tariff hikes
-
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు తీపికబురు
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) తన కస్టమర్లకు శుభవార్త అందించింది. సమీప భవిష్యత్తులో టారిఫ్ రేట్లను పెంచబోమని బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ రవి స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో బీఎస్ఎన్ఎల్కు కస్టమర్లు పెరుగుతున్న నేపథ్యంలో స్పామ్ బ్లాకర్స్, ఆటోమేటెడ్ సిమ్ కియోస్క్‌లు, డైరెక్ట్-టు-డివైస్ సేవలు వంటి కొత్త ఆఫర్లను తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉన్న వినియోగదారులను నిలుపుకోవడంతోపాటు కొత్తవారిని ఆకర్షించడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడుతాయని చెప్పారు.సెప్టెంబర్ 2024లో బీఎస్ఎన్ఎల్ ఊహించని విధంగా 8.5 లక్షల మంది సబ్స్క్రైబర్లను పొందింది. ప్రైవేట్ రంగ టెలికాం కంపెనీలకు ఈమేరకు కస్టమర్లు తగ్గుతున్నారు. జులైలో ప్రైవేట్ టెలికాం సంస్థలు 10 శాతం నుంచి 27 శాతం వరకు టారిఫ్ రేట్లను పెంచడంతో వినియోగదారులు బీఎస్ఎన్ఎల్కు మళ్లుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డేటా ప్రకారం రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ఇటీవల కాలంతో దాదాపు కోటి మంది చందాదారులను కోల్పోయాయి. జియో ఒక్కటే 79.69 లక్షల మంది సబ్స్క్రైబర్లను నష్టపోయింది.ఇదీ చదవండి: రిపేర్ బిల్లు చూసి చిర్రెత్తిన కస్టమర్!మెరుగైన సేవలందిస్తే మేలు..ప్రస్తుతం జియో 46.37 కోట్లు, ఎయిర్టెల్ 38.34 కోట్లు, బీఎస్ఎన్ఎల్ 9.18 కోట్ల మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉంది. బీఎన్ఎన్ఎల్కు సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ ప్రైవేట్ పోటీదారులతో పోల్చితే 4జీ, 5జీ సేవలందించడంతో చాలా వెనకబడి ఉంది. వినియోగదారుల పెంపును ఆసరాగా చేసుకుని విభిన్న విభాగాల్లో మెరుగైన సేవలందిస్తే మరింత మంది సబ్స్రైబర్లు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
రీఛార్జ్ ప్లాన్స్ ఎఫెక్ట్.. ఇప్పుడు అందరి చూపు దానివైపే..
ఇటీవల జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా వంటి టెలికాం దిగ్గజాలు రీఛార్జ్ ప్లాన్స్ ధరలను భారీగా పెంచాయి. పెరిగిన రీఛార్జ్ ప్లాన్స్ అన్నీ కూడా యూజర్లను ఒక్కసారిగా ఆందోళనకు గురి చేసింది. ఈ తరుణంలో యూజర్ల చూపు గవర్నమెంట్ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వైపు పడింది.రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెరగడంతో బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు మారుతున్న యూజర్ల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు సమాచారం. దీనికి కారణం ఇతర టెలికాం సంస్థలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ చార్జీలు తక్కువగా ఉండటమే. డేటా కోసం కాకుండా.. కేవలం కాల్స్ కోసం మాత్రమే ఉపయోగించేవారు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.2024 జులై 3, 4 తేదీల నుంచి జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాల టారిఫ్ ధరలు 15 శాతం నుంచి 20 శాతం పెరిగాయి. ధరలు పెరిగిన వారం రోజుల్లో సుమారు 2.5 లక్షల మంది బీఎస్ఎన్ఎల్కు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ద్వారా మారినట్లు తెలుస్తోంది. మరో 25 లక్షల మంది కొత్త బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు తీసుకున్నట్లు సమాచారం. -
అదిరిపోయే ప్లాన్లతో వినియోగదారునికి ఊరట..
-
టారిఫ్‌ల పెంపుతో ఏఆర్పీయూ జూమ్
ముంబై: టారిఫ్‌ల పెంపు టెలికం కంపెనీలకు మరింత ఆదాయన్ని తెచి్చపెట్టనుంది. ప్రతి యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 2025–26లో దశాబ్ద గరిష్ట స్థాయి రూ.225–230కు చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఏఆర్పీయూ రూ.182తో పోల్చి చూస్తే 25 శాతం వృద్ధి చెందుతుందని తెలిపింది. అధిక లాభాలు, తక్కువ మూలధన వ్యయాలతో టెలికం కంపెనీల పరపతి సైతం మెరుగుపడుతుందని పేర్కొంది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా టెలికం చార్జీలను 20 శాతం మేర పెంచడం తెలిసిందే. ఈ రేట్లు ఈ నెల 3 నుంచి అమల్లోకి వచ్చినట్టు క్రిసిల్ తన నివేదికలో గుర్తు చేసింది. అయితే, తదుపరి రీచార్జ్‌ల నుంచే పెంచిన చార్జీలు చెల్లించాల్సి వస్తుంది కనుక, దీని అసలు ప్రతిఫలం వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే కనిపిస్తుందని వివరించింది. 5జీ సేవలతో డేటా వినియోగం పెరుగుతుందని, ఇది కూడా ఏఆర్పీయూ పెరిగేందుకు మద్దతుగా నిలుస్తుందని క్రిసిల్ రేటింగ్స్ చీఫ్ రేటింగ్ ఆఫీసర్ మనీష్ గుప్తా తెలిపారు. వీడియో స్ట్రీమింగ్ సేవల కోసం కస్టమర్లు అధిక డేటా ప్లాన్లకు మారుతున్నట్టు క్రిసిల్ తన నివేదికలో తెలిపింది. మూలధన వ్యయ భారం తగ్గుతుంది.. తాజా చార్జీల పెంపుతో టెలికం పరిశ్రమ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ (ఆర్‌వోసీఈ) 2023–24లో ఉన్న 7.5 శాతం నుంచి 2025–26లో 11 శాతానికి పెరుగుతుందని క్రిసిల్ అంచనా వేసింది. ఆదాయంలో మూలధన వ్యయాల (పెట్టుబడులు) శాతం 2023–24లో 28 శాతంగా ఉంటే, 2025–26లో 19 శాతానికి దిగొస్తుందని తెలిపింది. చాలా వరకు టెలికం సంస్థలు 5జీ సేవలను అమల్లోకి తెచ్చాయని.. అలాగే, స్పెక్ట్రమ్‌పై అధిక వ్యయాలు 2022–23లోనే చేసినట్టు గుర్తు చేసింది. దీంతో కంపెనీల రుణ భారం 6.4 లక్షల కోట్ల నుంచి రూ.5.6 లక్షల కోట్లకు దిగొస్తుందని వివరించింది. కంపెనీలు మరో విడత రేట్లను పెంచితే, తమ తాజా అంచనాలకు ఇంకా మెరుగుపడతాయని తెలిపింది. -
దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు రిలయన్స్ సిద్ధం..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. టెలికాం విభాగంలో సేవలందిస్తున్న జియోను పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు తెచ్చే ప్రతిపాదనలున్నట్లు కొన్ని మీడియా సంస్థల కథనాల ద్వారా తెలిసింది. మార్కెట్ అనుకునేలా జియో ఐపీఓకు వస్తే దేశంలో మునుపెన్నడూ లేనివిధంగా రూ.55,000 కోట్ల నిధులు సమీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అది దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా రికార్డు నెలకొల్పనుంది.రిలయన్స్ జియో ఇటీవల మొబైల్ టారిఫ్‌లను పెంచింది. దాంతో టెలికాం రంగంలో సేవలందిస్తున్న ఎయిర్టెల్, వొడాఫోన్ఐడియా వంటి ఇతర కంపెనీలు జియో పంథానే ఎంచుకున్నాయి. అవి కూడా టారిఫ్‌లను పెంచాయి. దాంతో వినియోగదారుల నుంచి కొంత విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఇలా ఐపీఓ వార్తలు రావడం గమనార్హం. వచ్చే ఏడాది ప్రారంభంలో జియో ఐపీఓ రావొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు జియో 4జీ టారిఫ్‌లతోనే 5జీ సేవలు అందిస్తుండగా, ఇకపై 5జీకి ప్రత్యేక టారిఫ్ నిర్ణయించే అవకాశం ఉందని చెబుతున్నాయి.జులై నెలలో మొదటి త్రైమాసిక ఫలితాలు వెలువడే అవకాశం ఉండడంతో ఆగస్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) వార్షిక సాధారణ సమావేశాన్ని (ఏజీఎమ్) నిర్వహిస్తుంది. ఇందులో జియో ఐపీఓకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ ఊహిస్తున్న విధంగా జియో ఐపీఓ ద్వారా రూ.55 వేలకోట్లు సమీకరించానుకుంటే దేశంలో అతిపెద్ద ఐపీఓగా నిలువనుంది. ఇప్పటివరకు రూ.21 వేలకోట్లు సమీకరించి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఐపీఓనే అతిపెద్దదిగా ఉంది. జియో మొత్తం విలువ దాదాపు రూ.11 లక్షల కోట్లుగా అంచనా. పెద్ద కంపెనీ ఐపీఓకు వస్తే అందులో సుమారు 5 శాతం విక్రయించాల్సి ఉంటుంది. కాబట్టి దాని విలువ రూ.55 వేలకోట్లుగా లెక్కిస్తున్నారు.ఇదీ చదవండి: గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్.. మంత్రి ప్రకటనఇటీవల పెంచిన టారిఫ్‌లతో కంపెనీ సగటు వినియోగదారు ఆదాయం (ఆర్పు) పెరుగుతుందని మార్కెట్ అంచనా వేస్తుంది. 5జీకు ప్రత్యేకంగా టారిఫ్‌లు తీసుకురావడంతో మరింత ఆదాయం సమకూరుతుంది. దాంతో కంపెనీ రెవెన్యూలో పెరుగుదల ఉంటుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఫలితంగా కంపెనీ షేర్లను కొనుగోలు చేస్తున్నారు. కేవలం గడిచిన నెల రోజుల్లో స్టాక్ ధర ఏకంగా 11.4 శాతం పెరిగింది. -
టారిఫ్‌ల పెంపుతో టెల్కోలకు అధిక లాభాలు
న్యూఢిల్లీ: టారిఫ్‌ల పెంపుతో దేశీయంగా టాప్ మూడు టెలికం కంపెనీలకు ప్రతి యూజరుపై సగటున వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) 15 శాతం పెరగవచ్చని రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. దీంతో ఆపరేటర్ల నిర్వహణ లాభాలు 2025 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 20–22 శాతం మేర పెరుగుతాయని పేర్కొంది. స్పెక్ట్రం కొనుగోలు, 5జీ సేవలపై భారీగా ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు, ఆ పెట్టుబడులపై రాబడి పొందడానికి తంటాలు పడుతున్న నేపథ్యంలో ఇది సానుకూలంగా పరిణమించగలదని కేర్ రేటింగ్స్ తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 191గా ఉన్న ఏఆర్పీయూ ఈ ఆర్థిక సంవత్సరం 15 శాతం వృద్ధితో రూ. 220కి చేరవచ్చని విశ్లేషించింది. ప్రతి రూ. 1 ఏఆర్పీయూ పెరుగుదలతో పరిశ్రమ నిర్వహణ లాభాలు రూ. 1,000 కోట్ల స్థాయిలో పెరుగుతాయని తెలిపింది. ఏఆర్పీయూ, లాభాల పెరుగుదలతో టెక్నాలజీలను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు, నెట్‌వర్క్‌ను విస్తరించుకునేందుకు టెల్కోలకు వెసులుబాటు లభించగలదని వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ రుణ భారం కొంత దిగి వస్తుందని నివేదిక తెలిపింది. ఇటీవల జూన్‌లో ముగిసిన స్పెక్ట్రం వేలంలో టెల్కోలు పెద్దగా పాల్గొనకపోవడంతో .. రాబోయే రోజుల్లో రుణ భారం క్రమంగా మరింత తగ్గగలదని పేర్కొంది. -
గడువు పొడిగించేది లేదు
సాక్షి, హైదరాబాద్: ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించేది లేదంటూ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఝలక్ ఇచ్చింది. 2024–25 ఆర్థిక సంవత్స రానికి సంబంధించి డిస్కంల వార్షిక ఆదాయ అవసరాలు(ఏఆర్ఆర్), టారిఫ్ ప్రతి పాదన లు సమర్పించేందుకు జనవరి 31తో గడువు ముగిసింది. మరో మూడు నెలలు పొడిగించాలని డిస్కంలు చేసిన విజ్ఞప్తిని ఈఆర్సీ తోసిపుచ్చింది. మల్టీ ఈయర్ టారిఫ్(ఎంవైటీ) రెగ్యులేషన్స్ ప్రకారం సత్వరమే ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించాలని డిస్కంలకు ఆదేశించింది. ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు గడువులోగా సమర్పించడంలో విఫలమైతే డిస్కంలపై రోజుకు రూ.5000 చొప్పున జరిమానా విధించాలని ఎంవైటీ రెగ్యులేషన్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు పొడిగింపు ప్రతి ఏటా నవంబర్ 31లోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు ఈఆర్సీకి డిస్కంలు సమర్పించాలి. దాని ఆధారంగా వినియోగదారులకు ఎన్ని మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయాలి? దానికి ఎంత అవుతుంది ? ప్రస్తుత విద్యుత్ టారిఫ్‌తోనే వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేస్తే వచ్చే ఆదాయం ఎంత? అవసరమైన ఆదాయం, వచ్చే ఆదాయం మధ్య ఉండే వ్యత్యాసం(ఆదాయ లోటు) ఎంత? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విద్యుత్ సబ్సిడీలు పోగా, మిగిలే ఆదాయలోటు భర్తీ చేసేందుకు ఏ మేరకు విద్యుత్ చార్జీలు పెంచాలి ? వంటి అంశాలు ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనల్లో ఉంటాయి. ఈ ప్రతిపాదనలపై ఈఆర్సీ రాత పూర్వకంగా అభ్యంతరాలు స్వీకరించడంతో పాటు హైదరాబాద్, వరంగల్‌లో బహిరంగ విచారణ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతుంది. అనంతరం కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు ఆ సంవత్సరంలో వసూలు చేయాల్సిన విద్యుత్ టారి ఫ్ ఉత్తర్వులు జారీ చేస్తుంది. వినియోగదారుల కేటగిరీల వారీగా పెరిగిన/తగ్గిన విద్యుత్ చార్జీల పట్టిక ఇందులో ఉంటుంది. గతేడాది నవంబర్ 31లోగా ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉండగా, రాష్ట్ర శాసనసభ ఎన్నికల పేరుతో అప్పట్లో డిస్కంలు డిసెంబర్ 2 వరకు గడువు పొడిగింపు పొందాయి. విద్యుత్ టారీఫ్ ఖరారుకు సంబంధించిన కీలకమైన మార్గదర్శకాలతో మల్టీ ఈయర్ టారిఫ్ రెగ్యులేషన్స్‌ను ఆ తర్వాత కాలంలో ఈఆర్సీ ప్రకటించింది. ఈ కొత్త మార్గదర్శ కాలపై అధ్యయనం జరిపి ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించడానికి జనవరి 31వరకు రెండోసారి గడువు పొడిగించింది. డిస్కంల యాజమాన్యాలు తర్జనభర్జన రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారింలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్ అధికారులను సీఎండీలుగా నియమించింది. మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి తోడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచడానికి అనుమతించినట్టు తప్పుడు సంకేతాలు పోతాయని ప్రభుత్వవర్గాల్లో ఆందోళన నెలకొని ఉంది. డిస్కంల ఆర్థిక నష్టాలు రూ.50,275 కోట్లకు, అప్పులు రూ.59,132 కోట్లకు పెరిగినట్టు ఇటీవల రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యంగా మారిందని అధికారులు అంటున్నారు. మరోవైపు కొత్త ప్రభుత్వం నుంచి అనుమతి పొంది ప్రతిపాదనలు సమర్పించే విషయంలో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. -
కీలక టారిఫ్‌లను తొలగించనున్న జియో, ఎయిర్టెల్?
ఖర్చులను తట్టుకోవడానికి టెలికం రంగ సంస్థలు టారిఫ్‌లను పెంచడానికి రెడీ అవుతున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ ప్రీమియం కస్టమర్లకు ప్రస్తుతం అందించే తమ అన్లిమిటెడ్ 5జీ డేటా ప్లాన్లను ఆపేసే అవకాశం ఉంది. ఆదాయం పెంపునకు 2024 జూన్ నుంచి 4జీతో పోలిస్తే 5జీ సేవలకు కనీసం 5-10శాతం ఎక్కువ ఛార్జీ విధించవచ్చని టెలికం రంగ నిపుణులు చెబుతున్నారు. టెలికం కంపెనీలు 5జీ సేవల కోసం భారీగా ఇన్వెస్ట్ చేశాయి. ఈ ఖర్చును రాబట్టుకోవడానికి 2024 సెప్టెంబర్ క్వార్టర్లో రెండు టెలికాం ఆపరేటర్లు మొబైల్ టారిఫ్‌లను కనీసం 10శాతం పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం. కస్టమర్లను 5జీకి అలవాటు చేయడానికి, ఇప్పటికే ఉన్న వినియోగదారులను ఆకర్షించడానికి ఈ రెండు కంపెనీలు 5జీ అన్లిమిటెడ్ డేటా ఆఫర్లతో పాటు 4జీ ధరలకే 5జీ సేవలను అందిస్తున్నాయి. జనం 5జీకి అలవాటు పడటం మొదలైనందున కంపెనీలు మానిటైజేషన్‌పై దృష్టిసారించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు సంస్థలు కొన్ని నెలల్లో 5జీ- కోసం ప్లాన్లను ప్రకటించవచ్చని జెఫ్రీస్ ఒక రీసెర్చ్ నోట్లో తెలిపింది. ఎయిర్టెల్, జియో 5జీ రేట్లు 4జీ కంటే 5-10శాతం ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. ఇటువంటి ప్లాన్లకు 30-40శాతం అదనపు డేటాను జోడించి మార్కెట్ షేరును పెంచుకొని, లాభాలు పొందవచ్చని తెలిసింది. ఇదీ చదవండి: రోజూ రూ.3 కోట్లు మాయం! ఎలా మోసం చేస్తున్నారంటే.. తగిన సమయంలో ఛార్జీలు పెంచడానికి వెనకాడబోమని గతంలో ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ అన్నారు. ప్రతి కస్టమర్ నుంచి వచ్చే నెలవారీ సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) ప్రస్తుతం ఉన్న రూ.200 నుంచి దాదాపు రూ.250కి పెంచుకుంటామని ప్రకటించారు. జియో, ఎయిర్‌టెల్‌కు కలిపి ఇప్పటికే 12.5 కోట్ల మంది 5జీ యూజర్లు ఉన్నారు. దేశం మొత్తం 5జీ యూజర్ బేస్ 2024 చివరి నాటికి 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. -
జియో గుడ్‌న్యూస్.. ఆ కస్టమర్లే టార్గెట్!
దేశంలో అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio).. కోట్లాది మంది టెలికం కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. 5జీ ప్లాన్లు విస్తరిస్తున్నప్పటికీ టారిఫ్‌లు మాత్రం పెంచబోమని హామీ ఇచ్చింది. దేశంలోని మిగతా అన్ని టెలికమ సంస్థల కంటే తమ రీచార్చ్ ప్లాన్లు చవగ్గానే ఉంటాయని వెల్లడించింది. అసలు టార్గెట్ వారే.. టెలికం పరిశ్రమలో రిలయన్స్ జియో దూకుడును మరింత పెంచింది. రానున్న రోజుల్లో 5జీ ప్లాన్లపైన కూడా టారిఫ్‌లను పెంచబోమని ప్రకటించింది. అయితే దీని వెనుక అసలు టార్గెట్ వేరే ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో ఇప్పటికీ 2జీ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్న 24 కోట్ల మందికిపైగా ఎయిర్టెల్, వొడాఫోన్ఐడియా, బీఎస్ఎన్ఎల్/ఎమ్టీఎన్ఎల్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఈ "సరసమైన టారిఫ్‌లు" ప్రకటన చేసినట్లు అర్థమవుతోంది. అంబానీల దృష్టి కూడా అదే.. జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్ మాట్లాడుతూ.. కంపెనీ టారిఫ్‌లను నాటకీయంగా పెంచాలని భావించడం లేదని, యూజర్లు ఇంటర్నెట్-హెవీ, డేటా ప్లాన్లకు మారుతున్న నేపథ్యంలో కస్టమర్లను మరింత పెంచుకోవడంపై దృష్టి సారిస్తుందని చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీల దృష్టి కూడా అదేనని ఆయన వివరించారు. ఇదీ చదవండి: 70 hours work: ఆయనైతే 90 గంటలు పనిచేసేవారు.. భర్తకు అండగా సుధామూర్తి -
వొడాఫోన్‌కు 2023 కీలక సంవత్సరం కానుంది!
న్యూఢిల్లీ: టెలికం రంగానికి 2023 చాలా కీలక సంవత్సరంగా ఉండనుందని బ్రోకరేజి సంస్థ సీఎల్ఎస్ఏ పేర్కొంది. పరిశ్రమలో లాభసాటైన మూడో సంస్థగా కొనసాగగలదా లేదా అనే కోణంలో వొడాఫోన్ ఐడియాకు (వీఐఎల్) ఇది నిర్ణయాత్మకమైన ఏడాదిగా ఉండనుందని తెలిపింది. అలాగే డేటా వినియోగం, టారిఫ్‌ల పెంపు ఆధారిత ఆదాయ వృద్ధి .. పరిశ్రమకు కీలకంగా ఉంటుందని ఒక నివేదికలో సీఎల్ఎస్ఏ వివరించింది. దీని ప్రకారం 2023లో దేశీ మొబైల్ మార్కెట్లో 5జీ సేవల విస్తరణ, టారిఫ్‌ల పెంపు, రిలయన్స్ జియో పబ్లిక్ ఇష్యూ మొదలైనవి ప్రధానాంశాలుగా ఉండబోతున్నాయి. ప్రైవేట్ నెట్‌వర్క్‌లను అనుమతించిన పక్షంలో వ్యాపార సంస్థలకు ఇచ్చే 5జీ సర్వీసుల ద్వారా టెల్కోలకు వచ్చే ఆదాయాలకు కొంత గండి పడే అవకాశం ఉంది. 2022లో 14 శాతం పెరిగిన దేశీ మొబైల్ రంగం ఆదాయం 2023లో కూడా దాదాపు అదే స్థాయిలో వృద్ధి చెందవచ్చు. టారిఫ్‌ల పెంపు, డేటా వినియోగం పెరుగుదల ఇందుకు తోడ్పడనున్నాయి. టారిఫ్‌లను పెంచే విషయంలో భారతి ఎయిర్టెల్ అన్నింటికన్నా ముందు ఉండవచ్చని.. వీఐఎల్, రిలయన్స్ జియో దాన్ని అనుసరించవచ్చని సీఎల్ఎస్ఏ నివేదిక పేర్కొంది. నిధుల సమీకరణలోను, బకాయిలకు బదులు కేంద్రానికి వాటాలు ఇచ్చే ప్రతిపాదనల అమల్లో జాప్యాల కారణంగా వీఐఎల్ ఆర్థిక సంక్షోభం అవకాశాలు పూర్తిగా సమసిపోలేదని తెలిపింది. వీఐఎల్ మార్కెట్ వాటా తగ్గుతూ జియో, ఎయిర్టెల్ మార్కెట్ పెరగడం కొనసాగవచ్చని సీఎల్ఎస్ఏ వివరించింది. మొత్తం మీద యూజర్లపై వచ్చే సగటు ఆదాయం, డేటా వినియోగం పెరగడం ద్వారా టెలికం పరిశ్రమ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 14 శాతం వృద్ధితో 2025 ఆర్థిక సంవత్సరం కల్లా రూ. 2,84,600 కోట్లకు చేరవచ్చని తెలిపింది. చదవండి: భళా బామ్మ! సాఫ్ట్‌వేర్‌ను మించిన ఆదాయం, 15 రోజులకే 7 లక్షలు! -
ఎయిర్టెల్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్ (క్యూ1)లో నికర లాభం దాదాపు ఆరు రెట్లు ఎగసి రూ. 1,607 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 283 కోట్లు ఆర్జించింది. టారిఫ్‌ల పెంపు ప్రధానంగా ప్రభావం చూపింది. మొత్తం ఆదాయం సైతం 22 శాతం వృద్ధితో రూ. 32,085 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో రూ. 26,854 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. దేశీ ఆదాయం 24 శాతం బలపడి రూ. 23,319 కోట్లకు చేరగా.. మొబైల్ సర్వీసుల నుంచి 27 శాతం అధికంగా రూ. 18,220 కోట్లు లభించింది. హోమ్ సర్వీసుల(ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్) ఆదాయం 42 శాతం పురోగమించి రూ. 927 కోట్లకు చేరగా.. బిజినెస్ విభాగం నుంచి రూ. 4,366 కోట్లు సమకూరింది. ఇది 15% అధికం. ఆఫ్రికా ఆదాయం 15% ఎగసి 127 కోట్ల డాలర్ల(రూ. 10,098 కోట్లు)కు చేరింది. 4జీ స్పీడ్: ప్రస్తుత సమీక్షా కాలంలో ఎయిర్టెల్ మొత్తం కస్టమర్ల సంఖ్య 4.7 శాతం పుంజుకుని 49.69 కోట్లను తాకింది. దేశీయంగా ఈ సంఖ్య 36.24 కోట్లు. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) పరిశ్రమలోనే మెరుగ్గా రూ. 183కు చేరింది. గత క్యూ1లో నమోదైన రూ. 146తో పోలిస్తే ఇది 25 శాతంపైగా వృద్ధి. ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు నామమాత్ర లాభంతో రూ. 705 వద్ద ముగిసింది. -
జియో లాభం జూమ్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఈ ఏడాది క్యూ1లో రూ. 4,335 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఏప్రిల్–జూన్(రూ. 3,501 కోట్లు)తో పోలిస్తే ఇది 24 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం 21 శాతంపైగా ఎగసి రూ. 21,873 కోట్లను తాకింది. టారిఫ్‌ల పెంపు మెరుగైన పనితీరుకు సహకరించింది. నికరంగా 9.7 మిలియన్ యూజర్లు జత కలిశారు. దీంతో మొత్తం యూజర్ల సంఖ్య 41.99 కోట్లకు చేరింది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) త్రైమాసికంగా 5 శాతం బలపడి రూ. 175.7కు చేరింది. అత్యంత వేగవంత సర్వీసులందించగల 5జీ స్పెక్ట్రమ్‌కు వేలం ప్రారంభంకానున్న నేపథ్యంలో జియో వెల్లడించిన ఫలితాలకు ప్రాధాన్యత ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. టెలికం, డిజిటల్ బిజినెస్‌లతో కూడిన జియో ప్లాట్‌ఫామ్స్ కన్సాలిడేటెడ్ నికర లాభం 24% పుంజుకుని రూ. 4,530 కోట్లయ్యింది. ఆదాయం 24% వృద్ధితో రూ. 27,527 కోట్లకు చేరింది. -
ఎయిర్టెల్ యూజర్లకు భారీషాక్!
ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్ తగలనుంది. ఇప్పటికే గతేడాది టారిఫ్ రేట్లను పెంచిన ఎయిర్టెల్ సంస్థ ఈ ఏడాది మరోసారి టారిఫ్ రేట్లను పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో..ఈ ఏడాది తదుపరి విడత టారిఫ్‌ల పెంపుతో తమ ఏఆర్పీయూ (యూజరుపై వచ్చే సగటు ఆదాయం) రూ.200 మార్కును దాటగలదని టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ ఇండియా, దక్షిణాసియా ఎండీ గోపాల్ విఠల్ తెలిపారు. అయిదేళ్లలో దీన్ని రూ.300కు పెంచుకునే అవకాశం ఉందని ఇన్వెస్టర్లతో కాన్ఫరెన్స్ కాల్లో ఆయన చెప్పారు. గతేడాది మార్చి త్రైమాసికంలో నమోదైన రూ.145తో పోలిస్తే ఈ మార్చి క్వార్టర్లో ఎయిర్టెల్ ఏఆర్పీయూ రూ.178కి పెరిగింది. టెలికం సంస్థలు గత రెండేళ్లుగా మొబైల్ కాల్స్, డేటాల ధరలను పెంచుతున్నాయి. ప్రైవేట్ రంగంలోని మూడు సంస్థలు గతేడాది నవంబర్–డిసెంబర్లో మొబైల్ ప్లాన్ల రేట్లను 18–25 శాతం మేర పెంచాయి. మరోవైపు, చిప్‌ల కొరతతో స్మార్ట్ఫోన్ల రేట్లు పెరిగి విక్రయాలపై ప్రభావం పడిందని విఠల్ చెప్పారు. ఇది తాత్కాలిక ధోరణే కాగలదని ఎండీ గోపాల్ విఠల్ పేర్కొన్నారు. చదవండి👉ఎయిర్టెల్, జియో యూజర్లకు బంపరాఫర్! -
బిగ్ షాక్: సామాన్యుడి నెత్తిన మరో పిడుగు!
ఉప్పు నుంచి పప్పుదాకా..పెట్రోల్ నుంచి వంట నూనె దాకా. ఇలా పెరుగుతున్న నిత్యవసర ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇవి చాలవన్నట్లు మొబైల్ రీచార్జ్ టారిఫ్‌ల రూపంలో సామాన్యుడిపై ధరల భారం పడనుంది. పలు టెలికాం కంపెనీలు రీచార్జ్ టారిఫ్‌ల రేట్లను పెంచనున్నట్లు తెలుస్తోంది. దేశంలో ప్రముఖ టెలికాం దిగ్గజాలన్నీ గతేడాది నవంబర్ నెలలో 20, 25 శాతం (కంపెనీని బట్టి) టారిఫ్ ధరల్ని పెంచాయి. ఇప్పుడు మరోసారి యూజర్లపై ధరల భారం మోపేందు సిద్ధమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టారిఫ్ ధరల్ని పెంచడం ద్వారా... ఎవరతై తక్కువ ప్లాన్ టారిఫ్ ప్లాన్లను వినియోగించడం, ఇన్ యాక్టీవ్‌గా ఉన్న యూజర్ల బేస్‌ను తగ్గించాలని చూస్తున్నాయి. అదే జరిగితే యావరేజ్ పర్ రెవెన్యూ యూజర్(ఏఆర్పీయూ) అంటే యూజర్ల నుంచి వచ్చే సగటు తలసరి ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నాయి. యూజర్లు తగ్గడం లేదు గతేడాది నవంబర్ నెల నుంచి ఆయా టెలికాం సంస్థలు టారిఫ్ ధరల్ని పెంచాయి. అయినా సరే గత కొన్ని నెలలుగా యాక్టీవ్ యూజర్ల సంఖ్య పెరగడం, గతంలో పెంచిన టారిఫ్ ధరల గురించి యూజర్లు ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయడం లేదనే భావనలో టెలికాం సంస్థలున్నాయంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. జియో, ఎయిర్టెల్ రిలయన్స్ జియో నెట్ వర్క్ నుంచి ఇన్ యాక్టీవ్ నెంబర్లు తగ్గారు. దీంతో యాక్టీవ్‌గా ఉన్న యూజర్ల సంఖ్య పెరిగింది. 94శాతంతో ఇది ఫిబ్రవరి చివరి నాటికి ఆల్ టైమ్ గరిష్ట స్థాయికు చేరుకుంది. మరోవైపు ఎయిర్టెల్ సైతం తన ఏఆర్‌పీయూని పెంచడంపై దృష్టి సారించింది. గత డిసెంబర్ నెల సమాయానికి ఎయిర్టెల్ ఏఆర్పీయూ రూ.163 ఉండగా..టారిఫ్ ధరల్ని పెంచడం ద్వారా ఈ ఏడాది ఏఆర్‌పీయూని రూ.200 ఏఆర్‌పీయూకి పెంచుకోవాలని చూస్తుంది. అదేవిధంగా వొడాఫోన్ ఐడియా సైతం ఏఆర్‌పీయూని పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ ఆ సంఖ్య ఎంతనే స్పష్టం చేయలేదు. మార్కెట్ నిపుణులు ఏం చెబుతున్నారు ఈ సందర్భంగా టెలికాం నిపుణులు..గతంలో పెంచిన టారిఫ్ ధరలతో కంపెనీలపై ఎలాంటి ప్రభావం చూపలేదన్నారు. అయితే మరికొన్ని నెలల్లో స్పెక్ట్రమ్ వేలం తర్వాత టెలికాం ఆపరేటర్లు లాభాల్ని మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. అందుకే దాన్ని అధిగమించేందుకు ముందస్తుగా మనదేశ టెలికాం సంస్థలు టారిఫ్ ధరల్ని అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు 'దేశంలో 5జీ నెట్ వర్క్ విజయవంతం కావాలంటే ఏఆర్పీయూ మరింత వృద్ధి సాధించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉ఎగబడి మరీ కొంటున్నారు, మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే! -
ఎయిర్టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్...!
గతేడాది చివర్లో దేశీయ దిగ్గజ టెలికాం సంస్థలు టారిఫ్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సుమారు 20 శాతం మేర టారిఫ్ ధరలను దిగ్గజ టెలికాం కంపెనీలు పెంచాయి. కాగా ఈ ఏడాదిలో ఎయిర్ టెల్ టారిఫ్ ధరలను మరోమారు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కలిసొచ్చిన టారిఫ్ ధరల పెంపు..! మొబైల్ టారిఫ్ ధరల పెంపుతో భారతీ ఎయిర్‌టెల్‌కు మూడో త్రైమాసికంలో కాస్త కలిసొచ్చింది. వీటితో పాటు కంపెనీలో గూగుల్ పెట్టుబడులు ఉపశమనం కల్గించాయని కంపెనీ పేర్కొంది. ఎయిర్టెల్ డిసెంబర్ త్రైమాసికంలో నికర లాభం రూ. 854 కోట్ల నుంచి రూ. 830 కోట్లకు 3 శాతం పడిపోయిందని నివేదించింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం సంవత్సరానికి 13 శాతం పెరిగింది. ఈ త్రైమాసికంలో ఏఆర్పీయూ రూ.163కు మెరుగుపడింది. అయితే మరో మూడు లేదా నాలుగు నెలల్లో కాకపోయినా, ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలోనే మరో మారు టారిఫ్ పెంపు ఉండవచ్చునని ఎయిర్టెల్ టాప్ మేనేజ్మెంట్ అభిప్రాయపడ్డారు. 2022లో నెలకు ARPU (ఒక వినియోగదారుడి సగటు రాబడి)ని రూ. 200 తీసుకోవాలని కంపెనీ భావిస్తోందని మేనేజ్మెంట్ పేర్కొంది. దీంతో టారిఫ్ పెంపు మరోమారు ఉండే అవకాశం ఉన్నట్లు కన్పిస్తోంది. బోర్డు ఆమోదం..! డెట్ సెక్యూరిటీలు, బాండ్లు మొదలైన వాటి జారీ ద్వారా రుణ సాధనాల్లో రూ. 7,500 కోట్ల వరకు సేకరించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. కంపెనీ పోస్ట్ ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా, ఎయిర్టెల్ టారిఫ్ పెంపు ప్రారంభ సంకేతాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని , కొత్త ఉత్పత్తులను వేగవంతం చేయడంపై కంపెనీ తన దృష్టిని కొనసాగిస్తుందని బోర్డు మీటింగ్‌లో తెలిపింది. చదవండి: కిలోమీటర్‌కు కేవలం 14 పైసల ఖర్చు..! తక్కువ ధరలో మరో ఎలక్ట్రిక్ బైక్..! -
జియో యూజర్లకు భారీ షాక్..!
ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థలు ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా టారిఫ్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వారి బాటలోనే టారిఫ్ రేట్లను పెంచుతూ జియో నిర్ణయం తీసుకుంది. సుమారు 20 శాతం మేర ప్లాన్ ధరలను జియో పెంచింది. పెరిగిన టారిఫ్ ప్లాన్ల రేట్లు డిసెంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. జియోఫోన్ ప్లాన్ రూ. 75 నుంచి రూ. 91కి పెరిగింది. ఆయా ప్లాన్లను బట్టి సుమారు రూ. 24 నుంచి రూ. 480 మేర ధరలు పెరిగాయి. టెలికాం సర్వీసులను మరింత బలోపేతం చేయాలనే నిబద్ధతకు అనుగుణంగా కొత్త అపరిమిత ప్లాన్ రేట్లను పెంచుతున్నట్లు జియో ఒక ప్రకటనలో పేర్కొంది. టెలికాం పరిశ్రమలో ఈ కొత్త టారిఫ్ ప్లాన్స్ అత్యుత్తమ ప్లాన్స్‌గా నిలుస్తాయని జియో వెల్లడించింది. జియో కొత్త ప్లాన్స్ ఇలా ఉన్నాయి..! -
మొబైల్ రీచార్జ్ టారిఫ్‌ల పెంపు తప్పనిసరి కానుందా..!
న్యూఢిల్లీ: టెలికం రంగం కోలుకోవాలంటే టారిఫ్‌ల పెంపు, కనీస ధరల విధానం అమల్లోకి రావడం కీలకమని వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) సీఈవో రవీందర్ టక్కర్ తెలిపారు. కంపెనీకి అవసరమైన తోడ్పాటునిచ్చేందుకు వొడాఫోన్ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్ కట్టుబడి ఉన్నాయని ఆయన వివరించారు. పెట్టుబడులు పెట్టగలిగే అవకాశాలు ఉన్న ఇన్వెస్టర్లతో చర్చలు కొనసాగిస్తుంటామని తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా టక్కర్ పేర్కొన్నారు. ఇటీవల ఎంట్రీ స్థాయి కార్పొరేట్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు, ఇతర పథకాల టారిఫ్‌లను పెంచడం సరైన దిశలో తీసుకున్న నిర్ణయమని ఆయన వివరించారు. దీని వల్ల సగటున ప్రతి యూజరుపై ఆదాయం (ఏఆర్పీయూ) మెరుగుపడగలదన్నారు. అయితే టెలికం రంగం వ్యవస్థాగతంగా కోలుకోవాలంటే ఇది సరిపోదని టక్కర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం పరిశ్రమ మెరుగుపడటానికి కీలకమైన కనీస ధర అంశంపై నియంత్రణ సంస్థతో చర్చలు జరపడం కొనసాగిస్తామని ఆయన వివరించారు. (చదవండి: భారత్‌లోకి ‘ప్లే బాయ్’ వచ్చేస్తున్నాడు..!) ఉన్నతమైన సేవలకు కట్టుబడి ఉన్నాం అత్యుత్తమ సేవలను అందించాలన్న తమ అంకిత భావం కొనసాగుతుందని టక్కర్ వినియోగదారులకు భరోసానిచ్చారు. వీఐగా పేరు మార్చుకుని ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా టక్కర్ మాట్లాడారు. కంపెనీకి మద్దతుగా నిలిచినవారికి ధన్యవాదములు తెలిపారు. నెట్వర్క్ అనుసంధానత పెంపుపై గడిచిన ఏడాది కాలంలో దృష్టిసారించినట్టు చెప్పారు. ‘‘డిజిటల్ భారత్ కోసం మెరుగైన రేపటిరోజు, అత్యుత్తమ టెక్నాలజీ, సేవలు, పరిష్కారాలు అందిస్తామంటూ వీఐ హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు సేవలు అందించేందుకు ఇకముందూ మా కృషి కొనసాగుతుంది’’ అని టక్కర్ తెలిపారు. వొడాఫోన్ ఐడియా నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సుమారు రూ.1.6 లక్షల కోట్లను చెల్లించాల్సిన (ప్రభుత్వానికి, బ్యాంకులకు) పరిస్థితుల్లో ప్రభు త్వం నుంచి సాయం లభించకపోతే వొడా ఫోన్ ఐడియా కోలుకోవడం కష్టమంటూ సంస్థ చైర్మన్ హోదాలో కుమార మంగళం బిర్లా ఇటీవలే కేంద్రానికి ఓ లేఖ రాయడం గమనార్హం. ఈ క్రమంలో వినియోగదారులకు వొడాఫోన్ ఐడియా సీఈవో భరోసానివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. (చదవండి:ఈ మొబైల్ రీఛార్జ్‌తో ఏడాదిపాటు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, డిస్నీ హట్‌స్టార్ ఉచితం..!) -
సామాన్యుడి నెత్తిన మరో పిడుగు...!
దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు, నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడి నెత్తిమీద మరో పిడుగు పడనుంది. ఈ సారి మొబైల్ రీచార్జ్ టారిఫ్‌ల రూపంలో రానుంది. పలు టెలికాం కంపెనీలు రీచార్జ్ టారిఫ్‌ల రేట్లను పెంచనున్నట్లు తెలుస్తోంది. టారిఫ్‌ల పెంపులతో సామాన్యుడికి మరింత భారం కానుంది. తాజాగా భారతి ఎయిర్టెల్ తన యూజర్ల కోసం బేసిక్ స్మార్ట్ ప్రీ పెయిడ్ ప్లాన్ ధరను రూ. 49 నుంచి ఏకంగా రూ. 79 పెంచేసింది. ఈ బేసిక్ ప్లాన్‌పై సుమారు 55 మిలియన్ల యూజర్లు ఆధారపడి ఉన్నారు. ఎయిర్టెల్ ఈ ప్లాన్‌లో భాగంగా అవుట్ గోయింగ్ కాల్స్‌కు సంబంధించి నాలుగు రెట్లు అధికంగా టాక్‌టైంను అందించింది. దాంతోపాటుగా డబుల్ మొబైల్ డేటాను చేసింది. తాజాగా ఎయిర్టెల్ బాటలో వోడాఫోన్-ఐడియా కూడా టారిఫ్‌లను పెంచే దారిలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. వోడాఫోన్-ఐడియా ఇప్పటికే రూ. 49 ప్లాన్‌ను విరమించుకుంది. ఈ ప్లాన్‌కు బదులుగా కొత్తగా 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 79 ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా బాటలోనే పలు టెలికాం కంపెనీలు ప్రయాణించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే 6 నెలల్లో రీచార్జ్ టారిఫ్ ప్లాన్ల ధరలను 30 శాతం మేర పెంచాలని టెలికాం కంపెనీలు భావిస్తున్నాయి. టారిఫ్‌లను పెంచడంతో యూజర్ల నుంచి వచ్చే సగటు తలసరి ఆదాయాన్ని (ఏఆర్పీయూ) పెంచుకోవాలని టెలికాం కంపెనీలు యోచిస్తున్నాయి. గోల్డ్‌మన్ సాచ్ ప్రకారం.. టెలికం కంపెనీలు 2021 ఆర్థిక సంవత్సరంలో ప్రీ పెయిడ్ కస్టమర్ల నుంచి 50-80 శాతం వరకు రెవెన్యూను జనరేట్ చేసుకున్నాయని పేర్కొంది. టెలికాం కంపెనీల్లో ఫ్రీ క్యాష్ ఫ్లో (ఎఫ్‌సీఎఫ్) మెరుగుపడాలంటే..కచ్చితంగా ప్రీపెయిడ్ ప్లాన్ల టారిఫ్‌ల పెంపు అనివార్యమని తెలిపింది. కాగా జియో నుంచి టారిఫ్‌ల పెంపు తక్కువగా ఉండే అవకాశం ఉందని గోల్డ్‌మన్ సాచ్ పేర్కొంది. -
ఎవరెడీ- వొడాఫోన్ ఐడియా జోరు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో బ్యాటరీల కంపెనీ ఎవరెడీ ఇండస్ట్రీస్ ఇండియా కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఈ ఏడాది చివరికల్లా టారిఫ్‌లను పెంచనున్నట్లు వెలువడిన వార్తలతో మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. చదవండి: (వ్యాక్సిన్ ఆశలు- యూఎస్ కొత్త రికార్డ్స్) ఎవరెడీ ఇండస్ట్రీస్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఎవరెడీ ఇండస్ట్రీస్ నికర లాభం మూడు రెట్లు ఎగసి రూ. 57 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 7 శాతం పెరిగి రూ. 373 కోట్లకు చేరింది. ఈ కాలంలో మొత్తం వ్యయాలు 7 శాతం క్షీణించి రూ. 318 కోట్లను తాకాయి. స్టాండెలోన్ ప్రాతిపదికన నిర్వహణ లాభ మార్జిన్లు 9 శాతం నుంచి 20 శాతానికి ఎగశాయి. ఫలితాల నేపథ్యంలో ఎవరెడీ ఇండస్ట్రీస్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 10 శాతం దూసుకెళ్లి రూ. 172ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! వొడాఫోన్ ఐడియా నష్టాలను తగ్గించుకోవడం, ఆర్థికంగా పటిష్టంకావడంపై దృష్టిపెట్టిన వొడాఫోన్ ఐడియా టారిఫ్‌లను 15-20 శాతంమేర పెంచనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. డిసెంబర్లో పెంపును చేపట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టెలికం నియంత్రణ సంస్థ ఫ్లోర్ ధరలను నిర్ణయించనుందని, అయితే వొడాఫోన్ ఐడియా వచ్చే నెల మొదట్లోనే 25 శాతం వరకూ టారిఫ్‌లను పెంచే ప్రణాళికలు వేసినట్లు సంబంధితవర్గాలు చెబుతున్నాయి. 2016లో రిలయన్స్ జియో రంగ ప్రవేశం చేశాక టెలికం దిగ్గజాలు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా 2019లో తొలిసారి రేట్లను పెంచినట్లు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో తొలుత ఎన్ఎస్ఈలో వొడాఫోన్ ఐడియా షేరు 10 శాతం లాభపడి రూ. 10ను తాకింది. ప్రస్తుతం 6 శాతం ఎగసి రూ. 9.65 వద్ద ట్రేడవుతోంది. -
ఇప్పటికీ భారత్‌లోనే ఇంటర్నెట్ చౌక..
న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం మీద భారత్‌లోనే మొబైల్ డేటా రేట్లు అత్యంత తక్కువని కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. బ్రిటన్‌కు చెందిన కేబుల్.కో.యూకే అధ్యయనంలో ఇది వెల్లడైందని మైక్రోబ్లాగింగ్ సైటు ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన చార్టును పోస్ట్ చేశారు. దీని ప్రకారం.. ఒక గిగాబైట్ (జీబీ) డేటా సగటు ధర భారత్‌లో 0.26 డాలర్లుగా ఉండగా.. బ్రిటన్‌లో 6.66 డాలర్లు, అమెరికాలో 12.37 డాలర్లుగా ఉంది. ప్రపంచ సగటు 8.53 డాలర్లుగా ఉంది. దేశీ టెల్కోలు భారతి ఎయిర్టెల్, వొడాఫోన్–ఐడియా, రిలయన్స్ జియో .. ఏకంగా 50%దాకా టారిఫ్‌లను పెంచు తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మంత్రి స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఈ మొబైల్ చార్జీల సమస్యంతా.. కుంభకోణాలతో అప్రతిష్ట పాలైన యూపీఏ ప్రభుత్వ ఘనతే. దాన్ని మేం సరిచేశాం. అధిక మొబైల్ ఇంటర్నెట్ చార్జీలు.. యూపీఏ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చాయి. ట్రాయ్ గణాంకాల ప్రకారం 2014లో ఒక్క జీబీకి చార్జీ రూ. 268.97గా ఉండేది. ప్రస్తుతం ఇది రూ. 11.78కి తగ్గింది. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్/ఎంటీఎన్ఎల్ను కూడా ప్రొఫెషనల్‌గా, లాభసాటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని మంత్రి పేర్కొన్నారు. -
టెల్కోల వీరబాదుడు..!
న్యూఢిల్లీ: చౌక మొబైల్ కాల్, డేటా సేవలకిక కాలం చెల్లింది. సుమారు నాలుగేళ్ల తర్వాత.. టెలికం సంస్థలు పోటాపోటీగా రేట్ల పెంపుతో ప్రీ–పెయిడ్ వినియోగదారులను బాదేందుకు సిద్ధమయ్యాయి. వొడాఫోన్–ఐడియా, ఎయిర్టెల్, రిలయన్స్ జియో సంస్థలు టారిఫ్‌లను పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించాయి. వొడా–ఐడియా, ఎయిర్టెల్ టారిఫ్‌ల పెంపు ఏకంగా 50 దాకాను, జియో టారిఫ్‌ల పెంపు 40 శాతం దాకాను ఉండనుంది. వొడా–ఐడియా, ఎయిర్టెల్ కొత్త రేట్లు డిసెంబర్ 3 నుంచి, జియో రేట్లు డిసెంబర్ 6 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజా పరిణామంతో.. భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కస్టమర్లు నెలరోజుల పాటు కనెక్షన్ కలిగి ఉండాలంటే కనీసం రూ. 49 కట్టాల్సి రానున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ‘టీ ఖర్చుకన్నా తక్కువే’..! వొడాఫోన్–ఐడియా ... 28 రోజులు, 84 రోజులు, 365 రోజుల వ్యాలిడిటీ గల అన్లిమిటెడ్ ప్లాన్స్‌ను సవరిస్తూ కొత్త ప్లాన్స్ ప్రవేశపెట్టింది. మార్కెట్ స్పందనను బట్టి వీటిల్లో మార్పులు, చేర్పులు చేయడమో లేదా మరిన్ని కొత్త ప్లాన్స్ ప్రవేశపెట్టడమో జరుగుతుందని పేర్కొన్నాయి. మరోవైపు, ‘టారిఫ్ పెంపు రోజుకు కేవలం 50 పైసల నుంచి రూ. 2.85 దాకానే ఉండనుంది. మెరుగైన డేటా, కాలింగ్ ప్రయోజనాలు ఉంటాయి‘ అని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో పేర్కొంది. బడ్డీ కొట్టులో టీ తాగేందుకు ఓ వారం ఖర్చు చేసేంత కూడా టారిఫ్‌ల పెంపు ఉండదని కంపెనీ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఇక, జియో విషయానికొస్తే.. ‘అన్లిమిటెడ్ వాయిస్, డేటాతో సరికొత్త ఆల్–ఇన్–వన్ ప్లాన్స్‌ను ప్రవేశపెట్టబోతున్నాం. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్ విషయంలో సముచిత వినియోగ విధానం ఉంటుంది. 300 శాతం దాకా అదనపు ప్రయోజనాలు అందించే కొత్త ప్లాన్లు డిసెంబర్ 6 నుంచి అమల్లోకి వస్తాయి‘ అని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. టెలికం టారిఫ్‌లను సవరించే విషయంలో ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగిస్తామని పేర్కొంది. అపరిమితంలో.. పరిమితులు... అన్లిమిటెడ్ ప్లాన్స్ అయినప్పటికీ.. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్ విషయంలో వొడా–ఐడియా, ఎయిర్టెల్ ప్లాన్స్‌లో పరిమితులు ఉన్నాయి. 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్‌లో 1,000 నిమిషాలు, 84 రోజుల పథకాల్లో 3,000 నిమిషాలు, 365 వ్యాలిడిటీ ప్లాన్‌లో 12,000 నిమిషాల పరిమితి ఉంటుంది. దీన్ని దాటితే ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చార్జీ ఉంటుంది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్)ను లెక్కించే విషయంలో కేంద్రానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో టెల్కోలు కేంద్రానికి లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బకాయిల కింద ఏకంగా రూ. 1.4 లక్షల కోట్లు కట్టాల్సి రానుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వీటికి కేటాయింపులు జరపాల్సి రావడంతో వొడాఫోన్ ఐడియా ఏకంగా రూ. 50,921 కోట్లు, ఎయిర్టెల్ రూ. 23,045 కోట్ల మేర నష్టాలు ప్రకటించాయి. వీటన్నింటిని భర్తీ చేసుకోవడం కోసం, నెట్‌వర్క్‌పై మరింతగా ఇన్వెస్ట్ చేయడం కోసం టెలికం సంస్థలు తాజాగా చార్జీల పెంపు బాట పట్టాయి. -
వొడాఫోన్ ఐడియా బాటలో జియో..
సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్ ఛార్జీలను మోతెక్కిస్తున్న టెలికాం కంపెనీలు వినియోగదారుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కాల్, డేటా చార్జీలను డిసెంబర్ మూడు నుంచి 42 శాతం పెంచుతున్నట్టు వొడాఫోన్ ఐడియా ఇప్పటికే ప్రకటించగా రిలయన్స్ జియో 40 శాతం టారిఫ్ పెంపుతో న్యూ ఆల్ ఇన్ వన్ ప్లాన్లను ప్రకటించింది. డిసెంబర్ 6 నుంచి నూతన ప్లాన్లు అమల్లోకి వస్తాయని జియో పేర్కొంది. మొబైల్ చార్జీలను 40 శాతం పెంచినా వినియోగదారులకు 300 శాతం ప్రయోజనాలను వర్తింపచేస్తామని తెలిపింది. డేటా వినియోగ వృద్ధి, డిజిటల్ వ్యాప్తిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకుండా టారిఫ్‌ల పెంపును చేపట్టామని వెల్లడించింది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే ఉద్దేశ్యంతోనే నూతన ప్లాన్లను ఆఫర్ చేస్తున్నామని తెలిపింది. టెలికాం టారిఫ్‌ల సవరణకు చేపట్టిన సంప్రదింపుల ప్రక్రియలో ప్రభుత్వంతో జియో కలిసి పనిచేస్తుందని పేర్కొంది. కాగా, మొబైల్ కాల్స్, డేటా చార్జీలను మంగళవారం నుంచి పెంచనున్నట్టు టెలికాం ఆపరేటర్ వొడాఫోన్-ఐడియా ప్రకటించింది. ప్రీపెయిడ్ విభాగంలో రెండు రోజులు, 28, 84, 368 రోజుల వాలిడిటీతో కూడిన ప్లాన్లపై చార్జీలను పెంచనున్నట్టు కంపెనీ వెల్లడించింది. గత ప్లాన్లతో పోలిస్తే తాజా ప్లాన్లు దాదాపు 42 శాతం మేరకు భారమవుతాయని భావిస్తున్నారు. -
భారత టారిఫ్‌లను ఆమోదించేది లేదు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి భారత్ విధిస్తున్న టారిఫ్‌లపై మండిపడ్డారు. భారత్ ఎంతో కాలంగా అమెరికన్ ఉత్పత్తులపై టారిఫ్‌లను మోపుతోందని, వీటిని ఇంకెంత కాలం ఆమోదించేది లేదంటూ మంగళవారం ట్వీట్ చేశారు. గత నెల 28న జీ–20 దేశాల సమావేశం సందర్భంగా ట్రంప్, మన దేశ ప్రధానితో సమావేశం అవడం, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య వివాదాస్పద అంశాలపై సత్వర చర్చకు అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన కొన్ని రోజులకే ట్రంప్ భారత్ పట్ల తన కఠిన వైఖరిని మరోసారి తన మాటల ద్వారా ప్రదర్శించుకున్నారు. అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్రాస్, ఇంధన మంత్రి రిక్‌పెర్రీ ఈ వారం చివర్లో వాషింగ్టన్లో భారత్‌కు సంబంధించి జరిగే ఓ సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంలో ట్రంప్ వ్యూహాత్మకంగా భారత్ టారిఫ్‌లపై మరోసారి మాట్లాడడం గమనార్హం. గత నెలలో అమెరికాకు చెందిన బాదం, యాపిల్ సహా 28 ఉత్పత్తులపై భారత్ టారిఫ్‌లు పెంచుతూ నిర్ణయాన్ని అమలు చేసింది. గతేడాది మన దేశ అల్యూమినియం, స్టీల్ దిగుమతులపై అమెరికా విధించిన దిగుమతి సుంకాలకు ప్రతీకారంగానే ఈ నిర్ణయాన్ని ఆలస్యంగా అమలు చేసింది. ఇది తమకు ఆమోదం కాదని, భారత్ అమెరికాకు వ్యతిరేకంగా ఎక్కువ టారిఫ్‌లను అమలు చేస్తోందని, ఈ విషయమై ప్రధాని మోదీతో మాట్లాడాలనుకుంటున్నట్టు జీ20 దేశాల సమావేశానికి ముందు ట్రంప్ ట్వీట్ చేయడం తెలిసిందే. హార్లే డేవిడ్సన్ బైకులపై భారత్ భారీ టారిఫ్‌లు విధిస్తోందని అంతకుముందు పలు సందర్భాల్లోనూ ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
భారీ సుంకాలను ఒప్పుకోం
వాషింగ్టన్/ఒసాకా: అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. అమెరికా ఉత్పత్తులపై ఇండియా భారీగా దిగుమతి సుంకాలను విధిస్తోందని మండిపడ్డారు. ఇటీవల అమెరికా నుంచి దిగుమతయ్యే 28 ఉత్పత్తులపై భారత్ సుంకాలు వడ్డించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇలాంటి చర్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని తేల్చి చెప్పారు. నేటి నుంచి రెండ్రోజుల పాటు సాగే జీ20 సదస్సులో పాల్గొనేందుకు జపాన్‌లోని ఒసాకాకు ట్రంప్ చేరుకున్నారు. ఈ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో ట్రంప్ ప్రత్యేకంగా భేటీ కావాల్సిఉంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ స్పందిస్తూ..‘భారత ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకునేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నిజానికి చాలా ఏళ్ల నుంచి భారత్ అమెరికా ఉత్పత్తులపై చాలా భారీస్థాయిలో దిగుమతి సుంకాలను విధిస్తోంది. తాజాగా దాన్ని ఇంకా పెంచింది. దీన్ని ఎంతమాత్రం అంగీకరించబోం. భారత్ ఈ సుంకాలను వెంటనే తగ్గించాలి’ అని డిమాండ్ చేశారు. ఇటీవల భారత్‌లో పర్యటించిన అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఇరుదేశాల మధ్య సుంకాల విషయంలో ఏకాభిప్రాయం సాధ్యమేనని చెప్పిన మరుసటిరోజే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ట్రంప్ ఆరోపణలు సరికాదు: భారత్ భారత్ భారీగా పన్నులు విధిస్తోందన్న ట్రంప్ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్ విధిస్తున్న సుంకాలు అంత ఎక్కువగా లేవని స్పష్టం చేసింది. ‘అమెరికా ఉత్పత్తులపై మేం విధిస్తున్న సుంకాల కంటే కొన్ని భారతీయ ఉత్పత్తులపై అగ్రరాజ్యం విధిస్తున్న సుంకాలు భారీగా ఉంటున్నాయి’ అని పేర్కొంది. అసలు గొడవేంటి? అమెరికాలోని హార్లే–డేవిడ్సన్ సంస్థకు చెందిన బైక్‌లపై భారత్ 100 శాతం పన్ను విధించడాన్ని గతంలో ట్రంప్ బాహాటంగానే తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో హార్లేడేవిడ్సన్ బైక్‌లపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం 50 శాతానికి తగ్గించింది. అయినా శాంతించని ట్రంప్.. భారత్‌ను ‘సుంకాల రారాజు’గా అభివర్ణించారు. గతేడాది మార్చిలో భారత్ నుంచి దిగుమతి అయ్యే స్టీల్‌పై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం టారిఫ్ విధించారు. అక్కడితో ఆగకుండా ఇండియాకు గతంలో ఇచ్చిన ప్రాధాన్యత వాణిజ్య హోదా(జీఎస్పీ)ని రద్దుచేశారు. దీంతో ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన భారత్.. అమెరికా నుంచి దిగుమతయ్యే బాదం, పప్పుధాన్యాలు, వాల్నట్ సహా 28 ఉత్పత్తు్తలపై సుంకాలను గణనీయంగా పెంచింది. తాజాగా ఈ వ్యవహారంపైనే ట్రంప్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. -
వాణిజ్య యుద్ధ భయాలు
అమెరికా– చైనా మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతుండగానే అమెరికా– భారత్ మధ్య సుంకాల పోరుకు తెరలేవడంతో సోమవారం మన స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. భారత్‌కు వాణిజ్యపరంగా ఉన్న కొన్ని ప్రాధాన్యతలను అమెరికా తొలగించడం, దీనికి ప్రతిగా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై భారత్ సుంకాలు విధించడంతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 39,000 పాయింట్లు, నిఫ్టీ 11,700 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. నైరుతి రుతు పవనాల విస్తరణపై ఆందోళన నెలకొనడం, పశ్చిమాసియా ప్రాంతంలో భౌగోళికంగా ఉద్రిక్తతలు నెలకొనడం, ఫలితంగా ముడి చమురు ధరలు భగ్గుమంటుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు క్షీణించడం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు మందగించడం... ఈ అంశాలన్నీ ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 491 పాయింట్లు పతనమై 38,961 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 151 పాయింట్లు పతనమై 11,672 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు నెల కనిష్ట స్థాయికి పడిపోయాయి. లోహ షేర్లు విలవిలలాడాయి. ఇంధన షేర్లు కూడా బాగా నష్టపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 541 పాయింట్లు, నిఫ్టీ 165 పాయింట్ల మేర పతనమయ్యాయి. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 796 పాయింట్లు క్షీణించింది. మంగళవారం నుంచి మొదలై రెండు రోజుల పాటు జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక సమావేశం నేపథ్యంలో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలో అప్రమత్తత నెలకొంది. ఇక మన దగ్గర సుంకాల పోరు కూడా జత కావడం ప్రతికూల ప్రభావం చూపించింది. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం మరింత ముదరడం, పశ్చిమాసియాలో అకస్మాత్తుగా రేగిన ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు భగ్గుమనడంతో మన మార్కెట్ భారీగా నష్టపోయిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకుడు వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు. ఈ వారంలో వెలువడే అమెరికా ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ల నిర్ణయాల కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారని, ఈ నిర్ణయాల ప్రభావం మార్కెట్‌పై ఉండనున్నదని విశ్లేషకులంటున్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. మరిన్ని విశేషాలు... ♦ టాటా స్టీల్ 5 శాతం పతనమై రూ.473 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ♦ సెన్సెక్స్‌లో 3 షేర్లు– యస్ బ్యాంక్, కోల్ ఇండియా, ఇన్ఫీ మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 28 షేర్లు నష్టపోయాయి. ♦ ఇక్రా రేటింగ్ సవరణ కారణంగా ఆస్టర్ డీఎమ్ హెల్త్‌కేర్ షేర్ 5 శాతం లాభపడింది. ♦ ఆర్‌నామ్‌లో వాటాను విక్రయించినప్పటికీ, రిలయన్స్ క్యాపిటల్ షేర్ 6.7% నష్టపోయి రూ.71.4 వద్దకు చేరింది. ♦ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీలో పూర్తి వాటాను పిరమల్ ఎంటర్ప్రైజెస్ విక్రయించింది. ఈ నేపథ్యంలో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ షేర్ 6 శాతం క్షీణించి రూ.1,018 వద్ద, పిరమల్ ఎంటర్ప్రైజెస్ 3 శాతం నష్టంతో రూ. 2,004 వద్ద ముగిశాయి. ♦ రిలయన్స్ ఇన్ఫ్రా కంపెనీకి సంబంధించిన వివిధ అంశాలపై ఆడిటర్లు సందేహాలు లెవనెత్తడంతో రిలయన్స్ ఇన్ఫ్రా షేర్ ఇంట్రాడేలో 28 ఏళ్ల కనిష్ట స్థాయి, రూ.52.70కి పడిపోయింది. చివరకు 4.7 శాతం నష్టంతో రూ.56.5 వద్ద ముగిసింది. ♦ జెట్ ఎయిర్వేస్ వరుసగా పదకొండో రోజూ పతనమైంది. ఇంట్రాడేలో 16 శాతం క్షీణించి జీవిత కాల కనిష్ట స్థాయి, రూ.66ను తాకిన ఈ షేర్ చివరకు 16.7 శాతం నష్టంతో రూ. 68.3 వద్ద ముగిసింది. ఒక్క జూన్ నెలలోనే ఈ షేర్ 53 శాతం నష్టపోయింది. ♦ దాదాపు వందకు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. బాష్, డీహెచ్ఎఫ్ఎల్, సైయంట్, భారత్ ఫోర్జ్, బేయర్ క్రాప్‌సైన్స్, జేకే టైర్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రా ఈ జాబితాలో ఉన్నాయి. రూ.2 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.2 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,00,259 కోట్లు తగ్గి రూ.1,50,09,329 కోట్లకు తగ్గిపోయింది. పతనానికి ప్రధాన కారణాలివీ... ♦ అమెరికాపై భారత్ సుంకాలు.. భారత్‌కు వాణిజ్యపరంగా ఉన్న కొన్ని ప్రాధాన్యతలను అమెరికా తొలగించింది. అంతే కాకుండా భారత ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు విధించింది. దీనికి ప్రతిగా భారత్ కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే బాదం, ధాన్యాలు, వాల్నట్ తదితర 28 రకాల వస్తువులపై సుంకాలు విధించింది. ఇప్పటికే చైనాతో సుంకాల పోరు సాగుతుండగా, తాజాగా భారత్‌తో కూడా వాణిజ్య యుద్ధం ఆరంభం కావడం, ఇది అంతర్జాతీయంగా ఇంకెంత దూరం పోతుందోనన్న ఆందోళన నెలకొనడంతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. భారత్ విధించిన సుంకాల కారణంగా మనకు 21 కోట్ల డాలర్ల అదనపు రాబడి రావచ్చన్న అంచనాలున్నప్పటికీ, ఇది ఇంతటితో ఆగదని, ఇరు దేశాల మధ్య మరింత సుంకాల పోరుకు, ఇతర ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ప్రభావం ఉంటుందని ఆందోళన నెలకొంది. ♦ రుతుపవనాల విస్తరణపై ఆందోళన వ్యవసాయం ప్రధానమైన మన దేశానికి నైరుతి రుతు పవనాలు కీలకం. ఈ నైరుతి రుతుపవనాలు ఇప్పటిదాకా జాడ లేకపోవడం, అరకొర వర్షాలే పడటం, ఇప్పటికే లోటు వర్షపాతం నమోదైందన్న భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ♦ పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తత.. ఒమన్ సింధుశాఖలో రెండు ఆయిల్ ట్యాంకర్లపై దాడి నేపథ్యంలో పశ్చిమాసియా ప్రాంతంలో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. చమురు ఉత్పత్తికి కీలకమైన ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొంటే, ముడి చమురు ధరలు భగ్గుమనే అవకాశాలు అధికంగా ఉంటాయి. ముడి చమురు ధరలు పెరిగితే మన ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావమే పడుతుంది. దీంతో స్టాక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ♦ రూపాయి పతనం... భారత్–అమెరికాల మధ్య సుంకాల పోరు ప్రారంభం కావడం, ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోయింది. రూపాయి పతనం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించింది. ♦ తగ్గిన విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు ఎన్నికల ఫలితాల అనంతరం విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్లో జోరుగా పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత ఈ జోరు తగ్గింది. జూన్‌లో ఇప్పటివరకూ చూస్తే, (సోమవారం లావాదేవీలను కూడా పరిగణనలోకి తీసుకుంటే) విదేశీ ఇన్వెస్టర్లు రూ.411 కోట్ల నికర అమ్మకం దారులుగా నిలిచారు. విదేశీ ఇన్వెస్టర్ల జోరు తగ్గితే, స్వల్ప కాలంలో మార్కెట్ పరిమిత శ్రేణిలోనే కదలాడుతుందని నిపుణులంటున్నారు.