smart city
-
జహీరాబాద్‌లో ఇండ్రస్టియల్ స్మార్ట్ సిటీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్–నాగ్‌పూర్ ఇండ్రస్టియల్ కారిడార్‌లో భాగంగా.. న్యాలకల్, ఝరాసంగం మండలాల్లోని 17 గ్రామాల్లో జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా రూ.2,361 కోట్ల వ్యయంతో ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ నిర్మాణం జరగనుంది. మొత్తం రెండు దశల్లో దాదాపు 12,500 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. నేషనల్ ఇండ్రస్టియల్ కారిడార్ డెవలప్మెంట్ – ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ఫ్రేమ్ వర్క్‌లో భాగంగా..తొలిదశలో 3,245 ఎకరాల్లో పనులు ప్రారంభం అవుతాయి. ఇది జాతీయ రహదారి–65కు 2 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుకు 65 కిలోమీటర్లు, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే జహీరాబాద్ రైల్వేస్టేషన్‌కు 19 కిలోమీటర్లు, మెటల్‌కుంట రైల్వేస్టేషన్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 125 కిలోమీటర్ల దూరంలో, ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్టుకు 600 కిలోమీటర్ల దూరంలో, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టుకు 620 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పటికే పర్యావరణ అనుమతులు మొదటి దశకు అవసరమైన 3,245 ఎకరాల స్థలంలో 3,100 (దాదాపు 80%) ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉంది. రాష్ట్రానికి సంబంధించి షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్, స్టేట్ సపోర్ట్ అగ్రిమెంట్ ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్, మెషినరీ, మెటల్స్, నాన్–మెటాలిక్ ఆధారిత పరిశ్రమలు, రవాణా తదితర రంగాలకు ఊతం లభిస్తుంది. 1.74 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీనికి సంబంధించిన పర్యావరణ అనుమతులన్నీ అటవీ పర్యావరణ శాఖ నుంచి అందాయి. తెలంగాణ–కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ పారిశ్రామికాభివృద్ధి మరింత వేగంగా ముందడుగు వేస్తుందని భావిస్తున్నారు. జహీరాబాద్‌కు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‌కు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీలో రెండు ఇండ్రస్టియల్ స్మార్ట్ సిటీలు దేశంలో మొత్తం 12 ప్రపంచ స్థాయి గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగానే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఓర్వకల్లులో రూ.2,786 కోట్ల వ్యయంతో, కొప్పర్తిలో రూ.2,137 కోట్ల వ్యయంతో గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు ఏర్పాటు కానున్నాయి. తెలంగాణలో 31 ఎఫ్ఎం స్టేషన్లు తెలంగాణలో 31, ఆంధ్రప్రదేశ్‌లో 68 ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్ల ఏర్పాటుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంంగాణలోని ఆదిలాబాద్ (3), కరీంనగర్ (3), ఖమ్మం (3), కొత్తగూడెం (3), మహబూబ్‌నగర్ (3), మంచిర్యాల (3), నల్లగొండ (3), నిజామాబాద్ (4), రామగుండం (3), సూర్యాపేట (3)ల్లో కొత్త ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు : 12 కొత్త స్మార్ట్ సిటీలు.. 10 లక్షల ఉద్యోగాలు..
ఢిల్లీ : దేశంలో కొత్తగా 12 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.దేశంలో 12 గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.28,602 కోట్ల నిధుల్ని కేటాయించింది.నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఏర్పాటు కానున్న 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్‌లో తెలంగాణకు 1, ఆంధ్రప్రదేశ్‌కు 2 కేటాయించింది. కడప జిల్లా కొప్పర్తిలో 2596 ఎకరాల్లో, కర్నూలు జిల్లా ఓర్వకల్లో 2,621 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇక తెలంగాణ జహీరాబాద్‌లో 3245 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసేలా సమావేశంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా 10 లక్షల మందికి, పరోక్షంగా 30 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. #WATCH | After the cabinet meeting, Union Minister Ashwini Vaishnaw says, "...Cabinet today approved 12 Industrial Smart Cities under National Industrial Corridor Development Programme. The government will invest Rs 28,602 crore for this project..." pic.twitter.com/KxNYqNZ5dT— ANI (@ANI) August 28, 2024 -
ఇలా ఉంటే .. అవార్డులెలా వస్తాయి..
పేరుకు స్మార్ట్ సిటీ.. కానీ పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తం. అందుకేనేమో.. ఇటీవల పారిశుద్ధ్య విభాగంలో ఇండియన్ స్మార్ట్ సిటీ అవార్డ్స్–2022లో వరంగల్ నగరం అడ్రస్ గల్లంతైంది. పారిశుద్ధ్య విభాగంలో చేపట్టిన సంస్కరణల్లో నగరం ఫెయిల్ కావడంతో అవార్డు దక్కకుండా పోయింది. ఇందుకు నిదర్శనమే ఇలాంటి దృశ్యాలు. వరంగల్ రైల్వేస్టేషన్, బస్టాండ్ వద్ద మురుగు నీరు రోజుల తరబడి నిలిచి తీవ్ర దుర్గంధం వెలువడుతూ దోమలు, ఈగలు, పందులకు ఆవాసంగా మారింది. కమిషనర్ గారూ దీనివైపు కూడా ఒకసారి చూడండి అంటూ నగరవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి స్టాఫ్‌ఫొటోగ్రాఫర్, వరంగల్ -
విశాఖ సిగలో కలికితురాయి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ నగరానికి ఐకానిక్‌గా నిలిచే భవన నిర్మాణానికి గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ (జీవీఎస్సీసీఎల్) ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే నగరంలో వివిధ ప్రాంతాల్లో సరికొత్తగా రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు సాంకేతిక సహాయంతో ప్రజలకు సేవలందిస్తున్న స్మార్ట్ సిటీ కార్పొరేషన్.. మరో అడుగు ముందుకేసింది. ఇందుకోసం సంపత్ వినాయక రోడ్డు మార్గంలో ఆశీలమెట్ట ప్రాంతంలో జీవీఎంసీకి చెందిన 2.7 ఎకరాలను నగర అభివృద్ధికి చిహ్నంగా(ఐకానిక్) మార్చేందుకు ప్రతిపాదనలు ఆహా్వనించింది. ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే విషయంపై ఈ నెల 12లోగా ప్రతిపాదనలు సమర్పించాలని ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తుల(ఈవోఐ)ను కోరింది. మొత్తం 2.7 ఎకరాల్లో ఏకంగా 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టేందుకు అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్, హోటల్ టవర్‌తో పాటు రిక్రియేషన్ సెంటర్ అభివృద్ధి చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. మొత్తం రూ.265 కోట్లతో ఏ విధంగా అభివృద్ధి చేస్తారనే విషయాన్ని పేర్కొంటూ సంస్థలు ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో.. ఆశీలమెట్ట.. నగరంలో వాణిజ్య ప్రాంతం. ఇక్కడ జీవీఎంసీకి చెందిన 2.7 ఎకరాల స్థలం ఉంది. ఈ ప్రాంతంలో 6.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టేందుకు అనువుగా ఉంది. 2.16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్రాంతంలో వాణిజ్య సముదాయంతో పాటు మాల్, మల్టీప్లెక్స్, హోటల్ టవర్, అర్బన్ రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటుకు అనుకూలమని అధికారులు భావిస్తున్నారు. అయితే.. ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామనే ప్రతిపాదనలతో సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను సమర్పించాలి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తర్వాత వచ్చే ఆదాయంలో స్మార్ట్ సిటీ కార్పొరేషన్‌కు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 33 ఏళ్ల పాటు లీజు పద్ధతిలో ఈ భూమిని కేటాయించేందుకు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిర్ణయించింది. దీనిని సబ్లీజుకు ఇవ్వడం కానీ, స్థలాన్ని పూర్తిగా కొనుగోలు చేయడం కానీ కుదరదని స్పష్టం చేసింది. డీఎఫ్బీవోటీ పద్ధతిలో..! వాణిజ్యానికి అనువుగా ఉండే ఈ ప్రాంతంలో మొత్తం 2.7 ఎకరాల్లో వాణిజ్య భవనాలను నిర్మించాల్సి ఉంటుందని స్మార్ట్ సిటీ కార్పొరేషన్ స్పష్టం చేస్తోంది. టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 33 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చే ఈ భూమిలో వాణిజ్య భవనాల ద్వారా వచ్చే ఆదాయంలో జీవీఎంసీకి వాటా ఇవ్వాల్సి ఉంటుంది. వాటా ఇచ్చే శాతంతో పాటు ఇతర అంశాలను పరిగణలోనికి తీసుకుని సంస్థ ఎంపిక ఉండనుంది. అంతేకాకుండా స్థలాన్ని కేవలం లీజు పద్ధతిలో 33 ఏళ్ల పాటు అప్పగించనున్నారు. డిజైన్, ఫైనాన్స్, బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (డీఎఫ్బీవోటీ) పద్ధతిలో చివరకు 33 ఏళ్ల తర్వాత తిరిగి స్మార్ట్ సిటీ కార్పొరేషన్‌కు అప్పగించాల్సి ఉంటుంది. దీని అభివృద్దికి సుమారు రూ.265 కోట్ల మేర వ్యయం అవసరమవుతుందని అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగా తమ ప్రతిపాదనలతో ఆయా సంస్థలు ఎవరైనా ముందుకు వచ్చేందుకు ఈ నెల 12వ తేదీ నాటికి ఈవోఐలను సమర్పించాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించిన అనంతరం.. ఒక మంచి ప్రతిపాదనను ఓకే చేసి సంస్థ ఎంపిక ప్రక్రియ తర్వాత నిర్మాణాలు చేపట్టనున్నారు. రెండేళ్లలోనే ఐకానిక్ భవనం అందుబాటులోకి తీసుకురావాలన్నదే అధికారుల లక్ష్యంగా కనిపిస్తోంది. -
ఎన్నెన్నో ‘ఏఐ’ సేవలు.. మనిషి జీవితంలో ఊహించని మార్పులు
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) సమాచార సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కడంతో మనిషి జీవితంలో ఊహించని మార్పులు వస్తున్నాయి. ఇన్నాళ్లూ మనకు అందని చందమామలు నట్టింట దిగుతున్నాయి. చక్రం కనిపెట్టడంతో జీవన గమనంలో పెరిగిన వేగం పారిశ్రామిక విప్లవంతో ఎన్నో సౌకర్యాలను అందించింది. ఊహల్లో మాత్రమే సాధ్యమయ్యే అంశాలు ఇప్పుడు మనిషికి చిటికెలో అమరుతున్నాయి. మన రోజువారీ జీవితాన్ని మలుపు తిప్పుతున్న సరికొత్త పరిజ్ఞానం ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’(ఐవోటీ) కాగా దానికి దన్నుగా నిలుస్తున్న శక్తి ‘కృత్రిమ మేధ’(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్). మన ఫిట్నెస్ స్థాయిని చూపించడం మొదలు పరిశ్రమల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని తారస్థాయికి తీసుకెళ్లడం వరకు ఏఐ, ఐవోటీ మేలు కలయికతో మన కళ్లెదుటే ఆవిష్కృతమవుతున్నాయి. అద్భుత భవిష్యత్‌కు బాట ఎంతోదూరంలో లేదని అర్థమవుతోంది. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 5 వేల కోట్ల ఉపకరణాలు (డివైస్) ఇంటర్నెట్కు అనుసంధానమై ఉంటాయని అంచనా. ఇవి మన ఆన్లైన్ కార్యకలాపాలను సేకరించడం, సమాచారం పరస్పరం మార్చుకోవడం, ఏఐ ద్వారా ఇచ్చే కమాండ్స్‌ను ప్రాసెస్ చేస్తాయి. ఇంటర్నెట్ అనుసంధానానికి శక్తిని, యుక్తిని ఏఐ అందిస్తోంది. వేరియబుల్స్ (ధరించే ఉపకరణాలు) స్మార్ట్‌వాచ్ లాంటి వేరియబుల్స్ నిరంతరాయంగా మనిషి ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను ట్రాక్ చేయగలవు. హార్ట్‌బీట్, ఆక్సిజన్ లెవల్, వేస్తున్న అడుగులు, ఖర్చవుతున్న శక్తి, నిద్రలో నాణ్యత.. ఇవన్నీ రికార్డు చేయగలవు. మధుమేహాన్ని కచ్చితంగా అంచనా వేసే డివైస్‌లు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. గంట గంటకూ షుగర్ లెవల్‌ను రికార్డు చేస్తున్నాయి. వైద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు ఇది దోహదం చేస్తోంది. మన ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు వ్యక్తిగత వైద్యులకు చేరవేయడంతో పాటు స్ట్రోక్ లాంటి ప్రమాదాలను ముందుగా హెచ్చరించే పరిజ్ఞానం త్వరలో సాకారం కానుంది. స్పోర్ట్స్, ఫిట్‌నెస్‌కు కూడా ఈ డేటా ఉపయోగపడుతుంది. టెక్నాలజీ రీసెర్చ్ సంస్థ ‘గాట్నర్’ అంచనా ప్రకారం ప్రపంచ వేరియబుల్ డివైస్ మార్కెట్ వచ్చే రెండేళ్లలో 100 బిలియన్ డాలర్లకు చేరుతుంది. స్మార్ట్ హోమ్ మనం ఇచ్చే వాయిస్ కమాండ్‌కు ఇంట్లో వస్తువులు ప్రతిస్పందించడం గతంలో సైన్స్ ఫిక్షన్‌కు పరిమితం. ఇప్పుడది వాస్తవం. ఇంటి యజమాని అవసరాలు, అలవాట్లను గుర్తెరిగి ప్రవ ర్తించే డివైస్లతో ఇంటిని నింపేయడం సమీప భవిష్యత్‌లో సాకారమయ్యే విషయమే. ‘అలెక్సా’ ఇప్పటికే మన నట్టింట్లోకి వచ్చేసి వాయిస్ కమాండ్‌కు ప్రతిస్పందిస్తుంది. మనుషుల వ్యక్తిగత రక్షణ, ఇంటి భద్రతకు హెచ్చరికలను సంబంధిత వ్యవస్థలు/వ్యక్తులకు చేరవేసే టెక్నాలజీ కూడా రానుంది. స్మార్ట్‌హోమ్ గ్లోబల్ మార్కెట్ వచ్చే రెండేళ్లలో 300 బిలియన్ డాలర్లకు చేరుతుందని ‘గాట్నర్’ అంచనా. స్మార్ట్ సిటీ ఇది పట్టణీకరణ యుగం. నగరా లకు వలసలు పెద్ద ఎత్తున పెరుగు తున్నాయి. పట్టణాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పన, భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, ఇంధన సామర్థ్యం వృద్ధి.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల ముందున్న సవాళ్లు. ఢిల్లీలో ట్రాఫిక్ మెరుగైన నియంత్రణకు ‘ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టం’ ద్వారా రియల్‌టైమ్‌లో నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నారు. ఇందులో వాడుతున్నది కృత్రిమ మేధస్సే. స్మార్ట్ ఇండస్ట్రీ మాన్యుఫ్యాక్చరింగ్ నుంచి మైనింగ్ వరకు.. ప్రతి పరిశ్రమలో సామర్థ్యాన్ని గరిష్ట స్థాయికి పెంచడానికి, మానవ తప్పిదాలను పూర్తిగా నివారించడానికి ఏఐ ఉపయోగపడుతుంది. పరిశ్రమల్లో డిజిటల్ రూపాంతరీకరణ ఇప్పటికే మొదలైంది. వచ్చే రెండు మూడేళ్లలో 80 శాతం పరిశ్రమల్లో ఏఐ వినియోగం మొదలవుతుందని అంచనా. రియల్ టైమ్ డేటా విశ్లేషణ నుంచి సప్లైచైన్ సెన్సార్ల వరకు పారిశ్రామిక రంగంలో ‘ఖరీదైన తప్పుల’ను నివారించడానికి ఏఐ దోహదం చేస్తుంది. రవాణా డ్రైవర్ అవసరంలేని వాహనాల రూపకల్పనకు పునాది వేసింది కృత్రిమ మేధ. మనిషి తరహాలో ఆలోచనను ప్రాసెస్ చేసి నిర్ణయం తీసుకోవడం ద్వారా మనం చేస్తున్న పనులను ఏఐ ద్వారా ఉపకరణాలు చేసేస్తున్నాయి. అటానమస్ వాహనాలు మాత్రమే రోడ్డు మీద కనిపించే రోజు సమీప భవిష్యత్‌లో ఉంది. -
ఎడారిలో స్మార్ట్ సిటీ... ఊహకందని మాయం ప్రపంచం...
ఊహకందని మాయం ప్రపంచం వంటివి టీవీలోనూ లేదా కార్టూన్ ఛానల్స్‌లో చూస్తుంటాం. అందులో ఎగిరే కార్లు, ఆకాశంలోనే ఉండే ఎలివేటర్లు తదితర మాయలోకం కనిపిసిస్తుంది. ఐతే అదంతా గ్రాఫిక్స్ మాయాజాలమే తప్ప నిజజీవితంతో సాధ్యం కాదు. ఇది సాధ్యమే అంటూ చేసి చూపిస్తున్నారు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్. వివరాల్లోకెళ్తే....సౌదీ అరేబియాలో పర్వత పర్యాటకాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు ఉద్దేశించిన ఒక ప్రాజెక్ట్‌ను చేపడుతున్నట్లు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ 2017లోనే ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ఊహకందని ఒక సరి కొత్త ప్రపంచాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం బెల్జియం పరిమాణంలో ఉన్న ఎడారిని ఒక అద్భుతమైన సిటీ లా మారుస్తుందన్నారు. అంతేకాదు నియోమ్ అని పిలిచే ఒక అత్యద్భుతమైన హైటెక్ సిటీని రూపొందిస్తుంది. సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థను మార్చే లక్ష్యంతో దాదాపు రూ.40 వేల కోట్లను ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తోంది. ఈ ఫ్యూచరిస్టిక్ మెగాసిటీ న్యూయార్క్ నగరం కంటే 33 రెట్లు ఎక్కువ అని చెబుతోంది. ఇది సౌదీలోని అకాబా గల్ఫ్, ఎర్ర సముద్ర తీరప్రాంతం వెంబడి 26 వేల కి.మీ చదరపు విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ ఎగిరే డ్రోన్ టాక్సీలు, జురాసిక్ పార్క్, ఉద్యానవనం, ఒక పెద్ద కృత్రిమ చంద్రుడు తదితరాలు ఆ నగరానికి ప్రతిష్టాత్మకమైన విషయాలు. అంతేకాదు ఇక్కడ ఆకాశంలో ఏదో విధంగా ఎగిరే ఎలివేటర్లు, అర్బన్ స్పేస్‌పోర్ట్, డబుల్ హెలిక్స్ ఆకారంలో ఉన్న భవంతులు, ఫాల్కన్ రెక్కలు వికసించిన పువ్వులు తదితరాలు ఉంటాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా క్లీన్ ఎనర్జీ డెస్టినేషన్(సరళ రేలో విస్తరరించిన నగరం)ను కూడా ఏర్పాటు చేస్తోంది. దీనికోసం సుమారు రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తోంది. అంతేకాదు పురాతన ట్రాయ్ నగరం, దాదాపు రెండు మైళ్ల మానవ నిర్మిత సరస్సు, అత్యాధునిక సాంకేతికత కూడిన వర్టికల్ గ్రామం, వినోదం, అతిథి సౌకర్యాలతో అత్యంత విలాసంగా ఉంటుందని క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మా పేర్కొన్నారు. 20030 నాటికి సుమారు 7 లక్షల మంది సందర్శకులను 7 వేల మంది శాశ్వత నివాసితులను ఆకర్షిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. His Royal Highness Mohammed bin Salman, Crown Prince and Chairman of the NEOM Company Board of Directors, has announced the establishment of #TROJENA – the new global destination for mountain tourism, part of #NEOM's plan to support and develop the tourism sector in the region. pic.twitter.com/ZNa4JsamKy — NEOM (@NEOM) March 3, 2022 (చదవండి: ఆ తల్లులకు క్షమాపణలు చెప్పాల్సిందే : మానవహక్కుల ప్యానెల్) -
Chandrababu: ఒప్పందాలంటూ అమెరికన్లతో ఫొటోలు.. 20 సంస్థల్లో ఒక్కటొస్తే ఒట్టు
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు తీరు గురివింద గింజను గుర్తుచేస్తోంది.. గత టీడీపీ పాలనలో పెట్టుబడుల సదస్సుల పేరుతో లక్షల కోట్లు తీసుకొచ్చామని బాకా కొట్టి బూటకపు ప్రచారం చేశారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వస్తున్న పరిశ్రమల్ని చూసి ఓర్వలేకపోతున్నారు. విశాఖ వేదికగా నాలుగేళ్లపాటు నిర్వహించిన పెట్టుబడుల సదస్సుల ద్వారా నగరాభివృద్ధికి 20 అమెరికా కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు చంద్రబాబు ప్రకటించినా.. ఒక్క కంపెనీ సహకారం తప్ప.. మిగిలిన ఎంవోయూలన్నీ.. డొల్లవేనని స్పష్టమవుతున్నాయి. విశాఖపట్నం స్మార్ట్ సిటీ అభివృద్ధికి ఆయా కంపెనీలు పెట్టిన వేల కోట్ల పెట్టుబడులు ఎక్కడికి వెళ్లిపోయాయన్నది హాస్యాస్పద ప్రశ్నగా మారిపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన సమయంలో ఏటా విశాఖలో పెట్టుబడుల సదస్సు పేరుతో నాలుగేళ్ల పాటు అట్టహాసం చేశారు. రూ.14 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అనేక సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నామని ప్రగల్భాలు పలికారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం చెప్పిన కాకి లెక్కల ప్రకారం 2014 నుంచి 2019 వరకూ ఐదేళ్లలో ఏడాదికి రూ.14 లక్షల చొప్పున గణిస్తే.. రమారమి రూ.60 లక్షల కోట్లకుపైగా పెట్టుబడుల వరద ఆంధ్రప్రదేశ్‌ని ముంచెత్తి ఉండాలి. వాస్తవాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. ఎన్ని పరిశ్రమలు వచ్చాయో అందరికీ తెలిసిందే. పైగా పెట్టుబడుల సదస్సుల పేరుతో రూ.120 కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు పెట్టేశారు. 20 అమెరికా సంస్థల్లో ఒక్కటైనా..? దేశంలోనే నంబర్ వన్ స్మార్ట్‌సిటీగా విశాఖను తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమంటూ 2016లో అప్పటి సీఎం హోదాలో చంద్రబాబు బీరాలు పలికారు. అమెరికా అందించే ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానం, ఆలోచనలను సమర్థంగా అమలు చేసేందుకు భాగస్వామ్య సదస్సులకు హాజరైన అమెరికా బృందంతో చర్చించినట్టు ప్రకటించుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రస్థానంలో ఉన్న అమెరికా తన పిలుపు మేరకు వైజాగ్‌లో 4వ పారిశ్రామిక విప్లవం తీసుకొస్తోందని మీడియా సమక్షంలో హడావిడి చేశారు. విశాఖపట్నం స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుకు అమెరికాకు చెందిన 20 కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నట్లుగా అమెరికన్లతో ఫొటోలు దిగారు. ఇందులో ఒక్క సంస్థ కూడా ఇప్పటి వరకూ ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకపోవడం శోచనీయం. చదవండి: (CM YS Jagan: శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఇలా..) అయికాం సంస్థది సహకారమే.. యూఎస్ ట్రేడ్ డెవలప్మెంట్ ఏజెన్సీతో ఎంవోయూ చేస్తున్నట్లుగా చంద్రబాబు అండ్ కో సంతకాల కోసం ఫోజులిచ్చి.. మీడియాకు విడుదల చేశారు. అమెరికా ట్రేడ్ డెవలప్మెంట్ ఏజెన్సీ తరపున స్మార్ట్‌సిటీగా వైజాగ్‌ని అభివృద్ధి చేసేందుకు రూ.వేల కోట్లు నిధులు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. అమెరికాకు చెందిన అయికాం, కేపీఎంజీ, ఐబీఎం కంపెనీలు విశాఖ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ప్రణాళికను రూపొందిస్తాయని సదస్సులో ప్రకటించారు. ఈ ప్రణాళికల్ని అదే ఏడాది(2016)లోనే అమల్లోకి తెస్తామంటూ చంద్రబాబు ఊదరగొట్టారు. ఇ–గవర్నెస్, కాలుష్య నియంత్రణ, భద్రత, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాల్లో విశాఖను స్మార్ట్‌సిటీగా రూపుదిద్దే బాధ్యత టీడీపీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. 2019 వరకూ ఒక్క రూపాయీ ఏ ఒక్క అమెరికా సంస్థ పెట్టుబడి పెట్టలేదు. ఎంవోయూ చేసుకున్న తర్వాత.. ఏ ఒక్క సంస్థతోనూ చర్చించినట్లు దాఖలాలు లేవు. ఒక్క అయికాం సంస్థ ప్రతినిధులు మాత్రం పలుమార్లు విశాఖ నగరానికి వచ్చి.. జీవీఎంసీ అధికారులతో సంప్రదింపులు జరిపారు. స్మార్ట్‌సిటీ అభివృద్ధి కోసం అవసరమైన ప్రణాళికలు అందించారే తప్ప.. ఒక్క రూపాయీ విదిలించలేదు. ఇలా.. 20 అమెరికా కంపెనీలు వైజాగ్‌ని వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నాయంటూ చంద్రబాబు నమ్మించి మోసం చేశారని నగర ప్రజలతోపాటు రాజకీయ పార్టీలు కూడా ఎద్దేవా చేస్తున్నాయి. -
AP: ఆధ్యాత్మిక నగర అమ్ములపొదిలో మరో ఆణిముత్యం
ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లుతున్న తిరుపతి నగరాన్ని అధికారులు స్మార్ట్‌సిటీగా పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో నగర రూపురేఖలు మార్చేలా పక్కా ప్రణాళికలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు. తిరుపతిలోని వినాయకసాగర్ ఆధునీకరణతో సరికొత్త హంగులతో సందర్శన కేంద్రం అందుబాటులోకి రానుంది. కళ్లు జిగేల్మనిపించే అత్యాధునిక విద్యుత్ వెలుగులు, పచ్చదనం పరవశించే గార్డెన్లు, చుట్టూ నీటి అలల మధ్య అందమైన ఐర్లాండ్, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓపెన్‌జిమ్, యోగా సెంటర్లు, ఖరీదైన పూల మొక్కలతో గ్లో గార్డెన్, సాగర్‌లో చక్కర్లు కొట్టే బోటింగ్, ఘుమఘుమలాడే వంటకాలతో ప్రత్యేక రెస్టారెంట్, పిల్లలను ఆకట్టుకునే బొమ్మలతో వినాయకసాగర్ కొత్త రూపును సంతరించుకోనుంది. 2022 ఏప్రిల్ నాటికి లేక్ వ్యూను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు శరవేగంగా ఆధునీకరణ పనులు సాగుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, తిరుపతి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా భాసిల్లుతున్న తిరుపతిలో సరైన విహార స్థలం లేకపోవడం నగర వాసుల్ని వేధించే అంశం. రోజుకు లక్షలాది మంది యాత్రికులు వచ్చే తిరుపతిలో పర్యాటక స్థలాలు లేకపోవడం వల్ల శ్రీవారి దర్శనానంతరం భక్తులు మరో ప్రత్యామ్నాయం లేక నేరుగా తిరుగు ప్రయాణమవుతున్నారు. యాత్రికులు తిరుపతిలో ఒకటిరెండు రోజులు పర్యటించే అవకాశం లేకపోవడం వల్ల వ్యాపార, వాణిజ్య పరంగా తీవ్ర నష్టమని గుర్తించారు. అలానే సెలవు రోజుల్లో స్థానికులు కుటుంబ సమేతంగా కొంతసేపు గడిపే సరైన సందర్శనా స్థలాలు లేకపోవడం శాపంగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ గిరీష 2020 జూలై 4వ తేదీన వినాయకసాగర్ ట్యాంక్‌బండ్ ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు. తిరుపతి నగర ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని వినాయకసాగర్‌ను అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు శరవేగంగా చర్యలు చేపట్టారు. అత్యాధునిక డిజైన్లతో వినాయకసాగర్‌ను ప్రత్యేక సందర్శనా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు దేశంలోని పలు లేక్‌వ్యూ డిజైన్లను పరిశీలించి అందులో అత్యుత్తమ్మ డిజైన్లను ఎంపిక చేశారు. వాటికి తుదిమెరుగులు దిద్ది మరింత మార్పులతో అభివృద్ధి పనులు చేపట్టారు. మొత్తం 60 ఎకరాల విస్తీర్ణంలో వివిధ ఆకృతులతో, సౌకర్యాలతో ట్యాంక్‌బండ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. వినాయకసాగర్ ప్రాముఖ్యతను చాటేలా ముఖ ద్వారం వద్ద భారీ వినాయక ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు. కట్ట పొడవునా కిడ్స్పార్కు, ఓపెన్ గ్యాలరీలు, యోగాసెంటర్, లాన్, గ్రీనరీ, గ్లో గార్డెన్‌ను వేర్వేరుగా అభివృద్ధి చేస్తున్నారు. సాయంత్రం వేళ ఆహ్లాదాన్ని పెంచే లా ఆధునిక హంగులతో కూడిన విద్యుత్ వెలుగులు వెదజిమ్మేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా ఐలాండ్ వినాయకసాగర్‌లో ఐలాండ్‌ను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దుతున్నారు. 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఐలాండ్ కొత్త లోకంలో సంచరిస్తున్న అనుభూతిని కలిగించేలా ఉండబోతోంది. ఇక్కడే బర్త్‌డే వంటి పార్టీలను జరుపుకునేందుకు అద్దెకు ఇవ్వనున్నారు. ఎల్ఈడీ భారీ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటెన్ ఏర్పాటు చేస్తున్నారు. బోటింగ్ పాయింట్ సాగర్‌లో పడమట వైపు తక్కువ ఎత్తులో నీరు ఉన్న ప్రదేశంలో పది బోట్లు విహరించేలా కౌంటర్‌ను నిర్మిస్తున్నారు. కుటుంబ సమేతంగా బోటింగ్‌లో వెళ్లి సేద తీరేలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు. స్విమ్మింగ్‌ఫూల్, మూడు అంతస్తుల రెస్టారెంట్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. వాకింగ్ ట్రాక్ వినాయకసాగర్ కట్టపై 2.5 కి.మీల పొడవుతో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లను వేర్వేరుగా నిర్మిస్తున్నారు. వాకింగ్ ట్రాక్ నిర్మాణంలో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. నిపుణుల సలహా మేరకు వాకింగ్‌ట్రాక్‌ను తీర్చిదిద్దుతున్నారు. ఒకసారి 60 మందికి యోగాను నేర్పించేలా ఓపెన్ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నారు. అత్యవసరమైతే మరో గేటు అందుబాటులో ఉండేలా నిర్మిస్తున్నారు. పిల్లల ప్లే గ్రౌండ్లో రబ్బర్ ప్లోరింగ్ నిర్మిస్తున్నారు. నిమజ్జనానికి వినాయక నిమజ్జనానికి ప్రత్యేకంగా ఒకకొలను తీర్చిదిద్దుతున్నారు. ఐదు అడుగుల లోపు ఉన్న వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ఆ«ధునిక సదుపాయాలతో కొలను తీర్చిదిద్దుతున్నారు. నిమజ్జనాన్ని తిలకించేందుకు అవసరమైన గ్యాలరీని నిర్మిస్తున్నారు. 200 మంది ఒకేసారి సాగర్ వ్యూ పాయింట్‌ను కట్ట మధ్యలో ఉండేలా శరవేగంగా నిర్మాణాలు సాగుతున్నాయి. తిరుపతికి ప్రత్యేక ఆకర్షణ వినాయకసాగర్ తిరుపతి నగరానికి తలమానికంగా నిలిచేలా తీర్చిదిద్దుతున్న స్మార్ట్ సిటీ నిధులతో అభివృద్ధి చేస్తున్న ఈ లేక్‌వ్యూ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. స్థానికులు, యాత్రికులు రోజంతా ఒకేచోట గడిపేంత వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. పిల్లల ప్రత్యేక ఆటవిడుపు కేంద్రాలు, బోటింగ్, స్విమ్మింగ్, ఐలాండ్ వంటివి కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఏప్రిల్ నాటికి సందర్శకులను అనుమతించేలా శరవేగంగా పనులు చేపట్టాం. 80 శాతం పనులు పూర్తయ్యాయి. – పీఎస్ గిరీష, కమిషనర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సాగర్ విస్తీర్ణం- 60 ఎకరాలు సాగర్ అభివృద్ధికి చేస్తున్న ఖర్చు- రూ. 21.26 కోట్లు ఐలాండ్ ఏర్పాటుకు ఖర్చు - రూ.89 లక్షలు స్విమ్మింగ్‌ఫూల్, రెస్టారెంట్‌కు రూ.4 కోట్లు మొత్తం ఖర్చు 26.15 కోట్లు -
కాకినాడ మళ్లీ కేక.. అరుదైన గుర్తింపు..
కాకినాడ(తూర్పుగోదావరి): స్మార్ట్‌సిటీ కాకినాడ మరో అరుదైన గుర్తింపును దక్కించుకుంది. ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించే కార్యకలాపాల నిర్వహణకు గాను ఈ గుర్తింపు దక్కింది. వివిధ వర్గాల ప్రజల మధ్య మంచి వాతావరణాన్ని కల్పించడం, పిల్లల్లో పోటీతత్వాన్నిపెంచడం, సామాజిక అంశాలపై యువతలో చైతన్యం పెంపొందించడం వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ నుంచి కాకినాడ స్మార్ట్‌సిటీకి మంగళవారం సమాచారం అందింది. చదవండి: మసాజ్ సెంటర్ల పేరుతో చీకటి కార్యకలాపాలు.. కళ్లు బైర్లుకమ్మే అంశాలు ఈ ప్రక్రియకు దేశంలోని పలు నగరాలను ఎంపిక చేయగా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క కాకినాడకు మాత్రమే చోటు లభించింది. ప్రజల అభిరుచులకు అనుగుణంగా వివిధ రకాల తినుబండారాలను హైజనిక్‌గా ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయడం, అజాదికా అమృత్ మహోత్సవ్ పేరుతో విద్యార్థుల మధ్యపోటీ పెట్టడం, సైకత శిల్పాల తయారీ, డ్రాయింగ్ పోటీలు సహా అనేక కార్యక్రమాల నిర్వహణ ద్వారా కాకినాడ స్మార్ట్‌సిటీ ప్రత్యేక గుర్తింపును సాధించగలిగింది. ఈ తరహా కార్యకలాపాలను నిర్వహించి అన్ని వర్గాల ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంచేలా చేసిన కృషికి ఈ గౌరవాన్ని దక్కించుకోగలిగింది. ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంమరోసారి కాకినాడ స్మార్ట్‌సిటీని మంచిస్థానంలో నిలబెట్టిందని కమిషనర్ స్వప్నిల్‌దినకర్‌పుండ్కర్ చెప్పారు. -
దుబాయ్ దూకుడు.. సాహసోపేత అడుగులు
Dubai Sucessfully Deployed AI Tech In Govt Sectors: ఆయిల్ కంట్రీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నగరం దుబాయ్.. గత ఏడాది కాలంగా అరుదైన ప్రయోగాలతో ప్రపంచాన్ని అచ్చెరువుకు గురి చేస్తోంది. ఆవిష్కరణల భాండాగారంగా ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తోంది. విప్లవాత్మక సంస్కరణలతో దూసుకుపోతున్న దుబాయ్.. ఇప్పుడు సాహసోపేతమైన అడుగులకు సైతం వెనకాడడం లేదు. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడు ఈ టెక్నాలజీ అవసరం దాదాపు అన్ని రంగాల్లో అవసరం పడుతోంది. మనకు తెలియకుండానే వాడేస్తున్నాం కూడా!. ప్రైవేట్ రంగాల్లో దాదాపు ఏఐ సహకారం లేకుండా ముందుకు సాగడం లేదు. అయితే ప్రభుత్వ రంగాలు మాత్రం పూర్తిస్థాయిలో ఏఐని ఉపయోగించుకునేందుకు తటపటాయిస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం.. భద్రత. ఈ తరుణంలో దుబాయ్ సర్కార్ ఏమాత్రం బెణుకు ప్రదర్శించకుండా ముందుకు సాగుతోంది. ప్రమాదం లేకపోలేదు AI టెక్నాలజీ వాడకం ఇప్పుడు ఎంత ఉధృతంగా నడుస్తోందో.. సమీప-కాలంలో అంతే ఆందోళనను రేకెత్తిస్తోంది. గోప్యత, పారదర్శకత, అసమానత, భద్రత.. ఈ అంశాలు పెను సవాల్‌గా మారాయి. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీలో పుట్టుకొస్తున్న బెదిరింపులు, ఇతర పోకడలను సైతం గుర్తించింది CSER పరిశోధన. అంతేకాదు AI, డిజిటలైజేషన్, న్యూక్లియర్ వెపన్స్ సిస్టమ్‌ల తరపున ఎదురయ్యే ముప్పును సైతం ప్రస్తావించింది. ప్రధానమైన అంశాలు కావడం వల్లే అమెరికా లాంటి అగ్రరాజ్యాలు సైతం ఏఐను రక్షణ రంగంలో అన్వయింపజేసేందుకు ముందు వెనకా ఆలోచిస్తుంటుంది. అయితే.. ఎలా అధిగమిస్తోందంటే.. వనరులను, మేధస్సును వాడుకోవడంలో దుబాయ్ నిజంగానే అద్భుతాలు చేస్తోంది. అసలే టెక్నాలజీ కొత్తైన ఈ సిటీ.. అవసరం మేర మాత్రమే ఏఐను ఉపయోగించుకోవడంపై ఫోకస్ చేసింది. ఆరోగ్యభద్రత, విద్య, రవాణా, ప్రజా భద్రత విషయంలో ఏఐ సంబంధిత టెక్నాలజీనే ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఆచరణలో పెట్టింది. ప్రజల దైనందిన జీవితంలోకి జొప్పించి.. అలవాటు చేయిస్తోంది. స్మార్ట్దుబాయ్ ఆఫీస్‌ల సహకారంతో ఎన్నో వ్యూహాల నడుమ కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది. ఏఐ, బ్లాక్కెయిన్ ద్వారా ప్రభుత్వ సేవల్ని అందించడమే కాకుండా.. జనాల ఫీడ్‌బ్యాక్‌ను సైతం తీసుకుంటోంది. తద్వారా ఎదురయ్యే పరిణామాల్ని ఎదుర్కొనేందుకు పటిష్ట వ్యవస్థను సిద్ధం చేసుకుంటోంది. వీటికి తోడు ఎథికల్ టూల్ కిట్స్ ద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తోంది. హైలెవల్ సర్వీసులు కావడంతో ఏఐ అల్గారిథమ్ పొరపచ్చాలతో తప్పులు దొర్లే అవకాశమూ లేకపోలేదు. ఇందుకోసం భారీగా ఇంజినీర్లను నియమించుకుంటోంది కూడా. 2030 నాటికి ఏఐ సంబంధిత వ్యవస్థ కోసం 320 బిలియన్ డాలర్ల ఖర్చు పెట్టే యోచనలో ఉన్నాయి మిడిల్ ఈస్ట్ దేశాలు. ఈ అవకాశం అందిపుచ్చుకోవాలనే ఆలోచనలో ఉంది దుబాయ్ మహానగరం. దుబాయ్ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. కానీ, ఆనందం అంటే కేవలం ఎక్కువ డబ్బును కలిగి ఉండడం కాదు. గ్లోబలైజ్డ్ వరల్డ్‌లో కమ్యూనిటీతో ఎలా పొత్తు పెట్టుకోవాలి? సామాజిక అనుభవాన్ని మెరుగుపరచడానికి ఎలా పని చేయాలి? అనే విషయాలపైనే దుబాయ్ ఫోకస్ పెట్టింది. అలా దుబాయ్.. ఈ భూమిపై అత్యంత సంతోషకరమైన నగరంగా స్థానం సంపాదించుకునే మార్గం వైపు వెళ్తున్నట్లు కనిపిస్తోందని ఆర్థిక మేధావులు ఒక అంచనాకి వేస్తున్నారు. క్లిక్ చేయండి: ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌లో దూసుకుపోతున్న హైదరాబాద్ -
స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటున్న విశాఖ
-
‘క్రిస్ సిటీ’ తొలి దశకు టెండర్లు
సాక్షి, అమరావతి: చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ (క్రిస్ సిటీ) తొలి దశ పనులకు ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. పరిశ్రమల ఏర్పాటుతో పాటు నివాసయోగ్యంగా ఉండేలా నిర్మిస్తున్న క్రిస్ సిటీలో రహదారులు, విద్యుత్, నీటి సదుపాయాలు, మురుగు, వరద నీరు పారుదల, మురుగునీటి శుద్ధి వంటి మౌలిక వసతుల కల్పనకు రూ.1,190 కోట్ల విలువైన పనులకు ఏపీఐఐసీ బిడ్లను ఆహ్వానించింది. ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ 36 నెలల్లో పనులను పూర్తి చేయాలన్న నిబంధన విధించింది. అలాగే పనులు పూర్తయిన తర్వాత నాలుగేళ్ల పాటు క్రిస్ సిటీ నిర్వహణ బాధ్యతలను కూడా చూడాల్సి ఉంటుంది. ఆసక్తి గల సంస్థలు నవంబర్ 4 మధ్యాహ్నం 3 గంటల్లోగా బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. సీబీఐసీ కారిడార్‌లో భాగంగా మొత్తం 12,944 ఎకరాల్లో కృష్ణపట్నం నోడ్‌ను అభివృద్ధి చేయనుండగా తొలిదశ కింద 2,134 ఎకరాలను అభివృద్ధి చేయడానికి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (నిక్ డిట్) ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.2,139.44 కోట్లను నిక్‌డిట్ కేటాయించింది. ఈ క్రిస్ సిటీ నిర్మాణం ద్వారా రూ.37,500 కోట్ల పెట్టుబడులు, లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుందని అంచనా. -
వరంగల్: గంటలపాటు పొట్ట ఉగ్గబట్టుకోవాల్సిన దుస్థితి
చారిత్రక, వారసత్వ సంపద, వైద్య, విద్య, సాంస్కృతిక రెండో రాజధాని.. ఘన కీర్తి కలిగిన ఓరుగల్లు స్మార్ట్‌సిటీలో చెబితే ఇంతేనా అనిపించినా వాస్తవంగా ఇదో పెద్ద సమస్య. ఆదేనండి కనీస సదుపాయమైన మూత్రశాలలు లేకపోవడం. మూత్ర విసర్జన కోసం పురుషులు రహదారుల వెంబడి అటు ఇటు తిరుగుతూ ఎక్కడ మరుగు దొరికితే అక్కడే కానిచ్చేస్తున్నారు. మహిళల పరిస్థితి దయనీయం. బయటికి వెళ్లిన వారు మరుగుదొడ్డి దొరికితేనో లేక తిరిగి ఇంటికి చేరుకునేంత వరకు గంటలపాటు పొట్ట ఉగ్గబట్టుకోవాల్సిన పరిస్థితి. – వరంగల్ అర్బన్ చాటు దొరికితే చాలు.... పురుషులు మూత్రశాలలు దొరకక గత్యంతరం లేక చాటు దొరికితే చాలు కళ్లు మూసుకొని కానిచ్చేస్తున్నారు. ఆ సమయంలో మహిళలు సిగ్గుతో తలవంచుకొని వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. నగరంలోని వ్యాపార, వాణిజ్య సముదాయాల్లోనూ చాలా వాటికి మరుగుదొడ్లు కనిపించడం లేదు. గ్రేటర్ వరంగల్ నిబంధనల ప్రకారం ప్రతి అంతస్తుకు సాముహిక మూత్రశాల ఉండాలి.. అలా ఉంటేనే అనుమతులు ఇస్తారు. కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా అనుమతులు ఇచ్చేస్తున్నారు. రహదారుల్లో అక్కడక్కడ, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, కూరగాయల, పండ్ల, మార్కెట్లలో పరిస్థితులు మరింత అధ్వానంగా తయారయ్యాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్ద నగరం. పది లక్షల యాబై వేల జనాభా ఉండగా, నిత్యం చుట్టుపక్కల జిల్లాలనుంచి 2లక్షల పైచిలుకు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ మహా నగరంలో కనీస సదుపాయాలు కల్పించడంలో గ్రేటర్ వరంగల్ విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛ భారత్‌లో భాగంగా వరంగల్ నగరం ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ సాధించింది. కానీ బహిరంగ మూత్ర విసర్జనను నివారించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. బల్దియా బదిలీ కమిషనర్లు వీపీ గౌతమ్, పమేలా సత్పతిలు ప్రత్యేక చొరవ తీసుకొని నగరంలో ప్రతి వెయ్యి మందికి ఒక మరుగుదొడ్డి ఉండే విధంగా చేపట్టిన చర్యల్లో ఇప్పటివరకు 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో 888 మంది మరుగుదొడ్డి ఉపయోగించుకునేలా ప్రజా, కమ్యూనిటీ, లగ్జరీలు, కేఫ్‌లను నిర్మించారు. కొన్ని మరుగుదొడ్లలోనే మూత్రశాలలు నిర్మించారు. పబ్లిక్ టాయిలెట్లు ప్రజలు రద్దీగా ఉన్న రహదారుల్లో లేవు. స్థల లేమితో బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, అక్కడక్కడ రహదారుల్లో నిర్మించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు, కాలనీల్లో, ప్రధాన రహదారుల్లో మూత్రశాలలు లేక ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. మూత్రవిసర్జనకు డబ్బులు వసూలు మహా నగరంలో పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయి. వాటిలో చాలామేరకు మూత్రశాలలు లేవు. పబ్లిక్ టాయిలెట్లలో మూత్రశాల ఉంటే ఉపయోగించినందుకు ఒక్కరినుంచి రూ.3 నుంచి 5 చొప్పన చొప్పన వసూలు చేస్తున్నారు. వాస్తవానికి మూత్రశాల ఉపయోగించినందుకు డబ్బులు తీసుకోకూడదు. కానీ పబ్లిక్ టాయిలెట్ల నిర్వహకులు అడ్డంగా బాదేస్తున్నారు. దీంతో ప్రజలు వాటిలోకి వేళ్లేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో ఎక్కడైనా ఖాళీ స్థలం, సందు దొరికితే చాలు బహిరంగంగా మూత్ర విసర్జన అనివార్యమవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల కిందట ఆస్కీ ఆధ్వర్యంలో మూత్రశాలలపై ప్రణాళికలు రూపొందించారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ఇకనైనా పాలక వర్గం పెద్దలు, అధికారులు బహిరంగ మూత్ర విసర్జనపై కార్యచరణ ప్రణాళిక రూపొందించి విరివిగా మూత్రశాలలు ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. చదవండి: ప్రేమించాలని ‘యువతి’ వేధింపులు.. -
యమహా నగరి.. విశాఖ పురి
సాక్షి, విశాఖపట్నం: స్మార్ట్ సిటీగా కొత్త రూపు దిద్దుకుంటున్న విశాఖ.. దేశంలోని ప్రధాన నగరాలతో పోటీపడుతోంది. అవార్డులు, ర్యాంకింగ్‌లోనూ అదే దూకుడు ప్రదర్శిస్తోంది. క్లైమేట్ స్మార్ట్‌సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్‌వర్క్ 2.0 ర్యాకింగ్స్లో మొత్తం 123 నగరాలు పోటీపడగా.. 9 నగరాలకు మాత్రమే 4 స్టార్ రేటింగ్ దక్కగా.. అందులో విశాఖ స్థానం సంపాదించుకుంది. అర్బన్ ప్లానింగ్, గ్రీన్ కవర్ అండ్ బయోడైవర్సిటీ విభాగంతో పాటు వ్యర్థాల నిర్వహణలోనూ సత్తా చాటి ఏకంగా 5 స్టార్ రేటింగ్ సాధించింది. మురుగునీటి నిర్వహణలో వినూత్న పద్ధతుల్ని అవలంబిస్తున్న జీవీఎంసీ.. ఆ విభాగంలో 3 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ సంయుక్తంగా 2019–20 నుంచి స్మార్ట్‌సిటీ ర్యాంకింగ్స్ ప్రకటిస్తున్నారు. పట్టణ ప్రణాళిక, జీవవైవిధ్యం, ఎనర్జీ, గ్రీన్బిల్డింగ్, ఎయిర్‌క్వాలిటీ, వాటర్ మేనేజ్మెంట్, వ్యర్థాల నిర్వహణ మొదలైన అంశాలపై ర్యాంకింగ్స్ ఇస్తున్నారు. గతేడాది 9వ ర్యాంకు సాధించిన విశాఖ నగరం.. 2020–21లో మాత్రం సత్తా చాటింది. క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్‌వర్క్ 2.0 ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో మొత్తం 9 నగరాలకు 4 స్టార్ రేటింగ్ ఇవ్వగా అందులో విశాఖపట్నం కూడా నిలిచింది. ఇక వివిధ విభాగాల్లో ప్రకటించిన ర్యాంకుల్లో విశాఖ నగరం సత్తా చాటింది. అర్బన్‌ప్లానింగ్, గ్రీన్ కవర్ అండ్ బయోడైవర్సిటీ విభాగంలో ఇండోర్, సూరత్‌తో కలిసి వైజాగ్ 5 స్టార్ రేటింగ్ పంచుకుంది. వ్యర్థాల నిర్వహణ విభాగంలో 5 స్టార్, ఎనర్జీ అండ్ గ్రీన్ బిల్డింగ్స్ విభాగంలో, మొబిలిటీ అండ్ ఎయిర్‌క్వాలిటీ విభాగంలో, మురుగునీటి నిర్వహణలోనూ 3 స్టార్ రేటింగ్ సాధించింది. రెండేళ్ల కాలంలో విశాఖ నగరంలో వచ్చిన వినూత్న మార్పులతో ‘స్టార్ సిటీ’గా రూపాంతరం చెందుతోంది. వ్యర్థాల నిర్వహణలోనూ స్టారే.. జీవీఎంసీ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 2018–19లో 23వ ర్యాంక్‌కు పడిపోవడంతో.. పటిష్ట చర్యలకు అమలు చేసింది. బయోమైనింగ్, ఘన వ్యర్థాల నిర్వహణని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. కాపులుప్పాడ డంపింగ్ యార్డులో 20 ఏళ్లుగా పేరుకుపోయిన వ్యర్థాల్ని 25 ఎకరాల్లో ఆధునిక బయోమైనింగ్ పద్ధతు ల్లో తొలగిస్తున్నారు. అదేవిధంగా చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం చేపడుతోంది. అందుకే ఈ విభాగంలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. పర్యావరణహిత నగరంగా... నగరంలో రెండేళ్లుగా పర్యావరణ పరిరక్షణపై జీవీఎంసీ ప్రత్యేక దృష్టిసారించింది. సీడ్‌బాల్స్ రూపంలో లక్షకు పైగా విత్తనాలు, 58,456 మొక్కలు నాటింది. దీనికితోడు మియావాకీ చిట్టడవులు, పార్కులు ఏర్పాటు చేయడంతో.. ఈ విభాగంలో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. దీని ద్వారా జీవవైవిధ్యానికి జీవీఎంసీ పెద్దపీట వేసింది. ►జీవీఎంసీ విస్తీర్ణం-625.47 చ.కిమీ ►పచ్చదనం పరచుకున్న విస్తీర్ణం 222.53 చ.కిమీ మురుగు నీటిని శుద్ధి చేస్తూ.. నగరంలో ఉత్పన్నమవుతున్న మురుగునీటి వ్యర్థాల నిర్వహణలోనూ జీవీఎంసీ ప్రత్యేక చర్యలు అవలంబిస్తోంది. మురుగునీటిని శుద్ధి చేసేందుకు బయోరెమిడేషన్ పద్ధతుల్ని అవలంబిస్తోంది. ఈ కారణంగా ఈ విభాగంలో 3 స్టార్ రేటింగ్ సాధించింది. ►నగరంలో ఉత్పన్నమవుతున్న మురుగునీరు 78 ఎంఎల్డీ ►సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్(ఎస్టీపీ) 04 ►మినీ ఎస్టీపీలు 13 ►సివరేజ్లైన్ పొడవు 771 కి.మీ స్టార్ రేటింగ్ బాధ్యత పెంచింది స్మార్ట్ సిటీ స్టార్ రేటింగ్స్‌లో విశాఖ నగరం మంచి రేటింగ్ సాధించడం ఆనందంగా ఉంది. నగర ప్రజలకు ఆరోగ్యకరమైన, గౌరవ ప్రదమైన జీవనాన్ని అందించేందుకు జీవీఎంసీ నిరంతరం శ్రమిస్తోంది. వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణపై మరింత దృష్టిసారిస్తున్నాం. థీమ్‌పార్కులు, మియావాకీ అడవుల నిర్మాణం చేపడుతున్నాం. నరవలో 108 ఎంఎల్డీ ఎస్టీపీ సిద్ధం చేస్తున్నాం. స్టార్ రేటింగ్ జీవీఎంసీ అధికారులపై బాధ్యతని మరింత పెంచింది. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతున్నాం స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల విషయంలో జీవీఎంసీ రాజీపడటం లేదు. కమిషనర్ సూచనల్ని అనుసరించి.. ప్రాజెక్టుల్ని పూర్తి చేసే విషయంలో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంపై ప్రధాన దృష్టిసారించాం. సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూ గ్రీన్ సిటీగా విశాఖని తీర్చదిద్దుతున్నాం. – వినయ్‌కుమార్, జీవీఎంసీ స్మార్ట్‌సిటీ ఎస్ఈ -
ఫోర్ స్టార్ నగరాలుగా విశాఖ, బెజవాడ
సాక్షి, న్యూఢిల్లీ/విశాఖపట్నం/తిరుపతి తుడా: స్మార్ట్ సిటీల్లో విశాఖపట్నం, విజయవాడ నగరాలకు ఫోర్ స్టార్ రేటింగ్ దక్కింది. క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్‌వర్క్ 2.0 ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం నుంచి ఈ రెండు నగరాలు స్థానం సంపాదించుకున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 120 నగరాలు పోటీపడగా.. 9 నగరాలకు ఫోర్ స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇందులో రాష్ట్రం నుంచి విశాఖపట్నం, విజయవాడ నగరాలకు ఫోర్ స్టార్ రేటింగ్ దక్కింది. పట్టణ ప్రణాళిక, జీవ వైవిధ్యం, ఎనర్జీ, గ్రీన్ బిల్డింగ్, ఎయిర్ క్వాలిటీ, వాటర్ మేనేజ్మెంట్, వ్యర్థాల నిర్వహణ మొదలైన అంశాలపై 2019–2020 నుంచి ర్యాంకింగ్స్ ఇస్తున్నారు. తిరునగరికి ఐదు అవార్డులు స్మార్ట్ తిరుపతి జాతీయ స్థాయిలో కీర్తి పతాకాన్ని ఎగురవేసింది. స్వచ్ఛ సర్వేక్షణ్, లివింగ్ సిటీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో తిరుపతి నగరానికి జాతీయ గుర్తింపు లభించింది. సోషల్ యాస్పెక్ట్‌లో తిరుపతి తొలి స్థానం దక్కించుకుంది. అర్బన్ డెవలప్మెంట్లో మూడో స్థానంలో నిలిచింది. పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి విభాగంలో ఈ స్థానం దక్కింది. శానిటేషన్ విభాగంలో ఇండోర్‌తో కలిపి తిరుపతి తొలి స్థానంలో నిలిచింది. ఎకానమీ అంశంలో బూస్ట్ లోకల్ ఐడెంటిటీ, డిజైన్ స్టూడియోలో ఎకానమీ విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. సిటీల విభాగంలో రెండో రౌండ్లో రెండో స్థానంలో నిలిచింది. తిరుపతి నగరం మొత్తం ఐదు జాతీయ అవార్డులను దక్కించుకున్నట్టు నగరపాలక సంస్థ కమిషనర్ పి.ఎస్.గిరీష, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ వెల్లడించారు. కాకినాడ, అమరావతి ఇలా.. డాటా మెచ్యూరిటీ అసెస్మెంట్ ఫ్రేమ్ వర్క్ సైకిల్–2 డ్యాష్‌బోర్డు ఫలితాల ప్రకారం 80 పాయింట్లకు గానూ 56 పాయింట్లతో 14 వ స్థానంలో విశాఖపట్నం, 53 పాయింట్లతో కాకినాడ 19వ స్థానంలో, 41 పాయింట్లతో 27వ స్థానంలో అమరావతి, 14 పాయింట్లతో 84వ స్థానంలో తిరుపతి నిలిచాయి. అర్బన్ ప్లానింగ్, గ్రీన్ కవర్లో విశాఖకు ‘ఫైవ్‌స్టార్’ అర్బన్ ప్లానింగ్, గ్రీన్ కవర్ అండ్ బయో డైవర్సిటీ విభాగంలో దేశవ్యాప్తంగా కేవలం 3 నగరాలకు మాత్రమే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇందులోనూ విశాఖపట్నం సత్తా చాటింది. ఇండోర్, సూరత్‌తో కలిసి వైజాగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ పంచుకుంది. వ్యర్థాల నిర్వహణ విభాగంలోనూ విశాఖ సత్తా చాటింది. ఈ విభాగంలోనూ ఫైవ్ స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. ఎనర్జీ అండ్ గ్రీన్ బిల్డింగ్స్ విభాగంలో త్రీ స్టార్ రేటింగ్‌ని విశాఖ దక్కించుకుంది. మొబిలిటీ అండ్ ఎయిర్ క్వాలిటీ విభాగంలోనూ త్రీ స్టార్ రేటింగ్ సాధించింది. మురుగు నీటి నిర్వహణ విభాగంలో త్రీ స్టార్ రేటింగ్‌లో నిలిచింది. -
తిరుపతి నగరానికి 5 ప్రతిష్టాత్మక అవార్డులు
సాక్షి, తిరుపతి: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే స్మార్ట్ సిటీ అవార్డుల కాంటెస్ట్‌లో తిరుపతి నగరానికి ఏకంగా ఐదు అవార్డులు లభించాయి. దేశంలో ఇండోర్, సూరత్ నగరాల తర్వాత ఐదు అవార్డులు దక్కించుకున్న ఏకైక నగరం తిరుపతి కావడం విశేషం. పారిశుద్ధ్యం, ఈ-హెల్త్ విభాగాల్లో ఈ నగరానికి దేశంలోనే మొదటి స్థానం లభించగా.. బెస్ట్ సిటీ, ఎకానమీ విభాగాల్లో రెండో స్థానం.. అర్బన్ ఎన్విరాన్మెంట్ విభాగంలో మూడో స్థానం దక్కింది. మొత్తంగా తిరుపతి నగరానికి ఐదు స్మార్ట్ సిటీ అవార్డులు లభించాయి. చదవండి: 6 జిల్లాల్లో 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు: సీఎం జగన్ -
వారు మాతృమూర్తులతో సమానం..
సాక్షి, విశాఖ: పరిసారలను అనునిత్యం పరిశుభ్రంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తున్నపారిశుధ్య కార్మికులపై మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్య నారాయణ ప్రశంసల వర్షం కురిపించారు. స్వచ్చభారత్ కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికులకు వారు పేరుపేరునా ధన్యవాదాలుతెలిపారు. పారిశుధ్య కార్మికుల సేవలకు గుర్తింపుగా శుక్రవారం అవార్డులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికుల సేవలు వెల కట్టలేనివని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారి పాత్ర చాలా కీలకమని ప్రశంసించారు. పారిశుధ్య కార్మికులు మాతృ మూర్తులతో సమానమని, వారి సేవలకు గుర్తుంపుగా అవార్డులు ప్రధానం చేయడం చాలా సంతోషకరమన్నారు. స్మార్ట్ సిటీ విశాఖను మరింత సుందర నగరంగా తీర్చి దిద్దడంలో వారి పాత్ర చాలా కీలకమన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందని ఆయన పేర్కొన్నారు. మంత్రి బొత్స సత్య నారాయణ మాట్లాడుతూ.. పారిశుద్యం అంటే కేవలం శానిటైజేషన్ మాత్రమే కాదని, పరిసరాలను పూర్తిగా పరిశుభ్రంగా ఉంచడమేని అభిప్రాయపడ్డారు. పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించి 25 మందికి అవార్డులు ఇవ్వడం చాలా సంతోషకరమన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా తీర్చిడిద్దడంలో వారి పాత్ర చాలా కీలకమన్నారు. విశాఖను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలని కోరారు. దేశంలో అత్యంత సుందర నగరాలలో విశాఖకు 9వ స్థానం లభించడం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. కాపులుప్పాడ బయో మైనింగ్ ప్రాసెస్ ప్లాంట్‌కి నిధులు విడుదల చేసి మరింత స్వచ్చత సాధిస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఆధారబాదరగా పనులు చేపట్టి మధ్యలో వదిలేసారని, తాము అధికారంలోకి వచ్చాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన వివరించారు. -
విశాఖకు అంతర్జాతీయ ఘనత
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ అవార్డు రేసులో విశాఖ మహానగరం మూడో స్థానాన్ని దక్కించుకుంది. స్పెయిన్‌లో జరిగిన స్మార్ట్ సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్–2020లో విశాఖ స్మార్ట్ సిటీ ప్రపంచ నగరాలతో పోటీ పడింది. ‘లివింగ్ అండ్ ఇన్‌క్లూజన్ అవార్డు’ కేటగిరీలో మోస్ట్ ఇన్నోవేటివ్ అండ్ సక్సెస్ఫుల్ ప్రాజెక్టులతో ప్రపంచంలోని 20 నగరాలు పోటీ పడగా.. విశాఖ మూడో స్థానంలో నిలిచింది. బీచ్ రోడ్డులో రూ.3.50 కోట్లతో నిర్మించిన ‘ఆల్ ఎబిలిటీ పార్క్’ లివింగ్ అండ్ ఇన్‌క్లూజన్ అవార్డుకు పోటీ పడింది. ఏడు కేటగిరీల్లో ఈ అవార్డులు ప్రకటించారు. మొత్తం ఈ ఎక్స్‌పోలో ప్రపంచం నలుమూలల నుంచి 46 నగరాలు పాల్గొనగా.. భారత్ నుంచి కేవలం విశాఖపట్నం మాత్రమే అర్హత పొందడం విశేషం. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ ఎక్స్‌పోలో బుధవారం ఆయా కేటగిరీల్లో అవార్డులు ప్రకటించారు. తొలి స్థానంలో మురికివాడల అభివృద్ధి ప్రాజెక్టుతో బ్రెజిల్ విజేతగా నిలవగా, అంతర్జాతీయ విరాళాల ద్వారా పేదలకు సంబంధించిన వివిధ రకాల బిల్లుల్ని చెల్లించేప్రాజెక్టుతో టరీ్క దేశంలోని ఇస్తాంబుల్ సిటీ రెండో స్థానంలో నిలిచింది. దేశంలోనే తొలి ఎబిలిటీ పార్క్ బీచ్ రోడ్డులో వైఎంసీఏ ఎదురుగా రూ.3.50 కోట్లతో ఆల్ ఎబిలిటీ పార్క్ తీర్చిదిద్దారు. సాధారణ ప్రజలు, పిల్లలతో పాటు విభిన్న ప్రతిభావంతులు కూడా ఈ పార్కులో ఆటలాడుకొని ఎంజాయ్ చేసేలా పార్కు నిర్మించారు. పార్కులో క్లైంబింగ్ నెట్, పిల్లలు ఆటలాడుకునే ఎక్విప్మెంట్, షిప్ డెక్, మ్యూజికల్ పోల్స్, ప్లే గ్రౌండ్ డ్రమ్స్‌తో పాటు ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణతో తీర్చిదిద్దే ల్యాండ్ స్కేప్‌లు ఉన్నాయి. విభిన్న ప్రతిభావంతుల కోసం మూడు సీట్ల మేరీ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేశారు. దివ్యాంగులు కూడా ఎంజాయ్ చేసేలా దేశంలో రూపొందిన తొలి ఎబిలిటీ పార్క్ ఇదే కావడం విశేషం. ప్రజల ఆనందానికి, ఆహ్లాదానికి వినియోగించుకునేలా.. ముఖ్యంగా చిన్నారులకు సరికొత్త అనుభూతిని పంచుతున్న ఈ పార్కుని యూకే అంబాసిడర్‌తో పాటు అమెరికన్ల ప్రశంసలందుకుంది. వచ్చే ఏడాది మొదటి స్థానం ఖాయం స్మార్ట్ సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్–2020లో జీవీఎంసీ ప్రాజెక్ట్ మొదటి స్థానం సాధించలేకపోయినందుకు బాధగా ఉన్నా.. దేశం నుంచి ఎంపికైన ఏకైక ప్రాజెక్ట్ ఆల్ ఎబిలిటీ పార్క్ కావడం గమనార్హం. అవార్డు కోసం ప్రపంచంలోని అతి పెద్ద ప్రముఖ నగరాలతో విశాఖ పోటీ పడటం గర్వంగా ఉంది. వచ్చే ఏడాది బార్సిలోనాలో జరిగే స్మార్ట్ సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్–2021లో విశాఖ ఒక కేటగిరీలో అయినా మొదటి స్థానంలో నిలిచి అంతర్జాతీయ అవార్డు సొంతం చేసుకుంటుంది. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ -
మరింత స్మార్ట్‌గా..
స్మార్ట్ క్లాసులు నిర్వహిస్తూ పేద విద్యార్థులకు సరికొత్త విద్యాబోధన అందిస్తున్న మహా విశాఖ నగర పాలక సంస్థ.. మరిన్ని స్కూళ్లలో సేవలు విస్తృతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. స్మార్ట్ క్లాస్ రూమ్‌లు, డిజిటల్ ల్యాబ్‌లు, ప్రొజెక్షన్ యూనిట్లు.. ఇలా స్మార్ట్ పాఠశాలలుగా అభివృద్ధి చేసేందుకు రూ.28.77 కోట్లతో పనులు చేపట్టింది. లాక్డౌన్ కారణంగా పనులు ఆలస్యం కావడంతో.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పేద విద్యార్థులకు స్మార్ట్ పాఠాలు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. సాక్షి, విశాఖపట్నం : మున్సిపల్ బడి అంటే.. దుంపల బడి అనే ఆలోచన నుంచి.. డిజిటల్ బడి అనేలా తీర్చిదిద్దుతున్నారు మహా విశాఖ నగర పాలక సంస్థ అధికారులు. కార్పొరేట్ స్కూల్ విద్యార్థులకు అందే ప్రతి సౌకర్యం పేద, మధ్య తరగతి విద్యార్థులకు అందాలనే లక్ష్యంతో జీవీఎంసీ వినూత్నంగా ఆలోచనలు చేస్తోంది. విద్యార్థుల్లో ఆవిష్కరణ, పరిశోధన నైపుణ్యం, సామర్థ్యం పెరగాలనే లక్ష్యంతో ప్రాథమిక స్థాయిలోనే వారికి సాంకేతికతను పరిచయం చేయాలని జీవీఎంసీ నిర్దేశించుకుంది. ఇందుకు అనుగుణంగానే స్మార్ట్ క్లాసులను 2017 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించింది. మొదటి 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకూ డిజిటల్ క్లాస్ రూమ్‌లు, స్మార్ట్ క్లాస్‌లు పరిచయం చేసిన జీవీఎంసీ ఇప్పుడు ఒకటి నుంచి 8 వరకూ స్మార్ట్ క్లాస్లనూ, 10వ తరగతి వరకూ డిజిటల్ తరగతులను బోధిస్తోంది. దీని ద్వారా పిల్లల్లో నేర్చుకోవాలనే తపన, పాఠ్యాంశాలపై అవగాహన, ఆసక్తి, ఉత్సాహం పెరుగుతోంది. మూడు విభాగాలుగా తరగతులు స్మార్ట్ క్లాస్ రూమ్ అనేది మూడూ విభాగాలుగా అమలు చేస్తున్నారు. మొదటిది ప్రతి క్లాస్‌కు డిజిటల్ బోర్డును అమర్చుతారు. ఈ డిజిటల్ బోర్డును టీచర్స్ వినియోగించి.. పాఠాలను బోధిస్తారు. ఇలా బోధించడం వల్ల విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమవుతాయి. గణితం, సైన్స్ డయాగ్రామ్స్ విద్యార్థులు స్పష్టంగా 3డిలో వివరిస్తే ఆసక్తిగా ఉంటుంది. రెండో దశలో విద్యార్థులకు క్రోమ్ బుక్స్ (మినీ ల్యాప్టాప్స్) ఇచ్చి వారికి కంప్యూటర్ పరిజ్ఞానం నేర్పుతారు. ఇందులో ప్రత్యేకం గూగుల్ క్లాస్ రూమ్. ఇది విద్యా రంగంలో డిజిటల్ క్లాస్‌లకు ముఖ్య భూమిక పోషిస్తోంది. దీని గురించి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నేర్పిస్తారు. మూడో దశలో గూగుల్ క్లాస్ రూమ్ గురించి నేర్చుకున్న తరువాత ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆన్లైన్లో హోమ్ వర్క్స్ ఇవ్వడం, పరీక్షలు నిర్వహిస్తారు. వారు చేసిన హోమ్ వర్క్స్, పరీక్షలకు ఫలితాలను వెంటనే వెల్లడవుతాయి. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సమయం ఆదాతో పాటు, బుక్స్‌లో లేని విషయాలను సైతం తెలుసుకునే అవకాశం ఏర్పడుతోంది. స్మార్ట్ ల్యాబ్‌లు.. డిజిటల్ క్లాసులు విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు చెప్పడమే కాదు.. ఆన్లైన్లోనే పరీక్షలూ నిర్వహించేలా 2019–20 విద్యా సంవత్సరంలో యూనిట్ పరీక్షలు పైలట్‌గా చేపట్టి సఫలీకృతులయ్యారు. ఆన్లైన్ ద్వారా రివిజన్ ఎగ్జామ్స్ సైతం నిర్వహించారు. ఇలా ప్రతి అడుగూ స్మార్ట్‌గా వేస్తున్న జీవీఎంసీ మిగిలిన స్కూళ్లలోనూ ప్రాజెక్టు విస్తరిస్తోంది. రూ.28.27 కోట్లతో స్మార్ట్ స్కూళ్లు పనులు చేపడుతోంది. హైస్కూళ్లలో స్మార్ట్ క్లాస్ రూమ్‌లు, ప్రొజెక్షన్ యూనిట్లుతో పాటు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో డిజిటల్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నారు. కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో పనులు ఆలస్యమయ్యాయి. వీటన్నింటినీ ఈ విద్యా సంవత్సరంలో పూర్తి చేసి, 2021–22 నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీవీఎంసీ ప్రయత్నిస్తోంది. జీవీఎంసీ పాఠశాలలోని డిజిటల్ క్లాస్ రూమ్‌లో నాలెడ్జ్ యంత్ర (కెయాన్) అప్లికేషన్ ద్వారా క్లాస్ వివరించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో కెయాన్ వినియోగిస్తున్నారు. కంప్యూటర్‌కు ప్రొజెక్టర్ అనుసంధానించి. ప్రొజెక్టర్ ఆన్ చేసి ఇంటెల్ స్పేస్ అనే స్మార్ట్ బోర్డును ఉపాధ్యాయులు వినియోగిస్తున్నారు. సుద్ద ముక్క లేకుండానే బోర్డుపై క్లాసులు చెప్పే సౌకర్యం ఉంది. అదే విధంగా ల్యాబ్‌లో కెయాన్తో పాటు 40 క్రోమ్‌బుక్స్‌ను విద్యార్థులకు ఇస్తారు. ఈ క్రోమ్బుక్స్లోనే పెన్ను పుస్తకాలతో సంబంధం లేకుండా విద్యార్థులు నోట్స్ ప్రిపేర్ చేసుకునే సౌకర్యం కూడా అందుబాటులోకి రానుంది. చురుగ్గా స్మార్ట్ స్కూళ్ల పనులు జీవీఎంసీ విద్యార్థుల్లోనూ, ఉపాధ్యాయుల్లోనూ స్మార్ట్ క్లాసులు మంచి మార్పులు తీసుకొచ్చింది. డిజిటల్ క్లాస్ రూమ్స్ వల్ల విద్యార్థులు రివిజన్ సమయంలో చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సైన్స్ వీడియోస్ ద్వారా విద్యార్థులకు పాఠాలపై పూర్తి అవగాహన కలుగుతోంది. స్మార్ట్ క్లాస్ రూమ్స్ వల్ల పోటీ పరీక్షలకు కూడా విద్యార్థులకు మంచి సహకారం లభిస్తోంది. పనులు చురుగ్గా సాగుతున్నాయి. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా అమలు చేస్తున్న స్మార్ట్ క్లాసులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం. దీనికి తోడు విద్యార్థుల్ని ఆన్లైన్ ఎగ్జామ్స్‌ను ఎదుర్కొనేలా సంసిద్ధుల్ని చేస్తే భవిష్యత్తులో అన్ని పోటీ పరీక్షల్నీ సులువుగా అందిపుచ్చుకోగలరు. అందుకే పరీక్షలు కూడా ఆన్లైన్లో నిర్వహించే విషయంపై కసరత్తు చేస్తున్నాం. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ -
త్రీస్టార్.. తిరుపతి వన్
స్మార్ట్ తిరుపతి మెరిసింది. త్రీస్టార్ రేటింగ్‌లో జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. స్వచ్ఛత, పరిశుభ్రత నెలకొల్పడంలో అత్యున్నత ప్రమాణాలు అమలు చేస్తున్నందుకు అత్యున్నత గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో స్వచ్ఛత, పరిశుభ్రత అమలు విధానంపై కేంద్ర ప్రభుత్వ మినిస్టరీ ఆఫ్ అర్బన్ హౌసింగ్ అఫైర్స్‌శాఖ పర్యవేక్షణలో ఫైవ్, త్రీస్టార్ ర్యాంకింగ్‌లను మంగళవారం ప్రకటించారు. ఆశాఖ మంత్రి హర్దీప్సింగ్పూరీ ర్యాంకుల వివరాలను ఢిల్లీ కేంద్రంగా ప్రకటించారు. త్రీస్టార్ రేటింగ్‌లో పోటీపడ్డ తిరుపతి నగరం జాతీయ స్థాయిలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. సాక్షి, తిరుపతి: గార్బేజ్ ఫ్రీసిటీ స్టార్ రేటింగ్‌లో తిరుపతి నగరం జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకును సొంతం చేసుకుంది. 2019లో నిర్వహించి రేటింగ్స్‌లో 51వ స్థానంలో ఉన్న తిరుపతి నగరం 2020 పోటీల్లో టాప్–1 ర్యాంకులో నిలిచి తన సత్తాను చాటుకుంది. గత ఏడాది విజయవాడ నగరం 50వ స్థానంలో ఉండగా ఈ సారి జాతీయ స్థాయిలో 2వ స్థానానికి చేరింది. త్రీస్టార్ రేటింగ్‌లో టాప్–10లో ఉన్న నగరాలు మాత్రమే టాప్ 5 ర్యాంకింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. త్రీస్టార్ రేటింగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన తిరుపతి వచ్చే ఏడాది ఫైవ్ స్టార్ ర్యాంకింగ్‌లో పోటీపడనుంది. 1,435 నగరాలు పోటీ స్వచ్ఛతను పాటించే నగరాలకు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ స్టార్ రేటింగ్స్ పోటీ నిర్వహించింది. నిపుణులు నగరాల్లో అమలవుతున్న స్వచ్ఛత, పరిశుభ్రత, ప్రజలకు మౌలిక వసతులు, వాటి నిర్వహణకు ఉపయోగిస్తున్న అత్యున్నత ప్రమాణాలు, ప్రజల అభిప్రాయాల సేకరణ ఆధారంగా ర్యాంకింగ్‌ను కేటాయించారు. దేశంలోని 1,435 నగరాలు పోటీడ్డాయి. ఫైవ్ స్టార్ రేటింగ్‌లో ఆరు నగరాలు సొంతం చేసుకోగా 63 నగరాలకు త్రీస్టార్, 70 నగరాలు ఒక స్టార్ రేటింగ్‌ను కేంద్రం ప్రకటించింది. మెరిసిన తిరుపతి కీర్తి పతాకం తిరుపతిలో స్వచ్ఛత, పరిశుభ్రతకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. చెత్తను వంద శాతం సది్వనియోగం చేస్తున్నారు. ఇందుకోసం పీపీపీ పద్ధతిన కార్పొరేషన్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. పారిశుద్ధ్య కార్మికుల ద్వారా ఇంటింటా తడి, పొడి చెత్తను స్వీకరిస్తున్నారు. రూ.15 కోట్ల వ్యయంతో తూకివాకంలో నిర్మించిన బయో మెథనైజేషన్ ప్లాంట్‌కు తరలించి గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నారు. రూ.19 కోట్ల వ్యయంతో రామాపురం డంపింగ్ యార్డులో బయో మైనింగ్ ద్వారా 5 లక్షల టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేస్తున్నారు. రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ను తూకివాకంలో నిర్వహిస్తున్నారు. రూ.3 కోట్ల వ్యయంతో పొడిచెత్త ద్వారా సేంద్రియ ఎరువుల తయారీ చేపట్టారు. ఇలా శాశ్వత ప్రతిపాదికన చెత్త నిర్వహణను నిర్వహిస్తున్నారు. ప్రజలకు అత్యుత్తమ సేవలను అందిస్తుండడంతో తిరుపతి ఈ ఘనతను సొంతం చేసుకుంది. సమష్టి కృషితోనే సాధ్యం నగర ప్రజలకు పరిశుభ్రత, స్వచ్ఛతను అందించేందుకు కృషి చేస్తున్నాం. మౌలిక వసతులు కలి్పస్తున్నాం. చెత్త నిర్వహణ కోసం కోట్లు వె చ్చించి పలు ప్లాంట్లు నిర్వహిస్తున్నాం. ప్రజల సహకారం, పారిశుద్ధ్య కార్మికుల కష్టం, అధికారుల సమష్టి కృషితోనే ఈ ఘనత సాధించాం. – పీఎస్ గిరీషా, కమిషనర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ -
‘స్మార్ట్’ విశాఖ: 24 గంటలు డేగకన్నుతో..
సాక్షి, విశాఖపట్నం: మహమ్మారి కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని మహానగరం విశాఖపట్నం దేశంలోని అన్ని నగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయిన వెంటనే అప్రమత్తమైన అధికార బృందం యుద్దప్రాతిపదకన అనేక చర్యలు చేపట్టింది. నగరాన్ని 24 గంటలు డేగకన్నుతో పరిశీలిస్తూ కరోనా కట్టడికి కృషి చేస్తున్నారని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా కరోనా కట్టడిలో యంత్రాంగం పనితీరుకు కితాబు ఇచ్చింది. మహమ్మారి కరోనాపై నగర ప్రజల్లో అవగాహన పెంపొందించే విధంగా 90 ప్రాంతాల్లో బహిరంగ ప్రకటన వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా విశాఖ మొత్తం 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రతీ ఒక్కరి కదలికలపై దృష్టి సారించారు. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే కూడళ్లలో కరోనా గురించి తెలిపే 10 డిజిటల్ సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. వీటన్నింటిని అనుసంధానం చేస్తూ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. విశాఖ స్మార్ట్ సిటీ కార్యాలయంలో 24గంటలూ పనిచేసేలా హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు. 24 గంటలు షిఫ్ట్‌ల వారీగా పనిచేస్తూ నిరంతరం అప్రమత్తతో ఉంటున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన వలంటీర్ వ్యవస్థతో ఇంటింటి సర్వే చేపట్టి కరోనా పాజిటివ్/అనుమానితులను వేగంగా గుర్తించారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను హాట్‌స్పాట్ జోన్లుగా ప్రకటించి అంక్షలు విధించి అక్కడ వారిని బయటకు రానీయకుండా అధికారులు గట్టి చర్యలు చేపట్టారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి వారితోపాటు వారి కుటుంబసభ్యులు, సన్నిహితులను క్వారంటైన్ చేశారు. దీంతో స్మార్ట్ సిటీ విశాఖలో కరోనా కొంత నియంత్రణలోకి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు కూడా చైతన్యంతో వ్యవహరించడంతో విశాఖలో కరోనా వ్యాప్తి కొంత ఆగినట్లయింది. చదవండి: మే 17 వరకు లాక్డౌన్ పొడగింపు ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ జోన్లు ఇవే -
కరోనా నియంత్రణ చర్యలు చాలా 'స్మార్ట్'!
సాక్షి, అమరావతి: స్మార్ట్ సిటీల్లో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు బాగున్నాయ్.. మిగతా పట్టణాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయ్.. అంటూ స్మార్ట్ సిటీ మిషన్ కితాబిచ్చింది. ఈ మేరకు ఓ నివేదిక ఇచ్చింది. తిరుపతిలో కరోనా నియంత్రణ చర్యలు అద్భుతంగా ఉన్నట్టు పేర్కొంది. స్మార్ట్ నగరాల పనితీరును బట్టి సాధారణం, బాగా చే స్తున్నవి, అద్భుతంగా చేస్తున్నవి.. ఇలా మూడు గ్రేడ్లుగా విభజించి, అక్కడి సేవలను పరిశీలించి స్మార్ట్‌సిటీ మిషన్ ర్యాంకులిచ్చింది. మన రాష్ట్రంలో విశాఖ, అమరావతి, కాకినాడ, తిరుపతిలు స్మార్ట్ నగరాలు. ఈ నాలుగింటిలో తిరుపతికి మొదటి ర్యాంకు వచ్చింది. వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు ఇక్కడ బాగున్నట్టు తన నివేదికలో తేల్చింది. నివేదికలోని ముఖ్యాంశాలు.. - తిరుపతికి సంబంధించి విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల ఇళ్ల వద్ద మార్కింగ్ వేశారు. క్వారంటైన్ పర్యవేక్షణ బాగుంది. - ఇంటింటికీ వెళ్లి నిత్యావసరాలు, కిరాణా సరుకులు అందజేస్తున్నారు - వార్డు సెక్రటరీలు, సిబ్బంది ఆయా వార్డుల్లో పటిష్టంగా, ప్రజలను నొప్పించకుండా సేవలందిస్తున్నారు. - విశాఖపట్నంలో పబ్లిక్ అనౌన్స్మెంట్ విధానం చాలా బావుంది - అంతర్జాతీయ ప్రయాణికులను గుర్తించడంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ చక్కగా పనిచేస్తోంది - కాకినాడలో 24 గంటల హెల్ప్ డెస్క్‌లు, ఎమర్జెన్సీ కాల్ బాక్స్‌ను ఏర్పాటు చేశారు - అమరావతిలో పబ్లిక్ అవేర్నెస్ బ్యానర్లు విరివిగా ఏర్పాటు చేయడంతో పాటు హోమియో మందులు సరఫరా చేస్తున్నారు. -
ఏపీలో మరో 13 స్మార్ట్ సిటీల అభివృద్ధిపై దృష్టి
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ సిటీ కార్యక్రమానికి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరిన్ని స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం గుంటూరు, ఒంగోలు, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరులతో కలిపి మొత్తం 13 పట్టణాలను ఎంపిక చేసుకుంది. వచ్చే పదేళ్లలో ఈ పట్టణాలను స్మార్ట్ సిటీలుగా మార్చాలని నిర్ణయించింది. మొదటి దశలో ఆరు పట్టణాలను అభివృద్ధి చేయనుంది. ఇందు కోసం సుమారుగా రూ. 5,183 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విశాఖ, కాకినాడ, అమరావతి, తిరుపతిలను స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో చేర్చి అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తంగా రాష్ట్రంలో 17 పట్టణాలు స్మార్ట్‌గా మారనున్నాయి. మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి.. రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రస్తుతం రాష్ట్ర జనాభాలో 30 శాతం పట్టణాల్లో నివసిస్తుండగా పదేళ్లలో ఇది 50 శాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు వచ్చే పదేళ్లలో రూ. 3.55 లక్షల కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో ఒక్క పట్టణ రవాణా రంగంలోనే రూ. 89,034 కోట్లు అవసరమవుతాయని లెక్కకట్టింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈ ప్రాజెక్టులను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మెట్రో రైలు, రహదారులు, పోర్టుల అభివృద్ధి వంటి రంగాల్లో బీవోటీ, పీపీపీ విధానాల్లో విదేశీ పెట్టుబడులకు ఆహా్వనం పలుకుతోంది. ఈ మధ్య రాష్ట్ర పర్యటనకు వచి్చన కొరియా, ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తల బృందాలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఉన్నతాధికారులు మౌలిక వసతుల కల్పనలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. విశాఖ మెట్రో రైలు, బకింగ్‌హాం కెనాల్ పునరుద్ధరణ, అభివృద్ధి, వ్యర్థాల నిర్వహణలో పెట్టుబడులు పెట్టడానికి ఈ రెండు దేశాల ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేశారు. వచ్చే పదేళ్లలో రాష్ట్ర జీడీపీలో 75 శాతం పట్టణాల నుంచే వస్తుందని అంచనా వేస్తున్నట్లు బుగ్గన పేర్కొంటున్నారు. స్మార్ట్ సిటీల అభివృద్ధి ఇలా... 1రాష్ట్రం మొదటి దశలో చేపట్టేవి శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు, కర్నూలు, అనంతపురం, నెల్లూరు 2రెండో దశలో చేపట్టేవి విజయనగరం, రాజమండ్రి, విజయవాడ, మచిలీపట్నం గుంటూరు, కడప, చిత్తూరు కేంద్రం అభివృద్ధి చేస్తున్న స్మార్ట్ సిటీలు విశాఖ, కాకినాడ, అమరావతి, తిరుపతి -
చెత్త కనబడకుండా ’స్మార్ట్’ ఐడియా!
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో చెత్త నిర్వహణలో కొత్త విధానం చేపట్టేందుకు కసరత్తు ప్రారంభమైంది. నగరాన్ని స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దడమే కాకుండా ఆ స్థాయికి తగ్గట్టుగా నగరంలో చెత్త నిర్వహణను చేపట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రధాన రహదారులపై చెత్త కనబడకుండా ఉండేందుకు అండర్‌గ్రౌండ్ డస్ట్‌బిన్స్ ఏర్పాటుకు నగరపాలక సంస్థ శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు రోడ్లపై బహిరంగంగానే చెత్త డబ్బాలు ఏర్పాటు చేస్తుండగా... చెత్త డబ్బాలు నిండిపోయి రోడ్లపై ఇష్టానుసారంగా చెత్త వేస్తుండడంతో పరిసరాలన్నీ అధ్వానంగా మారుతున్నాయి. స్మార్ట్‌సిటీగా అవతరించి యేడాది గడుస్తున్నా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకొంది. దీంతో నగరపాలక సంస్థ చెత్త నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది. మొదటి విడతలో స్మార్ట్‌సిటీ హోదా దక్కించుకుని అభివృద్ది పథంలో నడుస్తున్న నగరాలకు ధీటుగా కరీంనగర్ స్మార్ట్‌సిటీని అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా నరగపాలక సంస్థ పరిధిలోని పారిశుధ్య పనుల నిర్వహణను మెరుగుపర్చేందుకు చర్యలు చేపడుతున్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో నగరాన్ని పరిశుభ్రంగా మార్చడానికి నిదులు కేటాయిస్తున్నారు. ఇళ్ల నుంచి వచ్చే చెత్తను తగ్గించడం, తడి, పొడి, చెత్తను వేరు చేసి తీసుకెళ్లాలనే నిబంధనలు అమలుపై దృష్టిసారించారు. ఇప్పటికే వీధుల్లో సేకరించిన చెత్తను కుదించడం కోసం కొత్తగా కంప్యాక్టర్ డబ్బాలు, వాహనాలు కొనుగోలు చేశారు. వీటిని ప్రతి డివిజన్లో ఏర్పాటు చేయగా అందులో చెత్తను వేసి, ప్రత్యేక వాహనాల్లో డంప్‌యార్డుకు తరలిస్తున్నారు. స్మార్ట్‌గా కనబడేందుకు... కరీంనగర్‌ను స్మార్ట్‌గా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. స్మార్ట్‌సిటీ నగరంలోని ప్రధాన రహదారులను, రద్దీ ప్రాంతాల రోడ్లను అందంగా తీర్చిదిద్దేందుకు అధికారులు టెండర్లు నిర్వహించే పనిలో ఉన్నారు. మూడు ప్యాకేజీల కింద రహదారుల నిర్మాణానికి టెండర్లు నిర్వహించగా వాటికి సాంకేతిక సమస్యలు రావడంతో వాటిని తిరిగి టెండర్లు పిలిచారు. వాటిని కూడా త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. అదే విధంగా పేస్–2లో అంతర్గత రోడ్లను వేయనున్నారు. రోడ్డు వేయడానికంటే ముందే అండర్‌గ్రౌండ్ డస్ట్‌బిన్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. చెత్త కనబడకుండా... నగర వీధుల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త దర్శనమిస్తోంది. దీంతో వీధులన్నీ అధ్వానంగా మారుతున్నాయి. ప్రధాన రహదారులపై చెత్త కనిపించకుండా అండర్ గ్రౌండ్లో స్మార్ట్ డస్ట్‌బిన్స్ ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన రహదారులపై చెత్త బహిరంగంగా కన్పించకుండా నూతన విధానం వైపు అడుగులు వేస్తున్నారు. అండర్‌గ్రౌండ్ చెత్త డబ్బాలను 14 ప్రాంతాల్లో 20 డబ్బాలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టారు. వీటికి స్మార్ట్‌సిటీలో రూ.1.5 కోట్లతో కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. స్థలాల ఎంపిక.. స్మార్ట్‌బిన్స్ ఏర్పాటు చేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు స్థలాలను సైతం ఎంపిక చేశారు. ఆర్టీసీ బస్టాండ్ వెనుక భాగంలో, ప్రభుత్వ ఆసుపత్రి వెనుకబాగంలో, ఎస్సారార్ కళాశాల వద్ద నున్న మార్కెట్లో, సర్కస్‌గ్రౌండ్‌లో, సాయినగర్‌లో, ఆదర్శనగర్‌లో, అన్నపూర్ణకాంప్లెక్స్ పార్కింగ్ స్థలంలో, వారసంతలో, మహిళా డిగ్రీ కళాశాల సమీపంలో, మార్కెట్ రిజర్వాయర్ ఎదురుగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ వెనుక, ప్రభుత్వాసుపత్రి వెనుక భాగంలో మొదట వీటిని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత దశల వారీగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్ డస్ట్బిన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ డస్ట్బిన్ల ఏర్పాటు పూర్తయితే రోడ్ల వెంట చెత్త ఇక కనబడదని అధికారులు భావిస్తున్నారు. -
స్మార్ట్ స్ట్రీట్
నగరంలో ఓ మార్గం. వినోద్ రోడ్డు మీద నడుస్తున్నాడు. రోడ్డంటే రోడ్డనుకునేరు.. ఇప్పటి ఫుట్‌పాత్‌కు భిన్నంగా భేషుగ్గా ఉన్న పాదచారుల మార్గంలో అతడు అడుగేస్తున్నాడు. గమ్యానికి వేగంగా చేరాలనిపించింది. బస్టాప్‌లో నిల్చున్నాడు.. అది కూడా మామూలుగా లేదు. వైఫై ఈజీగా అందుబాటులో ఉంది. హంగు చాలానే ఉంది. జీపీఎస్ కారణంగా ఆ దారిలో బస్సులు ఏవేవి ఎక్కడున్నాయో కళ్లెదురుగా స్క్రీన్ మీద కనిపిస్తోంది. దాన్ని చూస్తే బస్సులు దరిదాపుల్లో లేవని అర్థమైపోయంది. ఇంకెందుకు ఆలస్యం? అని వినోద్ రెండడుగులు వేసి అక్కడే ఉన్న బైక్ షేరింగ్ ఐలండ్‌కు వెళ్లి వివరాలు తెలిపి స్మార్ట్‌గా ఉన్న సైకిల్ తీసుకున్నాడు. సైక్లింగ్ ట్రాక్‌లో హుషారుగా సైకిల్ తొక్కుతూ గమ్యానికి ముందే చేరుకున్నాడు. సైకిల్ అక్కడే వదిలేసి నాలుగడుగుల్లో ఆఫీసుకు ఎంచక్కా వెళ్లాడు. దారంతా పచ్చని మొక్కల మధ్యలో ప్రయాణించి, కనువిందైన హరిత ఐలెండ్లు దాటుకుంటూ రావడంతో విసుగన్నదే లేకుండా హుషారుగా పనిలో మునిగిపోయాడు... ఇదంతా ఏ దేశంలోనో అనుకుని నిట్టూరుస్తున్నారా.. ఆగండాగండి.. ఈ హంగులన్నీ వేరే చోట కాదు.. మన వైజాగ్‌లోనే. దాదాపు రెండేళ్ల వ్యవధిలో ఇవన్నీ మన వీధుల్లోనే వాస్తవాలు కాబోతున్నాయి. ఈ స్మార్ట్ స్ట్రీట్స్ కోసం జీవీఎంసీ ఉత్తుత్తి మాటలు చెప్పడం లేదు. గట్టి ప్రయత్నాలే చేస్తోంది. విశాఖసిటీ: మహా నగరం మరింతగా స్మార్ట్ హంగుల్ని సంతరించుకోబోతోంది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా వీధుల్ని ఆకర్షణీయంగా మార్చేందుకు మహా విశాఖ నగర పాలక సంస్థ సమాయత్తమవుతోంది. నాలుగు ప్రాజెక్టులుగా విభజించి 19.43 కిలోమీటర్ల మేర వీధుల రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆకట్టుకునే ఐలాండ్స్, సైక్లింగ్ ట్రాక్‌లతో పాటు వైఫై స్పాట్లతో కూడిన అనేక మౌలిక సదుపాయాలతో ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. విశాల విశాఖ నగర వీధులు జిగేల్మననున్నాయి. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.400 కోట్లు మాత్రమే విడుదల చేశాయి. ఈ నిధులకు సంబంధించిన పనులు పూర్తయిన వెంటనే.. మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు మంజూరు చేయించుకునేందుకు జీవీఎంసీ చకచకా ప్రణాళికలు సిద్ధం చేసేస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 23నæ 9 స్మార్ట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించింది. ఈ ప్రాజెక్టుల్లో ముఖ్యమైనది స్మార్ట్ స్ట్రీట్స్ పథకం. మహా నగరంలో వీధులు తళుక్కుమనేలా.. రూపొందించేందుకు డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టు ఆకట్టుకునేలా ఉంది. దీనికోసం ఆయా శాఖల సమన్వయం అవసరమైనందున ఇప్పటికే వీఎంఆర్డీఏ, ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీసీ అధికారులు, ఈపీడీసీఎల్ సిబ్బంది, బీఎస్ఎన్ఎల్ అధికారులతో జీవీఎంసీ పలు దఫాలుగా సమావేశం నిర్వహించింది. రూ.164 కోట్లతో ఏబీడీ ప్రాంతంలో 19.43 కిలోమీటర్ల విస్తీర్ణంలో 20 రహదారుల్ని స్మార్ట్ స్ట్రీట్స్‌గా అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. షాపూర్జీ పల్లాన్జీ సంస్థ ఈ పనుల టెండర్‌ను దక్కించుకుంది. రూపాంతరమిలా.. ♦ స్మార్ట్ వీధుల్ని రహదారులకు ఇరువైపులా అభివృద్ధి చేస్తారు. సుమారు 6.4 మీటర్ల వెడల్పు వంతున వీటిని తీర్చిదిద్దుతారు. ♦ రోడ్డుకు ఇరువైపులా సైకిల్ ట్రాక్‌లు, వాకింగ్ ట్రాక్‌లు వేర్వేరుగా ఏర్పాటు చేస్తారు. ♦ 1.5 మీటర్ల సైకిల్ ట్రాక్, 2.5 మీటర్ల వాకింగ్ ట్రాక్ ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ♦ పాదచారులకు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు కానుంది. ♦ రహదారికి ఇరువైపులా వాకింగ్ ట్రాక్‌లలో బఫర్ ప్రాంతాల్లో పచ్చదనం పరచుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ♦ అక్కడక్కడా వైఫై స్పాట్లను ఏర్పాటు చేయనున్నారు. ♦ బీచ్‌రోడ్డులో ప్రస్తుతం ఉన్న పబ్లిక్ బైక్ షేరింగ్ ప్రాజెక్టును స్మార్ట్ స్ట్రీట్స్‌కు విస్తరించనున్నారు. మొత్తం 80 పబ్లిక్ బైక్ షేరింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ♦ ఈ ప్రాజెక్టులో మొత్తం 8 జంక్షన్లు వస్తాయి. ప్రతి జంక్షన్‌లోనూ స్మార్ట్ ఐలాండ్ ఏర్పాటు కానుంది. ♦ ఈ ఐలాండ్స్‌లో ల్యాండ్ స్కేపింగ్ చేసి, మొక్కలు, రంగులు వేసి ఆకర్షణీయంగా మారుస్తారు. మరికొన్ని ఐలాండ్స్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేయనున్నారు. ♦ హరిత రహదారి విస్తరణకు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయనున్నారు. ♦ వాణిజ్య ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ♦ బస్టాపులో భద్రత, సౌకర్యం, పూర్తిస్థాయి బస్సు సమాచారం ఎప్పటికప్పుడు అందించే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ♦ ఈ బస్టాపులు సోలార్ వ్యవస్థతో రూపుదిద్దుకోనున్నాయి. ♦ రహదారి మధ్యలో సేదతీరేందుకు వసతి స్థలాలు, విశ్రాంతి తీసుకునే షెడ్లు ఏర్పాటు చేయనున్నారు. 20 రహదారులు.. 19.43 కి.మీ. నగరంలోని 20 రహదారుల్ని స్మార్ట్ వీధులుగా అభివృద్ధి చేయనున్నారు. మొత్తం 19.43 కిలోమీటర్ల పరిధిలో ఈ వీధులు స్మార్ట్ కానున్నాయి. కేజీహెచ్ డౌన్రోడ్లో 1.08 కిలోమీటర్లు, కేజీహెచ్ అప్‌లో 0.45 కి.మీ. జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి నోవాటెల్ డౌన్ వరకూ 1.96 కి.మీ., కలెక్టర్ ఆఫీస్ నుంచి నౌరోజీ రోడ్ వరకూ 0.93 కి.మీ., నౌరోజీ రోడ్లో 1.37 కి.మీ., హార్బర్రోడ్లో 3.2 కి.మీ., వాల్తేర్ మెయిన్రోడ్లో 4.91 కి.మీ., చినవాల్తేర్ రోడ్లో 2.07 కి.మీ., నౌరోజీ రోడ్ నుంచి ఆలిండియా రేడియో దారిలో 0.98 కి.మీ., దసపల్లా హిల్స్ రెసిడెన్షియల్ రోడ్లో 0.87 కి.మీ. మేర స్మార్ట్ స్ట్రీట్స్‌గా అభివృద్ధి చెందనున్నాయి. రెండేళ్లలో పూర్తి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా విశాఖ నగర వీధుల్ని ఆకర్షణీయమైన వీధులుగా తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతున్నాం. స్మార్ట్ స్ట్రీట్స్‌కు సంబంధించిన డిజైన్ల రూపకల్పన ప్రారంభించారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. 18 నుంచి 24 నెలల్లో పనులు పూర్తి చేసి స్మార్ట్ వీధుల్ని నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. జీవనశైలి సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య నగరంలో పెరుగుతున్న నేపథ్యంలో.. వారికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఈ తరహా స్మార్ట్ స్ట్రీట్స్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నాం. – హరినారాయణన్, జీవీఎంసీ కమిషనర్.