Thalaivi Movie
-
పాకిస్తాన్లో ‘తలైవి’ ట్రెండింగ్.. జోక్ చేసిన కంగనా
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వరుస చిత్రాలు చేస్తు కెరీర్లో దూసుకుపోతోంది. ఆమె నటించిన తాజా చిత్రం ‘తలైవి’ థియేటర్స్‌లో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. దివంగత సినీ నటి, రాజకీయ నాయకురాలు జయలలిత బయోపిక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ మూవీ అక్కడ కూడా మంచి సక్సెస్‌ని అందుకుంది. అయితే ఎన్నో కంట్రీస్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఈ సినిమా పాకిస్తాన్‌లోనూ నెం.1గా దూసుకుపోతోంది. కంగనా ఈ విషయమై సోషల్ మీడియాలో స్పందించింది. ‘దేశద్రోహులు పాకిస్తాన్లో మాత్రమే లేరని, అన్ని దేశాల్లో ఉన్నారని అక్కడి ప్రజలు తెలుసుకొని ఉపశమనం పొందుతున్నారని’ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో జోక్ వేసింది ఫైర్ బ్రాండ్. అంతేకాకుండా ‘తలైవి’ మూవీ బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్లతో నెం.1గా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆరు దేశాల్లో టాప్ 3, ఐదు దేశాల్లో టాప్ 5, తొమ్మిది దేశాల్లో టాప్ 10గా ట్రెండింగ్‌లో ఉన్నట్లు ఈ బ్యూటీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తెలిపింది. చదవండి: రామ్ దర్బార్ నాణెం ఇచ్చిన సీఎం యోగి.. థ్యాంక్స్ చెప్పిన కంగనా -
ఓటీటీలో తలైవి..స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది..
సినీ నటి, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తలైవి’.బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ నటించిన ఈ చిత్రం ఇటీవలె థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. లిబ్రి మోహన్ పిక్చర్స్ కర్మ మీడి యా అండ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ సినిమాను విజయ్ దర్శకత్వం వహించారు. ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి నటిస్తున్నారు. కరుణానిధి పాత్రలో ప్రకాశ్ రాజ్ నటించారు. శశికళగా పూర్ణ నటించారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తాజాగా ఓటీటీ ఫ్లామ్ఫామ్స్లోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా నేటి(సెప్టెంబర్25) నుంచి స్ట్రీమింగ్ మొదలైంది. 'THALAIVII' ON NETFLIX TOMORROW... #Thalaivii [#Hindi version] - starring #KanganaRanaut and #ArvindSwami - streams on #Netflix tomorrow onwards. pic.twitter.com/8UIUoy9ll6 — taran adarsh (@taran_adarsh) September 24, 2021 -
తలైవి: ‘మొదట్లో కేసు పెట్టారు.. ఇప్పుడు ప్రశంసిస్తున్నారు’
‘‘తలైవి’ని ఆరంభింనప్పుడు జయలలితగారి కుటుంబసభ్యులు కేసు వేశారు. కానీ సినిమా చూసి ‘జయలలితకు ఇంతకన్నా గొప్ప నివాళి ఎవరూ ఇవ్వలేరు’ అని ఆనంద పడ్డారు’’ అన్నారు నిర్మాత విష్ణు ఇందూరి. ప్రముఖ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రపొందిన చిత్రం ‘తలైవి’. కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేయగా, ప్రముఖ నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్. పాత్రను అరవింద్ స్వామి చేశారు. విష్ణు ఇందరి నిర్మింన ఈ చిత్రం ఈ నెల 10న విడుదలైంది. చదవండి: Kangana Ranaut: ‘తలైవి’ మూవీ రివ్యూ ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. ‘‘జయలలిత పాత్రలో కంగనా అనగానే 99 శాతం మంది బ్యాడ్ చాయిస్ అన్నారు. కానీ సినిమా చూశాక వారే ఇప్పుడు గుడ్ అంటున్నారు. ఎం.జీ.ఆర్ పాత్రకు అరవింద్ స్వామి బాగా సరిపోయారు. దర్శకుడు ఏఎల్ విజయ్ బాగా తీశారు. నెక్ట్స్ సోషల్ మీడియా మీద ‘ట్రెండింగ్’ అనే సినిమా ప్లాన్ చేశాం. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ పైలట్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్లో చిక్కుకున్నప్పుడు భారత ప్రధాని కార్యాలయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే అంశాల ఆధారంగా ఓ సినిమా అనుకుంటున్నాం. ‘ఆజాద్ హింద్’ ప్రాంఛైజీ ద్వారా స్వాతంత్య్ర సమరయోధుల కథలను చూపించాలనుకుంటున్నాం. ముందుగా వీరనారి దుర్గాభాయ్ బయోపిక్ చేయాలనున్నాం. ఇక రణ్వీర్ సింగ్ ‘83’ చిత్రాన్ని థియేటర్స్‌లోనే విడుదల చేస్తాం’’ అన్నారు. చదవండి: ‘ఆ సన్నివేశాలు ఎంజీఆర్, జయలలితలను కించపరిచేలా ఉన్నాయి’ -
‘ఆ సన్నివేశాలు ఎంజీఆర్, జయలలితలను కించపరిచేలా ఉన్నాయి’
‘తలైవి’ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో వాస్తవిక తప్పిదాలు ఉన్నాయని అన్నాడీఎంకే (ఏఐఏడీఎంకే) నేత, మాజీ మంత్రి డి జయకుమార్ పేర్కొన్నారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారం ‘తలైవి’ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా శుక్రవారం(సెప్టెంబర్ 10) తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ నేపథ్యంలో చెన్నైలో తలైవి మూవీ చూసిన అన్నాడీఎంకే నేత డి జయకుమార్ అనంతరం మీడియాతో మాట్లాడారు. చదవండి: మరో విషాదం: ప్రముఖ టీవీ నటుడు ఆత్మహత్య ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తలైవి చిత్రాన్ని ఏఎల్ విజయ్ చాలా చక్కగా తెరకెక్కించారన్నారు. అయితే ఇందులో ఎంజీఆర్, జయలలిత మధ్య జరిగిన కొన్ని సన్నేవేశాల పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని సన్నివేశాలను తప్పుగా చూపించారని.. ఎంజీఆర్, జయలలితకు అంతగా ప్రాముఖ్యత ఇవ్వనట్లుగా ఉన్నాయన్నారు. అవి వారిద్దరినీ కించపరిచేలా ఉన్నాయని వెంటనే ఆ సీన్లను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకులు, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ అలియాస్ ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి, కరుణానిధిగా నాజర్, లీడ్‌రోల్ కంగనా నటించారు. ఈ మేరకు వారిమధ్య జరిగిన కొన్ని సీన్లపై మాజీ మంత్రి జయకుమార్ స్పందించారు. ఎంజీఆర్ తొలి డీఎంకే ప్రభుత్వంలో ఎన్నడూ పదవులు ఆశించలేదన్నారు. చదవండి: చికిత్సకు స్పందిస్తున్న సాయిధరమ్‌తేజ్, బయటకొచ్చిన వీడియో కానీ ఈ చిత్రంలో ఆయన మంత్రి పదవి కోరగా దీనిని అప్పటి డీఎంకే సీఎం అన్నాదురై, ఎం కరుణా నిధిలు అడ్డుకున్నట్లు చూపించారు. ఇది నిజం కాదని, ఎందుకంటే నాటి డీఎంకే సీఎం అన్నాదురై ఎంజీఆర్‌ను మంత్రిని చేయాలనుకున్నారన్నారు. కానీ ఎంజీఆర్ స్వయంగా మంత్రి పదవిని తిరస్కరించారని, దీంతో అన్నాదురై కొత్తగా ఓ శాఖను కేటాయించి దానికి ఆయనను డిప్యూటీ చీఫ్‌గా నియమించారని చెప్పారు. ఇక 1969లో అన్నాదురై మరణించిన అనంతరం సీఎంగా కరుణా నిధి పేరును సూచించింది ఎంజీఆర్యే అని జయకుమార్ వెల్లడించారు. ఆ తరువాత ఎంజీఆర్, కరుణానిధి మధ్య విభేదాలు తలెత్తడంతో 1972లో డీఎంకే నుంచి బయటకు వచ్చిన ఎంజీఆర్ సొంతంగా అన్నాడీఏంకే పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. చదవండి: Kangana Ranaut: ‘తలైవి’ మూవీ రివ్యూ -
Kangana Ranaut: ‘తలైవి’ మూవీ రివ్యూ
టైటిల్ : తలైవి జానర్: బయోపిక్ నటీనటులు : కంగన రనౌత్, అరవింద్ స్వామి, నాజర్, భాగ్యశ్రీ, సముద్రఖని, మధుబాలా తదితరులు నిర్మాణ సంస్థలు: విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు : విష్ణు వర్ధన్ ఇందూరి కథ: విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం : ఏఎల్ విజయ్ సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్ విడుదల తేది : సెప్టెంబర్ 10,2021 లేడి ఓరియెంటెండ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. వరుసగా నాయికా ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తూ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ తాజాగా నటించిన మరో లేడి ఓరియెంటెండ్ మూవీ ‘తలైవి’. నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్. విజయ్ రూపొందించిన చిత్రమిది. టైటిల్ పాత్రని కంగనా పోషించగా.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) పాత్రలో అరవింద్ స్వామి నటించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ‘తలైవి’ప్రేక్షకుల మనసును ఏ మేరకు దోచుకుందో రివ్యూలో చూద్దాం. ‘తలైవి’కథేంటంటే: దర్శకుడు ముందుగా చెప్పినట్టే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సినీ జీవితం ప్రారంభం నుంచి ఆమె సీఎంగా బాధ్యతలు చేపట్టే వరకు సాగే కథే ‘తలైవి’. ఓ పెద్దింటి కుటుంబంలో పుట్టినా జయలలిత(కంగనా రనౌత్) కొన్ని పరిస్థితుల కారణంగా పేదరికంలోకి వస్తుంది. అయితే వాళ్లమ్మ మాత్రం ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేస్తుంది. 16 ఏళ్ల వయసులోనే జయను హీరోయిన్ను చేస్తుంది. అతి చిన్న వయసులోనే ఎంజీ రామచంద్రన్ అలియాస్ ఎంజీఆర్ (అరవింద్ స్వామి) లాంటి స్టార్‌తో నటించే అవకాశం చేజిక్కించుకుంటుంది. ఆ తర్వాత కోలీవుడ్‌లో వాళ్లది సూపర్ హిట్ జోడీ అయిపోతుంది. ఈ క్రమంలో ఎంజీఆర్‌తో జయలలితకు ఎలాంటి అనుబంధం ఏర్పడుతుంది? సినీ నటిగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న జయ.. రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? తను ఎంతో అభిమానించే ఎంజీఆర్ మరణం తర్వాత తమిళనాడు ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి? జయలలిత ముఖ్యమంత్రి పీఠం చేపట్టే క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? తెలియాలంటే ‘తలైవి’ చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. జయలలిత పాత్రలో కంగన ఒదిగిపోయారు. తెరపై జయలలిత కనిపిస్తుందే తప్ప.. కంగాన రనౌత్ ఏ మూలాన కనిపించదు. ఆమెను జాతియ ఉత్తమ నటి అని ఎందుకు అంటారో ఈ సినిమా చూస్తే అర్థమవుతంది. ఎంజీఆర్‌తో దూరమయ్యే సన్నివేశాల్లో చక్కటి భావోద్వేగాన్ని పలికించింది. ఇక కంగన తర్వాత ఈ చిత్రంలో బాగా పండిన పాత్ర అరవింద్ స్వామిది. ఎంజీఆర్ పాత్రలో ఆయన జీవించేశాడు. స్టార్ హీరోగా, రాజకీయ నాయకుడిగాను ప్రత్యేక హావభావాలను పలికించాడు. ఎంజీఆర్ అనుచరుడు వీరప్పన్ పాత్రకు సముద్రఖని ప్రాణం పోశాడు. కరుణ పాత్రలో నాజర్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. జయ తల్లి పాత్రలో అలనాటి నటి భాగ్య శ్రీ, ఎంజీఆర్ భార్య పాత్రలో మధుబాల, శశికల పాత్రలో పూర్ణతో మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? ‘అమ్మ’గా తమిళ ప్రజల గుండెల్లో పదిలమైన చోటు దక్కించుకున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం తలైవి. జయ జీవితంలో అతి కీలకమైన 1965 నుంచి మొదటి సారి ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 1991 మధ్య జరిగే కథను మాత్రమే తెరపై చూపించాడు దర్శకుడు ఏఎల్ విజయ్. ఓ సినిమాకి కథ ఎంపికతోపాటు క్యారెక్టర్ సెలక్షన్ కూడా చాలా ముఖ్యం. ఇదే సినిమా సక్సెస్‌ను నిర్ణయిస్తుంది. ఎప్పుడైతే జయలలిత పాత్రకు జాతీయ ఉత్తమ నటి కంగనాను ఎంపిక చేశారో.. అప్పుడే ఈ సినిమా సగం సక్సెస్ సాధించింది. ఫస్టాఫ్‌లో జయ లలిత సినీ జీవితాన్ని చూపించిన దర్శకుడు.. సెకండాఫ్ మొత్తం ఆమె రాజకీయ జీవితాన్ని చూపించాడు. ఎంజీఆర్ పాత్రను హైలైట్ చేస్తూనే.. అదే సమయంలో జయలలిత పాత్ర ప్రాధాన్యత తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. జయ-ఎంజీఆర్ మధ్య ఉన్న బంధాన్ని కూడా తెరపై చాలా చక్కగా చూపించారు. రాజకీయాలే వద్దనుకున్న జయ.. పాలిటిక్స్‌లోకి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలిపే సీన్స్‌ని చాలా చక్కగా డిజైన్ చేసుకున్నాడు. అలాగే జయలలితను తమిళ ప్రజలు ‘అమ్మ’అని ఎందుకు ముద్దుగా పిలుసుకుంటారో తెలియజేసే సీన్ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఒక రాజకీయాల్లో వచ్చి తర్వాత జయ జీవితం ఎలాంటి మలుపు తిరిగిందే విషయాన్ని కూడా ఉన్నది ఉన్నట్లు చూపించారు. సొంత పార్టీ నేతలే జయపై కుట్ర చేయడం, ఆమెను రాజ్య సభకి పంపడం లాంటి సీన్స్ కూడా హత్తుకునేలా తీర్చి దిద్దారు. ఎంజీఆర్ మరణం తర్వాత చోటు చేసుకునే పరిణామాలను ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. ‘నమ్మి వస్తే అమ్మ.. లేదంటే ఆదిశక్తి’ అంటూ జయలో ఉన్న రెండో కోణాన్ని కూడా తెరపై చూపించారు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం జీవి ప్రకాశ్ కుమార్ సంగీతం. పాటలు అంతగా ఆకట్టుకోలేవు కానీ, నేపథ్య సంగీతం అదిరిపోయింది. విశాల్ విట్టల్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ పర్లేదు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్‌కి కత్తెర పడాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
స్క్రీన్ వెనకాల పడ్డ కష్టం ప్రేక్షకులకు కనపడదు
‘‘ఒక మంచి పాత్రలో నటించడానికి ప్రిపేర్ అవ్వడం ఒక ఎత్తు అయితే, కెమెరా ముందు సరిగ్గా చేయడం మరో ఎత్తు. ఎంత కష్టపడ్డాం అనేది ముఖ్యం కాదు. స్క్రీన్‌పై మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నదే ముఖ్యం. ఎందుకంటే స్క్రీన్‌పై మంచి నటన కనబర్చడానికి స్క్రీన్ వెనకాల ఎంత కష్టపడ్డామో ప్రేక్షకులకు కనపడదు’’ అన్నారు అరవింద్ స్వామి. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘తలైవి’. జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటించగా, దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ పాత్రను అరవింద్ స్వామి చేశారు. విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్. సింగ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానున్న సందర్భంగా అరవింద్ స్వామి చెప్పిన విశేషాలు. ►ఎంజీఆర్ (ఎం.జి. రామచంద్రన్), శివాజీ గణేశన్ గార్ల సినిమాలు చూస్తూ పెరిగాను. కేవలం సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ ఎంజీఆర్‌గారు తనదైన ముద్ర వేశారు. దర్శకుడు ఏఎల్ విజయ్‌గారు ‘తలైవి’లో ఎంజీఆర్ పాత్రను నాకు ఆఫర్ చేసినప్పుడు పెద్ద బాధ్యత అనిపించింది. ►ఎంజీఆర్గారిలా ట్రాన్స్ఫామ్ అయి, ఆ పాత్ర చేయడం చాలెంజ్లా భావించాను. పాత్ర పరంగా నేను ఏ చిన్న తప్పు చేసినా ప్రేక్షకులు, ఆయన అభిమానులు బాధపడే అవకాశం ఉంది. వాళ్లను దృష్టిలో పెట్టుకుని, నటుడిగా నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి వందశాతం కష్టపడాలని నిర్ణయించుకున్నాను. ఎంజీఆర్గారిని అభిమానించేవారందరూ నేను పోషించిన పాత్ర చూసి హ్యాపీ ఫీలవ్వాలని అనుకున్నాను.! ►నిజానికి ఎంజీఆర్‌గారి బాడీ లాంగ్వేజ్‌కి నా బాడీ లాంగ్వేజ్ పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆయన మేనరిజమ్స్ సినిమాల్లో ఒకలా, సాధారణ జీవితంలో మరోలా ఉంటాయి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కోసం కష్టపడ్డాను. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో, నటుడిగా ఎదిగాక, ముఖ్యమంత్రి అయినప్పుడు, ఆయన ఆరోగ్యంగా లేనప్పుడు.. ఇలా ఓ నాలుగు భాగాలుగా విభజించుకుని లుక్స్ పరంగా ప్రిపేర్ అయ్యాను. ►నేను ఎంజీఆర్‌ను కాదు... అరవింద్ స్వామిని. తెరపై ఆయనలా కనిపించడానికి ప్రయత్నించాను. ఒక నటుడిగా ఆయన పాత్ర చేశాను.. అంతే. ‘ధృవ’ సినిమా తర్వాత తెలుగులో పెద్ద ఆఫర్స్ వచ్చాయి. కానీ కుదర్లేదు. ఇప్పుడు కరెక్ట్ స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నాను. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా చూడను. కథ ఆసక్తికరంగా ఉంటే చాలు. ►ఇరవయ్యేళ్ల క్రితమే నాకు దర్శకత్వం అంటే ఆసక్తి కలిగింది. కానీ యాక్టర్‌గా ఉన్న కమిట్మెంట్స్, ఇతర వ్యాపార వ్యవహారాల వల్ల డైరెక్షన్ చేయలేకపోయాను. ఇటీవల ‘నవరస’ ఆంథాలజీలో ‘రౌద్రం’ భాగానికి దర్శకత్వం వహించడం హ్యాపీ. ప్రస్తుతం నా దగ్గర నాలుగు కథలున్నాయి. ఇవన్నీ మానవీయ సంబంధాల ఆధారంగా తయారు చేసుకున్న కథలే. -
‘తలైవి’ ప్రమోషన్స్: మరోసారి బాలీవుడ్‌పై నిప్పులు చెరిగిన కంగనా
Kangana Ranaut Comments On Bollywodd: ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గతంలో ఎన్నో సార్లు బాలీవుడ్‌పై మండిపిన సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ మృతి అనంతరం ఆమె బాలీవుడ్ పెద్దలపై, పరిశ్రమలోని బంధుప్రీతిపై విమర్శ వ్యాఖ్యలు చేసింది. తాజాగా మరోసారి కంగనా బాలీవుడ్‌పై నిప్పులు చెరిగింది. కాగా ఆమె తాజా చిత్రం తలైవి మూవీ విడుదల నేపథ్యంలో ఓ డిజిటల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘బాలీవుడ్ ఒక విషపూరితమైన పరిశ్రమ. స్నేహం, జాలి లేని దారుణమైనది. బాలీవుడ్లో విషాన్ని పెంచి పోషిస్తున్నారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అలాగే ఇక్కడ ప్రాంతీయ భేదం చూపిస్తారని, ఇక్కడి వారికే ప్రాధాన్యత ఇస్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదవండి: ‘ఐశ్యర్య రాయ్‌కి నటన రాదు, బ్యాడ్ యాక్టింగ్‌కు ఉదాహరణ ఆమె’ ‘బాలీవుడ్ పరిశ్రమకు మనం బయటి నుంచి వచ్చిన వాళ్లం. అందుచేత ఇక్కడ చాలా వైవిధ్యమైన పరిస్థితులను చూడాల్సి ఉంటుంది. అందరూ మనల్ని తొక్కెయాలనే చూస్తారు. బయటి వారిని అసలు ఎదగనివ్వరు. కనీసం ఇక్కడ మద్దతు కూడా దొరకదు. బాలీవుడ్ పూర్తిగా విషంతో నిండిపోయింది. ఇక్కడ మనం కోరుకునే సాధారణ పరిస్థితులు ఉండువు’ అంటూ చెప్పకొచ్చింది. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ‘తలైవి’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 10న ఈ మూవీ థియేటర్లోకి రానుంది. కంగనా లీడ్‌రోల్ పోషిస్తుండగా, అరవింద్‌స్వామి ఎంజీఆర్‌గా అలరించనున్నాడు. కాగా ‘తలైవి’ విడుదల నేపథ్యంలో థియేటర్లు తెరవాల్సిందిగా కంగనా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. చదవండి: భర్తపై దీపికా ఫిర్యాదు, రణవీర్ రొమాంటిక్ రిప్లై -
అందుకే ఇరవై కేజీల వరకు పెరిగాను : కంగనా రనౌత్
‘సమాజానికి మంచి చేయాలి. సేవా తత్వం ఉన్న వాళ్లు రాజకీయాల్లోకి వస్తారు. కానీ అందులో కొంత మంది కరప్ట్ అవుతుంటారు అని అనుకునే దాన్ని. కానీ రాజకీయాలనేవి చదరంగం అని తలైవి చేశాక తెలిసింది. ఓటు బ్యాంకుతోనే రాజకీయాలు చేస్తారని అర్థమయింది. తలైవి చేశాక నాకు రాజకీయాల మీద పూర్తి అభిప్రాయం మారింది’ అన్నారు బాలీవుడ్ భామ కంగనా రనౌత్. ఆమె ప్రధాన పాత్రలో సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. ‘తలైవి’ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. విశా విఠల్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. సినిమా విడుదల సందర్భంగా కంగనా రనౌత్ మీడియాతో ముచ్చటించారు. ► ఇది పాన్ ఇండియా చిత్రంగా విడుదలవడం లేదు ఎందుకంటే ఇంకా బాలీవుడ్లో పరిస్థితులు సద్దమణగలేదు. కొన్ని చోట్ల థియేటర్లు తెరవలేదు. ఇక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక త్వరలోనే మంచి రోజులు వస్తాయని మేం ఆశిస్తున్నాం. ►ముఖ్యంగా ఈ సినిమాకు బరువు తగ్గడం, పెరగడం అనేది చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే తలైవి సినిమా అనేది జయలలిత పదహారేళ్ల నుంచి మొదలైంది నలభై ఏళ్ల వరకు ఉంటుంది. అందుకే నేను కూడా పాత్రకు తగ్గట్టు ఇరవై కేజీల వరకు పెరిగాను. ►నేను ఈ సినిమాలోకి రచయిత విజయేంద్ర ప్రసాద్ గారి వల్లే వచ్చాను. ఆయన నా మణికర్ణిక సినిమాను కూడా రాశారు. ఆయనే నా పేరును ఈ ప్రాజెక్ట్‌కు సూచించారు. అలా నిర్మాతలు నన్ను సంప్రదించారు. అమ్మ పాత్రను పోషించడం అంత ఈజీ కాదు. కానీ దర్శకుడే నాలో ధైర్యాన్ని నింపారు. నన్ను నమ్మారు. ► జయలలితను అందరూ కూడా తక్కువ అంచనా వేశారు. ఆమె అంతలా ఎదుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు. తండ్రి లేని అమ్మాయి. సినిమాల్లోకి వచ్చినప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అన్నారు. ఇక పాలిటిక్స్‌లోకి వచ్చినప్పుడు ఎంతో మంది గేలి చేశారు. కానీ ఆ తరువాత ఆమె చక్రం తిప్పారు. సాధారణంగానే కథ విన్నప్పటి నుంచి నేను జయమ్మకు అభిమానిగా మారాను. సినిమా కోసం జయమ్మలా మారిపోయేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక వేళ ఆమె పాత్రకు న్యాయం చేయకపోతే ఎలా అనే అనుమానం కూడా వచ్చింది. ఆమె నాకు ముఖ్యమంత్రిగానే తెలుసు. కానీ పెద్ద నటి అని కూడా తెలుసు. అంతకంటే ఎక్కువగా తెలియదు. ► జయలలిత గారిని జూనియర్ ఆర్టిస్ట్ కూతురు అని అన్నారు.. ఆమెకు సినిమాల్లోకి రావడం ఇష్టం లేకపోయినా వచ్చారు.. టాప్ ప్లేస్‌కు చేరుకున్నారు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నన్ను కూడా వెక్కిరించారు. పహాడి అమ్మాయి.. ఆమె ఏం చేయగలదు అని అన్నారు. కానీ నేను కూడా ఎన్నో విజయాలు సాధించాయి. కానీ నా ప్రయాణం ఇక్కడే ఆగింది. జయమ్మ గారు రాజకీయాల్లోనూ విజయం సాధించారు. ► ఆమె గురించి ఎంతో చదివాను.. జయలలిత జీవితంలోని ముఖ్య ఘటనల గురించి తెలుసుకున్నాను. ఆమె ఆ సమయంలో ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు.. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని ఇలా ఊహించుకోవడం మొదలుపెట్టాను. పైగా తమిళనాడు ప్రజలకు జయలలిత జీవితం గురించి అంతా తెలుసు. ఇందులో సినిమాటిక్ లిబర్టీ తీసుకునే చాన్స్ లేకుండా పోయింది. ఓ మహిళగా ఆమె ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకుందో అవతలి నుంచి ఊహించుకున్నాను. అదే మానసికంగా ఈ సినిమాకు నేను పడ్డ కష్టం. ► రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశ్యం ఇప్పుడు అయితే లేదు. ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి. ఎంతో మందికి దగ్గరవ్వాలి.. తెలుగు, తమిళంలో ఇలా అన్ని భాషల్లో ఇంకా సినిమాలు చేయాలి. ఇప్పుడైతే రాజకీయాల గురించి ఆలోచించడం లేదు. ► సినిమా వాళ్ల జీవితాలు ఒక్క శుక్రవారం మీద ఆధారపడుతుంది. కానీ రాజకీయ నాయకులు మాత్రం ఎన్నో ఏళ్లు కష్టపడతారు. వారికంటూ ఓ కోటను నిర్మించుకుంటారు. ఏ ఒక్క మనిషిలోనూ అన్ని మంచి లక్షణాలే ఉండవు. మనం ఇక్కడ లేని ఓ మనిషి జీవిత కథను తెరకెక్కిస్తున్నాం.. మనకంటూ ఓ బాధ్యత ఉంటుంది. ఆమె ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎదిగారు.. ఎలా ఎదిగారు.. ఎంత ఘనంగా బతికారు అని ఇందులో చూపించాం. ►మల్టీప్లెక్స్ అసోసియేషన్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. మొదట ఇక్కడ కూడా సినిమాలను బ్యాన్ చేసింది. కానీ ఇప్పుడు సినిమాల విడుదలకు స్వాగతిస్తోంది. మనం దాన్ని మెచ్చుకోవాలి. అదే హిందీలో సినిమాలు విడుదల చేసేందుకు మాత్రం అనుమతినివ్వడం లేదు. అది చాలా తప్పు. ఇది వరకు రాధే సినిమాను విడుదల చేశారు. హాలీవుడ్ సినిమాను కూడా విడుదల చేశారు. ఒకే రోజు థియేటర్లో, ఓటీటీలో కూడా విడుదల చేశారు. కానీ వారు నా మీద, నా సినిమా మీద ద్వేషాన్ని చూపిస్తున్నారు. హీరోల సినిమాకు ఒకలా, హీరోయిన్ల సినిమాకు మరోలా చేయడం, ఇలా గ్రూపిజాన్ని ప్రదర్శించడం మంచిది కాదు. థియేటర్ల బిజినెస్ పెరగాలి అంటారు.. మళ్లీ సినిమాలను అడ్డుకుంటున్నారు. ► శారీరక కష్టానికి వస్తే.. భరతనాట్యం నేర్చుకున్నాను. జయమ్మ గొప్ప భరతనాట్య కళాకారిణి. సినిమాలు ఆపేశాక.. ఆమె డ్యాన్స్ స్కూల్ పెట్టుకున్నారు. ఎన్నో విదేశాల్లో షోలు చేశారు. ఇక ఆ పోర్షన్ కోసం భరత నాట్యం నేర్చుకోవాల్సి వచ్చింది. ► ప్రస్తుతం ఇందిరాగాంధీ బయోపిక్ చేస్తున్నాను. ఇంకా ఎంతో మంది వీరనారుల చరిత్రలున్నాయి. ప్రస్తుతం ఇందిరా గాంధీ పాత్రను పోషించేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను.హైద్రాబాద్‌లో ఎన్నో సినిమాలకు షూటింగ్ చేశాను. మణికర్ణిక షూటింగ్ ఇక్కడే చేశాను. నాకు ఇష్టమైన ప్రదేశాల్లో హైద్రాబాద్ ఒకటి. మనాలి తరువాత ఇదే నాకు ఇష్టం. ఇక్కడి వాతావరణం, ఫుడ్ ఎంతో ఇష్టం. ఇక్కడ చాలా మంది స్నేహితులున్నారు. హైద్రాబాద్ బ్యూటీఫుల్ సిటీ. ►తలైవి సెట్లో విజయ్ గారితో పాటు దాదాపు ఆరుగురు దర్శకులున్నారు. నేను, అరవింద్ స్వామి, సముద్రఖని సర్ ఇలా చాలా మంది ఉన్నాం. ఓ దర్శకుడితో మరో దర్శకుడు నటింపజేయడం చాలా కష్టం. మేం ఎన్నో డౌట్స్ అడుగుతుంటాం. కానీ విజయ్ గారు ఎంతో కూల్‌గా అన్నీ వివరించి చెప్పేవారు. ఆయనకు ఏం కావాలో అడిగి మరీ చేయించుకునే వారు. ►నిర్మాతలు మాకు అద్భుతంగా సహకరించారు. సెకండ్ షెడ్యూల్‌కు కరోనా విపత్తు వచ్చింది. ఇక ఆ సమయంలో వారు మాకు మద్దతుగా నిలిచారు. ఇక విడుదల చేద్దామని అనుకునే సమయంలో సెకండ్ వేవ్ దెబ్బ కొట్టేసింది. ఓటీటీ ఆఫర్లు వచ్చినా.. థియేటర్ల కోసం ఆగారు. సినిమా సత్తా తెలుసుకుని.. థియేటర్ రిలీజ్ కోసం ఆగారు. ►ప్రోస్థటిక్ మేకప్‌తో ఒకే ఒక్క సీన్ చేశాం.అది క్లైమాక్స్‌లో ఉంటుంది. దాని కోసం అమెరికా నుంచి ఓ యూనిట్ వచ్చింది. మీరు సినిమా చూస్తే ఆ సీన్లో జయమ్మను చూసినట్టు అనిపిస్తుంది. అద్భుతంగా వచ్చింది. ►పోటీతత్త్వం అనేది నాలో ఉంది. కలెక్షన్లు కూడా ముఖ్యమే. ఎందుకుంటే మా మీద ఇంత డబ్బులు పెడతారు. వారి ఆ డబ్బులు తిరిగి వస్తే మాకు రిలాక్స్‌గా ఉంటుంది. ఈ చిత్రం విషయంలో నేను రిలాక్స్‌గానే ఉన్నాం. ప్రతీ ఒక్కరూ కెరీర్లో ఎదగాలని, ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటారు. ఎప్పుడూ ఒకే పని చేయడం నాకు విసుగునిస్తుంది. నటించడమే కాకుండా కథలు రాయడం, దర్శకత్వం చేయడం వంటివి చేయడం ఇష్టం. ►కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి.. బీజేపీ ప్రభుత్వం ఉన్న సమయంలోనూ రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. ఎవరు ఎలాంటి అభిప్రాయాలు వెల్లిబుచ్చినా నేను ఏం చేయలేను. కానీ ఈ పాత్రకైనా, ఏ పాత్రకైనా అవార్డు వస్తుందా? అనేది నేను చెప్పలేను. ప్రజలు చెప్పాలి. ఇంకా మిగతా వాళ్ల సినిమాలు, పాత్రలు కూడా చూడాలి. ►మంచి అవకాశాల కోసం మనం ఎదురుచూడాలి. తమిళంలో ధామ్ ధూం సినిమా ఎప్పుడో చేశాను. తరువాత విజయ్ సార్ ఈ ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు కూడా పూరి సర్ని అడుగుతుంటాను.. ఇప్పుడు ప్రభాస్ పక్కన చాన్స్ ఇవ్వండి.. నేను ఎందుకు చేయను అని అంటాను. ఆయన పిలిస్తే మళ్లీ సినిమా చేస్తాను. పిలవాలని ఆశిస్తున్నాను. -
ఈ వారం థియేటర్లో, ఓటీటీలో అలరించబోతోన్న చిత్రాలివే!
లాక్డౌన్లో షూటింగ్‌లు, థియేటర్లు వాయిదా పడటంతో ఇంటికే పరిమితమైన ప్రేక్షకులకు టైంపాస్ లేక ఇబ్బందులు పడ్డారు. ఓటీటీ వేదిక సినిమాలు చూస్తూ అలా గడిపేశారంతా. ఇక పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే మెల్లిమెల్లిగా థియేటర్లు, షూటింగ్‌లు తిరిగి పున: ప్రారంభమయ్యాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో థియేటర్లు తెరచుకోగా మళ్లీ సినిమాల సందడి మొదలైంది. అయితే సెకండ్ వేవ్ తర్వాత తెరచుకున్న థియేటర్లో విడుదలైన సినిమాలేవి అంతగా అలరించలేకపోయాయి. ఇటీవల పెద్ద సినిమాల హీరోలు తమ షూటింగ్‌లను పూర్తి చేసుకోవడంతో ప్రస్తుతం అవి విడుదలకు సిద్దమయ్యాయి. దీంతో ఈ వారం వినాయక చవితికి ప్రేక్షకులకు బోలేడంత వినోదం పంచేందుకు థియేటర్లు, ఓటీటీల వేదిక భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు పలు చిన్న సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి ఆ సినిమాలేవో ఓసారి చూద్దాం రండి.. థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు: థియేటర్లో ఈలల వేయించేందుకే వస్తున్న ‘సీటీమార్’ హీరో గోపిచంద్-తమన్నా ప్రధాన పాత్రలో సంపత్ నంది దర్శకత్వంతో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘సిటీమార్’. కబడ్డీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న థియేటర్లో విడుదలయ్యేందుకు సిద్దమైంది. ఇప్పటికే వేసవి సందర్భంగా విడుదల కావాల్సిన ఈ చిత్రం సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. వినాయక చవితి సందర్భంగా సందడి చేసేందుకు రానుంది. ఇందులో గోపీచంద్ ఆంధ్రా ఫీమేల్ కబడ్డీ టీం కోచ్‌గా, తమన్నా తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీం కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. సినిమా, రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన బయోపిక్ ‘తలైవి’ దివగంత నటి జయలలిత జీవితం ఆధారంగా రూపొందింన ‘తలైవి’ చిత్రం కూడా సెప్టెంబర్ 10న తెలుగు, తమిళం భాషల్లో థియేటర్లో విడుదల కానుంది. విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో, టాలెంటెడ్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రస్తుతం జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇందులో కంగనా జయలలితగా కనిపించనుండగా, ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి, ఆయన భార్యగా మధుబాల అలరించనున్నారు. జయలలిత తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎలా ఎదిగారు? ఎంజీఆర్‌కు ఎలా దగ్గరయ్యారు? తమిళ రాజకీయాల్లో ప్రవేశించి ఏవిధంగా చక్రం తిప్పారన్న విషయాలను బిగ్‌స్రీన్‌పై చూడోచ్చు. చదవండి: ఇకపై కృతిశెట్టితో సినిమాలు చేయను : విజయ్ సేతుపతి విజయ్ సేతుపతి-శృతీ హాసన్ ‘లాభం’ విజయ్ సేతుపతి-శృతి హాసన్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తమిళ చిత్రం ‘లాభం’. సెప్టెంబరు 9న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్పీ జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తమిళ చిత్రం అదే పేరుతో తెలుగులో కూడా విడుదల కానుంది. ఇందులో జగపతి బాబు ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఇందులో విజయ్ సేతుపతి రైతులకు మద్ధుతుగా నిలబడతాడు. పి.అరుముగకుమార్ నిర్మించిన ఈ సినిమాకు ఇమ్రాన్ సంగీతం అందించారు. జాతీయ రహదారి లాక్డౌన్ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాల ఇతివృత్తంలో తెరెక్కించిన సినిమా ‘జాతీయ రహదారి’. ‘1940లో ఒక గ్రామం’, ‘కమలతో నా ప్రయాణం’, ‘లజ్జ’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహిచిన దర్శకుడు నరసింహ నంది ఈ మూవీని రూపొందించాడు. మధుచిట్టి, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి, శ్రీనివాస్ పసునూరి ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 10న థియేటర్లో విడుదల కానుంది. ఓటీటీ వేదికగా అలరించున్న చిత్రాలు, సిరీస్‌లు: నాని ‘టక్ జగదీష్’ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్, కుటుంబ కథా చిత్రం టక్ జగదీష్. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్‌లు కథానాయికులు. వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ సెప్టెంబర్ 10న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైం వీడియోస్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఇటీవల ఈ సినిమా విడుదల విషయంలో వివాదంలో నెలకొన్న సంగతి తెలిసిందే. థియేటర్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం చివరకు ఓటీటీ బాట పట్టింది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో జగపతి బాబు, నాజర్, నరేశ్, రావురమేశ్, రోహిణిలు కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు. అవికా గోర్, రాహుల్ రామకృష్ణ ‘నెట్’ రాహుల్ రామకృష్ణ, అవికాగోర్‌లు లీడ్ రోల్ నటించిన చిత్రం ‘నెట్’. భార్గవ్ మాచర్ల దర్శకుడు. సస్పెన్స్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా సెప్టెంబరు 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో లక్ష్మణ్ అనే పాత్రలో రాహుల్ రామకృష్ణ కనిపించనుండగా... అవికాగోర్.. ప్రియ అనే అమ్మాయి పాత్ర షోషించింది. అశ్లీల చిత్రాలు వీక్షించే రాహుల్ చివరికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సీక్రెట్ కెమెరాల ద్వారా ప్రియ ప్రైవేట్ లైఫ్‌ని వీక్షించిన రాహుల్ చిక్కుల్లో పడటానికి కారణమేమిటి? ప్రియ జీవితాన్ని సీక్రెట్ కెమెరాలతో చిత్రీకరించింది ఎవరు? తెలియాలంటే ‘నెట్’ చూడాల్సిందే. చదవండి: 'సిద్ధార్థ్ శుక్లా ప్రతినెలా బలవంతంగా డబ్బులు పంపేవాడు' ముంబై డైరీస్ 26/11 ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా మరో కొత్త సిరీస్ అలరించనుంది. ‘ముంబై డైరీస్ 26/11’ పేరుతో తెరకెక్కిన ఈ మెడికల్ థ్రిల్లర్ సెప్టెంబరు 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమింగ్ కానుంది. కొంకణ సేన్ శర్మ, మోహిత్ రైనా, శ్రేయా ధన్వంతరిలు కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్‌ను నిఖిల్ అడ్వాణీ, నిఖిల్ గోన్సల్వేస్‌లు తెరకెక్కించారు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్ల్లో సీరియల్ సిరీస్ ప్రసారం కానుంది. 26/11 ముంబయి దాడుల సమయంలో వైద్యులు, విలేకరులు, పోలీస్ ఫోర్స్ ఏవిధంగా పనిచేసిందనే నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెరక్కించారు దర్శకుడు. విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్బార్’ విజయ్ సేతుపతి మరో చిత్రం తుగ్లక్ దర్భార్ వినాయకచవితి సందర్భంగా సెప్టెంబరు 10న టెలివిజన్‌లో ప్రసారం కానుంది. ఆయన లీడ్ రోల్లో తెరకెక్కిన తమిళ పొలిటికల్ మూవీ ‘తుగ్లక్ దర్బార్’. రాశీ ఖన్నా, మంజిమా మోహన్ కథానాయికలు. దిల్లీ ప్రసాద్ దీనదయాళన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సెప్టెంబరు 10న సన్ టీవీ నేరుగా ప్రసారం చేయనుంది. ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబరు 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ► లూలా రిచ్ (సెప్టెంబర్ 10) ఆహా! ► ద బేకర్ అండ్ ద బ్యూటీ ( సెప్టెంబర్ 10) ► మహాగణేశా ( సెప్టెంబర్ 10) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ► అమెరికన్ క్రైమ్‌స్టోరీ (సెప్టెంబర్ 08) నెట్‌ఫ్లిక్స్ ► అన్‌టోల్డ్: బ్రేకింగ్ పాయింట్ (సెప్టెంబర్ 07) ► ఇన్ టు ది నైట్ (సెప్టెంబర్ 08) ► బ్లడ్ బ్రదర్స్ (సెప్టెంబర్ 09) ►మెటల్ షాప్ మాస్టర్స్ (సెప్టెంబర్ 10) ► లూసిఫర్ (సెప్టెంబర్ 10) ► కేట్ (సెప్టెంబర్ 10) జీ 5 ► డిక్కీ లూనా (సెప్టెంబర్ 10) ► క్యా మేరీ సోనమ్ గుప్తా బెవాఫా హై (సెప్టెంబర్ 10) వూట్(VOOT) ► క్యాండీ (సెప్టెంబర్ 08) -
ఈ పాత్రను పోషించగలనంటే నమ్మలేదు: కంగనా రనౌత్
హైదరాబాద్: సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, జయలలిత పాత్ర పోషిస్తుండగా, విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. ‘తలైవి’ సినిమాను తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ‘తలైవీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కంగనా రనౌత్, అరవింద్ స్వామి, విజయేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. కంగనా రనౌత్ : ‘ప్రొడ్యూసర్ విష్ణు సార్‌కి ఈ మూవీ బర్త్ డే గిఫ్ట్ అవుతుంది. మీరు ఎప్పటికీ గుర్తుంచుకునే బ్లాక్ బస్టర్ బర్త్ డే గిఫ్ట్ ఇదే అవుతుంది. థాంక్యూ వెరీ మచ్. నాకు తమిళం గురించి కానీ, ఇక్కడి రాజకీయాల గురించి కానీ ఏం తెలియదు. నేను ఈ పాత్రను పోషించగలను అని విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పినప్పుడు నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు మాత్రం నాకే వింతగా అనిపిస్తోందని’ అన్నారు. అరవింద్ స్వామి: ‘ఎన్నో సినిమాల్లో నటించాను కానీ ఈ సినిమాలో భాగం కావడం చాలా అద్భుతమైన అనుభవం. ఈ సినిమాతో మీ అందరి ముందుకు రావడం ఆనందంగా ఉంది. విజయ్ సార్‌తో పాటు చిత్రయూనిట్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఓ నటుడిగా ఈ సినిమాలో కంగనా లాంటి స్టార్లతో నటించి చాలా నేర్చుకున్నా. ఈ సినిమాను కంగనా తన భుజాలపై వేసుకొని నటించింది. రెండు రోజుల క్రితం ఈ సినిమా చూశా. ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నమ్ముతున్నానని తెలిపారు. దర్శకుడు విజయ్: ‘తెలుగు ప్రేక్షకులంటే నాకు చాలా గౌరవం. వాళ్ళు సినిమాను ఎంతో ప్రేమిస్తారు. మా సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. జీవీ ప్రకాష్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ కానుంది. అరవింద్ సార్ ఈ సినిమాకు బిగ్ పిల్లర్. జయలలిత క్యారెక్టర్లో కంగనా ఒదిగిపోయింది. ఆమెకు నేషనల్ అవార్డు రావడం ఖాయం. నేను 2000 సంవత్సరంలో కాలేజ్ పూర్తిచేసి విజయేంద్రప్రసాద్ గారి క్లాసులకు వెళ్లి ఆయనతో కూర్చొని స్టోరీలు రాస్తూ ఎన్నో నేర్చుకున్నా. చిత్ర యూనిట్ అందరికీ ధన్యవాదాలు’ అని అన్నారు. చదవండి: Bigg Boss 5 Telugu: ఆరో కంటెస్టెంట్‌గా లోబో -
రియల్ తలైవికి.. రీల్ తలైవి నివాళి
చెన్నై: రియల్ తలైవికి రీల్ తలైవి నివాళుల ర్పించారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రతో రూపొందుతున్న తలైవిలో టైటిల్ రోల్‌ను పోషించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈనెల 10న విడుదలకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్లో భాగంగా శనివారం చెన్నైకు చేరుకున్న నటి కంగనా రనౌత్ స్థానిక మెరీనా తీరంలోని జయలలిత సమాధి వద్దకు చేరుకుని నివాళి అర్పించారు. అనంతరం ఎంజీఆర్, కరుణానిధి సమాధులను దర్శించుకున్నారు. -
జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పించిన కంగనా రనౌత్
సాక్షి, చెన్నై : బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తలైవి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ మూవీ సెప్టెంబర్10న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కంగనా తమిళనాడు మెరీనా బీచ్ సమీపంలో ఉన్న జయలలిత సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఎంజీఆర్ స్మారకం వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ..జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన తలైవి చిత్రం అందరికీ చేరువ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఏ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కంగనా టైటిల్ రోల్ పోషించగా, అరవింద స్వామి ఎంజీఆర్ పాత్రలో కనిపించనున్నారు. విద్యార్థి దశ నుంచి హీరోయిన్గా, ఆ తర్వాత రాజకీయ నేతగా ఎదిగే క్రమంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు, ఎంజీఆర్‌తో పరిచయం..ఇలా పలు ఆసక్తికర అంశాలతో తలైవి సినిమాను రూపొందించారు. ‘తలైవి’ థియేటర్లో విడుదలైన నెల రోజుల తర్వాత నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం. భాగ్యశ్రీ కీలకపాత్రలో కనిపించనున్నారు. విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్, బ్రిందా ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి చదవండి : సిద్ధార్థ్ శుక్లా అంత్యక్రియల్లో వివాదం..వీడియో వైరల్ సిద్ధార్థ్‌కు నివాళి తెలుపను, ఎందుకంటే: షెహనాజ్ సోదరుడు -
2 ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి ‘తలైవి’ మూవీ, మేకర్స్ భారీ ఒప్పందం!
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం తలైవి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 10న ఈ మూవీ థియేటర్లో విడుదల కానున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఇదిలా ఉండగా ఇటీవల ఈ మూవీ ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని, ఏదేమైన తమ మూవీని థియేటర్లోనే విడుదల చేస్తున్నట్లు కంగనాతో పాటు మేకర్స్ కూడా తేల్చిచెప్పారు. ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘తలైవి’ ఖచ్చితంగా పెద్ద స్క్రీన్‌పై చూడాల్సిన మూవీ అని అన్నారు. చదవండి: ‘తలైవి’ విడుదల తేదీ వచ్చేసింది, అప్పడే థియేటర్లోకి అయితే ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా తలైవి విడదుల చేయాలని మేకర్స్ భావించినట్లు తెలుస్తోంది. కాగా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మూతపడిన సినిమా థియేటర్లు పార్శికంగా తెరుచుకున్నాయి. ఇక మహారాష్ట్ర, ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు పూర్తిగా తెరుచుకోనేలేదు. ఈ నేపథ్యంలో తలైవి థియేటర్లో విడదులై అనంతరం నేరుగా నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలతో మేకర్స్ భారీగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: అధ్యక్ష బరి నుంచి తప్పుకున్న జీవితా రాజశేఖర్, హేమ కానీ థియేటర్లో విడుదలైన 4 వారాల తర్వాత నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లో తలైవి విడుదల కానున్నట్లు వినికిడి. ఈ తాజా బజ్ ప్రకారం ప్రముఖ ఓటీటీ సంస్థలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైంలో తలైవి మూవీని విడుదల చేసేందుకు 55 కోట్ల రూపాయల ఒప్పందం కుదర్చుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాయి. ఇక దక్షిణాన 50 శాతం సిట్టింగ్‌తో థియేటర్లు ఒపెన్ అయ్యాయి. అందువల్లే ‘తలైవి’ థియేటర్లో విడుదలైన నెల రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలనే ఉద్దేశంతో ఓటీటీ సంస్థలతో మేకర్స్ ఒప్పందం కుదుర్చుకున్నారట. -
‘తలైవి’ విడుదల తేదీ వచ్చేసింది, అప్పడే థియేటర్లోకి
Kangana Ranaut Thalaivi Movie Release Date: ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ‘తలైవి’ మూవీ విడుదల తేదీ వచ్చేసింది. గతేడాది రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. చివరకు షూటింగ్‌ను పూర్తి చేసుకుని ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధంగా కాగా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూత పడ్డాయి. దీంతో మళ్లీ సినిమా వాయిదా పడింది. దివంగత ముఖ్యమంత్రి జయలలీత బయోపిక్ కావడంతో ఈ మూవీని థియేటర్లోనే విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. దీంతో ‘తలైవి’ మూవీ ఏప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు పుల్‌స్టాప్ పెడుతూ తాజాగా మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. చదవండి: షాకింగ్: నటి ప్రియాంక పండిట్ న్యూడ్ వీడియో లీక్, స్పందించిన నటి The story of this iconic personality deserves to be witnessed only on the BIG SCREEN! Pave way, for #Thalaivii as she is all set to make a superstar entry into the world of cinema, yet again, a place where she has always belonged! Thalaivii IN CINEMAS near you on 10th September! pic.twitter.com/e20oHvj5bw — VIBRI (@vibri_media) August 23, 2021 సెప్టెంబర్ 10న తలైవి థియేటర్లో రానున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సినిమాని నిర్మిస్తున్న విబ్రి మీడియా ట్విట్టర్ ద్వారా ప్రకటించించింది. ‘ఐకానిక్ వ్యక్తి కథని పెద్ద తెరపైనే చూడాలి. తలైవి కోసం, ఆమె సినిమా ప్రపంచంలోకి సూపర్‌స్టార్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నందున, ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నాం’ అంటూ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. కాగా తమిళనాడు దివంగత ముఖమంత్రి, అలనాటి నటి జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’ మూవీ రూపొందింది. ఇందులో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ జయలలితగా కనిపించనుండగా, ఎంజీఆర్‌గా అరవింద స్వామి నటిస్తున్నాడు. ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎంజీఆర్ భార్యగా మధుబాల నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఈ మూవీని ఒకేసారి తెరకెక్కించారు. చదవండి: ‘కాంచన 3’ మూవీ హీరోయిన్ అనుమానాస్పద మృతి.. -
మరోసారి అరవింద్ స్వామితో జతకట్టిన మధుబాల
సినీ నటి, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తలైవి మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జయలలిత పాత్రలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటిస్తుండగా, ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్దమవుతుండగా తాజాగా దీని నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఇందులో ఎంజీఆర్ భార్య జానకీ రామచంద్రన్ పాత్రలో ప్రముఖ నటి మధుబాల నటిస్తున్నారు. ఇందులో ఆమె లుక్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఎంజీఆర్(అరవింద్ స్వామి), మధుబాల సన్నివేశానికి సంబంధించిన వారిద్దరి ఫొటోను షేర్ చేశారు. 1992లో వచ్చిన మణిరత్నం మ్యుజికల్ హిట్ చిత్రం ‘రోజా’లో అరవింద్ స్వామి, మధుబాల జోడి హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక 28 ఏళ్ల తర్వాత వీరిద్దరూ మరోసారి ‘తలైవి’ కోసం జతకట్టారు. ఈ సందర్భంగా మధుబాల మాట్లాడుతూ.. ‘తలైవి మూవీ షూటింగ్ చాలా బాగా వచ్చింది. ఈ మూవీ ఎప్పుడేప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంతో కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. దీంతో మార్చిలో విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. అయితే థియేటర్లోకి ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. కానీ ‘తలైవి’ మాత్రం ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా మధుబాల రోజా మూవీ తర్వాత పలు సినిమాల్లో నటించి ఆ తర్వాత బ్రేక్ తీసుకున్నారు. 2017లో వచ్చిన కన్నడ చిత్రం ‘కాలేజీ కుమార్’తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ మూవీకి అంతగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు తాజాగా ఆమె మరోసారి తలైవి మూవీతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. View this post on Instagram A post shared by Thalaivi (@thalaivithefilm) -
ఆ రూమర్స్‌కి చెక్ పెట్టిన కంగనా రనౌత్
సినీ నటి, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తలైవి’.విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జయలలిత పాత్రలో బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్ నటిస్తుండగా, ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి నటిస్తున్నారు. కథను బాహుబలి ఫేమ్ విజయేంద్ర ప్రసాద్ సమకూర్చారు. ఈ చిత్రాన్ని విజయ్ దర్శకత్వంలో లిబ్రి మోహన్ పిక్చర్స్ కర్మ మీడి యా అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు భారీ ఎత్తున నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన తలైవి టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. తమిళం, తెలుగు, హిందీ భాషలో పాన్ ఇండియా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ సినిమా ఓటీటీ ఫ్లామ్ఫామ్లో విడుదల చేయనున్నారు అని వస్తోన్న వార్తలను కంగనా కొట్టిపారేసింది. ఇప్పటివరకు తలైవి రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదని, దయచేసి ఎవరూ పుకార్లను నమ్మవద్దని పేర్కొంది. దేశ వ్యాప్తంగా థియేటర్లను ఓపెన్ చేసినప్పుడే తలైవి సినిమాను రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చింది. ఇక జయలలిత పదహారేళ్ల వయసు నుండి 60 ఏళ్ల వయసు వరకూ మొత్తం నాలుగు దశలను తలైవి బయోపిక్లోలో చూపించనున్నారు. -
తలైవి సీక్వెల్..రెండో భాగంలో అంతిమయాత్ర వరకు..
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి, నటి జయలలిత జీవిత చరిత్రతో తమిళం, తెలుగు, హిందీ భాషలో పాన్ ఇండియా చిత్రంగా తలైవి సినిమా నిర్మిస్తున్నారు. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జయలలిత పాత్రలో బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్, ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి నటిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా తలైవి చిత్రానికి సీక్వెల్ రూపొందించాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు తెలిసింది. మొదటి భాగంలో జయలలిత నట జీవితం, రాజకీయ రంగ ప్రవేశం, ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టే వరకు ఉంటుందని, రెండో భాగంలో సీఎంగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ఆమె ఎదుర్కొన్న ఒడిదుడుకులు, అంతిమయాత్ర వరకు సాగుతుందని సమాచారం. దీని గురించి తలైవి చిత్రానికి మాటలు అందిస్తున్న మదన్ కార్గీ ట్విట్టర్లో పేర్కొంటూ జయలలిత గురించి రజనీకాంత్ కొన్ని విషయాలను చెప్పారని, తలైవి చిత్రానికి రెండో భాగం రూపొందిస్తే అందులో ఆయన చెప్పిన విషయాలను పొందుపరిచే అవకాశం ఉందని తెలిపారు. -
‘తలైవి’ కొత్త స్టిల్స్ విడుదల.. రచ్చ చేసేందుకు కంగనా రెడీ
సినీ నటి, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తలైవి’. ఈ మూవీలో కంగనా రనౌత్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఎంజీఆర్‌గా అరవిందస్వామి నటించారు. కథను బాహుబలి ఫేమ్ విజయేంద్ర ప్రసాద్ సమకూర్చారు. విజయ్ దర్శకత్వంలో లిబ్రి మోహన్ పిక్చర్స్ కర్మ మీడి యా అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 23న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు సినిమా పైన అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ సినిమా నుంచి పలు స్టిల్స్ విడుదలయ్యాయి. ఇందులో కంగనా, అరవింద్ స్వామి కనిపిస్తున్నారు. జయలలిత హీరోయిన్గా ఉన్ననప్పుడు ఎలా ఉన్నారు, రాజకీయాల్లోకి వచ్చాక ఎలా మారారో అచ్చం అలాగే తాజా స్టిల్స్ ఉన్నాయి. జయలలిత పదహారేళ్ల వయసు నుండి 60 ఏళ్ల వయసు వరకూ మొత్తం నాలుగు దశలను తలైవి బయోపిక్ లో చూపించనున్నారు. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
కంగనా రనౌత్ కీలక నిర్ణయం.. ‘మణికర్ణిక’గా నామకరణం
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కీలయ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వెండితెరపై ప్రేక్షకులకు వినోదం పంచిన ఈ ఫైర్‌బ్రాండ్.. త్వరలో డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఆమెకు జాతియ అవార్డు తెచ్చిపెట్టిన 'మణికర్ణిక' చిత్రంపేరునే కంగనా తన బ్యానర్ కు పెట్టడం విశేషం. అయితే తొలి యత్నంగా మెయిన్ స్ట్రీమ్ మూవీని కాకుండా డిజిటల్ ప్లాట్ ఫామ్ కోసం సినిమాను నిర్మిస్తోంది. నూతన నటీనటులతో క్యూట్ లవ్ స్టోరీగా 'టికు వెడ్స్ షేరు' పేరుతో సినిమా తీయబోతున్నట్టు ట్వీటర్ వేదికగా కంగనా వెల్లడించింది. అలాగే తన ప్రొడక్షన్ హౌస్ లోగోను శనివారం ఆమె ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరు తమకు ఆశీర్వదించాలని ఆమె కోరింది. ‘టికు వెడ్స్ షెరు సినిమాతో మణికర్ణిక ఫిలిమ్స్ డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతోంది. ఇది ఒక సెటైరికల్ కామెడీతో కూడిన ప్రేమ కథ. కొత్త రకం వినోదాన్ని ఈ సినిమా ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాక, మా ప్రొడక్షన్ సంస్థ నుంచి కొత్త టాలెంట్‌ని, కొత్త కాన్సెప్ట్‌లని పరిచయం చేస్తాము. సాధారణ సినిమాలు చూసే ప్రేక్షకుల కంటే.. డిజిటల్ సినిమాలు చూసే ప్రేక్షకులు కాస్త పరిణితి చెందిన వాళ్లు అని మా భావన’’ అని కంగనా తెలిపింది. ఇదిలా ఉంటే... కంగనా రనౌత్ నటించిన జయలలిత బయోపిక్ 'తలైవి' విడుదలకు సిద్ధంగా ఉంది. Launching the logo of @ManikarnikaFP with the announcement of our debut in digital space with a quirky love story Tiku weds Sheru .... Need your blessings 🙏 pic.twitter.com/ulaMK62m7l — Kangana Ranaut (@KanganaTeam) May 1, 2021 -
ఓటీటీలో రానున్న తలైవి!: క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు
'తలైవి' చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో స్ట్రీమింగ్కు సిద్ధం అవుతుందనే ప్రసారం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రతో రూపొందిన చిత్రం తలైవి. ఇందులో జయలలిత పాత్రలో బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్, ఎంజీఆర్‌గా అరవిందస్వామి నటించారు. కథను బాహుబలి ఫేమ్ విజయేంద్ర ప్రసాద్ సమకూర్చారు. ఈ చిత్రాన్ని విజయ్ దర్శకత్వంలో లిబ్రి మోహన్ పిక్చర్స్ కర్మ మీడి యా అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు భారీ ఎత్తున నిర్మించాయి. దీన్ని ఏప్రిల్ 23న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కరోనా మళ్లీ విజృంభించడంతో తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లోనూ పలు చిత్రాల విడుదల వాయిదా పడుతున్నాయి. దీంతో తలైవి చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోందని ప్రసారం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. దీనిపై చిత్ర నిర్మాతలు స్పందిస్తూ తలైవి చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేస్తామన్నారు. అంతకుముందు చిత్రాన్ని థియేటర్లో విడుదల చేస్తామని చిత్ర నిర్మాతలు స్పష్టం చేశారు. చదవండి: జయలలిత బయోపిక్స్: దీపకు చుక్కెదురు -
జయలలిత బయోపిక్స్‌పై కోర్టు కీలక ఉత్తర్వులు
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీపకు మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. జయలలిత జీవిత ఇతివృత్తాంత చిత్రాలు, వెబ్ సీరియల్‌కు వ్యతిరేకంగా ఆమె దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు తోసి పుచ్చింది. దివంగత సీఎం జయలలితకు వారసులు తామే అని ఆమె మేన కోడలు దీప, మేనళ్లుడు దీపక్ సాగిస్తున్న న్యాయపోరాటం గురించి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో జయలలిత జీవిత ఇతివృత్తాంతతో క్వీన్ పేరిట వెబ్ సిరీస్, తలైవి, జయ పేరిట చిత్రాలు తెరకెక్కించే పనిలో ప్రముఖ దర్శకులు నిమగ్నమయ్యారు. దీనిని వ్యతిరేకిస్తూ దీప కోర్టును ఆశ్రయించారు. తన మేనత్త జీవిత ఇతివృత్తాంతంతో తెరకెక్కుతున్న వెబ్ సీరిస్, చిత్రాల్లో తమ కుటుంబానికి వ్యతిరేకంగా అంశాలు ఉన్నట్టు, ఈ చిత్రాలు, వెబ్ సీరియల్స్‌పై స్టే విధించాలని కోరారు. తొలుత ఈ పిటిషన్‌ను సింగిల్ బెంచ్ విచారించింది. అయితే, ఈ పిటిషన్‌ను సింగిల్ బెంచ్ తోసి పుచ్చడంతో అప్పీలుకు దీప వెళ్లారు. హైకోర్టు బెంచ్ ముందు శుక్రవారం పిటిషన్ విచారణకు వచ్చింది. తలైవి అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని, ఇందులో ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి అంశాలు లేవని, ఆమె అనుమతి పొందాల్సిన అవసరం లేదని చిత్ర దర్శకుల తరఫున వాదనలు కోర్టుకు చేరాయి. వాదనల అనంతరం దీపకు మళ్లీ చుక్కెదురైంది. ఆమె వాదనను కోర్టు తోసి పుచ్చింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను ధ్రువీకరిస్తూ, ఆ చిత్రాలకు లైన్ క్లియర్ చేస్తూ న్యాయమూర్తులు ఉత్తర్వులు ఇచ్చారు. చదవండి: 16 గంటలు వర్షంలో కంగనా.. జ్వరంతోనే వాన పాట! ‘రాధేశ్యామ్’లో పూజా హేగ్డే పాత్ర ఇలా ఉంటుందట -
కంగనాను అలా చూసి నిర్ఘాంతపోయిన వృద్ధురాలు..
జయలలితకు కాస్ట్యూమ్స్ కుట్టాలి. ఇప్పటివా? 1960లవి, 70లవి, 80లవి. ఆమె లేదు. కాని ఆమెలా చేయనున్న కంగనాకు ఆ తళుకు తేవాలి. బెళుకు కలిగించాలి. మాయా ప్రతిబింబం నిలబెట్టాలి. ఎవరు దీనికి సరైనవారు? నీతా లుల్లా పేరు అందరూ చెప్పారు. ‘తలైవి’కి అద్భుతంగా పని చేసివిడుదలకు ముందే అందరి ప్రశంసలు పొందుతున్ననీతా లుల్లా ఈ సినిమా కోసం పడిన శ్రమను తెలిపే కథనం...వస్త్ర నాయిక జయలలిత పేరు చెప్తే తెలుగు ప్రేక్షకులు తెలుగులో ఆమె చేసిన సినిమాలు గుర్తుకొస్తాయి. అక్కినేనితో ‘అయ్యయ్యో బ్రహ్మయ్య... అన్యాయం చేసేవేమయ్యా’ (అదృష్టవంతులు), ఎన్.టి.ఆర్తో ‘విన్నారా... అలనాటి వేణుగానం’ (దేవుడు చేసిన మనుషులు)... వెండి తెర మీద ఆమె నిండైన రూపం ఎవరు మర్చిపోగలరు. కాని తమిళులకు ఆమె ‘అమ్మ’, ‘విప్లవ వనిత’, ‘విప్లవ నాయకురాలు’. దాంతో పాటు తమ అభిమాన నటుడు, నాయకుడైన ఎం.జి.ఆర్కు సరిజోడి. అంతేనా?... తమ సామాజిక, రాజకీయ చరిత్రలో ఆమె ఒక అవిభాజ్యమైన భాగం. సౌత్‌లో సినిమా రంగం నుంచి ముఖ్యమంత్రులైన నటులు ముగ్గురే. ఎం.జి.ఆర్, ఎన్.టి.ఆర్, జయలలిత. (కరుణానిధి నటుడు కాదు). ఎన్.టి.ఆర్ బయోపిక్‌ను తెలుగులో రెండు భాగాలుగా తీశారు. ఇప్పుడు జయలలిత బయోపిక్ ప్రతిష్టాత్మకంగా తయారవుతోంది. సినిమా పేరు ‘తలైవి’. కంగనా రనౌత్ హీరోయిన్. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోందని చెప్పవచ్చు. ఈ సినిమాలో కంగన అచ్చు జయలలిత లానే కనిపిస్తోందని ప్రశంసలు వస్తున్నాయి. ఇందుకు కారణం ఆ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన నీతా లుల్లా. మిగిలిన సినిమాలకు పని చేయడం వేరు... ఈ సినిమాకు పని చేయడం వేరు అంటోందామె. ఆ కాలం... ఆ రూపం ‘తలైవి’ సినిమా కోసం కంగనా రనౌత్‌ను జయలలితగా చూపించడం ఆ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన నీతా లుల్లాకు సవాలుగా నిలిచింది. ‘ఇందుకు కారణం ఆమె రూపం, సినిమాలు, పాటలు, తెర మీద, తెర బయటి ఆహార్యాలు ప్రజల దృష్టిపథం నుంచి ఇంకా చెరిగిపోకపోవడమే. జయలలిత ఈ సినిమా తెర మీద నటిగా కనిపిస్తారు. ఆ తర్వాత రాజకీయ వేత్తగా, ఆ తర్వాత సి.పిగా రకరకాల దశల్లో కనిపిస్తారు. ప్రతిసారి ఆమె రూపం మారింది. ఆహార్యం మారింది. కాస్ట్యూమ్స్ మారాయి. వాటిని యథాతథంగా మళ్లీ చూపించడానికి నేను చాలా శ్రద్ధ పెట్టాల్సి వచ్చింది’ అంటారు నీతా లుల్లా. ‘జయలలిత ఫ్యాషన్స్‌ను సినిమాల్లో చాలా ఫాలో అయ్యారు. ఆమె బట్టలు, ఆభరణాల్లో ప్రత్యేకత ఉంది. వాటిని మళ్లీ చూపడానికి ఆమె పాటలు, సినిమాలు లెక్కలేనన్నిసార్లు చూడాల్సి వచ్చింది’ అంటారు నీతా లుల్లా. కంగనా కోరిక మీద బాలీవుడ్లో ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ అయిన నీతా లుల్లా కంగనా నటించిన ‘మణికర్ణిక’కు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది. దాంతో ‘తలైవి’కి కూడా పని చేయమని కంగనా ఆమెను కోరింది. ‘నా పని మొదలయ్యాక ఎం.జి.ఆర్గా నటిస్తున్న అరవింద్ స్వామికి కూడా కాస్ట్యూమ్స్ చేయమని కోరారు. ఆ పని కూడా సంతోషంగా చేశాను’ అంటుంది నీతా లుల్లా. ఈ సినిమాలో ఆ కాలపు చీరల కోసం ఫ్రెండ్స్ అమ్మమ్మలు, నాయనమ్మలను బతిమిలాడి సంపాదించడం దగ్గరి నుంచి, కంచిలో మళ్లీ నాటి చీరల్లాంటివి తిరిగి నేయించడం దగ్గరి నుంచి, నాటి డ్రస్సులను, చెప్పులను, ఆఖరకు నాటి బ్రాలను కూడా స్టడీ చేయాల్సి వచ్చిందని నీతా అంటారు. ‘ఏ డిటైల్‌ను మిస్ కాలేదు’ అంటారామె. గెటప్ టెస్ట్ కంగనాను ఈ సినిమా కోసం తలైవిగా తయారు చేశాక, అంటే సి.ఎం గెటప్ వేశాక ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని ఆమెను తీసుకుని కారులో చెన్నై బిజీ దారిలో తీసుకెళ్లి దించింది నీతా. కారులో నుంచి దిగిన కంగనాను ఒక ముసలామె చూసి ఒక్క క్షణం నిర్ఘాంతపోయింది. ఆ వెంటనే వచ్చి చుట్టేసుకుంటూ ‘అమ్మా.. అమ్మా’ అని జయలలితను చూసి పులకించినట్టే పులకించింది. ‘అది చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది నాకు’ అంటుంది నీతా లుల్లా. ‘చాందిని’, ‘తాళ్’, ‘జోధా అక్బర్’, ‘దేవదాస్’ వంటి భారీ సినిమాలకు కాస్ట్యూమ్స్ చేసిన నీతా ప్రస్తుతం తెలుగులో భారీగా మొదలైన ‘శాకుంతలం’కు కాస్ట్యూమ్స్ అందిస్తున్నారు. మహిళా కాస్టూమ్ డిజైనర్‌గా ఇప్పటికి నాలుగుసార్లు జాతీయ అవార్డులు పొందిన నీతా ఎందరికో స్ఫూర్తి. విజయాన్ని ఆమె ఇలాగే పర్ఫెక్ట్గా కుట్టుకుంటూ వెళ్లాలని ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ చదవండి: 'తలైవి' రిలీజ్‌కు కరోనా షాక్ -
'తలైవి' రిలీజ్‌కు కరోనా షాక్
వంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం తలైవి. కంగనా టైటిల్ పాత్రలో కనిపించనుంది. ఇందులో ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి, ఎంజీఆర్ సతీమణి జానకీ రామచంద్రన్ పాత్రలో మధుబాల నటించారు. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 23న థియేటర్లలో సందడి చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ తాజాగా తలైవి రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. 'ఏప్రిల్ 23న అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ కరోనా వ్యాప్తి హెచ్చుమీరుతున్న తరుణంలో ఈ నిర్ణయాన్ని విరమించుకుంటున్నాం. ప్రభుత్వ నిబంధనలకు మద్దతు తెలుపుతూ తలైవిని వాయిదా వేస్తున్నాం' అని శుక్రవారం ప్రకటన జారీ చేసింది. కొత్త డేట్‌ను మాత్రం ప్రకటించలేదు. Theater business can only be revived if theatres open 🙏@thearvindswami #Vijay @vishinduri @ShaaileshRSingh @BrindaPrasad1 @neeta_lulla #HiteshThakkar @urstirumalreddy #RajatArora #BhushanKumar @KarmaMediaent @TSeries @vibri_media @ZeeStudios_ #SprintFilms #GothicEntertainment pic.twitter.com/HZnkgFo3Au — Kangana Ranaut (@KanganaTeam) April 9, 2021 చదవండి: కంగనాకి అక్షయ్ కుమార్ సీక్రెట్ కాల్! సెకండ్ వేవ్ సినిమా.. మూడు నెలల ముచ్చటేనా? -
అక్షయ్ సీక్రెట్ కాల్ చేశాడు.. మరో బాంబు పేల్చిన కంగన
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరో బాంబు పేల్చింది. ఎప్పటిలాగే బాలీవుడ్ మాఫియాలను టార్గెట్ చసే కంగనా.. ఈ సారి ఆ వివాదంలోకి ఖిలాడి అక్షయ్ కుమార్‌ని లాగింది. అక్షయ్ లాంటి టాప్ స్టార్స్ అంతా తనకు రహస్యంగా ఫోన్ చేసి ప్రశంసించారని చెప్పుకొచ్చింది. కంగనా ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘తలైవి’. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ టీజర్‌కు మంచి స్పందన లభించింది. జయలలిత పాత్రలో కంగనా ఒదిగిపోయింది. ఆడియన్స్, క్రిటిక్స్ ఇద్దరి నుంచీ మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ, బాలీవుడ్ పెద్దలు మాత్రం ఎప్పటిలాగే సైలెంట్ గా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో కంగనా తాజాగా తనకు వచ్చిన సీక్రెట్ కాల్స్ గురించి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇండస్ట్రీలోని చాలా మంది తనకు సీక్రెట్‌గా అభినందనలు తెలిపారని చెప్పింది. కానీ, దీపిక, ఆలియా భట్ లాంటి వారి సినిమాలకు వచ్చినట్టు తన చిత్రాలకి పబ్లిగ్గా పొగడ్తలు రావని చెప్పింది. అయితే కంగనా చెప్పినదాంట్లో వాస్తవం ఎంత ఉందో తెలియాలంటే అక్షయ్ కుమార్ స్పందించేవరకు చూడాలి. Bollywood is so hostile that even to praise me can get people in trouble,I have got many secret calls and messages even from big stars like @akshaykumar they praised @Thalaivithefilm trailer to sky but unlike Alia and Deepika films they can’t openly praise it. Movie mafia terror. https://t.co/MT91TvnbmR — Kangana Ranaut (@KanganaTeam) April 7, 2021 -
16 గంటలు వర్షంలో కంగనా.. జ్వరంతోనే వాన పాట!
‘ఇలా... ఇలా..’ అంటూ పాడుతూ, కంగనా రనౌత్ అలవోకగా డ్యాన్స్ చేశారు. కానీ, ఆ పాట చిత్రీకరణ వెనక పెద్ద కష్టం ఉంది. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘తలైవి’లోని పాట ఇది. జయలలిత పాత్రను కంగనా చేశారు. ఈ చిత్రంలోని ‘ఇలా.. ఇలా..’ పాటను ఇటీవల విడుదల చేశారు. జయలలిత డ్యాన్స్‌ని తలపించేలా ఈ పాటలో కంగనా కనబడుతున్నారు. మొత్తం మూడు రోజులు ఈ పాట చిత్రీకరణకు పట్టింది. గత ఏడాది అక్టోబర్‌లో చిత్రీకరించారు. ఇది వాన పాట. మూడు రోజుల్లో దాదాపు 16 గంటలు ఈ పాట కోసం కంగనా తడవాల్సి వచ్చింది. సరిగ్గా పాట చిత్రీకరిస్తున్న సమయంలో ఆమెకు జ్వరం అట. అయినప్పటికీ లెక్క చేయకుండా, షూట్లో పాల్గొన్నారు. విశ్రాంతి తీసుకుని, కోలుకున్నాక చిత్రీకరించవచ్చని చిత్రబృందం అన్నప్పటికీ కంగనా మాత్రం తన కారణంగా షూటింగ్ ఆగకూడదనుకున్నారట. ఆమె కమిట్మెంట్ని చిత్రబృందం అభినందిస్తోంది. ఈ పాట కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో వాటర్ ఫాల్ సెట్ వేశారు. డ్యాన్స్ మాస్టర్ బృందా గోపాల్ నేతృత్వంలో ఈ పాటను చిత్రీకరించారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 23న ‘తలైవి’ విడుదల కానుంది.