OTP / PIN నంబర్లను ఏ రూపంలోనూ షేర్ చేయవద్దు. ► మీరు ఫోన్ మాట్లాడే సమయంలో చెల్లింపు లావాదేవులను ఎప్పుడూ చేయవద్దు. ► అమ్మకం దారు అందించిన ఏవైనా షార్ట్ లింక్‌లను క్లిక్ చేసి, వాటిని పూరించవద్దు. గూగుల్ లింక్ ద్వారా వచ్చిన ఫామ్‌లను పూరించవద్దు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవద్దు, మీరు స్కాన్ చేస్తుంటే మీ ఖాతా నుండి డబ్బు డెబిట్ అవుతుంది. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్, యూజర్లకు ఇక పండగే
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త అప్డేట్తో ముందుకు వచ్చింది. ఈ ఫీచర్‌తో వాట్సాప్‌లో హైక్వాలిటీ వీడియోల్ని సెండ్చేసే సౌకర్యం అందుబాటులోకి రానుంది. వాస్తవానికి వాట్సాప్ నుంచి మరో వాట్సాప్‌కు కేవలం 16ఎంబీ వీడియోను మాత్రమే షేర్ చేసే సదుపాయం ఉంది. దీనివల్ల వినియోగదారులు వీడియో క్వాలిటీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వాట్సాప్ ద్వారా హై క్వాలిటీ వీడియోల్ని సెండ్ చేయలేకపోతున్నామని, అందుకోసం ఫీచర్‌ను తీసుకొని రావాలంటూ వాట్సాప్ యాజమాన్యానికి పెద్ద ఎత్తున మెయిల్స్ పెట్టారు. దీంతో వాట్సాప్ యాజమాన్యం ఇకపై హై క్వాలిటీ వీడియోల్ని సెండ్ చేసేలా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తులు చేసింది. వీ బీటా ఇన్ఫోరిపోర్ట్ ప్రకారం.. వీడియో అప్లోడ్ క్వాలిటీ పేరుతో ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.21.14.6 ఫీచర్‌పై వర్క్ చేస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత హైక్వాలిటీ వీడియోల్ని షేర్ చేసే అవకాశం ఉంది. "ఆటో, బెస్ట్ క్వాలిటీ, డేటా సర్వర్" పేరుతో మూడు ఆప్షన్లను యాడ్ చేయనుంది. ఆటో: ఆప్షన్ ద్వారా వీడియో క్వాలిటీ తగ్గకుండా సైజును మాత్రమే తగ్గించి సెండ్ చేసేందుకు వీలుంది బెస్ట్ క్వాలిటీ : ఈ ఆప్షన్ ద్వారా హై రెజెల్యూషన్ వీడియోల్ని షేర్ చేసుకోవచ్చు. డేటా సేవర్ : ఈ ఆప్షన్ ద్వారా ఇంటర్ నెట్ హై బ్యాండ్ విత్ లేకపోయినా వీడియోను కంప్రెస్ చేసి సెండ్ చేసుకోవచ్చు. బ్యాండ విత్ లేకుండా వీడియోను కంప్రెస్ చేస్తే క్వాలిటీ మిస్ అవుతుందనే డౌట్ రావచ్చు.కానీ డేటా సేవర్ ఆప్షన్ వీడియో క్వాలిటీ తగ్గకుండా కంప్రెస్ చేయడంపై దృష్టిసారిస్తున్నట్లు వాట్సాప్ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్ పై వర్క్చేస్తుండగా, త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ బీటా ఇన్ఫో పేర్కొంది. చదవండి: వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్, యూజర్లకు ఇక పండగే -
ఇకపై బంగారం కొనాలంటే ఇది తప్పనిసరి
ముంబై: ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న హాల్ మార్కింగ్ విధానం రేపటి నుంచి అమల్లోకి రానుంది. 2021 జూన్ 15 నుంచి హాల్‌మార్క్ ఉన్న బంగారు ఆభరణాలనే విక్రయించాల్సి ఉంటుంది. హాల్‌మార్క్ లేని బంగారం విక్రయించడం చట్టపరంగా నేరం. దీంతో బంగారం నాణ్యత విషంయలో కష్టమర్లకు మరింత భరోసా లభించనుంది, నాణ్యతకు భరోసా బంగారు ఆభరణాల తయారీకి సంబంధించి చిన్న పట్టణాలు, గ్రామాల్లో హాల్ మార్కింగ్ ఉండటం లేదు. దీని వల్ల ఆ ఆభరణం ఎంత నాణ్యతపై సందేహాలు తలెత్తుతున్నాయి. చాలా సందర్భాల్లో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన తర్వాత తాము నష్టపోయినట్టు వినియోగదారులు చెబుతున్నారు. దీంతో బంగారం కల్తీకి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం హాల్‌మార్క్ విధానం అమల్లోకి తెచ్చింది. హాల్‌మార్క్ ఇలా 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 14 క్యారెట్ల బంగారు ఆభరణాలపై తప్పనిసరిగా హాల్ మార్క్ ఉండాలి. BIS హాల్‌మార్కింగ్ స్కీంలో ఆభరణాలకు రిజిస్ట్రేషన్ మంజూరు, మదింపు, హాల్ మార్కింగ్(A&H)కు గుర్తింపు ఉంటుంది. ఆభరణాల హాల్ మార్కింగ్ ప్రక్రియలో BIS-A&H సెంటర్లో నాణ్యతను తనిఖీ చేస్తారు. ఇక్కడ పరీక్షించిన అనంతరం A&H సెంటర్లో హాల్ మార్కింగ్ ముద్రను వేస్తారు. చదవండి : మూడో రోజు తగ్గిన బంగారం ధరలు -
నాణ్యత మహానందీశుడికెరుక !
మహానంది: మహానంది క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. పట్టుమని ఆరునెలలు కూడా కాకముందే రాజగోపురం ముందు భాగంలో రెండు సుపథ మండపాల మధ్యలో గ్రీనరీ కోసం యూ ఆకారంలో నిర్మించిన గోడ బుధవారం కూలిపోయింది. గోడల మధ్యలో వేసిన మట్టికి పైప్ ద్వారా నీరు పడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, చిన్నపాటి నీటి ఫోర్స్‌కే ఇలా జరగడంతో నిర్మాణాల్లో నాణ్యతపై స్ధానికులు, భక్తులు పెదవి విరుస్తున్నారు. దీనిపై ఈఓ మల్లికార్జునప్రసాద్ మాట్లాడుతూ సిబ్బంది ఫైర్ ఇంజన్లకు వాడే పైపుతో నీరు పట్టడం ద్వారా ఫోర్స్‌కు గోడ కూలిపోయిందని బాధ్యులపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. కాగా ఈ గోడ నిర్మాణానికి సుమారు రూ. 55 వేలకు పైగా ఖర్చు చేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.