Right to Education Act
-
విద్యాహక్కు చట్టం అమలు ఏ దశలో ఉంది
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పిల్లల ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం–2009ను రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఎందుకు అమలుచేయడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అసలు చట్టం అమలు ఇప్పుడు ఏ దశలో ఉందో పూర్తి వివరాలు తెలుసుకొని చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ‘రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు. చట్టంలో 121 సీ ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు 25 శాతం సీట్లు కేటాయించాల్సి ఉంది. అలా ఎక్కడా జరగడం లేదు. దీనిని ప్రభుత్వం కఠినంగా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలి’అని కోరుతూ న్యాయవాది యోగేష్ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధానన్యాయమూర్తి జస్టిస్ అలోక్‌అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా ఇస్తున్నట్టు ఎక్కడా లేదని, రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలు ఎంత వరకు వచ్చి0దో చెప్పాలని ఏఏజీ ధర్మాసనం ఆదేశించింది. కాగా, విద్యాహక్కు చట్టంపై తమకు సాయం చేసేందుకు అమికస్‌గా నియమితులైన సీనియర్ న్యాయవాది సునీల్ బి.గణు సేవలను ధర్మాసనం ప్రశంసించింది. మరో పిటిషన్ విచారణ సందర్భంగా ప్రభుత్వ హాస్టళ్లలో బాత్రూమ్లు, టాయిలెట్లు, పరుపులు, దిండ్లు లాంటి ఏర్పాట్లపై కూడా వివరాలు అందజేయాలని చెబుతూ, విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
టెట్.. సర్వీస్ టీచర్లు లైట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)పై సర్వీస్ టీచర్లు ఆసక్తి చూపడం లేదు. ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్న టీచర్లు అసలే ముందుకు రావడం లేదు. ఎవరు ఏ పేపర్ రాయాలో స్పష్టత లేదని.. దానికితోడు సన్నద్ధతకు సమయం లేదని ప్రభుత్వ టీచర్లు పేర్కొంటున్నారు. విద్యార్థులకు వార్షిక పరీక్షల నిర్వహణ, ఆపై ఎన్నికల విధులు ఉంటాయని.. అలాంటిది టెట్కెలా సన్నద్ధమవు తామని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో 2012కు ముందు సర్వీస్‌లో చేరిన 80వేల మందికిపైగా ప్రభుత్వ టీచర్లకు టెట్ అర్హత లేదు. అయితే విద్యాహక్కు చట్టం ప్రకారం.. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) నుంచి స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ).. స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎం పదోన్నతి పొందాలంటే టెట్ ఉత్తీర్ణత పొందాలి. అయితే ఈ పదోన్నతి కూడా అవసరం లేదనే భావన టీచర్లలో కనిపిస్తోందని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. పదోన్నతి వస్తే వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుందని కొందరు టీచర్లు అంటున్నారు. ఉన్న ప్రాంతంలోనే పనిచేయడం ఉత్తమమని పేర్కొంటున్నారు. టెట్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో.. సర్వీస్ టీచర్లు విద్యాశాఖ వద్ద అనేక సందేహాలు లేవనెత్తుతున్నారు. పరీక్షపై స్పష్టత ఏదీ? వృత్తి నైపుణ్యం పెంపు కోసం సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారని.. పదోన్నతుల కోసం టెట్ తప్పనిసరి అని చెప్పలేదని ఉపాధ్యాయ వర్గాలు చెప్తున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే టీచర్లు డీఎడ్ అర్హతతో ఉంటారు. వారు పేపర్–1 పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేయాలంటే బీఈడీ అర్హత ఉండాలి. వారు పేపర్–2 రాయాలి. ఎస్జీటీలు పేపర్–1 మాత్రమే రాయగలరు. వారికి బీఈడీ లేని కారణంగా పేపర్–2 రాయలేరు. పదోన్నతులూ పొందే ఆస్కారం లేని పరిస్థితి తలెత్తుతుంది. ప్రాథమిక పాఠశాలల్లో హెచ్ఎంలుగా మాత్రం వెళ్లే వీలుంది. ఆ పదోన్నతి వస్తే ఇతర స్కూళ్లకు వెళ్లాలి. వేతనంలోనూ పెద్దగా తేడా ఉండదనేది టీచర్ల అభిప్రాయం. అంతేగాకుండా ఎవరు ఏ పేపర్ రాయాలనే దానిపై నోటిఫికేషన్లో స్పష్టత ఇవ్వలేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. సన్నద్ధతకు సమయమేదీ? చాలా మంది టీచర్లు పదేళ్ల క్రితమే ఉపాధ్యాయులుగా చేరారు. అప్పటికి, ఇప్పటికి బీఈడీ, డీఎడ్‌లో అనేక మార్పులు వచ్చాయి. టెన్త్ పుస్తకాలు అనేక సార్లు మారాయి. అయితే టీచర్లు వారు బోధించే సబ్జెక్టులో మాత్రమే అప్‌గ్రేడ్ అయ్యారు. కానీ టెట్ రాయాలంటే అన్ని సబ్జెక్టులూ చదవాలి. జూన్ 12 నుంచి టెట్ పరీక్షలు జరగనున్నాయి. టీచర్లు ఏప్రిల్ నెలాఖరు వరకు పరీక్షల నిర్వహణ, పేపర్లు దిద్దడంలోనే నిమగ్నమై ఉంటారు. మే నెలలో లోక్‌సభ ఎన్నికలున్నాయి. టీచర్లు ఆ విధులకు హాజరవ్వాల్సి ఉంటుంది. దీనితో టెట్ సన్నద్ధతకు అతి తక్కువ రోజులే ఉంటాయని టీచర్లు చెప్తున్నారు. ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు అన్ని తరగతులకు సంబంధించిన అని సబ్జెక్టులు చదివితే తప్ప టెట్‌లో అర్హత మార్కులు సాధించడం కష్టమని అంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది టీచర్లు టెట్ రాసేందుకు సుముఖత చూపడం లేదు. టీచర్ల కోసం ప్రత్యేక టెట్ చేపట్టాలని, నోటిఫికేషన్‌లోని అంశాలపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఉచిత విద్యకు దరఖాస్తు గడువు పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేటు, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరానికి (2024–25) విద్యాహక్కు చట్టం కింద దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. నిజానికి ఈ గడువు సోమవారంతో ముగుస్తుండగా, విద్యాశాఖాధికారులు మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రతికూల పరిస్థితుల్లోని పిల్లలైన అనాథలు, హెచ్ఐవీ బాధితులు, విభిన్న ప్రతిభావంతులు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలకు ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలు కల్పించాలి. వీరికి విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు, అన్ఎయిడెడ్ స్కూళ్లల్లో 25 శాతం సీట్లు కేటాయించాలి. దీనిప్రకారం ఇప్పటివరకు 49,208 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 38,150 మంది పాఠశాలలను ఎంపిక చేసుకున్నారు. విద్యార్థుల నివాసాలకు సమీపంలో ఉన్న ఐబీ, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్‌ను బోధిస్తున్న స్కూళ్లలోను పేద విద్యార్థులకు ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించాలని సమగ్రశిక్ష ఎస్సీడీ బి. శ్రీనివాసరావు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థుల తల్లిదండ్రులు తమ నివాసాలకు సమీపంలోని సచివాలయం లేదా ఇంటర్నెట్, ఎంఈవో కార్యాలయం, మీ–సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు కార్యాలయ పనివేళల్లో సమగ్రశిక్షా పాఠశాల విద్యాశాఖ (టోల్ ఫ్రీ) 18004258599 నంబర్లో సంప్రదించాలని ఆయన కోరారు. అర్హతగల పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. ఆధార్ నంబర్‌తో రిజిస్ట్రేషన్.. ఇక ఆసక్తిగల పిల్లల తల్లిదండ్రులు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో విద్యార్థి పేరు, ఇతర వివరాలు నమోదుచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. పిల్లల ఆధార్ నంబర్, లేదా తల్లిదండ్రుల ఆధార్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం ఆన్లైన్లో కనిపించే స్కూళ్లలో నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవాలి. వచ్చిన దరఖాస్తులకు ఆన్లైన్ లాటరీ ద్వారా స్కూళ్లను కేటాయిస్తారు. http://cse.ap.gov.in/RTE వెబ్సైట్లో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. -
దేశంలో బాల్యవిద్య బలహీనమే!
సాక్షి, అమరావతి: ఆరేళ్ల లోపు పిల్లల్లో మెదడు ఎదుగుదల అధికంగా ఉంటుంది. ఆ వయసులో మానసిక వికాసానికి సాన పెట్టాలి. అయితే దేశంలో ఇప్పటికీ 3.7 కోట్ల మందికి పైగా బాలలు పూర్వ బాల్య విద్యకు దూరమైనట్లు ‘సేవ్ ద చిల్డ్రన్’ సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదం సత్ఫలితాలనివ్వాలంటే పూర్వ బాల్యవిద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరముందని పేర్కొంది. విద్యాహక్కు చట్టం–2009, నేషనల్ ఈసీసీఈ పాలసీ–2013, జాతీయ నూతన విద్యావిధానం–2020లో పూర్వ బాల్య విద్య ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలంటే పూర్వ బాల్య విద్యకు తగినన్ని నిధులు కేటాయించాలి. 3– 6 ఏళ్ల వయసు వారి విద్యాభ్యాసాన్ని పాఠశాల విధానంలో చేర్చేలా ప్రీ ప్రైమరీ విధానాన్ని ప్రవేశపెట్టాలని నూతన విద్యావిధానం సిఫార్సు చేసింది. 2011 జనాభా లెక్కల నివేదిక పూర్వ బాల్య విద్యకు అర్హులైన బాలలు దేశంలో 10 కోట్ల మంది ఉన్నారు. ప్రస్తుతం పూర్వ బాల్య విద్య, ప్రాథమిక విద్యకు దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 0.1 శాతం నిధులు మాత్రమే కేటాయిస్తుండగా కనిష్టంగా 1.6 నుంచి 2.2 శాతం వరకు పెంచాలి. అమెరికా, యూకే, ఈక్వెడార్ లాంటి దేశాల్లో 1.17 శాతం వరకు నిధులు కేటాయిస్తున్నారు. రాష్ట్రంలో బాల్య విద్య భేష్ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక విద్యారంగ సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్వ బాల్య విద్య, ప్రాథమిక విద్యకు ప్రాధాన్యమిచ్చారు. జాతీయ నూతన విద్యావిధానం కంటే ముందే రాష్ట్రంలో పూర్వ ప్రాథమిక విద్యకు రూపకల్పన చేశారు. అంగన్వాడీలను స్కూళ్లతో అనుసంధానించి పీపీ–1, పీపీ–2 తరగతులతో ఫౌండేషన్ స్కూళ్లకు శ్రీకారం చుట్టారు. పూర్తిగా బాలల కోసమే ప్రత్యేక బడ్జెట్ పెట్టి ఏటా రూ.16 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. 2021–22లో సీఎం జగన్ ప్రభుత్వం రూ.16,748.47 కోట్లతో తొలిసారిగా బాలల బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2022 – 23లో ఇందుకోసం రూ.16,903 కోట్లు కేటాయించారు. -
బడి బయటి పిల్లల కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బడుల్లో చేరని బాలల కోసం నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు (ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ) ఏర్పాటు చేయాలని సమగ్ర శిక్ష విభాగం రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం.. 6 నుంచి 14 ఏళ్లలోపు బాలబాలికలకు నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలన్న లక్ష్యం మేరకు సమగ్ర శిక్ష విభాగం ఈ ప్రత్యేక శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. విద్యా సంవత్సరంలో ఏ స్కూల్లోనూ నమోదు కాకుండా బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి వారికి ప్రాథమిక విద్యను ఈ కేంద్రాల ద్వారా అందించనున్నారు. ఇలా బడి బయట ఉన్న పిల్లలు రాష్ట్రవ్యాప్తంగా 11,331 మంది ఉన్నట్లు సమగ్ర శిక్ష విభాగం గుర్తించింది. వీరికి నాన్ రెసిడెన్షియల్ విధానంలో 3, 6, 9 నెలల కాల వ్యవధితో ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. విద్యార్థులు ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. వీటిలో టీచర్ వలంటీర్లను నియమించి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించనున్నారు. అనంతరం ఆ విద్యార్థులను వారి వయసుకు తగ్గ తరగతుల్లో చేర్చనున్నారు. సమగ్ర శిక్ష విభాగం జిల్లా అదనపు ప్రాజెక్టు సమన్వయకర్తల ద్వారా టీచర్ వలంటీర్లను నియమించనున్నారు. టెట్ ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ప్రత్యేక శిక్షణా కేంద్రాలకు సంబంధించి ప్రాథమిక స్థాయిలో టీచర్ వలంటీర్లకు ఇంటర్మీడియెట్‌తో డీఈడీ, ప్రాథమికోన్నత స్థాయిలో డిగ్రీ, బీఈడీ పూర్తి చేసి ఉండాలి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఉత్తీర్ణులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. టీచర్ వలంటీర్లకు నెలకు రూ.7,500 చొప్పున అందిస్తారు. వలంటీర్లకు ఐదు రోజులపాటు ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. టీచింగ్ టెర్నింగ్ మెటీరియల్ కింద ప్రతి సెంటర్‌కు రూ.1,000 విలువైన వస్తువులు అందిస్తారు. ఇవికాకుండా ప్రతి కేంద్రంలోని పిల్లలకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఇస్తారు. పిల్లలకు సంబంధించిన స్టేషనరీకి రూ.200, బ్యాగుకు రూ.200, చెప్పులకు రూ.100 చొప్పున అందిస్తారు. పిల్లలకు కావాల్సిన వివిధ సబ్జెక్టుల పుస్తకాలను సమగ్ర శిక్ష విభాగం అందజేస్తుంది. ప్రతి కేంద్రంలో కనిష్టంగా 20 మంది ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు 1 నుంచి 3 కిలోమీటర్ల దూరంలోపు ఉన్న పిల్లల కోసం ఈ ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. కొండలు, నదులు, వాగులు వంటి ఆటంకాలు ఉన్న చోట స్కూల్ పాయింట్లోనే వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఎంఈవోలు, హెడ్మాస్టర్ల పర్యవేక్షణలోనే ఇవి కొనసాగాలని, ఎన్జీవోల ద్వారా నిర్వహించరాదని సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి కేంద్రంలో కనిష్టంగా 20 మంది విద్యార్థులు ఉండాలని సూచించారు. మారుమూల, కొండ ప్రాంతాల్లో వీరి సంఖ్య 13 వరకు ఉండొచ్చన్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉండే కమిటీ ఈ కేంద్రాలకు అనుమతి మంజూరు చేస్తుంది. ఈ కేంద్రాల ఏర్పాటుకు సంబంధిత మండలం, పంచాయతీ, గ్రామానికి చెందిన వారికి ప్రాధాన్యమిస్తారు. అర్హులైనవారు లేనిపక్షంలో మండల పరిధిలో లేదా డివిజన్ పరిధిలో ఇతరులకు అవకాశం కల్పిస్తారు. -
తుది తీర్పునకు లోబడే 25% కోటా సీట్ల ఫీజు చెల్లింపు వ్యవహారం
సాక్షి, అమరావతి: విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం కోటా కింద ఉచిత సీట్లు పొందే పిల్లల తల్లిదండ్రులు అమ్మఒడి పథకం చెల్లించే మొత్తం నుంచే ఫీజులు చెల్లించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 24ను సవాలు చేస్తూ ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) అధ్యక్షుడు కోగంటి శ్రీకాంత్, యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ ఫెడరేషన్(యుపీఈఐఎఫ్) చైర్మన్ గొల్లపూడి మోహనరావు హైకోర్టును ఆశ్రయించారు. 25 శాతం కోటా కింద భర్తీ చేసే సీట్ల ఫీజులను తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా పాఠశాలలకు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు కోర్టును కోరారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ శుక్రవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. 25 శాతం కోటా సీట్ల ఫీజులను ప్రభుత్వం సరైన రీతిలో నిర్ణయించలేదని వారు కోర్టుకు నివేదించారు. ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా పాఠశాలల ఖాతాలో సొమ్ము జమ చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. ఫీజు చెల్లింపు వ్యవహారం ఈ వ్యాజ్యాల్లో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లకు నోటీసులిచ్చారు. తదుపరి విచారణను 15కి వాయిదా వేశారు. -
ప్రైవేటు స్కూళ్లలో ఆర్టీఈ చట్టం కింద 1వ తరగతిలో ప్రవేశాలు
సాక్షి, అమరావతి: విద్యాహక్కు (ఆర్టీఈ) చట్టం కింద రాష్ట్రంలోని ప్రైవేటు అన్ఎయిడెడ్ స్కూళ్లలో 2023–24 విద్యాసంవత్సరానికి ఒకటో తరగతిలో అర్హులైన పేద విద్యార్ధులకు 25 శాతం సీట్ల కేటాయింపుపై ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఈమేరకు జీవో 24ను విడుదల చేశారు. ఐబీ (అంతర్జాతీయ), ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్ స్కూళ్లన్నిటిలోను విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లను అర్హులైన పేదలకు కేటాయించాల్సి ఉంటుంది. ఈ సీట్లకు సంబంధించి మార్చి 4న ప్రవేశాల క్యాలెండర్‌తో సహా నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆయా ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లు మార్చి 6 నుంచి 16 వరకు సంబంధిత వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి సంబంధిత వెబ్సైట్ విండో మార్చి 18నుంచి అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 7వ తేదీవరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. అర్హులైన విద్యార్థుల ఎంపిక ఏప్రిల్ 9 నుంచి 12 వరకు చేపడతారు. మొదటి విడత కేటాయింపు ఏప్రిల్ 13న ఉంటుంది. విద్యార్థులు ఏప్రిల్ 15 నుంచి 21వ తేదీలోపు ఆయా స్కూళ్లలో చేరికలను ఖరారు చేసుకోవాలి. అనంతరం రెండోవిడత సీట్ల కేటాయింపు ఏప్రిల్ 25న చేపడతారు. ఈ విద్యార్థులు ఏప్రిల్ 26 నుంచి 30వ తేదీలోపు ఆయా స్కూళ్లలో చేరాలి. రిజిస్ట్రేషన్లను హెచ్‌టీటీపీఎస్://సీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్లో నమోదు చేయాలి. ఈ ప్రైవేటు స్కూళ్లలో ఆర్టీఈ చట్టం కింద ప్రవేశాలకు సంబంధించి సమస్యలు తలెత్తితే 14417 టోల్‌ఫ్రీ నంబరును సంప్రదించాలి. ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాలను, విధివిధానాలను జీవోలో వివరించారు. ఈ స్కూళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఒక్కో విద్యార్థికి పట్టణప్రాంతాల్లో రూ.8 వేలు, రూరల్‌లో రూ.6,500, గిరిజన ప్రాంతాల్లో రూ.5,100 చొప్పున చెల్లిస్తారని జీవోలో తెలిపారు. రాష్ట్రంలోని తమ పిల్లలను బడులకు (ప్రభుత్వ, లేదా ప్రైవేటు) పంపించే అర్హులైన పేద తల్లులందరికీ అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. 75 శాతం, ఆపై హాజరు నిబంధన అమలు చేస్తూ పేద పిల్లలందరికీ అమ్మ ఒడి పథకం వర్తింపజేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో సీట్లు పొందే ఈ పిల్లలకు సంబంధించి ఆయా స్కూళ్లకు చెల్లించాల్సిన ఫీజును నిబంధనలను అనుసరించి అమ్మ ఒడిని అందుకున్న అనంతరం విద్యాసంవత్సరం చివరన ఆయా స్కూళ్లకు రీయింబర్స్ చేస్తారని జీవోలో పేర్కొన్నారు. అలా తల్లిదండ్రులు చెల్లించకపోతే ప్రభుత్వం ఆమొత్తాన్ని తదుపరి అమ్మ ఒడి నుంచి మినహాయించి స్కూళ్లకు చెల్లిస్తుందని తెలిపారు. -
ప్రీ–మెట్రిక్ ఉపకార వేతనం 9, 10 తరగతులకే: కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలయ్యే ప్రీ మెట్రిక్ ఉపకార వేతన పథకాన్ని ఇకపై 9, 10వ తరగతి విద్యార్థులకే వర్తింపజేస్తామని కేంద్రం స్పష్టంచేసింది. గతంలో ఒకటి నుంచి పదో తరగతి దాకా మైనారిటీ విద్యార్థులకు ఈ పథకం కింద స్కాలర్షిప్ వచ్చేది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు నిర్బంధ ఉచిత విద్య అమలవుతున్నందున వారికి ఉపకార వేతన ప్రయోజనాల అవసరం ఉండదని చెప్పుకొచ్చింది. ఇకపై స్కాలర్‌షిప్‌ల కోసం 9, 10 తరగతి విద్యార్థుల దరఖాస్తులనే పరిశీలించాలని రాష్ట్ర, జిల్లా నోడల్ అధికారులకు సూచించింది. దీనిపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ‘దశాబ్దాలుగా లబ్ధి పొందుతున్న పేద విద్యార్థులను ఆర్థికంగా మరింత కుంగదీసేలా బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ఆగ్రహం వ్యక్తంచేశారు. -
ప్రైవేటు స్కూళ్లలో ఒకటో తరగతిలోకి ఉచిత ప్రవేశాలు
సాక్షి, అమరావతి: విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలోకి ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వర్గాలకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీలు, మైనార్టీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 6 శాతం సీట్లు కేటాయిస్తున్నట్లు వివరించారు. ప్రైవేటు స్కూళ్లలో ఒకటో తరగతి విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయిస్తున్నామన్నారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను డీఈవోల ద్వారా ఆయా పాఠశాలల యాజమాన్యాలకు పంపినట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు కూడా సమాచారం అందించామన్నారు. పాఠశాలల యాజమాన్యాలు కూడా ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించాలని ఆదేశించారు. ఈ నెల 12లోపు ప్రవేశాలు పూర్తి చేయాలన్నారు. ఆ తేదీలోపు చేరని వారు అడ్మిషన్లు కోల్పోతారన్నారు. విద్యార్థుల జాబితాను cse.ap.gov.in/DSE/లో ఉంచామన్నారు. ఈ విద్యార్థులకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ తదితర సదుపాయాలు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
ప్రైవేట్ స్కూళ్లలో పేదల పిల్లలకు 25 % సీట్లు
సాక్షి, అమరావతి: పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం సీట్లలో ప్రవేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేయనుంది. ఒకటో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి 25 శాతం సీట్లను పేద వర్గాల పిల్లలతో భర్తీ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ, అనాధ, దివ్యాంగ, హెచ్ఐవీ బాధిత పిల్లలకు రిజర్వేషన్ల వారీగా సీట్ల కేటాయింపు చేపడతారు. ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీ మైనారిటీ, ఓసీలకు 6 శాతం, అనాథ, దివ్యాంగ, హెచ్ఐవీ బాధిత పిల్లలకు 5 శాతం సీట్లు కేటాయించనున్నారు. ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షికాదాయం రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.40 లక్షలు ప్రాతిపదికగా నిర్ణయించారు. ఉచిత నిర్బంధ విద్యకు సంబంధించి బాలల హక్కుల చట్టం–2009 జీవో 20ని సవరిస్తూ జీవో 129లో సవివర మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నారు. మిగిలిపోయిన సీట్లలో ప్రవేశాల కోసం రెండో జాబితా విడుదల చేయనున్నారు. 16 నుంచి దరఖాస్తు ప్రక్రియ 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లలో పేద విద్యార్థులకు ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ఈనెల 16వ తేదీనుంచి ప్రారంభం అవుతుందని కమిషనర్ తెలిపారు. ఆగస్టు 26వ తేదీ వరకు http://cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 1వ తరగతిలో ప్రవేశాలు, జీవో సవరణ వివరాలను వెబ్సైట్లో పొందుపరిచినట్లు వివరించారు. -
కార్పొరేట్ స్కూళ్లలోనూ 'కోటా'
సాక్షి, అమరావతి: పేద విద్యార్ధులకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లను తప్పనిసరిగా కేటాయించేలా చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2022 – 23 విద్యాసంవత్సరం నుంచి దీన్ని పక్కాగా అమలు చేసేలా పాఠశాల విద్యాశాఖ కార్యాచరణ రూపొందించింది. తద్వారా వీటిల్లో ఏటా లక్ష సీట్లు పేద విద్యార్ధులకు అందుబాటులోకి రానున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం పేద పిల్లలందరికీ కార్పొరేట్ స్కూళ్లలో ప్రవేశాలు కల్పించేలా ‘ఇండస్ యాక్షన్’ అనే సంస్థతో పాఠశాల విద్యాశాఖ ఎంవోయూ కూడా కుదుర్చుకుంది. గవర్నెన్స్, టెక్నాలజీ సపోర్టు తదితర అంశాల్లో సంస్థ ప్రభుత్వానికి సహకారం అందించనుంది. ఈ సంస్థ ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ఆర్టీఈ చట్టం అమలుకు తోడ్పాటునిచ్చి లక్షల మంది పేద విద్యార్ధులకు మేలు చేకూర్చింది. ఆర్టీఈపై న్యాయ వివాదాలు.. దేశంలో 6 నుంచి 14 ఏళ్ల వయసు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యకోసం కేంద్ర ప్రభుత్వం 2009లో జాతీయ విద్యాహక్కు చట్టాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టంలోని సెక్షన్ 12 (1సి) ప్రకారం ప్రైవేట్, అన్ ఎయిడెడ్, నాన్ మైనారిటీ, గుర్తింపు పొందిన ప్రతి పాఠశాల యాజమాన్యాలు నర్సరీ, ఎల్కేజీ, లేదా ఒకటో తరగతి నుంచి సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు 25 శాతం సీట్లను కేటాయించాలి. చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించి దశాబ్దం దాటినా కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అమలవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2010లోనే ఆర్టీఈ చట్టాన్ని నోటిఫై చేసినా విధానపరమైన కారణాలతో పాటు కోర్టు స్టే ఉత్తర్వుల కారణంగా పేద విద్యార్ధులకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో 25 శాతం కోటా అమలుకు నోచుకోలేదు. సీఎం ఆదేశాలతో కోటాపై కదలిక వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీఈ చట్టం అమలుపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద పిల్లలకు 25 శాతం కోటా ప్రకారం సీట్లు కేటాయించేలా చర్యలు చేపట్టారు. వరుసగా రెండేళ్లు కరోనా కారణంగా పాఠశాలలు మూతబడిన నేపథ్యంలో కొంత జాప్యం జరిగింది. తాజాగా ఈ ఏడాది నుంచి కోటా అమలుకు సన్నద్ధమైంది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని, త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ తెలిపారు. ఫీజులపై నిర్ణయానికి కమిటీ అందరికీ సమాన విద్యావకాశాలు కల్పించేందుకు 25 శాతం కోటా తోడ్పడనుంది. ఆర్థిక స్థోమత లేక కార్పొరేట్ స్కూళ్లలో విద్యను పేద విద్యార్థులు అందుకోలేకపోతున్నారు. ఆర్టీఈ చట్టాన్ని అమలు చేయడం ద్వారా పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో 25 శాతం కోటా కింద సీట్లను కేటాయించి ఫీజులను ప్రభుత్వమే యాజమాన్యాలకు చెల్లిస్తుంది. స్కూళ్లు, తరగతుల వారీగా చెల్లించాల్సిన ఫీజులపై పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే కమిటీని నియమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆయా తరగతుల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని అనుసరించి ప్రైవేట్ స్కూళ్లకు ఫీజులను చెల్లించనున్నారు. ఏటా లక్ష మందికి అవకాశం ఆర్టీఈ చట్టం ప్రకారం 25 శాతం కోటా అమలుతో రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో దాదాపు లక్ష సీట్లు పేద పిల్లలకు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. గత ఏడాది లెక్కల ప్రకారం 9,500 స్కూళ్లలో 35 వేల సీట్లు ఈ విద్యాసంవత్సరంలో పేద పిల్లలకు అందనున్నాయి. -
బాలలకు భద్రత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. ప్రధాన ప్రభుత్వ శాఖలన్నింటినీ సమన్వయపరుస్తోంది. బాలల హక్కుల పరిరక్షణకు వచ్చే నెలలో ప్రత్యేకంగా ‘కంప్లైంట్ మానిటరింగ్ సెల్ (సీఎంఎస్)’ ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా వచ్చే విజ్ఞాపనలు, ఫిర్యాదులను పరిశీలించి సమన్వయం చేసేందుకు రాష్ట్రస్థాయిలో ఒక సమన్వయకర్త (కోఆర్డినేటర్)ను నియమిస్తారు. ప్రతి గ్రామ, పట్టణాల్లోని వార్డు స్థాయిల్లో అధికారులకు బాధ్యతలు అప్పగిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, మహిళా పోలీస్, వలంటీర్లను సైతం భాగస్వాముల్ని చేస్తారు. ఇందుకోసం ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రత్యేక కసరత్తు ప్రారంభించింది. ప్రాథమికంగా దృష్టి సారించిన కీలక అంశాలు, చర్యలు ► విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయనున్నారు. ► బాలలపై లైంగిక వేధింపులు, లైంగిక దాడులు తదితర నేరాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా పోలీస్ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తారు. పోక్సో చట్టంతోపాటు బాలల హక్కులపైన పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ► బాలల అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపనుంది. పేదరికం, ఆర్థిక సమస్యలు, కోవిడ్ నేపథ్యంలో చితికిపోయిన కుటుంబాలకు చెందిన బాలలు అక్రమ రవాణా బారిన పడుతున్నారు. గ్రామాలు, పట్టణాల్లో తేలిగ్గా డబ్బు సంపాదన మరిగిన కొందరు బ్రోకర్లు బాలలను కార్మికులుగా, బలవంతపు వ్యభిచారానికి, కిరాయి యాచక వృత్తిలోకి దింపుతున్నారు. బాలలపై ఈ క్రూరత్వాన్ని కట్టడి చేసేలా చర్యలు చేపట్టింది. ► ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో బాల్య వివాహాలు, డ్రాపవుట్స్ (బడి మానేయడం) వంటి వాటిని నివారించేందుకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లను భాగస్వాముల్ని చేయనున్నారు. ► దత్తత పేరుతో జరుగుతున్న దగాను నివారించడంపై దృష్టి పెట్టారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దత్తత రిజిస్ట్రేషన్ చెల్లదనే విషయంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పిల్లల దత్తతకు కేంద్ర, రాష్ట్ర మార్గదర్శకాలు కచ్చితంగా పాటించేలా ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కఠినంగా అమలు చేయనున్నారు. ► భ్రూణ హత్యలకు దారితీసే లింగ నిర్ధారణ పరీక్షలు, ఆడ శిశువులను వదిలించుకునేలా రోడ్డు, చెత్త కుప్పల్లో వదిలేసే దారుణాలు, సరోగసి (అద్దె గర్భాల) మాఫియాలపైనా దృష్టి పెట్టారు. ప్రభుత్వ యంత్రాంగం జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులు, పోలీసులను సమన్వయపరిచి ఈ మాఫియాపై కఠిన చర్యలు చేపడుతున్నారు. ► బాలల స్వీయ రక్షణకు తోడ్పడే దిశ అప్లికేషన్ (యాప్)పై ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతోంది. పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టి రోడ్డుపైన, విద్యాలయాల్లో బాలల మొబైల్ ఫోన్లలో దిశ యాప్‌ను ఇన్స్టాల్ చేయిస్తున్నారు. ఈ యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ఆపద సమమంలో దిశ యాప్ రక్షణ కవచంలా ఉంటుందని బాలలు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు. పది ప్రభుత్వ శాఖలతో సమన్వయం బాలల హక్కులు, సమస్యలపై పది ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తున్నాం. ప్రధానంగా వైద్య ఆరోగ్య, విద్య, పోలీస్, కార్మిక, పంచాయతీరాజ్, మహిళా శిశు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలతోపాటు లీగల్ సర్వీసెస్ అథారిటీ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమన్వయంతో బాలల సమస్యల పరిష్కారానికి కృషి జరుగుతోంది. – డాక్టర్ కేసలి అప్పారావు, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ -
పక్కాగా లెక్క.. బడి బయట పిల్లలెందరు..?
సాక్షి,మేడ్చల్ జిల్లా: బడి ఈడు పిల్లల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని అమలు చేస్తున్నాయి. పలు కారణాలతో మధ్యలో బడిమానేసిన వారిని తిరిగి చదువు బాట పట్టించే చర్యలను విద్యాశాఖ తీసుకుంటోంది. ఇందులో భాగంగా బడిమానేసిన పిల్లల వివరాలు సేకరించాలని ఆదేశించింది. చదువుకు దూరమైన పాఠశాల స్థాయిలో 06–14. కళాశాల స్థాయిలో 15–19 ఏళ్ల వారిపై క్షేత్రస్థాయిలో సర్వే చేసేందుకు సిద్ధమవుతున్నారు. సీఆర్పీలు ఇంటింటికీ వెళ్లి ‘ప్రభంద’ పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. నేటి నుంచి ప్రారంభం గ్రేటర్‌తో సహా శివారు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధిలో 2,498 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ఇందులో మేడ్చల్ జిల్లాలో 515, రంగారెడ్డి జిల్లాలో 1,301, హైదరాబాద్ జిల్లాలో 682 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో బడిమానేసిన విద్యార్థుల వివరాల జాబితా అందుబాటులో ఉంది. దీని ఆధారంగా పది, ఇంటర్, డిగ్రీ.. ఏ దశలో విద్యను మానేశారో స్పష్టంగా తేల్చనున్నారు. గురువారం నుంచి వచ్చే నెల 12 వరకు గ్రామపంచాయతీ, పురపాలక సంఘాలు, జీహెచ్ఎంసీ పరిధిలో విద్యాశాఖకు చెందిన ఐఈఆర్పీలు, సీఆర్పీలు క్షేత్రస్థాయి సర్వే నిర్వహించనున్నారు. ఉదయం..సాయంత్రం.. ఎండల తీవ్రత బడి బయట పిల్లల సర్వేపై ప్రభావం చూపనుంది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో సర్వే చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఆసక్తి ఉన్న వారిని వృత్తి విద్యా కోర్సులో చేర్పించనున్నారు. ఉన్నత విద్యా ఫలాలు అందించి జీవితంలో స్థిరపడేలా చేయూతనివ్వనున్నారు. సర్వే వేగవంతం చేసేలా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షిస్తారు. పక్కాగా వివరాల సేకరణ చదువుకునే వయస్సులో ఆర్థిక స్తోమత, కుటుంబ పరిస్థితుల కారణంగా పలువురు చిన్నారులు బడికి వెళ్లడంలేదు. ఉన్నత విద్య అభ్యసించాలనే వారి ఆశయం నెరవేరడం లేదు. ఈ సర్వేలో విద్యార్థి పేరు, ఆధార్, సెల్‌ఫోన్ నంబరు, ఏ తరగతిలో బడి మానేశారు. కారణాలు ఏమిటి..? తల్లి స్వశక్తి సంఘంలో సభ్యురాలిగా ఉందా? తల్లితండ్రుల వృత్తి, ప్రత్యేక అవసరాల పిల్లలు, వలస కూలీల పిల్లల సమాచారాన్ని సేకరించి నమోదు చేయనున్నారు. గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా సర్వే మొక్కబడిగా సాగింది. ప్రస్తుతం ఆయా వివరాల సేకరణ పక్కాగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.కొందరు ఇంటివద్దనే ఉంటూ కూలీ పనులకు వెళుతున్నారు. మరికొందరు కుల వృత్తిలో కొనసాగుతూ.. విద్యకు దూరమవుతున్నారు. గత సర్వేలో బడి బయట పిల్లల సంఖ్య –1226 బడి బయట పిల్లల వివరాలకు సంబంధించి 2020–21లో విద్యాశాఖ సర్వే నిర్వహించగా ,గ్రేటర్‌తో సహా శివారు జిల్లాల్లో 1226 మంది లెక్క తేల్చారు. ఇందులో మేడ్చల్ జిల్లాలో 294 , రంగారెడ్డి జిల్లాలో 413, హైదరాబాద్ జిల్లాలో 519 మంది ఉండగా, వీరందరికీ ఆయా పాఠశాలలు, సార్వత్రిక విద్యాలయాల్లో ప్రవేశాలు కల్పించి చదువుకునేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంది. (చదవండి: జల్లు..ఝల్లు) -
పేద వర్గాల పిల్లలకు ఆన్లైన్ విద్య
న్యూఢిల్లీ: దేశంలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈడబ్ల్యూఎస్), అణగారిన వర్గాల పిల్లలకు ఆన్లైన్ విద్య అందుబాటులో ఉండడం లేదని, ఫలితంగా వారు ఎంతో నష్టపోతున్నారని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో విద్యా హక్కు చట్టాన్ని (ఆర్టీఈ) కచ్చితంగా అమలు చేసే దిశగా ఒక వాస్తవిక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాలని కేంద్ర, ప్రభుత్వాలకు శుక్రవారం సూచించింది. ఆన్లైన్ తరగతులు వినడానికి వీలుగా పేద విద్యార్థులకు పరికరాలు(స్మార్ట్ ఫోన్లు లేదా ల్యాప్‌ట్యాప్‌లు) అందజేయాలని, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని ఢిల్లీ హైకోర్టు 2020 సెప్టెంబర్ 18న ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ గుర్తింపు పొందిన అన్–ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్ల యాక్షన్ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్, బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఏను నిజం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అది జరగాలంటే పేద, అణగారిన వర్గాల పిల్లలకు ఆన్లైన్ విద్యను నిరాకరించరాదని స్పష్టం చేసింది. వారికి ఆన్లైన్ విద్య అందకపోతే సంపన్న కుటుంబాల పిల్లల కంటే వెనుకబడే ప్రమాదం ఉందని, ఇరు వర్గాల మధ్య అంతరం పెరిగిపోతుందని తెలిపింది. మంచి తీర్పు ఇచ్చిన ఢిల్లీ హైకోర్టును సుప్రీంకోర్టు ధర్మాసనం అభినందించింది. -
AP: జీవో- 44 అమలుపై స్టే ఎత్తివేత
సాక్షి, అమరావతి: ప్రైవేట్ పాఠశాలల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలన్న విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) నిబంధనల అమలులో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై గతంలో విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది. విద్యాహక్కు చట్టం అమలును సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలో ఈ చట్టాన్ని అసలైన స్ఫూర్తితో అమలు చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో అదనపు అఫిడవిట్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి గడువునిచ్చిన హైకోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది. ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యా యమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 25 శాతం ఉచిత సీట్ల నిబంధనను ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ న్యాయవాది తాండవ యోగేష్ 2017లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, పిటిషనర్ యోగేష్ వాదనలు వినిపిస్తూ.. 25 శాతం సీట్ల కేటాయింపు నిబంధనల అమలు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 44 అమలుపై హైకోర్టు గతంలో స్టే విధించిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనివల్ల ప్రతి విద్యా సంవత్సరంలో లక్షల మంది పిల్లలు ఉచిత సీట్లను కోల్పోతున్నారని వివరించారు. ఇది విద్యాహక్కు చట్టాన్ని నీరుగార్చడమేనన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, 25 శాతం సీట్ల కేటాయింపు నిబంధన అమలు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 44పై గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. -
ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లపై ఆగస్టు 9న విచారణ
సాక్షి, అమరావతి: ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలని విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) నిబంధనలు చెబుతున్నాయని, ఈ నిబంధనను అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఆగస్టు 9న విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 25 శాతం ఉచిత సీట్ల నిబంధనను ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ న్యాయవాది తాండవ యోగేష్ 2017లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. గురువారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, పిటిషనర్ యోగేష్ స్వయంగా వాదనలు వినిపిస్తూ, చట్ట నిబంధనలు ఇప్పటికీ అమలు కావడం లేదన్నారు. పాఠశాలలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ ఆగస్టు 9న ఈ వ్యాజ్యంపై విచారణ చేపడుతామని స్పష్టం చేసింది. -
పదేళ్ల నుంచి ఏం చేస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యాహక్కు చట్టం అమలుపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. 2010 నుంచి పెండింగ్‌లో ఉన్న పలు పిల్స్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. పూర్తి వివరాలతో సోమవారం కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలుపగా, 10 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. విద్యా హక్కు చట్టం అమలవుతుందా? లేదా? అని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది (చదవండి: రోజు పది మందే చనిపోతున్నారా?: హైకోర్టు) నిధులు, ఖర్చుల వాటాలపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదని, హైకోర్టు ఆదేశించినప్పటికీ కేంద్రం తన వైఖరి వెల్లడించలేదని రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. బడ్జెట్ వివాదాలను ఈనెల 17లోగా పరిష్కరించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. మరో వాయిదా ఇచ్చేది లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు స్పష్టం చేసింది. ఈనెల 18న తుది విచారణ చేపడతామని హైకోర్టు వెల్లడించింది. (చదవండి: అది రాజ్యాంగ విరుద్ధం) -
ఇంగ్లిష్ మీడియంపై సిఫార్సులివ్వండి
సాక్షి, అమరావతి: ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన అమలుపై రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ప్రభుత్వానికి త్వరలోనే సిఫార్సులు అందించనుంది. వీటి ఆధారంగా ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. విద్యార్థుల తల్లిదండ్రుల్లో అత్యధికులు ఆంగ్ల మాధ్యమానికే మొగ్గు చూపిన దృష్ట్యా ఆ మాధ్యమం అమలుకు వీలుగా సిఫార్సులు అందించాలని ప్రభుత్వం ఎస్సీఈఆర్టీకి సూచించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ శుక్రవారం ఉత్తర్వులు (జీవో–21) జారీ చేశారు. ఆంగ్ల మాధ్యమం అమలుపై హైకోర్టు తీర్పు మేరకు ఏపీ విద్యా చట్టం (ఎడ్యుకేషన్ యాక్ట్)లోని సంబంధిత సెక్షన్లను అనుసరించి ప్రభుత్వానికి సిఫార్సులు సమర్పించాలని జీవోలో పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో గతంలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి అమలు చేసిన తీరు, అందుకు దశలవారీగా తీసుకున్న చర్యలకు సంబంధించిన అంశాలను కూడా నివేదికల్లో పొందుపర్చాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్‌తో పాటు విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ)లోని సంబంధిత అవకాశాలను కూడా పరిశీలించి సిఫార్సుల్లో పొందుపర్చాలన్నారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఆంగ్ల మాధ్యమం వైపు తల్లిదండ్రుల మొగ్గు ► ఆంగ్ల మాధ్యమంపై హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు కావడంతో ప్రభుత్వం ఇచ్చిన జీవోలు 81, 85లను రద్దు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ► అకడమిక్ అంశాలపై అధికారాలు ఎస్సీఈఆర్టీవేనని, విద్యాహక్కు చట్టం ప్రకారం అకడమిక్ వ్యవహారాల్లో ఎస్సీఈఆర్టీ ప్రమేయం లేకుండా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని తీర్పులో పేర్కొంది. ► అదే సమయంలో నిర్ణయం తీసుకునే ముందు మాధ్యమంపై తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదని తీర్పులో అభిప్రాయపడింది. ► ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం (2020–21)లో తమ పిల్లలకు ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారనే దానిపై విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకోవాలని పాఠశాల విద్యా కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ► ఈ ఆదేశాల మేరకు తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించిన కమిషనర్ ప్రభుత్వానికి నివేదించారు. ► 1 నుంచి 5 తరగతి వరకు చదువుతున్న 17,87,035 మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆప్షన్లు కోరగా.. 17,85,669 మంది నుంచి ఆప్షన్లు అందాయి. ► 96.17 శాతం మంది ఆంగ్ల మాధ్యమం.. 3.05 శాతం మంది తెలుగు మాధ్యమం, 0.78 మంది ఇతర మైనర్ మాధ్యమాలు కావాలని ఆప్షన్లు ఇచ్చారు. ► హైకోర్టు తీర్పును అనుసరించి నిర్వహించిన ఆప్షన్ల సేకరణలో మాధ్యమంపై పిల్లలు/తల్లిదండ్రుల అభిప్రాయాలు ఇలా ఉన్న నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుపై తగిన సిఫార్సులు అందించాలని ప్రభుత్వం ఈ జీవోలో ఎస్సీఈఆర్టీని కోరింది. -
ప్రమాణాలే ప్రామాణికం
సాక్షి, అమరావతి: ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, ప్రమాణాలు పాటించని విద్యా సంస్థలపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ స్పష్టం చేసింది. పాఠశాలల్లో బోధన, నిర్వహణ ఖర్చులను అనుసరించి ఏప్రిల్ నాటికి ఫీజులు నిర్ణయిస్తామని తెలిపింది. ఫీజులపై చట్టబద్ధమైన విధివిధానాలు లేనందున ప్రత్యేక చట్టం కోసం ప్రభుత్వానికి లేఖ రాస్తామని పేర్కొంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లు పేదలకు అందాలని, దీన్ని అమలు చేయిస్తామని పేర్కొంది. సోమవారం విజయవాడలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కమిషన్ చైర్మన్ జస్టిస్ కాంతారావు, వైస్ చైర్మన్ డాక్టర్ ఎ.విజయశారదారెడ్డి, కార్యదర్శి ఎ.సాంబశివారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల్లో వసతులు, ఫీజులు.. విద్యార్థులు– ఉపాధ్యాయుల నిష్పత్తి, మరుగుదొడ్లు, మంచినీరు, తరగతి గదులు, లైబ్రరీ లాంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని తనిఖీలు చేశామన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పారు. వారు వెల్లడించిన వివరాలు ఇంకా ఇలా.. 260 విద్యా సంస్థల్లో తనిఖీలు – రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 13, 14వ తేదీల్లో 130 ప్రైవేట్ పాఠశాలలు, 130 ప్రైవేట్ జూనియర్ కాలేజీలను తనిఖీ చేయగా నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించాం. – లోపాలపై విద్యా సంస్థలకు నోటీసులిస్తాం. గడువులోగా సరిదిద్దుకోకుంటే చట్టపరమైన చర్యల కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం. దిద్దుబాటుకు అవకాశం లేని విద్యాసంస్థల గుర్తింపు రద్దుకు సిఫార్సు చేస్తాం. – సీబీఎస్ఈ, ఐసీఎస్సీ పాఠశాలలు, కాలేజీల విషయంలో కూడా ఫీజులు, ఇతర అంశాలపై ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలుంటాయి. – పాఠశాలలు ఫీజు రూ.70 వేలు చెబుతూ రూ.95 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. సృజనాత్మక బోధనకు బదులుగా బట్టీ విధానాల్లో పాఠాలు చెబుతున్నారు. – ప్రతి యూనిట్ టెస్టుకు విద్యార్ధులను ఒక సెక్షన్ నుంచి మరో సెక్షన్‌కు మారుస్తున్నారు. కఠిన శిక్షలు అమలు చేస్తుండడంతో విద్యార్థులు ఒత్తిడితో మానసిక స్థైర్యం కోల్పోతున్నారు. – విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు ఎక్కడా లేవు. బాలికలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 40 మంది పట్టే తరగతి గదుల్లో 80 – 100 మంది వరకు ఉంటున్నారు. – ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు పూర్తి అపరిశుభ్ర వాతావరణంలో కొనసాగుతున్నాయి. విద్యార్థులతో పాటు సిబ్బంది పరిస్థితి దయనీయంగా ఉంది. రోజువారీ కూలీలకన్నా తక్కువ వేతనాలు ఇస్తున్నారు. – గతంలో విద్యార్థుల ఆత్మహత్యలు కూడా చోటు చేసుకున్నాయి. – ఇంజనీరింగ్, డాక్టర్ విద్య మాత్రమే చదువులన్నట్లుగా కార్పొరేట్ విద్యాసంస్థల ప్రచారం వల్ల విద్యార్థుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతూ ఒత్తిడికి గురవుతున్నాయి. నిబంధనల మేరకు వ్యవహరించాల్సిందే మీడియా సమావేశంలో కమిషన్ చైర్మన్ జస్టిస్ కాంతారావు, వైస్ చైర్మన్ డాక్టర్ విజయశారదారెడ్డి, కార్యదర్శి ఎ.సాంబశివారెడ్డి రాష్ట్రంలో ఏ విద్యా సంస్థ అయినా ప్రభుత్వ విధివిధానాల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. సొసైటీల పేరిట కొన్ని సంస్థలు ఫీజుల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ప్రతి విద్యా సంస్థకు సంబంధించిన ఐటీ రిటర్న్‌లను తెప్పించి పరిశీలిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ విద్యాబోధన, ప్రమాణాల విషయంలో స్పష్టమైన వైఖరితో ఉంది. నాణ్యతా ప్రమాణాలపై అలసత్వాన్ని ఉపేక్షించం. – జస్టిస్ కాంతారావు అనువైన వాతావరణం లేదు ప్రైవేట్ సంస్థలు నిపుణులైన ఉపాధ్యాయులను నియమించడం లేదు. బోధనా సిబ్బంది నాలుగైదు బ్రాంచిలకు వెళ్లి పాఠాలు చెబుతున్నారు. 3, 4, 5 తరగతుల పిల్లలకు ప్రత్యేక తరగతులంటూ ఇబ్బంది పెడుతున్నారు. సరైన ఆటస్థలం, చదువుకునేందుకు అనువైన వాతావరణం ఎక్కడా లేదు. అపార్టుమెంట్లు, బహుళ అంతస్థుల భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్, ఈ–మెయిల్ ప్రవేశపెడుతున్నాం. – విజయ శారదారెడ్డి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యాచట్టం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మఒడి, నాడు–నేడు కార్యక్రమాలతో ప్రభుత్వ విద్యాలయాలను అభివృద్ధి చేస్తున్నారు. గత ప్రభుత్వం విద్యను వ్యాపారంగా మార్చింది. చంద్రబాబు బినామీ సంస్థలైన నారాయణ, చైతన్య విద్యాసంస్థలు ఇష్టానుసారం వ్యవహరించాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యాచట్టాన్ని మార్చి, సింగిల్ విండో ద్వారా ఆన్లైన్లో అనుమతులు ఇచ్చే విధానాన్ని రూపొందిస్తాం. – ఆలూరు సాంబశివారెడ్డి -
వయసు ఒకటే..తరగతులే వేరు!
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లు నిండిన వారినే ఒకటో తరగతిలో చేర్పించాలి.. ఇదీ విద్యా హక్కు చట్టం చెబుతున్న నిబంధన. అందుకు భిన్నంగా ఉంది రాష్ట్రంలో పిల్లల పరిస్థితి. ఐదేళ్లు నిండని పిల్లలు కొందరు ప్రీప్రైమరీలో ఉంటే, మరి కొందరు ఒకటో తరగతి చదువుతు న్నారు. ఇక ఆరేళ్లు వచ్చినా కొందరు ఇంకా ప్రీప్రైమరీ స్కూళ్లోనే/అంగన్ వాడీ కేంద్రాల్లోనే ఉండగా, కొందరు ఒకటో తరగతిలో ఉన్నారు. ఆయా విద్యార్థుల వయసు ఒక్కటే ఐనా, చదివే తరగతులు వేర్వేరు. తల్లిదం డ్రుల ఆకాంక్షలు, సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఈ అంతరాలకు కారణం. పిల్లలను త్వరగా చదివించాలన్న తప నతో కొందరు తల్లిదండ్రులు రెండేళ్లకే పిల్లలను ప్రీప్రైమరీ స్కూళ్లకు పంపి స్తుంటే.. ఐదేళ్లు నిండకుండానే ఒకటో తరగతికి వచ్చేస్తున్నారు. పల్లెల్లో ఆర్థిక స్తోమత లేని నిరుపేదలు తమ పిల్ల లను ప్రైవేటు ప్రీప్రైమరీ స్కూళ్లకు పంపించకుండా ఆరేళ్లు వచ్చినా అంగన్వాడీ కేంద్రాలకే పంపుతుం డగా, మరికొంత మంది తల్లిదండ్రులు మాత్రం ఐదేళ్లు నిండాకే తమ పిల్లలను ఒకటో తరగతిలో చేర్చుతున్నారు. రాష్ట్రంలో ప్రీప్రైమరీ, ప్రైమరీస్కూళ్లలో ప్రవేశాల తీరుపై ‘ప్రథమ్’ సంస్థ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు (అసర్) పేరుతో సర్వే చేసింది. ఇందులో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. 24 రాష్ట్రాల్లోని 26 జిల్లాల్లో సర్వే.. దేశంలోని 24 రాష్ట్రాలకు చెందిన 26 జిల్లాల్లోని 1,514 గ్రామాల్లో అసర్ ప్రతినిధులు ఈ సర్వేను నిర్వహించారు.ఆయా గ్రామాల్లోని 30,425 ఇళ్లు తిరిగి 4 నుంచి 8 ఏళ్ల వయసున్న 36,930మంది పిల్లలతో మాట్లాడి వివరాలను సేకరించారు. అందులో రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని 60గ్రామాలకు చెందిన 1,201 ఇళ్లను తిరిగి 1,426 మంది విద్యార్థులను కలిసి, 4 నుంచి 8 ఏళ్ల వయసు పిల్లల స్థితిగతులపై నివేదికను రూపొందించారు. తాజాగా ఢిల్లీలో విడుదల చేసిన నివేదికలోని ప్రధానాంశాలు ►రాష్ట్రంలో ఐదేళ్ల వయసున్న విద్యార్థుల్లో 21.6 శాతం మంది ఒకటో తరగతి చదువుతుండగా, మిగతా వారు అంగన్వాడీ/ప్రీప్రైమరీ తరగతులు చదువుతున్నారు. ►ఇక ఆరేళ్ల వయసు వారిలో 32.8 శాతం మంది అంగన్వాడీ కేంద్రాలు/ప్రీప్రైమరీ స్కూళ్లలో ఉన్నారు. ఇక 46.4 శాతం మంది ఒకటో తరగతి చదువుతుండగా, 18.7 శాతం మంది రెండో తరగతి, మిగతా వారు ఆపై తరగతుల్లో ఉన్నారు. ►4 నుంచి 8 ఏళ్ల వయసు వారిలో బాలికలు ఎక్కువ మంది ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేరగా, బాలురు ఎక్కువ మంది ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉన్నారు. ►నాలుగైదేళ్ల వయసు పిల్లల్లో 56.8% మంది బాలికలు ప్రభుత్వ ప్రీప్రైమరీ స్కూల్స్/అంగన్వాడీ కేంద్రాల్లో ఉండగా, బాలురు మాత్రం 50.4% మందే ప్రభుత్వ సంస్థల్లో ఉన్నారు. ►అదే వయసు పిల్లలు ప్రైవేటు ప్రీప్రైమరీ స్కూళ్లలో 43.2% బాలికలుండగా, బాలురు 49.6% ఉన్నారు. ►6 నుంచి 8 ఏళ్ల వయసు పిల్లల్లో 61.1% బాలికలు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్తుండగా, బాలురు 52.1% మందే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్నట్లు తేలింది. 10 మందిలో ప్రతి నలుగురు తక్కువ వయసు వారే.. విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతిలో చేరాలంటే ఐదేళ్లు నిండి ఉండాలి. కానీ రాష్ట్రంలో ఒకటో తరగతిలో చేరిన ప్రతి 10 మందిలో సగటున నలుగురు ఐదేళ్లు నిండని వారే ఉన్నట్లు సర్వేల్లో వెల్లడించింది. నిబంధనల ప్రకారం ఆరేళ్లకు వచ్చి ఒకటో తరగతిలో చేరిన వారు 41.7 శాతమే ఉన్నట్లుగా తేలింది. అలాగే ఒకటో తరగతిలో చేరిన వారిలో ఏడెనిమిదేళ్ల వయసు వారు 36.4 శాతం ఉండగా, నాలుగైదేళ్ల వయసు వారు 21.9 శాతం ఉన్నట్లుగా వెల్లడైంది. -
టెట్టా.. టెట్ కమ్ టీఆర్టీనా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో వాటి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో కోటి ఆశలు వెల్లివిరుస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం అయిదేళ్ల పాటు టీచర్‌పోస్టులు భర్తీచేయకుండా కాలక్షేపం చేసింది. ప్రయివేటుకు ప్రోత్సాహం అందించేందుకు వీలుగా ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు లేక బోధన కుంటుపడినా పట్టించుకోలేదు. గత ఏడాది అక్టోబర్‌లో 7,902 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసినా నిబంధనల్లో సమస్యల కారణంగా వాటిపై న్యాయ వివాదాలు ఏర్పడి నేటికీ తేలలేదు. ఈ నేపథ్యంలో ఖాళీ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి ఆదేశించడంతో విద్యాశాఖ ఆ అంశంపై ప్రస్తుతం దృష్టి సారించింది. రానున్న నోటిఫికేషన్ కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఈ పోస్టుల అర్హతకు అవసరమైన టీచర్ ఎలిజిబులిటీ టెస్టు (టెట్)ను వేరేగా నిర్వహిస్తారా? లేక టీచర్ రిక్రూట్మెంట్తో కలిపి పెడతారా? అని తర్జనభర్జన పడుతున్నారు. గత ప్రభుత్వం తడవకో విధానాన్ని అనుసరించడంతో ఈసారి ఏ విధానం అమలు చేస్తారోనన్న ఆందోళనలో ఉన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీలో నిర్దిష్ట పద్ధతిని పాటించకపోవడంతో అభ్యర్ధుల్లో ఈ గందరగోళం నెలకొంది. టెట్‌ను రిక్రూట్‌మెంటును కలిపేసి.. ఏటా రెండుసార్లు టెట్ పెట్టాల్సి ఉన్నా రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీ ప్రభుత్వం పెట్టలేదు. అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్ణయించిన పోస్టుల భర్తీకోసం ప్రభుత్వం టెట్‌ను, డీఎస్సీ రెండిటినీ కలిపి 2015లో నిర్వహించింది. ఆ తరువాత మళ్లీ టెట్, డీఎస్సీల ఊసేలేదు. అభ్యర్థుల నుంచి టీచర్ పోస్టుల భర్తీకి ఆందోళనలు రావడంతో 2018 ఫిబ్రవరి, మేలలో టెట్‌ను పెట్టారు. తరువాత డీఎస్సీ–2018కు వచ్చేసరికి విధానాన్ని మార్పుచేశారు. 2018 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంటు, భాషాపండితుల పోస్టులకు రిక్రూట్మెంటు టెస్టును పెట్టారు. బీఈడీ అభ్యర్ధులకు కొత్తగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అవకాశం కల్పిస్తూ ఎన్సీటీఈ నిర్ణయం తీసుకోవడంతో ఎస్జీటీ పోస్టులకు టెట్ కమ్‌టీఆర్టీని పెట్టారు. కాలపరిమితి ముగుస్తుండడంతో.. ఏడేళ్ల కాలపరిమితి నిబంధనతో ప్రస్తుతం 2014 టెట్, 2018 టెట్లలో ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే డీఎస్సీకి అర్హత ఉంటుంది. అయితే గతంలో టెట్‌లో ఉత్తీర్ణులై కాలపరిమితి దాటిన వారు, టెట్లలో అర్హత సాధించలేని వారు టెట్ కోసం ప్రస్తుతం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం టెట్‌ను ఏటా నిర్వహించి ఉన్నట్లయితే ఏదో ఒకసారి తాము అర్హత సాధించి టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఉండేదని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం డీఎస్సీకి నిర్ణయించడంతో ఈసారి ఏ విధంగా పరీక్ష నిర్వహిస్తారన్న చర్చ వారిలో కొనసాగుతోంది. టెట్‌ను వేరేగా పెడితేనే ఆధ్రువపత్రానికి ఏడేళ్లపాటు వేలిడేషన్ ఉంటుంది కనుక అదే తమకు మేలని వారు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ హయాంలో ఒక్కోసారి ఒక్కో విధానం ఉపాధ్యాయ పోస్టుల నియామకాలను గతంలో డీఎస్సీ ద్వారా ఎంపిక పరీక్ష నిర్వహించి భర్తీ చేసేవారు. జాతీయ విద్యాహక్కు చట్టం ఏర్పాటు తరువాత టీచర్‌పోస్టుల ఎంపికకు టీచర్ ఎలిజిబులిటీ టెస్టును నిర్వహించాలన్న నిబంధన అమల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రమైనా టీచర్ ఎలిజిబులిటీ టెస్టును తప్పనిసరిగా పాటించాలని అందులో పేర్కొన్నారు. ఈ టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే టీచర్ పోస్టులకు అర్హులవుతారు. ఆయా రాష్ట్రాలు టీచర్ పోస్టుల భర్తీకి తమతమ పద్ధతుల్లో ఎంపిక పరీక్షలు నిర్వహించినా టెట్ పాసైన వారిని మాత్రమే వాటికి అనుమతించాలి. టెట్ పాసైన వారికి ఆ ధ్రువపత్రం చెల్లుబాటు ఏడేళ్ల వరకు ఉంటుంది. అయితే తమిళనాడు ప్రభుత్వం తాను ప్రత్యేక పరీక్ష నిర్వహించకుండా టెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపికలు నిర్వహించగా, బీహార్ వంటి కొన్ని రాష్ట్రాలు టెట్‌ను లేకుండా నేరుగా తమ ఎంపిక పరీక్షల ద్వారానే టీచర్‌పోస్టుల భర్తీ చేపట్టాయి. దీంతో టీచర్ పోస్టులకు ఈ అర్హత పరీక్ష తప్పనిసరిగా నిర్వహించాల్సిందేనని ఎన్సీటీఈ ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి ఏపీలో కూడా 2009లో విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చినా 2011 జులైలో మొదటి టెట్‌ను, 2012 జనవరిలో రెండో టెట్‌ను, అదే ఏడాది జూన్‌లో మూడో టెట్‌ను నిర్వహించారు. ఆ తరువాత 2013లో టెట్ నోటిఫికేషన్ వచ్చినా ఆ పరీక్షను మళ్లీ 2014 మార్చిలో పెట్టారు. ఈ టెట్‌లో పేపర్1లో 40,688 మంది, పేపర్2లో 115510 మంది అర్హత సాధించారు. -
విద్యా సంస్థల నియంత్రణకు ప్రత్యేక కమిషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థల్లో అత్యున్నత ప్రమాణాల సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రతి విద్యా సంస్థ ప్రభుత్వ నిబంధనల మేరకు మౌలిక సదుపాయాల కల్పన, ఫీజుల వసూ లు, ఉన్నత ప్రమాణాలను పాటించేందుకు వీలుగా పాఠశాల విద్య, ఉన్నత విద్యలకు వేర్వేరుగా ప్రత్యేక కమిషన్లను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ శుక్రవారం శాసనసభలో బిల్లులను ప్రవేశపెట్టారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు చైర్మన్లుగా ఉండే ఈ కమిషన్లలో ఆయా రంగాల్లో నిపుణులు, మేధావులను సభ్యులుగా నియమించనున్నారు. రెండు కమిషన్లకు సివిల్ కోర్టు అధికారాలుంటాయి. అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించడం, విద్యా సంస్థల్లో చేరికలు పెంచడం, డ్రాపవుట్లు తగ్గించడం, సుస్థిర విద్యాభివృద్ధి సాధన, లక్ష్యాల సాధన దిశగా విద్యార్థులకు అవకాశాలు కల్పించడం ఈ బిల్లుల ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్.. ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల కింద ఉన్న 62,063 పాఠశాలల్లో 70,41,568 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో 2,87,423 మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీటితో పాటు 778 ఉపాధ్యాయ శిక్షణ సంస్థలున్నాయి. ఈ సంస్థలను పాఠశాల విద్యా శాఖ పర్యవేక్షిస్తోంది. బోధన పద్ధతులు, పాఠ్యాంశాలు, కోర్సులు, స్కూళ్ల నిర్వహణ, సదుపాయాల కల్పన, పరీక్షల విధానం ఇలా అన్నింటిలోనూ విద్యా రంగంలో వస్తున్న ఆధునిక పోకడలకు అనుగుణంగా మార్పులు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విద్యా సంస్థల పర్యవేక్షణకు ప్రత్యేక నియంత్రణ కమిషన్ అవసరమని ప్రభుత్వం పేర్కొంది. విద్యా సంస్థల్లో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడం, ఫీజుల నియంత్రణ, స్కూళ్ల పర్యవేక్షణ మరింత సమర్థంగా ఉండేలా ఈ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లన్నీ ఈ కమిషన్ పరిధిలోకి రానున్నాయి. కమిషన్‌కు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చైర్మన్‌గా, జాతీయ స్థాయిలో పేరొందిన నిపుణుడు వైస్ చైర్మన్‌గా ఉంటారు. ఐదుగురు విద్యావేత్తలు, ఇద్దరు ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ కార్యదర్శి స్థాయి వ్యక్తి సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తారు. కమిషన్‌కు ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది. కమిషన్ అధికారాలు, విధులు.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ప్రవేశాలు, బోధన, బోధకుల అర్హతలు, విద్యా ప్రమాణాలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాగుతున్నాయో? లేదో పరిశీలిస్తుంది. ప్రైవేటు స్కూళ్లలోని ఫీజుల నియంత్రణ అధికారం కూడా ఉంటుంది. జాతీయ విద్యా హక్కు చట్టం ప్రకారం ఆయా సంస్థల్లో 25 శాతం సీట్లు పేద వర్గాలకు అందేలా చూస్తుంది. ఆయా స్కూళ్ల ఫీజుల నిర్ణయానికి అక్రిడిటేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తుంది. ప్రమాణాలు, నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై చర్యలకు సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇస్తుంది. ఆయా సంస్థలకు జరిమానా విధించడం, నిబంధనలు పాటించని సంస్థల గుర్తింపు రద్దు చేసే అధికారాలు ఉంటాయి. కమిషన్‌కు సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి. ఆయా అంశాలపై ఎవరినైనా పిలిచి విచారించే అధికారం ఉంటుంది. కమిషన్ ఆదేశాలను సవరించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కమిషన్ పరిధిలోకి ఇంటర్, ప్రైవేటు వర్సిటీలు.. ఉన్నత విద్య నియంత్రణ కమిషన్ పరిధిలోకి ఇంటర్మీడియెట్ కళాశాలలతోపాటు ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలను కూడా చేరుస్తూ మరో బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ కమిషన్‌కు కూడా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చైర్మన్‌గా, ఇద్దరు ప్రొఫెసర్లు, ఒక ఐఏఎస్ అధికారి, ఉన్నత విద్యా సంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ కార్యదర్శి స్థాయి వ్యక్తి సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఉన్నత విద్యా సంస్థల్లో అత్యున్నత ప్రమాణాల సాధనకు కమిషన్ చర్యలు చేపడుతుంది. ప్రవేశాలు, బోధన, పరీక్షలు, పరిశోధన, బోధన సిబ్బంది అర్హతలు, మౌలిక సదుపాయాలు నిబంధనల మేరకు ఉన్నాయో.. లేదో పరిశీలిస్తుంది. జూనియర్, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీలు, అన్ని ప్రైవేటు యూనివర్సిటీలు కమిషన్ పరిధిలోకి వస్తాయి. వీటితోపాటు పాఠశాల విద్య నియంత్రణ కమిషన్‌కు ఉన్నట్టే ఇతర అధికారాలు, విధులు ఉంటాయి. కాగా ఉన్నత విద్య నియంత్రణ కమిషన్ ఏర్పాటుతో ఇప్పటివరకు ఫీజులు, ప్రవేశాలను పర్యవేక్షిస్తున్న ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) కనుమరుగు కానుంది. -
ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్లలో చిగురిస్తున్న ఆశలు
సాక్షి, విశాఖపట్నం: విద్యా హక్కు చట్టం ప్రకారం నియమించిన ఆర్ట్, క్రాఫ్ట్ ఉపాధ్యాయుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించి సర్వీసుల్ని క్రమబద్ధీకరిస్తుందని వీరంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. పాదయాత్ర సమయంలో పార్ట్‌టైమ్ ఇన్స్ట్రక్టర్లను క్రమబద్ధీకరిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చాలని ఆర్ట్, క్రాఫ్ట్ ఉపాధ్యాయులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యార్థి మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఆర్ట్ (చిత్రలేఖనం), క్రాఫ్ట్ (హస్తకళలు) విద్యలు దోహదపడతాయి. ఈ విషయంలో కొఠారి కమిషన్, యూజీసీ, ఎన్సీఈఆర్టీ ప్రతిపాదనల్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆర్ట్, క్రాఫ్ట్ ఉపాధ్యాయుల్ని 1995లో అప్పటి సీఎం చంద్రబాబు నిషేధించడంతో ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్ల జాడ లేకుండా పోయింది. కాంట్రాక్టు పద్ధతిలో: విద్యా హక్కు చట్టంలో సూచించిన మేరకు 2012–13 విద్యా సంవత్సరంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విద్యను మళ్లీ పాఠశాలల్లో ప్రవేశపెట్టేందుకు పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్ల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 3,000 పోస్టుల్ని భర్తీ చేసింది. క్రమంగా వీరి సంఖ్య 5 వేలకు చేరింది. పూర్తి కాంట్రాక్ట్ బేసిక్ అంటూ సర్వశిక్షా అభియాన్ ద్వారా నియామకాలు చేపట్టింది. ప్రస్తుతం వీరికి గౌరవ వేతనంగా రూ.14,203 చెల్లిస్తున్నారు. ఏటేటా ఉద్యోగులు ప్రభుత్వానికి ఒప్పంద పత్రం (బాండ్)ని ఇస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో వీరంతా ఉద్యోగ క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పాదయాత్రలో హామీతో ఆశలు: గత ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా సానుకూలంగా స్పందించకపోవడంతో ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర చేసిన వైఎస్ జగన్‌ని వీరంతా పలుమార్లు కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. అర్హతలు ఆధారంగా ఎక్కువ మందిని క్రమబద్ధీకరిస్తానని వీరికి జగన్ హామీ ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2009 ఫిబ్రవరి 13న జీవో నం.31, 38, 84లను విడుదల చేస్తూ రాష్ట్రంలోని 1,030 మంది ఒకేషనల్ పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్లను రెగ్యులర్ చేశారు. వీరంతా అప్పట్లో ఆపరేషన్ బ్లాక్ బోర్డు పథకంలో విధులు నిర్వర్తించేవారు. వారి లాగానే పార్ట్‌టైమ్ ఇన్స్ట్రక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న తమ జీవితాల్లోకి రాజన్న తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెలుగు తీసుకొస్తారని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉపాధ్యాయులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రిపై పూర్తి ఆశలు పెట్టుకున్నాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైనే మేము పూర్తి ఆశలు పెట్టుకున్నాం. పాదయాత్రలో పలుమార్లు ఆయన్ను కలిసి మా బాధలు విన్నవించుకున్నాం. మేమంతా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏడేళ్లుగా పనిచేస్తున్నాం. గతంలో ఉండే రెగ్యులర్ డ్రాయింగ్, క్రాఫ్ట్ టీచర్ల స్థానంలో మేము పనిచేస్తున్నా వేతనాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దివంగత సీఎం వైఎస్సార్ మాదిరిగా ఆయన తనయుడు జగన్ ముఖ్యమంత్రిగా మా జీవితాలకు దారి చూపిస్తారని కోరుతున్నాం. – ఎస్.శివకుమారిరెడ్డి, రాష్ట్ర ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ అసోసియేషన్ అధ్యక్షురాలు -
నీరుగారుతోన్న ఆర్టీఈ లక్ష్యం
జైపూర్: పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం(ఆర్టీఈ) లక్ష్యం మధ్యలోనే నీరుగారిపోతోంది. 6 నుంచి 14 సంవత్సరాల్లోపు పిల్లలందరూ తప్పనిసరిగా చదువుకోవాలన్న సమున్నత లక్ష్యంతో కేంద్రం ఈ చట్టాన్ని 2010, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ప్రాథమిక విద్య పూర్తయేంతవరకు పిల్లలకు ఉచితంగా, నిర్బంధ విద్యను అందించాల్సి ఉంటుంది. పిల్లలు తమకు సమీపంలోని పాఠశాలలో ఉచితంగా ప్రాథమిక విద్యను పూర్తి చేసేందుకు విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 3 అవకాశం కల్పిస్తోంది. ఆర్టీఈ కింద పాఠశాలన్నీ 25శాతం సీట్లను కేటాయించాల్సి ఉంటుంది. ఈ చట్టం ప్రకారం ప్రముఖ పాఠశాలల్లో ప్రాథమిక విద్యను అభ్యసించిన విద్యార్థులు తర్వాత బడి మానేసి దినసరి కూలీలుగా మారిపోతున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల కారణంగా ఆర్టీఈ విద్యార్థులు విద్య కొనసాగించలేకపోతున్నారు. ఆర్టీఈ కింద 8వ తరగతి వరకు మాత్రమే ఉచితంగా అందిస్తున్నారు. అక్కడి నుంచి ఫీజులు చెల్లించి చదువు కొనసాగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత చదివించే స్తోమతలేక తల్లిదండ్రులు పిల్లలను చదువు మాన్పించేసి, తమతో పాటు పనులకు తీసుకెళ్లిపోతున్నారు. ‘ఆర్టీఈ కోటాలో చేరిన విద్యార్థుల్లో కొంత మంది చాలా తెలివైనవారు ఉంటున్నారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించలేక మధ్యలోనే చదువు ఆపేస్తుండటం బాధ కలిగిస్తోంది. వీరిలో డ్రైవర్లు, దినసరి కూలీల పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు. 8వ తరగతి పూర్తి చేసిన తర్వాత తమ తల్లిదండ్రులతో కలిసి పనులకు వెళ్తుఉన్నారు. ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత వీరిని పాలకులు పట్టించుకోకపోవడం విచారకరమ’ని జైపూర్‌లోని ప్రముఖ పాఠశాల ప్రిన్సిపాల్ ఒకరు వ్యాఖ్యానించారు. ఆర్టీఈ కోటాను 8 నుంచి 12వ తరగతి వరకు పొడించాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్టు రాజస్తాన్ విద్యా శాఖ మంత్రి గోవింద్ సింగ్ తెలిపారు. దీనికి అనుగుణంగా జాతీయ విద్యా విధానాన్ని మార్చాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. -
విద్యాహక్కు.. ఇక ఉండదు చిక్కు
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వాలు విద్యాహక్కు చట్టాన్ని నిర్వీర్యం చేశాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, ఈబీసీ విద్యార్థులను బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు సొమ్ము చెల్లిస్తూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విద్యాహక్కు చట్టం ప్రకారం కార్పొరేట్ స్కూళ్లలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన పిల్లలు, పేదలకు 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలి. కానీ.. రాష్ట్రంలో ఎక్కడా ఈ చట్టం అమలు కావడం లేదు. ఎస్సీ, ఎస్టీ, పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలను కార్పొరేట్ కాలేజీలు చేర్చుకోవడం లేదు. చేర్చుకున్నా పూర్తిస్థాయిలో ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల నిర్వహించిన విద్యాశాఖ సమీక్షలో ఎస్సీ, ఎస్టీలు, పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసి తనకు నివేదించాలని ఆదేశించారు. విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులకు నిర్దేశించారు. ఐదేళ్లలో రూ.591.50 కోట్ల నష్టం బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం ఏటా రూ.103.26 కోట్ల చొప్పున చెల్లిస్తోంది. ఒక్కసారి స్కూల్లో చేరిన విద్యార్థులు పదో తరగతి వరకు అక్కడే విద్యనభ్యసిస్తారు. ఇలా గడచిన ఐదేళ్లలో ప్రభుత్వం రూ.520 కోట్ల వరకు చెల్లించింది. 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో అడ్మిషన్లు ఇప్పటికే పూర్తయ్యాయి. 34,421 మంది విద్యార్థులకు వాటిల్లో చదువు చెప్పించేందుకు ఎంపిక చేశారు. వీరిలో ఎస్సీలు 22,814 మంది, ఎస్టీలు 11,580 మంది, ఇతరులు 27 మంది ఉన్నారు. ఒక్కో విద్యార్థికి ఏటా రూ.30 వేల చొప్పున ప్రభుత్వం ఫీజు చెల్లిస్తోంది. ఇదిలావుంటే.. కార్పొరేట్ కాలేజీల్లో ఉచిత విద్య పొందేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, దివ్యాంగ, ఈబీసీ విద్యార్థులు అర్హులు. పదో తరగతి పాసైన వారిని ఇంటర్మీడియెట్‌లో చేర్పించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. 2019–20 సంవత్సరానికి 3,765 మంది విద్యార్థులను కార్పొరేట్ కాలేజీల్లో చేర్చారు. ఒక్కొక్కరికి రూ.35 వేల ఫీజు, రూ.3 వేల పాకెట్ మనీ కలిపి మొత్తం రూ.38 వేల చొప్పున ప్రభుత్వం కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలకు చెల్లిస్తోంది. ఏటా రూ.14.30 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.71.50 కోట్లు వెచ్చిస్తోంది. ఈ ఏడాది కార్పొరేట్ కళాశాలల్లో ఎస్సీలు 1,795 మంది, ఎస్టీలు 582 మంది, బీసీలు 1,050 మంది, మైనార్టీలు 189 మంది, కాపులు 83, ఈబీసీలు 65 మంది, దివ్యాంగుల్లో ఒకరిని ప్రభుత్వం ఎంపిక చేసింది. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, కార్పొరేట్ కాలేజీల్లో పేద విద్యార్థులను చదివిస్తున్నందుకు గడచిన ఐదేళ్లలో సుమారు రూ.591.50 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చింది. విద్యాహక్కు చట్టం సక్రమంగా అమలు చేసి ఉంటే ప్రభుత్వానికి ఈ భారం తగ్గేది. ఇకపై కార్పొరేట్ స్కూళ్లు, కార్పొరేట్ కాలేజీల్లో విద్యాహక్కు చట్టం కింద ఆయా వర్గాల్లోని పేదలకు 25 శాతం సీట్లు విధిగా ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలివ్వడంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రానున్న రోజుల్లో విద్యాహక్కు చట్టం అమలుకు చిక్కు ఉండదని, పేదవర్గాల వారికి మేలు కలుగుతుందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకు విద్యాశాఖ అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.