Swine Flu
-
Chhattisgarh: స్వైన్ ఫ్లూతో ఇద్దరు మహిళలు మృతి.. అరోగ్యశాఖ అప్రమత్తం
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్లో స్వైన్ ఫ్లూతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యింది. వ్యాధి లక్షణాల గురించి అధికారులు మరింత విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. అనుమానిత రోగులను గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.అనారోగ్యం బారినపడిన కొరియా జిల్లాలోని పండోపరా గ్రామానికి చెందిన 51 ఏళ్ల మహిళ జిల్లా ఆస్పత్రిలో చేరారు. ఆమెకు వైద్య పరీక్షలు జరపగా, స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయింది. దీంతో బాధితురాలిని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ బాధితురాలి పరిస్థితి మరింత దిగజారింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో ఆమెను వెంటిలేటర్‌పై ఉంచారు. శుక్రవారం బాధితురాలు మృతిచెందింది.రెండవ కేసు విషయానికొస్తే జంజ్‌గిర్ చంపాలోని లక్షన్‌పూర్ గ్రామంలో నివసిస్తున్న 66 ఏళ్ల మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. స్వైన్‌ఫ్లూ వ్యాధికి చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. జూలై 29 నుంచి ఆగస్టు 9 వరకు అపోలో ఆస్పత్రిలో 9 మంది స్వైన్‌ఫ్లూ వ్యాధిగ్రస్తులను గుర్తించారు. వీరిలో ఐదుగురు బిలాస్పూర్ జిల్లాకు చెందినవారు. ప్రస్తుతం ఐదుగురు బాధితులు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న రోగులకు సంబంధించిన సమాచారాన్ని ఆరోగ్యశాఖ ప్రతిరోజూ సేకరిస్తోంది. -
కరోనా బారిన మాజీ సీఎం... స్వైన్ ఫ్లూ కూడా నిర్ధారణ!
రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కరోనా బారినపడ్డారు. ఆయనకు స్వైన్ ఫ్లూ కూడా సోకినట్లు మెడికల్ రిపోర్టులో వెల్లడయ్యింది. గెహ్లాట్ ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’లో తన ఆరోగ్యం గురించి అశోక్ గెహ్లాట్ తెలియజేస్తూ ‘గత కొన్ని రోజులుగా జ్వరం వస్తున్న కారణంగా, వైద్యుల సలహా మేరకు మెడికల్ టెస్టులు చేయించాను. కోవిడ్, స్వైన్ ఫ్లూ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. అందుకే వచ్చే ఏడు రోజుల పాటు నేను ఎవరినీ కలవలేను. మారుతున్న ఈ సీజన్లో అందరూ ఆరోగ్యం విషయంలో తగిన శ్రద్ధ వహించాలి. ప్రస్తుతం వాతావరణం మారుతోంది. ఇటువంటి వాతావరణంలో చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారని’ దానిలో పేర్కొన్నారు. -
స్వైన్ ‘ఫ్లో’: వేగంగా విస్తరిస్తున్న వైరస్.. పదేళ్లలో 8,064 మంది మృతి!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా స్వైన్‌ఫ్లూపై ఓ నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం 2014 సంవత్సరం నుంచి ఈ ఏడాది జూలై వరకు అంటే దాదాపు పదేళ్లలో దేశవ్యాప్తంగా 1.47 లక్షల మందికి స్వైన్‌ఫ్లూ వైరస్ సోకింది. అందులో 8,064 మంది చనిపోయినట్టు కేంద్ర నివేదిక వెల్లడించింది. ఆ వివరాలను తెలంగాణ వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. 2015 సంవత్సరంలో అత్యధికంగా దేశంలో 42,592 మందికి స్వైన్‌ఫ్లూ సోకగా, అందులో ఏకంగా 2,990 మంది చనిపోయారు. ఆ తర్వాత అత్యధికంగా 2017లో 38,811 మందికి స్వైన్‌ఫ్లూ వైరస్ సోకగా, అందులో 2,270 మంది చనిపోయినట్టు కేంద్ర నివేదిక తెలిపింది. 2014లో మాత్రం 937 మందికి స్వైన్‌ఫ్లూ రాగా, 218 మంది చనిపోయారు. దేశంలో వాతావరణ పరిస్థితులు, తీసుకునే జాగ్రత్తలపైనే దాని విస్తరణ, మరణాలు ఆధారపడి ఉన్నాయని ఆ నివేదిక వెల్లడించింది. ఈ ఏడు నెలల్లోనే 2,783 కేసులు దేశవ్యాప్తంగా ఈ ఏడాదిలో ఈ ఏడు నెలల కాలంలో 2,783 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా, 52 మంది చనిపోయారు. గతేడాది దేశంలో 13,202 మందికి సోకగా, 410 మంది చనిపోయారు. ఇవిగాక కొందరు రోగులు నేరుగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడంతో అవి రికార్డుల్లోకి ఎక్కడంలేదని అంటున్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు స్వైన్‌ఫ్లూ భయం పెట్టి వేలకు వేలు గుంజుతున్నాయి. చివరకు అక్కడ తగ్గకపోవడంతో కొన్ని కేసులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. స్వైన్‌ఫ్లూపై నిరంతర అవగాహన కల్పించడం, నియంత్రణ చర్యలు తీసుకోవడమే పరిష్కారమని నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ క్రిటికల్ కేర్ విభాగాధిపతి డాక్టర్ కిరణ్ మాదల చెబుతున్నారు. జాగ్రత్తలే శ్రీరామరక్ష... గుంపులున్న చోట తిరగకుండా చూసుకోవాలి. గుంపుల్లో తిరిగితే ఒకరి నుంచి మరొకరికి స్వైన్‌ఫ్లూ వైరస్ సోకే ప్రమాదముంది. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. అవకాశముంటే రక్షణ కవచంగా గ్లౌవ్స్ తొడుక్కోవాలి. దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, అధిక జ్వరం ఉండి, స్వైన్‌ఫ్లూ అనుమానం వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. బీపీ, స్థూలకాయం, షుగర్, ఊపిరితిత్తుల సమస్యలున్న వారికి స్వైన్‌ఫ్లూ త్వరగా సోకే అవకాశముంది. కాబట్టి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. స్వైన్‌ఫ్లూ లక్షణాలు... తీవ్రమైన జ్వరం వస్తుంది. దగ్గు, జలుబు, ఒళ్లునొప్పులు ఉంటాయి. జ్వరం ఒక్కోసారి అధికంగా ఉంటుంది. తలనొప్పి కూడా తీవ్రంగానే ఉంటుంది. పిల్లల్లో కొన్ని సందర్భాల్లో తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్య ఎదురవుతుంది. ఒక్కోసారి చర్మం బ్లూ లేదా గ్రే కలర్లోకి మారుతుంది. దద్దుర్లు వస్తాయి. ఒక్కోసారి వాంతులు కూడా అవుతాయి. నడవడమూ కష్టంగానే ఉంటుంది. ఇక పెద్దల్లో అయితే కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఛాతీనొప్పి, కడుపునొప్పి కూడా ఉంటుంది. నిరంతరాయంగా వాంతులు అవుతాయి. -
తెలంగాణపై మళ్లీ ఫ్లూ పంజా!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణపై మళ్లీ ఫ్లూ పంజా విసురుతోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఏ ఇంట్లో చూసినా జ్వరపీడితులే కనిపిస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, కళ్లమంటలు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష మంది ఈ సీజనల్ జ్వరాల బారినపడినట్లు సమాచారం. బాధితుల్లో ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న వారే ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం నమోదవుతున్న జ్వరాల్లో సాధారణ లక్షణాలకు భిన్నంగా ఉంటుండటం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణం మారడంతో.. ప్రస్తుతం శీతాకాలం ముగిసి వేసవి ప్రారంభమైంది. చలిగాలులు తగ్గి పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వైరస్ కారకాలు మార్పు చెందుతున్నాయి. ప్రస్తుతం నమోదవుతున్న జ్వరాలను ఐసీఎంఆర్ ఇటీవల విశ్లేషించగా విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. ఐసీఎంఆర్ చేసిన సీరో సర్వేలో 92 శాతం మందికి తీవ్రమైన జ్వరంతోపాటు దగ్గు, కళ్ల మంటలు, నిమోనియా (హెచ్3ఎన్2 వైరస్) లక్షణాలున్నట్లు గుర్తించింది. సాధారణ స్వైన్‌ఫ్లూ కంటే ఈ వైరస్ తీవ్రత కొంత ఎక్కువున్నట్లు పేర్కొంది. పదేళ్ల క్రితం తగ్గినట్లే తగ్గి.. 2009లో హైదరాబాద్‌లో తొలిసారిగా స్వైన్‌ఫ్లూ కేసు నమోదైంది. 2012 వరకు హెచ్1ఎన్1 ఇన్ఫ్లుయెంజా వైరస్ కేసుల తీవ్రత ఎక్కువగా కనిపించింది. ఆపై కేసుల సంఖ్య క్రమంగా తగ్గి సాధారణ ప్లూ జాబితాలో చేరింది. అడపాదడపా కేసులు నమోదవుతున్నప్పటికీ రోగనిరోధకశక్తి పెరగడం, చికిత్స సులభతరం కావడంతో ఆ తర్వాత పెద్దగా ప్రాణనష్టం వాటిల్లలేదు. ప్రస్తుతం ఈ వైరస్ హెచ్3ఎన్2గా రూపాంతరం చెంది మరింత బలపడింది. సాధారణంగా చలి ప్రదేశంలో ఈ వైరస్ విస్తరిస్తుంది. కానీ ఇందుకు భిన్నంగా వేసవిలోనూ విజృంభిస్తోంది. జనసమూహాలతో వ్యాపిస్తూ.. ప్రస్తుతం శుభకార్యాల సీజన్ కావడంతో ప్రజలు భారీగా ఒకచోట చేరుతున్నారు. తీర్థయాత్రలు, పర్యాటక ప్రాంతాలకు సైతం వెళ్తున్నారు. ఈ సమయంలో వైరస్ సోకిన వ్యక్తి తుమ్మడం, దగ్గడం వల్ల ఆ వైరస్ గాలిలోకి ప్రవేశించి ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరిస్తోంది. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ కేంద్రాలు ప్రస్తుతం ఫ్లూ బాధితులతో రద్దీగా మారుతున్నాయి. బాధితుల్లో జ్వరం 3–5 రోజులపాటు ఉంటుండగా దగ్గు 10–15 రోజులపాటు వేధిస్తోంది. సకాలంలో వైరస్‌ను గుర్తించకపోవడం, చికిత్సను నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రమైన నిమోనియాకు కారణమవుతోంది. ఆందోళన అక్కర్లేదు వైరస్లు ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతుంటాయి. హెచ్3ఎన్2 వైరస్ కారకాలపై ఆందోళన అవసరం లేదు. ఇది కూడా ఓ సాధారణ ఫ్లూనే. అయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. జన సమూహంలోకి వెళ్లకపోవడం, విధిగా మాస్క్‌లు ధరించడం, రోగనిరోధకశక్తిని పెంచుకోవడం, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ బారినపడకుండా కాపాడుకోవచ్చు. చికిత్సల్లో మోతాదుకు మించి యాంటీబయోటిక్స్ వాడొద్దని ఐసీఎంఆర్ ఇప్పటికే సూచించింది. ఇది సాధారణ మందులతోనే నయమవుతుంది. – డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ ఆస్పత్రి -
TS: మూడేళ్ల తర్వాత అక్కడ స్వైన్‌ఫ్లూ కలకలం.. బాలికకు పాజిటివ్!
మహబూబ్‌నగర్ క్రైం: పాలమూరులో మూడేళ్ల తర్వాత మరో స్వైన్‌ఫ్లూ కేసు నమోదైంది. జిల్లాకేంద్రంలోని టీచర్స్‌కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలికకు దగ్గు, జలుబు, జ్వరంతోపాటు ఇతర లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్‌లో నాలుగు రోజులపాటు ఉండి చికిత్స చేయించారు. ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. అయితే అప్పటికే ఇచ్చిన శాంపిల్ పరీక్ష చేయగా స్వైన్‌ఫ్లూ పాజిటివ్ వచ్చింది. జిల్లాలో చివరగా 2019 ఆగస్టులో స్వైన్‌ఫ్లూ కేసు నమోదవగా.. తాజాగా మరొకటి వెలుగులోకి రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. లక్షణాలు ఇలా.. ఇది హెచ్1 ఎన్1 రకం ఇన్ఫ్లూ ఎంజా వైరస్. ఇది సోకిన వారిలో ముందుగా దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి, ముక్కు నుంచి అదేపనిగా నీరుకారడం, చిన్నపిల్లల్లో వాంతులు, విరేచనాలు అవుతాయి. అయితే ఇవి ఉన్నంత మాత్రాన స్వైన్‌ఫ్లూ అనడానికి వీల్లేదు. ఈ లక్షణాలు ఉంటే మందులు వాడిన 48 గంటల్లో తగ్గకపోతే వెంటనే దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రదించాలి. గతంలో పందులు తిరుగుతున్న ఆవరణలో దగ్గరగా ఉన్న వారికి వచ్చేది. ప్రస్తుతం ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు చాలా త్వరగా సోకుతుంది. వైద్యుల పర్యవేక్షణలోనే.. స్వైన్‌ఫ్లూ టీకా, మందులు వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. తప్పనిసరిగా ఐసోలేషన్‌లో ఉండాలి. ఇతర రోగులు ఆ వార్డులోకి రాకుండా చూడాలి. ఆక్సిజన్‌తోపాటు బీపీ సరైన మోతాదులో ఉండేలా మందులు వాడాల్సి ఉంటుంది. వారికే ఎక్కువగా.. స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాలి. బహిరంగ ప్రదేశాల్లో సంచరించరాదు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే మాస్క్ ధరించాలి. స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్న వ్యక్తి తుమ్మిన, దగ్గిన టేబుల్, ఇతర వస్తువుల మీద పడిన తుంపర్ల నుంచి ఇతరులకు సోకుతుంది. చేతులను తరుచుగా శుభ్రం చేసుకోవాలి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లకు ఇది త్వరగా సోకే అవకాశం ఉంది. మధుమేహం, క్యాన్సర్ పీడితులు, వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, శ్వాస సంబంధిత జబ్బులు ఉన్నవారు, స్టెరాయిడ్స్ వాడే వాళ్లకు ఎక్కువగా ఈ ఫ్లూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్వైన్‌ఫ్లూ కేసుల నమోదు ఇలా.. ఏడాది పాజిటివ్ కేసులు 2013 3 2014 5 2015 37 2016 3 2017 5 2018 4 2019 4 2022 1 జాగ్రత్తలు పాటించండి జిల్లాకేంద్రంలో ఒకరికి స్వైన్‌ఫ్లూ రావడంతో కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌లో ఉంచడంతోపాటు అవసరమైన మందులు ఇచ్చాం. ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. వైరస్ సోకిన వారు ఎక్కువ సమయం నిద్రించడంతోపాటు పౌష్టికాహారం తీసుకోవాలి. – కృష్ణ, డీఎంహెచ్ఓ -
గర్భిణిని కాటేసిన స్వైన్‌ఫ్లూ.. తీవ్ర జ్వరంతో బాధపడుతూ..
సాక్షి, మైసూరు: స్వైన్‌ఫ్లూ (హెచ్1ఎన్1) లక్షణాలతో గర్భిణి మృతి చెందిన ఘటన మైసూరు జిల్లా హుణసూరు పట్టణంలో చోటు చేసుకుంది. ఇక్కడి కోణనహొసహళ్లి గ్రామానికి చెందిన స్వామినాయక కుమార్తె ఛాయ (26) తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా మైసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా హెచ్1ఎన్1గా గుర్తించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. జిల్లా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హెచ్‌కే ప్రసాద్ వివరాలు తెలుసుకున్నారు. వర్షాకాలంలో ఈ వ్యాధి విజృంభించే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చదవండి: Karnataka: పోక్సో కేసులో మురుఘ మఠాధిపతి అరెస్ట్ -
వందేళ్లుగా వణికిస్తున్నాయి.. నిలబడుతూనే ఉన్నాం
కొవిడ్-19 మహమ్మారితో మానవాళి సహజీవనం ఏడాదిన్నర పూర్తి చేసుకుంది. వైరస్ తీరు తెన్నులు గందరగోళంగా ఉండడంతో సరైన మందు కనిపెట్టడం పరిశోధకులకు కష్టంగా మారుతోంది. అయితే శాస్త్ర విజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ప్రమాదకరమైన అంటువ్యాధుల్ని, మహమ్మారుల్ని ఎదుర్కొన్నాం. తట్టుకుని నిలబడగలిగాం. స్పానిష్ ఫ్లూ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్‌గా స్పానిష్ ఫ్లూ చెప్తుంటారు. 19వ శతాబ్దం ప్రారంభంలో విజృంభించిన ఈ వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా యాభై కోట్ల మందికి సోకినట్లు ఒక అంచనా. అదే విధంగా కోట్ల సంఖ్యలో మనుషులు స్పానిష్ ఫ్లూకి బలయ్యారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మనిషి అపరిశుభ్రమైన అలవాట్ల నుంచి పుట్టిన ఈ వైరస్.. చాలా వేగంగా ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. భారత సైనికుల ద్వారా 1918లో బాంబే(ఇప్పుడు ముంబై) నుంచి తొలి కేసు మొదలై.. రైల్వే ప్రయాణాల వల్ల మన దేశంలో వేగంగా విస్తరించింది(బాంబే ఫీవర్‌గా పిలిచారు). బ్రిటిష్ ప్రభుత్వ నిర్లక్క్ష్యంతో కోట్ల మందికి ఈ వైరస్ సోకింది. చివరికి.. విమర్శలతో మెరుగైన మందులు తీసుకొచ్చి వైద్యం అందించడం మొదలుపెట్టాక పరిస్థితి రెండేళ్లకు అదుపులోకి వచ్చింది. కలరా కలరా మహమ్మారి తొలిసారి 1817లో విజృంభించింది. రష్యాలో మొదలైన ఈ మహమ్మారి శరవేగంగా ప్రపంచమంతటా విస్తరించింది. దాదాపు 150 ఏళ్ల వ్యవధిలో ఏడుసార్లు కలరా మహమ్మారి మానవాళిపై పంజా విసిరింది. 1961 టైంలో ఇండోనేషియా నుంచి ఎల్ టొర్ స్ట్రెయిన్ మొదలై.. మూడేళ్ల తర్వాత మన దేశం మీద తీవ్ర ప్రభావం చూపెట్టింది. గంగా పరివాహక ప్రాంతంలో అపరిశుభ్రత, కలకత్తా(కొల్కట్టా) వాతావరణం ఈ కలరా విజృంభణకు దారితీసింది. మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ.. దీని కట్టడికి ఏడాదిపైనే సమయం పట్టింది. ఇక కలరా నివారణకు వ్యాక్సిన్‌ను 1885లోనే తయారు చేసినా.. ఈ మహమ్మారి విజృంభణ ఆగకపోవడం విశేషం. కలరా కారణంగా 1817-1923 మధ్య కాలంలో దాదాపు 3.5 కోట్ల మంది మరణించారు. ఇప్పటికీ కలరా ఉనికి ఉన్నప్పటికీ.. వైద్య రంగం అభివృద్ధితో తారా స్థాయిలో అది వ్యాపించడం లేదు. స్మాల్ఫాక్స్ అంటువ్యాధి మశూచి. ఈజిప్ట్‌ల కాలం నుంచే ఉందని భావిస్తున్న ఈ వ్యాధిని..1520లో అధికారికంగా గుర్తించారు. 1980లో నిర్మూలించబడిన వ్యాధుల జాబితాలో ప్రపంచ ఆరోగసంస్థ చేర్చింది. ఇక మన దేశంలో 1974 జనవరి నుంచి మే మధ్య ఐదు నెలలపాటు స్మాల్ఫాక్స్తో 15,000 మంది చనిపోయారు. తట్టుకోగలిగిన వాళ్లలో చాలా మంది చూపు పొగొట్టుకున్నారు. కకావికలం చేసిన ఈ అంటువ్యాధి.. చివరికి డబ్ల్యూహెచ్‌వో చొరవతో అదుపులోకి తేగలిగారు. 1977లో మన దేశంలో మశూచిని అదుపులోకి తేగలిగారు. అయితే మశూచికి 1796లోనే వ్యాక్సిన్(ఎడ్వర్డ్ జెన్నర్ కనిపెట్టాడు) తయారుచేసినప్పటికీ.. పూర్తిగా నిర్మూలించడానికి రెండు వందల సంవత్సరాలకు పైనే పట్టడం విశేషం. సూరత్ ప్లేగు భయంకరమైన అంటువ్యాధి. బ్యాక్టీరియా ద్వారా ఎలుకలు వాహకంగా ఈ అంటువ్యాధి వ్యాపిస్తుంది. 1994లో గుజరాత్ సూరత్‌లో ప్లేగు కేసులు మొదలయ్యాయి. తెరిచి ఉన్న నాలలు, చెత్త కుప్పలు, చచ్చిన ఎలుకల ద్వారా ఇది మొదలైంది. దీంతో లక్షల మంది పట్టణం వదిలి వెళ్లిపోయారు. ఇది వ్యాధి మరింత వ్యాపించడానికి కారణమైంది. ఆగష్టు నుంచి అక్టోబర్ మధ్యే దీని విజృంభణ కొనసాగింది. అయితే ఇది ఎక్కువగా విస్తరించకపోవడంతో 52 మంది మాత్రమే చనిపోయినట్లు లెక్కలు చెప్తున్నాయి. ఇది ఇతర దేశాలకు వ్యాపించినట్లు కూడా ఎక్కడా ఆధారాలు లేవు. పైగా దీని వ్యాప్తి విషయంలో నెలకొన్న గందరగోళం నడుమే.. ఈ వ్యాధి కనుమరుగుకావడం విశేషం. డెంగ్యూ, చికున్‌గున్యా 1635లో వెస్టిండీస్‌లో మొదటిసారిగా డెంగ్యూను అంటువ్యాధిగా గుర్తించారు. చికున్‌గున్యా కేసుల్ని 1952లో టాంజానియాలో గుర్తించారు. ఇక 2006లో ఒకేసారి డెంగ్యూ, చికున్‌గున్యా వ్యాధులు రాష్ష్ర్టాలను అతలాకుతలం చేశాయి. దోమల ద్వారా సంక్రమించే ఈ వ్యాధులు.. ఢిల్లీతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్(ఉమ్మడి) ఎక్కువ ప్రభావం చూపెట్టాయి. 2006లో భారత్‌లో అధికారికంగా డెబ్భై వేలకుపైగా డెంగ్యూ కేసులు నమోదు కాగా, 50 మరణాలు సంభవించాయి. దేశంలో పదకొండు లక్షల చికున్‌గున్యా కేసులు నమోదుకాగా.. ప్రభుత్వం మాత్రం మరణాల లెక్క సున్నా అని చెప్పడం విమర్శలకు దారితీసింది. ఎన్సెఫలిటిస్(మెదడువాపు) జపనీస్ ఎలిటిస్(జేఈ) 1871లో జపాన్‌లో మొదటి కేసును గుర్తించారు. ఎక్యుట్ ఎస్పెఫలిటిస్ సిండ్రోమ్(ఎఈఎస్) కేసును 1955లో మద్రాస్ రీజియన్‌లో గుర్తించారు. 1978 నుంచి పాతిక వేలమంది పిల్లల ప్రాణాల్ని బలిగొన్న వ్యాధి ఇది. 2017లో గోరఖ్‌పూర్(యూపీ) నుంచి వీటి విజృంభణ ఎక్కువైంది. దోమల వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ సోకి.. మెదడుపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది.ఆ ఏడాదిలో మొత్తం 4,759 ఎఈఎస్ కేసులు నమోదు కాగా, 595 మరణాలునమోదు అయ్యాయి. జేఈ కేసుల సంఖ్య 677 కాగా, 81 మరణాలు సంభవించాయి. చికిత్స ద్వారానే ఈ వ్యాధిని అదుపు చేయడం విశేషం. నిఫా వైరస్ జునోటిక్(జంతువుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుంది) వైరస్. మనుషులతో పాటు పందులపైనా ఈ వైరస్ ప్రభావం ఉంటుంది. నిఫా వైరస్ గబ్బిలాల(ఫ్రూట్ బ్యాట్స్) ద్వారా వ్యాప్తి చెందుతుంది. 1998లో మలేషియాలో నిఫామొదటి కేసును గుర్తించారు. అక్కడి సుంగై నిఫా అనే ఊరి పేరు మీదుగా దీనికి ఆ పేరు పెట్టారు. 2018 మే నెలలో కేరళలో నిఫా కేసులు మొదలయ్యాయి. రెండు నెలల వ్యవధిలో 18 మంది చనిపోగా.. కేవలం నెలలోనే పరిస్థితిని పూర్తిగా అదుపు చేసుకోగలిగింది కేరళ. దీనికి వ్యాక్సిన్ లేదు. అప్రమత్తంగా ఉండడమే మార్గం. సార్స్ సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. కరోనా వైరస్ రకాల్లో ఒకటి సార్స్. 21వ శతాబ్దంలో వేగంగా వ్యాపించే జబ్బుగా గుర్తింపు దక్కించుకుంది. 2002లో చైనా ఫొషన్ నుంచి మొదలైంది. తుంపర్ల ద్వారా ఈ వైరస్ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 2003లో సార్స్(సార్స్ కోవ్) మన దేశంలో మొదటి కేసు నమోదు అయ్యింది. మొత్తం మూడుకేసులు నమోదుకాగా.. అంతా కోలుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 30 దేశాల్లో దాదాపు ఎనిమిది వేల మంది సార్స్ బారినపడగా.. 774 మంది మృతిచెందారు. దీని కొత్త స్ట్రెయినే ఇప్పడు కరోనా వైరస్(సార్స్ కోవ్ 2)గా విజృంభిస్తోంది. -
అవి ఆరోగ్యంగా ఉంటే.. మనమూ ఉన్నట్టే!
జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను నివారించేందుకు మనకున్న మేలైన మార్గం పాడి పశువుల ఆరోగ్యాన్ని కాపాడటమేనని హెల్త్ ఫర్ యానిమల్స్ అనే సంస్థ చెబుతోంది. ఎందుకంటే కనీసం 13 వ్యాధులు మనుషుల నుంచి జంతువులకు కూడా సోకే అవకాశం ఉంది కాబట్టి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాడిపశువుల రంగానికి ఈ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తుంది. పాడి పశువులు, పౌల్ట్రీ, మాంసం కోసం పెంచే మేక, గొర్రె వంటి జంతువులపై ఈ సంస్థ పరిశోధనలు చేస్తోంది. జంతువులకు అవసరమైన మందులు, వ్యాక్సిన్లను తయారు చేసే కంపెనీలు కూడా ఈ సంస్థలో భాగమే. ఏటా కొత్తగా బయటపడుతున్న ఐదు వ్యాధుల్లో మూడు జంతువుల నుంచి సంక్రమించేవే. వ్యాధుల కారణంగా ఏటా కనీసం 20 శాతం పాడిపశువులు మరణిస్తుంటాయని, దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనీసం వందకోట్ల మందిపై ఉంటుందని ఈ సంస్థ చెబుతోంది. (చదవండి: భవిష్యత్ మహమ్మారి జీ4..!) గత 12 ఏళ్లలో వ్యాధుల కారణంగా అంతర్జాతీయ స్థాయిలో ఆరుసార్లు పెద్దసంఖ్యలో పాడిపశువులు మరణించాయని, గాలికుంటు వ్యాధి, స్వైన్‌ఫ్లూ, ఏవియన్ బర్డ్ ఫ్లూ వంటి వాటి కారణంగా జరిగిన ఆర్థిక నష్టం దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయల వరకు ఉందని ఈ సంస్థ అంచనా. ఈ వ్యాధుల నియంత్రణకు, మనుషుల ప్రాణాలను రక్షించేందుకు 1995 నుంచి 2008 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు పది లక్షల కోట్ల రూపాయల వరకు ఖర్చయ్యాయి. యాంటీబయాటిక్‌లను అందివ్వడం ద్వారా జంతువ్యాధుల్ని చాలా వరకూ నివారించవచ్చునని తద్వారా వాటిని సంరక్షించుకోవడమే కాకుండా.. వాటిపై ఆధారపడ్డవారి నష్టాలను కూడా తగ్గించవచ్చునని ఈ సంస్థ చెబుతోంది. (జూనోసిస్ డే...) -
చైనాను కలవరపెడుతోన్న మరో వైరస్
బీజిగ్: ఓ వైపు కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుండగానే.. మరో కొత్త రకం స్వైన్ ఫ్లూ వైరస్ ఒకటి ప్రస్తుతం చైనాను కలవరపెడుతోంది. ఇది గతంలో విస్తరించిన స్వైన్ ఫ్లూ వైరస్ కంటే ఎంతో ప్రమాదకరమైనదని.. అంటువ్యాధిగా మారే లక్షణాలు కలిగి ఉందని అమెరికా సైన్స్ జర్నల్ పీఎన్ఏఎస్ సోమవారం ప్రచురించింది. జీ4 అని పిలువబడే ఇది జన్యుపరంగా 2009లో స్వైన్ ఫ్లూకు కారణమైన హెచ్1ఎన్1 జాతి నుంచి వచ్చిందని నివేదిక వెల్లడించింది. ఇది మానవులకు సోకడానికి అవసరమైన అన్ని లక్షణాలను కలిగి ఉందని చైనా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు వెల్లడించారు. (చైనా ప్రాజెక్టులకు కరోనా సెగ) పరిశోధకులు 2011 నుంచి 2018 వరకు 10 చైనా ప్రావిన్సులు, పశువైద్య ఆస్పత్రులు, కబేళాలలో పందుల నుండి 30,000 వేల స్వాబ్స్‌ను సేకరించి పరిశోధనలు జరిపారు. దాదాపు 179 స్వైన్ ఫ్లూ వైరస్‌లను ఐసోలేట్ చేసినట్లు తెలిపారు. అయితే 2016 నుంచి కొత్త రకం వైరస్ ఒకటి పందులలో బాగా అభివృద్ధి చెందినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని గురించి తెలుసుకోవడానికి పరిశోధకులు ఫెర్రోట్స్‌తో సహా పలు ప్రయోగాలు చేశారు. ప్లూ పరిశోధనల్లో ఈ ఫెర్రోట్స్ టెస్ట్‌ను బాగా ఉపయోగిస్తారు. ఎందుకుంటే ఈ వ్యాధి సోకిన వారిలో జలుబు, జ్వరం, దగ్గు లక్షణాలే కనపడతాయి. అయితే తాజాగా గుర్తించిన జీ4 చాలా ప్రమాదకరమైన అంటువ్యాధిగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫెర్రెట్ల కంటే తీవ్రమైన లక్షణాలు కలిగి ఉందని తెలిపారు. సాధారణ ఫ్లూ నుంచి మానవుల్ని రక్షించే రోగనిరోధక శక్తి ఈ జీ4 నుంచి కాపాడలేదని పరీక్షలు తెలుపుతున్నాయన్నారు. (చైనాకు పాశ్చాత్య సెగ) ఇప్పటికే 4.4 శాతం మంది జనాభా ఈ జీ4 బారిన పడినట్లు పరీక్షల్లో తేలిందన్నారు శాస్త్రవేత్తలు. అంతేకాక ఈ వైరస్ జంతువుల నుంచి మానవులకు వ్యాపించినట్లు గుర్తించామన్నారు. అయితే ఇది మానవుడి నుంచి మానవునికి వ్యాపిస్తుందనే దానిపై ఇంకా స్పష్టమైన ఆధారాలు లభించలేదన్నారు. ఒకవేళ జీ4 వైరస్ మానవుల్లో ఒకరి నుంచి ఇతరులకు వ్యాపిస్తే.. మహమ్మారిగా మారే ప్రమాదం అధికంగా ఉందన్నారు. కనుక పందులతో పని చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు కోరారు. ‘జూనోటిక్ రోగకారకాలు రోజురోజుకు అభివృద్ధి చెందుతుండటంతో మానవులు నిరంతరం ప్రమాదంలో ఉన్నారు. వన్యప్రాణుల కంటే కూడా మానవులకు ఎక్కువ సంబంధం ఉన్న వ్యవసాయ జంతువుల నుంచి ఈ మహమ్మారి వైరస్లు ఎక్కువ వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తున్నది’ అని అని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో వెటర్నరీ మెడిసిన్ విభాగం చీఫ్‌గా పని చేస్తున్న జేమ్స్ వుడ్ తెలిపారు. వైరస్ జంతువు నుంచి మానవులకు వ్యాప్తి చెందటాన్ని జూనోటిక్ ఇన్ఫెక్షన్ అంటారు. -
అస్సాంలో ఆఫ్రికన్ ఫ్లూ కలకలం
గువహటి : భారత్‌లో ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తుంటే ఈశాన్య భారతంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ బీభత్సం సృష్టిస్తోంది. ఫిబ్రవరిలో అస్సాంలో తొలి స్వైన్ ఫీవర్ కేసు నమోదైంది. ప్రస్తుతం అది తీవ్రరూపం దాల్చి 15,600 పందులు మరణించాయని ఆ రాష్ర్ట పశుసంవర్ధక శాఖ మంత్రి అతుల్ బోరా తెలిపారు. పందుల లాలాజలం, రక్తం, మాంసం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. అంతేకాకుండా పందుల్లో సంక్రమించే అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి కావడంతో దీని నివారణకు పందులను సామూహికంగా చంపేందుకు కేంద్రప్రభుత్వం అనుమతినిచ్చింది. వ్యాధి నివారణకు రాష్ర్ట ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని అతుల్ అన్నారు. ఈ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు పందులను సామూహికంగా చంపేందుకు స్థానిక ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే కేవలం వైరస్ సోకిన పందులను మాత్రమే చంపాలని నిర్ణయించింది. (ఒకపక్క కరోనా, మరోపక్క వరదలు ) ఇక వ్యాధి బారిన పడి చనిపోయిన పందులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. పందులను పెంచే రైతులకు ఒకే విడతలో రూ.144 కోట్ల ఆర్థిక ప్యాకేజీని అందించాలని కేంద్రాన్ని కోరింది. ఇక రాష్ట్రంలో పెరుగుతున్న ఈ సంక్షోభం కారణంగా తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని అసోం పశు సంవర్ధక శాఖ మంత్రి అతుల్ బోరా తెలిపారు. రోజురోజుకీ పందుల మరణాలు పెరుతున్నాయని, ప్రస్తుతం వైరస్ ప్రభావం పది జిల్లాలకు సోకిందని పేర్కొన్నారు. ఇప్పటికే 15,600 పందులు చనిపోయాయని, వీటి సంఖ్య మరింత పెరుగుతోందన్నారు. పంది పెంపకం దారులకు ఉపశమనం కలిగించే దిశగా పంది మాంసం అమ్మకం, వినియోగం విషయంలో కొన్ని నిబంధనలపై సడలింపు ఇచ్చామని అతుల్ బోరా చెప్పారు. (టాపర్‌గా కూరగాయలు అమ్మే వ్యక్తి కొడుకు ) -
చైనా నుంచే వ్యాప్తి: భయపెడుతున్న స్వైన్ ఫీవర్
గువాహటి: భారత్‌లో ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తుంటే ఈశాన్య భారతంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ వైరస్ బారినపడి అసోంలో ఇప్పటి వరకు దాదాపు 15 వేల పందులు మృత్యువాతపడ్డాయి. ఫిబ్రవరిలో ఇక్కడ తొలి స్వైన్ ఫీవర్ కేసు నమోదైన విషయం తెలిసిందే. అది కాస్తా క్రమంగా తీవ్ర రూపం దాల్చడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాధి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు పందులను సామూహికంగా చంపేందుకు స్థానిక ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే కేవలం వైరస్ సోకిన పందులను మాత్రమే చంపాలని నిర్ణయించింది. ఇక వ్యాధి బారిన పడి చనిపోయిన పందులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. (వైరస్‌లను తరిమికొట్టే కోటింగ్ సృష్టి ) పందులను పెంచే రైతులకు ఒకే విడతలో రూ.144 కోట్ల ఆర్థిక ప్యాకేజీని అందించాలని కేంద్రాన్ని కోరింది. ఇక రాష్ట్రంలో పెరుగుతున్న ఈ సంక్షోభం కారణంగా తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని అసోం పశు సంవర్ధక శాఖ మంత్రి అతుల్ బోరా తెలిపారు. రోజురోజుకీ పందుల మరణాలు పెరుతున్నాయని, ప్రస్తుతం వైరస్ ప్రభావం పది జిల్లాలకు సోకిందని పేర్కొన్నారు. ఇప్పటికే 14,919 పందులు చనిపోయాయని, వీటి సంఖ్య మరింత పెరుగుతోందన్నారు. ఈ క్రమంలో పరిస్థితిని కేంద్రానికి వివరించి అప్రమత్తం చేశామని తెలిపారు మరోవైపు బాధిత పది జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసింది. (మాస్కు ఉల్లంఘన: హైదరాబాద్ టాప్ ) ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది జంతువులకు సోకే వైరస్. ఇది మనుషులకు వ్యాప్తి చెందదు. ఒక జంతువు నుంచి ఇతర జంతువులకు సోకే ఈ వైరస్ భారత్‌లో వ్యాపించడం ఇదే మొదటిసారి. చైనా నుంచి ఈ వ్యాధి వచ్చినట్లు అసోం పేర్కింది. ఇది ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా వ్యాపించింది. (దేశంలో మరో వైరస్.. ఇది కూడా చైనా నుంచే!) -
దేశంలో మరో వైరస్.. ఇది కూడా చైనా నుంచే!
గువహటి : అసలే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తాజాగా మరో వైరస్ వెలుగుచూసింది. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూగా పిలిచే ఈ వైరస్ మొట్టమొదటిసారిగా అస్సాంలో బయటపడిందని ప్రభుత్వం వెల్లడించింది. భోపాల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఎన్ఐహెచ్ఎస్ఎడి) ఈ వైరస్‌ను ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ (ఎఎస్ఎఫ్) అని ధృవీకరించినట్లు తెలిపింది. అయితే దీనివల్ల మనుషులకు పెద్దగా ప్రమాదం లేదని, దీనికి కోవిడ్‌తో ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది. అస్సాంలో ఇప్పటివరకు 306 గ్రామాల్లో ఈ వైరస్ ప్రబలి 2,500 పందులు మరణించాయి. (ఆపత్కాలంలో అస్సాం కీలక నిర్ణయం!) పందుల లాలాజలం, రక్తం, మాంసం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. అంతేకాకుండా పందుల్లో సంక్రమించే అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి కావడంతో దీని నివారణకు పందులను సామూహికంగా చంపేందుకు కేంద్రప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే తాము ఆ పనిని చేయమని, ప్రత్యామ్నాయ పద్దతుల్లో అడ్డుకట్ట వేస్తామని అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా వైరస్ ప్రబలిన జిల్లాల నుంచి ఇతర ప్రాంతాలకు పందుల రవాణా ఆపేశామని తెలిపింది. పొరుగు రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిందిగా అస్సాం పశుసంవర్ధక శాఖ మంత్రి అతుల్ బోరా అన్నారు. ఈ వైరస్ ఇంకా పెద్దగా వ్యాప్తిచెందలేదని, ఇప్పటికే నమూనాలు సేకరించి మూడు ప్రత్యేక ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2019 ఏప్రిల్‌లో ఈ వైరస్ చైనాలోని జిజాంగ్ ప్రావిన్స్ గ్రామంలో బయటపడిందని, అక్కడినుంచి అరుణాచల్ మీదుగా అస్సాంలో వ్యాధి ప్రబలడానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే వైరస్ పెద్దగా ప్రమాదం కాదని, వ్యాధి ప్రబలని ప్రాంతాల్లో పంది మాంసం తినొచ్చని పశు సంవర్ధక శాఖ అధికారులు పేర్కొన్నారు. (కరోనా కలకలం: అసోం ఎమ్మెల్యే అరెస్టు ) -
కరోనా వైరస్ మాటున స్వైన్ ఫ్లూ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో కాలానుగుణంగా సంక్రమించే వైరస్ అంటు వ్యాధులను మొదటి సారిగా 2009లో గుర్తించారు. జనవరి నుంచి మార్చి, జూలై నుంచి సెప్టెంబర్ నెలల మధ్య ఈ వైరస్ల వల్ల ప్రజలు జబ్బు పడుతున్నారు. 2019లోనే భారత దేశాన్ని స్వైన్ ఫ్లూ కుదిపేసింది. శాస్త్ర విజ్ఞాన పరిభాషలో ‘హెచ్1ఎన్1’గా వ్యవహరించే ఈ వైరస్ కేసులు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2019లో భారత్‌లో రెట్టింపు అయ్యాయి. (చదవండి: ప్రపంచ దేశాల్లో ప్రజా దిగ్భందనం) ఈ ఏడాది కూడా మార్చి వరకు దేశంలో స్వైన్ ఫ్లూ కేసులు 1100 దాఖలుకాగా, 28 మంది మరణించారు. ఈ స్వైన్ ఫ్లూ కారణంగా ఫిబ్రవరి నెలలో జర్మనీకి చెందిన కంపెనీ స్వాప్ భారత్‌లోని తన యూనిట్‌ను మూసివేసింది. బెంగళూరులోని తమ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులకు ఈ వైరస్ సోకడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి మొదటి వారానికి ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 78 కేసులు నమోదయ్యాయి. వారిలో 19 మంది పోలీసులు అస్వస్థులుకాగా వారిలో 9 మంది మరణించారు. అదే నెలలో ఈ వైరస్ కారణంగా ఆరుగురు సుప్రీం కోర్టు జడ్జీలు అస్వస్థులయ్యారు. 2018 సంవత్సరంలో పోల్చినట్లయితే 2019లో స్వైన్ ప్లూ కేసులు రెట్టింపు అయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి అశ్వణి కుమార్ చౌబే స్వయంగా లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. మరణాలు కూడా అదే నిష్పత్తిలో పెరిగాయి. కోవిడ్ మహమ్మారి గురించి వార్తలు వెలువడడంతో ఈ స్వైన్ ఫ్లూ కేసులు మరుగున పడిపోయాయి. వాస్తవానికి రెండు వైరస్ల లక్షణాలు ఒకే రీతిగా ఉంటాయి. జలుబు, దగ్గు, గొంతు మంట, శ్వాస ఇబ్బంది, జ్వరం బాధిస్తాయి. వైరస్ సోకకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఒకటే! (కరోనా ఎఫెక్ట్ : అలిపిరి టోల్గేట్ మూసివేత) -
గంటలోపే స్వైన్‌ఫ్లూ నిర్ధారణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు తీసుకున్న చర్యలు బాగానే ఉన్నాయని, అయితే కరోనా (కోవిడ్) వైరస్ వ్యాప్తి కాకుండా తీసుకున్న ముందస్తు ప్రణాళికలను కూడా తెలియచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. స్వైన్‌ఫ్లూ, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడిన రోగులకు ప్రభుత్వాసుపత్రుల్లో సరైన వైద్య సహాయం అందడం లేదని నగరానికి చెందిన డాక్టర్ కరుణ, మరొకరు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంతో పాటు, న్యాయవాది రాపోలు భాస్కర్ రాసిన లేఖను కూడా పిల్‌గా పరిగణించిన ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. స్వైన్‌ఫ్లూ (హెచ్1ఎన్1) వ్యాధి నిర్ధారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశారు. స్వైన్‌ఫ్లూ పరీక్షా కేంద్రాలు మూడు మాత్రమే ఉన్నాయని, మరో 14 చోట్ల ఏర్పాటు చేసేందుకు యంత్రాలను కొనుగోలు చేస్తున్నట్తు వివరించారు. మార్చి నెలాఖరులోగా ఈ యంత్రాలు వినియోగంలోకి వస్తాయని, ఇవి వస్తే ఒక చిప్ ద్వారా అనుమానితుడిని పరీక్షించి ఒక్క గంట వ్యవధిలోనే వ్యాధి నిర్ధారణ పరీక్ష ఫలితాలు వెలువరించ వచ్చునని తెలిపారు. ప్రస్తుతం స్వైన్‌ఫ్లూ పరీక్షలు నిర్వహించే యం త్రాలు నారాయణ గూడలోని ఐపీఎం, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, గాంధీ ఆస్పత్రుల్లోనే ఉన్నాయని చెప్పారు. కొత్తగా కొనుగోలు చేయ బోయే యంత్రాలను కింగ్ కోఠి, ఖమ్మం, గద్వాల, సంగారెడ్డి జిల్లా ఆస్పత్రులు, ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, వనపర్తి, భువనగిరి ఏరియా ఆస్పత్రులు, బార్కాస్, హుజూరాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, శామీర్‌పేట, పెద్దపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 187 స్వైన్‌ఫ్లూ కేసులు నిర్ధారణ ప్రభుత్వాసుపత్రుల్లో 253 స్వైన్‌ఫ్లూ నమూనాలను పరీక్షిస్తే 26 మందికి, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 1,200 నమూనాలను పరీక్షిస్తే 161 మందికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం స్వైన్‌ఫ్లూ రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ప్రజలకు అవగాహనా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పారు. స్వైన్‌ఫ్లూ సాంకేతిక కమిటీ గత జనవరి 2న సమావేశమైందని, జిల్లా స్థాయిలో అవగాహనా సమావేశాల నిర్వహణ, నమూనాల సేకరణ, ఇతర అంశాలపై శిక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. రెండు లక్షల పోస్టర్లు, 15 లక్షల కరపత్రాలను ముద్రించామని, ర్యాలీ నిర్వహించామని తెలిపారు. విద్యార్థులకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని డీఈవోలను ఆదేశించామన్నారు. అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. వాదనల అనంతరం కోవిడ్‌పై తీసుకున్న జాగ్రత్తలపై సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణ మార్చి 6కి వాయిదా వేసింది. -
కన్నబిడ్డను చూడకుండానే..
సాక్షి, హైదరాబాద్: నవమాసాలు మోసి, బిడ్డను కని.. అమ్మతనాన్ని ఆనందించకుండానే ఆ తల్లి కన్నుమూసింది. మరోపక్క పుట్టిన బిడ్డ కనీసం ముర్రుపాలకూ నోచుకోలేదు. తల్లి స్పర్శకు నోచుకోక ఆస్పత్రి ఎన్ఐసీయూలో ప్రస్తుతం ఆ శిశువు క్షేమంగా ఉన్నా.. తల్లిని కోల్పోవడం విషాదాన్ని మిగిల్చింది. కరీంనగర్‌కు చెందిన గర్భిణి షహనాజ్ (24) తీవ్ర జ్వరం, జలుబు, తలనొప్పితో బాధపడుతుండటంతో వరంగల్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. స్వైన్‌ఫ్లూగా అనుమానించిన వైద్యులు.. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్న ఆమెను బంధువులు వెంటిలేటర్ సాయంతో ఈ నెల 18న రాత్రి పొద్దుపోయాక గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు ఆమెకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌గా తేలింది. అప్పటికే ఆమెకు నెలలు నిండటం, పరిస్థితి విషమంగా ఉండటంతో 19వ తేదీన సిజేరియన్ చేశారు. ఆడశిశువు జన్మించింది. శిశువుకు పరీక్షలు నిర్వహించగా, ఫ్లూ నెగటివ్ రావడంతో బిడ్డను ఇదే ఆస్పత్రి పీడియాట్రిక్ విభాగంలోని ఎన్ఐసీయూకు తరలించారు. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉండటంతో తల్లిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందించారు. ఫ్లూ బారి నుంచి కాపాడేందుకు వైద్యులు ఎంతగా ప్రయత్నించినా.. పరిస్థితి విషమించి షహనాజ్ సోమవారం కన్నుమూసింది. బిడ్డను కళ్లారా చూడకుండానే మృతి చెందడం, తల్లిపాల కోసం బిడ్డ గుక్కపట్టి ఏడవటం కలచివేసింది. విజృంభిస్తోన్న వైరస్ చలికాలంలో విజృంభించే హెచ్1ఎన్1 స్వైన్‌ఫ్లూకారక వైరస్.. ప్రస్తుతం సీజన్‌తో సంబంధం లేకుండా విస్తరిస్తోంది. జనవరి నుంచి రాష్ట్రంలో 148 కేసులు నమోదు కాగా, వీరిలో హైదరాబాద్ జిల్లావాసులే యాభై మందికిపైగా ఉన్నారు. బాధితుల్లో ఇప్పటికే ఒకరు మృతిచెందగా, తాజాగా బాలింత మృతితో మృతుల సంఖ్య రెండుకు చేరింది. గాలి ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ప్రస్తుతం గాంధీలో మౌలాలికి చెందిన బాలిక (11)తో పాటు కార్పొరేట్ ఆస్పత్రుల్లో మరో నలుగురు ఫ్లూ పాజిటివ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. ముందు జాగ్రత్తే మందు.. – డాక్టర్ శ్రీధర్, స్వైన్‌ఫ్లూ నోడల్ ఆఫీసర్, ఉస్మానియా ఆస్పత్రి – సాధారణ ఫ్లూ, స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఒకేలా ఉంటాయి. కాబట్టి జ్వరం, దగ్గు, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపించగానే స్వైన్‌ఫ్లూగా అనుమానించాల్సిన పనిలేదు. – రోగ నిరోధకశక్తి తక్కువుండే మధుమేహులు, గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, కిడ్నీ, కాలేయ మార్పిడి చికిత్సలు చేయించుకున్న వారు ఫ్లూ బారినపడే అవకాశాలు ఎక్కువ. – స్వైన్‌ఫ్లూలో దగ్గు, జలుబు, ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, 101, 102 డిగ్రీల జ్వరం, ఒళ్లు నొప్పులు, బాగా నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, కొందరిలో వాంతులు, విరోచనాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు మూడు రోజుల కంటే ఎక్కువ వేధిస్తే వైద్యులను సంప్రదించాలి. – వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం. బయటి నుంచి ఇంటికి వచ్చినప్పుడు చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పిల్లలకు ఇది నేర్పించాలి. – స్వైన్‌ఫ్లూ లక్షణాలున్న వారు తుమ్మినా, దగ్గినా చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలి. -
ఒకవైపు కరోనా.. మరోవైపు స్వైన్‌ఫ్లూ..
సాక్షి, రామగుండం: ‘ఒకవైపు కరోనా.. మరోవైపు స్వైన్‌ఫ్లూ..’ ప్రాణాంతకమైన వైరస్లు ప్రజలను వణికిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఎక్కువగా మాస్క్‌లు ధరించినవారే కనిపిస్తున్నారు. ఈ నేపధ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఎయిర్‌పోర్ట్‌ల వద్ద వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఓ కుటుంబానికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు అనుమానంతో పరీక్షలు చేసిన వైద్యులు చివరికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఈ కుటుంబం ఇటీవల చైనా నుంచి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. అధికారులు మాత్రం బాధిత కుటుంబ వివరాలను గోప్యంగా ఉంచారు. చైనాలో తొలిసారిగా.. చైనాలో తొలిసారి వెలుగు చూసిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ మనదేశంలోకి సైతం ప్రవేశించింది. ఈ వైరస్ సోకిన వ్యక్తికి వ్యాధి తీవ్రత అధికంగా ఉండడంతోపాటు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం అధికంగా ఉంటుంది. దీని ప్రభావంతో ఇప్పటికే చైనాలో చాలా మంది మరణించారు. అలాంటి వారిని ముట్టుకోవద్దు.. విదేశీ ప్రయాణాలు చేసేవారు తమ సహ ప్రయాణికులతో జాగ్రత్తగా ఉండాలి. జలుబు, గొంతులో గరగర, జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి.. ఎవరికైనా జలుబు చేసినట్టుగా అనిపిస్తే వారిని ముట్టుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. తొలుత ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకినట్లుగా భావిస్తున్నారు. అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు నాణ్యత గల మాస్క్‌లను వాడడం మంచిది. వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి.. ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. మాస్క్‌లు ధరించాలి. తుమ్మినా, దగ్గినా చేతి రుమాలను అడ్డుగా పెట్టుకోవాలి. జలుబు చేసిన వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకే ప్రమాదం ఉంది. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అపరిశుభ్ర చేతులతో ముక్కు, నోరు తాకొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ముఖ్యంగా విదేశీ ప్రయాణం చేసేవారు తరచూ సబ్బుతో చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండడం మంచిది. అంతేకాక, ప్రజా బాహుళ్యం ఎక్కువగా ఉన్న చోట్ల అనవసరంగా ఏ వస్తువులను పడితే వాటిని తాకకూడదు. లక్షణాలు ఇవే.. కరోనా వైరస్ సోకితే జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, ఛాతిలో నొప్పి, వాంతులు తీవ్రంగా ఉంటాయి. ఈ లక్షణాలు తీవ్రమైన న్యుమోనియోకు దారి తీసి ఊపిరాడక మనిషి మరణించే ప్రమాదమూ ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వారికి జలుబు ఎక్కువగా ఉండి, ముక్కు కారుతూనే ఉంటుంది. తలనొప్పి, జ్వరం, దగ్గు, గొంతులో మంట ఉంటాయి. ఆరోగ్యంగా లేనట్లు అనిపిస్తుంది. అంతకు మించి ఈ వైరస్ సోకినా వారికి వేరే ఏ లక్షణాలు కనిపించవు. ఇక ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. రెగ్యులర్‌గా సబ్బు, నీటితో చేతులు కడుక్కోవాలని చెబుతున్నారు. ఇతరుల కళ్లు, ముక్కు, నోటిని ఎవరూ చేతులతో టచ్ చేయవద్దని, రోగులకు దగ్గరగా ఉండొద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. ఈ దేశాల్లోనూ వైరస్ ప్రభావం.. చైనాలోని బీజింగ్, షాంఘై, సౌత్ గాంగ్ డాంగ్ ప్రావిన్స్‌లోనూ చాలా మంది ఈ వైరస్ బారినపడ్డారు. దక్షిణకొరియా, జపాన్, థాయ్‌లాండ్‌లోనూ ఈ వ్యాధి కేసులు వెలుగు చూశాయి. చైనాలో అనేక కేసులు అధికారికంగా నమోదైనా ఇంకా వెలుగులోకి రాని కేసులు చాలా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
‘స్వైన్‌ఫ్లూ’ కాలంతో జాగ్రత్త..
చలికాలం సమీపించడంతో జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే చలి పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. సాక్షి, నల్లగొండ టౌన్: చలికాలం సమీపించడంతో జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే చలి పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే మేలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో స్వైన్‌ఫ్లూ బారిన పడి మరణించిన సంఘటనలు లేనప్పటికీ చలికాలంలో వ్యాధి వ్యాప్తి చెందే అవకావం లేకపోలేదు. చలితీవ్రత లేని రోజుల్లో అంటే ఈ ఏడాది మార్చి నాటికే జిల్లాలో 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్, దేవరకొండ, శాలిగౌరారం, మర్రిగూడ మండలాల్లో స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసులను నమోదైన సంఘటనలు ఉన్నాయి. వారికి హైదరాబాద్‌లోని గాంధీ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొంది వ్యాధి నుంచి విముక్తులయ్యారు. అప్రమత్తంగా వైద్య ఆరోగ్యశాఖ.. చలికాలంలో గాలి ద్వారా ఒకరి నుంచి మరోకరికి ఇన్ఫ్లూయంజా ఏ వైరస్ వ్యాప్తి చెందుతుండడం, ఊపిరితిత్తుల అంతర భాగాలకు వ్యాధి సోకడం వల్ల ప్రమాదకారిగా మారి ప్రాణాపాయం సంబవించే అవకాశం ఉంటుం ది. స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఎవరైనా కనపడితే వెంటనే వారి రక్తనమూనాలను సేకరించి హైదరాదాద్‌లోని ఐపీఎం (ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రీవెంటీవ్ మెడిషిన్) ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో పది పడకలతో ప్రత్యేక స్ల్వైన్ఫ్లూ వార్డును ఏర్పాటు చేశారు. స్వైన్‌ఫ్లూ పాజిటివ్ అని ఐపీఎం నివేదికలో తేలితే వెంటనే వారికి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స అందించడానికి అవసరమైన మందులను కూడా అందుబాటులో ఉంచినట్లు జిల్లా వైద్య ఆరోగశాఖ అధికారులు పేర్కొంటుననారు. ప్రజలు వ్యాధిపై అవగాహనను పెంపొందించుకుని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు. స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలు.. దగ్గు, ముక్కుకారడం, ఆయాసం, దమ్మురావడం, ఊపిరిపీల్చడానికి కష్టపడడం, పిల్లికూతులు రావడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, గొంతులో గరగర, జ్వరం రావడం, వం టి నొప్పులు, కళ్ల నుంచి నీరుకారడం, చెవి నొ ప్పి, చెవి నుంచి చీము కారడం, చిన్న పిల్లలకు నిమ్ముచేయడం వంటి లక్షణాలు కనపడతాయి. స్వైన్‌ఫ్లూ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. బహిరంగ ప్రదేశాలు, ఏటీఎంలు, తలుపుల గొళ్లాలు, మొదలైన వాటిని వాడిన తరువాత, ప్రయాణాలను చేసిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కునే వరకు ముక్కు, కళ్లు, నోటిని ముట్టుకోవద్దు. చేతులను తరుచుగా సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోటికి, ముక్కకు చేతి రుమాలును అడ్డంగా పెట్టుకోవాలి. ఎక్కువగా నీళ్లు తాగడంతో పాటు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. చలికాలంలో మంచుపడుతున్న సమయంలో బయటకు రాకూడదు. ఉన్నిదుస్తులను ధరించాలి, వేడివేడి ఆహరం, గోరువెచ్చని నీ టిని తాగడం మంచిది. చిన్న పిల్లల శరీర ఉష్ణోగ్రతలు తగ్గకుండా ఉన్ని దుస్తులను వేయాలని, లక్షణాలు కనపడిన వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేం«ద్రంలోని డాక్టర్‌ను సంప్రదించాలి. ముందస్తు జాగ్రత్తలు చేపట్టాం చలి పెరుగుతుండడంతో స్వైన్‌ఫ్లూ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. స్వైన్‌ఫ్లూను ఎదుర్కొనేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం. స్వైన్‌ఫ్లూ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కడైనా అనుమానిత కేసులు నమోదైతే వెంటనే ప్రత్యేక వైద్య బృందం వెళ్లి వారిని పరీక్షించడంతో పాటు చుట్టూ ఉన్న యాబై ఇండ్లలోని వారికి కూడా పరీక్షలను చేయడానికి ఏర్పాట్లు చేశాం. – డాక్టర్ అన్నిమళ్ల కొండల్రావు, డీఎంహెచ్ఓ -
అప్రమత్తతే రక్ష
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్లో చలి తీవ్రత నానాటికి పెరుగుతోంది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులను శరీరం స్వీకరించలేకపోతోంది. చలికి వాహన, పారిశ్రామిక కాలుష్యం తోడవడంతో స్వైన్‌ఫ్లూ కారక వైరస్ మరింత విస్తరించే ప్రమాదం ఉంది. ఇప్పటికే శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతు న్న ఆస్తమా రోగులు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇక రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పసిపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు త్వరగా ఫ్లూ బారిన పడే ప్రమాదం ఉంది. చలి తీవ్రతకు కాళ్లు, చేతులు, పెదాలపై పగుళ్లు ఏర్పడటం, జుట్టు రాలడం వంటి సమస్యలు ఎదురవుతాయి. బద్దకంతో వ్యాయామం చేయకపోవడం వల్ల పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోయి అధిక బరువుకు కారణమవుతుంది. ఇప్పటికే మధుమేహం, రక్తపోటు, హృద్రోగ సమస్యతో బాధపడు తున్న వారిలో సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. చలికాలంలో ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణుల సూచిస్తున్నారు. చిన్నారులకు ఫ్లూ ముప్పు చలికాలంలో చిన్నపిల్లలు ఎక్కువగా నిమోనియాతో బాధపడుతుంటారు. వాతావరణ కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చిన్నారులను తిప్పడం వల్ల శ్వాసనాళ సబంధ సమస్యలు వెలుగు చూస్తుంటాయి. చలికి శ్వాసనాళాలు మూసుకుపోయి స్వేచ్ఛగా ఊపిరి తీసుకోలేక పోతారు. తరచూ నిద్ర లేచి ఏడుస్తుంటారు. చలి తీవ్రతకు కాళ్లు, చేతులు, పెదాలపై పగుళ్లు ఏర్పడి మంట పుడుతుంది. ఇది మానసికంగా చిరాకు కలిగిస్తుంది. సాధ్యమైనంత వరకు కాళ్లు, చేతులను కప్పి ఉంచే ఉన్ని దుస్తులను ఎంపిక చేసుకోవాలి. వాతావరణంలో ఫ్లూ కారక వైరస్ మరింత బలపడుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, బాలింతలు, గర్భిణులు, వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆస్తమా బాధితులు విధిగా ముక్కుకు మాస్క్‌లు ధరించడం, రాత్రిపూట ఏసీ ఆఫ్ చేసి, తక్కువ స్పీడ్‌లో తిరిగే ఫ్యాను కిందే గడపడం, సిమెంటు, సున్నం, బొగ్గు, ఇతర రసాయన పదార్థాలకు దూరంగా ఉండటం, మంచు కురిసే సమయంలో ఆరుబయటికి వెళ్లక పోవడం మంచిది. తాత్కాలిక ఉపశమనం కోసం ఉదయం ‘నాడీ శోధన’ ప్రాక్టీస్ చేయడం ద్వారా శ్వాస నాళాల పని తీరును కొంత వరకు మెరుగు పర్చుకోవచ్చు. – డాక్టర్ రఫీ, ఫల్మొనాలజిస్ట్ చర్మ పగుళ్ల సమస్య ఉదయాన్నే చాలా మంది తమ పిల్లలను టూ వీలర్‌పై స్కూలు, కాలేజీలకు తీసుకెళ్తుంటారు. ఈ సమయంలో బయట మంచుతో పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మార్కెటింగ్ రంగంలో పని చేసే యువతీ యువకులు కూడా టూ వీలర్‌పై ప్రయాణిస్తుంటారు. ఎక్కువ సేపు చలిగాలిలో తిరగడం వల్ల కాళ్లు, చేతులు, పెదాలు, ఇతర శరీర భాగాల్లోని చర్మంపై పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఇలాంటి వారు రాత్రి శరీరానికి పాండ్స్, వాయిజ్లీన్ ఉత్పత్తులను అప్లయ్ చేసుకోవడం ద్వారా చలి బారి నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. పెదాలను ఉమ్మితో తడపకుండా రోజూ వాటిపై లిప్‌గార్డ్‌ను రుద్దడం చేయాలి. మంచి నీటిని ఎక్కువగా తాగాలి. సోరియాసిస్ బాధితులు స్నానానికి ముందు శరీరానికి ఆయిల్ అప్లయ్ చేసుకోవడం, గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం, వీలైనంత వరకు సాయంత్రం తర్వాత బయటికి వెళ్లకుండా చూసుకోవడం ద్వారా చర్మ సంబంధ సమస్యల నుంచి బయటపడవచ్చు. – డాక్టర్ మన్మోహన్, చర్మ వైద్యనిపుణుడు మెళకువలు పాటిస్తే చాలు చలికాలంలో వాకింగ్ వెళ్లాలని, జిమ్‌కు వెళ్లి భారీ కసరత్తులు చేయాలని చాలా మంది భావిస్తుంటారు. బద్దకం వల్ల కొంత మంది, సమయం లేక మరికొందరు దీనిని వాయిదా వేస్తుంటారు. నిజానికి వ్యాయామానికి ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. రోజువారి వృత్తి పనిలో చిన్న చిన్న మెళుకువలు పాటిస్తే సరిపోతుంది. ఎస్కలేటర్లు, లిఫ్టులు వాడకుండా మెట్లు ఎక్కడం, వీలున్నప్పుడు చిన్న చిన్న జంపింగ్‌లు చేయడం, అర నిమిషం పాటు వెనక్కి నడవడం, సైక్లింగ్‌ను రోజువారీ కార్యకలాపాల్లో ఓ భాగంగా చేసుకోవడం, శరీరంలోని నడుము కింది భాగాలకు ఎక్కువ శ్రమ కలగాలంటే సైకిల్‌పై ఎక్కువ సేపు నిలబడి ఉండటం, మెట్రోలో ప్రయాణించే ఉద్యోగులు రైలు ఎక్కి దిగేటప్పుడు ఎస్కిలేటర్, లిఫ్ట్‌కు బదులు మెట్లను ఉపయోగించడం వల్ల శరీ రానికి అవసరమైన వ్యాయామం పొందవచ్చు. తద్వారా శారీరకంగా ధృడంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. – వెంకట్, ప్రముఖ ఫిట్‌నెన్ నిపుణుడు -
స్వైన్‌ఫ్లూ రోగుల కోసం ప్రత్యేకవార్డులు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒకవైపు డెంగీ డేంజర్ కొనసాగుతుండగా, మరోవైపు స్వైన్‌ఫ్లూ పంజా విసురుతోంది. కాస్త దగ్గు, జలుబు, తలనొప్పి, జ్వరం వస్తేనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ రాష్ట్రవ్యాప్తంగా 39 ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వైన్‌ఫ్లూ రోగుల కోసం ప్రత్యేకవార్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో 60, ఉస్మానియా, ఫీవర్, నిలోఫర్ ఆసుపత్రుల్లో 30 పడకల చొప్పున ప్రత్యేకవార్డులను ఏర్పాటు చేశారు. కింగ్‌కోఠి ఆసుపత్రి 10, మలక్‌పేట ఏరియా ఆసుపత్రి 3, నాంపల్లి ఏరియా ఆసుపత్రిలో 4 పడకల చొప్పున ప్రత్యేకవార్డులను ఏర్పాటు చేశారు. ప్రతిజిల్లా ఆసుపత్రుల్లోనూ 10 పడకల చొప్పున ప్రత్యేకవార్డులను ఏర్పాటు చేశారు. స్వైన్‌ఫ్లూ నివారణకు అప్రమత్తంగా ఉండాలని ఆసుపత్రులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. 1.70 లక్షల స్వైన్‌ఫ్లూ క్యాప్సిల్స్ ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 2 వేల స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా, 25 మంది చనిపోయినట్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రస్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. స్వైన్‌ఫ్లూకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులుంటే, 040–24651119 నంబర్‌కు ఫోన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. 8 మంది వైద్యాధికారులతో రాష్ట్రస్థాయి నోడల్ టీంను ఏర్పాటు చేసింది. జిల్లాల్లో ప్రతి స్వైన్‌ఫ్లూ కేసుపై సమగ్రమైన వివరాలను పంపాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులను గుర్తించేందుకు ఐపీఎం, గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రుల్లోనూ స్వైన్‌ఫ్లూ నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో కేవలం ఒకేచోట మాత్రమే నిర్ధారణ పరీక్షలు జరిగేవి. ఇప్పుడు రోజుకు వెయ్యి శాంపిళ్లను పరీక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. స్వైన్‌ఫ్లూ రోగుల కోసం 1.70 లక్షల క్యాప్సిల్స్‌ను ఇప్పటికే జిల్లాలకు పంపించినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. 5,458 సిరప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. రోగులకు వైద్యం చేసే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కోసం 13,750 వ్యాక్సిన్లు జిల్లాలకు పంపిణీ చేశారు. 15 వేల మాస్‌్కలు, 7,500 శానిటైజర్లు పంపించారు. 4,635 పీపీఈ కిట్లను జిల్లాలకు పంపించాలని నిర్ణయించారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక స్వైన్‌ఫ్లూ విజృంభించే అవకాశముందని వైద్యాధికారులు చెబుతున్నారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలు తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబు, తల, ఒళ్లు నొప్పులు ఉంటాయి. పిల్లల్లో తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్య ఎదురువుతుంది. ఒక్కోసారి చర్మం నీలం లేదా బూడిద రంగులోకి మారుతుంది. దద్దుర్లు వస్తాయి. కొన్ని సందర్భాల్లో వాంతులు అవుతాయి. ఒక్కోసారి నడవడమూ కష్టంగా ఉంటుంది. పెద్దల్లోనైతే కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఛాతీ, కడుపునొప్పి కూడా ఉంటుంది. నిరంతరాయంగా వాంతులు అవుతాయి. -
మళ్లీ..స్వైన్ ‘ఫ్లో’!
సాక్షి, హైదరాబాద్: స్వైన్ ‘ఫ్లో’.. మళ్లీ మొదలైం ది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కు తోడు పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో హెచ్1ఎన్1 స్వైన్‌ఫ్లూ కారక వైరస్ విజృంభిస్తుంది. ఇప్పటికే ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1,300 పైగా కేసులు నమోదు కాగా, వీరిలో 21 మంది మృతి చెందారు. తాజాగా హైదరాబాద్‌లో మరో నాలుగు అనుమానిత ఫ్లూ కేసులు నమోదు కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బాధితుల్లో ఇద్దరు పురుషులు కాగా.. ఒక మహిళ, ఒక బాలుడున్నట్లు సమాచారం. వీరిలో ఒకరు గాంధీలో చికిత్స పొందుతుండ గా, మరో ముగ్గురు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ఆయా ఆస్పత్రుల వైద్యులు వీరి నుంచి నమూనాలు సేకరించి వ్యా ధి నిర్ధారణ కోసం ఐపీఎంకు పంపినట్లు చెబుతున్నాయి. ప్రస్తుతం వారికి అనుమానిత స్వైన్ ఫ్లూగా భావించి చికిత్సలు అందజేస్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి.. ఫ్లూ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వైరస్ గాలిలోకి ప్రవేశించి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువున్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతున్న వారు జన సమూహంలోనికి వెళ్లకపోవడమే ఉత్తమం. బాధితులు ఉపయోగించిన రుమాలు, టవల్ వంటివి వాడొద్దు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ముఖానికి అడ్డంగా కర్చీఫ్‌ను పెట్టుకోవాలి. జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారితో కరచాలనం, ఆలింగనాలు చేయొద్దు. మందులు వాడుతున్నా లక్షణాలు తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి. గ్రేటర్లో 1,106 కేసుల నమోదు 2009లో ‘హెచ్1ఎన్1’ఇన్‌ఫ్లూయెంజా వైరస్ తొలిసారిగా వెలుగుచూసింది. తర్వాత నగరంలో స్వైన్‌ఫ్లూ కేసులు, మరణాలు భారీగా నమోదయ్యాయి. ఏడాది పాటు నిశ్శబ్దంగా ఉన్న వైరస్ మళ్లీ 2012లో ప్రతా పం చూపించింది. ఈ ఏడాది ఇప్పటివరకు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్‌లో 671, రంగారెడ్డి 208, మేడ్చల్ జిల్లాలో 227 ప్లూ పాజి టివ్ కేసులు నమోదవగా 21 మంది మృతిచెందారు. మారిన వాతావరణ పరిస్థితులకు తోడు ఇటీవల గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జనసమూహంలో ఎక్కువగా గడపడం వల్ల ఫ్లూ ఒకరి నుంచి మరొకరికి సులభంగా విస్తరించినట్టు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాం ముందు జాగ్రత్తల్లో భాగంగా ఉస్మానియా, గాంధీ, ఫీవర్, ఛాతి ఆస్పత్రి సహా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, ఏరియా ఆస్పత్రులకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ఎన్–95 రకం మాస్క్‌లను ప్రభుత్వం సరఫరా చేసింది. రోగుల కోసం ‘ఒసల్టామీవిర్’ టాబ్లెట్స్‌ను, డబుల్ లేయర్ మాస్క్‌లను అందుబాటులో ఉంచింది. స్వైన్‌ఫ్లూ నిర్ధారణ పరీక్షలను గాంధీ, ఫీవర్, ఐపీఎంలో ఉచితంగా చేస్తున్నాం. – డాక్టర్ శంకర్, ఫీవర్ ఆస్పత్రి -
మళ్లీ ‘స్వైన్’ సైరన్!
సాక్షి, సిటీబ్యూరో: కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న హెచ్1ఎన్1 స్వైన్‌ఫ్లూ కారక వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. పగటిపూట ఎండలు తగ్గుముఖం పట్టడం, సాయంత్రం చిరుజల్లులకు తోడు చలిగాలులు వీస్తుండటంతో వైరస్ బలపడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 1227 స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదు కాగా, కేవలం రెండు వారాల్లోనే పదిహేను కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. ఇదిలా ఉంటే గత ఏడాది 1007 కేసులు నమోదు కాగా, వీరిలో 28 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఏడాది ఇప్పటికే 20 మంది మృతి చెందినట్లు అధికారుల గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. జిల్లాలతో పోలిస్తే గ్రేటర్ పరిసర ప్రాంతాల్లోనే ఫ్లూ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. చాప కింది నీరులా విస్తరిస్తున్న ఈ స్వైన్‌ఫ్లూపై మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. హైరిస్క్ గ్రూప్‌ను వెంటాడుతున్న ఫ్లూ భయం పదేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాండించిన స్వైన్‌ఫ్లూ వైరస్ మరోసారి విస్తరిస్తుంది. కేవలం గ్రేటర్‌లోనే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిల్లాలోనూ చాప కింది నీరులా విస్తరిస్తుండటంతో సామాన్య ప్రజలే కాదు రోగులు చికిత్స పొందుతున్న ఆయా ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య, నర్సింగ్, ఇతర వైద్య సిబ్బంది సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ తమను ఆ వైరస్ వెంటాడుతుందోనని ఆందోళన చెందుతున్నాయి. కేవలం గ్రేటర్లో నమోదైన కేసులే కాకుండా జిల్లాల్లో నమోదైన కేసులు సైతం నగరంలోని ఆస్పత్రులకు తరలిస్తుండటంతో హెచ్1ఎన్1 వైరస్ ఎక్కడ తమకు చుట్టు కుంటుందోనని భయపడుతున్నారు. గతంలో హైరిస్క్ జోన్లో పని చేస్తున్న సిబ్బందికి రోగి నుంచి వైరస్ సోకడమే ఇందుకు కారణం. వ్యాధి నివారణలో భాగంగా వీరికి ముందస్తు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా, స్వైన్‌ఫ్లూ రోగులకు చికిత్స అందిస్తున్న గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో ఈ మందు మచ్చుకైనా కన్పించడం లేదు. వైరస్ సోకకుండా ఒక్కక్కరికి ఒక్కో డోసు చొప్పున పంపిణీ చేయాల్సి ఉంది. కానీ స్వైన్‌ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో కూడా వ్యాక్సిన్ లేక పోవడంతో అక్కడ పని చేసే వైద్యులే కాకుండా చికిత్సల కోసం అక్కడికి వస్తున్న రోగులు సైతం భయ పడుతున్నారు. చివరకు ఫ్లూ బాధితుల వద్దకు వెళ్లడానికి కూడా సిబ్బంది జంకుతున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి సాధారణ ఫ్లూ జ్వరాలు వచ్చే వ్యక్తిలో కన్పించే లక్షణాలన్నీ స్వైన్‌ఫ్లూ బాధితుల్లో కనిపిస్తాయి. ముక్కు కారడం, దగ్గు, గొంతునొప్పి, తుమ్ములు, కళ్లవెంట నీరు కారడం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. కొందరికి వాంతులు, విరేచనాలు అవుతాయి. గర్భిణులు, శ్వాస కోశ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఊబకాయులకు సులభంగా వ్యాపించే అవకాశం ఉంది. వ్యాధి బారిన పడిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వైరస్ గాలిలోకి ప్రవేశిస్తుంది. ఇలా ఒకసారి బయటికి వచ్చిన వైరస్ వాతావరణంలో రెండుగంటలకుపైగా జీవిస్తుంది. ఫ్లూ లక్షణాలతో బాధపడే వారికి దూరంగా ఉండాలి. మాస్కు ధరించండంతో పాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. వీలైనంత ఎక్కువ సార్లు నీళ్లు తాగాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. జనసమూహ ప్రాంతాలకు వెళ్లక పోవడమే ఉత్తమం. తీర్థయాత్రలు, ప్రయాణాలు రద్దు చేసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. ఇతరులకు షేక్‌హ్యాండ్ ఇవ్వడం, కౌగిలించుకోవ డం చేయరాదు. చిన్న పిల్లలతో సహా ఎవరినీ ముద్దు పెట్టుకోకూడదు. అనుమానం వచ్చిన వెంటనే వ్యాధి నిర్ధారణ కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్ శ్రీధర్, ఉస్మానియా ఆస్పత్రి -
స్వైన్‌ఫ్లూ మృతుల వివరాలు ఎందుకివ్వలేదు?
సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు, విషజ్వరాల బారిన పడి మరణించినవారి వివరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభు త్వం ఎందుకు దాటవేత వైఖరి అవలంబిస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. తొలిసారి వివరాలు కోరినప్పుడు ఆయా రోగాల కారణంగా మృత్యువాత పడినవారి వివరాలు ఇవ్వకుండా ఎంతమంది ఆ రోగాల బారిన పడ్డారో, ఎంతమందికి వైద్య పరీక్షలు నిర్వహించారో వంటి వివరాలే ఇచ్చిన అధికారులు రెండో సారి కూడా మృతుల వివరాలు ఇవ్వకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 8న జరిగే విచారణ నాటికి పూర్తి వివరాలు అందజేయాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీ వల ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రోగాలు, విషజ్వరాల కారణంగా పేద రోగులకు ప్రభుత్వాసుపత్రుల్లో సరైన చికిత్స అందడం లేదని, రోగులు చని పోతున్నారని, ప్రైవేటు ఆస్పత్రుల్లో బిల్లుల భారాన్ని రోగులు మోయలేకపోతున్నారని న్యాయవాది రాపోలు భాస్కర్ రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి విచారణ చేపట్టింది. ఎన్ని వైద్య శిబిరాలు నిర్వహించారో, ఎంతమందికి వైద్య పరీక్షలు చేశారో, వారిలో ఎంతమందికి ఆయా రోగా లు ఉన్నాయని తేలిందో, తీసుకున్న నివారణ చర్య లు తదితర వివరాలతో సమగ్ర నివేదిక అందజేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్వైన్‌ఫ్లూపై ఆందోళన తెలంగాణ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చి న రెండో నివేదికలో మరణించిన రోగుల వివరాలు లేకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకూ 5,574 మందికి వైద్యపరీక్షలు నిర్వహిస్తే 1,165 మందికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు తేలిందని నివేదికలోని వివరాలు చూసిన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అందులో హైదరాబాద్‌లోనే 606 మంది ఉన్నారని, వ్యాధి నివారణకు తీసుకున్న చర్యలు, ఇప్పటి వరకు మరణించిన రోగుల వివరాలను అందజేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్‌ను ఆదేశించింది. కేంద్రం కూడా తమ వాదనలతో కౌం టర్ వ్యాజ్యాన్ని దాఖలు చేయాలని, రాష్ట్రప్రభుత్వం సమగ్ర వివరాలను తెలపాలని ఆదేశించింది. -
గాంధీ ఆస్పత్రిలో అరుదైన ప్రసవం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వైద్యులు అరుదైన ప్రసవం చేశారు. స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్న ఓ మహిళకు డెలివరీ చేశారు. వెంటిలేటర్‌పై ఉన్న సదురు మహిళకు స్వైన్‌ఫ్లూ వార్డులోనే చికిత్స అందించారు. తర్వాత కొద్ది రోజులకు తల్లి, బిడ్డను ఆస్పత్రి నుంచి క్షేమంగా డిశ్చార్జ్ చేశారు. స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్న తన కూతురికి చికిత్స చేయడానికి కార్పొరేట్ వైద్యులు 25 లక్షల రూపాయలు అడిగారని.. అయినా గ్యారంటీ లేదన్నారని ఆ మహిళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డను బతికించిన గాంధీ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ కేసుల వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన స్వైన్‌ప్లూ, డెంగ్యూ కేసుల వివరాలను తమ ముం దుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ వ్యాధులు ప్రబలినట్లు గుర్తించిన 117 ప్రాంతాల వివరాలను కూడా సమర్పించాలంది. ఈ కేసులో కోర్టు సహాయకారి (అమికస్ క్యూరీ)గా సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డిని నియమించింది. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కా లిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ వ్యాధులకు చికిత్స అందించేందుకు సౌకర్యాలు లేవంటూ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. బుధవారం ఈ వ్యాజ్యం మరో సారి విచారణకు వచ్చింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ వ్యవహారంలో వైద్యఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సమర్పించిన నివేదికపై ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. స్వైన్‌ఫ్లూ చికిత్స కేవలం గాంధీ ఆసుపత్రిలోనే అందుబాటులో ఉంటే మారుమూల ఉన్న ప్రాంతాల ప్రజల సంగతేమిటని ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
యానాంలో స్వైన్‌ఫ్లూ కలకలం..
తూర్పుగోదావరి, యానాం: యానాం పట్టణంలో స్వైన్‌ఫ్లూ కలకలం సృష్టించింది. పట్టణపరిధిలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన ఇసుకపట్ల సంపత్ అనే వ్యక్తికి స్వైన్‌ఫ్లూ సోకిందని కాకినాడకు చెందిన ఒక ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు రక్తపరీక్షల ఆధారంగా గుర్తించి మెరుగైన వైద్యం కోసం అతడిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. కొన్ని రోజులుగా సంపత్ అనారోగ్యబారిన పడడంతో అతడిని కుటుంబసభ్యులు శుక్రవారం యానాంలో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరిస్థితి విషమించడంతో కాకినాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వివిధ పరీక్షలు నిర్వహించి ఆదివారం మధ్యాహ్నం స్వైన్‌ఫ్లూ అని నిర్ధారించారని వారి కుటుంబసభ్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తీసుకువెళ్లారు. బాధితుడు దరియాలతిప్పలో ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అపరిశుభ్రత వల్లే : అంబేడ్కర్‌నగర్ గ్రామస్తులు అంబేడ్కర్ నగర్ శివారు ప్రాంతాలు ముఖ్యంగా కోరంగినదీ కాలువ వెంబడి ఉన్న ఏటిగట్టుకు ఆనుకుని ఉన్న నివాసాల వద్ద పరిసరాలు అశుభ్రంగా ఉంటున్నాయని పందులు స్వైరవిహారం చేస్తున్నాయని, మున్సిపాలిటీవారు చెత్తను తీసుకువెళ్లడం లేదని గ్రామస్తులు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. పందులు గుంపులుగా వచ్చి అక్కడే తిష్టవేస్తున్నాయని వాటి గురించి ఎవరూ పట్టించు కోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ సిబ్బంది ఇక్కడి చెత్తను తొలగించడం లేదు సరికదా, ఎక్కడి నుంచో తెచ్చిన చెత్తను ఇక్కడే వేస్తున్నారని వారు తెలిపారు. ముఖ్యంగా పందులు స్వైరవిహారం చేయడం వల్లే స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకిందని తక్షణం అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నివాసాల చెంతకు పందులు వస్తుండటంతో పలువురిపై దాడులు చేస్తున్నాయని ఈ సమస్యను పరిష్కరించాలని ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని వారు ముక్తంకంఠంతో కోరుతున్నారు.