Tax exemption
-
ట్రూడో తాయిలాలు
టొరంటో: ద్రవ్యోల్బణం పెరిగి జీవన వ్యయ సంక్షోభంతో సతమతమవుతున్న కెనడియన్లకు ఊరట కల్పిస్తూ జస్టిన్ ట్రూడో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. కిరాణా, పిల్లల దుస్తులు, మద్యం, క్రిస్మస్ ట్రీలతో సహా పలు వస్తువులపై రెండు నెలల పాటు పన్ను మినహాయించింది. 2023లో 1.5 లక్షల కెనేడియన్ డాలర్లు లేదా అంతకంటే తక్కువ సంపాదన ఉన్న 1.87 కోట్ల మందికి ‘వర్కింగ్ కెనడియన్స్ రిబేట్’కింద ఒక్కొక్కరికి 250 డాలర్ల చొప్పున పంపిణీ చేయనుంది. ట్రూడో ఈ మేరకు ఎక్స్‌లో పోస్టులో వెల్లడించారు. ‘‘మా ప్రభుత్వం ధరలను నిర్ణయించలేదు. కానీ ప్రజలకు మరింత డబ్బు అందించగలదు. 250 డాలర్ల రిబేట్‌తో పాటు కెనేడియన్లు డిసెంబర్ 14 నుంచి రెండు నెలల పాటు జీఎస్టీ, హెచ్ఎస్టీ నిలిపివేత రూపంలో పన్ను మినహాయింపు పొందనున్నారు’’అని ప్రకటించారు. దాని ప్రకారం కిరాణా సరుకులు, ఇతర నిత్యావసరాలు, పిల్లల దుస్తులు, డైపర్లు, ప్రాసెస్డ్ ఫుడ్, రెస్టారెంట్ భోజనం, స్నాక్స్, ఆల్కహాల్, బొమ్మలు, పుస్తకాలు, వార్తాపత్రికలతో సహా పలు ఇతర వస్తువులపై రెణ్నెల్లపాటు పన్ను ఎత్తేస్తారు. ట్రూడో ప్రకటనను విపక్ష కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియరీ పొయిలీవ్రే తప్పుపట్టారు. రెండు నెలల తాత్కాలిక పన్ను విరామం వచ్చే సంవత్సరం ప్రారంభంలో పెరిగే కార్బన్ పన్నుల భారాన్ని భర్తీ చేయబోదన్నారు. ‘‘ట్రూడో హయాంలో గృహనిర్మాణ ఖర్చులు రెట్టింపయ్యాయి. ఫుడ్‌బ్యాంక్ వినియోగం ఆకాశాన్నంటుతోంది. ఫెడరల్ కార్బన్ ట్యాక్స్ వల్ల చలికాలంలో ఇళ్లలో వెచ్చదనం కూడా ప్రజలకు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారుతోంది’’అని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే కొత్తింటి అమ్మకాలపై కార్బన్ పన్ను, జీఎస్టీ రద్దు చేస్తామన్నారు. ట్రూడో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉండటం తెలిసిందే. దాంతో తాజా ఆర్థిక తాయిలాలను వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో వారిని బుజ్జగించడంలో భాగమని భావిస్తున్నారు. కాగా జీఎస్టీ రద్దు తమ పార్టీ ప్రచారం ఫలితమేనని ఎన్డీపీ నేత జగీ్మత్ సింగ్ అన్నారు. -
131 ఈవీలపై పన్ను మినహాయింపు
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం పన్ను మినహాయింపు ప్రకటించిన నేపథ్యంలో మొదటిరోజు సోమవారం హైదరాబాద్‌లో కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలపైన పన్నులు, ఫీజుల రూపంలో రవాణాశాఖ రూ.25.15 లక్షల మినహాయింపునిచ్చింది. మొదటి రోజు హైదరాబాద్‌లో 121 ద్విచక్ర వాహనాలు, ఆరు కార్లు కొత్తగా అమ్ముడయ్యాయి. కార్లపైన జీవితకాల పన్ను రూపంలో రూ.13.74 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో మరో రూ.6,000 వరకు వాహనదారులకు రాయితీ లభించింది. అలాగే 121 ద్విచక్ర వాహనాలపై జీవితకాల పన్ను రూపంలో రూ.10.94 లక్షల వరకు వాహనదారులకు రాయితీ లభించడం గమనార్హం. ఆటోలు, గూడ్స్ వాహనాలపై ప్రతి మూడు నెలలకు ఒకసారి విధించే త్రైమాసిక పన్ను నుంచి కూడా మినహాయింపు లభించింది. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం ఇచ్చిన పన్ను రాయితీ అవకాశాన్ని వాహన కొనుగోలుదార్లు సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ జేటీసీ రమేశ్ సూచించారు. నగరంలో వాహన కాలుష్యం ఆందోళన కలిగిస్తున్న దృష్ట్యా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వైపు మళ్లాలని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం ఈ అవకాశం కల్పించిందన్నారు. -
వీపీఎఫ్..పన్ను రహిత వడ్డీ పరిమితి పెంపు?
స్వచ్ఛంద భవిష్య నిధి(వీపీఎఫ్)పై సమకూరే పన్ను రహిత వడ్డీ పరిమితిని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం రూ.2.5 లక్షల వరకు వీపీఎఫ్‌పై సమకూరే వడ్డీపై పన్ను మినహాయింపు ఉంది. ఈ పరిమితిని పెంచితే మరింత మందికి మేలు జరుగుతుందని, కాబట్టి ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఈ విషయం తెలిసిన వ్యక్తులు తెలిపారు.ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ఆధ్వర్యంలోని స్వచ్ఛంద భవిష్య నిధి(వీపీఎఫ్) ద్వారా ఉద్యోగులు తమ డబ్బుపై అదనంగా వడ్డీ సమకూర్చుకోవచ్చు. ఈపీఎఫ్, వీపీఎఫ్‌కు ఒకే వడ్డీరేటు ఉంటుంది. దాంతో దీర్ఘకాలంలో మంచి రాబడి పొందవచ్చు. వీపీఎఫ్‌లో జమ చేసే నగదుకు సంబంధించి ఎలాంటి పరిమితులు లేవు.వీపీఎఫ్ గురించి కొన్ని విషయాలుఈ పథకం కోసం ఉద్యోగి ప్రత్యేకంగా కంపెనీ యాజమాన్యానికి లేఖ అందించాల్సి ఉంటుంది. కచ్చితంగా అందరు ఉద్యోగులు ఈ పథకంలో చేరాల్సిన నిబంధనేమీ లేదు. బ్యాంకు సేవింగ్స్ ఖాతా, కొన్ని బ్యాంకులు అందించే ఎఫ్డీ వడ్డీ కంటే మెరుగైన వడ్డీ ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలంలో మంచి రాబడులు అందుకోవచ్చు. భవిషత్తు అవసరాల కోసం మెరుగైన వడ్డీ కావాలని భావించే ఉద్యోగులు ఇందులో చేరవచ్చు.ఈ పథకంలో చేరిన వారు తమ ప్రాథమిక జీతంలో కట్ అవుతున్న 12 శాతం ఈపీఎప్ కంటే అధికంగా జమ చేసుకునే వీలుంది.ఇదీ చదవండి: ఆహార శుభ్రతకు ‘స్విగ్గీ సీల్’ఏటా జమ చేసే మొత్తం రూ.1.5 లక్షల వరకు ఉంటే సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది.ప్రస్తుతం ఈపీఎఫ్ వడ్డీ 8.15 శాతంగా ఉంది. ఇదే వడ్డీ వీపీఎఫ్‌కు వర్తిస్తుంది.ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత, లేదా పదవీ విరమణ చేసిన తర్వాత ఈ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. వైద్య అత్యవసరాలు, విద్య, వివాహాలు..వంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కూడా నిబంధనల ప్రకారం విత్‌డ్రా చేసుకోవచ్చు. -
స్థిరాస్తి అమ్మి ఇల్లు కొంటున్నారా..?
ఇల్లు అమ్మి కొత్తగా మరో ఇల్లు కొనుగోలు చేస్తే ప్రత్యేకంగా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే పన్ను మినహాయింపు ఉన్నప్పటికీ కొన్ని ప్రాథమిక అంశాల్లో మాత్రం తేడాలున్నాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం సెక్షన్ 54, సెక్షన్ 54ఎఫ్‌లో ఈ విషయాలను పొందుపరిచారు. అవి ఏమిటో తెలుసుకుందాం.1. మీకు ఉన్న పాత ఇల్లు అమ్మి తదనుగుణంగా సక్రమించే మూలధన లాభాలతో మరో కొత్త ఇల్లు కొనుగోలు చేసినప్పుడు సెక్షన్ 54 వర్తిస్తుంది. అంటే ఇల్లు అమ్మి, ఇల్లు కొనడం అన్నమాట. 54ఎఫ్ సెక్షన్ ప్రకారం మీ ఇల్లు అమ్మితే ఎటువంటి ప్రయోజనం రాదు. మీరు అమ్మే క్యాపిటల్ అసెట్ ఇల్లు తప్ప మిగిలింది ఏదైనా కావాలి. అంటే స్థలం, షేర్లు, బంగారం మొదలైనవి. 54ఎఫ్ ప్రయోజనం పొందాలంటే ఇల్లు అమ్మకుండా ఇతర ఆస్తుల అమ్మకంతో ఏర్పడ్డ లాభాలతో ఇల్లు కొనాలి.2. సెక్షన్ 54 ప్రకారం కేవలం మూలధన లాభాలు పెట్టి కొత్త ఇల్లు కొంటే మినహాయింపు దొరుకుతుంది. ఉదాహరణకు మీరు రూ.40 లక్షలు పెట్టి కొన్న ఇల్లు రూ.90 లక్షలకు అమ్మగా ఏర్పడ్డ లాభం రూ.50 లక్షలు. ఈ రూ.50 లక్షలతో కొత్త ఇల్లు కొంటే సరిపోతుంది. కానీ 54ఎఫ్ ప్రకారం మీకు చేతికొచ్చిన మొత్తం ప్రతిఫలంతో కొనాలి. ఉదాహరణకు బంగారం రూ.40 లక్షలకు కొని రూ.1 కోటికి అమ్మారు.. ఇప్పుడు లాభంతో నిమిత్తం లేకుండా మొత్తం ప్రతిఫలం వెచ్చించి ఇల్లు కొనాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్‌తో ముడిపడి ఉంది. 54లో కన్నా 54ఎఫ్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి. బైటకు పోయే మొత్తం ఎక్కువ.3. 54 ప్రకారం కొనే ఇంటి మీద ఎటువంటి ఆర్థిక ఆంక్షలు లేవు. ఎంత మొత్తం అయినా ఖర్చు పెట్టొచ్చు. మీకు సంక్రమించే ఆదాయాలు నిబంధనల ప్రకారం ఉండాలి. 54ఎఫ్ ప్రకారం కొత్త ఇల్లు ధర రూ.10 కోట్లు దాటకూడదు. పది కోట్లు దాటితే మొత్తం మీద పన్ను మినహాయింపు ఇవ్వరు.4. ఇల్లు కొనే నాటికి మీకు ఇల్లు ఉండకూడదు. 54ఎఫ్ కేవలం ఇల్లు కొనడానికే ప్రోత్సాహకంగా పెట్టారు. అంతేకాకుండా మొట్టమొదటిసారి ఇల్లు కొనేవారికే అనుకూలించేలా పెట్టారు. 54 ప్రకారం ఎటువంటి పరిమితులు, ఆంక్షలు లేవు. అన్ని రూల్స్ ఫాలో అయితే ఇల్లు కొనడం–అమ్మడంలో లబ్ధి పొందవచ్చు.5. 54ఎఫ్ ప్రకారం ఆస్తి అమ్మిన తేదీ నుంచి ఏడాది ముందు, అలాగే రెండు సంవత్సరాల్లోపల కొనుక్కోవచ్చు. లేదా అమ్మిన తేదీ నుంచి 3 సంవత్సరాల్లోపల కొనుగోలు చేసుకోవచ్చు. 54లో ఇటువంటి ఆంక్షలు లేవు.ఇదీ చదవండి: ఈటీఎఫ్ లేదా ఇండెక్స్ ఫండ్స్.. ఏది మెరుగు?ఈ రెండు సెక్షన్లు వ్యక్తులకు, హిందూ ఉమ్మడి కుటుంబాలకు వర్తిస్తాయి. నిబంధనల మేరకు రెండింటికీ క్యాపిటల్ గెయిన్స్ అకౌంటు రేటు వర్తిస్తుంది. సకాలంలో స్థలం కొని ఇల్లు కట్టుకున్నా ప్రయోజనం ఉంటుంది. అయితే, సెక్షన్ 54 ప్రయోజనం, 54ఎఫ్ ప్రయోజనం పరస్పరం ప్రత్యేకమైనవని గుర్తుంచుకోవాలి. కానీ 54ఎఫ్ ప్రయోజనం.. 54 ప్రయోజనాన్ని ప్రభావితం చేస్తుంది. 54 ప్రకారం ఇల్లు అమ్మితే ఇల్లు కొనుక్కోవచ్చు. బాండ్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. రెండింటిలోనూ వెచ్చించవచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకునేపుడు వృత్తి నిపుణుల సహాయం తీసుకోవడం మేలు.-మూర్తి, కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు -
పన్ను మినహాయింపు.. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై ఆర్థిక శాఖ కీలక ప్రకటన
ప్రైవేటు ఉద్యోగులకు సంబంధించిన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేసింది. బడ్జెట్లో ప్రకటించిన విధంగానే ప్రైవేట్ ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత చేసుకునే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు పరిమితిని రూ.25 లక్షలకు పెంచింది. ఇప్పటివరకు ప్రభుత్వేతర ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు రూ.3 లక్షలుగా ఉండేది. ఈ పరిమితిని 2002లో నిర్ణయించారు. ఇదీ చదవండి: సూపర్ ఫీచర్లతో లెనోవో కొత్త ట్యాబ్: ధర రూ.15 వేల లోపే సెక్షన్ 10(10AA)(ii) కింద ఆదాయపు పన్ను నుంచి మినహాయించిన మొత్తం రూ.25 లక్షలకు మించరాదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఒక ప్రకటనలో పేర్కొంది. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పొడిగించిన పన్ను మినహాయింపు పరిమితి 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. (మరో సంచలనం: బ్రెయిన్ చిప్, మస్క్‌కు గ్రీన్ సిగ్నల్) 2023 బడ్జెట్ లోని ప్రతిపాదనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం పొందే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు పరిమితిని రూ.25 లక్షలకు పెంచిందని, ఇది 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని సీబీడీటీ తెలిపింది. ఇదీ చదవండి: IT Returns: అందుబాటులోకి ఐటీఆర్-ఫారమ్‌లు.. గడువు తేదీ గుర్తుందిగా! మరిన్ని బిజినెస్ వార్తలకోసం చదవండి సాక్షిబిజినెస్ -
పన్ను శూన్యం.. ఆదాయం అదనం
ఆదాయపన్ను ఆదాచేసే పెట్టుబడి సాధనాలకు మంచి డిమాండ్ ఉంది. మధ్యాదాయ వర్గాల వారికి పాత పన్ను విధానమే మెరుగైనది. అందులో పన్ను ఆదా, మినహాయింపునిచ్చే సెక్షన్లు చాలానే ఉన్నాయి. పన్ను ఆదా కోసం ఈ తరహా సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే వారు చాలా మంది ఉన్నారు. ఆర్థిక సంవత్సరం చివర్లో కాకుండా ఆరంభం నుంచే ఈ సాధనాల్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లడం వల్ల చివర్లో ఏకమొత్తంలో సమకూర్చుకోవాల్సిన ఇబ్బంది తప్పుతుంది. అయితే, పన్ను ఆదా సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే ముందు లాభ, నష్టాల గురించి పూర్తిగా విచారించుకోవాలి. లాక్ ఇన్ పీరియడ్‌ను చూడాలి. రాబడిని చూడాలి. రిస్క్‌ను అర్థం చేసుకోవాలి. పన్ను బాధ్యత ఏ మేరకు అన్నది పరిశీలించాలి. ముందస్తు ఉపసంహరణలకు అవకాశం ఉందా? లేదా? తెలుసుకోవాలి. చాలా మంది పెట్టుబడిపై పన్ను ఆదానే చూస్తుంటారు. కానీ రాబడిపై పన్ను బాధ్యత గురించి తెలుసుకోరు. ముఖ్యంగా రిస్క్‌లేని సంప్రదాయ డెట్ సాధనాల్లో రాబడి 6–8 శాతం మించదు. కానీ, దీనిపై పన్ను చెల్లించాల్సి వస్తే.. ఇక మిగిలేది ఏముంటుంది? కనుక పెట్టుబడిపై పన్ను ఆదాయే కాదు, రాబడిపైనా పన్ను లేని సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అదనపు రాబడిని సంపాదించుకోవచ్చు. ఇలాంటి ముఖ్యమైన సాధనాల గురించి తెలియజేసే కథనమే ఇది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేసే వారు పాత, కొత్త విధానాల్లో దేనినైనా ఎంపిక చేసుకోవచ్చు. కాకపోతే కొత్త విధానంలో పన్ను ఆదా ప్రయోజనాలు పెద్దగా లేవు. స్టాండర్డ్ డిడక్షన్, ఉద్యోగి తరఫున యాజమాన్యం ఎన్పీఎస్ ఖాతాకు చేసే జమపైనే పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. పాత విధానంలో అయితే సెక్షన్ 80సీ, 80డీ సహా ఎన్నో సెక్షన్లు పన్ను భారాన్ని తగ్గిస్తున్నాయి. కనుక పాత, కొత్త విధానాల్లో ఒక దానిని ఎంపిక చేసుకునే ముందు తమ ఆదాయం, పెట్టుబడులు తదితర అంశాలన్నీ విశ్లేషించుకున్న తర్వాత ఎంపిక చేసుకోవాలి. పాత విధానంలో అయితే, ఇక్కడ చర్చించే సాధనాలు రిస్క్‌లేని రాబడిని, పన్ను లేని రాబడినిస్తాయి. కనుక ఇన్వెస్టర్లు వీటిని పరిశీలించొచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ అన్నది ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోతగిన సాధనం. సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ మొత్తంపైనా ఎలాంటి పన్ను లేదు. అంతేకాదు ఈ సాధనానికి మూడు రకాల పన్ను మినహాయింపులు ఉన్నాయి. ఇందులో పెట్టుబడిపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. వడ్డీ రాబడిపైనా పన్ను కట్టక్కర్లేదు. చివర్లో గడువు తీరిన తర్వాత ఉపసంహరించుకునే మొత్తంపైనా పన్ను లేదు. భద్రత దృష్ట్యా చూస్తే.. సార్వభౌమ గ్యారంటీతో కూడిన పథకం ఇది. ప్రస్తుతం 7.1 శాతం వార్షిక రాబడి ఈ పథకంలో ఉంది. పీపీఎఫ్ అకౌంట్ కాల వ్యవధి 15 ఏళ్లు. లాకిన్ పీరియడ్ కూడా ఇంతే ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడి మొదలు పెట్టిన ఆర్థిక సంవత్సరం చివరి నుంచి 15 ఏళ్ల కాలం అమలవుతుంది. ఆరంభం నుంచి కాదు. ఖాతా ప్రారంభించిన ఆరో ఏట నుంచి రుణ సదుపాయం అమల్లో ఉంటుంది. ఖాతా ప్రారంభించిన ఏడో ఆర్థిక సంవత్సరం నుంచి పాక్షిక ఉపసంహరణకు అనుమతిస్తారు. ఇందుకు కొన్ని షరతులు అమలవుతాయి. పోస్టాఫీసు లేదా బ్యాంక్‌లో ప్రారంభించుకోవచ్చు. పోస్ట్ ఆఫీసు అయితే అక్కడ సేవింగ్స్ ఖాతా తెరవాలని షరతు పెడుతున్నారు. ఉద్యోగుల భవిష్య నిధి, స్వచ్ఛంద భవిష్య నిధి సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులు ఈపీఎఫ్ కిందకు వస్తారు. వేతనం నుంచి 12 శాతాన్ని ఈపీఎఫ్ ఖాతాకు ప్రతి నెలా జమ చేయాల్సి ఉంటుంది. పని చేయించుకునే సంస్థ కూడా ఉద్యోగి తరఫున అంతే మొత్తాన్ని జమ చేస్తుంది. ఉద్యోగులు తన వంతుగా జమ చేసే మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ నిధికి 12 శాతానికి మించి జమ చేసుకోవాలంటే అందుకు వీలు కల్పించేదే స్వచ్చంద భవిష్య నిధి (వీపీఎఫ్). ఈపీఎఫ్ నిబంధనలు వీపీఎఫ్‌కు సైతం వర్తిస్తాయి. ఈపీఎఫ్ వడ్డీ రేటే వీపీఎఫ్ జమలపైనా అమలవుతుంది. ఈపీఎఫ్ పథకాన్ని కేంద్ర సర్కారు నిర్వహిస్తోంది. కనుక నూరు శాతం భద్రత ఉంటుంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌పై 8.1 శాతం వడ్డీ రేటు అమలు చేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ పథకం రిటైర్మెంట్ వరకు కొనసాగుతుంది. ముందస్తు ఉపసంహరణలు చేసుకోవచ్చు. ఉన్నత విద్య, వివాహం, వైద్య చికిత్సల కోసం ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన పథకాల మాదిరే ఈపీఎఫ్‌పైనా పన్ను లేదు. కాకపోతే ఒక ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్, వీపీఎఫ్‌కు ఉద్యోగి చేసే జమ రూ.2.5 లక్షలు మించినప్పుడు.. అంతకుమించి చేసే జమలపై వచ్చే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షలకు మించి జమ చేసే వారు 5 శాతం మంది కూడా ఉండరు. వీపీఎఫ్, ఈపీఎఫ్ రెండు కలసి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల పరిమితిపైనే పన్ను ఆదా పరిమితం. జీవిత బీమా పాలసీలు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనం కలిగిన సాధనాల్లో జీవిత బీమా సాధనాలు కూడా ఉన్నాయి. టర్మ్ పాలసీలు, ఎండోమెంట్ పాలసీలు, యూనిట్ లింక్డ్ పాలసీల (యులిప్‌లు)కు ఏటా చెల్లించే ప్రీమియం మొత్తాన్ని సెక్షన్ 80సీ కింద చూపించుకోవచ్చు. జీవిత బీమాను పెట్టుబడి కోణంలో చూడొద్దు. కుటుంబానికి రక్షణ సాధనంగానే చూడాలి. అలా చూసినప్పుడు అసలైన బీమా ప్లాన్ అంటే టర్మ్ ప్లాన్ అనే చెప్పుకోవాలి. తక్కువ ప్రీమియంకే ఎక్కువ రక్షణ కవరేజీ లభిస్తుంది. పాలసీదారుడికి ఏదైనా జరిగితే కుటుంబం ఆర్థిక ఇబ్బుందుల పాలు కాకుండా ఉంటుంది. గడువు తీరే వరకు జీవించి ఉంటే చివర్లో ఏమీ తిరిగి రాదు. అందుకే చాలా మంది దీని పట్ల విముఖత చూపిస్తుంటారు. దీనికి బదులు చివర్లో ఎంతో కొంత చెల్లింపులు చేసే ఎండోమెంట్ ప్లాన్ల వైపు వెళుతుంటారు. సంప్రదాయ పాలసీల్లో 20 ఏళ్లకు మించి కాలంపై రాబడి 4–6 శాతం మించదని గుర్తుంచుకోవాలి. యులిప్ ప్లాన్లు బీమా రక్షణ, పెట్టుబడితో కూడినవి. వీటిల్లోనూ ప్రీమియం అధికంగానే ఉంటుంది. యులిప్ ప్లాన్లలో పెట్టుబడులను ఈక్విటీ లేదా డెట్, లేదా ఈక్విటీ డెట్ కలసినవి ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ నుంచి డెట్‌కు, డెట్ నుంచి ఈక్విటీకి ఎలాంటి చార్జీల్లేకుండా మార్చుకోవచ్చు. గడువు తీరిన తర్వాత చివర్లో వచ్చే మొత్తంపై పన్ను లేకుండా చేసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యులిప్ ప్లాన్ల ప్రీమియం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షలకు మించకుండా చూసుకుంటే మెచ్యూరిటీపై పన్ను పడదు. యులిప్‌లలో ఉన్న మరో ప్రతికూలత ఇవి చాలా తక్కువ టర్మ్‌తో వస్తుంటాయి. యులిప్ ప్లాన్లలోనూ రాబడులకు హామీ ఉండదు. అంచనా రాబడినే బీమా సంస్థలు వెల్లడిస్తాయి. ఇక సంప్రదాయ బీమా పాలసీలు (జీవించి ఉంటే మెచ్యూరిటీ చెల్లించేది) తీసుకునే వారు వార్షిక ప్రీమియం రూ.5 లక్షలు మించకుండా చూసుకోవాలి. అప్పుడే చివర్లో చేతికొచ్చే మొత్తం పన్ను రహితం. ఈ నిబంధన 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ పథకాలు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ పథకాలలో చేసే పెట్టుబడులపై పన్ను మినహాయింపు ఉంది. పైన చెప్పుకున్న వాటికి ఇది భిన్నం. సెక్షన్ 80సీ కింద గరిష్టంగా ఈ పథకాల్లో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఆ మొత్తంపై మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ పథకాలు పూర్తిగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక రిస్క్ ఉంటుంది. రాబడులు పన్ను పరిధిలోకి వస్తాయి. రాబడులపై హామీ ఉండదు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా లాభ, నష్టాలు ఏవైనా రావచ్చు. కాకపోతే ఈక్విటీల్లో ఐదేళ్లకు మించిన కాలానికి నికరంగా రాబడులే వస్తాయని చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. ఈ పథకంలో పెట్టుబడులపై మూడేళ్ల లాకిన్ పీరియడ్ అమలవుతుంది. పన్ను ఆదా సాధనాల్లో తక్కువ లాకిన్ ఉన్నది ఇదే. ఈఎల్ఎస్ఎస్ నుంచి మూడేళ్లు నిండకుండా పెట్టుబడులు వెనక్కి తీసుకోవడానికి ఉండదు. మూడేళ్ల లాకిన్ పీరియడ్‌లో ఈ పథకం నుంచి ఆదాయం రావాలని కోరుకుంటే, గ్రోత్ ఆప్షన్‌కు బదులు డివిడెండ్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. దాంతో ఫండ్ డివిడెండ్ ప్రకటించిన ప్రతీ సందర్భంలోనూ ఇన్వెస్టర్‌కు ఎంతో కొంత ఆదాయం వస్తుంది. కాకపోతే డివిడెండ్ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలిపి, పన్ను వర్తించే ఆదాయం ఉన్నప్పుడే చెల్లించాల్సి ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఏడాదికి మించిన కాలంపై వచ్చే లాభాన్ని దీర్ఘకాలిక మూలధన లాభంగా పరిగణిస్తారు. ఈఎల్ఎస్ఎస్ పథకాలు మూడేళ్ల లాకిన్‌తో ఉంటాయి కనుక.. ఇందులో వచ్చే రాబడులు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.లక్ష వరకు ఉంటే ఎలాంటి పన్ను లేదు. ఈ పరిమితికి మించిన లాభంపైనే 10 శాతం పన్ను చెల్లించాలి. అందుకే ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో గ్రోత్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకుని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందాలి. మూడేళ్లు నిండిన తర్వాత నుంచి ఏటా రూ.లక్ష లాభం మించకుండా ఉపసంహరించుకుని, తిరిగి ఆ మొత్తాన్ని మరొక ఈఎల్ఎస్ఎస్ పథకంలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలి. దీనివల్ల లాభంపై పన్ను పడదు. దీర్ఘకాలంలో మంచి నిధి జమవుతుంది. సుకన్య సమృద్ధి యోజన భేటీ బచావో భేటీ పడావో అనే పథకం కింద సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని కేంద్ర సర్కారు తీసుకొచ్చింది. కుమార్తెలకు సంబంధించిన డిపాజిట్ పథకం ఇది. ఆడ పిల్ల విద్య లేదా వివాహం అవసరాల కోసం తల్లిదండ్రులు ఆమె పేరిట ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కరు ఇద్దరు కుమార్తెల పేరిటే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోగలరు. ఇద్దరికి మించి కుమార్తెలు ఉంటే, వారి పేరిట ఇన్వెస్ట్‌మెంట్‌కు అవకాశం ఉండదు. పీపీఎఫ్ మాదిరే ఇందులోనూ పెట్టుబడిపై పన్ను లేదు. రాబడి, చివరిలో అందుకునే మొత్తంపై పన్ను ఉండదు. పన్ను లేని, మెరుగైన రాబడితో కూడిన డెట్ సాధనం ఇది. కేంద్ర ప్రభుత్వం గ్యారంటీతో వస్తుంది కనుక భద్రత పరంగా సందేహం అక్కర్లేదు. ప్రతి మూడు నెలలకు ఒకసారి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను సవరిస్తుంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రేటు 8 శాతం. బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే ఇందులోనే రాబడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడులకు 21 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ముందస్తు ఉపసంహరణలను కొన్ని షరతుల మేరకు అనుమతిస్తారు. కుమార్తెల వయసు 10 ఏళ్లు మించకుండా ఉంటే, వారిపైనే ఈ పథకం కింద ఖాతా తెరిచి ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.250, గరిష్టంగా రూ.1.5 లక్షలను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కుమార్తె వయసు 18 ఏళ్లు వచ్చే వరకు తల్లిదండ్రి లేదా సంరక్షకుడు ఖాతాను నిర్వహించొచ్చు. బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఈ ఖాతా తెరుచుకోవచ్చు. -
దుబాయ్‌లో మద్యంపై పన్ను రద్దు
దుబాయ్: పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా దుబాయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం విక్రయాలపై ఇప్పటిదాకా విధిస్తున్న 30 శాతం పన్నును పూర్తిగా రద్దు చేసింది. ఇది ఆదివారం నుంచే అమల్లో వచ్చింది. అంతేకాకుండా వ్యక్తిగత ఆల్కహాల్ లైసెన్స్‌లకు ఇకపై ఎలాంటి చార్జీ వసూలు చేయబోరు. దుబాయ్‌లో ఎవరైనా ఇళ్లలో మద్యం సేవించాలంటే వ్యక్తిగత ఆల్కహాల్ లైసెన్స్ ఉండాల్సిందే. దుబాయ్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో మద్యం విషయంలో కొన్ని చట్టాలను సడలిస్తోంది. అయితే, పన్ను రద్దు అనేది తాత్కాలికమా? లేక శాశ్వతమా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
బడా కార్పొరేట్ల రుణ మాఫీపై చర్చకు సిద్ధమా?: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఉచితాల సంస్కృతి దేశానికి ప్రమాదమంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కార్పొరేట్ సంస్థలు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.5.8 లక్షల కోట్లను ఎందుకు మాఫీ చేశారు? ఏటా రూ.1.45 లక్షల కోట్ల మేర కార్పొరేట్ పన్నుల్లో రాయితీలు ఎందుకు కల్పించారని ప్రశ్నించింది. బడా పారిశ్రామికవేత్తల బ్యాంకు రుణాల మాఫీ, కార్పొరేట్ ట్యాక్స్ మినహాయింపుపై చర్చకు ఎప్పుడు సిద్ధమని కాంగ్రెస్ ప్రతినిధి గౌరవ్ వల్లభ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో రద్దు చేసిన రూ.9.92 లక్షల కోట్ల బ్యాంకు రుణాల్లో రూ.7.27 లక్షల కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులవేనని మీడియాకు ఆయన వివరించారు. రద్దైన రుణాల నుంచి కేవలం రూ.1.03 లక్షల కోట్లను మాత్రమే రాబట్టగలిగామంటూ ప్రభుత్వమే పార్లమెంట్లో ప్రకటించిందన్నారు. రానున్న కాలంలో రుణ రికవరీ మరో 20% మేర పెరుగుతుందని భావించినా అప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ మాఫీ రూ.5.8 లక్షల కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. ధనికులకు వివిధ రూపాల్లో వేల కోట్ల మేర మినహాయింపులు కల్పించే ప్రభుత్వం..పేదలకు స్వల్ప మొత్తాల్లో సాయం అందించేందుకు సైతం ఎందుకు ముందుకు రాలేకపోతోందని నిలదీశారు. -
ఇల్లు అమ్మి.. మరో ఇల్లు కొంటే.. ట్యాక్స్ మినహాయింపు ఇలా
గత వారం మూలధన లాభాల గురించి తెలుసుకున్నాం. ఈ వారం మరిన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. కేవలం స్థిరాస్తి మీద ఏర్పడ్డ దీర్ఘకాలిక మూలధన లాభాలే మన ప్రస్తుత అంశం. æ చట్టంలోని నిర్వచనాల జోలికి వెళితే తికమ కగా ఉంటుంది. సెక్షన్ల ప్రస్తావన అంతే. సారాంశమే తెలుసుకుందాం. æస్థిరాస్తి కొన్న తేదీ నుండి రెండు సంవత్సరాల తర్వాత అమ్మితే ఆ అమ్మకం, దీర్ఘకాలికమైనది అవుతుంది. రెండు సంవత్సరాల లోపల అమ్మితే అది స్వల్పకాలికం అని అర్థం. అలా వచ్చిన లాభాలను మీ మిగతా ఆదాయాలు.. అంటే జీతం, ఇంటి అద్దె, ఇతర ఆదాయాలు మొదలైన వాటితో కలిపి ఆ మొత్తాన్ని శ్లాబులవారీగా విభజించి, వర్తించే రేట్ల ప్రకారం ట్యాక్స్ లెక్కించాలి. దీర్ఘకాలిక మూలధన లాభాల మీద 20 శాతం పన్ను విధిస్తారు. విద్యా సుంకం అదనంగా ఉంటుంది. ఈ వారం, మూలధన లాభాల నుండి పన్ను భారం లేకుండా బైటపడటం ఎలాగో తెలుసుకుందాం. ఇల్లు అమ్మి, మరో ఇల్లు కొంటే పన్ను భారం ఉండదు. ఈ మినహాయింపనేది వ్యక్తులు, ఉమ్మడి కుటుంబాలకే వర్తిస్తుంది. ఇల్లు అంటే ఇల్లు అలాగే అనుబంధమైన స్థలం అని అర్థం. ఫ్లాటు, దానితో పాటు జాగాలో ఉండే అన్‌డివైడెడ్ వాటా. ఈ ఇంటిని ఇదివరకే ఇన్‌కం ట్యాక్స్ రిటర్నులలో అసెస్మెంట్ చేయించాలి. అంటే డిక్లేర్ చేయాలి. æ ఇల్లు అమ్మిన వెంటనే మన దేశంలో వేరే .. అంటే కొత్త ఇల్లు నిర్మాణం మూడు సంవత్సరాల లోపల చేయాలి. అంటే గెయిన్స్ మొత్తం వెచ్చించాలి. ఖర్చు పెట్టాలి. ఇల్లు నిర్మాణం పూర్తితో నిమిత్తం లేదు. తగిన కాగితాలు ఉండాలి. లేదా అమ్మిన తేదీ నుండి వెనక్కి వెళ్తారు. ఒక సంవత్సరం వరకూ .. ఒక సంవత్సరం ముందు ఇన్వెస్ట్ చేసినా చాలు. రెండు సంవత్సరాల లోపు ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎంతో వెసులుబాటు ఉందని గమనించాలి. æఎంత లాభం వచ్చిందో అంతే అయినా లేక అంతకన్నా ఎక్కువగా అయినా ఇన్వెస్ట్ చేయాలి. తక్కువగా చేస్తే ఆ తక్కువ మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అసెస్సీకి జీవితకాలంలో ఒకే ఒకసారి ఓ అవకాశం ఉంది. లాభాలు రూ. 2 కోట్లు దాటితే, ఒక ఇల్లు బదులు రెండు ఇళ్లు కొనుక్కోవచ్చు. కట్టుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసినప్పుడు కుటుంబంలో భార్య, సంతానం పేరు మీద కొనవచ్చు. ఈ మేరకు ఎన్నో జడ్జిమెంట్లు ఉన్నాయి. లాభం మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే చాలు. మొత్తం ప్రతిఫలం చేయనవసరం లేదు. మిగిలిన మొత్తాన్ని మీరు ఇష్టం వచ్చినట్లు ఖర్చుపెట్టుకోవచ్చు. ఏదైనా కారణాల వల్ల ఇల్లు కొనకపోతే, ఇల్లు అమ్మిన సంవత్సరం నుంచి ఏడాది ముందు కానీ లేదా రిటర్నులు వేయడానికి గడువు తేదీ లోపల కానీ వెంటనే బ్యాంకులో క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్‌లో మిగిలిన మొత్తాన్ని డిపాజిట్ చేయండి. మీకు మినహాయింపు లభిస్తుంది. అలా చేయకపోతే పన్ను పడుతుంది. మీరు కొన్న కొత్త ఇంటిని 3 సంవత్సరాలు అమ్మకూడదు. అలా అమ్మితే పన్ను వేస్తారు. జాగా కొని, స్వయంగా కట్టుకోవచ్చు. మినహాయింపులు పొంది స్వంత ఇంటి కల సాకారం చేసుకోండి. - కేసీహెచ్ఏవీఎస్ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) చదవండి: దీర్ఘకాలిక మూలధన లాభం పన్ను ఎలా వేస్తారంటే? -
ఇది హీరోలకు తగిన పనేనా?
చట్టం ముందు అందరూ సమానులే. కాకపోతే, కొద్దిమంది అధిక సమానులు! సుప్రసిద్ధ ఆంగ్ల సూక్తి ఇది. ఆ అధిక సమానులైన ‘మోర్ ఈక్వల్’ వర్గం ఎవరు? పేరుప్రతిష్ఠలు ఉన్నంత మాత్రాన ఎవరైనా సరే, సమాజంలోని తోటివారి కన్నా ఏ రకంగా ఎక్కువ అవుతారు? తమిళనాట ఇప్పుడు ఇదే చర్చ. అక్కడి సినీస్టార్లు తాము కొనుక్కున్న ఖరీదైన కార్ల మీద పన్ను మినహాయింపు కోరడం, ఈ వివాదంలో న్యాయమూర్తుల తాజా వ్యాఖ్యలతో ఈ చర్చ తెర మీదకు వచ్చింది. రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్ళూరుతూ ఆ తరహా ఇతివృత్తాలతో సినిమాలు చేస్తున్న విజయ్, ఆ వెంటనే జాతీయ ఉత్తమ నటుడు ధనుష్ లాంటి హీరోలు ఈ పన్ను మినహాయింపు వివాదంలో ఉండడం గమనార్హం. కోట్లల్లో పారితోషికం తీసుకొని ఖరీదైన కార్లు కొన్నవాళ్ళు... ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను విషయంలో బీద అరుపులు అరవడం విచిత్రమే. తెరపై దేశోద్ధారకులుగా ప్రచారం పొందాలని తపించేవారు... తీరా నిజజీవితంలో ఇలా చేయడం ఆశ్చర్యకరమే. కోర్టూ ఆ మాటే అంది. హీరో విజయ్ 2012లో ఇంగ్లండ్ నుంచి రోల్స్ రాయిస్ కారు దిగుమతి చేసుకున్నారు. అప్పట్లో ఆ కారు రూ.1.2 కోట్లనీ, ఖరీదు కన్నా 150 శాతం ఎక్కువ రూ. 1.8 కోట్లు కస్టమ్స్ కింద కట్టామనీ, కారుపై అసాధారణ ‘ఎంట్రీ ట్యాక్స్’ వేస్తున్నారనీ, ఆ పన్ను మినహాయించాలనీ కోరారు. అప్పటి నుంచి ఈ వ్యవహారం కోర్టులోనే ఉంది. ఇటీవలే ఆ అభ్యర్థనను మద్రాసు హైకోర్టు కొట్టివేస్తూ, ప్రాథమిక వసతులు కల్పించాలంటే పన్నులు కట్టాలని గుర్తు చేసింది. ‘‘రీల్ హీరోలం’’ మాత్రమే అన్నట్టు ప్రవర్తించడాన్ని తప్పుపట్టింది. వెంటనే పన్ను కట్టమనీ, ముఖ్యమంత్రి కరోనా సహాయ నిధికి రూ. లక్ష అపరాధ రుసుము కట్టమనీ ఆదేశించింది. దానిపై మళ్ళీ కోర్టుకెళ్ళి, విజయ్ స్టే తెచ్చుకోవడం వేరే కథ. హీరో ధనుష్ సైతం ఇలానే తన రోల్స్ రాయిస్ కారు కోసం 2015 నుంచి కోర్టులో పన్ను మినహాయింపు కోరుతున్నారు. 2018లో సుప్రీంకోర్టు ఈ వ్యవహారం ఓ కొలిక్కి తెచ్చినా, వినలేదు. చివరకు ఈనెల మొదటి వారంలో మద్రాసు హైకోర్టు ఆగ్రహానికి గురై, ధనుష్ వెనక్కి తగ్గారు. లగ్జరీ కార్లను కొంటున్నవాళ్ళు మాత్రం అసలీ ఎంట్రీ ట్యాక్స్ సరైనది కాదని వాదిస్తున్నారు. నాలుగేళ్ళ క్రితం 2017 జూలై 1 నుంచి దేశంలో ‘వస్తువులు – సేవల పన్ను’ (జీఎస్టీ) వచ్చింది. దానిలోనే ఎంట్రీ ట్యాక్స్ కలసిపోయిందని కొనుగోలుదార్ల అభిప్రాయం. ‘విదేశాల నుంచి కార్లు తెప్పించుకున్నప్పుడు దిగుమతి, కస్టమ్స్ సుంకాలు చెల్లిస్తున్నాం. విడిగా ఎంట్రీ ట్యాక్స్ అనవసరం’ అన్నది వారి వాదన. ఆ మాట కొట్టిపారేయలేం. ఒక రకంగా జీఎస్టీ వచ్చాక ఇతర పన్నుల విధింపులో జరగాల్సిన హేతుబద్ధీకరణను ఇది గుర్తుచేస్తోంది. మన జీడీపీలో ఆరేడు శాతం ఆటో ఇండస్ట్రీదే! దేశంలో వాహనాల అమ్మకాల్లో లగ్జరీ కార్ల వంతు ఒక శాతం లోపలే! వీటికి దేశమంతటా ఒకే విధమైన పన్ను విధానం ఉండాలని బెంజ్ తదితర సంస్థల భారతీయ శాఖలు అభ్యర్థిస్తున్నాయి. అయితే, జీఎస్టీ లాంటివి లేనప్పుడు కూడా విదేశీ లగ్జరీ కార్లు తెచ్చుకున్న ప్రముఖులు గతంలో ఎంట్రీ ట్యాక్స్ మినహాయింపు పొందడం గమనార్హం. ఉదాహరణ – క్రికెటర్ సచిన్ టెండూల్కర్. ప్రసిద్ధ ‘ఫార్ములా వన్’ రేసర్, జర్మనీ దేశీయుడు అయిన మైఖేల్ షూమేకర్ 2002లో తన ఫెరారీ కారును సచిన్‌కు కానుకగా ఇచ్చారు. ఆ లగ్జరీ కారుకు ఎంట్రీ ట్యాక్స్ కట్టే పని లేకుండా ఆ రోజుల్లో సచిన్‌కు మినహాయింపు నిచ్చారు. ఇప్పుడు పన్ను మినహాయింపు కోరుతున్న కొందరు ఆ పూర్వోదాహరణను ఎత్తి చూపుతున్నారు. ఇలా కావాల్సిన కొందరికి మాత్రం మినహాయింపులిచ్చి, మిగిలినవాళ్ళకు ‘చట్టం – న్యాయం’ అంటూ ధర్మపన్నాలు వల్లిస్తేనే చిక్కు! స్థానిక ప్రాంతాలలోకి మోటారు వాహనాల ప్రవేశంపై తమిళనాడు పన్ను (సవరణ) చట్టం కొన్నేళ్ళుగా అక్కడ అమలులో ఉంది. ఏవైనా ప్రజాప్రయోజనాలుంటేనే – కారు దిగుమతిదార్ల ఎంట్రీ ట్యాక్స్‌ను పాక్షికంగా కానీ, పూర్తిగా కానీ మాఫీ చేయవచ్చని 2015 నాటి ఆ చట్టం చెబుతోంది. సినీతారలు సొంత కార్లకు చెల్లించాల్సొచ్చే పన్నుకు ప్రజాప్రయోజనాలు ఏముంటాయి! నాలుగేళ్ళ క్రితం మలయాళ హీరో, అప్పట్లో బీజేపీ రాజ్యసభ సభ్యుడైన సురేశ్ గోపి సైతం ఇలాంటి పనే చేశారు. రూ. 20 లక్షల పైన ఖరీదుండే లగ్జరీ కారుకు 20 శాతం పన్ను కట్టాలనే ఆ రాష్ట్ర చట్టాన్ని తప్పించుకొనేందుకు ఆ కారును కేంద్ర పాలితప్రాంతమైన పుదుచ్చేరిలో రిజిస్టర్ చేయించారు. అందుకోసం అక్కడ ఓ తప్పుడు ఇంటి చిరునామా ఇచ్చారని కేరళ పోలీసులు అప్పట్లో కేసు పెట్టారు. లగ్జరీ కార్ల పన్ను చెల్లింపు వివాదం పక్కన పెట్టినా, పలు సందర్భాల్లో ఆదాయపన్ను ఎగ్గొట్టిన తారలూ అనేకులు కనిపిస్తారు. ఇక, ప్రభుత్వం అనుమతించిన టికెట్ రేట్లకు రెట్టింపు రేట్లతో ఓపెనింగ్ వసూళ్ళు తెచ్చుకొనే మాస్ హీరోలూ, టికెట్ అమ్మిన రేటుకూ – కట్టే వినోదపు పన్నుకూ పొంతన లేని సినీ వ్యాపారులూ మన తెలుగుతో సహా అన్నిచోట్లా తారసపడతారు. ఆ బాక్సాఫీస్ వాపును బలుపుగా చూపి, పారితోషికాలు పెంచుకొనే బడాబాబులు సామాన్యులకు తెరపై సుద్దులు చెబుతుంటారు. తీరా కట్టాల్సిన పన్ను దగ్గర తటపటాయిస్తున్నారు. ఓ పాత సూపర్‌హిట్ పాటలో అగ్రహీరో గారే అన్నట్టు, ‘ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి’ అంటే ఇదేనేమో! న్యాయమూర్తి మాటల్లో చెప్పాలంటే, ‘పన్ను చెల్లింపు దేశాభివృద్ధికి తప్పనిసరి. అంతే తప్ప, అది తోచింది ఇచ్చే విరాళమో, దాతృత్వమో కాదు. పన్ను ఎగవేతంటే– దేశానికి ద్రోహం చేసే అలవాటు, ఆలోచన. పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం!’ అది ‘హీరోలం’ అనుకొనేవాళ్ళు చేయదగిన పనేనా? -
ఆ జరిమానా చెల్లించడం ఇష్టం లేదు : విజయ్
చెన్నై: తనకు విధించిన రూ.లక్ష జరిమానా ప్రభుత్వ కరోనా నివారణ నిధికి చెల్లించడం ఇష్టం లేదని విజయ్ న్యాయస్తానానికి తెలిపారు. ఈయన ఇంగ్లాండ్‌లో కొనుగోలు చేసిన రోల్స్‌రాయిస్ కారుకు సంబంధించిన ట్యాక్స్ విషయంగా ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎస్ఎం సుబ్రమణియం విజయ్‌కు రూ.లక్ష జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో విజయ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన డివిజన్ బెంచ్ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులపై తాత్కాలిక స్టే విధించింది. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్‌కు విధించిన జరిమానా చెల్లింపునకు సంబంధించి ప్రకటన దాఖలు చేసే విషయంపై ప్రత్యేక న్యాయమూర్తి ఎస్ ఎం సుబ్రమణ్యం సమక్షంలో బుధవారం విచారణ జరిగింది. జరిమానాను ప్రభుత్వ కరోనా నివారణ నిధికి ఎందుకు జమ చేయలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. అందుకు విజయ్ తరఫు న్యాయవాది గత ఏడాది ప్రభుత్వ కరోనా నివారణ నిధికి రూ.25 లక్షలు అందించినట్లు, అందువల్ల రూ.లక్ష జరిమానాను కరోనా నివారణ నిధిగా చెల్లించడం ఇష్టం లేదని తెలియచేశారు. దీంతో విజయ్‌పై కేసును ముగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. -
టాటా ట్రస్టులకు తొలగిన పన్ను చిక్కులు!
న్యూఢిల్లీ: మూడు టాటా ట్రస్టులకు పన్ను మినహాయింపు హోదా సమంజసమేనని ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) రూలింగ్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ మార్చి 2019లో ఇచ్చిన ‘పన్ను మినహాయింపు హోదా రద్దు’ ఉత్తర్వులను తోసిపుచ్చింది. ఇందుకు సంబంధించి ఐటీఏటీ ముంబై బెంచ్ ప్రెసిడెంట్ జస్టిస్ పీపీ భట్, వైస్ ప్రెసిడెంట్ ప్రమోద్ కుమార్ సోమవారంనాడు మూడు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. . దీనితో రతన్ టాటా ట్రస్ట్, జేఆర్డీ టాటా ట్రస్ట్, దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు అప్పీలేట్ ట్రిబ్యునల్ నుంచి ఊరట లభించినట్లయ్యింది. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటాసన్స్లో ఈ మూడు ట్రస్టులకూ 66 శాతం వాటా ఉంది. 2019లో ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన రూలింగ్‌లో ఎటువంటి మెరిట్స్ లేవని ఈ ఉత్తర్వుల్లో బెంచ్ పేర్కొంది. కేసు వివరాల్లోకి వెళితే... మూడు ట్రస్ట్‌లకూ టాటా సన్స్‌లో వాటాలు ఉన్నాయన్న కారణంగా పన్ను మినహాయింపు రద్దును కోరుతూ ఆదాయపు పన్ను కమిషనర్– మినహాయింపులు (సీఐటీ–ఈ) గత ఏడాది మార్చిలో ఒక రివిజన్ (అభిప్రాయ వ్యక్తీకరణ) ఉత్తర్వులను ఇచ్చారు. ఈ ఉత్తర్వుల జారీకి సంబంధించి టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ సమర్పించిన పత్రాలను పరిశీలనలోకి తీసుకున్నారు. టాటాసన్స్లో వాటాలు కలిగిఉంటూ, పన్ను మినహాయింపులు పొందడం ఆదాయపు పన్ను చట్టాలకు విఘా తమని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘‘ట్రస్టు లో ట్రస్టీలు ఎవరికీ టాటా సన్స్‌లో ఎటువంటి స్వప్రయోజనాలూ లేవు. టాటాసన్స్లో పెట్టుబడు లు పెట్టి, స్వలాభాలు పొందాలన్న అభిప్రా యం ఇక్కడ కనిపించడంలేదు. టాటా గ్రూప్ కంపెనీల విజయం ద్వారా వచ్చిన ఫలాలను విస్తృత ప్రాతిపదికన ప్రజా ప్రయోజనాలకు పంచాలన్నదే ట్రస్టు ల లక్ష్యం’’ అని ఉత్తర్వులో అప్పీలేట్ ట్రిబ్యునల్ పేర్కొంది. అలాగే టాటాసన్స్ ట్రస్టీలకు చేస్తున్న చెల్లింపులు వారి సేవలకు ఇస్తున్న ప్రతిఫలంగానే చూడాలి తప్ప, మరో విధంగా కాదని పేర్కొంది. సైరస్ మిస్త్రీ ప్రవర్తన అనైతికం... కాగా, బాధ్యతల్లో నుంచి తప్పించిన ఎనిమిది వారాల తర్వాత సైరస్ మిస్త్రీ సంబంధిత డాక్యుమెంట్లను ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమర్పించడాన్నీ ట్రిబ్యునల్ తప్పుపట్టింది. కార్పొరేట్ ప్రపంచంలో కనీవినీ ఎరుగని అనైతిక ప్రవర్తనకు మిస్త్రీ పాల్పడ్డారని అప్పీలేట్ ట్రిబ్యునల్ పేర్కొంది. కంపెనీ అనుమతి కూడా లేకుండా ఈ పత్రాలను ఆదాయపు పన్ను శాఖకు ఎలా సమర్పిస్తారని ప్రశ్నించింది. మిస్త్రీ డాక్యుమెంట్ల సమర్పణకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే, ఇందుకు సంబంధించి ఆయన ఉద్దేశాలు ‘‘తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని ట్రిబ్యునల్ పేర్కొంది. టాటా సన్స్‌లో 2006 నుంచీ ఆయన డైరెక్టర్‌గా ఉన్నారనీ, 2013 నుంచీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారనీ పేర్కొన్న ట్రిబ్యునల్, అప్పుడు అంతా మంచిగా కనిపించిన ఆయనకు, బాధ్యతల నుంచి తొలగించిన వెంటనే తప్పులు ఎలా కనబడతాయని ప్రశ్నించింది. 2013లో టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా వారసునిగా సైరస్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టారు. 2017 మార్చిలో జరగాల్సిన పదవీకాలానికి ముందే 2016 అక్టోబర్ 24న గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని టాటా సన్స్ బోర్డ్ అర్ధాంతరంగా తొలగించింది. ఈ చర్య మిస్త్రీలు–టాటాల మధ్య న్యాయపోరాటానికి దారితీసిన సంగతి తెలిసిందే. టాటా ట్రస్టుల కేసుకు బలం! కాగా తాజాగా ఐటీఏటీ ఇచ్చిన రూలింగ్, టాటా ట్రస్టుల రిజిస్ట్రేషన్ రద్దు కేసుకు బలం చేకూర్చినట్లయ్యింది. ఆదాయపు పన్ను శాఖ 2019 అక్టోబర్‌లో ఆరు టాటా ట్రస్టుల రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. ఈ కేసు ఐటీఏటీ ప్రత్యేక బెంచ్ వద్ద విచారణలో ఉంది. ఎయిర్–ఏషియా ఇండియాలో టాటా సన్స్‌కు మరింత వాటా అదనంగా 32 శాతం వాటా కొనుగోలు ఎయిర్–ఏషియా ఇండియా(ఏఏఐఎల్)లో టాటా సన్స్ సంస్థ తన వాటాను మరింతగా పెంచుకోనున్నది. ప్రస్తుతం ఏఏఐఎల్ఎల్లో టాటా సన్స్‌కు 51 శాతం, మలేషియాకు చెందిన ఎయిర్‌ఏషియాకు 49 శాతం చొప్పున వాటాలున్నాయి. తాజాగా టాటా సన్స్ సంస్థ అదనంగా 32 శాతం వాటాను ఎయిర్ఏషియా నుంచి 3.76 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కారణంగా ఏఏఐఎల్లో టాటా సన్స్ వాటా 83.67 శాతానికి పెరుగుతుంది. ఎయిర్ఏషియా వాటా 13 శాతానికి పరిమితమవుతుంది. ఎయిర్–ఏషియా ఇండియా కంపెనీ 2014 జూన్‌లో దేశీయ రూట్లలో విమాన సర్వీసులను ప్రారంభించింది. ఎయిర్ ఇండియా కోసమే...!: ఎయిర్ ఇండియా టేకోవర్‌కు ఎయిర్ఏషియా ఇండియాను ఇన్వెస్ట్మెంట్ వెహికల్‌గా వినియోగించుకోవడానికి ఎయిర్ఏషియా ఇండియాలో తన వాటాను టాటా సన్స్ మరింతగా పెంచుకున్నారని సమాచారం. దేశీయ పౌర విమానయాన మార్కెట్లో ఎయిర్ఏషియా వాటా 7.1 శాతంగా ఉంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి టాటా గ్రూప్ విస్తార పేరుతో మరో విమానయాన కంపెనీని కూడా నిర్వహిస్తోంది. -
ఐపీఎల్ జట్లు... టి20 ప్రపంచకప్... ఒలింపిక్స్!
అహ్మదాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సుదీర్ఘ విరామం తర్వాత పలు కీలకాంశాలపై నిర్ణయాలు తీసుకోనుంది. ఇందుకోసం గురువారం జరిగే వార్షిక (89వ) సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో బోర్డు సభ్యులందరూ పాల్గొనబోతున్నారు. కరోనా పరిస్థితుల తర్వాత తొలిసారి బోర్డు పూర్తి స్థాయిలో ప్రత్యక్ష సమావేశం నిర్వహిస్తుండటం విశేషం. ఇందులో వేర్వేరు అంశాలు చర్చకు రానున్నాయి. బోర్డులో ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న పలు అంశాలపై కూడా ఏజీఎంలో అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు. ఐపీఎల్లో అదనపు జట్లు 2022 ఐపీఎల్లో ప్రస్తుతం ఉన్న 8 జట్లకు తోడు అదనంగా మరో 2 జట్లకు అవకాశం కల్పించాలనే ప్రతిపాదనపై చర్చించనున్నారు. వచ్చే ఐపీఎల్‌తోనే ఇలా చేయాలని భావించినా... పలు కారణాలతో 10 జట్ల ఆలోచన సాధ్యం కాదనే అభిప్రాయం ఎక్కువ మందిలో వ్యక్తమైంది. ఈ సమావేశంలో రెండు కొత్త జట్లు చేర్చే అంశానికి మాత్రమే ఆమోదం తెలిపి 2022 ఐపీఎల్ నుంచి అమల్లోకి వచ్చేలా నిర్ణయం తీసుకోవచ్చు. పన్ను రాయితీలపై ఎలా? 2021లో భారత్‌లో టి20 ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో టోర్నీ నిర్వహణ విషయంలో పూర్తిగా పన్ను రాయితీ కల్పించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కోరుతోంది. అందుకు ఐసీసీ విధించిన గడువు మరో వారం రోజులు మాత్రమే ఉంది. రాయితీ ఇవ్వలేకపోతే టోర్నీని యూఏఈకి తరలిస్తామని కూడా ఇప్పటికే ఐసీసీ చెప్పేసింది. గతంలో పలు మెగా ఈవెంట్లకు పన్నుల విషయంలో ప్రభుత్వం సడలింపులు ఇచ్చినా... కొత్త పన్ను చట్టాల ప్రకారం ఇది సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఏం చేస్తుందనేది చూడాలి. మరోవైపు ప్రపంచ కప్ నిర్వహణ కోసం బోర్డు ఎనిమిది వేదికలను ప్రస్తుతానికి ఎంపిక చేసింది. అహ్మదాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, మొహాలి, ధర్మశాల ఈ జాబితాలో ఉన్నాయి. అయితే పలు రాష్ట్ర సంఘాలు తమ వద్దా అత్యుత్తమ సౌకర్యాలు ఉన్నాయని, తమకూ వరల్డ్‌కప్ మ్యాచ్ నిర్వహణ అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఒలింపిక్స్‌కు నో 2028 లాస్ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు బోర్డు మద్దతునిచ్చే విషయంపై చర్చ జరగవచ్చు. అయితే ఎక్కువ మంది దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొంటే జాతీయ క్రీడా సమాఖ్యగా ప్రభుత్వం గుర్తింపు కిందకు వచ్చి బీసీసీఐ తమ పట్టు కో ల్పోయే ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారు. ఫ్రెండ్లీ మ్యాచ్... ఏజీఎంలో పాల్గొనేందుకు వచ్చిన సభ్యుల మధ్య బుధవారం మొతేరా స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బీసీసీఐ కార్యదర్శి జై షా సెక్రటరీ ఎలెవన్ 28 పరుగుల తేడాతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జట్టు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌పై గెలుపొందడం విశేషం. 12 ఓవర్లపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా జై షా జట్టు 3 వికెట్లకు 128 పరుగులు చేసింది. భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజహరుద్దీన్ ఓపెనర్‌గా వచ్చి 22 బంతుల్లో 7 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. అనంతరం గంగూలీ జట్టు 100 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. గంగూలీ 53 పరుగులతో అజేయంగా నిలిచాడు. కార్యదర్శి జై షా రెండు వికెట్లు తీశాడు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో ప్రజ్ఞాన్ ఓజా క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ) సహా పలు ప్రధాన సబ్ కమిటీలను ఏజీఎంలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా ఎంపికకు... ముగ్గురు సభ్యుల ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు కూడా ఆమోద ముద్ర వేస్తారు. ఇందులో బ్రిజేశ్ పటేల్, ఖైరుల్ మజుందార్ మరో ఏడాది కొనసాగనుండగా... భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) తరఫున హైదరాబాద్‌కు చెందిన మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాకు అవకాశం దక్కింది. సురీందర్ ఖన్నా స్థానంలో ఓజా పేరును ఐసీఏ ప్రతిపాదించింది. భారత్ తరఫున 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టి20లు ఆడిన ఓజా... ఏడేళ్ల క్రితం చివరిసారిగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. -
అందరికీ ‘ఎన్పీఎస్’ పన్ను ప్రయోజనం
న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) పథకం కింద 14 శాతం చందాకు సంబంధించి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సంస్థలకు లభిస్తున్న పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని మరింత విస్తరింపజేయాలని కేంద్రానికి పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్– పీఎఫ్ఆర్డీఏ విజ్ఞప్తి చేయనుంది. 2021–22 బడ్జెట్లో ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని కోరనున్నట్లు చైర్మన్ సుప్రీతిమ్ బందోపాధ్యాయ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎన్పీఎస్ పథకం కింద 14 శాతం యాజమాన్యాల చందాకు 2019 ఏప్రిల్ 1 నుండి పన్ను మినహాయింపును అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ యాజమాన్య సంస్థలకు ఇస్తున్న ఈ మినహాయింపును రాష్ట్ర ప్రభుత్వ, ఇతర కార్పొరేట్ సంస్థలకూ వర్తింపజేయాలని కోరుతున్నట్లు బందోపాధ్యాయ వెల్లడించారు. చందాదారులందరికీ ఈ ప్రయోజనం అందాలన్నది తమ ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. ఇప్పటికే కేంద్ర సంస్థల యాజమాన్యాలకు అందుతున్న ప్రయోజనాలను తమకూ వర్తింపజేయాలని కోరుతూ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ)కి లేఖలు రాసినట్లు ఆయన వివరించారు. యథాపూర్వం 2021–22 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటుకు సమర్పిస్తారని భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రతికూలతలు, ఉద్దీపన చర్యలు, ఆదాయాలు–వ్యయాలకు మధ్య భారీగా పెరిగిపోనున్న ద్రవ్యలోటు, మౌలిక రంగంపై భారీ నిధుల కేటాయింపులకు భారీ అవరోధాలు వంటి అంశాల నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు తాజా బడ్జెట్ కత్తిమీద సాములాగా కనిపిస్తోంది. నిర్మలా సీతారామన్‌తోపాటు మోదీ 2.0 ప్రభుత్వానికి ఇది మూడో బడ్జెట్. టైర్–2 ఎన్పీఎస్ అకౌంట్లను కూడా... దీనితోపాటు చందాదారులందరి టైర్–2 ఎన్పీఎస్ అకౌంట్లను కూడా పన్ను మినహాయింపు పరిధిలోనికి తీసుకురావాలని కోరుతున్నట్లు బందోపాధ్యాయ తెలిపారు. ‘‘ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రయోజనాన్ని అందించడం జరిగింది. ట్యాక్స్ ఫ్రీ టైర్ 2 అకౌంట్లను మూడేళ్లు లాక్ ఇన్ పీరియడ్‌లో ఉంచడం జరుగుతుంది. పన్ను రహిత హోదానే దీనికి కారణం. ఉద్యోగులందరికీ ఈ ప్రయోజనాన్ని వర్తింపజేయాలని కోరుతున్నాం’’ అని ఆయన అన్నారు. ఎన్పీఎస్ కింద టైర్–2 అకౌంట్ తప్పనిసరి అకౌంట్ కాదు. దీనిని టైల్–1 అకౌంట్‌తో పాటు ఎంపికచేసుకోవచ్చు. తక్షణం విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇందులో ఉంటుంది. ఎన్పీఎస్ అంటే... ఇది ఒక స్వచ్ఛంద పదవీ విరమణ పొదుపు పథకం. పీఎఫ్ఆర్డీఏ నిర్వహిస్తుంది. భవిష్యత్ అవసరాల కోసం ఈ పథక రూపకల్పన జరిగింది. ఎన్‌పీఎస్‌లో రెండు రకాల అకౌంట్లు ఉంటాయి. ఒకటి టైర్–1, రెండు టైర్–2. టైర్–1 శాశ్వత రిటైర్మెంట్ అకౌంట్. ఇందులో డిపాజిట్లు, ఇన్వెస్ట్మెంట్లు క్రమంగా వృద్ధి చెందుతూ, చివరికి నిర్దిష్ట మొత్తంలో లేదా పెన్షన్ రూపంలో వడ్డీతో సహా చందాదారునికి అందుతుంది. ఇక టైర్–2 స్వచ్ఛంద విత్‌డ్రాయెల్ అకౌంట్. టైర్–1 అకౌంట్ ఉన్న వారే దీనిని నిర్వహించడానికి అర్హులు. అతల్ పెన్షన్ యోజన (ఏపీవై) పేరుతో మరో పెన్షన్ స్కీమ్‌ను పీఎఫ్ఆర్డీఏ నిర్వహిస్తోంది. ఎన్పీఎస్ ప్రధానంగా వ్యవస్థాగత ఉద్యోగుల విభాగాన్ని ఉద్దేశించినదైతే, ఏపీవై అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారికి ఉపయోగపడుతుంది. -
టీడీఎస్ రేటు తగ్గింపు అమల్లోకి..
న్యూఢిల్లీ: డివిడెండ్, అద్దె, బీమా చెల్లింపులు తదితర వేతనేతర చెల్లింపులపై మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్), మూలం వద్దే పన్ను వసూలు (టీసీఎస్) రేట్లను తగ్గిస్తూ ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీడీబీటీ) గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సవరించిన రేట్లు గురువారం నుంచే అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది. 2021 మార్చి 31 వరకు ఇవే రేట్లు అమల్లో ఉంటాయని తెలిపింది. ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు గాను కంపెనీలు, పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ.. టీడీఎస్, టీసీఎస్ రేటును ప్రస్తుత రేటుపై 25 శాతం తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేసిన మరుసటి రోజే అందుకు సంబంధించి ఆదేశాలు వెలువడ్డాయి. ► 23 ఐటమ్స్‌పై టీడీఎస్ తగ్గింది. రూ.10 లక్షలు మించిన మోటారు వాహనంపై టీడీఎస్ 1 శాతం నుంచి 0.75 శాతానికి తగ్గింది. ► జీవిత బీమా పాలసీకి సంబంధించి పాలసీదారునికి చేసే చెల్లింపులపై టీడీఎస్ 5 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గింది. ► డివిడెండ్, వడ్డీ ఆదాయంపై టీడీఎస్ 10 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గింది. ► చరాస్తి కొనుగోలుపై 1 శాతం టీడీఎస్ 0.75 శాతానికి తగ్గింది. ► వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు చేసే అద్దె చెల్లింపులపై టీడీఎస్ 5% నుంచి 3.75%కి సవరించారు. ► ఈ కామర్స్ వేదికపై విక్రేతలకు వర్తించే టీడీఎస్ రేటు 1 శాతం నుంచి 0.75 శాతానికి మారింది. ► వృత్తి ఫీజు 2 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గింది. ► నేషనల్ సేవింగ్స్ స్కీమ్ డిపాజిట్ మొత్తాలను తిరిగి చెల్లించే సందర్భంలో వర్తించే టీడీఎస్ రేటు 10 శాతం నుంచి 7.5 శాతానికి దిగొచ్చింది. ► బీమా కమీషన్, బ్రోకరేజీపై 5 శాతం నుంచి 3.75 శాతానికి టీడీఎస్ సవరించారు. ► మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ హోల్డర్లకు చేసే డివిడెండ్ చెల్లింపులపై టీడీఎస్ 10 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గింది. ► టెండ్ లీవ్స్ (బీడీ ఆకులు), తుక్కు, కలప, అటవీ ఉత్పత్తులు, బొగ్గు, లిగ్నైట్, ఐరన్ ఓర్ తదితర మినరల్స్‌పై టీసీఎస్ తగ్గింది. ► పాన్/ఆధార్ సమర్పించని కేసుల్లో అధిక టీడీఎస్/టీసీఎస్ వసూలు చేయాల్సిన చోట ఈ తగ్గింపులు వర్తించవని సీబీడీటీ స్పష్టం చేసింది. -
ఏపీ: విరాళాలకు 100 శాతం పన్ను మినహాయింపు
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారిపై పోరాటానికి చేయూతనిచ్చే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చే విరాళాలపై 100 శాతం పన్ను మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. 1961 ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80జీ కింద మినహాయింపు వర్తిస్తుందని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వి. ఉషారాణి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చెక్ ద్వారా విరాళాలు ఇవ్వాలనుకునే వారు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, ఆంధ్రప్రదేశ్ పేరుపై పంపాలని సూచించారు. బ్యాంక్ ద్వారా పంపే వారు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అకౌంట్ నెంబర్: 38588079208, వెలగపూడి, సెక్రటేరియట్ బ్రాంచ్, IFSC కోడ్: SBIN001884 ఆంధ్రా బాంక్, అకౌంట్ నెంబర్: 110310100029039, వెలగపూడి, సెక్రటేరియట్ బ్రాంచ్, IFSC CODE: ANDB0003079 కొనసాగుతున్న విరాళాలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు విద్యుత్ ఉద్యోగులు ఒక రోజు వేతనం (రూ.5.30 కోట్లు) విరాళంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్ ఉద్యోగులను మంత్రి బాలినేని శ్రీనివాస్ అభినందించారు. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ లక్ష రూపాయల విరాళాన్ని గురువారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి మురళీధరరెడ్డికి అందజేశారు. జిల్లాలో కరోనా వైరస్ నిరోధానికి వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో చేపట్టిన కార్యాచరణ ను కలెక్టర్‌ను అడిగి ఆయన తెలుసుకున్నారు. (కరోనా బాధితులకు పవన్ కల్యాణ్ విరాళం) రేపు కేబినెట్ ప్రత్యేక భేటీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రి మండలి ప్రత్యేకంగా సమావేశం కానుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు అందించే సేవలపై చర్చించే అవకాశం ఉంది. బడ్జెట్‌పై ఆర్డినెన్స్‌ను కేబినెట్ ఆమోదించనుందని సమాచారం. -
కొత్త విధానంలో పన్ను తగ్గుదల ఉత్తుత్తిదేనా..?
సాక్షి, అమరావతి: కొత్త పన్నుల విధానంలో పన్ను రేట్లు తగ్గించడం వల్ల పన్ను భారం భారీగా తగ్గు తుందని, దీనివల్ల కేంద్ర ప్రభుత్వం రూ.40,000 కోట్ల ఆదాయం కోల్పోతుందన్న మాటల్లో వాస్తవం లేదని ట్యాక్సేషన్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కీలకమైన పన్ను మినహాయింపులను ఎత్తివేయడం వల్ల ప్రజల్లో పొదుపు అలవాటుపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. పన్ను భారం తగ్గించు కోవడానికి చాలామంది బీమా, పీపీఎఫ్, గృహ రుణాలు వంటివి తీసుకుంటున్నారని, ఇప్పుడు వీటిని తొలగించడం వల్ల ఈ పథకాలకు ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందని ట్యాక్స్ నిపుణులు ఎంఎన్ శాస్త్రి స్పష్టం చేస్తున్నారు. వృద్ధిరేటును పెంచడం కోసం పొదుపు శక్తిని తగ్గించడం ద్వారా కొనుగోలు శక్తిని పెంచాలని ఆర్థికమంత్రి ఆలోచన కింద ఉన్నట్లు కనిపిస్తోందని, కానీ ఇది దీర్ఘకాలంలో మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందన్నారు. ఏ విధంగా చూసినా కొత్త విధానం కంటే పాత విధానమే భారం తక్కువగా ఉంటుందని ట్యాక్స్ నిపుణురాలు కె.వి.ఎల్.ఎన్ లావణ్య స్పష్టం చేస్తున్నారు.పన్ను రేటు సగానికి సగం తగ్గినా మినహాయింపులు ఎత్తివేయడం వల్ల పాత విధానం కంటే కొత్త విధానంలో పన్ను చెల్లించాల్సి వస్తోందన్నారు. ప్రస్తుత విధానంలో రూ.7.5 లక్షల ఆదాయం ఉన్న వారి వరకు మినహాయింపులను వినియోగించుకోవడం ద్వారా ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదని, అదే కొత్త విధానంలో అయితే ఏకంగా రూ.37,500 పన్ను చెల్లించాల్సి వస్తోందన్నారు. -
తాప్సీ సినిమాకి పన్ను మినహాయింపు
సాక్షి, సినిమా : హర్యానాకు చెందిన ప్రముఖ షూటింగ్ సిస్టర్స్ చంద్రో, ప్రకాశీల జీవిత కథ ఆధారంగా బాలీవుడ్లో రూపొందించిన చిత్రం సాండ్ కి ఆంఖ్. తాప్సీ పన్ను, భూమి పెడ్నేకర్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తూ, అరవైయేళ్ల బామ్మలుగా నటించారు. తుషార్ హీరానందని దర్శకత్వంలో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళి కానుకగా విడుదలవుతోన్న ఈ చిత్రానికి అశోక్ గెహ్లాట్ సారథ్యంలోని రాజస్థాన్ ప్రభుత్వం పన్ను మినహాయింపునిచ్చింది. మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కార్యాలయం శుక్రవారం ట్విట్టర్లో ప్రకటించింది. కాగా, ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ 20 మిలియన్ల వ్యూస్‌ను దాటి దూసుకెళ్తోంది. -
‘పన్ను’కు టైమైంది..
గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేసేందుకు పెద్దగా సమయం లేదు. వాస్తవానికి జూలై చివరి నాటికే ఆదాయపన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేయాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ చివరి వరకు గడువును పొడిగించింది. దీంతో ఈ నెల చివరి వరకు అవకాశం లభించినట్టు అయింది. కనుక వెంటనే ఐటీఆర్ దాఖలును ప్రారంభించడం మంచిది. బేసిక్ పన్ను మినహాయింపు అయిన రూ.2.5 లక్షలు (60 ఏళ్లు దాటిన వారికి రూ.3 లక్షలు) దాటి ఆదాయం ఉన్న ప్రతీ ఒక్కరూ నిబంధనల మేరకు ఐటీఆర్ తప్పనిసరిగా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ దాఖలు చేయాలంటే, అందులో ఉండే పన్ను అంశాలు, వాటికి సంబంధించి ఇవ్వాల్సిన వివరాలు అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. అంతేకాదు అందరికీ ఒకటే ఐటీఆర్ వర్తించదు. వేతన జీవులు, వ్యాపారులు, ఉమ్మడి కుటుంబాల వారు... ఇలా వారి ఆదాయ మార్గాలను బట్టి ఐటీఆర్ కూడా మారిపోతుంది. కనుక ఐటీఆర్ ప్రక్రియ గురించి అవగాహన కలిగి ఉంటే, సులభంగా దాఖలు చేయవచ్చు. ఆ వివరాలే ఈవారం ప్రాఫిట్ ప్లస్ కథనం... గడువులోపు ఐటీఆర్ దాఖలు అన్నది మంచి చర్య అవుతుంది. లేదంటే పెనాల్టీలు, ఇతర వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఐటీఆర్ దాఖలు కోసం ముందుగా మీరు మీ ఆదాయ వనరులు అన్నింటిపై అవగాహన కలిగి ఉండాలి. వేతనం, ఇంటి అద్దె, ఏవైనా రాయల్టీలు (ప్రతిఫలాలు) ఇలా అన్ని ఆదాయ వనరుల సమాచారం సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఆదాయంలో దేనిపై పన్ను వర్తిస్తుందన్నది తెలుసుకోవాలి. ఆదాయపన్ను అన్నది బేసిక్ శాలరీ, కరువుభత్యం (డీఏ), బోనస్‌లపై అమలవుతుంది. సొంతిల్లు ఉండి, అందులో మీరు నివసిస్తుంటే తప్ప ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పన్ను పరిధిలోకి రాదు. ఇక ఆదాయంలో పన్ను మినహాయింపులు వేటికన్నది గుర్తించాల్సి ఉంటుంది. సేవింగ్స్ పథకాలు, బీమా పాలసీలు, ఈపీఎఫ్, పీపీఎఫ్ వంటివన్నీ సెక్షన్ 80సీ కింద మినహాయింపులోకి వస్తాయి. పన్ను వర్తించే ఆదాయం అన్నది స్థూల ఆదాయంలో ఒక భాగం కాగా, మిగిలినది మినహాయింపులకు అర్హమైనది. పన్ను వర్తించే ఆదాయంపై పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఇలా పన్ను ఆదాయం ఉన్న వారి వేతనం నుంచి టీడీఎస్‌ను సంస్థలు మినహాయిస్తుంటాయి. ఈ వివరాలను ఫామ్–16 రూపంలో సంస్థ నుంచి పొందొచ్చు. ఐటీ చట్టం ప్రకారం పలు రకాల పన్ను శ్లాబులు ఉన్నాయి. మీకు పన్ను వర్తించే ఆదాయం ఏ శ్లాబు పరిధిలోకి వస్తే, అందులో వర్తించే రేటు మేరకు పన్ను చెల్లించాలి. ఐటీఆర్‌లో అన్ని వివరాలు పొందుపరిచి మినహాయింపుల ఆదాయం పోను మిగిలిన ఆదాయంపై పన్ను చెల్లించిన తర్వాత... ఏవైనా వ్యత్యాసం ఉంటే.. ఆ మేరకు పన్ను చెల్లింపుదారుడు రిఫండ్ కోరొచ్చు. తనే అదనంగా చెల్లించాల్సి ఉంటే పన్ను కట్టాల్సి ఉంటుంది. ఆదాయ వనరులు... మీరు ఉద్యోగి అయితే, నెలవారీ ఆదాయం లేదా వార్షికాదాయంతోపాటు.. ఇతర మార్గాల నుంచి వచ్చే ఆదాయం (అంటే ఇంటిపై అద్దె, ఉన్న ఆస్తిని విక్రయించగా వచ్చిన ఆదాయం వంటివి). పన్ను పరంగా అన్ని రకాల ఆదాయం సంబంధిత ఆర్థిక సంవత్సరంలో మీ మొత్తం ఆదాయం కిందకు వస్తుంది. బేసిక్ సాలరీ, బోనస్‌లు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఇతర అలవెన్స్‌ను వేతనంలో భాగంగా పొందుతుంటే అది పన్ను వర్తించే ఆదాయమే. అలాగే, ఇంటిపై వచ్చే ఆదాయంపైనా పన్ను ఉంటుంది. ఏదైనా ఆస్తిని విక్రయించగా వచ్చిన మూలధన లాభం లేదా నష్టం. వ్యాపారంపై వచ్చే ఆదాయం. ఫిక్స్డ్ డిపాజిట్, సేవింగ్స్ బ్యాంకు ఖాతాపై వడ్డీ ఆదాయం, గిఫ్ట్, కుటుంబ పెన్షన్‌ను సైతం ఐటీఆర్‌లో చూపించాల్సి ఉంటుంది. మినహాయింపులు... ఆదాయపన్ను చట్టంలోని పలు సెక్షన్లు ఆదాయంలో కొంత వరకు పన్ను మినహాయింపులు పొందేందుకు వీలు కల్పిస్తున్నాయి. సెక్షన్ 80సీ, 80సీసీసీ, 80సీసీడీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంటుంది. పెన్షన్ ప్లాన్లు, బీమా పాలసీలు, ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్, ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో పెట్టుబడులు, పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజు చెల్లింపులు ఈ సెక్షన్ల కింద పన్ను మినహాయింపునకు అర్హమైనవి. అందుబాటులో ఉన్న సాధనాల్లో మీకు అనుకూలమైన వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ మేరకు ఆదాయంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. కాకపోతే ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవడం సౌకర్యవంతం. ఇవి కాకుండా ఇతర పన్ను మినహాయింపులు కూడా ఉన్నాయి. ఇంటి కొనుగోలు కోసం తీసుకున్న రుణానికి చేసే అసలు (ప్రిన్సిపల్) మొత్తంపై సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల పరిమితి మేరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. రుణంపై సమకూర్చుకున్న ఇంటిని సొంత వినియోగానికి ఉంచుకుంటే గరిష్టంగా సెక్షన్ 24 కింద ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల వడ్డీ చెల్లింపులకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ ఇంటిని అద్దెకు ఇచ్చినట్టయితే, ఆ ఇంటి రుణంపై చేసే వడ్డీ చెల్లింపులు మొత్తంపైనా పరిమితి లేకుండా పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇక మొదటి సారి ఇంటిని కొనుగోలు చేసిన వారు సెక్షన్ 80ఈఈ కింద రూ.2 లక్షలకు అదనంగా మరో రూ.50,000 వరకు వడ్డీ చెల్లింపులపై మినహాయింపు చూపించుకోవచ్చు. బ్యాంకు సేవింగ్స్ ఖాతాపై వార్షికంగా వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలకు (హెచ్‌యూఎఫ్) సెక్షన్ 80టీటీఏ కింద పన్ను మినహాయింపు ఉంది. సెక్షన్ 80సీసీజీ ఈక్విటీ సేవింగ్ స్కీమ్‌లో పెట్టుబడులపై 50 శాతం, గరిష్టంగా 25,000కు... దీర్ఘకాలిక ఇన్ఫ్రా బాండ్లలో రూ.20,000 పెట్టుబడులకు సెక్షన్ 80సీసీఎఫ్ కింద పన్ను మినహాయింపులు ఉన్నాయి. సెక్షన్ 80డీ కింద వ్యక్తులు అయితే రూ.25,000 వరకు హెల్త్ ప్రీమియంపై, వృద్ధులకు రూ.30,000 ప్రీమియంకు పన్ను మినహాయింపు ఉంది. సెక్షన్ 80ఈ కింద విద్యా రుణంపై చేసే వడ్డీ చెల్లింపులు పరిమితి లేకుండా ప్రయోజనం పొందొచ్చు. ఐటీఆర్ దాఖలు ఇలా... అన్ని వివరాలపై అవగాహన తెచ్చుకున్న తర్వాత ఐటీఆర్ దాఖలు చేయడం ద్వారా సమగ్రంగా ఉండేలా చూసుకోవచ్చు. ఆన్లైన్లో స్వయంగా ఐటీఆర్ దాఖలు చేయడం లేదంటే నిపుణుల సాయం తీసుకోవచ్చు. మీ సమక్షంలో వారు ఐటీఆర్ దాఖలు చేస్తారు. ఆదాయపన్ను శాఖ వెబ్సైట్ నుంచి ఆదాయపన్ను రిటర్నుల దాఖలు పత్రం సహజ్‌ను పొందొచ్చు. ఆదాయపన్ను ఈఫైలింగ్ వెబ్‌పోర్టల్‌లో తమ పేరిట అకౌంట్ క్రియేట్ చేసుకుంటే, ఆన్లైన్లోనే ఈ ఫామ్‌ను పూర్తి చేసి దాఖలు చేయవచ్చు. ఇలా రిటర్నులు దాఖలు చేసే ముందు ఆదాయం, పెట్టుబడుల వివరాలను, సంబంధిత డాక్యుమెంట్లను, ఫామ్ 16ను రెడీగా ఉంచుకోవాలి. రిటర్నుల సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఐటీఆర్ దాఖలును సులభంగా పూర్తి చేయవచ్చు. ఆన్లైన్ టూల్‌ను గతంలో వినియోగించినట్టయితే, లాగిన్ అయి ప్రీఫిల్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. వీటికి అదనంగా ఇతర వివరాలను నమోదు చేసి దాఖలు ప్రక్రియను పూర్తి చేయడం సులభం. అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత మీపై పన్ను చెల్లింపు బాధ్యత ఎంతన్నది లెక్కించుకోవాలి. అంతిమంగా చెల్లించాల్సిన పన్ను, అప్పటికే టీడీఎస్ రూపంలో చెల్లించినది పోను మిగిలిన మేర చెల్లించాలి. ఐటీఆర్‌ను దాఖలు చేసిన తర్వాత ఐటీఆర్–వీ ఫామ్ అన్నది జనరేట్ అవుతుంది. దీనిపై డిజిటల్‌గా సంతకం చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకుని ఐటీఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయవచ్చు. లేదంటే ఐటీఆర్–వీ పత్రాన్ని ప్రింట్ తీసుకుని, సంతకం చేసి, ఐటీ కార్యాలయానికి పోస్ట్ ద్వారా పంపుకోవచ్చు. ఎవరు.. ఏ ఫారం దాఖలు చేయాలి.. ఒక వ్యక్తి ఏయే ఫారంల ద్వారా రిటర్నులు దాఖలు చెయ్యాలో ఈ వారం తెలుసుకుందాం. గతంలో వేతన జీవులకొక ఫారం, ఇతరులకొక ఫారం అంటూ రెండే ఉండేవి. కాలక్రమంలో ఎన్నో మార్పు.. ఎన్నో ఫారాలు.. మొత్తం వాడుకలో ఉన్న ఏడు ఫారాలలో నాలుగు ఫారాలు వ్యక్తులకు వర్తిస్తాయి. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ప్రీఫిల్డ్ ఫారాలు అమల్లో ఉన్నాయి. ఐటీ సైట్లోకి వెళ్లి my account ఆప్షన్‌లోకి వెడితే.. Prefilled XML ఉంటుంది. ఫారం 26 A లోని వివరాలు కనిపిస్తాయి. జీతం, పెన్షన్, వడ్డీ.. తదితరసమాచారం ఇందులో ఉంటుంది. ఐటీ ట్యాక్స్ వివరాలు ఉంటాయి. ఐటీఆర్1 వ్యక్తులు.. రెసిడెంట్ అయి ఉండి, నికర ఆదాయం రూ. 50 లక్షలు దాటని వారు ఈ ఫారం వేయాల్సి ఉంటుంది. విదేశీ ఆదాయం ఉండకూడదు. ఏదేని సంస్థలో డైరెక్టర్ అయి ఉండకూడదు. వ్యాపారం, క్యాపిటల్ గెయిన్స్ ఉండకూడదు. ఏ వనరు ద్వారా కూడా నష్టం ఉండకూడదు. ఒక ఇంటి నుంచే ఆదాయం ఉండాలి. మరో విధంగా చెప్పాలంటే.. కేవలం జీతం, వడ్డీ, ఒక ఇంటి మీద ఆదాయం (నష్టం కాదు) ఉన్న వారు ఈ ఫారం దాఖలు చేయాలి. వ్యవసాయం మీద ఆదాయం, డివిడెండ్లు రూ. 5,000 దాటకపోతే కూడా వేయొచ్చు. ఐటీఆర్ 2 వ్యక్తులు మరియు ఉమ్మడి కుటుంబాలు ఈ ఫారం దాఖలు చేయొచ్చు. జీతం, ఇంటి మీద ఆదాయం (నష్టం ఉన్నా ఫర్వాలేదు), ఇతర ఆదాయాలు, క్యాపిటల్ గెయిన్స్ ఉన్న వారు మాత్రమే దీన్ని ఉపయోగించవచ్చు. నాన్ రెసిడెంట్లు కూడా ఈ ఫారం వేయొచ్చు. అయితే, వారు తమ ట్యాక్స్ ఐడెంటిటీ నంబరు ఇవ్వాలి. నికర ఆదాయం రూ. 50 లక్షలు దాటిన వారు దీన్ని దాఖలు చేయాల్సి ఉంటుంది. స్థిరాస్తుల వివరాలు, షేర్లు, బంగారం, ఆభరణాలు, వాహనాలు, పెయింటింగ్, కళాత్మక వస్తువులు, బ్యాంకు డిపాజిట్లు, ఇన్సూరెన్స్ పాలసీలు, రావల్సిన అప్పులు, నగదు మొదలైన వివరాలు ఇందులో పొందుపర్చాలి. ఆస్తులను కొన్న ధర చూపాలే తప్ప ప్రస్తుత మార్కెట్ విలువ కాదు. నష్టం, సర్దుబాటు చూపొచ్చు. ఐటీఆర్ 3 ట్యాక్స్ క్రెడిట్ పరిధిలోకి రానివారు, పలు వనరుల నుంచి ఆదాయం ఉన్నవారు.. అంటే జీతం, ఇంటద్దె, క్యాపిటల్ గెయిన్స్, ఇతరత్రా వ్యాపారం.. వృత్తిగత ఆదాయాలు ఉన్నవారు దీన్ని దాఖలు చేయొచ్చు. ఇది పెద్ద ఫారం. చాలా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. నాన్ రెసిడెంట్లు, వ్యక్తులు, ఉమ్మడి కుటుంబాలు దీన్ని వేయొచ్చు. ఆస్తులు.. అప్పుల పట్టీ, స్థూల ఆదాయం, ఖర్చుల వివరాలు, నగదు, బ్యాంకు నిల్వల వివరాలు ఇందులో పొందుపర్చాలి. ఐటీఆర్ 4 ఇది రెసిడెంట్లు మాత్రమే ఉపయోగించగలిగే ఫారం. వ్యక్తులు, హిందు ఉమ్మడి కుటుంబాలు దీన్ని దాఖలు చేయొచ్చు. వ్యాపారం మీద స్థూల ఆదాయం/టర్నోవరు రూ. 2 కోట్లు దాటకూడదు. వృత్తి నిపుణుల స్థూల ఆదాయం రూ. 50,00,000 దాటకూడదు. ఒక ఇంటి మీద మాత్రమే ఆదాయం ఉండాలి. నికర ఆదాయం రూ. 50 లక్షలు దాటకూడదు. ఊహాజనిత ఆదాయాలున్న వారు దీన్ని వేయొచ్చు. ఈ ఫారాన్ని ఒకసారి వేస్తే.. వరుసగా అయిదేళ్ల పాటు ఇదే ఫారం దాఖలు చేయడం కొనసాగించాల్సి ఉంటుంది. ఏదైనా కారణం వల్ల ఫారం 3 వేస్తే రాబోయే అయిదు సంవత్సరాలు కూడా ఫారం 3 మాత్రమే వేయాల్సి ఉంటుంది. ఇంకా సందేహాలు ఉంటే వృత్తి నిపుణులను సంప్రతించండి. ఐటీ రిటర్నులను మీరే స్వయంగా దాఖలు చేసుకోవచ్చు. అయితే, ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. తప్పులు చేయొద్దు. ఆదాయాన్ని చూపించడం మానొద్దు. లేకపోతే 50–200% దాకా జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య -
సొంతింటికి దారి ఇదీ..!
ఇంటి కొనుగోలును ఆకర్షణీయం చేసే పలు నిర్ణయాలను మోదీ సర్కారు ఇటీవలి బడ్జెట్లో ప్రకటించింది. అందుబాటు గృహాలపై బిల్డర్లకు పన్ను రాయితీలను 2019–20 వరకు పొడిగించింది. అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లపైనా పన్ను మినహాయింపు రెండేళ్లకు పొడిగించారు. రూ.5 లక్షల వరకు ఆదాయం ఉంటే పన్ను మినహాయింపునిచ్చారు. దీనికి పైన మరో రెండు లక్షల ఆదాయం ఉన్న వారు రుణంపై ఇంటిని తీసుకుని వడ్డీ రూ.2 లక్షలు చెల్లించడం ద్వారా మొత్తం ఆదాయంపై పన్ను లేకుండా ప్రయోజనం పొందొచ్చు. త్వరలో ఇళ్లపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వచ్చేందుకు కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక బడ్జెట్‌కు ముందే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వడ్డీ సబ్సిడీని మరో ఏడాది పాటు పొడిగించడం జరిగింది. ఇవన్నీ కలసి మధ్యతరగతి జీవులు సొంతింటి కలను నిజం చేసుకునే దిశగా అడుగులు వేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. అయితే, ఈ విషయంలో కచ్చితంగా దృష్టిపెట్టాల్సిన కొన్ని అంశాలున్నాయి. అవేంటో చూడండి మరి... ఇల్లు కొనుగోలు అన్నది ఆర్థికంగా ఓ పెద్ద నిర్ణయం. ఈ విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచిస్తుంటారు. సొంతిల్లును సమకూర్చుకోవడాన్ని చాలా ముఖ్యమైన విషయంగా చూస్తారనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. నిజానికి ఇది ఆర్థిక కట్టుబాటు కూడా. అందుకే ఇంటి కొనుగోలుకు సిద్ధమైన వారు ముందుగా చూడాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. రుణంతో మొదటి సారి ఇంటిని కొనాలనుకునే వారు.. డౌన్ పేమెంట్ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. నెలవారీ సమాన వాయిదాల (ఈఎంఐ)ను సక్రమంగా చెల్లించే సామర్థ్యాన్ని కూడా అంచనా వేసుకోవాలి. వీటికి తోడు మరెన్నో అంశాలు ఇంటి కొనుగోలు సామర్థ్యాలను నిర్ణయిస్తాయి. అవన్నీ పరిశీలించిన తర్వాతే ముందడుగు వేయాలి. డౌన్ పేమెంట్... ఇంటి రుణానికి డౌన్ పేమెంట్ తప్పనిసరి. ఓ ఇంటి కొనుగోలుకు అయ్యే మొత్తం ఖర్చులో కొంత శాతాన్ని రుణం తీసుకోదలిచిన వ్యక్తి తన వంతుగా రెడీ చేసుకోవాల్సినదే డౌన్ పేమెంట్. రుణాలిచ్చే సంస్థలు సాధారణంగా ఇల్లు కొనుగోలు వ్యయంలో 20 శాతం డౌన్‌పేమెంట్ కింద అడుగుతాయి. ఉదాహరణకు రూ.50 లక్షల విలువైన ఇంటిని కొనుగోలు చేసే వారు కనీసం తమ వంతుగా రూ.10 లక్షలను డౌన్‌పేమెంట్‌గా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన రూ.40 లక్షలను బ్యాంకులు రుణంగా ఇస్తాయి. ఇంటి కొనుగోలు విలువ... డౌన్‌పేమెంట్ ఎంతన్నది నిర్ణయిస్తుంది. ఒకవేళ ఈ మొత్తం లేకపోతే ఇంటి రుణం సాధ్యం కానట్టే. అత్యవసరాలనూ దృష్టిలో ఉంచుకోవాల్సిందే జీవితంలో అత్యవసరాలు ఎప్పుడైనా ఎదురుకావచ్చు. వాటిని తప్పించుకోలేం. అటువంటి పరిస్థితులను అధిగమించేందుకు ముందే తగిన విధంగా సన్నద్ధం కావాలి. సొంతింటి కోసం అప్పటి వరకు పొదుపు చేసిన మొత్తాన్ని డౌన్ పేమెంట్ కోసం వినియోగిస్తే... వేతనంలో మిగిలేదంతా ఈఎంఐగా పోతుంటే... అత్యవసరం ఎదురైతే ఏంటి పరిస్థితి? ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోతే..? అందుకే అత్యవసర నిధిని పక్కన పెట్టి మిగిలిన మొత్తానే డౌన్‌పేమెంట్‌గా వాడుకోవడం వివేకం. కనీసం ఆరు నెలల కుటుంబ అవసరాలకు సరిపడా మొత్తాన్నే అత్యవసర నిధిగా ఉంచుకోవాలి. అలాగే, ఇంటి రుణం తీసుకునే వారు, అత్యవసర నిధికి అదనంగా మూడు నెలల ఈఎంఐ మొత్తాన్ని కూడా విడిగా రెడీగా ఉంచుకోవాలి. ముఖ్య లక్ష్యాల కోసం పెట్టుబడులు... డౌన్ పేమెంట్‌ను సమకూర్చుకుని, అత్యవసర నిధిని పక్కన పెట్టి, నెలవారీ ఈఎంఐ చెల్లించడంతోనే అన్ని బాధ్యతలు తీరినట్టు కాదు. జీవితంలో కీలకమైన లక్ష్యాలు వేరేవీ ఉన్నాయి. పిల్లల ఉన్నత విద్య ఇందులో ఎంతో ముఖ్యమైనది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. పిల్లల ఉన్నత విద్య వంటి కీలక లక్ష్యాలకు అవసరమైనంత సమకూర్చుకునేందుకు ప్రతి నెలా కొంత మేర ఇన్వెస్ట్ చేస్తుండాలి. దీనికి తోడు స్వల్పకాల లక్ష్యాలు ఏవైనా ఉన్నాయా అన్నది చూసుకోవాలి. వీటికి పెట్టుబడులు పోను వేతనంలో ఎంత మిగులుతుంది, ఎంత ఈఎంఐగా చెల్లించగలరన్నది నిర్ణయించుకోవాలి. చాలా మంది సొంతింటిని సమకూర్చుకునే విషయంలో కీలకమైన పెట్టుబడులు, అత్యవసరాలను విస్మరిస్తుంటారు. ఈఎంఐ మొత్తాన్ని నిర్ణయించుకోవడంలోనూ అన్ని అంశాలను చూడరు. అందుకే ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయానికి రావాలి. ఈఎంఐ ఎంత మేర...? డౌన్ పేమెంట్ అవసరమైనంత ఉన్న వారు చూడాల్సిన తదుపరి అంశం ఈఎంఐ. రుణం తీసుకుంటే నెలవారీగా ఈఎంఐ మొత్తాన్ని చెల్లించగల సామర్థ్యం ఉందా? అనేది చూడాలి. కట్టగలమన్న నమ్మకం వేరు, సామర్థ్యం వేరు. ఉదాహరణకు మీ నెలవారీ ఆదాయంలో ఈఎంఐ మొత్తం 30–40 శాతాన్ని మించరాదనేది పాటించాల్సిన సూత్రం. ఇక ఈఎంఐ ఎంతన్నది రుణం ఎంత తీసుకుంటున్నారనే అంశంతోపాటు, ఎంత కాలానికి తీసుకుంటున్నారనేదీ నిర్ణయిస్తుంది. ఉదాహరణకు నెలవారీ ఆదాయం రూ.75,000 ఉందనుకుంటే... 9.5 శాతం వడ్డీ రేటు ప్రకారం ఎంత కాలానికి, ఎంత రుణం తీసుకుంటే ఈఎంఐ ఎంత ఉంటుందంటే... ఆదాయంలో ఈఎంఐ 20% ► రూ.18 లక్షల ఇంటికి 20 శాతం డౌన్ పేమెంట్ పోను బ్యాంకులు రూ.14.4 లక్షల రుణం ఇస్తాయి. 15 ఏళ్ల కాలానికి తీసుకుంటే 9.5 శాతం వడ్డీ రేటు ప్రకారం ఈఎంఐ రూ15,000 అవుతుంది. అంటే రూ.75,000 నెలసరి ఆదాయంలో 20 శాతాన్ని ఈఎంఐగా చెల్లించాల్సి ఉంటుంది. ► రూ.20 లక్షల ఇంటికి బ్యాంకులు రూ.16 లక్షల రుణం ఇస్తాయి కనుక 20 ఏళ్ల కాలాన్ని నిర్ణయించుకుంటే అప్పుడు కూడా ఈఎంఐ రూ.15,000 అవుతుంది. రుణం పెరిగినప్పటికీ కాల వ్యవధి ఐదేళ్లు పెంచుకున్నారు గనుక ఈఎంఐ మొదటి ఉదాహరణలో మాదిరే ఉంటుంది. ► ఇక రూ.21.5 లక్షల ఇంటికి బ్యాంకులు రూ.17.2 లక్షల రుణాన్ని ఇస్తాయి. దీనిపైనా రూ.15,000 ఈఎంఐ ఉండాలనుకుంటే ఇంటి రుణ కాల వ్యవధిని 25 ఏళ్లుగా చేసుకుంటే సరిపోతుంది. ఆదాయంలో ఈఎంఐ 30% ► రూ.26.8 లక్షల ఇంటికి డౌన్ పేమెంట్ పోను రూ.21.5 లక్షలు రుణంగా లభిస్తుంది. 15 ఏళ్ల టర్మ్ పెట్టుకుంటే ఈఎంఐ రూ.22,500 అవుతుంది. ► రూ.30.3 లక్షల ఇంటికి 24.2 లక్షలు రుణంగా తీసుకుంటే టర్మ్‌ను 20 ఏళ్లుగా నిర్ణయించుకున్నా కూడా ఈఎంఐ రూ.22,500 అవుతుంది. ► రూ.32.3 లక్షల ఇంటికి రూ.25.8 లక్షలు రుణంగా లభిస్తుంది. 25 ఏళ్ల టర్మ్‌ను నిర్ణయించుకుంటే ఈఎంఐ 22,500 అవుతుంది. ఆదాయంలో ఈఎంఐ 40% ► రూ.36 లక్షల ఇంటిపై రూ.28.8 లక్షల రుణానికి గాను, 15 ఏళ్ల టర్మ్‌కు ఈఎంఐ రూ.30,000. ► రూ.40.3 లక్షల ఇంటికి రూ.28.8 లక్షల రుణం లభిస్తుంది. రుణం చెల్లించాల్సిన వ్యవధి 20 ఏళ్లు అయితే అప్పుడూ ఈఎంఐ రూ.30,000 దాటదు. ► ఇక రూ.43 లక్షల ఇంటికి 20 శాతం డౌన్ పేమెంట్ పోను వచ్చే రుణం రూ.34.4 లక్షలు. కాల వ్యవధి 25 ఏళ్లు అయితే ఈఎంఐ రూ.30,000 అవుతుంది. నెలసరి ఆదాయం ఎక్కువగా ఉంటే తప్ప, ఈఎంఐ 20 శాతానికి మించకుండా ఉంటే దాన్ని సురక్షితంగా భావించొచ్చు. ఒకవేళ డౌన్ పేమెంట్ 20 శాతానికి మించి సమకూర్చుకుంటే అప్పుడు కూడా ఈఎంఐ భారం తగ్గుతుంది. నెల వేతనంలో ఈఎంఐ 40 శాతం వరకు ఉంటే చెల్లింపులు కష్టం కావచ్చు. తప్పదనుకుంటే నెల ఆదాయంలో 30 శాతాన్ని ఈఎంఐగా నిర్ణయించుకోవచ్చు. కొందరు దంపతులు ఇద్దరూ కలసి ఇంటి రుణం తీసుకుంటుంటారు. ఇరువురు ఆర్జనాపరులైతే అధిక ఈఎంఐ చెల్లించగలరు. అయితే, రుణ కాల వ్యవధి ముగిసే వరకు ఇద్దరూ ఆర్జనను కొనసాగించాలి. లేదంటే మధ్యలో ఇల్లాలు కుటుంబ అవసరాల కోసం ఉద్యోగాన్ని విడిచిపెడితే, అప్పుడు భారీ ఈఎంఐ భారం ఆమె భాగస్వామి ఒక్కరిపైనే పడుతుంది. దీన్ని ముందే ఆలోచించుకోవాలి. -
ఉమ్మడి రుణం.. ఉభయకుశలోపరి
సొంతింటిని సమకూర్చుకోవాలన్న కల ఎందరికో వుంటుంది. అయితే సొంతంగా ఇంటి కొనుగోలుకు సరిపడా డబ్బులను సమకూర్చుకోవడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఇప్పటికే గణనీయంగా పొదుపు చేసి ఉన్నవారు, వేరే ఆస్తులను విక్రయించడం ద్వారా సమకూర్చుకునే వారికి ఇది సాధ్యమే అయినా, మిగిలిన వారి ముందున్న ఏకైక మార్గం గృహ రుణమే. అందుకే నేడు విక్రయం అవుతున్న కొత్త ప్రాజెక్టుల్లో మూడింట రెండొంతులు గృహ రుణాలపైనే ఉంటున్నాయి. ఇందులో ఇద్దరు కలసి తీసుకునే గృహ రుణాలు కూడా ఉన్నాయి. మరొకరితో కలసి గృహ రుణం తీసుకోవాల్సిన అవసరం ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో ఉండొచ్చు. కారణం ఏదైనా జాయింట్ హోమ్‌లోన్ విషయంలో ఉండే సానుకూల ప్రతికూలతలు ఏంటన్నవి తెలుసుకుంటే గృహ రుణ గ్రహీతలకు సాయంగా ఉంటుంది. వాటిని తెలియజేసే కథనమే ఇది. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం జాయింట్హోమ్ లోన్ అన్నది మరో వ్యక్తితో కలసి ఉమ్మడిగా తీసుకునే రుణం. సాధారణంగా జీవిత భాగస్వామి లేదా తోడబుట్టిన వ్యక్తితో కలసి జాయింట్ హోమ్‌లోన్ తీసుకోవచ్చు. విడిగా ఒక్కరే తీసుకునే రుణంతో పోలిస్తే, ఇతరులతో కలసి ఉమ్మడిగా తీసుకునే రుణానికి ఎన్నో కారణాలు ఉంటాయి. విడిగా తీసుకునేందుకు అనుకూలమైన క్రెడిట్ స్కోరు లేకపోవచ్చు. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) దరఖాస్తుదారుల రుణ చరిత్ర (క్రెడిట్ స్కోరు)ను చూసిన తర్వాతే రుణంపై తేలుస్తాయి. వారి క్రెడిట్ రిపోర్ట్‌ను పరిశీలించి ఒకవేళ రుణం మంజూరు చేస్తే తిరిగి చెల్లించే సామర్థ్యం వారికి ఉందా అని ఆరాతీస్తాయి. రుణ ఎగవేతల నివారణకు తీసుకునే చర్యల్లో భాగంగా ఈ విధానాన్ని ఎప్పటి నుంచో పాటిస్తున్నాయి. ఒకవేళ ఒకరి క్రెడిట్ రిపోర్ట్ మంచిగా ఉండి, గతంలో తీసుకున్న రుణాలకు చెల్లింపులు సకాలంలో చేసి ఉంటే, సహజంగానే క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉంటుంది. ఇటువంటి వారికి గృహ రుణం సులభంగానే లభిస్తుంది. అయితే, క్రెడిట్ స్కోరు తగినంత లేని వారి పరిస్థితి ఏంటి? వీరు ఆశ కోల్పోనవసరం లేదు. క్రెడిట్ స్కోరు మంచిగా ఉన్న మరో వ్యక్తితో కలసి ఉమ్మడిగా రుణం కోసం దరఖాస్తు చేసుకోవడమే పరిష్కారం. మీరు ఎంచుకునే ఆ భాగస్వామి క్రెడిట్ స్కోరు మంచిగా ఉంటే, అప్పుడు సులభంగానే రుణం లభిస్తుంది. ఇక తీసుకున్న రుణాన్ని తాము ఒక్కరమే తిరిగి చెల్లించడం కష్టమని భావించే వారు కూడా ఉమ్మడిగా రుణం తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. అలాగే, భార్యాభర్తలు ఇరువురూ వేతన జీవులు అయి ఉంటే, పన్ను ప్రయోజనం ఇరువురికీ అవసరం కనుక జాయింట్ హోమ్‌లోన్‌కు మొగ్గు చూపుతారు. సానుకూలతలు ఉమ్మడిగా గృహ రుణం తీసుకుంటే సాధారణ హోమ్‌లోన్‌తో పోలిస్తే ఆకర్షణీయమైన వడ్డీ రేటుకు లభించే అవకాశాలు ఎక్కువ. ఖరీదైన ప్రాపర్టీ అయితే పెద్ద మొత్తంలోనే గృహ రుణాన్ని పొందొచ్చు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం జాయింట్ హోమ్‌లోన్‌లో ఇద్దరూ పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. రుణంపై చేసే వడ్డీ చెల్లింపులకు గాను ఒక్కొక్కరు విడిగా రూ.2లక్షలను మినహాయింపు చూపించుకోవచ్చు. అలాగే, రుణం అసలుకు చేసే చెల్లింపులు రూ.1.5 లక్షలపై అదనంగా తమ ఆదాయం నుంచి పన్ను మినహాయింపు పొందేందుకు అవకాశం ఉంది. బలహీన క్రెడిట్ స్కోరు ఉన్న వారికి కూడా జాయింట్ హోమ్‌లోన్‌లో సులభంగా రుణం లభిస్తుంది. ప్రతికూలతలు జాయింట్ లోన్ తీసుకునే వారు గుర్తించుకోవాల్సిన ప్రతికూల అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉమ్మడిగా గృహ రుణం తీసుకున్న తర్వాత వారిలో ఒకరు తమవాటా చెల్లించలేని పరిస్థితి ఏర్పడితే ఇద్దరి క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. ఇక భార్యా భర్తలు ఉమ్మడిగా గృహ రుణం తీసుకుని, అది చెల్లించే కాలంలో విభేదాల కారణంగా వారు విడిపోతే న్యాయపరమైన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రాపర్టీ అనేది ఒకరి పేరిట నమోదై ఉండి, ఇద్దరూ కలసి రుణం తీసుకుని పూర్తిగా చెల్లించారనుకోండి. అయినప్పటికీ ప్రాపర్టీ ఉన్న వారికే దానిపై చట్టబద్ధమైన హక్కులు ఉంటాయి. అపోహలకు చెక్ ► జాయింట్ హోమ్‌లోన్ విషయంలో ఎన్నో సందేహా లు ఉన్నాయి. రుణం తీసుకునే వారు ముందుగా వీటిపై స్పష్టత తెచ్చుకోవాలి. ప్రాథమిక రుణ దరఖాస్తుదారునితో సమానంగా సహ దరఖాస్తుదారునిపైనా గృహ రుణం చెల్లించాల్సిన బాధ్యత సమంగానే ఉంటుంది. అందుకే రుణ డాక్యుమెంట్‌పై సంతకం చేయడానికి ముందే నిబం ధనలపై పూర్తిగా స్పష్టత తెచ్చుకోవాలి. బ్యాంకుతో చేసుకునే ఒప్పందం గురించి సందేహాలు తీర్చుకోవాలి. ► ఉమ్మడిగా తీసుకునే రుణంలో ఒక్కరికే పన్ను ప్రయోజనాలు లభిస్తాయా? అంటే... ఇద్దరు గ్రహీతలకూ ప్రయోజనాలు సమానంగా వర్తిస్తాయి. కానీ, ఉమ్మడిగా తీసుకునే రుణాలపై పన్ను స్పష్టత కోసం ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 24ను చూడాల్సి ఉంటుంది. ఆదాయపన్ను శాఖ మార్గదర్శకాల ప్రకారం... సహ రుణ గ్రహీత పన్ను ప్రయోజనాలు క్లెయి మ్ చేసుకోవాలనుకుంటే సంబంధిత ఆస్తికి అతను లేదా ఆమె సైతం సహ యజమాని అయి ఉండాలి. ► ఒక్కరు విడిగా దరఖాస్తు చేయడంతో పోలిస్తే మరొకరితో కలసి జాయింట్‌గా దరఖాస్తు చేసుకుంటే రుణాన్ని సులభంగా పొందడం అన్నది నిజమే. అయితే, కచ్చితంగా రుణం వస్తుందన్న గ్యారంటీ ఏమీ ఉండదు. ఎందుకంటే గృహ రుణాలను బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు అధిక రిస్క్‌తో కూడినవిగానే పరిగణిస్తాయి. కనుక సహ దరఖాస్తుదారునితో కలసి రుణం తీసుకునే ప్రయత్నం చేసే వారు... వారి క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉండి, ఈఎంఐ చెల్లించేంత ఆదాయం కలిగి ఉంటేనే రుణాన్ని పొందగలరు. ఉమ్మడి గృహ రుణం విషయంలో ఈ అంశాలతోపాటు వడ్డీ రేటు సహా చూడాల్సినవి మరి కొన్ని కూడా ఉన్నాయి. ఒక్కసారి రుణం తీసుకుంటే వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు కనుక ముందే సమగ్రంగా విచారించుకుని నిర్ణయం తీసుకోవాలి. గృహ రుణానికి అర్హతలు ఇంటి రుణం దరఖాస్తును ఆమోదించడానికి ముందు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఏఏ అంశాలను చూస్తాయి? రుణం ఇస్తే ఎగవేతకు అవకాశం లేదని ఎలా తేలుస్తాయి? ఇవి తెలిస్తే దరఖాస్తుదారులు తమకు రుణం వస్తుందో లేదో తెలుసుకోవడం సులభం. ఇంటి రుణం విషయానికి వస్తే ప్రతీ దరఖాస్తుదారుని అర్హతలు వేర్వేరుగా ఉంటాయి. వీటిని ఎన్నో అంశాలు నిర్ణయిస్తాయి. వయసు దరఖాస్తుదారుని వయసు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇంటి రుణంలో గరిష్ట టర్మ్ 30 ఏళ్ల వరకే ఉంటుంది. చిన్న వయసులో ఉన్న వారు అయితే దీర్ఘకాలానికి ఇంటి రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అదే మధ్య వయసుకు వచ్చిన వారికి దీర్ఘకాలిక రుణానికి అవకాశం ఉండదు. ఎందుకంటే 25 ఏళ్ల వయసుతో పోలిస్తే, 40–45 ఏళ్ల వయసున్న వ్యక్తి పదవీ కాలం తక్కువగా ఉంటుంది కనుక. ఈ నేపథ్యంలో యుక్తవయసులో ఉన్న వారికి ఎక్కువ మొత్తంలో రుణం, దీర్ఘకాలానికి లభించే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు, ప్రాపర్టీ వయసు, సైజును కూడా బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి తీసుకున్న రుణాన్ని క్రమం తప్పకుండా వాయిదాల రూపంలో తిరిగి చెల్లించాలంటే గ్రహీత ఆదాయం దాన్ని నిర్దేశిస్తుంది. అందుకే ఎంత ఆదాయం వస్తోంది, స్థిరత్వం ఏ మేరకు తదితర అంశాలు రుణం మొత్తాన్ని నిర్ణయిస్తాయి. క్రెడిట్ హిస్టరీ దరఖాస్తుదారుని రుణ చరిత్ర కూడా కీలకం అవుతుంది. గతంలో తీసుకున్న రుణాలు, వాటికి చెల్లింపులు ఏ విధంగా చేశారన్నది క్రెడిట్ రిపోర్ట్‌లో తెలుస్తుంది. మంచి స్కోరు ఉందంటే రుణ ఎగవేత అవకాశాలు తక్కువగా ఉంటాయి. కనుక క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉన్న వారికి బ్యాంకులు సులభంగా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. ఇతర బాధ్యతలు అలాగే, దరఖాస్తుదారునిపై ఇప్పటికే ఉన్న ఆర్థిక, రుణ బాధ్యతలు కూడా పరిశీలనకు వస్తాయి. కారు రుణం, క్రెడిట్ కార్డు వంటివి తీసుకుంటే వాటిని కూడా ఇంటి రుణం దరఖాస్తు పరిశీలనలో భాగంగా బ్యాంకులు చూసి, చెల్లింపుల సామర్థ్యంపై అంచనాకు వస్తాయి. వ్యక్తిగత ప్రొఫైల్ వీటితోపాటు దరఖాస్తుదారుని వ్యక్తిగత ప్రొఫైల్ కూడా కీలకం అవుతుంది. విద్యార్హతలు, బ్యాక్‌గ్రౌండ్‌ను రుణదాతలు చెక్ చేసుకుంటారు. మంచి విద్యార్హతలు కలిగిన వారికి ఉపాధి అవకాశాలు విరివిగా ఉంటాయి. వీరికి రుణం ఇచ్చినా తిరిగి చెల్లించగల సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అందుకే బ్యాంకులు వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. హామీదారుగా ఉంటే ఇప్పటికే ఏదైనా రుణానికి హామీదారుగా ఉన్నారనుకుంటే... ఆ మేరకు దరఖాస్తుదారుని అర్హత నుంచి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు మినహాయించి చూస్తాయి. ఎందుకంటే రుణం తీసుకున్న వ్యక్తి చెల్లించలేని పరిస్థితుల్లో ఆ బాధ్యత హామీగా ఉన్న వారిపైనే పడుతుంది. కనుక ఇది కూడా రుణ దరఖాస్తుదారుని అర్హతలను ప్రభావితం చేసే అంశంగా గుర్తు పెట్టుకోవాలి. అర్హత ఉంటే... అర్హత ఉందని నిర్ధారణకు వస్తే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తర్వాతి అంశాలపై దృష్టి పెడతాయి. వీటిల్లో ఆదాయంతో రుణ వాయిదా రేషియో ఒకటి. రుణ వాయిదా చెల్లింపుల కోసం వచ్చే ఆదాయంలో పక్కన పెట్టాల్సిన మొత్తం. ఆదాయంలో సగాన్ని సాధారణ ఖర్చుల కింద మినహాయించి మిగిలిన మొత్తంలో బాధ్యతలను చూస్తాయి. అంటే అప్పటికే ఏవైనా రుణాలు తీసుకుని వాటికి వాయిదాలు చెల్లిస్తున్నట్టయితే ఆదాయంలో కచ్చితమైన బాధ్యతల కింద ఆ మొత్తాన్ని మినహాయిస్తాయి. లోన్ కాస్ట్ రేషియో కూడా ఒకటి. ప్రాపర్టీకి ఇచ్చే రుణంలో దరఖాస్తుదారుని వాటాను చూస్తాయి. అర్హతను పెంచుకునే మార్గాలు ► జీవిత భాగస్వామి లేదా కుటుంబంలో సన్నిహిత వ్యక్తిని సహ దరఖాస్తుదారునిగా చేర్చుకుంటే రుణం లభించడం సులువు అవుతుంది. ► క్రమం తప్పకుండా ఆదాయం, పొదుపు, పెట్టుబడుల చరిత్ర ఉంటే రుణం లభించడం తేలిక. ► అదనపు ఆదాయ వనరుల గురించి కూడా దరఖాస్తుతోపాటు తెలియజేయడం అవసరం. అద్దె ఆదా యం, వ్యాపారం, వృత్తి పరంగా ఇతర ఆదాయ వనరుల గురించి తప్పక తెలియజేయడం లాభిస్తుంది. ► ఇక ఇంటి రుణం అవసరం అనుకునే వారు ముందు నుంచే తమ క్రెడిట్ స్కోరును పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. రుణాలు ఏవైనా తీసుకుని ఉంటే ముందుగా చెల్లించేయడం, బకాయిలు ఉంటే వెంటనే తీర్చేయడం చేయాలి. చాలా వరకు రుణమిచ్చే సంస్థలు క్రెడిట్స్కోరును తెలుసుకునే అవకాశాన్ని ఆన్లైన్లో ఉచితంగానే కల్పిస్తున్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. -
చిన్న సినిమాలకు పెద్ద వరం
‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమ కోసం తీసుకున్న నిర్ణయం చిన్న సినిమాలకు పెద్ద వరం. 116 జీవో చిన్న సినిమాలతో పాటు నిర్మాతలందరికీ చాలా ప్రయోజనకరంగా ఉంది’’ అని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(టీఎఫ్‌సీసీ) అధ్యక్షుడు వి.వీరినాయుడు అన్నారు. హైదరాబాద్‌లోని టీఎఫ్‌సీసీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీరినాయుడు మాట్లాడుతూ– ‘‘4 కోట్ల రూపాయలలోపు బడ్జెట్‌తో నిర్మించే చిత్రాలకు ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వడం.. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా నిర్మించే ప్రదేశాలకు ఉచితంగా అనుమతి ఇవ్వడంతో పాటు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) ద్వారా షూటింగ్‌లకు సింగిల్ విండో ద్వారా అనుమతి ఇవ్వడం సంతోషించదగ్గ విషయం. ప్రతి ఏడాది ఎఫ్డీసీ పర్యవేక్షణలో 15 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి రూ.10 లక్షలు సబ్సిడీ ఇవ్వడం చాలా మంచి నిర్ణయం. ప్రభుత్వం ఈ నిర్ణయాలను ఆమోదించడానికి కారకులైన ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ అంబికాకృష్ణగారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఏపీ ప్రభుత్వం జీఎస్టీలో రాష్ట్ర వాటా 9 శాతం చిన్న సినిమాలకు మినహాయింపు ఇవ్వాలనే నిర్ణయం కీలకమైంది. తెలంగాణ ప్రభుత్వం కూడా చిత్ర పరిశ్రమపట్ల మంచి నిర్ణయాలు తీసుకుంటోంది’’ అన్నారు టీఎఫ్‌సీసీ సెక్రటరీ ముత్యాల రాందాసు. ఈ సందర్భంగా కేరళ వరద బాధితులకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున రూ.10లక్షలు విరాళం ప్రకటించారు. ఈ సమావేశంలో టీఎఫ్‌సీసీ సెక్టార్ చైర్మన్ వల్లూరిపల్లి రమేశ్, కోశాధికారి తుమ్మలపల్లి సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ మోహన్ వడ్లపట్ల, ఈసీ మెంబర్ ప్రసన్న కుమార్, స్టూడియో సెక్టార్ తరఫున బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘సినిమా షూటింగ్‌లకు లోకేషన్లు ఉచితం’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా నిర్మాణాలను ప్రోత్సహించేందుకు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్ అంబికా కృష్ణ పలు రాయితీలను ప్రకటించారు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లో చిత్రీకరించే సినిమాలకు ప్రోత్సాహకాలతో పాటు నగదు, పన్ను రాయితీలు కల్పిస్తున్నట్టుగా వెల్లడించారు. 4 కోట్ల రూపాయలలోపు రూపొందే సినిమాలను ప్రభుత్వం చిన్న సినిమాలుగా గుర్తించి, ఆ సినిమాలకు పన్ను మొత్తం వెనక్కి ఇవ్వనుందని.. 18 శాతం జీఎస్టీలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 9 శాతం రద్దు చేసి తిరిగి చెల్లిస్తుందని తెలిపారు. చిన్న సినిమాలకు పన్ను రాయితీలతో పాటు షూటింగ్‌లకు లోకేషన్లు ఉచితంగా ఇవ్వటం, ఎఫ్డీసీ ద్వారా సింగల్ విండోలో అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు. షూటింగ్‌ల కోసం సెక్యురిటి డిపాజిట్ మాత్రం చెల్లిస్తే సరిపోతుందని ఆ డబ్బును కూడా షూటింగ్ పూర్తయిన తరువాత వెనక్కి తిరిగిచ్చేస్తామన్నారు. అయితే ఈ చిత్రాలకు సంబంధించిన డబ్బింగ్, రీరికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తిగా ఏపీలోనే చేయాలన్నారు. రాయితీలతో పాటు చిన్న సినిమాల్లో ఉత్తమ కథాంశాలు, విలువలు ఉన్న 15 చిత్రాలకు 10 లక్షల నజరానా ప్రభుత్వం నుంచి అందిచనున్నట్టుగా తెలిపారు. పరభాషా చిత్రాలు తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ అవుతుండటంతో ధియేటర్ల సమస్య తలెత్తుందని, పైరసీ వల్ల సినీరంగం తీవ్రంగా నష్టపోతుందని అలాంటి వాటిపై కూడా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటుగా తెలిపారు. -
ఛారిటీ ఆస్పత్రుల నిర్వాకమిదే...
సాక్షి, న్యూఢిల్లీ : ఖరీదైన వైద్యం పేద రోగులకు అందుబాటులోకి తెచ్చే ఛారిటీ ఆస్పత్రులు దారితప్పుతున్నాయి. సేవ పేరుతో వేల కోట్ల ఆదాయ పన్ను మినహాయింపులు పొందుతున్న కొన్నిఛారిటీ సంస్థలు అసలు దాతృత్వానే చాటుకోవడం లేదని, వాటి ధ్యాసంతా దండుకోవడంపైనే ఉందని కాగ్ నివేదిక వెల్లడించింది. ఈ ఆస్పత్రులు, ట్రస్టుల నిర్వాకంతో కోట్లాదిరూపాయల ప్రజాదనం వృథా కావడం మినహా ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని కాగ్ ఆక్షేపించింది. ఆస్పత్రులు, ట్రస్టులకు పన్నుమినహాయింపు ఇచ్చే క్రమంలో అనుసరిస్తున్న ప్రమాణాలపైనా కాగ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఛారిటీ ఆస్పత్రులు, ట్రస్ట్‌ల కింద ఆదాయ పన్ను మినహాయింపు పొందుతున్నపలు సంస్థలు రోగుల నుంచి పెద్దమొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ మరోవైపు సర్కార్ నుంచి పన్ను రాయితీలు పొందుతున్నాయి. పలు ఛారిటబుల్ సంస్థలు వసూలు చేసిన మొత్తాలు ఐటీ అధికారుల పరిశీలనకు రాలేదని కాగ్ నిగ్గుతేల్చింది. ఆదాయ పన్ను మినహాయింపునకు అనుసరించాల్సిన ప్రమాణాలు లేని సంస్థలనూ అనుమతిస్తున్నారని ఎత్తిచూపింది. దాదాపు 10 ఛారిటబుల్ ఆస్పత్రులకు ఆదాయ పన్ను మినహాయింపు పొందే అర్హత లేదని కాగ్ ఆడిట్లో వెల్లడైంది. -
‘సచిన్’కు పన్ను మినహాయింపు
ముంబై: భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌పై జీవిత చరిత్రగా రానున్న ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ అనే సినిమాకు కేరళ, చత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు వినోదపు పన్నును మినహాయించాయి. ఈనెల 26న దేశవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ‘ఓ వ్యక్తి అకుంఠిత దీక్ష, పట్టుదలకు అద్దం పట్టే చిత్రమిది. నేటి యువతకు ఎంతో ప్రేరణగా నిలుస్తుంది. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా జీవితంలో అనుకున్నది సాధించాలనే సందేశాన్ని ఈ చిత్రం ఇస్తుంది. రెండు రాష్ట్రాల్లో పన్ను మినహాయింపును ఇచ్చినందుకు కృతజ్ఞతలు’ అని చిత్ర నిర్మాత రవి భగ్చందా తెలిపారు. చిన్నప్పటి నుంచి ప్రపంచస్థాయి క్రికెటర్‌గా సచిన్ ఎదిగిన ప్రస్థానాన్ని అభిమానులు ఈ చిత్రంలో చూడవచ్చు.