secenderabad
-
HYD: పీజీ ఉమెన్స్ హాస్టల్లో కలకలం.. బాత్రూంలోకి చొరబడ్డ ఆగంతకులు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ఉస్మానియా మహిళా పీజీ కాలేజీ హాస్టల్లో కలకలం చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాగర్ల్స్ హాస్టల్ బాత్రూమ్లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. గమనించిన విద్యార్ధులు.. ఓ వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని బంధించారు. మరో వ్యక్తి పరారయ్యాడు. విద్యార్ధుల చేతికి చిక్కిన దుండగుడికి దేహశుద్ది చేశారు. హాస్టల్లో భద్రతా లోపంపై విద్యార్ధులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు సరైన రక్షణ లేదంటూ నిరనస వ్యక్తం చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీజీ కళాశాలలో విద్యార్థులు ఆందోళన విరమించారు. దీనిపై నార్త్‌జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ..అర్ధరాత్రి సమయంలో ముగ్గురు ఆగంతకులు పీజీ కాలేజ్ లేడీస్ హాస్టల్లోకి వచ్చారని తెలిపారు. నిందితులు గోడ దూకి లోకి ప్రవేశించారని పేర్కొన్నారు. వసతి గృహంలోని బాత్రూం వద్ద అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. హాస్టల్లో భద్రత సిబ్బంది సహాయంతో నిందితుడిని పట్టుకున్న విద్యార్ధులు అతన్ని చితకబాదారని చెప్పారు. వసతి గృహంలోని విద్యార్థుల రక్షణ కోసం ప్రత్యేకంగా గస్తి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల రక్షణ విషయంలో కళాశాల ప్రిన్సిపల్, వీసీతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని చెప్పారు. చదవండి: కామారెడ్డి ఎమ్మెల్యే మరో సంచలన నిర్ణయం.. -
హైదరాబాద్‌లో ఓరియంట్బెల్ స్టోర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెరామిక్ టైల్స్ తయారీలో ఉన్న ఓరియంట్బెల్ తాజాగా హైదరాబాద్‌లో ఎక్స్‌పీరియెన్స్ స్టోర్‌ను తెరిచింది. సికింద్రాబాద్‌లో 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మహాలక్ష్మి ఎంటర్ప్రైసెస్ దీనిని ఏర్పాటు చేసింది. 2020లో దేశవ్యాప్తంగా 69 ఎక్స్‌పీరియెన్స్ సెంటర్స్‌ను ప్రారంభించామని ఓరియంట్బెల్ టైల్స్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ పినాకి నంది తెలిపారు. 1977లో కంపెనీని స్థాపించారు. -
పాస్‌పోర్టు కార్యాలయంలో ప్రభాస్
రాంగోపాల్‌పేట్: సినీనటుడు ప్రభాస్ బుధవారం సికింద్రాబాద్‌లోని పాస్‌పోర్ట్ కార్యాలయానికి వచ్చారు. పాస్‌పోర్డు రెన్యూవల్ కోసం వచ్చిన ఆయన దరఖాస్తు సమర్పించి వెళ్లారు. కార్యాలయానికి వచ్చిన ప్రభాస్‌ను చూసేందుకు, ఆయనతో ఫొటోలు దిగేందుకుకార్యాలయ సిబ్బంది ఎగబడ్డారు. -
అమ్మవారే కరోనాను తరిమి కొట్టాలి..
రాంగోపాల్‌పేట్: ఎటు చూసినా భక్త జన సందోహం, అమ్మవారికి బోనం సమర్పించేందుకు బారులు తీరే భక్త జనం, ఫలహార బండ్ల ఊరేగింపులు, తొట్టెల సమర్పణలకు వచ్చే యువత తీన్మార్ స్టెప్పులు...శివసత్తుల పూనకాలు....అమ్మవారికి మొక్కులు తీర్చుకోవాలని ఆశతో ఎంతో దూరం నుంచి వచ్చే భక్తులు.. ఇదీ ఏటా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర సందర్భంగా కనిపించే కమనీయ దృశ్యం...ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు, విమర్శలు, ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించే ప్రజాప్రతినిధులు...అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే వీవీఐపీలు, వీఐపీలతో కొనసాగే సందడి. అయితే ఈ ఏడాది ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి అమ్మవారిని దర్శించుకోవాలని, బోనం సమర్పించి మొక్కులు తీర్చుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్న భక్తులకు నిరాశే మిగిల్చింది. అమ్మవారి జాతర ప్రారంభమైనప్పటి నుంచి చరిత్రలో మొదటి సారిగా భక్తులు లేకుండానే బోనాల జాతర మొదలైంది. లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ జన జాతర ఈ ఏడాది జనం లేని జాతరగా చరిత్రలో నిలిచిపోనుంది. లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహంకాళి దేవాలయం చుట్టు ఎక్కడ భక్తుల జాడ కనిపించ లేదు. ఎటు చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. అయితే అధికారులు అమ్మవారికి భక్తుల బోనం లేకున్నా సంప్రదాయాల్లో ఎలాంటి లోటు లేకుండా, శాస్త్రోక్తంగా బోనాల ఉత్సవాలను నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా పూజలు... మంత్రి ఇంటి నుంచి తొలి బోనం కోవిడ్ నిబంధనల మధ్య సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతర సంప్రదాయాలతో వైభవంగా జరిగింది. ఆదివారం ఉదయం 4.05 నిమిషాలకు మహాహారతితో మహంకాళి అమ్మవారికి పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంత్రి తలసాని కుటుంబ సభ్యులు బోనాన్ని దేవాలయం బయటి వరకు తెచ్చి ఆలయ ఈవో మనోహర్‌రెడ్డికి అప్పగించారు. మహాహారతి అనంతరం ఆలయ అధికారులు అమ్మవారికి బోనం సమర్పించారు. ఆలయ ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే ఆలయ సిబ్బంది అమ్మవారికి 7 బోనాలను సమర్పించారు. ఉదయం 4.45 నిమిషాలకు వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 8గంటలకు ఆర్యసమాజ్, దక్కన్ మానవ సేవా సమితి ఆధ్వర్యంలో లోక కల్యాణం కోసం హోమం చేశారు. కనిపించని భక్త జనం కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఏడాది బోనాల జాతరలో భక్తులకు అనుమతి ఇవ్వలేదు. అమ్మవారికి జరిగే పూజలన్నీ మాత్రం యధావిధిగా ఆలయ అధికారులు నిర్వహించారు. ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులు రాకుండా చూశారు. ఈ విషయం తెలియని కొందరు భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు, బోనాలు సమర్పించేందుకు వచ్చి నిరాశగా వెనుదిరిగారు. అమ్మవారే కరోనాను తరిమి కొట్టాలి: మంత్రి తలసాని ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాధిని మహంకాళి అమ్మవారే తరిమికొట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఆదివారం మహంకాళి బోనాల జాతర సందర్భంగా ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలరా వ్యాధిని తరిమికొట్టడంతో 1815లో అప్పయ్యదొర మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ నుంచి అమ్మవారిని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్టించారన్నారు. నాడు కలరా వ్యాధిని తరిమికొట్టిన అమ్మవారే నేడు కరోనాను కూడా దేశం నుంచి పారదోలాలని ప్రార్థించారు. అయితే ఈ ఏడాది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జాతరకు భక్తులను అనుమతించడం లేదని ఇందుకు వారు క్షమించాలని కోరారు. ప్రభుత్వ సూచనలను భక్తులు, స్థానిక ప్రజలు పాటిస్తూ ఇంట్లోనే బోనాల ఉత్సవాలు జరుపుకున్నారని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నేడు 9.30 గంటలకు రంగం ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరలో మరో ప్రధాన ఘట్టం రంగం. అవివాహిత మహిళ అమ్మవారికి ఎదురుగా ఉండే మాతంగేశ్వరీ అమ్మవారి ముందు పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి వినిపిస్తారు. అమ్మవారు ఆమెను ఆవహించగా ఆమె నోటి నుంచి వచ్చే ప్రతి మాట అమ్మవారే పలుకుతున్నట్లుగా భక్తుల నమ్మకం. సోమవారం ఉదయం 9.30 గంటలకు భవిష్యవాణి ఉంటుంది. ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తుండటం, భక్తుల బోనాలు లేకుండానే జాతర జరుగడంతో అమ్మవారి నుంచి ఎలాంటి వాక్కులు వినవలసి వస్తుందోనని భక్తులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అనంతరం అమ్మవారి సాగనంపే నిర్వహిస్తారు. దీంతో బోనాల జాతర ముగుస్తుంది. దూరం నుంచి దండం అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ రాంగోపాల్‌పేట్ పాత పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే పోలీసులు కోవిడ్ నిబంధనల నేపథ్యంలో భక్తులను అనుమతించడం లేదని చెప్పడంతో ఆయన అక్కడి నుంచే అమ్మవారికి దండం పెట్టుకుని వెనుదిరిగి వెళ్లారు. -
బాప్రే పరదేశీ!
దేశం నలుమూలల నుంచి నగరానికి వచ్చే అతిథులు, పర్యాటకులు సికింద్రాబాద్‌లో బస చేసేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రయాణించేందుకు రైళ్లు అందుబాటులో ఉండటం ఒకటైతే.. బస చేయడం మొదలు అన్ని రకాలవసతులు ఈ ప్రాంతంలో ఉండటం మరో కారణం. నారాయణగూడ, ఉప్పల్,బొల్లారం, బేగంపేట్ ఇలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి నాలుగు దిక్కులాఅతిథులకు, పర్యాటకులకు ఆశ్రయం ఇచ్చేందుకు 300 వరకు లాడ్జీలు వెలిశాయి. అందుకే సికింద్రాబాద్ నుంచి ఎటు10 కిలోమీటర్ల మేర పర్యాటకుల సందడి కనిపిస్తుంది. లాడ్జీలలో దిగే వారిపైఆధారపడి క్యాటరింగ్, ట్రావెల్స్ వ్యాపారులు జీవిస్తున్నారు. సుమారుగా5 వేల మంది యువకులు లాడ్జీలలోవార్డుబాయ్లుగా పనిచేస్తున్నారు. ఇంతవరకు పరిస్థితి బాగానే ఉన్నా.. దశాబ్దాల తరబడి ఎప్పుడు లాడ్జీల యజమానులు, సిబ్బంది వాటిపై ఆధారపడిన వ్యాపారులు ఇబ్బందుల్లో పడలేదు. సీజనల్లో ఎక్కువ.. అన్‌సీజన్‌లో తక్కువ.. అన్నట్టుగా లాడ్జీల వ్యాపారం సాగేది. 10 శాతం అటు ఇటుగా నడిచిన లాడ్జీల వ్యాపారం మూడువారాలుగా మొత్తంగా పడిపోయింది. సికింద్రాబాద్: లాడ్జీల్లో బసచేసేవారే కరువైపోగా వ్యాపారం మొత్తంగా దెబ్బతిన్నది. ఇందుకు కారణం కరోనా వైరస్. దీని కారణంగాఅతిథులు, పర్యాటకులు నగరానికి రావడం మానేయడంతో లాడ్జీల వ్యాపారంరూ.లక్షల్లోంచి వేలల్లోకి పడిపోయింది. కరోనా వైరస్ కారణంగా సికింద్రాబాద్నగరంలో స్తంభించిపోయిన లాడ్జీల వ్యాపారం గురించిన ప్రత్యేక కథనమిది. 5 వేలమంది రూమ్‌బాయ్స్.. లాడ్జీల్లో పనిచేసే రూమ్‌బాయ్స్‌కు వేతనాలు సహజంగానే తక్కువ.. వీరంతా లాడ్జీల్లో బసచేసే అతిథులు, పర్యాటకులు అందించే టిప్స్‌పైనే ఎక్కువగా ఆధారపడతారు. సాధారణంగా రూ.3 నుంచి రూ.5 వేల వరకే రూమ్‌బాయ్స్‌కు వేతనాలు ఉంటాయి. లాడ్జీల్లో బసచేసేవారి నుంచి సీజన్‌ను బట్టి నెలకు రూ.10 వేల వరకు టిప్స్ రూపంలో సంపాదించుకుంటారు. సికింద్రాబాద్ నగరంలో 300 లాడ్జీల్లో సుమారుగా 5వేల వరకు రూమ్‌బాయ్స్ పనిచేస్తున్నారు. వీరందరికీ ఈనెల మొదటి వారం నుంచి రోజు దమ్మిడీ ఆదాయం కూడా లేకుండా పోయింది. రద్దవుతున్న టూర్లు.. రెండు మూడు నెలలు ముందే నగర ప్రదర్శనకు వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న వారంతా కరోనా దెబ్బకు ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. వెస్ట్‌బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలోని ప్రయాణికులు నగరానికి వస్తుంటారు. ఇందులో ముఖ్యంగా గ్రూపులుగా వచ్చే విద్యార్థుల సంఖ్య ఏటా వేల సంఖ్యలోనే ఉంటుంది. నిత్యం ఐదు నుంచి పది వేల మంది పర్యాటకులు సికింద్రాబాద్ ప్రాంతంలో బసచేయడం ఉండేది. కరోనా కారణంగా మొత్తంగా పర్యాటకులు నగరానికి రావడమే మానేశారు. ఏప్రిల్, మే వేసవి సెలవుల టూర్లు కూడా ముందస్తుగా రద్దు చేసుకుంటుండటంతో లాడ్జీల యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. పడిపోయిన బుకింగ్‌లు.. లాడ్జీల్లో 20 నుంచి 60 వరకు గదులు ఉంటాయి. ప్రతిలాడ్జిలో సాధారణ సమయాల్లో సగానికి ఎక్కువ, సెలవులు తదితర సీజన్లలో 80 నుంచి 90 శాతం వరకు గదులు అతిథులతో నిండి ఉంటుంటాయి. ఎంత అన్‌సీజన్‌లో అయినా 30శాతం గదుల బుకింగ్ ఉంటుంది. కరోనా కారణంగా లాడ్జీల్లో బస చేసేవారే కరువయ్యారు. ఫలితంగా రోజుకు రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు వ్యాపారం చేసే లాడ్జీల వ్యాపారం పూర్తిగా పడిపోయింది. రోజుకు రూ.5 వేల వ్యాపారం కావడం లేదని లాడ్జీల యజమానులు వాపోతున్నారు. క్యాటరింగ్.. ట్రావెల్స్ అంతే.. లాడ్జీల యజమానులు, ఉద్యోగుల సంగతి పక్కనపెడితే వాటిపై ఆధారపడిన క్యాటరింగ్, ట్రావెల్స్ వ్యాపారాలు కూడా కుదేలవుతున్నాయి. లాడ్జీల్లో దిగే పర్యాటకులకు భోజనాలు, టిఫిన్స్ అందించడం ద్వారా క్యాటరింగ్ వ్యాపారులు బిజీగా ఉంటుంటారు. అదేతరహాలో పర్యాటకులను, అతిథులను నగరంలోని వివిధ ప్రాంతాల సందర్శన కోసం తీసుకెళ్లేందుకు ట్రావెల్స్ నిర్వాహకులు బీజీగా ఉండేవారు. రెండు వారాలుగా లాడ్జీల్లో బసచేసేవారే లేకపోగా అక్కడి ట్రావెల్స్ వాహనాలు బయట తిరిగిన దాఖలాలే లేవు. రెండు గదులు బుక్కావడం లేదు హోటళ్లు, లాడ్జీల్లో పది గదుల్లో రెండు కూడా బుక్ కావడం లేదు. పర్యాటకుల సంఖ్య మొత్తంగా పడిపోయింది. లాడ్జీ సిబ్బంది ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి ఎదురైంది. గదుల్లో బసచేసే అతిథులతోపాటు బాంకెట్ హాళ్లలో సందడిగా ఉండే హోటళ్లు, లాడ్జీలు మొత్తంగా బోసిపోయాయి. – ఆనంద్‌కుమార్, లాడ్జీ నిర్వాహకుడు చిక్కడపల్లి -
జన'ని'ల్ బజార్..
సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లోని జనరల్ బజార్‌కు ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ వందల కోట్ల వ్యాపారం సాగుతుంది. అయితే కరోనా దెబ్బకు వ్యాపారం కుదేలైంది. ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వస్త్ర వ్యాపారాలకు పెట్టింది పేరు సికింద్రాబాద్ జనరల్ బజార్. చేతి రుమాలు మొదలు వస్త్ర వ్యాపారాలు, స్టీల్, బంగారం అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇక్కడి నుంచి పెద్ద మొత్తంలో వస్త్రాలు వెళ్తుంటాయి. నిత్యం వేలమంది కస్టమర్లతో ఇసుకేస్తే రాలనంత జనంతో కిటకిటలాడేది. ఇటువంటి జనరల్ బజార్‌కు కరోనా వైరస్ ఎఫెక్ట్ గట్టిగా పట్టుకుంది. వ్యాపారాలన్నీ ఘోరంగా దెబ్బతిన్నాయి. లక్షల రూపాయల టర్నోవర్ కూడా జరగడం లేదని వ్యాపారస్తులు ఆవేదన చెందుతున్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ తమ వ్యాపారానికి ఇబ్బంది లేదని, చరిత్రలో మొదటిసారిగా పెద్ద మొత్తంలో నష్టం వచ్చి పడిందని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర నష్టం వాటిల్లింది తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాలకు వస్త్రాలను పంపిస్తుంటాం. వైరస్ నేపథ్యంలో ఎటువంటి ఎగుమతులు జరగడం లేదు. ప్రజలు కూడా కొనుగోలు చేసేందుకు జనరల్ బజార్‌కు రావడం లేదు. కోట్ల రూపాయల టర్నోవర్‌కు భారీగా గండి పడింది. దీని ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి. – రవికుమార్, దుస్తుల వ్యాపారి పది మంది కూడా రావడం లేదు ఎప్పుడూ జనసందోహంతో కిటకిటలాడే జనరల్ బజార్‌కు కరోనా మహమ్మారి పట్టుకుంది. నాకు కొన్నేళ్లుగా ఇక్కడ గోల్డ్ షాపు ఉంది. ప్రతిరోజు పది నుంచి 20 మంది కొనుగోలు దారులు కూడా రావడం లేదు. ఇది వరకు నిత్యం వందలాది మంది వచ్చేవారు. వైరస్ దెబ్బ జనరల్ బజార్‌పై పడింది. – భవిలాల్ వర్మ, గోల్డ్ వ్యాపారి పెళ్లిళ్ల సీజన్.. నో సేల్స్ పెళ్లిళ్ల సీజన్ కావడంతో నిత్యం వందల మంది కస్టమర్లతో షాపు కిక్కిరిపోయేది. ప్రస్తుతం ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్‌తో ప్రజలు ఇక్కడికి రావడంలేదు. ఉదయం షాపు తెరిచింది మొదలు రాత్రి మూసివేసే వరకు గిరాకీ అనే మాటనే లేదు. ఇబ్బందిగా ఉంది. – రామకృష్ణ, స్టీల్ వ్యాపారి -
ప్రముఖులకే ప్రాధాన్యం
సనత్‌నగర్: సామాన్య భక్తుల విషయంలో అధికారులు ఎప్పటిలాగే వ్యవహరించారు. వీవీఐపీలు, వీఐపీల సేవలో దేవాదాయ శాఖ అధికారులు మునిగి తేలడంతో ఎంతకీ క్యూలైన్ కదలక సామాన్య భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఇతర రంగాల ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి తోడు జాతరలో విధులు నిర్వర్తించే సిబ్బంది పలుకుబడితో తమ కుటుంబసభ్యులు, బంధువులను వీఐపీ గేటు ద్వారానే పంపించడంతో సామాన్య భక్తుల దర్శనం మరింత ఆలస్యమైందనే చెప్పాలి. వీఐపీ గేటు వద్ద పైరవీకారుల హడావుడి ఎక్కువ కావడంతో ఒకానొక దశలో వారిని కట్టడి చేయ డం పోలీసుల తరం కాలేదు. కేవలం ప్రముఖుల సేవలో మునిగితేలిన అధికారులు సామాన్య భక్తుల దర్శనం ఏవిధంగా జరుగుతుందనే దానిపై దృష్టిసారించలేదు. దీంతో క్యూలైన్లలో పిల్లాపాపలతో పాటు బోనాలను ఎత్తుకుని వచ్చిన మహిళలు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. గతేడాది తలెత్తిన సమస్యను దృష్టిలో ఉంచుకొని బోనంతో వచ్చిన జోగినిలకు త్వరితగతిన దర్శన భాగ్యం కల్పించారు. అటు వీఐపీలు, ఇటు జోగినిల ప్రవేశంతో సామాన్య భక్తుల క్యూలైన్ నత్తనడకను తలపించింది. ఇదీ పరిస్థితి... ♦ భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా చేశామని చెబుతున్న పోలీసు అధికారులు కేవలం వీఐపీల సేవలోనే తరించినట్లు కనిపించింది. ఎవరికి వారు రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని రావడంతో పోలీసులు వారికి వీఐపీ దర్శనం కల్పించారు. ♦ సీఎం, మంత్రులు, ప్రముఖులు వచ్చిన ప్రతిసారీ 10–15 నిమిషాల పాటు సామాన్య భక్తుల దర్శనం ఆగిపోయింది. ♦ చిన్నారులు, బోనాలతో వచ్చిన మహిళల కోసం సెపరేట్ లైన్లు కేటాయించాలని ఆలయ అధికారులు మైక్‌లో పదే పదే చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ముఖ్యంగా గర్భ గుడి ప్రాంగణంలో నాలుగైదు లైన్లలో భక్తులను పంపించడంతో తోపులాటకు దారితీసింది. ♦ తొలిబోనం సమర్పణ సమయంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ట్రస్ట్ సభ్యుల కుటుంబాలను అనుమతించలేదు. ♦ మహంకాళి పోలీస్‌స్టేషన్ సమీపంలో వాటర్ ప్యాకెట్ల బస్తాలను నిల్వ ఉంచగా భక్తులకు వాటిని అందించడంలో అధికారులు విఫలమయ్యారు. ♦ లక్షలాది మంది భక్తులు జాతరకు హాజరవుతారని తెలిసి కూడా బయో టాయ్లెట్లు, మరుగుదొడ్లను సరిపడా ఏర్పాటు చేయలేదు. ♦ ప్రముఖులకు ప్రాధాన్యమిచ్చిన పోలీసులు ప్రజాప్రతినిధులను విస్మరించారు. బేగంపేట్ కార్పొరేటర్ ఉప్పల తరుణి కుటుంబసభ్యులతో కలిసి దర్శనం కోసం రాగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దాదాపు అరగంట రోడ్డుపైనే నిలుచోగా.. కేవలం ఆమెను మాత్రమే లోపలికి పంపించారు. ♦ దర్శనం దారి తెలియక చాలామంది అవస్థలు పడ్డారు. సాధారణ భక్తులు, పాస్ ఉన్నవారు, దివ్యాంగులు, బోనం ఎత్తుకొని వచ్చిన మహిళలు ఏ దారి గుండా ఏ లైన్లో వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. అక్కడ వారికి దిశా నిర్దేశం చెప్పేవారు కరువయ్యారు. -
బోనాలు.. ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర కొత్వాల్ అంజనీకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆది, సోమవారాల్లో వివిధ సమయాల్లో, వివిధ ప్రాంతాల్లో ఇవి అమలులో ఉంటాయన్నారు. ఉత్సవాలకు హాజరయ్యే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలనుకేటాయించారు. ఆదివారం తెల్లవారుజాము 4 గంటల నుంచి ♦ ఉజ్జయిని మహంకాళి పూజ ముగిసే వరకు టుబాకో బజార్ హిల్ స్ట్రీట్, జనరల్ బజార్, అదయ్య చౌరస్తాల నుంచి మహంకాళి దేవాలయం వరకు ఉన్న మార్గాల్లో ట్రాఫిక్ అనుమతించరు. బాటా చౌరస్తా నుంచి రామ్‌గోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ మధ్య ఉన్న సుభాస్ రోడ్‌ను వాహనాలకు మూసేస్తారు. ♦ కర్బలా మైదాన్ నుంచి రాణిగంజ్ చౌరస్తా వైపు వచ్చే ట్రాఫిక్‌ను మినిస్టర్స్ రోడ్, రసూల్‌పురా చౌరస్తా, సీటీఓ, ఎస్బీహెచ్ చౌరస్తా, వైఎంసీఏ చౌరస్తా, సెయింట్ జాన్స్ రోటరీ, గోపాలపురం లైన్, రైల్వేస్టేషన్ మీదుగా పంపిస్తారు. ♦ బైబిల్ హౌస్ వైపు నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను ఘాస్మండి చౌరస్తా, సజన్‌లాల్ స్ట్రీట్ మీదుగా పంపిస్తారు. ♦ రైల్వేస్టేషన్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సుల్ని అల్ఫా హోటల్, గాంధీ ఎక్స్ రోడ్, మహంకాళి ఓల్డ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఘాస్మండి, బౌబిల్ హౌస్, కర్బాలా మైదాన్ మీదుగా పంపిస్తారు. ♦ రైల్వేస్టేషన్ నుంచి తాడ్‌బండ్, బేగంపేట వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను క్లాక్ టవర్, ప్యాట్నీ చౌరస్తా, వైఎంసీఏ చౌరస్తా, ఎస్బీహెచ్ చౌరస్తా మీదుగా మళ్లిస్తారు. ♦ ఎస్బీహెచ్ చౌరస్తా నుంచి ఆర్పీ రోడ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ప్యాట్నీ చౌరస్తా నుంచి క్లాక్ టవర్, ప్యారడైజ్ వైపు, ప్యారడైజ్ నుంచి ఆర్పీ రోడ్‌కు వచ్చే ట్రాఫిక్‌ను ప్యాట్నీ చౌరస్తా నుంచి ఎస్బీహెచ్, క్లాస్టవర్ వైపు పంపిస్తారు. ♦ క్లాక్ టవర్ వైపు నుంచి ఆర్పీ రోడ్లోకి వెళ్లే ట్రాఫిక్‌ను ప్యాట్నీ చౌరస్తా ..ఎస్బీహెచ్ చౌరస్తా వైపు పంపిస్తారు. ♦ సీటీఓ జంక్షన్ నుంచి ఎంజీ రోడ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ప్యారడైజ్ చౌరస్తా నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సింధికాలనీ, మినిస్టర్స్ రోడ్, రాణిగంజ్ చౌరస్తా, కర్బాలా మైదాన్ వైపు, ప్యాట్నీ చౌరస్తా నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ప్యారడైజ్ చౌరస్తా నుంచి సీటీఓ వైపు పంపిస్తారు. సోమవారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 వరకు.. ♦ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, సెయింట్ మేరీస్ రోడ్ మధ్య మార్గాన్ని పూర్తిగా మూసేస్తారు. హకీంపేట్, బోయిన్పల్లి, బాలానగర్, అమీర్‌పేట్ వైపుల నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే బస్సుల్ని క్లాక్ టవర్ వరకే అనుమతిస్తారు. పార్కింగ్ ప్రాంతాలివే.. ♦ సెయింట్ జాన్స్ రోటరీ, ఉప్కార్, ఎస్బీహెచ్ వైపు నుంచి వచ్చే వాహనాలకు హరిహర కళాభవన్, మహబూబియా కాలేజీ ♦ కర్బాలా మైదాన్, బైబిల్ హౌస్, ఘాసీమండీ వైపు నుంచి వచ్చే వాహనాలకు ఇస్లామియా హైస్కూల్ ♦ రాణిగంజ్, ఆదయ్య చౌరస్తా వైపు నుంచి వచ్చే వాహనాలను ప్రభుత్వ ఆదయ్య మెమోరియల్ హైస్కూల్ ♦ సుభాష్ రోడ్ వైపు నుంచి వచ్చే వాహనాలకు పాత జైల్‌ఖానాలోని ప్రాంతం ♦ మంజు థియేటర్ వైపు నుంచి వచ్చే వాహనాలకు అంజలి థియేటర్ మద్యం విక్రయాలపై కూడా.. ఉజ్జయినీ బోనాల నేపథ్యంలో ఉత్తర, మధ్య మండలాల్లోని కొన్ని ఠాణాల పరిధిలో మద్యం విక్రయాలు నిషేధిస్తూ కొత్వాల్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6 నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు గోపాలపురం, చిక్కడపల్లి, లాలగూడ, తుకారాంగేట్, మహంకాళి, మార్కెట్, మారేడ్‌పల్లి, కార్ఖానా, బేగంపేట, తిరుమలగిరి, రామ్‌గోపాల్‌పేట్, గాంధీనగర్ ఠాణాల పరిధిలో ఇది అమల్లో ఉంటుంది. స్టార్ హోటల్స్ బార్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు మినహాయింపునిచ్చారు. -
వైఎంసీఏలో ఫుడ్ పాయిజన్
రాంగోపాల్‌పేట్: కలుషిత ఆహారం తినడంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన సికింద్రాబాద్ వైఎంసీఏలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ వైఎంసీఏలో బ్లూ అనే సంస్థ గత మూడు నెలలుగా నర్సింగ్, సోలార్ కోర్సుల్లో 50 మంది విద్యార్థినులు శిక్షణ పొందుతున్నారు. వారికి అక్కడే భోజనం, బస ఏర్పాటు చేశారు. సోమవారం మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం పూజా, వంశీ, సరస్వతి, యాదమ్మ, దివ్య, నాగలక్ష్మి, ప్రియదర్శిని, భువనేశ్వరి అనే ఎనిమిది మంది విద్యార్థినులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురికావడంతో నిర్వాహకులు వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. -
అసాంఘిక శక్తుల అడ్డాగా ‘గాంధీ’ ప్రాంగణం
గాంధీఆస్పత్రి : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. రాత్రి వేళల్లో మందుబాబులు, జేబుదొంగలు యథేచ్ఛగా సంచరిస్తూ మద్యం సేవిస్తూ ఆస్పత్రి ప్రాంగణాన్ని పర్మిట్‌రూమ్‌గా మార్చేస్తున్నా పోలీసులు, ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది పట్టనట్లు వ్యవహరిస్తున్నారని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది వైద్యసేవల నిమిత్తం నిత్యం గాంధీ ఆస్పత్రికి వస్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి కుటుంబసభ్యులు, సహాయకులు రాత్రి వేళల్లో ఇక్కడే బస చేస్తారు. యాచకులు, చిత్తుకాగితాలు ఏరుకునే వారితో పాటు జేబుదొంగలు, చిల్లర దొంగలు ఇక్కడే తిష్ట వేసి చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని బెదిరించి డబ్బులు, సెల్ఫోన్లు లాక్కుంటున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. అవుట్ పోస్ పోలీసులు, స్పెషల్ రాపిడ్ ఫోర్స్ పోలీసులతోపాటు ఆస్పత్రికి చెందిన ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ ఫలితం లేదని రోగి సహాయకులు విమర్శిస్తున్నారు. రాత్రి సమయాల్లో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు ఆస్పత్రి పాలనయంత్రాంగానికి ఫిర్యాదులు అందుతున్నాయి. తక్షణమే పోలీసులతోపాటు ఆస్పత్రి పాలనయంత్రాంగం స్పందించి అసాంఘిక శక్తుల నుంచి రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం రాత్రి సమయాల్లో అసాంఘిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. పోలీస్ ఉన్నతాధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటాం, ఆస్పత్రి సెక్యూరిటీ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాం.–డాక్టర్. శ్రవణ్‌కుమార్ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
నలబై కోట్లు విలువైన వెండి పట్టివేత
సాక్షి, హైదరాబాద్: సిక్రింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో పది టన్నుల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న కంటైనర్ సోమవారం పోలీసులకు పట్టుబడింది. వాహనంలోని వెండి విలువ సుమారు రూ.40 కోట్ల వరకు ఉండొచ్చని పోలీసులు అంచనావేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వెండి తరలింపుపై పోలీసులకు అనుమానం రావడంతో వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో కంటైనర్‌ను తనిఖీ చేయగా.. దానిలో 9వేలకు పైగా వెండి కడ్డీలను పోలీసులు గుర్తించారు. వెండికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు, ఆధారాలు లేకపోవడంతో వాహనం డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారి వద్ద నుంచి మరింత సమాచారాన్నిరాబట్టేందుకు ప్రశ్నిస్తున్నారు. ఇంత మొత్తంలో వెండి పట్టుబడడంతో దీనికి వెనుకున్న దందాపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
వారందరి లెక్క తేలుస్తాం: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు ఇవ్వడం సంతోషంగా ఉందని సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన మంత్రివర్గ కేటాయింపుల్లో హోంశాఖ సహాయమంత్రిగా కిషన్ రెడ్డికి అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. కీలక బాధ్యతలు అప్పగించినందుకు సంతోషంగా ఉందన్నారు. నేషనల్ సిటిజన్ రిజిస్టర్ తయారిపై ప్రధానంగా దృష్టి సారిస్తామని తెలిపారు. ఉగ్రవాద కార్యకలపాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు పడితే వారు మన దేశంలో ఉండేందుకు ఇదేమి ధర్మ సత్రం కాదని చెప్పారు. భారతీయులెవరు? చొరబాటుదారులెవరనేది లెక్క త్వరలోనే తేలుస్తామని స్పష్టం చేశారు. ఎక్కడ ఉగ్రవాద ఘటన జరిగినా హైదరాబాద్‌ను మూలాలుంటున్నామని, ఉగ్రవాదులు హైదరాబాద్‌ను సేఫ్ జోన్‌గా చేసుకుంటున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిని శాశ్వతంగా ఏరివేస్తాని కిషన్ రెడ్డి హెచ్చరించారు. పోలీసుశాఖను ఆధునీకరించి బలోపేతం చేస్తామన్నారు. దేశ సమగ్రత, ఐక్యత, భద్రత మా ప్రధాన లక్ష్యమని, గతంలో బీజేవైఎం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీమా సురక్ష పేరుతో 25 రోజులు యాత్ర చేసినట్లు ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు అదే అంశానికి సంబంధించిన హోంశాఖకు మంత్రికావడం సంతోషంగా ఉందన్నారు. ‘‘సంపదకు గుర్తు లక్ష్మిదేవి...తొలిసారిగా ఆర్థికశాఖకు మహిళా మంత్రి అయ్యారు. దేశాభివృద్ధికి, తెలుగురాష్ట్రాల అభివృద్ధికి అన్ని విధాల సహాయం చేస్తారని భావిస్తున్నాం. తెలంగాణలో బీజేపీని టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దుతాం. బీజేపీలో చేరేందుకు చాలా మంద్రి సంప్రదిస్తున్నారు. వారందరినీ చేర్చుకుంటాం’’ అని అన్నారు. చదవండి: కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు -
లష్కర్లో ముగ్గురూ ముగ్గురే!
కీలకమైన సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఈసారి గట్టి పోటీ నెలకొంది. మూడు ప్రధాన పార్టీలకూ ఈ లోక్‌సభ పరిధిలో బలం ఉండటంతో పోటీ రసవత్తరంగా మారింది. పూర్తిగా సిటీ ఓటర్లున్న ఈ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానముంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఇక్కడ పోటీ కొనసాగుతోంది. కానీ ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. సెగ్మెంట్ల వారీగా..ముషీరాబాద్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ముఠా గోపాల్ (టీఆర్ఎస్) ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లలో 51.18 శాతం ఆయనకు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి అనిల్‌కుమార్‌పై 36,888 ఓట్ల ఆధిక్యత సాధించారు. దీంతో బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంబర్‌పేట మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి టీఆర్ఎస్ తరపున కాలేరు వెంకటేశ్ గెలిచారు. పోలైన ఓట్లలో ఆయనకు 45.6 శాతం వచ్చాయి. బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డిపై 1,016 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఖైరతాబాద్ దానం నాగేందర్ (టీఆర్ఎస్) గెలిచారు. పోలైన ఓట్లలో 53.66 శాతం ఆయనకు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిపై 28,402 ఓట్ల మెజార్టీతో గెలిచారు. జూబ్లీహిల్స్ టీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ గెలిచారు. పోలైన ఓట్లలో ఆయనకు 43.1 శాతం వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్థన్‌రెడ్డిపై 16,011 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. సనత్‌నగర్ ఇక్కడ తలసాని శ్రీనివాసయాదవ్ (టీఆర్ఎస్)కు.. 55.2 శాతం ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ బలంగా ఉన్న నియోజకవర్గమిది. సికింద్రాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి టి.పద్మారావు విజయం సాధించారు. ఇక్కడ కూడా టీఆర్ఎస్కు పట్టుంది. నాంపల్లి ఇక్కడ నుంచి మజ్లిస్ అభ్యర్థి హుస్సేన్ 43.4 శాతం ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్‌పై 9,675 ఓట్ల తేడాతో గెలిచారు. బోనాల ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన సికింద్రాబాద్‌లో గెలుపు మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. సికింద్రాబాద్ లోక్‌సభ.. బీజేపీకి సిట్టింగ్ స్థానం. సిట్టింగ్ ఎంపీ దత్తాత్రేయను పక్కన పెట్టి ఆ పార్టీ కిషన్‌రెడ్డికి అవకాశం ఇచ్చింది. ఆయన గత అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా వ్యవహరించారు. ఇక కాంగ్రెస్ మరోసారి మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌ను రంగంలోకి దింపింది. టీఆర్ఎస్ మాత్రం ప్రయోగం చేసింది. మంత్రి తలసాని కుమారుడు సాయికిరణ్ యాదవ్‌ను పోటీకి దించింది. ఇది సిట్టింగ్ సీటు కావడం, మోదీ చరిష్మాపై కిషన్‌రెడ్డి ధీమా పెట్టుకోగా, అంజన్‌కుమార్ యాదవ్ తన పరిచయాలు, కాంగ్రెస్ ఓటుబ్యాంకుపై ఆశలు పెట్టుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి సాయికిరణ్ పూర్తిగా కొత్త. తండ్రి తలసాని శ్రీనివాసయాదవ్పైనే ఆధారపడి ఉన్నారు. అయితే ఈ సెగ్మెంట్ పరిధిలో టీఆర్ఎస్ ఎక్కువ అసెంబ్లీ సీట్లు గెలుచుకోవడం కలిసి వస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అసెంబ్లీ ఫలితాలే పునరావృతమైతే టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్లే. ఇప్పటివరకు సికింద్రాబాద్ స్థానం నుంచి గెలుపొందని టీఆర్ఎస్, ఎలాగైనా ఈసారి గెలవాలనే పట్టుదలతో ఉంది. పైగా లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యేల అండతో పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లి ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని టీఆర్ఎస్ నాయకులు తలపోస్తున్నారు. జనసేన తరపున శంకర్‌గౌడ్ రంగంలో ఉన్నారు. మొత్తం ఈ స్థానం నుంచి 28 మంది పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్– కాంగ్రెస్– బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా గత లోక్‌సభ ఎన్నికల నాటికి టీఆర్ఎస్కు సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో పెద్దగా పట్టులేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయంతో పరిస్థితి మారింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ లోక్‌సభ స్థానం పరిధిలో ఒక్క నాంపల్లి మినహా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. మొత్తంగా ఈ లోక్‌సభ పరిధిలోని ఇటీవలి అసెంబ్లీ ఓట్ల తీరును పరిశీలిస్తే... టీఆర్ఎస్కు 4,29,390 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 2,44,789, బీజేపీకి 1,72,188 ఓట్లు వచ్చాయి. నాంపల్లిలో గెలిచిన ఎంఐఎంకు 52 వేల ఓట్లు వచ్చాయి. అయితే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతు ఇస్తోంది. సికింద్రాబాద్ లోక్‌సభ సీటును కచ్చితంగా దక్కించుకోవాల్సిందేనని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్టుదలతో ఉన్నారు. దీంతో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. గుబాళించాలని గులాబీ.. ఇప్పటివరకు గెలవని చోట బోణీ కొట్టాలని టీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతోంది. ఈ లోక్‌సభ స్థానం నుంచి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ లోక్‌సభ పరిధిలోని నాంపల్లి మినహా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో 2018లో అన్నింటినీ టీఆర్ఎస్ గెలుచుకోవడంతో గెలుపుపై ఆ పార్టీ ధీమాతో ఉంది. పైగా సాయికిరణ్‌ను గెలిపించే బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలకే అప్పగించారు. ప్రస్తుతం వారంతా ప్రచారంలో ఉన్నారు. పైగా మంత్రి తలసానికి ఈ నియోజకవర్గంపై గట్టి పట్టుంది. బలమైన సామాజిక వర్గమైన బీసీ ఓటర్ల అండ ఉంది. అయితే అభ్యర్థి సాయికిరణ్ యాదవ్.. అనుభవజ్ఞులైన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులతో తలపడటం ఆసక్తి కలిగిస్తోంది. ‘హస్త’గతం చేసుకోవాలని కాంగ్రెస్.. అంజన్‌కుమార్ యాదవ్‌ను మరోసారి బరిలోకి దింపిన కాంగ్రెస్ గెలుపుపై ఆశలు పెట్టుకుంది. ఇక్కడ 2004 నుంచి వరుసగా మూడుసార్లు పోటీ చేసిన ఆయన రెండుసార్లు ఎంపీగా గెలిచారు. తిరిగి బరిలో ఉన్నారు. ఆ విధంగా సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉండేది. పైగా ఈ స్థానం నుంచి ఎక్కువసార్లు కాంగ్రెస్ ఎంపీలే గెలిచారు. ఈ ఎన్నికల ద్వారా పూర్వ వైభవాన్ని చాటాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. గెలుపు కోసం ఆ పార్టీ నేతలు శక్తియుక్తులన్నింటినీ కూడదీసుకుంటున్నారు. అయితే కీలకమైన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరిపోతుండటంతో కాంగ్రెస్‌కు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని టీడీపీని కాంగ్రెస్ నాయకులు కోరారు. పైగా బీసీ సామాజికవర్గ ఓట్లున్నాయి. అయితే ఇటీవలి ఎన్నికల్లో పార్టీకి ఎదురైన పరాజయం ఆయనకు మైనస్‌గా చెప్పుకోవచ్చు. నియోజకవర్గాల్లో పార్టీకి నాయకుల కొరత ఉంది. సీటు నిలబెట్టుకోవాలని బీజేపీ.. తమకు గట్టి పట్టున్న సికింద్రాబాద్ సిట్టింగ్ సీటును మరోసారి దక్కించుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఇక్కడి నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. ముషీరాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీకి పట్టుంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్‌సభ పరిధిలోని 3 సెగ్మెంట్లలో గెలుపొందిన బీజేపీ 2018 ఎన్నికల్లో ఒక్కచోటా గెలుపొందలేకపోయింది. అంబర్‌పేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయిన కిషన్‌రెడ్డిని ఇప్పుడు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టింది. కిషన్‌రెడ్డిపై ఓటర్లలో సానుకూల వైఖరి ఉందని, దీనికితోడు మోదీ అనుకూల పవనాలు తమ అభ్యర్థిని గెలిపిస్తాయని ఆ పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి. ఇక్కడి నుంచి గెలిపిస్తే కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి అయ్యే అవకాశముందని, అభివృద్ధి చేయడానికి వీలుంటుందని ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. కేసీఆర్, కేటీఆర్‌లే అండదండ చిన్న వయసులోనే లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించే అవకాశం కల్పించినందుకు పార్టీ అధినేతలకు కృతజ్ఞతలు. నాకు అనుభవం ఉందా లేదా అనేది ముఖ్యం కాదు.. కేసీఆర్ విధానాలే నన్ను గెలిపిస్తాయి. పైగా మా నాన్న మంత్రి. ఆయనకు ఇక్కడ కార్యకర్తలు, ప్రజాబలం ఉంది. ఇవన్నీ నాకు కలిసొచ్చేవే. బీజేపీ, కాంగ్రెస్ గెలిచినా ప్రయోజనం లేదు. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంటే అధికారంలోకి వస్తుంది. నా గెలుపు నల్లేరుపై నడకే.. బీజేపీ.. బండారు దత్తాత్రేయను మంత్రి పదవి నుంచి తొలగించి బీసీలను అవమానించింది. ఇద్దరు ఎంపీలతో కేసీఆర్ తెలంగాణ తెచ్చారు. 16 మంది ఎంపీలను గెలిపిస్తే ఫెడరల్ ఫ్రంట్‌ను అధికారంలోకి తెస్తారు.– తలసాని సాయికిరణ్ యాదవ్, టీఆర్ఎస్ అభ్యర్థి కేంద్రంలోఅధికారం మాదే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రానుంది. పైగా నేను ఎంపీగా గతంలో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. బడుగు, బలహీన వర్గాల కోసం కష్టపడ్డాను. నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నిరంతరం ప్రజల్లో ఉన్నాను. కాబట్టి ప్రజలు నన్ను గెలిపిస్తారు. రాహుల్ ప్రధానైతే రాష్ట్రానికి నిధులొస్తాయి. వాటి సాయంతో అభివృద్ధికి పాటుపడతాను. – అంజన్‌కుమార్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి నా గెలుపు ఖాయం ఈ ఎన్నికలు దేశ ప్రధానిని ఎన్నుకునేవి కాబట్టి ఇందులో టీఆర్ఎస్ ఎంపీలు ఓడినా, గెలిచినా ప్రజలకు లాభం లేదు. మోదీని ప్రధానిని చేసేందుకు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి. ప్రధాని మోదీ సభ తరువాత తెలంగాణ ప్రజలు మరోసారి మోదీనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను ఇచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదే. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం అనేక చర్యలు చేపడుతోంది. కేసీఆర్ అభివృద్ధి అంతా గ్రాఫిక్స్ లోనే ఉంది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రుణమాఫీ కాలేదు. రేపు కాంగ్రెస్ ఎంపీలు గెలిచినా టీఆర్ఎస్లోకి వెళ్లిపోవడం ఖాయం. సికింద్రాబాద్‌లో బీజేపీ మంచి మెజారిటీతో గెలుస్తుంది.– కిషన్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి జనం మాట... కేసీఆర్‌ని గెలిపించాల్సిందే.. మోదీకి బీజేపీని, రాహుల్‌కు కాంగ్రెస్‌ను గెలిపించాలని ఉంటుంది. కానీ తెలంగాణ గెలవాలంటే కేసీఆర్‌ను గెలిపించాలి. ఎందుకంటే జాతీయ పార్టీల దృష్టి ఒకలా ఉం టుంది. ప్రాంతీయ పార్టీల ఆలోచన విధానం ఆ ప్రాంతం అభివృద్ధి, వనరుల సృష్టి కోసం ఉంటుంది. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ప్రాచుర్యం పొందాయి. టీఆర్ఎస్కు 16 ఎంపీ సీట్లు ఇస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది. – శంకర్, సినీ డైరెక్టర్ మంచి అభ్యర్థికి ఓటేయండి మంచి అభ్యర్థిని గుర్తించి ఎంచుకోవాలి. పొరపాటున డబ్బు తీసుకొని కానీ, ఇతరత్రా ప్రలోభాలకు గురై కానీ ఓటేయకూడదు. రాజ్యాంగం మనకు ఓటు హక్కు కల్పించింది. కానీ కొందరు ఓటేయడం లేదు. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటేయాలని నా విన్నపం. మన భవిష్యత్తును నిర్ణయించేది ఓటే.– హేమ, సినీనటి మోదీతోనే దేశాభివృద్ధి సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని ప్రాంతాలను అభివృద్ధి చేసే పార్టీ, అభ్యర్థికి ఓటేస్తాను. ప్రస్తుతం జరిగే ఎన్నికలు కేవలం పార్లమెంటుకు సంబంధించినవి. అంటే ప్రధాని ఎవరో నిర్ణయించేవి. మోదీతోనే దేశంలో అభివృద్ధి జరుగుతోంది. పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం బయటకు వచ్చింది. కాబట్టి బీజేపీకి మద్దతివ్వాలనుకుంటున్నా.– జి.ఆనంద్, నగల వ్యాపారి, ముషీరాబాద్ ఫ్రంట్‌తోనే దేశం ముందుకు.. టీఆర్ఎస్కే ఓటేస్తా. కేసీఆర్‌తోనే రాష్ట్రం అభివృద్ధి చెందింది. 16 ఎంపీ సీట్లను గెలిపిస్తే దేశంలో చక్రం తిప్పుతానని చెప్పారు. కాబట్టి ఆ ప్రకారమే టీఆర్ఎస్కు ఓటేస్తాను. కేంద్రంలో జాతీయ పార్టీలుంటే రాష్ట్రాలు అభివృద్ధి అయ్యే పరిస్థితి లేదు. బడుగు బలహీన వర్గాలకు కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారు. మరిన్ని ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడితే తెలంగాణ మరింత అభివృద్ధి చెందడం ఖాయం. కె.శ్రీకాంత్ నా చెల్లి పెళ్లికి సాయం షాదీ ముబారక్ పథకం కింద నా చెల్లి పెళ్లికి ప్రభుత్వంరూ. 50 వేలు ఇచ్చింది. కాబట్టి నేను టీఆర్ఎస్ అభ్యర్థికే ఓటేస్తాను.– రహీమ్, కూరగాయల వ్యాపారి, విజయనగర్ కాలనీ పురుషులు 10,24,917 స్త్రీలు 9,43,171 ఇతరులు 59 మొత్తం 19,68,147 సికింద్రాబాద్లోక్సభలోనిఅసెంబ్లీ సెగ్మెంట్లు ♦ సికింద్రాబాద్ ♦ ముషీరాబాద్ ♦ ఖైరతాబాద్ ♦ జూబ్లీహిల్స్ ♦ నాంపల్లి ♦ సనత్‌నగర్ ♦ అంబర్‌పేట సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల శాతం -
లష్కర్లో ఎలక్షన్ జాతర
ఒకవైపు కాలనీలు.. మరోవైపు సరైన ఇంటి పైకప్పులూ లేని బస్తీలు.. ఇంకోవైపు ఆకాశాన్నంటే హర్మ్యాలు.. జాతీయ సమైక్యతకు అద్దం పట్టే నిర్మాణాలు, చారిత్రక నేపథ్యం ఉన్న చర్చిలు, మసీదులు, దేవాలయాలు.. ఇదీ లష్కర్గా పేరొందిన సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ముఖచిత్రం. భిన్న సంస్కృతులు, సంప్రదాయాల నిలయమైన ఈ ప్రాంతం నిజాం కాలంలోనే వెలుగొందింది. ఆంగ్లేయుల ప్రభావమూ తోడై సాంస్కృతిక వారసత్వం– ఆధునికతల కలబోతగా మారింది. బొల్లోజు రవి,సాక్షి– హైదరాబాద్ 1957లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడింది. ఈ స్థానం తొలి నుంచీ కాంగ్రెస్ అడ్డా. ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం హవా కొనసాగినపుడూ ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. తర్వాత ఓటర్లు బీజేపీని ఆదరించారు. ఇప్పుడు సీన్ మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నాటి నుంచి టీఆర్ఎస్ బలపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఊహించని విధంగా సత్తా చాటింది. దీంతో ఈసారి సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాన్ని కచ్చితంగా గెలుచుకుంటామన్న ధీమాతో ఆ పార్టీ ఉంది. ఈ స్థానం జనరల్ అయినా.. ఇక్కడి నుంచి గెలిచిన వారిలో బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాల వారే ఎక్కువ. 1996 నుంచి 1998 వరకు రెండేళ్లపాటు పదవిలో ఉన్న పీవీ రాజేశ్వరరావు మాత్రమే ఓసీ వర్గానికి చెందినవారు. 1991కి ముందు వరుసగా కాంగ్రెస్ గెలవగా, తర్వాత నాలుగుసార్లు బీజేపీ (బండారు దత్తాత్రేయ), మూడుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఈ స్థానానికి మొత్తం 18 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 11, కాంగ్రెస్ (ఐ) రెండుసార్లు, టీపీఎస్ ఒకసారి, బీజేపీ నాలుగుసార్లు గెలిచింది. కాంగ్రెస్ నేత శివశంకర్ ఈ నియోజకవర్గంలో రెండు సార్లు, తెనాలిలో ఒకసారి గెలిచారు. ఇక హషీం, మణెమ్మ అంజయ్య, అంజన్‌కుమార్ యాదవ్ రెండేసి సార్లు గెలిచారు. ఎ.మోహియుద్దీన్ సికింద్రాబాద్‌లో రెండుసార్లు, హైదరాబాద్‌లో ఒకసారి గెలిచారు. బీఏ మీర్జా సికింద్రాబాద్‌లో ఒకసారి, వరంగల్‌లో ఒకసారి గెలిచారు. ఎస్.ఎ.ఖాన్, టి.అంజయ్య, పీవీ రాజేశ్వర్‌రావు ఒక్కోసారి గెలిచారు. శివశంకర్, అంజయ్య, బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రులుగా పనిచేశారు. అంజయ్య ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగానూ ఉన్నారు. ఆయన మరణం తర్వాత భార్య మణెమ్మ రెండుసార్లు ఎంపీ కాగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. మొత్తంగా బీసీ నేతలు ఎనిమిది సార్లు గెలవగా, రెడ్లు మూడు సార్లు, బ్రాహ్మణ ఒకసారి, ముస్లింలు ఆరుసార్లు గెలిచారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఇదీ పరిస్థితి 2014లో జరిగిన ఎన్నికల్లో బండారు దత్తాత్రేయ (బీజేపీ) గెలిచారు. ఆ తర్వాత ప్రధాని మోదీ మంత్రివర్గంలో సభ్యులయ్యారు. దత్తాత్రేయకు 4,38,271 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి అంజన్‌కుమార్ యాదవ్‌కు 1,83,536 ఓట్లు వచ్చాయి. అంజన్‌కుమార్ యాదవ్ అంతకుముందు రెండుసార్లు వరుసగా గెలిచి, ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పుడు ఎంఐఎం అభ్యర్థి మూడో స్థానంలో, టీఆర్ఎస్ అభ్యర్థి భీమ్సేన్ నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. ఈ నియోజకవర్గంలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ ఆధిక్యత తెచ్చుకోగా, నాంపల్లిలో మాత్రం ఎంఐఎం మెజారిటీ పొందింది. సికింద్రాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు అసెంబ్లీకి ఎన్నిక కాగా, లోక్‌సభకు మాత్రం క్రాస్ ఓటింగ్ జరిగి బీజేపీ మెజారిటీ సంపాదించింది. ఇప్పుడు ‘కారు’దే దూకుడు.. గత లోక్‌సభ ఎన్నికల నాటికి టీఆర్ఎస్కు సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంపై పెద్దగా పట్టులేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయంతో పరిస్థితి మారింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ స్థానం పరిధిలో ఒక్క నాంపల్లి మినహా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. మొత్తంగా ఈ లోక్‌సభ పరిధిలోని ఇటీవలి అసెంబ్లీ ఓట్ల తీరును పరిశీలిస్తే.. టీఆర్ఎస్కు 4,29,390 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 2,44,789, బీజేపీకి 1,72,188 ఓట్లు వచ్చాయి. నాంపల్లిలో గెలిచిన ఎంఐఎంకు 52 వేల ఓట్లు వచ్చాయి. అయితే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతు ఇచ్చే అవకాశముంది. సికింద్రాబాద్ లోక్‌సభ సీటును కచ్చితంగా దక్కించుకోవాల్సిందేనని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్టుదలతో ఉన్నారు. ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించారు. యాదవులు, మైనార్టీలే కీలకం.. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం మొదటి నుంచీ యాదవులకు పట్టున్న ప్రాంతం. ఇక్కడ వరుసగా విజయాలు సాధిస్తున్న వారిలో ఎక్కువ మంది ఆ సామాజిక వర్గానికి చెందిన వారే. సంఖ్యాపరంగా ఈ వర్గం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. దీనికి తోడు ఇక్కడ కంటోన్మెంట్, దక్షిణ మధ్య రైల్వే కేంద్రంగా ఉండటంతో ఉత్తర భారతీయులు పెద్దసంఖ్యలో ఓటర్లుగా ఉన్నారు. వీరిలోనూ యూపీ, బిహార్, జార్ఖండ్‌లోని కుర్మి, యాదవ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు కీలకంగా మారతారు. అందుకే, పార్టీలేవైనా ఇక్కడ చాలాసార్లు అదే సామాజిక వర్గానికి చెందిన నేతలు గెలుపొందుతున్నారు. ఇక మైనార్టీలూ ఇక్కడ గెలుపోటములను ప్రభావితం చేయగల సంఖ్యలో ఉన్నారు. ఏ పార్టీ నుంచి ఎవరు? కాంగ్రెస్: సికింద్రాబాద్ లోక్‌సభ సెగ్మెంట్లో కాంగ్రెస్ తరపున మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ బరిలో నిలవడం ఖాయమైంది! ప్రస్తు తం గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న ఆయన 2004–2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కాగా, ఈ లోక్‌సభ స్థానంలో అంజన్ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతోపాటు గతంలో గెలవడంతో ఆయన గెలుపుపై కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది. బీజేపీ: గతంలో ఇక్కడ బీజేపీకి విజయాన్ని అందించిన బండారు దత్తాత్రేయకు బదులు ఆ పార్టీ ఈసారి కిషన్‌రెడ్డిని బరిలోకి దించింది. కిషన్‌రెడ్డి 2014 ఎన్నికల్లోనే ఈ లోక్‌సభ సీటుపై దృష్టిపెట్టారు. కానీ, దత్తాత్రేయకు టికెట్ లభించింది. కాగా, తాజా అభ్యర్థి కిషన్‌రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఎంపీగా ఇప్పుడిక్కడ గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. టీఆర్ఎస్: ఈ పార్టీ నుంచి ఈసారి నలుగురి పేర్లుమొదటి నుంచీ వినిపించినా.. చివరకు మంత్రి తలసానిశ్రీనివాస్యాదవ్ కుమారుడుతలసాని సాయికిరణ్ యాదవ్ పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. -
లష్కర్ బరిలో సైకిల్!
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ లోక్‌సభ బరిలో నిలిచేందుకు తెలుగు తమ్ముళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ స్థానం నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవని టీడీపీ పోటీకి సై అంటోంది. గతంలో వివిధ ఎన్నికల్లో ఇతర పార్టీ లతో పొత్తులో భాగంగా టీడీపీ పోటీ చేయలేదు. పోటీ చేసిన సందర్భాల్లోనూ విజయం దక్కకపోవడమే కాకుండా కనీసం రెండో స్థానంలో కూడా నిలవలేదు. అయినప్పటికీ సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీకి బలముందని, గతంలో టీడీపీతో పొత్తుపెట్టుకున్న మిత్ర పక్షాల అభ్యర్థులు గెలవడానికి, ఓడినప్పుడు వారు రెండో స్థానంలో నిలవడానికీ టీడీపీ బలమే కారణమని చెబుతున్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమతో పొత్తు వల్లే లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని వివిధ సెగ్మెంట్లలో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలవగా, బీజేపీ అభ్యర్థులు వారికంటే వెనకబడటానికి కారణమని చెబుతూ ముషీరాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ వంటి వాటిని ప్రస్తావిస్తున్నారు. ఎల్బీనగర్లో కాంగ్రెస్ తరఫున సు«ధీర్‌రెడ్డి గెలిచేందుకు కూడా టీడీపీ తోడ్పాటే కారణమని చెబుతూ, ఈసారి సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. టికెట్ ఎవరికిచ్చినా సరే.. హైదరాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెన్ శ్రీనివాసరావు, సనత్‌నగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన కూన వెంకటేశ్‌గౌడ్, టీడీపీ రాష్ట్ర నాయకులు బీఎన్ రెడ్డి, లంకెల దీపక్‌రెడ్డి, అంబర్‌పేట నియోజకవర్గ ఇన్చార్జి వనం రమేశ్, సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మేకల సారంగపాణి తదితరుల పేర్లు ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి పార్టీ ఎలాగైనా పోటీ చేయాలని కోరుతూ పలువురు నాయకులు సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఇన్చార్జి రావుల చంద్రశేఖరరెడ్డి వద్ద బుధవారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిపినట్లు సమాచారం. తమలో ఎవరికి టిక్కెట్ దక్కినా ఫరవాలేదనే అభిప్రాయంతోపాటు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెన్ శ్రీనివాసరావుకు కేటాయించాల్సిందిగా దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు దశాబ్దాల నుంచి వేచి చూసినప్పటికీ, పొత్తుల్లో భాగంగా ఆయనకు ఇప్పటి వరకు అవకాశం లభించకపోవడంతోపాటు, జిల్లా అధ్యక్షునిగా ఉన్నప్పటికీ ఇంతవరకు పోటీ చేయకపోవడం తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని ఆయనకు కేటాయిస్తే తమకేం అభ్యంతరం లేదని, అందరం కలిసి పనిచేస్తామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, ఆ మేరకు తీర్మానం చేసి పంపించాల్సిందిగా రావుల సూచించినట్లు తెలిసింది. సికింద్రాబాద్ నుంచి టీడీపీ పోటీలో దిగడం దాదాపు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేతలు మాత్రం పార్టీ ఆదేశిస్తే పోటీ చేసేందుకు తాము సిద్ధమని చెబుతున్నారు. లష్కర్ నుంచి పార్టీ రంగంలో ఉండాలనే తలంపుతోనే బుధవారం సికింద్రాబాద్ పార్లమెంట్ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసానిలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎలాగైనా పోటీ చేయాలనే తలంపుతోనే అధికార పార్టీపై విరుచుకుపడ్డట్లు తెలుస్తోంది. మరోవైపు ఎంతోకాలంగా విభేదాలతో దూరమైన ఎమ్మెన్, మేకల సారంగపాణి ఏకమయ్యారు. మేకల ప్రాధాన్యాన్ని చాటేందుకే ఆయన అసెంబ్లీ సెగ్మెంట్లో ఈ సమావేశం నిర్వహించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 15 శాతం ఓట్లే.. లష్కర్లో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అంతో ఇంతో సత్తా చాటిన సందర్భం 1987లో డాక్టర్ ప్రతాప్‌రెడ్డి పోటీ చేసినప్పుడు తప్ప మరెప్పుడూ వెల్లడి కాలేదు. ఆయన రెండో స్థానంలో నిలవగా, ఆ తర్వాత 1996లో ఎం.రామచంద్రరావు, 1998లో డాక్టర్ అల్డాడి రాజ్‌కుమార్, 2009లో సుధీష్ రాంభొట్ల మూడో స్థానానికే పరిమతమయ్యారు. 1996లో టీడీపీ అభ్యర్థి ఎం. రామచంద్రరావుకు కేవలం 15.45 శాతం , 1998 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి డాక్టర్ అల్లాడి రాజ్‌కుమార్‌కు 21.58 శాతం 2009 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి సుధీష్ రాంభొట్లకు 15.68 శాతం ఓట్లే లభించడం గమనార్హం. ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన పార్టీకి ఏమేరకు ప్రజల మద్దతు ఉందనేది ఎన్నికల్లోనే తేలనుంది. -
ఇదీ ‘సికింద్రాబాద్’ ప్రత్యేకత
సికింద్రాబాద్: రాష్ట్రంలోనే సికింద్రాబాద్ అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. వీటికి ఇప్పటివరకు ముప్పైరెండు సార్లు ఎన్నికలు జరగాయి. కానీ ప్రధాన పార్టీలు ఇక్కడినుంచి స్థానికులకు టికెట్లు ఇవ్వకపోవడంతో స్థానికులెవరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాలేకపోయారు. ఆదినుంచీ ఇక్కడ స్థానికేతరులదే హవా నడుస్తోంది. అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ ఎన్నికల్లో దిగుమతి నాయకులే ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నారు. 32 ఎన్నికల్లోనూ.. సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఇప్పటివరకు 15, లోక్‌సభకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. మొత్తంగా జరిగిన 32 ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఏ ఒక్క నాయకుడికీ ప్రధాన రాజకీయ పార్టీలు ఏవీ పోటీ చేసే అవకాశమే ఇవ్వలేదు. సికింద్రాబాద్ ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా చుట్టు పక్కల నియోజకవర్గాల నాయకులు పోటీ చేయడం, పదవీకాలం తర్వాత వెళ్లిపోవడం ఆనవాయితీగా మారింది. సనత్‌నగర్ నుంచి ఎమ్మెల్యేలు.. సికింద్రాబాద్ నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇందులో ఇద్దరు మినహా ఆరుగురు నేతలు సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోనివారే. కేఎస్ నారాయణ, తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావుగౌడ్‌లు తలా మూడుసార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ ముగ్గురు సనత్‌నగర్ నియోజకవర్గానికి చెందినవారే. 1972, 78 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఎల్.నారాయణతో పాటు అల్లాడి రాజ్‌కుమార్, మేరీ రవీంద్రనాథ్‌లు కూడా సనత్‌నగర్ నియోజకవర్గానికి చెందిన వారే. గచ్చిబౌలి వాస్తవ్యురాలు, ప్రముఖ సినీనటి జయసుధ, వరంగల్‌కు చెందిన మేచినేని కిషన్‌రావులను కూడా లష్కర్ ప్రజలు ఆదరించి ఎమ్మెల్యేలుగా పని చేసే అవకాశమిచ్చారు. హైదరాబాద్ నుంచి ఎంపీలు.. సికింద్రాబాద్ ఎంపీలు గెలిచిన బండారు దత్తాత్రేయ, బాఖర్ అలీ మీర్జా, ఎంఎం హషీం, అంజన్‌కుమార్ యాదవ్‌లు హైదరాబాదీలు. ఇందులో కొందరు పాతబస్తీకి చెందిన వారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్ నుంచి పి.శివశంకర్, బర్కత్‌పుర నుంచి టి.అంజయ్య, మణెమ్మ, ఆదర్శ్‌నగర్ నుంచి పీవీ రాజేశ్వర్‌రావు సికింద్రాబాద్ ఎంపీలుగా గెలుపొందారు. దిగుమతి నాయకులే దిక్కు.. సికింద్రాబాద్ నుంచి టికెట్ ఆశించే నాయకుల జాబితా క్రమేణా తగ్గుతూ వస్తోంది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ.. ఏ పార్టీ ఏ నాయకుడిని దిగుమతి చేస్తుందా అంటూ ఈ ప్రాంత ఓటర్లు ఎదురుచూడడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇక్కడ ఇదే వైనం పునరావృతం కానుంది. ఇక్కడి నుంచి ఎంపీ టికెట్ ఆశించే నాయకులు ఎవరూ లేరు. ఫలితంగా సికింద్రాబాద్ అభ్యర్థిగా ఏ పార్టీ.. ఏ నాయకుడిని దిగుమతి చేస్తుందా అని ఓటర్లు ఎదురుచూస్తున్నారు. -
ఈజీ జర్నీ
సాక్షి,సిటీబ్యూరో: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో మరో సదుపాయం అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ప్రయాణికులు ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఉన్నాయి. తాజాగా ఫ్లాట్‌ఫామ్‌పై ఒకచోటు నుంచి మరో చోటుకు వేళ్లేందుకు బ్యాటరీ ఆపరేటెడ్ కార్ల (బీఓసీ)ను ప్రవేశపెట్టారు. వయోధికులు, దివ్యాంగులు, మహిళలు, పిల్లలు ప్లాట్‌ఫామ్‌లకు చేరుకునేందుకు వీలుగా ఐదు వాహనాలను 24 గంటలూ అందుబాటులో ఉంచారు. బ్యాటరీతో నడిచే ఈ వాహనాల్లో ఒకేసారి ఆరుగురు వెళ్లవచ్చు. వాహనం పైన లగేజీ పెట్టుకునేందుకు తగినంత స్థలం కూడా ఉంది. వీటిలో సాంకేతిక లోపాల వల్ల ఇబ్బందులు ఏర్పడినప్పుడు హ్యాండ్ బ్రేక్‌ను వినియోగించి తగిన రక్షణ పొందవచ్చు. క్లోజ్డ్ యూజర్ గ్రూప్ (సీయూజీ) ఫోన్లతో అనుసంధానం కలిగిన శిక్షణ పొందిన డ్రైవర్లు వీటిని నడుపుతారు. ఈ వాహనాల్లో కెమరాలు కూడా ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులకు పటిష్టమైన భద్రత ఉంటుంది. ఈ వాహనాలను ముందుగా బుక్ చేసుకునేందుకు 88273 31111 నంబర్లో సంప్రదించవచ్చు. ప్రయాణికుడికి రూ.45 చొప్పున చార్జీ నిర్ణయించారు. -
జస్ట్ మిస్!
సికింద్రాబాద్ :సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఎవరూవరుసగా మూడుసార్లు గెలవలేదు. ఇక్కడి నుంచి వరుసగా రెండుసార్లు గెలిచినపలువురు నేతలకు మూడోసారిఆశాభంగం తప్పలేదు. ఈ నియోజకవర్గం 1956లో ఆవిర్భవించగా, ఇప్పటి వరకు 17సార్లు (ఉప ఎన్నికతో 1987–89)ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుంచి పోటీ చేసిన వారిలో ఐదుగురురెండుసార్లు వరుసవిజయాలు సాధించారు. మూడోసారి పోటీ చేసేఅవకాశం లభించక కొందరు, పోటీ చేసి పరాజయం పాలవడంతో మరికొందరు హ్యాట్రిక్ చేజార్చుకున్నారు. ఒకరు మూడుసార్లు, మరొకరు నాలుగు సార్లు ఎంపీగా గెలిచినప్పటికీ హ్యాట్రిక్ మాత్రం దక్కలేదు. ♦ సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన నరాల సాయికిరణ్ యాదవ్ 1957, 62 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు.ఆ తర్వాత ఎన్నికలకు పోటీకి దూరమైన ఆయన తిరిగి 1971లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ♦ కాంగ్రెస్ నేత పి.శివశంకర్ 1979, 1980 ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆయనకు పోటీ చేసే అవకాశం రాలేదు. ♦ 1987, 89 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్యమరణానంతరం ఆయన సతీమణి మణెమ్మ రెండుసార్లుఎంపీగా గెలుపొందారు. ♦ 1991 ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ.. ఆ తర్వాతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, పీవీ తనయుడు రాజేశ్వరావు చేతిలో పరాజయం పాలయ్యారు. ♦ తిరిగి 1998, 99 ఎన్నికల్లో రెండుసార్లు వరుస విజయాలు సాధించిన దత్తాత్రేయ... 2004లో ఓటమిపాలై హ్యాట్రిక్ చేజార్చుకున్నారు. 2014లో నాలుగోసారి ఎంపీగా గెలిచారు. ♦ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అంజన్‌కుమార్‌యాదవ్ తొలి విజయం సాధించారు. 2009లోనూ రెండోసారి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయి హ్యాట్రిక్ మిస్ అయ్యారు. -
‘విశాఖ’ వేదన!
సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ మధ్య రైల్వే విభజన నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని ప్రధాన కార్యాలయం రైల్‌నిలయం. గణాంకాల కార్యాలయం లేఖాభవన్, రైల్ నిర్మాణ్ భవన్ వంటి ప్రధాన పరిపాలన, నిర్వహణ కేంద్రాల్లో గురువారం ఉద్విగ్న వాతావరణం నెలకొంది. కొత్తగా ఏర్పాటు కానున్న దక్షిణ కోస్తా రైల్వే, పాత దక్షిణమధ్య రైల్వేల మధ్య ఉద్యోగుల విభజన తప్పనిసరి కావడంతో అన్ని ప్రధాన కేంద్రాల్లో విభజన అంశమే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అనేక సంవత్సరాలుగా సికింద్రాబాద్ కేంద్రంగా పని చేసిన అధికారులు, ఉద్యోగులు ఇప్పుడు ఏపీకి తరలి వెళ్లవలసి రావడంతో ఉద్వేగానికి గురవుతున్నారు. మొదటి దశలో ఆప్షన్లు ఇచ్చినప్పటికీ కిందిస్థాయి ఉద్యోగులకు ఎలాంటి ఆప్షన్లు ఉండకపోవచ్చునని, తప్పనిసరిగా విశాఖ జోన్‌కు వెళ్లవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్‌లో పని చేస్తూ ఇక్కడే స్థిరపడి సొంత ఇళ్లు, ఆస్తులు సంపాదించుకొన్న వారు ఇప్పుడు ఉన్నఫళంగా కొత్త జోన్‌కు వెళ్లవలసి రావడంతో ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘‘చాలా కాలంగా పని చేస్తూ సొంత ఊళ్లనే మరిచిపోయాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి. తిరిగి ఎక్కడ స్థిరపడాలి. చాలా గందరగోళంగా ఉంది.’’ అని రైల్‌నిలయంలో పని చేస్తున్న అధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. నగరంలోనే హైదరాబాద్ డివిజన్ , సికింద్రాబాద్ డివిజన్ల ప్రధాన కార్యాలయాలు ఉన్నప్పటికీ విభజన ప్రభావం డివిజనల్ ఉద్యోగులపైన ఉండబోదు. కేవలం జోనల్ కార్యాలయాల్లో పని చేసే అధికారులు, ఉద్యోగులు మాత్రమే రెండు జోన్ల మధ్య బదిలీ కావలసి ఉంటుంది. తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన అధికారులు, ఉద్యోగులు, విశాఖ, విజయవాడ, తదితర ప్రాంతాల్లో పని చేస్తున్నప్పటికీ వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. హైదరాబాద్‌లో పని చేస్తున్న వాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. రైల్నిలయంపై ప్రభావం... దక్షిణమధ్య రైల్వే ప్రధాన కార్యాలయం రైల్‌నిలయంలో సుమారు 1500 మంది ఉద్యోగులు, అధికారులు, వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది పని చేస్తున్నారు. జోన్‌లోని మొత్తం 6 డివిజన్ల కార్యాలకలాపాలను ఇక్కడి నుంచి పర్యవేక్షిస్తారు. పరిపాలన, మానవ వనరుల విభాగం, ఆపరేషన్స్, విజిలెన్స్, ప్రజాసంబంధాలు, కమర్షియల్, తదితర విభాగాలతో పాటు, ఆర్పీఎఫ్ ప్రధాన కార్యాలయం కూడా రైల్నిలయంలోనే ఉంది. విభజన నేపథ్యంలో సుమారు 750 మందికి పైగా విశాఖ జోన్‌కు తరలి వెళ్లే అవకాశం ఉంది. దీంతో రైల్‌నిలయంలోని ఏడంతస్థుల భవనంలో సగానికి పైగా ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొందని దక్షిణమధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ నేత అరుణ్ విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకల్లోని కొంత భాగాన్ని రైల్‌నిలయం కేంద్రంగా దక్షిణమధ్య రైల్వే నిర్వహిస్తుంది. విభజన అనంతరం హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే దీని పరిధిలో ఉంటాయి. ఉద్యోగుల సంఖ్య చాలా వరకు తగ్గుతుంది.అలాగే దక్షిణమధ్య రైల్వేలో కొత్త లైన్ల నిర్మాణం, కొత్త భవనాలు, కట్టడాలు,తదితర కార్యాలయాలను చేపట్టి పర్యవేక్షించే రైల్నిర్మాణ్ భవన్లో సుమారు 650 మంది పని చేస్తున్నారు. లేఖా భవన్లో మరో 500 మందికి పైగా ఉన్నారు. ఈ రెండు కార్యాలయాల్లోనూ సగం మంది కొత్త జోన్‌కు తరలి వెళ్లవలసిందే. తగ్గనున్న ఏ–1 స్టేషన్లు... జోన్ విభజన దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే జోన్లో ఏ–1 స్టేషన్ల సంఖ్య తగ్గనుంది. విజయవాడ, తిరుపతి రైల్వేస్టేషన్లు కొత్త జోన్‌కు బదిలీ అవు తాయి. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లు మాత్రమే మిగులుతాయి.దీంతో రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు తగ్గే అవకాశం ఉన్న ట్లు అధికారవర్గాలు భావిస్తున్నాయి. సికింద్రాబాద్ డివిజన్ ఒక్కటే అత్యధిక ఆదాయం వచ్చే డివిజన్‌గా మారింది. కొత్తగా కాజీపేట్ డివిజన్‌ను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని మజ్దూర్ యూనియన్ నాయకులు అరుణ్ కోరారు. విశాఖ–సికింద్రాబాద్నెట్వర్క్ పెరిగే అవకాశం దక్షిణమధ్య రైల్వే విభజన పట్ల ఉద్యోగ వర్గాల్లో కొంత విముఖత ఉన్నప్పటికీ కొత్త జోన్ వల్ల ప్రయాణికులకు మరిన్ని అదనపు రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్టణం నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు కనెక్టివిటీ పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉండే ఈ కారిడార్‌లో కొత్త రైళ్లను విశాఖ వరకు పొడిగించేందుకు అవకాశం లేకపోవడంతో కాకినాడ నుంచే మళ్లిస్తున్నారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వేకు, దక్షిణమధ్య రైల్వేకు మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఉత్తరాంధ్రకు హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ పెరగడం లేదు. కొత్త రైళ్లు నడపాలని అనేక ఏళ్లుగా ప్రజలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఈస్ట్‌కోస్ట్ నుంచి సహకారం లభించకపోవడంతో వాయిదా వేస్తున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే సౌత్‌కోస్ట్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వేలు రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించనున్న దృష్ట్యా రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఎలా వెళ్తారు ఇది పూర్తిగా రాజకీయ నిర్ణయం. ఇంత ఉన్న పళంగా జోన్ పైన నిర్ణయం తీసుకుంటారని ఊహించలేకపోయాం. ఇప్పటికిప్పుడు జోన్ విభజించడం వల్ల ఉద్యోగులు, వారి పిల్లలు ఎక్కడికి వెళ్లాలి. ఎక్కడ చదువుకోవాలి. చాలామంది ఇక్కడ స్థిరపడ్డారు. వాళ్ల పరిస్థితి ఏంటీ. చిన్న జోన్ల వల్ల రైల్వేకు నష్టమే కానీ లాభం మాత్రం ఉండబోదు. – ఉమా నాగేంద్రమణి, దక్షిణమధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆందోళన మొదలైంది జూనియర్ ఉద్యోగుల్లో అప్పుడే ఆందోళన కనిపిస్తోంది. ఆప్షన్లు ఇస్తామంటారు కానీ, కిందిస్థాయికి వచ్చేటప్పటికీ బలవంతపు బదిలీలు తప్పవు. పారదర్శకత పాటించాలి. ప్రధాన కార్యాలయాల్లో పనిచేసే వారిపైన ప్రభావం ఉంటుంది. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది.– అరుణ్‌కుమార్, సహాయ ప్రధాన కార్యదర్శి, మజ్దూర్ యూనియన్ నిరుద్యోగం అలాగే ఉంటుంది విశాఖ పట్నంలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటును ఆంధ్ర ప్రజలు ఆహ్వానించినప్పటికీ , అక్కడవున్న నిరుద్యోగ సమస్య పూర్తిగా తొలగిపోదు. జోన్ రాకతో ముఖ్య కార్యాలయానికి మాత్రమే అధికారులు,సిబ్బంది అవసరం ఉంటుంది. గుంతకల్ , విజయవాడ , గుంటూరు డివిజన్ లో పని చేస్తున్న స్టాఫ్ యధావిధిగా వుంటారు. ఏ రైల్వే నుండైనా బదిలీలపై వచ్చే అవకాశం ఉంటుంది. వేరే చోట పని చేస్తున్న అధికారులు అనధికారులు కొత్త జోన్ కు రావడానికి ప్రయత్నిస్తారు. ఇక కొత్త ఉద్యోగాలు ఎక్కడివి. – నూర్, దక్షిణమధ్య రైల్వే రిటైర్డ్ అధికారి -
మళ్లీ దత్తన్న!
సాక్షి,సిటీబ్యూరో: సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి నాలుగుసార్లు విజయం సాధించిన బండారు దత్తాత్రేయ మరోసారి బరిలో నిలిచేందుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. ఈ మేరకు ఆదివారం జరిగిన రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశంలో దత్తాత్రేయ పార్టీ ఎన్నికల ఇన్చార్జి అరవింద్ నింబావలి వద్ద తన మనోగతాన్ని వెల్లడించారు. అయితే ఈ స్థానం నుంచి పోటీ చేసే ఆలోచనల్లో మాజీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ సైతం ఉన్నారు. ఈ ఇద్దరూ ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం, డాక్టర్ లక్ష్మణ్‌కు బీజేపీ అధ్యక్ష పదవి ఉండడం వల్ల తనకు చివరిసారిగాఅవకాశం కల్పించాలని దత్తాత్రేయ పార్టీ ఎన్నికల కమిటీకి నివేదించాలని నిర్ణయించారు. ఇప్పటికే బూత్ కమిటీలు, శక్తి కేంద్రాల ఏర్పాటును సైతం వేగవంతం చేశారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభలోని అన్ని నియోజకవర్గాల్లోనూ బీజేపీ భారీగా వెనకబడిపోయింది. అయినా లోక్‌సభకు వచ్చేసరికి పరిస్థితి తమకు అనుకూలంగా ఉంటుందన్న అంచనాలో బీజేపీ నేతలు ఉన్నారు. దీంతో దత్తాత్రేయతో పాటు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ సైతం సికింద్రాబాద్ స్థానంపై ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్‌కు రాజాసింగ్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథాను హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దించే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని నిలబడ్డ రాజాసింగ్ అయితేనే హైదరాబాద్ లోక్‌సభలో పార్టీ క్యాడర్లో కొత్త ఉత్తేజం వస్తుందన్న భావనను బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇక చేవెళ్ల లోక్‌సభకు నియోకజవర్గ ఇన్చార్జి బి.జనార్దన్‌రెడ్డిని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లోనూ తనకు అవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి కోరే అవకాశం ఉన్నా, ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలవడం వల్ల కొత్త అభ్యర్థి జనార్దన్‌రెడ్డి వైపు ఎన్నికల కమిటీ మొగ్గుచూపే అవకాశం ఉందని సమాచారం. ఇక మల్కాజిగిరి లోక్‌సభ స్థానాన్ని పార్టీకి చెందిన ముఖ్య నాయకుల్లో ఒకరికి కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఈనెల 5న హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ నియోకజవర్గాల ఎన్నికల సమావేశాన్ని ఇంíపీరియల్ గార్డెన్లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరై గెలిచే అభ్యర్థులెవరన్న అంశాన్ని పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 11న షాద్‌నగర్‌లో నిర్వహించే చేవెళ్ల నియోజకవర్గ సమావేశానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హాజరు కానున్నారు. వీలైనంత త్వరంగా లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి అందరి కంటే ముందుగా ప్రచారాన్ని హోరెత్తించే దిశగా బీజేపీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. -
హతవిధీ.. ఇదీ ‘గాంధీ’!
గాంధీఆస్పత్రి: తెలంగాణ వైద్యప్రదాయినిగా పేరుగాంచిన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ముఖ్యమైన వైద్యయంత్రాలు పనిచేయక సేవల్లో తీవ్రజాప్యం జరుగుతోంది. సరైన సమయానికి వైద్యం అందకపోవడంతో నిరుపేద రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేవుడిపై భారంపై వేసి దిక్కులు చేస్తున్నారు. ఆస్పత్రి రేడియాలజీ విభాగంలోని ‘మ్యాగ్నటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్’ (ఎంఆర్ఐ) స్కానింగ్ యంత్రం వారం రోజులుగా పనిచేయడంలేదు. దీంతో వందలాది మంది రోగులకు వైద్యసేవలు అందడంలో జాప్యం జరుగుతోంది. ప్రమాదాల్లో గాయపడి ప్రాణాపాయస్థితిలో వచ్చిన రోగులకు కొన్ని సందర్భాల్లో ఎమ్మారై స్కానింగ్ తప్పనిసరి. అటువంటి అత్యవసర కేసులను కేవలం సీటీ స్కానింగ్‌తో సరిపెడుతున్నట్టు సమాచారం. గాంధీ రేడియాలజీ విభాగంలో ప్రతిరోజు సుమారు 50 మందికి ఎమ్మారై స్కానింగ్ పరీక్షలు చేస్తారు. వారం రోజులుగా ఈ యంత్రం మూలనపడడంతో సరైన వైద్యసేవలు అందడం లేదు. దీంతో సుమారు 350 మంది రోగులు ప్రాణాలు గాలిలో దీపంలా కొట్టుమిట్టాడుతున్నాయి. వివిధ వార్డుల్లో వందలాది మంది రోగులు ఎమ్మారై స్కానింగ్ కోసం వారాల తరబడి వేచిచూస్తున్నారు. 2006లో ఏర్పాటు చేసిన ఎమ్మారై స్కానింగ్ మెషిన్ జీవితకాలం 12 ఏళ్లు. సదరు యంత్రం కాలపరిమితి 2018లో ముగిసింది. మరో ఎమ్మారై మెషిన్ ఏర్పాటు చేయాలని ఆస్పత్రి అధికారులు పలుమార్లు చేసిన విజ్ఞప్తులు వైద్యశాఖ ఉన్నతాధికారుల ఫైళ్లలో మూలుగుతున్నాయి. రెండు రోజులుగా ‘క్యాత్ ల్యాబ్’.. గుండెకు సంబంధించిన రుగ్మతలు, రక్తనాళాలు మూసుకుపోవడం వంటి సమస్యలను గుర్తించే ‘క్యాత్ ల్యాబ్’ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి కార్డియాలజీ విభాగంలో రెండు రోజలుగా పనిచేయడంలేదు. యంత్రంలోని పీసీబీ బోర్డు మరమ్మతులకు గురవడంతో సేవలు నిలిచిపోయాయి. వైద్య చికిత్సలు అందక ఏ క్షణమైనా గుండె ఆగిపోతుందేమోనని రోగులు బిక్కుబిక్కు మంటున్నారు. పట్టించుకోని నిర్వహణ సంస్థ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్య యంత్రాల నిర్వహణ బాధ్యతలను ‘పేబర్ సింధూరీ’ సంస్థకు అప్పగించారు. సదరు సంస్థకు నిపుణులైన టెక్నీషియన్లు లేరని, నిర్వహణ వ్యవహరాలను సంస్థ యాజమాన్యం పట్టించుకోవడంలేదని గాంధీ ఆస్పత్రి పాలనా యంత్రాంగం పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాసింది. గాంధీ ఆస్పత్రిలోని వైద్యయంత్రాలు పనిచేయడంలేదని లిఖిత పూర్వకంగా సమాచారం అందించినా నేటి వరకు సదరు సంస్థ స్పందించలేదని ఆస్పత్రి అధికారులు ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటి దాకా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అందుబాటులోకి తెస్తాం:సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ వైద్య యంత్రాలకు మరమ్మతులు చేసి త్వరలోనే అందుబాటులోకి తెస్తామని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. యంత్రాలు పనిచేయడంలేదని పేబర్ సింధూరీ సంస్థతో పాటు టీఎస్ఎంఎస్ఐడీసీ, వైద్య ఉన్నతాధికారులకు సమాచారం అందించామన్నారు. ఆస్పత్రి అభివృద్ధి నిధులతో మరమ్మతులు చేసేందుకు ఉన్నతాధికారుల అనుమతి కోరామని ఆయన తెలిపారు. -
సికింద్రాబాద్.. కాదు ట్రెయిన్‌బాద్!
సికింద్రాబాద్ ‘రైళ్లబాద్’ అయింది. ఈ ప్రాంతంలో ఎటు చూసినా రైళ్లేకన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 16 రైల్వేస్టేషన్ల నుంచి రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. ఇందులో రెండు సాధారణ, 8 మెట్రో, 6 ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లు ఉన్నాయి. అన్ని స్టేషన్ల నుంచి సగటున 3 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నట్టు ఒక అంచనా. త్వరలో జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా మెట్రో కారిడార్ అందుబాటులోకి రానుంది. ఈ మార్గంలో జేబీఎస్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీఆసుపత్రి కేంద్రాలుగా మరో మూడు రైల్వే స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి.క్రమేణా సికింద్రాబాద్ ప్రాంతం రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్ల సమాహారంగామారుతుంది. సికింద్రాబాద్ :స్వాతంత్య్రానికి పూర్వం సైనిక బలగాల స్థావరాలతో సికింద్రాబాద్ విరాజిల్లింది. లష్కరులకు (జవాన్లకు) కేంద్రంగా ఉండడంతో ఈ ప్రాంతానికి లష్కర్ అనే పేరువచ్చింది. నాడు కంటోన్మెంట్ పరిధిలో రెజిమెంటల్ బజార్, బోట్స్ క్లబ్, ట్యాంక్‌బండ్, బేగంపేట్ ప్రాంతాలు సైనిక స్థావరాలకు కేంద్రాలుగా ఉండేవి. స్వాతంత్య్రానంతరం ఇక్కడి సైనిక స్థావరాలు శివారు ప్రాంతాలకు తరలించారు. ఆ తరువాత జనావాసాలు, వ్యాపార కేంద్రాలకు నిలయంగా మారిన సికింద్రాబాద్ ప్రాంతం క్రమేణా రైల్వేస్టేషన్లకు కేంద్రంగా మారింది. సికింద్రాబాద్ ప్రతిష్టాత్మక రైల్వేస్టేషన్‌కు అనుబంధంగా 6 ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లు ఆవరించి ఉన్నాయి. సబర్బన్ రైళ్లకోసం లాలాగూడలో మరో రైల్వేస్టేషన్ ఉంది. తాజాగా ఎనిమిది మెట్రో స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఆరు ఎంఎంటీఎస్ స్టేషన్లు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ఇరువైపుల 6 ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఒకవైపు జామైఉస్మానియా, ఆర్ట్స్ కళాశాల, సీతాఫల్మండి మరొకవైపు జేమ్స్‌స్ట్రీట్, సంజీవయ్యపార్కు, బేగంపేట ఎంఎంటీఎస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో నడుస్తున్న 130 వరకు ఎంఎంటీఎస్ రైళ్లలో పెద్దసంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి ఫలక్‌నుమా, లింగంపల్లి, హైదరాబాద్ మార్గాలకు ఈ స్టేషన్ల నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. సికింద్రాబాద్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న లాలాగూడ రైల్వేస్టేషన్ నుంచి సబర్బన్, ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి. ఎనిమిది మెట్రో స్టేషన్లు తార్నాక మొదలుకొని బేగంపేట వరకు తాజాగా మెట్రో రైళ్ల కోసం ఎనమిది మెట్రో స్టేషన్లు ప్రారంభమయ్యాయి. తార్నాక, మెట్టుగూడ, సికింద్రాబాద్ ఈస్ట్, పరేడ్‌గ్రౌండ్, రసూల్‌పుర, ప్రకాశ్‌నగర్, బేగంపేట కేంద్రాలుగా మెట్రోస్టేషన్లు ఏర్పాటయ్యాయి. త్వరలో జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా మార్గంలో జేబీఎస్, సికింద్రాబాద్ స్టేషన్, గాంధీ ఆసుపత్రి కేంద్రాలుగా మరో మూడు మెట్రో స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యేక ఆకర్షణగా వంతెనలు సికింద్రాబాద్‌లో మెట్రో నిర్మాణాలు వినూత్న పద్ధతుల్లో ఉన్నాయి. ఇవి ఈ ప్రాంతానికి కొత్తరూపు తెచ్చాయి. అంతేకాదు ప్రయాణికులకు కనువిందు చేస్తున్నాయి. ♦ సికింద్రాబాద్ రెతిఫైల్ బస్‌స్టేషన్ పక్కన ఒలిఫెంటా వంతెన ఉంది. వంతెన కిందినుంచి వాహనాలు, మీదినుంచి రైళ్ల రాకపోకలు ఉంటున్నాయి. ఈ వంతెనపై నుంచి కొత్తగా ఎత్తైన మెట్రోరైలు వంతెనను ఏర్పాటు చేశారు. ఒలిఫెంటా వంతెన పైన మరింత ఎత్తులో స్టీలు వంతెనను అమర్చి రెండు మార్గాలను అనుసంధానం చేశారు. ♦ సికింద్రాబాద్ వైఎంసీఏ కూడలి. ఇక్కడ వాహనాల రాకపోకల కోసం హరిహర కళాభవన్ ఫ్లై ఓవర్ ఉంది. వైఎంసీఏ నుంచి నాగోల్–అమీర్‌పేట్ వెళ్లే మెట్రోరైళ్ల కోసం ఇక్కడి ఫ్లై ఓవర్‌కు సమాంతరంగా మెట్రో కారిడార్‌ను నిర్మించారు. రెండు సమాంతర వంతెనలు ఉండగానే ఫలక్‌నుమా–జేబీఎస్‌కు మెట్రోరైళ్లు రాకపోకల కోసం రెండు వంతెనల పై నుంచి మరో మెట్రో కారిడార్‌ను నిర్మించారు. ♦ మెట్టుగూడ–సికింద్రాబాద్ మెట్రో కారిడార్‌ను ఆలుగడ్డబావి రైల్వే వంతెన మీదుగా నిర్మించారు. ఎత్తైన పొడవాటి పిల్లర్లతో నిర్మించిన ఇక్కడి మెట్రో కారిడార్ ఆకట్టుకుంటుంది. ఎటు చూసినా పరుగులే... సికింద్రాబాద్‌లో ఏ రహదారికి వెళ్లినా రైల్వేస్టేషన్లు నెలకొని ఉన్నాయి. అంతేకాదు ఈ ప్రాంతంలోని వంతెనలపై మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్ల పరుగులు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. మెట్రో సెకండ్ ఫేజ్ కారిడార్ల నిర్మాణం పూర్తయి రైళ్లరాకపోకలు ప్రారంభం అయితే...మూడు రకాల రైళ్ల రాకపోకలకు ఈ ప్రాంతం నిలయంగా మారుతుంది. సాధారణ రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లు, మెట్రో రైళ్లు ఈ ప్రాంతంలోని లెవల్ క్రాసింగ్‌లు, వంతెలనపై ప్రతినిత్యం పరుగులు తీస్తున్నాయి. కొత్తగా సికింద్రాబాద్ నగరానికి వస్తున్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రైళ్ల పరుగులు ముచ్చటగొలుపుతున్నాయి. -
సిగ్నల్ రెడ్, గ్రీన్ లైట్లు ఒకేసారి వెలగడంతో..
సికింద్రాబాద్ :అసలే ట్రాఫిక్ జామ్‌లతో సతమతమవుతున్న సిటీజనులు...సిగ్నలింగ్ వ్యవస్థ లోపాలతోనూ పాట్లు పడుతున్నారు. బుధవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తా వద్ద సిగ్నల్ రెడ్, గ్రీన్ లైట్లు ఒకేసారి వెలగడంతో వాహనదారులు అయోమయానికి గురయ్యారు. ఇలా అయితే అన్ని వైపుల వాహనదారులు కదిలి... ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
వైద్యం వికటించి మహిళ మృతి
హైదరాబాద్: సికింద్రాబాద్ శ్రుతి సెంటర్లో టెస్ట్ ట్యూబ్ సెంటర్లో వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ టెస్ట్ ట్యూబ్ సెంటర్ ముందు మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయాలని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నగరంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ మాట నిలబెట్టుకోవాలని సూచించారు. ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదని జూపూడి ఈ సందర్భంగా అన్నారు.