Super Specialty Hospital
-
మార్కాపురం కిడ్నీ బాధితులకు ప్రభుత్వం భరోసా
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రకాశం జిల్లా మార్కాపురం పరిసర ప్రాంతాల్లో కిడ్నీ సమస్య బాధితులపై ప్రత్యేక దృష్టి సారించింది. వీరికి ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయనుంది. ఇందులో భాగంగా మార్కాపురంలో నూతనంగా ప్రారంభించబోతున్న ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన బోధనాస్పత్రిలో నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే నెఫ్రాలజీ విభాగం ఏర్పాటు కోసం 21 పోస్టులను కొత్తగా మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూరాలజీ విభాగం ఏర్పాటుకు పోస్టులు మంజూరు చేస్తూ శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024–25 విద్యా సంవత్సరంలో మార్కాపురం వైద్య కళాశాల ప్రారంభం కానుంది. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) నిబంధనల ప్రకారం.. ఎంబీబీఎస్‌లో ప్రవేశాలు ప్రారంభించడానికి నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాల ఏర్పాటు తప్పనిసరి కాదు. అయినప్పటికీ మార్కాపురం ప్రాంత కిడ్నీ సమస్యల బాధితులకు వైద్య సేవలను చేరువ చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. ఇందులో భాగంగానే ఆ రెండు విభాగాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే గత నాలుగు దశాబ్దాల ఉద్దానం కిడ్నీ సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రూ.700 కోట్లతో వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్‌ను చేపట్టి కిడ్నీ సమస్యల ప్రభావిత గ్రామాలకు మంచినీటి సరఫరాను చేపట్టింది. అదే విధంగా రూ.85 కోట్లతో శ్రీకాకుళం జిల్లా పలాసలో డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని, 200 పడకలతో ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. వీటిని కొద్ది రోజుల క్రితం సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. -
ఉద్దానానికి ఊపిరి పోసిన సీఎం జగన్
నాడు... ఉద్దానం ప్రాంతంలో ఎందుకు పుట్టామా అన్న అవేదనే నిత్యం వారిని వెంటాడుతుండేది. అప్పటికే దాదాపు ప్రతి ఇంటా ఒకరిద్దరు కిడ్నీ వ్యాధుల బారిన పడ్డారు. కదలలేక మంచానికే పరిమితమయ్యారు. వైద్యం పేరుతో ఇళ్లు గుల్లయిపోతున్నాయి. ఇళ్లూ, ఆస్తులు అమ్ముకున్నా, మందులకు, డయాలసిస్‌కు డబ్బు చాలని పరిస్థితి. 40 ఏళ్లగా ఉద్దానం ప్రాంతం దయనీయజీవితమిది. పాలకులు మారుతున్నారుగానీ అక్కడి సమస్యను ఎవరూ పరిష్కారించలేదు. రాష్ట్రంలో అత్యంత సుదీర్ఘకాలం సీఎంగా పని చేసిన చంద్రబాబు గొప్ప విజనరీగా ప్రచారమైతే చేసుకుంటారు కానీ, ఉద్దానం వైపు కన్నెత్తి చూడలేదు. అక్కడి ప్రజల సమస్యకు పరిష్కారానికి చూపలేదు. కనీసం విభజన అనంతరం ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసినా, ఉద్దానం వ్యధను పట్టించుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వానికి ఎన్నికల ముందు, తర్వాత పూర్తిగా మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్లి వచ్చారు. చాలా మాటలే చెప్పారు. వచ్చేశారు. వారి సమస్య పరిష్కారానికి వీసమెత్తు పరిష్కారం చూపలేదు. పైగా, అక్కడి ప్రజల బాధలను రాజకీయంగా మాత్రమే వాడుకున్నారు. తన వల్లే ఆ ప్రజల సమస్య వెలుగులోకి వచ్చిందని ప్రచారం చేసుకొనే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఉద్దానం ఊసే మరిచారు. ఆ సమయంలో.. 2017లో అప్పటి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా ఉద్దానం ప్రాంతానికి వచ్చారు. అక్కడి ప్రజలతో ముఖాముఖీ భేటీ అయ్యారు. వారి సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. అక్కడ కిడ్నీ వ్యాధులు ప్రబలడానికి కారణాలను లోతుగా పరిశీలించారు. ఏమి చేస్తే ఉద్దానం ప్రజల ఆరోగ్యం బాగుపడుతుందో ఓ ప్రణాళిక రూపొందించారు. ఏడాది కూడా గడవక ముందే.. 2018 డిసెంబరు 31న మరోసారి ఉద్దానానికి వెళ్లారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక, ఆ ప్రాంతంలోని ప్రతి కిడ్నీ బాధితుడికి తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. అక్కడే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కలుషిత నీరు కారణంగా ఈ సమస్య వస్తుందని, ఆ ప్రాంతానికి మంచి నీటిని అందించేందుకు ప్రత్యేకంగా రిజర్వాయర్ నిర్మిస్తామని చెప్పారు. అక్కడి నుంచి నీటిని పైపులైన్ ద్వారా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. నేడు... 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. జగన్ సీఎం అయ్యారు. బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలు కూడా పూర్తి కాక మునుపే.. 2019 సెపె్టంబరు 6న రూ. 700 కోట్లతో ఉద్దానం ప్రాంతం రక్షిత మంచి నీటి పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలోనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చి సెంటర్‌కు కూడా శంకుస్థాపన చేశారు. మధ్యలో.. కరోనా విపత్తు వచ్చి పనులేవీ ముందుకు సాగక ఆటంకాలు కలిగినా.. పట్టుదలగా నాలుగేళ్లలోనే భగీరధ ప్రయత్నం పూర్తి చేశారు. గురువారం రూ.700 కోట్లతో నిర్మించిన రక్షిత మంచి నీటి పథకానికి, రూ.85 కోట్లతో నిరి్మంచిన కిడ్నీ రీసెర్చి సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ప్రారం¿ోత్సవం చేశారు. పరిష్కారమూ సమగ్రంగా, శాశ్వతంగా.. సాధారణంగా.. వందల కోట్లు ఖర్చు పెట్టి రక్షిత మంచి నీటి పథకం నిర్మాణం చేపట్టినా, నీరు అందుబాటులో లేకపోతే అంతటి పథకమూ వృథా అవుతుంది. ఉద్దానం రక్షిత మంచి నీటి పథకం విషయంలోనూ అధికారులు ఇలాంటి సందేహాన్ని సీఎం జగన్ వద్ద ప్రస్తావించారు. మనం చూపే పరిష్కారం శాశ్వతంగా, సమగ్రంగా ఉండాలని సీఎం జగన్ వారికి స్పష్టం చేశారు. తక్కువ ఖర్చుతో ఉద్దానం ప్రాంత సమీపంలో ఉండే బహుదా, మహేంద్ర తనయ నదుల నుంచి రక్షిత నీటి సరఫరాకు అవకాశం ఉంది. అయితే, వేసవిలో ఆ నదులు ఎండిపోతే అక్కడి ప్రజలు బోరు నీటిని తాగక తప్పదని జగన్ సర్కారు ఆ ప్రతిపాదనను మొదట్లోనే పక్కనపెట్టింది. ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండేలా ఖర్చు ఎక్కువైనా వెనుకాడకుండా ఆ ప్రాంతానికి 104 కి.మీ.కి పైగా దూరంలోని హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటి తరలింపునకు ప్రణాళిక రూపొందించింది. ఉద్దానం ప్రాంతం మొత్తానికి ఏడాది పొడవునా ఒక టీఎంసీ కన్నా తక్కువ నీరు అవసరం ఉండగా.. ïహిరమండలం రిజర్వాయర్ కనీస నీటి మట్టం స్ధాయిలోనూ 2.67 టీఎంసీలు అందుబాటులో ఉంటుంది. అందువల్ల ఇక్కడి నుంచి నీటిని తరలించాలని నిర్ణయించారు. ఏకంగా 1,047 కి.మీ. పొడవున భూగర్భ పైపులైన్లు నిర్మించారు. ఇప్పుడు ఉద్దానం వాసులకు నీటి బెంగ లేదు. నిత్యం స్వచ్ఛమైన నీరు అందుతుంది. అందుబాటులో అత్యాధునిక ఆసుపత్రి ఉంది. కిడ్నీ వ్యాధుల రీసెర్చి సెంటరూ ఉంది. 40 ఏళ్ల ఉద్దానం ప్రాంత కిడ్నీ సమస్యకు పరిష్కారం చూపి, ఆ ప్రాంతానికి ఊపిరి పోసిన సీఎం జగన్‌కు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. -
ఉద్దానం సమస్యకు ఇక శాశ్వత పరిష్కారం
సాక్షి, అమరావతి: ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోంది. దీంతో వారి కష్టాలు తీరనున్నాయి. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ – 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఉద్దానం ప్రాంతంలో కళ్లెదుటే కిడ్నీ సమస్య కనిపిస్తున్నా గతంలో ఎవరూ దీనికి పరిష్కారం చూపడానికి కూడా సాహసించలేదు. ఇలాంటి పరిస్థితిలో వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.785 కోట్లు భారీ వ్యయం చేసి మరీ.. ఉద్దానం వ్యాధిగ్రస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపింది. వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్– 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు, అలాగే అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు.. మూడు బ్లాకులుగా నాలుగు అంతస్తుల్లో ఆస్పత్రి నిర్మాణం. క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్ ల్యాబ్‌తో ప్రత్యేక వార్డులు. సీటీ స్కాన్, 2డీ ఎకో, హై ఎండ్ కలర్ డాప్లర్, మొబైల్ ఎక్స్ రే (డిజిటల్), థూలియం లేజర్ యూరో డైనమిక్ మెషీన్ తదితర పరికరాలతో పాటు ఐసీయూ సౌకర్యాలు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఇప్పటికే 42 స్పెషాలిటీ డాక్టర్ పోస్టులు, 60 స్టాఫ్ నర్సు పోస్టులు, 60 ఇతర సహాయ సిబ్బంది పోస్టుల భర్తీ. వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్.. ఉద్దానం ప్రాంతంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు (క్రానిక్ కిడ్నీ డిసీజెస్) ప్రబలంగా ఉన్న ఏడు మండలాల్లోని అన్ని గ్రామాలకు ‘వైఎస్సార్ సుజలధార‘ ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేసిన రక్షిత తాగునీరు. హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుని శుద్ధి చేసి పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలో 7 మండలాల్లోని 807 గ్రామాలకు రక్షిత నీటి సరఫరా. ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న 6.78 లక్షల జనాభా 2051 నాటికి 7.85 లక్షలకు చేరుతుందన్న అంచనాతో అప్పటి అవసరాలకు కూడా సరిపోయేలా ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటి సరఫరా చేసేలా ప్రాజెక్టు నిర్మాణం. ఇప్పటికే 613 గ్రామాలకు నీటి సరఫరా.. ఈ నెలాఖరుకు మిగిలిన గ్రామాలకు. ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు.. ♦ గత ప్రభుత్వంలో డయాలసిస్ రోగులకు కేవలం రూ.2,500 చొప్పున పింఛన్ ఇస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాన్ని ఏకంగా రూ.10 వేలకు పెంచింది. ప్రతి నెలా 1న ఠంఛన్‌గా లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దే వలంటీర్లతో అందజేస్తోంది. ♦ ఇప్పటికే టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో 74 మెషీన్లతో డయాలసిస్ సేవలు. ఇలా వరుసగా 2019–20లో 37,454 సెషన్లు, 2020– 21లో 46,162 సెషన్లు, 2021–22లో 54,520 సెషన్లు, 2022–23లో 55,520 సెషన్లు, 2023–24లో (అక్టోబర్ నాటికి) 38,513 సెషన్ల చొప్పున కిడ్నీ బాధితులకు ప్రభుత్వం డయాలసిస్ సేవలు అందించింది. ఇప్పుడు దీనికి అదనంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు కిడ్నీ రీసెర్చ్ సెంటర్–సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ♦వైద్య పరీక్షల కోసం ఉద్దానం ప్రాంతంలోని 18 పీహెచ్‌సీలు, 5 యూపీహెచ్‌సీలు, 6 సీహెచ్‌సీల్లో సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్ ఏర్పాటు. గత టీడీపీ ప్రభుత్వంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులు మాత్రమే.. అది కూడా అరకొరగా అందజేశారు. ప్రస్తుతం ఇక్కడ ప్రతి ఆస్పత్రిలో 37 రకాల మందులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. కొత్త కేసుల గుర్తింపునకు నిరంతరాయంగా స్క్రీనింగ్ కొనసాగుతోంది. స్క్రీనింగ్ అనంతరం అనుమానిత లక్షణాలున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించి సీరమ్ క్రియాటినిన్ పరీక్షల కోసం సమీపంలోని పీహెచ్‌సీలకు తరలిస్తున్నారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో పనిచేసే సీహెచ్‌వోలకు ప్రత్యేక యాప్. ఉద్దానం సమస్యలకు సంబంధించి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా.. జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్ నేడు సీఎం పర్యటన ఇలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించనున్నారు. ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసం నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరి 10.30 గంటలకు కంచిలి మండలం మకరాంపురం గ్రామానికి హెలికాప్టర్లో వస్తారు. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించి 11.10 గంటలకు వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు పంప్‌హౌస్ స్విచ్ నొక్కి దాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పలాస వెళ్తారు. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించి 11.40 గంటలకు కిడ్నీ పరిశోధన కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ ఆస్పత్రిని ప్రారంభించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఇండ్రస్టియల్ కారిడార్‌కు శంకుస్థాపన చేస్తారు. అలాగే ఎచ్చెర్లలోని బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన వసతి గృహ భవనాన్ని వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. ఆ తర్వాత పాత జాతీయ రహదారి మీదుగా పలాస రైల్వే క్రీడా మైదానానికి చేరుకుంటారు. సభా ప్రాంగణంలో స్టాల్స్‌ను పరిశీలించి బహిరంగ సభలో మాట్లాడతారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తిరిగి హెలికాప్టర్లో విశాఖకు బయలుదేరతారు. -
చిన్నారుల ఆరోగ్యానికి రక్ష
-
చిట్టి గుండెకు గట్టి భరోసా
‘‘ముక్కుపచ్చలారని ఏ చిన్నారి కూడా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడకూడదు. వ్యాధిబారిన పడ్డ నా బిడ్డను కాపాడుకోలేకపోయాననే వేదన ఏ ఒక్కరూ పడకూడదు. ఇందుకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరించాలి. ఆ బాధ్యత నాది’’.. .. అంటూ చిన్నపిల్లల గుండె సంబంధిత చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చి వివిధ ప్రముఖ ఆసుపత్రుల్లో వైద్య సహాయం అందించేలా దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కృషిచేశారు. 2003లో ఆయన చెప్పిన ఈ మాటలను కార్యరూపం దాల్చేలా 2004లో నిర్ణయం తీసుకుని పసిగుండెలకు సాంత్వన చేకూర్చారు. ఇప్పుడాయన వారసుడిగా సీఎం జగన్ మరో అడుగు ముందుకేసి చిన్నపిల్లల గుండె సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఓ ఆస్పత్రినే నిర్మించాలని సంకల్పించారు. మరెక్కడా ఇలాంటి సమస్యల కోసం ప్రత్యేకంగా ఓ ఆసుపత్రి లేకపోవడంతో చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దీనికి బీజం వేశారు. అనుకున్నట్లుగానే అత్యాధునిక వైద్య సదుపాయాలతో శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి తిరుపతిలో విజయవంతంగా అంకురార్పణ చేశారు. (వడ్డే బాలశేఖర్, శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయం నుంచి సాక్షి ప్రతినిధి) వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చీరాగానే సీఎం వైఎస్ జగన్ ప్రజారోగ్య వ్యవస్థను పట్టాలెక్కించి పరుగులు పెట్టించారు. పిల్లలకు ప్రభుత్వరంగంలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవల బలోపేతంపైనా దృష్టిసారించారు. ఇందులో భాగంగా టీటీడీ సహకారంతో తిరుపతిలో చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా శ్రీపద్మావతి హృదయాలయాన్ని ప్రారంభించారు. ఇప్పుడు పిల్లల గుండె చికిత్స కోసం బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలకు వెళ్లే పనిలేకుండా పోయింది. 1,980 మంది చిన్నారులకు పునర్జన్మ ఇక ఈ రెండేళ్లలో 14,800 ఓపీ సేవలు ఈ ఆస్పత్రిలో నమోదయ్యాయి. వీరిలో పుట్టుకతో వచ్చిన గుండె సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు ఓపెన్ హార్ట్, కీ హోల్, వంటి ఇతర సర్జరీలు పెద్దఎత్తున నిర్వహించారు. మరికొందరికి మెడికల్ మేనేజ్మెంట్ చేశారు. ఇలా 1,980 మందికి పైగా చిన్నారులకు పునర్జన్మను ప్రసాదించారు. వీరిలో మెజారిటీ శాతం నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల వారే. ఆరోగ్యశ్రీ కింద వీరికి పూర్తి ఉచితంగా వైద్యసేవలన్నింటినీ అందించారు. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ కింద 2,052 ప్రొసీజర్లు రెండేళ్లలో నమోదయ్యాయి. చిన్నారులతో పాటు, పెద్దలకు సైతం గుండె మార్పిడి ఆపరేషన్లను చేపట్టారు. ఇప్పటివరకూ ఏడు గుండె మార్పిడి ఆపరేషన్లు ఇక్కడ నిర్వహించారు. ఒక్కో ఆపరేషన్‌కు రూ.10 లక్షల వరకూ ఖర్చుకాగా ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరించింది. గుండె మార్పిడి, ఇతర చికిత్సల కోసం సీఎంఆర్ఎఫ్ కింద కూడా అదనంగా సహాయం అందింది. 75 పడకలున్న ఈ ఆస్పత్రిలో 15 మంది నిష్ణాతులైన వైద్యులు సేవలు అందిస్తున్నారు. అడ్వాన్స్ క్యాథ్‌ల్యాబ్, మెడికల్ ల్యాబ్, ఎక్స్‌రే, ఈసీజీ పరికరాలతో పాటు, ఆపరేషన్ థియేటర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆసుపత్రికి తిరుపతి బస్టాండ్, రైల్వేస్టేషన్ నుంచి సులభంగా ఆటోలో వెళ్లొచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఆధార్, ఆరోగ్యశ్రీ కార్డులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే.. బాధితులతో వచ్చే అటెండర్లలో ఒకరు ఇక్కడ ఉండొచ్చు. ఇక ఈ ఆసుపత్రి ఇటీవలే ఉత్తమ పీడియాట్రిక్ కార్డియాక్ సెంటర్‌గా గుర్తింపు పొందింది. ఆసియా టుడే రీసెర్చ్ అండ్ మీడియా సంస్థ ప్రైడ్ ఆఫ్ నేషన్‌గా ఈ అవార్డును ప్రకటించగా తెలంగాణ గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం డైరెక్టర్ డా.శ్రీనాథరెడ్డి దానిని అందుకున్నారు. త్వరలో మరో సూపర్ స్పెషాలిటీ.. మరోవైపు.. తిరుపతి జిల్లా అలిపిరి వద్ద శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా నిర్మిస్తున్నారు. రూ.450 కోట్ల వ్యయంతో, అత్యాధునిక ప్రమాణాలతో దీనిని ఏర్పాటుచేస్తున్నారు. హెమటో ఆంకాలజి, మెడికల్ ఆంకాలజి, సర్జికల్ ఆంకాలజి, న్యూరాలజి, కార్డియాలజీ, నెఫ్రాలాజి, గ్యాస్ట్రో ఎంట్రాలజి లాంటి 15 రకాల సూపర్‌స్పెషాలిటీ విభాగాల్లో చిన్నారులకు వైద్యసేవలు, చికిత్సలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇదే తరహాలో విశాఖపట్నం, గుంటూరు, విజయవాడల్లోను పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఇటీవల వైద్యశాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ ఫొటోలోని సుర్ల శివ, పార్వతి దంపతులది పార్వతిపురం మన్యం జిల్లా నర్సిపురం. ఎనిమిది నెలల క్రితం వీరికొక కొడుకు ప్రన్షు పుట్టాడు. చిన్నారికి ఆరోగ్యం బాగోకపోవడంతో విశాఖలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారి గుండెలో రంధ్రంతో పాటు.. చెడు, మంచి రక్తం కలుస్తున్నాయని వైద్యులు పిడుగులాంటి వార్త చెప్పారు. ఆపరేషన్‌కు రూ.25 లక్షలు ఖర్చవుతుందన్నారు. అంత స్థోమత ఆ దంపతులకు లేదు. అదే సమయంలో తిరుపతిలో శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో చికిత్స గురించి తెలిసిన వాళ్లు చెప్పారు. వెంటనే అక్కడ తీసుకెళ్లగా చిన్నారికి పరీక్షలు చేసి ఒక్కరూపాయి కూడా ఖర్చుకాకుండా ఆరోగ్యశ్రీ కింద స్టెంట్లు వేశారు. చిన్నారి కోలుకుని బరువు పెరిగాక గుండె రంధ్రానికి కూడా ఇక్కడే ఉచితంగా ఆపరేషన్ చేయనున్నారు. ‘ఇక నాకు పిల్లలు పుట్టే అవకాశంలేదు. బాబుకు ఏదైనా జరిగితే ఎలా అని నేను ఏడవని రోజులేదు. ఈ రోజు నా బిడ్డ ప్రాణాలతో ఉన్నాడంటే అది ఒక్క సీఎం జగన్ వల్లే’.. అంటూ పార్వతి భావోద్వేగంతో కన్నీరు పెట్టుకుంది. ఈ ఫొటోలోని అన్నమయ్య జిల్లా మంగపట్నంకు చెందిన గంగాదేవి వ్యవసాయ కూలీ. మంచం మీద నిద్రపోతున్న చిన్నారి ఈమె కుమారుడు.. పేరు దేవాన్‡్ష. ముగ్గురు ఆడపిల్లల అనంతరం కలిగిన మగ సంతానం. అయితే, పుట్టుకతోనే గుండె సమస్య వచ్చిపడింది. రెక్కాడితే కానీ డొక్కాడని వీరికి ఆపరేషన్ చేయించే స్థోమతలేదు. గంగాదేవి కుమారుడి ప్రాణాలను ఆరోగ్యశ్రీ, హృదయాలయం రూపంలో ప్రభుత్వం ఆదుకుంది. తాముంటున్న ప్రాంతానికి కొద్దిదూరంలోని తిరుపతిలో ఆపరేషన్ చేస్తున్నారని తెలిసి బాబును ఇక్కడికి తీసుకొచ్చింది. ఏ సిఫార్సు, చేతి నుంచి ఒక్క రూపాయి ఖర్చులేకుండా చిన్నారికి ఆపరేషన్ పూర్తయింది. ‘కుటుంబ పోషణే భారమైన మాకు కొడుకు ఆరోగ్య సమస్యతో పెద్ద చిక్కొచ్చి పడింది. కానీ, కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం నా బిడ్డకు ఉచితంగా ఆపరేషన్ చేయించింది’.. అని అంటున్న గంగాదేవి ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. ..ఈ ఇద్దరు చిన్నారుల తరహాలోనే పుట్టుకతో తీవ్రమైన గుండె సమస్యలున్న వందల మంది చిన్నారులకు శ్రీపద్మావతి చిన్న పిల్లల హృదయాలయం అక్కున చేర్చుకుని పునర్జన్మను ప్రసాదించింది. 11 అక్టోబరు 2021 అక్టోబరు 11న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మానసపుత్రికను ప్రారంభించారు. ఆస్పత్రికి వచ్చే నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఒక్క రూపాయి ఖర్చులేకుండా ప్రభుత్వం ఆపన్న హస్తం అందిస్తోంది. విజయవంతంగా గుండె ఆపరేషన్లు నిర్వహిస్తూ అభాగ్యుల పాలిట వరంగా నిలుస్తున్న హృదయాలయాన్ని ‘సాక్షి’ పరిశీలించి రోగుల కుటుంబాలను పలకరిస్తే.. ఒకొక్కరిదీ ఓ కన్నీటి గాధ ఆవిష్కృతమైంది. సీఎం జగన్ నాకు పునర్జన్మనిచ్చారు గుంటూరులో ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తుంటాను. నాకు గుండె సంబంధిత సమస్యలుండటంతో హైదరాబాద్, గుంటూరు ఇలా చాలాచోట్ల చూపించుకున్నా. గుండె మార్పిడి చేయాలన్నారు. గతనెల 24న గుండె మార్పిడి చేశారు. ఈ ఆపరేషన్‌కు రూ.10 లక్షల పైనే ఖర్చవుతుందన్నారు. అయితే, నాకు ఒక్క రూపాయి కూడా ఖర్చుకాలేదు. మొత్తం ప్రభుత్వమే భరించింది. సీఎం జగన్ నాకు పునర్జన్మ ప్రసాదించారు. – ఎస్. సుమతి, వెల్దుర్తి, పల్నాడు జిల్లా నెలకు 120 సర్జరీలు..మొదట్లో ఇక్కడ నెలకు 30 ఆపరేషన్ల వరకూ చేసేవాళ్లం. ప్రస్తుతం నెలకు 100 నుంచి 120 చేస్తున్నాం. పెద్దల్లో కూడా పుట్టుకతో వచ్చిన స్ట్రక్చరల్ గుండె సమస్యలతో పాటు, గుండె మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నాం. 15 మంది నిపుణులైన వైద్యులు, ఇతర సిబ్బంది, అత్యాధునిక వైద్య పరికరాలున్న ఈ తరహా ఆస్పత్రి ప్రైవేట్‌లో కూడా ఎక్కడా ఉండదు. ఆస్పత్రి నిర్వహణ కోసం టీటీడీ పుష్కలంగా నిధులు అందిస్తోంది. ఇక పేద ప్రజలకు ఉచితంగా చికిత్సలు చేయడానికి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ రూపంలో పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోంది. త్వరలో అలిపిరిలో పీడియాట్రిక్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి కూడా అందుబాటులోకి వస్తుంది. – డాక్టర్ శ్రీనాథరెడ్డి, డైరెక్టర్, శ్రీపద్మావతి చిన్న పిల్లల హృదయాలయం -
టీటీడీ చిన్నారుల ఆస్పత్రికి సీఎం శంకుస్థాపన
సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీటీడీ తిరుపతిలో నిర్మించే శ్రీపద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అలిపిరి వద్ద ఆరు ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్ల వ్యయంతో 4,11,325 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీటీడీ చిన్నపిల్లల ఆసుపత్రిని నిర్మిస్తోంది. ► శ్రీపద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి, స్మైల్‌ట్రైన్ కాక్లియర్ ఇంప్లాంట్స్ దృశ్య మాలికను సీఎం పరిశీలించారు. వైద్యులు, గుండె ఆపరేషన్లు చేయించుకున్న చిన్న పిల్లల తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ► ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో లోగోను ఆవిష్కరించారు. ► బర్డ్ ఆస్పత్రిలో గ్రహణం మొర్రి, చెవుడు, మూగ చికిత్సల వార్డులను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ► తిరుపతి స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో టీటీడీ సహకారంతో నగరంలోని శ్రీనివాసం సర్కిల్ నుంచి వాసవి భవన్ సర్కిల్ వరకు తొలిదశలో నిర్మించిన 3 కి.మీ మేర వంతెన శ్రీనివాస సేతు ప్రారంభ శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. ► తిరుపతి నగర పాలక సంస్థ రూ.83.7 కోట్లతో నిర్మించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కు చెందిన ఐదు ప్లాంట్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో తడిచెత్త నుంచి గ్యాస్ తయారీ, ఎరువుల తయారీ, డ్రైవేస్ట్ రీ సైక్లింగ్, భవన నిర్మాణ వ్యర్థాల రీ సైక్లింగ్, 25 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన భూగర్భ డ్రైనేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉన్నాయి. డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డికి సీఎం సత్కారం టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీపద్మావతి హృదయాలయంలో 300 మందికి పైగా చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించిన ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శాలువతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందచేశారు. బర్డ్ ఆసుపత్రిలో గ్రహణ మొర్రి, చెవుడు, మూగ చికిత్సలకు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన స్మైల్ ట్రైన్ సంస్థ నిర్వాహకురాలు మమత కౌరల్‌ను ముఖ్యమంత్రి శాలువతో సన్మానించి స్వామివారి ప్రసాదాలు అందించారు. శ్రీపద్మావతి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భూమి పూజ సందర్భంగా గురువారం అలిపిరి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వీరిద్దరి సేవలను సీఎం జగన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. -
బాలల ఆరోగ్యానికి భరోసా
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పం మండలం లక్ష్మీపురానికి చెందిన ఈ చిన్నారి హర్షిత్‌కు రెండేళ్లు. పుట్టకతోనే గుండె సమస్యలున్నాయి. తల్లిదండ్రులు అనేక ఆస్పపత్రుల్లో చూపించారు. గుండెకు ఆపరేషన్ చేయాలని, రూ.లక్షల్లో ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. అంత ఖర్చుపెట్టే స్తోమత లేని తల్లిదండ్రులు గతేడాది నవంబర్‌లో తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయానికి వచ్చారు. హర్షిత్ గుండెకు వెళ్లే మంచి రక్తం, చెడు రక్తం కలిసిపోతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఇక్కడ ఉచితంగా ఆపరేషన్ చేసి సమస్యను పరిష్కరించారు. ► అనంతపురం జిల్లా ఎం.ఎన్.పి తండాకు చెందిన చిన్నారి బాలచంద్ర నాయక్‌కు మూడేళ్లు. చంద్ర నాయక్‌కు పుట్టుకతోనే గుండె సమస్యలున్నాయి. నిరుపేద కుటుంబం. పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంలో ఉచితంగా గుండె చికిత్సలు చేస్తున్నారని తల్లిదండ్రులు తెలుసుకున్నారు. గత ఏడాది చంద్రనాయక్‌ను ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు ఓపెన్ హార్ట్ (ఇంట్రా కార్డియాక్ రిపేర్) సర్జరీ చేశారు. ప్రస్తుతం చంద్రనాయక్ ఆరోగ్యంగా ఉన్నాడు. వీళ్లిద్దరే కాదు.. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వేలాది పిల్లల ఆరోగ్యానికి భరోసానిస్తోంది శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం. ఇప్పుడీ ఆస్పత్రి సేవలు విస్తరించనున్నాయి. శ్రీ పద్మావతి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా రూపాంతరం చెందుతోంది. బాలలకు గుండె సంబంధిత చికిత్సలతో పాటు, అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే దేశంలోనే అతిపెద్ద ఆస్పత్రిగా రూపు దిద్దుకుంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని అలిపిరి వద్ద దీనిని నిర్మిస్తున్నారు. రూ.300 కోట్లతో 350 పడకలతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. ఈ ఆస్పత్రికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. ఆస్పత్రి కోసం 6 ఎకరాల్లో జీ+6 భవనాన్ని నిర్మిస్తారు. భవన నిర్మాణానికి రూ.240 కోట్లు ఖర్చవుతుందని అంచనా. రూ.60 కోట్లతో అధునాతన వైద్య పరికరాలు, ఇతర వసతులు సమకూరుస్తారు. 18 నెలల్లో భవన నిర్మాణం పూర్తి చేసేలా టీటీడీ ప్రణాళిక రూపొందించింది. ఆస్పత్రిపైనే హెలీప్యాడ్ గుండె, కాలేయం, కిడ్నీలకు సంబంధించిన తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అవయవాలు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలి. ఇతర ప్రాంతాల నుంచి అవయవాలను ఇక్కడికి తరలించాల్సి వస్తుంది. అవయవాల తరలింపు ఆలస్యం అవకుండా ఆస్పత్రి భవనంపైనే ఎయిర్ అంబులెన్స్ దిగేలా హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సౌకర్యం దేశంలో అతి తక్కువ ఆస్పత్రుల్లో మాత్రమే ఉంది. అందుబాటులోకి వచ్చే సేవలు ఈ ఆస్పత్రిలో హెమటో అంకాలజీ, మెడికల్ అంకాలజి, సర్జికల్ అంకాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలాజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ లాంటి 15 రకాల ప్రత్యేక విభాగాల్లో చిన్నారులకు వైద్య సేవలు అందిస్తారు. అత్యంత ఖరీదైన బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్, గుండె, ఇతర అవయవాల మార్పిడి ఉచితంగా చేస్తారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇలాంటి ఆస్పత్రి దేశంలోనే మొదటిది కాబోతుంది. 2,020 మందికిపైగా చిన్నారులకు పునర్జన్మ గత ఏడాది అక్టోబర్ 11న పద్మావతి చిన్న పిల్లల హృదయాలయాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. 70 పడకలతో ఈ ఆస్పత్రిని చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 12 మంది స్పెషలిస్ట్ వైద్యులు పనిచేస్తున్నారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద ఇక్కడ ఇప్పటివరకు 2,020 మందికి పైగా చిన్నారులకు ఓపెన్ హార్ట్, కీ హోల్ సర్జరీలు చేశారు. ఉచితంగా అత్యాధునిక వైద్యం పద్మావతి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ద్వారా నిరుపేద, మధ్య తరగతి పిల్లలకు అత్యాధునిక వైద్యం ఉచితంగా అందుతుంది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద ఇక్కడ వైద్య సేవలు అందుతాయి. 15 రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయి. వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవస్థలు తప్పుతాయి. – డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం పిల్లలకు వైద్య సేవలపై సీఎం ప్రత్యేక దృష్టి రాష్ట్ర విభజనకు ముందు పిల్లల కోసం హైదరాబాద్‌లో నీలోఫర్ ఆస్పత్రి ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత చిన్న పిల్లల కోసం రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆస్పత్రి లేకుండాపోయింది. దీంతో పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ సేవల కోసం ప్రైవేటు ఆస్పత్రులపై ఆధారపడే పరిస్థితి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రకాల వైద్య సదుపాయాలను పేద కుటుంబాల పిల్లలకు అందుబాటులోకి తీసుకురావడంపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో చిన్న పిల్లల కోసం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ చొరవతో తిరుపతిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ప్రారంభమవుతోంది.విజయవాడ, విశాఖపట్నంలలోనూ పిల్లల ఆస్పత్రుల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. అత్యాధునిక లేబొరేటరీ, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ విభాగాలతో అత్యాధునిక ఆస్పత్రులు నిర్మించాలని భావిస్తోంది. ఇందుకోసం ఒక్కో ఆస్పత్రికి రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. -
ఉద్దానంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టండి
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ జబ్బుల బారిన పడుతున్న ప్రజలను ఆదుకునే విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఉద్దానం ప్రాంతంలో ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను తీర్చేలా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించి, తగినన్ని బెడ్లు, డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కిడ్నీ జబ్బు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచితంగా మందులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం తీర్పు వెలువరించింది. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ఉద్దానం ప్రజలకు ఉచితంగా వైద్య సాయం, మందులు అందించాలని, ఆ ప్రాంతంలో 500 పడకల ఆసుపత్రిని నిర్మించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది కరుకోల సింహాచలం, ఓ రిటైర్డ్ ఉపాధ్యాయులు వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం విచారణ జరిపి తీర్పునిచ్చింది. ‘ఉద్దానం ప్రాంతంలో జీడిపçప్పు పరిశ్రమలు, ఇటుక బట్టీల నుంచి కలుషిత పదార్థాలు, వ్యర్థాలు చెరువుల్లోకి వదలకుండా ప్రభుత్వం, స్థానిక సంస్థలు వాటి అధికారాలను ఉపయోగించాలి. ఉద్దానం ప్రాంతంలో ఆసుపత్రుల స్థాయిని పెంచాలి. తగిన సంఖ్యలో అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలి. బాధితుడి ఆరోగ్యం సాధారణ స్థితికి వచ్చేంత వరకు చికిత్స అందించేందుకు ఆరోగ్య కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలి. బాధితుల ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో వైద్యం అందించాలి. అత్యవసర కేసుల్లో వైద్య సాయాన్ని నిరాకరించడానికి వీల్లేదు. బాధితులు ఆసుపత్రుల్లో చేరే విషయంలో వైద్యాధికారులు రెండు వారాలకొకసారి సమీక్ష సమావేశాలు పెట్టి, తగిన మార్గదర్శకాలు జారీ చేయాలి. కిడ్నీ బాధిత కుటుంబాల్లోని పిల్లలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎలాంటి వివక్షను ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవాలి. తద్వారా వారి చదువులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలి. ఉద్దానం, ఇతర గ్రామాల్లో ఆహారం కలుషితం కాకుండా తనిఖీలు చేసేందుకు ఫుడ్ ఇన్స్పెక్టర్లను నియమించాలి’ అని ధర్మాసనం ఆదేశించింది. పర్యవేక్షణకు భాగస్వామిగా న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలను పర్యవేక్షించేందుకు న్యాయ సేవాధికార సంస్థను భాగస్వామిని చేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. సలహా కమిటీ, అవగాహన కమిటీ, పర్యవేక్షణ కమిటీ, న్యాయ సాయం కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో పలువురికి స్థానం కల్పించింది. ఈ కమిటీలన్నీ నెల, రెండు నెలలకొకసారి సమావేశం కావాలని ఆదేశించింది. కిడ్నీ వ్యాధి నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు సమర్పించాలని ఆ కమిటీలను హైకోర్టు ఆదేశించింది. తగిన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిని ఆదేశించింది. -
ఎయిమ్స్ తరహాలో నాలుగు టిమ్స్‌లు
సాక్షి, హైదరాబాద్: టిమ్స్ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) తరహాలో హైదరాబాద్ నగరానికి నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గచ్చిబౌలి, సనత్‌నగర్, ఎల్బీనగర్, అల్వాల్‌లో వీటిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో వీటి సేవలు ఉండాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లోని కంటోన్మెంట్, ఎయిర్‌పోర్టుల నిబంధనలు కూడా పరిగణనలోకి తీసుకొని నమూనాలు తయారు చేయాలని కోరారు. ఒక్కొక్కటి వెయ్యి పడకల సామర్ధ్యంతో కూడిన ఈ ఆసుపత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో శంకుస్థాపన చేస్తారని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి వివిధ అంశాలపై మంత్రి హరీశ్‌రావు సోమవారం వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు. వరంగల్ ఆసుపత్రికి టెండర్లు పూర్తి చేయండి వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. జనవరి మొదటి వారంలో నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తయితే రాష్ట్రానికి మెడికల్ హబ్‌గా మారుతుందని చెప్పారు. మరోవైపు పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలోని కార్మికులకు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందేలా మరో కొత్త ఆసుపత్రిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఈ మేరకు త్వరగా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రూ.150 కోట్లతో 200 పడకల ఆసుపత్రి నిర్మాణానికి తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలు వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. 20 ఆసుపత్రులకు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు రాష్ట్రంలోని గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం, టిమ్స్, నీలోఫర్ సహా వివిధ జిల్లాల్లోని 20 ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. సుమారు రూ.59.25 కోట్ల విలువైన పనులకు త్వరలో టెండర్లు పిలవాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయండి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. రెండో డోసుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. కరోనాకు సంబంధించి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమీక్షల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, వాణిజ్య పన్నుల శాఖ అధికారి నీతు కుమారి ప్రసాద్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, డీఎంఈ రమేష్ రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, అధికారులు చంద్రశేఖర్ రెడ్డి, గణపతి రెడ్డి పాల్గొన్నారు. -
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి 1,100 కోట్లు
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌ను హెల్త్‌సిటీగా తీర్చిదిద్దే దిశలో రాష్ట్రప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి రూ.1,100 కోట్లు మంజూరు చేసింది. తాజాగా దీనికి సంబంధించి పరిపాలనా అనుమతులు ఇస్తూ శనివారం వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ ఉత్తర్వులు జారీచేశారు. వరంగల్‌ను హెల్త్ సిటీగా అభివృద్ధి చేసే క్రమంలో ప్రభుత్వం ఇప్పటికే కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 15 ఎకరాల్లో భారీ భవన సముదాయాన్ని నిర్మించనుంది. 2 వేల పడకలు ఏర్పాటు చేయనుంది. స్పెషాలిటీ సేవల కోసం 1,200 పడకలు, సూపర్ స్పెషాలిటీ వైద్యసేవల కోసం 800 పడకలను కేటాయించాలని నిర్ణయించారు. స్పెషాలిటీ వైద్యంలో భాగంగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్ మొదలైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. సూపర్ స్పెషాలిటీల కేటగిరీలో ఆంకాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, కార్డియాలజీ, కార్డియో థొరాసిక్, యూరాలజీ, నెఫ్రాలజీ తదితర సేవలు ఇక్కడ లభించనున్నాయి. కిడ్నీ, కాలేయం వంటి అవయవ మార్పిడికి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. కీమోథెరపీ, రేడియేషన్ సౌకర్యాలతో అత్యాధునిక క్యాన్సర్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. దీనికి అనుబంధంగా డెంటల్ కళాశాలను ఈ ప్రాంగణంలోనే నిర్మించనున్నారు. -
అశ్విని నేత్రాలయంతో మ్యాక్సివిజన్ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంటి వైద్య సేవల సంస్థ మ్యాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేటకి చెందిన డాక్టర్ ఏఏవీ రామలింగా రెడ్డి సంస్థ అశ్విని నేత్రాలయంతో చేతులు కలిపింది. జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. ఇది మ్యాక్సివిజన్ డాక్టర్ రామలింగా రెడ్డి ఐ హాస్పిటల్స్ పేరిట కార్యకలాపాలు సాగించనున్నట్లు ఆదివారమిక్కడ విలేకరుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మ్యాక్సివిజన్ చైర్మన్ జీఎస్కే వేలు వెల్లడించారు. ఈ ఏడాది ఆఖరు నాటికి మాచర్ల, గుంటూరులో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత ప్రకాశం జిల్లాలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ప్రముఖ నేత్ర వైద్యుడు శరత్ బాబు చిలుకూరితో కలిసి శరత్ మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ పేరిట ఈ తరహాలో తెలంగాణ వ్యాప్తంగా జేవీ కింద ఐ కేర్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వేలు చెప్పారు. ప్రస్తుతం తమకు సుమారు 20 పైచిలుకు సెంటర్స్ ఉన్నాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటిని 50 దాకా పెంచుకోనున్నామని ఆయన తెలిపారు. మరోవైపు, జేవీ విధానం కారణంగా నిర్వహణ, వ్యాపార విస్తరణను నిపుణులకు అప్పగించి, వైద్యులు ప్రధానంగా వైద్య సేవలపై మరింతగా దృష్టి పెట్టేందుకు వీలవుతుందని మ్యాక్సివిజన్ వ్యవస్థాపక మెంటార్ కాసు ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా తమ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇది తోడ్పడగలదని రామలింగా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణలో కొత్తగా మరో 6 జిల్లాల్లోకి విస్తరించనున్నట్లు శరత్ బాబు పేర్కొన్నారు. -
కరోనా బాధితులకు వైద్యం గిట్టుబాటు కాదు
సాక్షి, హైదరాబాద్: సర్కారు విధించిన ఫీజు సీలింగ్ ఆధారంగా కరోనా బాధితులకు వైద్యం చేయడం తమకు సాధ్యంకాదని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. సగం పడకలను ప్రభుత్వానికి అప్పగిస్తామని, అయితే 14 రోజుల వైద్యానికి గరిష్టంగా రూ.4 లక్షలే వసూలు చేయాలన్న ప్రతిపాదన అసాధ్యమని అంటున్నారు. అది తమకు ఏమాత్రం గిట్టుబాటు కాదని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలకు చెందిన ఒక కీలక ప్రతినిధి వ్యాఖ్యానించారు. దీనిపై త్వరలో ప్రభుత్వానికి తమ ప్రతిపాదనలను అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. కొనసాగుతున్న ప్రతిష్టంభన: ప్రైవేట్, కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఎంత ఫీజు వసూలు చేయాలన్న దానిపై గతంలో ప్రభుత్వం ఒక జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. రోజుకు సాధారణ వార్డులో కరోనా చికిత్స పొందే వ్యక్తి నుంచి రూ.4 వేలు, ఆక్సిజన్ వార్డు అయితే రూ.7,500, ఐసీయూలో అయితే రూ.9వేల చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది. పీపీఈ కిట్లు, మందులు, ఇతరత్రా వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. కానీ సర్కార్ నిర్ణయాన్ని ఏ ఆసుపత్రీ అమలు చేయడం లేదని బాధితుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. (సందేహాలకు సమాధానమిస్తాం: కేసీఆర్) దీంతో సగం పడకలను తమకు అప్పగించాలని ఇటీవల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలతో జరిగిన సమావేశంలో వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అందుకు వారూ అంగీకరించారు. తర్వాత ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావుతో జరిగిన సమావేశంలో సగం పడకలకు ఎంత వసూలు చేయాలన్న దానిపై ఒక సీలింగ్‌ను ప్రభుత్వం ప్రతిపాదించింది. 14 రోజులకు అన్నీ కలిపి సాధారణ పడకలకు రూ.లక్ష, ఆక్సిజన్ బెడ్‌కు రూ.2లక్షలు, ఐసీయూ పడకలకు రూ.3 లక్షల నుంచి రూ.4లక్షల వరకు వసూలు చేయాలని సీలింగ్ విధించింది. ఆ మేరకు ప్రతిపాదనలు తయారు చేసుకొని రావాలని కోరింది. కానీ ఇప్పటికీ దీనిపై సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఎలాంటి నిర్ణయమూ ప్రభుత్వానికి ప్రతిపాదించలేదు. దీనిపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. కాగా, సర్కారు సీలింగ్ మేరకు సగం పడకలు ఇవ్వడం తమకు గిట్టుబాటు కాదని, కొత్త సీలింగ్ ఫీజులను ప్రభుత్వానికి త్వరలో ప్రతిపాదిస్తామని ఆసుపత్రుల ప్రతినిధి ఒకరు తెలిపారు. బాధితులకు ఇతరత్రా అనారోగ్య సమస్యలుంటే చేయాల్సిన టెస్టులు.. అత్యవసర మందులకు అధిక ఖర్చు అవుతుందని, తమకు వాస్తవంగా అయ్యే ఖర్చును ఆధారం చేసుకొని ఈ ప్రతిపాదనను సర్కారు తెలియజేస్తామన్నారు. -
కిడ్నీ బాధితులకు ‘భరోసా’గా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
ఉద్ధానం సమస్యపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : ఉద్ధానం సమస్యపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ బాధితుల కోసం శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆస్పత్రికి అనుసంధానంగా రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్‌కు రూ.50కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రీసెర్చ్ సెంటర్లో రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో ప్రభుత్వం సిబ్బందిని నియమించనుంది. వైద్యుడు, సిబ్బందిని మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ ప్రాతిపదికన 5 పోస్టులు, కాంట్రాక్ బేసిస్ కింద 98, సర్వీస్ ఔట్‌సోర్స్ కింద60 పోస్టులను మంజూరు చేసింది. కాగా ప్రభుత్వ నిర్ణయం పట్ల కిడ్నీ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి కాకముందే తమ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. కిడ్నీ బాధితులకు ‘భరోసా’గా రూ.10 వేలు కాగా, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజు నుంచే కిడ్నీ బాధితులకు నెలకు రూ. 10 వేల పెన్షన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం ప్రాంతంతో పర్యటించారు. కిడ్నీ బాధితుల అవస్థలను చూసి ఆయన చలించిపోయారు. వారి గోడు విన్న వైఎస్ జగన్ ‘మనం అధికారంలోకి వస్తే నెలకు రూ.10 వేల ఇస్తా’నని మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం వారికిచ్చే పింఛను రూ.10 వేలకు పెంచారు. రాష్ట్రంలో సుమారు 8,500 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలోని 112 గ్రామాల్లో ఉన్నారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా జి.కొండూరు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో డయాలసిస్ బాధితులు ఉన్నారు. వీళ్లందరూ పేదవాళ్లే. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 4 వేల మందికి మాత్రమే నెలకు రూ.2,500 చొప్పున పింఛను ఇచ్చేవారు. 2019 ఫిబ్రవరి తరువాత 8,500 మందికి రూ.3,500 చొప్పున రూ.2.80 కోట్లను వ్యయం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక రూ.10 వేల చొప్పున 8,500 మందికి నెలకు రూ.8.50 కోట్లను చెల్లిస్తున్నారు. కేవలం కిడ్నీ బాధితులకు ఇచ్చే పింఛను వ్యయమే ఏడాదికి రూ.102 కోట్లు కానుంది. అంతే కాకుండా ఉద్దాన సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఇపుడు రూ.50 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న ఉద్దాన సమస్యపై సీఎం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం కిడ్నీ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మా పాలిట దేవుడయ్యారని ప్రశంసిస్తున్నారు. కిడ్నీ డయాలసిస్ రోగులకు ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
టీడీపీ నేతకు భూ నజరానా
సాక్షి ప్రతినిధి, తిరుపతి/సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అస్మదీయులకు ప్రభుత్వం భూసంత్పరణ కొనసాగిస్తోంది. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు, తిరుపతి కేంద్రంగా వైద్యరంగంలో స్థిరపడ్డ డాక్టర్ కోడూరి బాలసుబ్రహ్మణ్యంకు చెందిన అలైట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి అత్యంత విలువైన భూమిని కారుచౌకగా కేటాయించింది. తిరుపతి శివారు కరకంబాడిలో రూ.15 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.1.20 కోట్లకే ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్ బుధవారం ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నెం.266) జారీ చేశారు. మంత్రుల ద్వారా పైరవీలు తిరుపతి నుంచి మంగళం మీదుగా కడప హైవేకు వెళ్లే మార్గంలో కరకంబాడి గ్రామం ఉంది. దీనిపక్కనే అమరరాజా ఫ్యాక్టరీ ఉంది. దీనికి సమీపంలోనే విలువైన ప్రభుత్వ భూమి ఉంది. సర్వే నెంబరు 774/3లో ఉన్న 15 ఎకరాల ప్రభుత్వ భూమిని 500 పడకలతో నిర్మించే అలైట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ మార్కెట్ విలువ ఎకరం రూ.35 లక్షలుగా నిర్ధారించినప్పటికీ తక్కువ ధరకే ఇవ్వాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, అమరనాథరెడ్డిల ద్వారా భూమి కోసం ప్రయత్నాలు చేశారని సమాచారం. దీంతో ప్రభుత్వం ఇదే సర్వే నెంబరులో ఉన్న 15 ఎకరాల భూమిని ఎకరం కేవలం రూ.8 లక్షలకే ఇవ్వాలని నిర్ణయానికొచ్చింది. మూడేళ్లలో భూమిని వినియోగంలోకి తీసుకురావాలని, కేటాయించిన భూమిలో జల వనరుల రూపురేఖలు మార్చకూడదని జీవోలో స్పష్టం చేశారు. సంబంధిత అవసరాలకే భూమిని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. రూ.15 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.1.20 కోట్లకే కట్టబెట్టడంతో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వం పెద్దలకు ముడుపులు ముట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పలు సంస్థలకు భూముల కేటాయింపు వివిధ సంస్థలకు భూములను కేటాయిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామంలో ట్రక్ టెర్మినల్ ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కి ప్రభుత్వం 402.32 ఎకరాలు ఉచితంగా కేటాయించింది. ఇదే జిల్లా పెనుగొండ మండలంలో డంపింగ్ యార్డు, ఇతర అవసరాల కోసం ఏపీఐఐసీకి 129 ఎకరాలను ఉచితంగా కేటాయించింది. చిత్తూరు జిల్లా నగరి మండలంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి 101.18 ఎకరాలను కేటాయించింది. వీటితోపాటు మరికొన్ని సంస్థలకు భూములను కేటాయిస్తూ రెవెన్యూ శాఖ జీవోలు జారీ చేసింది. -
‘అనంత’ను పారిశ్రామిక వాడగా మారుస్తాం
అనంతపురం అర్బన్: ‘అనంత’ని పారిశ్రామిక వాడగా మారుస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా సోమవారం స్థానిక వైద్య కళాశాల ఆడిటోరియంలో పారిశ్రామిక, సేవారంగంలో ప్రగతి- భవిష్యత్ ప్రణాళిక అంశంపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు కామినేని శ్రీనివాస్, పల్లెరఘునాథ్‌రెడ్డిలు మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా 1400 డాక్టర్ పోస్టుల భర్తీ చేశామన్నారు. జిల్లాను పారిశ్రామిక వాడగా తీర్చిదిద్ధేందుకు చర్యలు ప్రారంభమయ్యాయన్నారు. ఇప్పటికే కస్టమ్స్ అండ్ ఎక్సైజ్, బెల్, ఎయిర్‌బస్, రాగమయూరి, తదితర కంపెనీలు జిల్లాలో పరిశ్రమలు స్థాపిస్తునాయన్నారు. ఇందుకు అవసరమైన భూమిని కేటాయించామన్నారు. రూ.150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు కానుందన్నారు. ఆర్థిక, సామాజిక, పారిశ్రామికంగా ఎదగాలంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. సదస్సులో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, జడ్పీ చైర్మన్ చమన్, మేయర్ స్వరూప, కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ రాజశేఖర్‌బాబు, జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం, తదితరులు పాల్గొన్నారు. -
మంగళగిరి ఎయిమ్స్‌కి గ్రీన్‌సిగ్నల్
విజయవాడ బ్యూరో : మంగళగిరి ఎయిమ్స్‌కు సంబంధించి మరో ముందడుగు పడింది. ఎయిమ్స్ నిర్మాణ పనులకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని నాగ్‌పూర్, కల్యాణి ప్రాంతాలతో పాటు మన రాష్ట్రంలోని మంగళగిరిలో నిర్మించే ఎయిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం 2015-16 వార్షిక బడ్జెట్లో రూ.1618 కోట్లు కేటాయించే వీలుందని సూత్రప్రాయంగా తెలిపింది. ఫలించిన ఎదురుచూపులు... రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సమయంలో కేంద్రం ఇచ్చిన హామీల్లో భాగంగా మంగళగిరిలోని పాత టీబీ శానిటోరియం స్థలంలో అన్ని సదుపాయాలతో కూడిన ఎయిమ్స్‌ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు తయారుచేసి కేంద్రానికి పంపింది. కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ 2014 డిసెంబర్లో గుంటూరు జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి టీబీ శానిటోరియం స్థలాన్ని పరిశీలించింది. ప్రభుత్వం కేటాయించిన 193 ఎకరాల విస్తీర్ణంలో 960 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, మెడి కల్ కళాశాల, పరిపాలనా భవనాలను నిర్మించాలని ప్రతిపాదనలు రూపొందించింది. మే 14న పనులు ప్రారంభించేందుకు శంకుస్థాపన ముహూర్తం కూడా ఖరారైంది. అయితే చివరి క్షణంలో శంకుస్థాపన వాయిదా పడింది. ఇక్కడున్న స్థలం సరిపోదన్న వాదనలు బయటకు రావడంతో పక్కనే ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీ సంస్థలకు కేటాయించిన మరో 50 ఎకరాలను కూడా ఎయిమ్స్‌కు కేటాయించారు. ఆ తరువాత కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి. ఇటీవల కాలంలో కేంద్ర మంత్రి సుజనాచౌదరి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రివర్గం నుంచి ఆమోదం లభించగానే ఎయిమ్స్ పనులు ప్రారంభమవుతాయన్నారు. బుధవారం ఈ మేరకు కేబినెట్ నుంచి ఆమోదం లభించింది. అన్నీ సవ్యంగా జరిగితే నవంబరు 14 లోపే నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగవచ్చని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
సూపర్ ‘జాప్యం’
చొరవ చూపని రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా ప్రకటనలకే పరిమితం నిధులిచ్చినా.. ఒక్క అడుగూ ముందుకు పడని వైనం నేటికీ ఎక్కడ కడతారో తెలియని దుస్థితి విజయవాడ : విజయవాడలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు కల ఎప్పటికి నెరవేరుతుందో అర్థం కాని అయోమయ స్థితి నెలకొంది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతుంది. గత ఏడాది జూన్‌లో కేంద్రం ప్రధాన మంత్రి స్వాస్త్ సురక్ష యోజన పథకం ద్వారా సిద్ధార్థ వైద్య కళాశాలకు రూ.150 కోట్లు కేటాయించింది. వాటిలో సూపర్ స్పెషాలిటీ విభాగాలకు ప్రత్యేకంగా భవన నిర్మాణం చేపట్టడంతో పాటు, అత్యాధునిక పరికరాలు సమకూర్చేందుకు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో సూపర్ ఆశ నెరవేరినట్లేనని అందరూ భావించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ఏడాది గడిచినా నేటికీ అంచనాలు రూపొందించే దశలోనే ఉండటంతో ఎప్పటికి పూర్తవుతుందో తెలియని దుస్థితి నెలకొంది. ఎక్కడ కట్టాలనేదే సమస్య... ప్రధాన మంత్రి స్వాస్త్ సురక్ష యోజన పథకం ద్వారా రూ.150 కోట్లు కేటాయించగా, వాటిలో రూ.80 కోట్లు వెచ్చించి భవన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. మిగిలిన రూ.70 కోట్లతో అత్యాధునిక పరికరాలు సమకూర్చడంతో పాటు, ప్రస్తుతం ఉన్న విభాగాల్లో మరమ్మతులు చేపట్టాలని భావించారు. అయితే భవన నిర్మాణాలు ఎక్కడ చేపట్టాలనేది సమస్యగా మారింది. తొలుత రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సందర్శించి ప్రస్తుతం ఉన్న వైద్యకళాశాల భవనాల్లో సగ భాగాన్ని తొలగించి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అనంతరం రాష్ట్ర వైద్య ఆర్యోగ శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీనివాస్‌లు వైద్య కళాశాలను సంద ర్శించి క్రీడా ప్రాంగణంలోని కొంత భాగంలో సూపర్ స్ఫెషాలిటీ బ్లాక్ నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. ఉన్నతాధికారులు ఒక ప్రాంతంలో, ప్రజాప్రతినిధులు మరో ప్రాంతంలో ప్రతిపాదనలు చేయడంతో వైద్య ఆరోగ్యశాఖ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఇంజనీర్లు రెండు ప్రాంతాల్లోనూ డిజైన్లు వేసి ప్రభుత్వానికి పంపారు. అక్కడ ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. గతం పునరావృతమయ్యేనా? నాలుగేళ్ల కిందట వైద్య కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. తొలి విడతగా సిద్ధార్థ వైద్య కళాశాలకు రూ.9 కోట్లు విడుదల చేశారు. దానికి మ్యాచింగ్ గ్రాంటుగా రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు విడుదల చేయక పోవడంతో రెండో విడత నిధులను వైద్య కళాశాల కోల్పోవాల్సి వచ్చింది. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలు రెండు, మూడు విడ తలు నిధులు పొందగా మన రాష్ట్రంలో మాత్రం మొదటి విడతతోనే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం కేటాయించిన రూ.150 కోట్లలో 20 శాతం అంటే రూ.30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఈ నిధులు కూడా సగంలోనే ఆగిపోయే పరిస్థితి తలెత్తుతుందని నిపుణులు చెపుతున్నారు. -
రామగుండంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి
రూ. 500 కోట్లతో ఏర్పాటు అనుబంధంగా వైద్యకళాశాల కూడా.. సింగరేణి, ఎన్టీపీసీ, నిమ్స్ సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డి అంగీకారం సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్), నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) ఉద్యోగులకు శుభవార్త. అందులో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు అత్యాధునిక వైద్య సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. రామగుండంలో రూ. 500 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. దానికి అనుబంధంగా వైద్య కళాశాలను కూడా ఏర్పాటు చేస్తారు. శనివారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తన చాంబర్లో సింగరేణి, ఎన్టీపీసీ, నిమ్స్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం సింగరేణి ఎదురుచూపు’ కథనానికి స్పందించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు రూ. 500 కోట్ల ఖర్చును ఎన్టీపీసీ, సింగరేణి సంస్థలు భరిస్తాయి. ఎవరి వాటా ఎంతనేది వారే నిర్ణయించుకుంటారు. నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందులో కార్మికులు, ఉద్యోగులకు నామమాత్రపు ఫీజుతో వైద్య సదుపాయం అందిస్తారు. ఆ ఫీజు, ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్వహిస్తారు. సాంకేతిక, వైద్య సహకారాన్ని నిమ్స్ అందజేస్తుంది. సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆమోదం పొందాక తుది నిర్ణయం తీసుకుంటారు. ఇది ఆదిలాబాద్‌లోని రిమ్స్ పరిధిలో సెమీ అటానమస్‌గా పనిచేస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 50 వేల కుటుంబాలకు ప్రయోజనం ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న సింగరేణి సిబ్బంది దాదాపు 43 వేల మంది, ఎన్టీపీసీ సిబ్బంది 7 వేల మంది ఉంటారని అధికారులు చెబుతున్నారు. వారందరికీ రామగుండంలో ఏర్పాటు చేయబోయే సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. -
కొత్త రాజధాని వద్ద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తిరుపతి, తిరుమల: గుంటూరు, విజయవాడల (కొత్త రాజధాని) మధ్య ఆధునిక వసతులతో సూపర్ స్పెషాలిటీ (ఈఎస్ఐ) ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. తిరుపతిలోని ఈఎస్ఐ ఆస్పత్రిని ఆయన గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నంలో అవసాన దశలో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రిని 200 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. విజయనగరం, తిరుపతిలోని ఈఎస్ఐ ఆస్పత్రులను 100 పడకల ఆస్పత్రులుగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం దత్తాత్రేయ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. -
తెలంగాణలో మరిన్ని ఈఎస్ఐ ఆస్పత్రులు: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరిన్ని ఈఎస్ఐ ఆస్పత్రులను ఏర్పా టు చేయనున్నట్టు కేంద్రమంత్రి దత్తాత్రేయ తెలిపారు. నిర్మల్‌లో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పా టు చేస్తున్నట్టు వెల్లడించారు. బీడీ కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్న ట్టు చెప్పారు. గురువారం ఆయనను దిల్‌కుశ అతిథి గృహంలో గృహనిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కలిశారు. రాష్ట్రంలో పేదలకు అధి కంగా గృహాలు నిర్మించేందుకు, గోదావరి పుష్కరాలకు కేంద్రం రూ.900 కోట్లు కేటాయించేలా సహకరించాలని కోరారు. ఈ ఉత్సవాలకు రాష్ట్రపతి, ప్రధాని వచ్చేలా చూడాలని కోరారు. -
దృష్టి పెట్టరే!
‘సీఎం చంద్రబాబుకు అనంత అంటే ఎనలేని ప్రేమ. అడక్కుండానే వరాలు ఇస్తున్నారు. త్వరలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించి.. పేదలకు మెరుగైన సేవలందిస్తార’ంటూ జిల్లా మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత ఏ కార్యక్రమానికి వెళ్లినా ఊదరగొడుతున్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యం దేవుడెరుగు గానీ.. అందుబాటులో ఉన్న సర్వజనాస్పత్రిలో వైద్యసేవలు రోజురోజుకూ తీసికట్టుగా మారుతున్నాయి. కంటి ఆపరేషన్ థియేటర్ మూసేసి మూడు నెలలు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అనంతపురం రూరల్ : జిల్లాలోని పేదలకు సర్వజనాస్పత్రే పెద్దదిక్కు. ఏ రోగమొచ్చినా ఇక్కడికి వస్తుంటారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందడం లేదు. చాలా వైద్యపరికరాలు చెడిపోయాయి. వాటి మరమ్మతుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక కంటి ఆపరేషన్ థియేటర్ పునరుద్ధరణ పనులు ముందుకు సాగడం లేదు. ప్రతిరోజూ కంటి శుక్లాల(కాటరాక్ట్) ఆపరేషన్ల కోసం అనేకమంది వృద్ధులు ఆస్పత్రికి వస్తున్నారు. థియేటర్ మూసేశారని, ఎప్పుడు తెరుస్తారో తమకే తెలియదని వైద్యులు చెబుతున్నారు. దీంతో వారు నిరాశగా వెనుదిరుగుతున్నారు. అంతోఇంతో ఆర్థికంగా ఉన్న వారు మాత్రం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళుతున్నారు. ఆపరేషన్లకు బ్రేక్ ఆస్పత్రిలో ప్రతిరోజూ 5-10 కంటి ఆపరేషన్లు చేసేవారు. వైద్యులు సైతం పోటాపోటీగా ఆపరేషన్లు చేస్తూ మెరుగైన సేవలు అందించే వారు. థియేటర్ మూతపడడంతో ఆపరేషన్లకు బ్రేక్ పడింది. ఈ విభాగంలో ఇన్ఫెక్షన్ వ్యాపించి ఐదారు మందికి కంటిచూపు పోయింది. దీనిపై విచారణకు ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. కర్నూలు రీజినల్ ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి ఈ ఏడాది సెప్టెంబర్ 24న ‘అనంత’కు వచ్చారు. ఆపరేషన్ థియేటర్‌ను తనిఖీ చేశారు. ఇన్ఫెక్షన్కు గల కారణాలపై డిపార్టమెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)కు నివేదిక అందించారు. అలాగే ఆగస్టు 20 నుంచి థియేటర్లో ఆపరేషన్లను బంద్ చేశారు. ఆపరేషన్ త్వరలోనే చేస్తామన్నారు కంటిచూపు సరిగా లేదు. ఆస్పత్రిలో చూయించుకునేందుకు వచ్చా. చుక్కల మందు ఇచ్చారు. ఎప్పుడు నయమవుతుందో తెలియదు. ఆపరేషన్ త్వరలో చేస్తామని చెప్పారు. - ఉజ్జినప్ప, బోయినేపల్లి ఓపీ తగ్గింది ఆస్పత్రిలో కంటి వైద్యచికిత్సకు వచ్చే ఔట్పేషెంట్ల సంఖ్య బాగా తగ్గింది. కాటరాక్ట్ ఆపరేషన్లు తాత్కాలికంగా నిలిచిపోవడమే ఇందుకు కారణం. డీఎంఈ నుంచి నివేదిక రావాల్సి ఉంది. ఆమోదం రాగానే థియేటర్‌ను పునరుద్ధరిస్తాం. - శ్రీనివాసులు, కంటి వైద్య విభాగాధిపతి డీఎంఈ నుంచి ఆదేశాలు రావాలి డీఎంఈ నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. అక్కడి నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తేనే థియేటర్‌ను పునరుద్ధరిస్తాం. - డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వర రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
పోలీసులకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ హైదరాబాద్: తెలంగాణలో పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేసేందుకు అనేక ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించినట్టు రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. పోలీసు శాఖకు ప్రత్యేకంగా సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిని నిర్మించే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచి నట్టు ఆయన తెలిపారు. పోలీసుల పిల్లలకు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో .23 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని, ఆరోగ్య భద్రత పథకం ద్వారా పోలీసుకుటుంబాలకు ఆర్థికంగా చేయూతను ఇస్తామన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకుని సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నక్సలైట్లు, ఉగ్రవాదులు, సంఘవిద్రోహ శక్తులతో పోరాడుతూ అసువులు బాసిన పోలీసుల కుటుంబసభ్యులకు ఇచ్చే నష్టపరిహారాన్ని భారీగా పెంచామన్నారు. కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ వరకు రూ.25 లక్షలు,సీఐ ఆపై స్థాయి అధికారుల కుటుంబాలకు రూ. 30 లక్షలకు పెంచినట్టు చెప్పారు. శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 3లక్షలు పరిహారంగా ఇస్తున్నామని వివరించారు. విధినిర్వహణలో మృతి చెందిన హోంగార్డులకు రూ.5 లక్షలు పరిహారంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కానిస్టేబుళ్లతో సమానంగా వీరికి బస్‌పాస్‌లు ఇవ్వాలని ప్రతిపాదించామన్నారు. మంగళవారం జరిగే అమరవీరుల సంస్మరణ పరేడ్‌కు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి హాజరవుతున్నట్టు ఆయన తెలిపారు. -
ఆదిలాబాద్ జిల్లాకు కొమురం భీమ్ పేరుపెట్టాలి
సీఎంకు కొమరం భీమ్ మనవడి విజ్ఞప్తి వర్ధంతి కార్యక్రమానికి ఆహ్వానం హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాకు కొమురం భీమ్ పేరుపెట్టాలని, ఉట్నూరులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని, గిరిజనుల విద్య, వైద్య, వ్యవసాయం, రవాణ సదుపాయూలపై ప్రత్యేకశ్రద్ధ వహించాలని సీఎం కేసీఆర్‌కు కొమురం భీమ్ మనవడు కొమురం సోనేరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో సీఎంకు సోనేరావు, బంధువు ఆత్రం భుజంగరావు, కొమురం భీమ్ స్మారకసమితి అధ్యక్షుడు రుద్రశంకర్, ఆత్రం తిరుపతి, కనక వెంకటేశ్వరరావు, తొడసం పుల్లారావువినతిపత్రాన్ని సమర్పించారు. ఈనెల 8న జరగనున్న కొమురంభీమ్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాలని వుుఖ్యవుంత్రిని ఆహ్వానించారు. కొమురం సోనేరావు కొడుకు, కుమార్తెలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలన్న విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారని ఆత్రం భుజంగరావు, రుద్రశంకర్ చెప్పారు. కుంటాల జలపాతం హైడల్ ప్రాజెక్టును రద్దుచేయాలని కోరారు. కొమురంభీమ్ పేరు కలకాలం నిలిచేలా చూస్తాం: సీఎం కొమురం భీమ్ పేరు కలకాలం నిలిచి ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. ఈ నెల 8న కొమురం భీమ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయున అధికారులను ఆదేశించారు. కొమురం భీమ్ స్మారక కేంద్రాన్ని నిర్మిస్తామన్న సీఎంకు వారు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం సచివాలయంలో మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ కొమురం భీమ్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు వెళ్లేందుకు గతంలో మంత్రులు జంకేవారన్నారు. గిరిజన ఉత్సవంగా కొమురం భీమ్ వర్ధంతి ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో ‘‘కొమురం భీమ్ ఫెస్టివల్’’గా గిరిజన ఉత్సవ నిర్వహణకు రూ.10 లక్షలను బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది. -
గుండె దడదడ..నివారిద్దామిలా
న్యూఢిల్లీ: భారతీయుల్లో గుండె జబ్బులు అధికంగా వారసత్వంగా వస్తున్నాయి. ఈ క్రమంలో వయస్సుతో సంబంధం లేదు. వృద్ధులు మొదలు చిన్న, యుక్త వయస్సులో ఉన్న వారు సైతం గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఇది రోజురోజుకూ పెరుగుతోంది. వారసత్వం తోపాటు నిత్య జీవనశైలిలో పనిఒత్తిడి కారణంగా కూడా గుండె జబ్బులకు గురవుతున్నారు. వారంలో మూడు రోజులు వ్యాయామం తప్పని సరి. సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, నృత్యం, నడక ద్వారా గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చని పలువురు హృద్యోగ నిపుణులు పేర్కొంటున్నారు. సెప్టెంంబర్ 29న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వారు దేశప్రజలకు సలహాలు, సూచనలు చేస్తున్నారు. గుండె జబ్బుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ముఖ్యమని అంటున్నారు. ఇంకా అభిప్రాయాలు వారి మాటల్లోనే.. వ్యాయమమే మేలు బీఎల్కే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ నీరజ్ బల్లా మాట్లాడుతూ.. గుండె జబ్బుల నివారణకు ప్రతివారం సుమారు 150 నిమిషాలు శారీరక వ్యాయామం చేయాలి. నడక లేదా ఈతకొట్టడంతోపాటు సైక్లింగ్, ఏరోబిక్ (ఆక్సీజన్ తీసుకోవడం) వ్యాయామం చేయాలి. దీంతో గుండె సంబంధ కండరాలు బలోపేతం అవుతాయి. వ్యక్తిగతంగా ఎవరి శరీర అవసరాలకు తగినట్లు వారు వ్యాయామాన్ని చేయాలి. అతిముఖ్యమైన విషయమేమిటంటే శరీరం మీద అధిక ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. అలా అయితేనే జీవితం సంతోషంగా, ఆరోగ్యంగా సాగుతోంది. అత్యధిక అధ్యయనాల్లో ఉపఖండంలోని ప్రజలు కార్డియోవస్కులర్ డిసీజెస్(సీవీడీ)తోపాటు మదుమేహం(డయాబటిక్)తో కూడా సతమతమవుతున్నట్లు గణంకాలు తెలుపుతున్నాయి. 2.25 మిలియన్లకు చేరిన మరణాలు వివరాలిలా ఉన్నాయి... అత్యధికంగా భారతదేశంలో గుండె జబ్బుల కారణంగా 2.25 మిలియన్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. 2015లో ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 2.94 మిలియన్లకు చేరింది. ఇప్పటికీ గుండె వ్యాధుల తీవ్రత,దాని ప్రభావాన్ని ప్రజలు గుర్తించడం లేదని నిపుణులు అంటున్నారు. విదేశాల్లోనూ భారతీయులే ‘వాస్తవమేమిటంటే భారతీయులకు గుండెజబ్బులు ఎక్కువగా వారసత్వంగా వస్తున్నాయి. అది కూడా అతి చిన్న వయస్సులోనే వస్తున్నాయని ఇంటర్నేషనల్ కాడ్రియాలోజిస్టు, నోయిడాలోని జయపీ ఆస్పత్రి డెరైక్టర్ డాక్టర్ గుంజాన్ కపూర్ చె ప్పారు. అదే విధంగా విదేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడ స్థానికులకన్నా అధికంగా గుండెజబ్బుల బారిన పడుతున్నారు. బ్రిటన్, యూఎస్, ఆఫ్రికా ఇంకా పలు దేశాల్లో ఉన్న భారతీయులు స్థానికులకన్నా అధికంగా గుండె సంబంధ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైందని కపూర్ చెప్పారు. ప్రజల్లో చైతన్య తేవాలి ‘ఘజియాబాద్‌లోని కొలంబియా ఆస్పత్రి చీఫ్ హృద్రోగ నిపుణుడు అనిల్ బన్సల్ మాట్లాడుతూ..ప్రజల్లో ఉన్న అవగాహనా రాహిత్యం కూడా గుండె జబ్బులకు కారణమవుతోంది. ఇందుకు పరిష్కారం ఒక్కటే..గుండె జబ్బుల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకొని రావాలి. అవసరమైన సమాచారం, శాస్త్రీయ పరిజ్ఞానానికి మధ్య ఉన్న దూరాన్ని అధిగమించాల్సి ఉంది. జీవనశైలిలో ప్రజలు తమ అలవాట్లను మార్చుకొనేలా చైతన్యం చేయాలి. ఆరోగ్య సంరక్షణ పట్ల ముందస్తు శ్రద్ధ తీసుకొనెలా చూడాలి. అత్యవసర సమయాల్లోనే డాక్టర్లను సంద్రించే పద్ధతి మంచిదికాదు, ముందుగా దాన్ని ప్రజల మనస్సుల్లో నుంచి తొలగిపోవడానికి అవసరమైన చర్యలు, ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. అవగాహన కల్పించాలి శ్రీకాంత్ కేవీ..బెంగళూర్‌లోని నారాయణ హెల్త్ సిటీకి చెందిన ఇంటర్నేషనల్ కార్డియాలజిస్టు శ్రీకాంత్ కేవీ మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొని రావడానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి. ముందుగా ఒక గ్రూపును ఎంచుకొని గుండె సంబంధ వ్యాధులపై అవగాహన కల్పించాలి. పాఠశాల స్థాయిలోనే చిన్నారులకు గుండు జబ్బులపై అవగాహన కల్పించాలి. అదేవిధంగా యువత, సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారాన్ని చేపట్టాలి. ప్రజలు పనిచేసే చోట, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఆరోగ్య శిభిరాలు నిర్వహించాలి. ఇందులో అంగన్ వాడీ వర్కర్ల బాధ్యత కీలకంగా ఉండేలా చూడాలని చెప్పారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి గుర్గావ్లోని పరాస్ ఆస్పత్రి కార్డియాలజిస్టు తపన్ ఘోష్ మాట్లాడుతూ.. అర్బనైజేషన్, అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు అలవాట్లు, ఆహారపు అలవాట్లు, ఉబకకాయంతోపాటు మద్యం, పొగ తాగడం, అధిక ఒత్తిడి, మదుమేహంతోపాటు, వంశపారంపర్యంగా గుండెజబ్బులు రావడానికి ప్రధాన కారణాలని చెప్పారు.