Thermal power
-
Fact Check: ఏపీలోనే వెలుగులు
సాక్షి, అమరావతి: విద్యుత్ ప్లాంటు కట్టేశామని స్ట్రక్చర్ పూర్తయినట్లు చూపిస్తే సరిపోదు. లోపల అనేక టర్బైన్లు, ఇతర యంత్రాలు అమర్చాలి. ఈ మాత్రం జ్ఞానం కూడా లేని రామోజీ..వాస్తవాలను వక్రీకరించి గత పదేళ్లుగా విద్యుత్ సంస్థలు చేస్తున్న కృషిని తక్కువ చేస్తూ వాటి మనోబలాన్ని దెబ్బతీసేలా ఓ తప్పుడు కథనాన్ని అచ్చేశారు. ఏపీ మొత్తం విద్యుత్ డిమాండులో ఏపీజెన్కో 45 నుంచి 50 శాతం వరకూ సమకూర్చుతుండగా, తెలంగాణలో జెన్కో, సింగరేణి ప్లాంట్లు అన్నీ కలిపి రాష్ట్ర డిమాండులో 37 నుంచి 38 శాతం విద్యుత్ మాత్రమే ఇవ్వగలుగుతున్నాయి. నిజాలు ఇలా ఉండగా ‘తెలంగాణలో మిరుమిట్లు..ఏపీలో కునికిపాట్లు’ శీర్షికన ఈనాడు రాసిన ఆ అభూతకల్పనల కథనాన్ని విద్యుత్ సంస్థలు ఖండిస్తూ వివరాలు వెల్లడించాయి. ఆరోపణ: పొరుగు రాష్ట్రంతో పోటీ పడలేక పోయింది వాస్తవం: విభజన నాటికి రాష్ట్రంలో రోజుకు సరాసరి 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉండేది. అది అప్పటి రోజువారీ విద్యుత్ వినియోగంలో దాదాపు 18 శాతం. విభజన చట్టంలో ఆస్తులు భౌగోళికంగా, అప్పులు జనాభా నిష్పత్తిలో, విద్యుత్ ఒప్పందాలు అప్పటికున్న లోడ్ ప్రకారం విభజించారు. రాష్ట్ర విభజన తేదీ నాటికే హైదరాబాద్ వల్ల తెలంగాణలో విద్యుత్ వాడకం ఎక్కువగా ఉండేది. అలాగే ఆంధ్ర రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణ జనాభా తక్కువ కావడంతో అక్కడ తలసరి విద్యుత్ వినియోగం ఎక్కువ. అందుకే దాదాపు 2017 వరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు తెలంగాణ సంస్థలకు విద్యుత్ అందించాయి. దానికి సంబంధించి దాదాపు రూ.7400 కోట్లు ఏపీకి రావాల్సి ఉంది. అంతటి విద్యుత్ కొరతను అధిగమించి మనకు భౌగోళికంగా అనుకూలంగా ఉన్న పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించుకుని, కావలసిన ధర్మల్ విద్యుత్ ను కూడా అభివృద్ధి చేసుకుని మన రాష్ట్రం విద్యుత్ రంగంలో అభివృద్ధి పథంలో పురోగమిస్తోంది. ఆరోపణ: తెలంగాణలో వ్యూహాత్మత అడుగులు.. ఏపీలో తడబాటు వాస్తవం: పునరుత్పాదక విద్యుత్ రంగంలో మన రాష్ట్రంలో దాదాపు 9 వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాలు స్థాపించారు. కృష్ణపట్నంలో 2400 మెగావాట్ల ధర్మల్ కేంద్రం, విజయవాడలో 800 మెగావాట్ల కేంద్రం అందుబాటులోకి వచ్చాయి. పోలవరంలో 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం కూడా శరవేగంగా నిర్మాణమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి గనుల ద్వారా అక్కడి ధర్మల్ కేంద్రాలకు కావలసినంత బొగ్గు దొరుకుతోంది. మనం సుదూర ప్రాంతాల నుంచి, అంటే మహానది బొగ్గు క్షేత్రాలు– తాల్చేర్ ఒరిస్సా, సింగరేణి బొగ్గు గనుల నుంచి సేకరించవలసి వస్తోంది. మన రాష్ట్ర విద్యుత్ సంస్థలు కూడా వేరే రాష్ట్రాలలోని విద్యుత్ సంస్థలతో ముందస్తుగా విద్యుత్ బ్యాంకింగ్ విధానం.. అంటే మనకు అవసరం వున్నప్పుడు వాళ్ళు విద్యుత్ ఇచ్చేలా, మనకు మిగులు వున్నప్పుడు వారికీ తిరిగి విద్యుత్ అందించేలా ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దీనికి విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి కూడా ఇస్తోంది. ఆరోపణ: ఎక్స్చేంజీల పైనే ఏపీ ఆధారం వాస్తవం: ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో విద్యుత్ ఎక్సే్చంజీలపై ఆధారపడకుండా ముందుగానే సెప్టెంబర్ నెలలో తగిన ప్రణాళికతో చర్యలు తీసుకుని జూన్ నెల వరకు పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా అత్యంత పారదర్శకంగా విద్యుత్ అమ్మకందార్లను ఎంచుకుని ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దానివల్ల ప్రస్తుత నెలలో ఏ విధమైన అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా అవుతోంది. ఆరోపణ: రాత్రిపూట రైతులు పొలంబాట పడుతున్నారు వాస్తవం: రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు. నిజానికి ఇది గత ప్రభుత్వ హయాంలో ఉండేది. ప్రస్తుతం వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలు విద్యుత్ అందుతోంది. భవిష్యత్తులోనూ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో 7 వేల మెగావాట్ల విద్యుత్ యూనిట్ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు కొనుగోలు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంది. ఈ విద్యుత్ కొనుగోలుకు అయ్యే ఖర్చు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. వ్యవసాయ విద్యుత్ సరఫరా కోసం ఒక ప్రత్యేక సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ఆరోపణ: అక్కడ విద్యుత్ ప్లాంట్లకు ప్రణాళిక..ఇక్కడ ఆపసోపాలు వాస్తవం: కేవలం ఏడాది వ్యవధిలో కృష్ణపట్నంలో 800 మెగావాట్ల మూడో యూనిట్, డాక్టర్ ఎన్టీటీపీఎస్లో 800 మెగావాట్ల ఎనిమిదో యూనిట్‌ను ఏపీ అందుబాటులోకి తెచ్చింది. 2019 నాటికి కృష్ణపట్నంలో 60 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. డాక్టర్ ఎన్టీటీపీఎస్లో ఎనిమిదో యూనిట్ నిర్మాణ పనులు 60 శాతం మాత్రమే పూర్తయ్యాయి. తర్వాత కరోనా లాంటి విపత్కర పరిస్థితులను అధిగమించి రెండు ప్లాంట్ల నిర్మాణ పనులు పూర్తి చేసి ఏపీజెన్కో విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. లోయర్ సీలేరులో మరో 230 మెగావాట్ల అదనపు ఉత్పత్తి కోసం 115 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్ల నిర్మాణ పనులను ఏపీజెన్కో శరవేగంగా జరిపిస్తోంది. పీక్ డిమాండును దృష్టిలో పెట్టుకుని ఎగువ సీలేరులో 1350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి ప్లాంటు నిర్మాణానికి అన్ని అనుమతులు తీసుకుని ముందుకెళుతోంది. పోలవరంలో 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేసి దశలవారీగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. సంయుక్త భాగస్వామ్యంలో 5 వేల మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజి ప్లాంట్లు నిర్మించే దిశగా ప్రణాళిక రూపొందించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌హెచ్‌పీసీతో ఎంఓయూ కూడా కుదుర్చుకుంది. -
AP: ‘బొగ్గు’ భయం లేదు.!
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ ముందు చూపు వల్ల రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ నిరాటంకంగా నడిచాయి. విద్యుత్ సంస్థలు సమర్థవంతంగా కరెంటు అందించాయి. ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గును సమకూర్చుకుంటున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క రోజు బొగ్గు కోసమే నానా తంటాలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు కేంద్ర బొగ్గు, విద్యుత్ మంత్రిత్వ శాఖలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, సకాలంలో చెల్లింపులు చేస్తూ స్వదేశీ బొగ్గు కేటాయింపులను పొందడంతో పాటు, విదేశీ బొగ్గునూ దిగుమతి చేసుకుంటున్నాయి. దీంతో వారానికి సరిపడా నిల్వలు ఉంటున్నాయి. కొరత లేకుండా నిల్వలు వీటీపీఎస్‌కి రోజుకి 28,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా.. ప్రస్తుతం 1,24,324 మెట్రిక్ టన్నులు ఉంది. ఆర్టిపీపీకి 21 వేల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉండగా.. 60,203 మెట్రిక్ టన్నులు ఉంది. కృష్ణపట్నం ప్లాంటుకు 29 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా 1,66,606 మెట్రిక్ టన్నులు ఉంది. హిందూజాలో 19,200 మెట్రిక్ టన్నులు ఒక రోజుకి వాడుతుండగా, ఇక్కడ 1,04,891 మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. ఈ లెక్కన రాష్ట్రంలో బొగ్గు నిల్వలు మూడు రోజుల నుంచి వారం రోజులకు సరిపోతాయి. ఈ బొగ్గు వాడుతూనే, తర్వాతి రోజుల్లో విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బంది రాకుండా నిత్యం మరింత బొగ్గును రాష్ట్రం దిగుమతి చేసుకుంటోంది. సాధారణంగా 65 నుంచి 75 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) వద్ద 1,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి 3.5 నుంచి 4 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ఈ మేరకు డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ (ఆర్టిపీపీ) కోసం 8 లక్షల టన్నుల బొగ్గు రవాణాకు ఏపీ జెన్కో టెండర్ ఖరారు చేసింది. మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి ఈ బొగ్గు వస్తుంది. విదేశీ బొగ్గుతో స్వదేశీ బొగ్గును కలిపి విద్యుత్ ఉత్పత్తికి వాడాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో ఇప్పటికే 7.5 లక్షల విదేశీ బొగ్గు టెండర్‌ను జెన్కో ఖరారు చేసింది. ఆర్టీపీపీకి 2 లక్షల టన్నులు, వీటీపీఎస్‌కు 3 లక్షల టన్నుల చొప్పున మరో 5 లక్షల టన్నుల విదేశీ బొగ్గు కోసం మరో టెండర్‌ను పిలిచింది. పూర్తి విదేశీ బొగ్గుతో నడిచే కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్)కు 7.5 లక్షల టన్నుల బొగ్గును సమకూర్చే ప్రయత్నం కూడా జరుగుతోంది. అవసరాలకు తగ్గట్టు.. రాష్ట్రంలో ప్రజలకు ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ అందించాలన్నది ఏపీ జెన్కో లక్ష్యం. అందుకే విద్యుత్ ఉత్పత్తి పెంచుతూ వస్తోంది. సామర్థ్యాన్ని మించి దాదాపు 10 మెగావాట్ల అధిక ఉత్పత్తి నమోదు చేస్తూ రాష్ట్ర అవసరాల్లో దాదాపు 40 శాతం విద్యుత్‌ను అందిస్తోంది. కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో 800 మెగావాట్ల యూనిట్, ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ ఎన్టీటీపీఎస్ (వీటీపీఎస్)లో 800 మెగావాట్లు విద్యుత్ వాణిజ్య ఉత్పత్తి ఈ ఏడాది ప్రారంభమైంది. ప్రస్తుతం రోజుకి 78.677 మిలియన్ యూనిట్ల విద్యుత్ జెన్కో థర్మల్ యూనిట్ల నుంచి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తికి కొరత రాకుండా బొగ్గు సమకూర్చుకుంటున్నాం. – కేవీఎన్ చక్రధర్‌బాబు, ఎండీ, ఏపీజెన్కో -
‘థర్మల్’ వెలుగులు
సాక్షి, అమరావతి: దేశంలో కర్బన ఉద్గారాలను 2070 నాటికి సున్నా స్థాయికి తీసుకురావాలనే లక్ష్యంలో భాగంగా రానున్న కాలంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచుకుని.. థర్మల్ విద్యుత్‌ను తగ్గించుకోవాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కొన్ని నెలల క్రితం అన్ని రాష్ట్రాలకూ ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ జెన్కో) థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో రిజర్వు షట్ డౌన్ (ఉత్పత్తి తగ్గింపు)పై విధివిధానాలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) కూడా ప్రకటించింది. పూర్తిగా మూసేయాల్సిన అవసరం లేదని, గ్రిడ్‌కు ప్రమాదం వాటిల్లే పరిస్థితి వస్తే అప్పుడు థర్మల్ యూనిట్లు షట్‌డౌన్ చేయవచ్చని ఏపీ ఈఆర్సీ స్పష్టం చేసింది. వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా అకస్మాత్తుగా విద్యుత్ డిమాండ్ పడిపోయినప్పుడు కూడా ఉత్పత్తి తగ్గించవచ్చని పేర్కొంది. తక్కువ ధరకు విద్యుత్ అందించే ఉత్పత్తి సంస్థలకు మొదట ప్రాధాన్యం ఇచ్చేలా కొన్ని యూనిట్లను రిజర్వు షట్ డౌన్ చేసే వెసులుబాటు కల్పించింది. దీంతో రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ సామర్థ్యాన్ని అత్యవసరంగా తగ్గించాల్సిన ఆవçశ్యకత రాలేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల సూపర్ క్రిటికల్ థర్మల్ యూనిట్ ఈ నెల 20న వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించింది. 2024లో 17 థర్మల్ ప్లాంట్లు భవిష్యత్‌లో పెరుగనున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవాలంటే పునరుత్పాదక ఇంధనంతో పాటు శిలాజ ఇంధన ఉత్పత్తిపైనా దృష్టి సారించాల్సిందేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా గుర్తించాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒకడుగు ముందే ఉంది. ఇప్పటికే సోలార్, విండ్, హైడల్ కలిపి ఉండే పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లకు శ్రీకారం చుట్టింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో రూ.9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇంధన రంగంలో ఏపీ చర్యలను ఇప్పటికే అనేక పర్యాయాలు ప్రశంసించిన కేంద్రం రాష్ట్రం బాటలోనే నిర్ణయాలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా భారీగా బొగ్గు ఆధారిత ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. 2024లో దేశంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ 256 గిగావాట్లకంటే ఎక్కువ ఉంటుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నివేదిక అంచనా వేసింది. 2031–32కి ఇది 366.39 గిగావాట్లకు పెరుగుతుందని చెప్పింది. 2041–42కి 574.68 గిగావాట్లకు పెరగొచ్చనే అంచనాతో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంపు అనివార్యమైంది. దీంతో 2024లో 17 గిగావాట్ల సామర్థ్యం గల థర్మల్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని, తర్వాత మరో 33 గిగావాట్ల ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని ప్రణాళిక రూపొందించింది. ఇలా దాదాపు రూ.7.28 లక్షల కోట్ల పెట్టుబడితో 91 థర్మల్ ప్లాంట్లు స్థాపించాలని యోచిస్తున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలోనే ఆదర్శంగా ఏపీ ఏపీ గ్రిడ్ డిమాండ్ గతేడాది రోజుకు 190 మిలియన్ యూనిట్ల నుంచి 200 మిలియన్ యూనిట్లు ఉండగా.. ఈ ఏడాది 220 నుంచి 245 మిలియన్ యూనిట్లు రికార్డయ్యింది. అయినప్పటికీ విద్యుత్ కొరత లేకుండా సరఫరా చేయడంలో థర్మల్ కేంద్రాలు కీలక భూమిక పోషించాయి. ఎన్టీటీపీఎస్ ఆపరేషన్, మెయింటెనెన్స్ యూనిట్ల లభ్యత శాతం 2022–23 ఆర్థిక సంవత్సరంలో 69.90 శాతం ఉంటే.. ఈ ఏడాదిలో 75.83 శాతానికి పెరిగింది. అలాగే గతేడాది ఎన్టీపీఎస్ స్టేజ్–4 యూనిట్ హీట్ రేట్ 2,517 కిలో వాట్ అవర్ నుంచి 2,436 తగ్గింది. అదేవిధంగా 2022–23లో ఎంవీఆర్ ఆర్టీపీపీ స్టేషన్ యూనిట్ల లభ్యత 67.85 శాతం నుంచి 75.68 శాతానికి మెరుగుపడింది. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలోనే అత్యుత్తమ థర్మల్ ప్లాంట్‌గా ఆర్టీపీపీ గుర్తింపు పొందింది. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో) తన అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ పీడీసీఎల్)తో కలిసి థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్వహిస్తోంది. వీటిలో సామర్థ్యాన్ని మించి దాదాపు 10 మెగావాట్ల అధిక విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. రాష్ట్ర గ్రిడ్ అవసరాలను సాధ్యమైనంత ఎక్కువగా తీర్చాలనే లక్ష్యంతో ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతూ వస్తోంది. అందులో భాగంగానే కృష్ణపఛిట్నంలోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఈ ఏడాది మార్చి 10న 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. తాజాగా ఎన్టీటీపీఎస్లో 8వ యూనిట్ సీవోడీతో జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం 5,810 మెగావాట్ల నుంచి 6,610 మెగావాట్లకు పెరిగింది. -
సింగరేణి @ 4000 మెగావాట్లు !
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ విద్యుదుత్పత్తి రంగంలో తెలంగాణ జెన్కో, ఎన్టీపీసీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రధానంగా కొత్త విద్యుత్ కేంద్రాల స్థాపన ద్వారా తమ థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 4000 మెగావాట్లకు పెంచుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరిపిన సింగరేణి సంబురాల్లో సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఈ విషయాన్ని ప్రకటించారు. సింగరేణి సంస్థ ఇప్పటికే మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద 2 వేల ఎకరాల్లో 1,200(2్ఠ600) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్వహిస్తూ, ఏటా రూ.500 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అదే ప్రాంగణంలో మరో 800 మెగావాట్ల కొత్త సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను ఇటీవలే ప్రారంభించింది. 800 మెగావాట్ల మరో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించి థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 2800 మెగావాట్లకు పెంచుకోలని ఈ ఏడాది ప్రారంభంలోనే సంస్థ నిర్ణయం తీసుకుంది. తాజాగా 4000 మెగావాట్లకు థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించడంతో, మరో 1200(2్ఠ600) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను సంస్థ ఏర్పాటు చేయాల్సి ఉండనుంది. 4400 మెగావాట్లకూ పెరిగే అవకాశం.. కొన్నేళ్ల నుంచి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో 600 మెగావాట్ల కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించడం లేదు. దాంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో 1600(2్ఠ800) మెగావాట్ల సామర్థ్యం గల యూనిట్లను సింగరేణి నిర్మించాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే సింగరేణి థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యం 4400 మెగావాట్లకు పెరిగే అవకాశం ఉంది. జెన్కో, ఎన్టీపీసీలకు గట్టి పోటీ.. తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) రాష్ట్రంలో మొత్తం 4042.5 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్వహిస్తుండగా, చివరి దశలో ఉన్న 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తయితే సంస్థ పూర్తి సామర్థ్యం 8042.5 మెగావాట్లకు పెరగనుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘ఎన్టీపీసీ’ రామగుండంలో 2600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్వహిస్తుండగా, చివరి దశలోని 1600(2్ఠ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తయితే సంస్థ సామర్థ్యం 4200 మెగావాట్లకు పెరగనుంది. అదే సమయంలో 4400 మెగావాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యంతో సింగరేణి ఎన్టీపీసీని వెనక్కి నెట్టి రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో ఉండే అవకాశం ఉంది. సౌర విద్యుత్ రంగంలో సైతం.. సింగరేణి సంస్థ భారీగా సౌర విద్యుదుత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 300 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టి, 224 మెగావాట్ల ప్లాంట్ల పనులు పూర్తయి విద్యుదుత్పత్తి జరుగుతోంది. మిగిలిన 76 మెగావాట్ల ప్లాంట్ల పనులు చివరి దశలో ఉన్నాయి. భూపాలపల్లి, మందమర్రి, మణుగూరులో మరో 250 మెగావాట్ల సౌర విద్యత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి సంస్థ సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం 550 మెగావాట్లకు పెంచుకోవాలని నిర్ణయించింది. -
వచ్చే ఐదేళ్లలో రూ.14,130 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని థర్మల్, హైడల్ విద్యుత్ కేంద్రాలపై తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) రానున్న ఐదేళ్లలో రూ.14,130.37 కోట్లు ఖర్చు చేయనుంది. నిర్మాణంలోని కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల పూర్తికి, ఇప్పటికే వినియోగంలో ఉన్న థర్మల్, హైడల్ విద్యుత్ కేంద్రాల నిర్వహణ, మరమ్మతులకు ఈ మేరకు వ్యయం చేయనుంది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి తాజాగా సమర్పించిన 2024–29 పంచవర్ష పెట్టుబడి ప్రణాళికలో ఈ విషయాన్ని జెన్కో వెల్లడించింది. వచ్చే ఐదేళ్లలో మొత్తం 2,83,836.08 మిలియన్ యూనిట్ల (ఎంయూ) థర్మల్ విద్యుత్, 16,112.84 ఎంయూల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు అంచనా వేసింది. జెన్కో ప్రతిపాదనలపై ఈ నెల 15 వరకు సలహాలు, సూచనలను ఈఆర్సీ ఆహా్వనించింది. జూలై 5న ఉదయం 11 గంటలకు రెడ్‌హిల్స్‌లోని తమ కార్యాలయంలో బహిరంగ విచారణ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. అనంతరం జెన్కో సమర్పించిన పెట్టుబడి వ్యయ ప్రణాళికలకు ఆమోదం తెలిపే అంశంపై నిర్ణయం తీసుకోనుంది. ఎఫ్‌జీడీలు తప్పనిసరి థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, మెర్క్యూరీ వంటి విష వాయువుల కట్టడికి ఫ్లూ–గ్యాస్ డిసల్ఫ్యూరిజేషన్ (ఎఫ్‌జీడీ) ప్లాంట్లను తప్పనిసరిగా నిర్మించాలని 2015లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేటీపీఎస్ 5, 6వ దశల యూనిట్లకు రూ.1,231.04 కోట్లు, కేటీపీపీ 1, 2 దశల యూనిట్లకు రూ.1,325.75 కోట్ల అంచనాలతో ఎఫ్‌జీడీ ప్లాంట్లను నిర్మించనున్నట్టు జెన్కో తెలిపింది. కొత్తగా నిర్మించిన కేటీపీఎస్ 7వ దశ, భద్రాద్రి థర్మల్ కేంద్రాలతో పాటు నిర్మాణంలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఎఫ్‌జీడీల ప్లాంట్లను ఏర్పాటు చేసే పనులను ఇప్పటికే బీహెచ్ఈఎల్కు అప్పగించారు. మణుగూరు, పాల్వంచల్లో భారీ టౌన్‌షిప్‌లు మణుగూరు, పాల్వంచ పట్టణాల్లో తమ సిబ్బంది అవసరాలకు ఈపీసీ విధానంలో సమీకృత టౌన్‌షిప్‌లను జెన్కో నిర్మించనుంది. మణుగూరులోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం వద్ద రూ.635.63 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మించనుంది. అందులో బహుళ అంతస్తుల నివాస క్వార్టర్లు, ఆస్పత్రి భవనం, పాఠశాల భవనం, క్లబ్ హౌస్, అతిథి గృహం, ఇండోర్ స్టేడియం, ఆడిటోరియం, స్టోర్స్ కాంప్లెక్స్, సెక్యూరిటీ ఆఫీస్ బిల్డింగ్, స్టోరేజీ షెడ్, రోడ్లు, డ్రెన్లు, ప్రహరీ గోడల వంటి నిర్మాణాలు ఉండనున్నాయి. కొత్తగూడం పాల్వంచలోని కేటీపీఎస్ 7వ దశ థర్మల్ విద్యుత్ కేంద్రం వద్ద రూ.524 కోట్లతో బహుళ అంతస్తుల రెసిడెన్షియల్ క్వార్టర్లను జెన్కో నిర్మించనుంది. -
‘థర్మల్’కు బై.. ‘రెన్యూవబుల్’కు జై!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: నేటి ఆధునిక ప్రపంచంలో విద్యుత్ లేనిదే ఎవరికీ పూట గడిచే పరిస్థితి లేదు. తలసరి విద్యుత్ వినియోగమే రాష్ట్ర, దేశ పురోగతికి సంకేతం. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య తలసరి విద్యుత్ వినియోగం మధ్య వ్యత్యాసం చాలానే ఉంది. పునరుత్పాదక విద్యుత్ (రెన్యూవబుల్ ఎనర్జీ) రావడానికి ముందు థర్మల్, జల, అణు, గ్యాస్ ఇంధనమే ప్రధానమైన విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు. ప్రస్తుతం పవన, సౌర విద్యుత్ కేంద్రాల నిర్మాణం వేగంగా సాగుతోంది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ కోసం రెన్యూవబుల్ ఎనర్జీనే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పుడు థర్మల్ విద్యుత్ కేంద్రాలకే పరిమితమైన ఎన్టీపీసీ సైతం ప్రస్తుతం పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో వేగం పెంచింది. మరోవైపు ప్రైవేటు రంగం పెద్ద ఎత్తున రెన్యూవబుల్ ఎనర్జీ వైపు పరుగులు పెడుతోంది. థర్మల్ కేంద్రాల నిర్మాణంలో ఐదేళ్లుగా ప్రైవేటు రంగం గణనీయంగా పడిపోతూ వస్తోంది. 2023లో ఇప్పటివరకు ఒక్క యూనిట్ కూడా ప్రైవేటు రంగంలో గ్రిడ్‌కు అనుసంధానం కాకపోవడం గమనార్హం. రానురాను కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాలు తలకు మించిన భారమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యుత్ ప్లాంట్ నిర్మాణంలోనే కాదు.. దాని ఉత్పత్తి వ్యయం కూడా ఏటేటా పెరుగుతోంది. బొగ్గు ధరలు, బొగ్గు ఉత్పాదన కేంద్రం నుంచి ప్లాంట్ వరకు రవాణా వ్యయం కూడా పెరగడం వల్ల అంతిమంగా విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థలకు వచ్చేసరికి తడిసి మోపెడవుతోంది. అది కాస్తా వినియోగదారులపై భారం మోపక తప్పని పరిస్థితి. 2030 నాటికి కర్బన ఉద్గారాల తగ్గింపే లక్ష్యమా..? దేశంలో ప్రస్తుతం ఉన్న 2,36,680 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలతో దాదాపు 910 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు విడుదల అవుతున్నాయి. వీటిని గణనీయంగా తగ్గించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. కేంద్ర ఇంధన శాఖలోని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) 2029–30 నాటికి శిలాజ ఇంధనలతో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించడం, సంప్రదాయేతర ఇంధనాలతో విద్యుత్ ఉత్పత్తిని పెంచేలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తద్వారా పర్యావరణ సమతౌల్యతను కాపాడటానికి సంప్రదాయేతర ఇంధన విద్యుత్ ఉత్పాదనను ప్రోత్సహించనున్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న మెగావాట్ ధరలూ ఓ కారణమా..? దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల వ్యయం ఒక మెగావాట్‌కు గడిచిన ఏడేళ్లుగా పెరిగిన తీరు పరిశీలిస్తే... అవి రాబోయే కాలంలో లాభసాటిగా అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. 2015లో ఒక మెగావాట్‌కు రూ. 4.88 కోట్లు, 2016లో రూ. 5.33 కోట్లు, 2019లో రూ. 6.79 కోట్లు, 2023లో రూ. 8.34 కోట్లు చేరినట్లు సీఈఏ గణాంకాలు చెబుతున్నాయి. సౌర విద్యుత్ మెగావాట్ వ్యయం దాదాపు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల మేరకు ఉంటోంది. ఒకప్పుడు సౌర ఫలకాల ధరలు అధికంగా ఉండటంతో యూనిట్ విద్యుత్ రూ.14కు కూడా విద్యుత్ సంస్థలు కొనుగోలు చేశాయి. ఇప్పుడు అదే సౌర విద్యుత్ రూ. 3.50 నుంచి రూ. 4.50 మధ్య అందుబాటులోకి వచ్చింది. 2030 నాటికి... దేశంలో థర్మల్ విద్యుత్ స్థాపిత సామర్థ్యం, సౌర, పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం ప్రకారం 2029–30 నాటికి దేశంలోని అన్ని రకాల విద్యుదుత్పాదన ప్లాంట్ల సామర్థ్యం 5,87,243 మెగావాట్లుగా ఉంటుందని కేంద్రం పేర్కొంది. వాటిలో థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థాపిత సామర్థ్యం 2,66,911 మెగావాట్లకు చేరుకుంటే... సౌర, పవన విద్యుత్‌ల స్థాపిత సామర్థ్యం ఏకంగా 2,25,160 మెగావాట్లకు చేరనున్నట్లు అంచనా వేసింది. వాటితోపాటు జల, బయోమాస్, బ్యాటరీ స్టోరేజ్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజి విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని స్పష్టం చేసింది. తద్వారా కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించాలన్న నిర్ణయం కూడా ఇమిడి ఉంది. కానీ తాజాగా విడుదల చేసిన అంచనా ప్రకారం మొత్తం స్థాపిత సామర్థ్యం 5,87,243 మెగావాట్లుగా ఉండనుంది. -
సంప్రదాయం నుంచి.. స్వచ్ఛత వైపు.. 2029–30 నాటికి లక్ష్యం 64 %
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : రాష్ట్ర, దేశ ప్రగతికి కీలకమైనది విద్యుత్ రంగం. కాగా ఒకప్పుడు బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పాదనకే ప్రాధాన్యత ఎక్కువగా ఉండేది. దశాబ్దన్నర కిందటి వరకు విద్యుత్ ఉత్పత్తి ప్రధానంగా బొగ్గుపైనే ఆధారపడి ఉండేది. కానీ ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి ప్రాధాన్యతలు మారుతున్నాయి. కర్బన ఉద్గారాలు, వాతావరణంలో మార్పులు నేపథ్యంలో విద్యుదుత్పాదన సంప్రదాయ విధానం నుంచి సంప్రదాయేతర విధానం వైపు మారుతోంది. బొగ్గుతో పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం, కర్బన ఉద్గారాల విడుదల విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. కర్బన ఉద్గారాల తగ్గింపునకు కట్టుబడి ఉన్నామని చెబుతున్న భారత్ పుష్కరకాలంగా సంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదనకే మొగ్గు చూపుతోంది. సంప్రదాయేతర విద్యుత్‌కే మొగ్గు దేశంలో ప్రస్తుతం ఉన్న ప్లాంట్లకు మొత్తం 3,79,515 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామ ర్థ్యం ఉంది. వీటిలో బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల సామర్ధ్యం 2,04,435 మెగావాట్లు (49.7%) కాగా, పవన, సౌర విద్యుత్ కేంద్రాల సామర్ధ్యం 1,21,550 మెగావాట్లు (29.5%). అయితే ఈ సౌర, పవన విద్యుత్ కేంద్రాలు గత దశాబ్దన్నర కాలంగా వచ్చినవే కావడం గమనార్హం కాగా.. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) కూడా తన ప్రధాన ఉత్పాదన అయిన థర్మల్ నుంచి సోలార్ వైపు అడుగులేస్తుండటం కీలక పరిణామం. ప్రస్తుతం సంప్రదాయేతర విద్యుదుత్పాదన మొత్తం 42.5 శాతం కాగా, దీనిని 2029–30 నాటికి ఏకంగా 64 శాతానికి తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. థర్మల్ విద్యుత్ కేంద్రాలే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తిని ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి సంప్రదాయ (బొగ్గు, లిగ్నైట్, గ్యాస్, డీజిల్ ఆధారిత) అయితే, మరొకటి సంప్రదాయేతర (జల, పవన, సౌర, బయోమాస్, అణు) విద్యుత్. సంప్రదాయ విద్యుత్‌లో కూడా..దేశంలో బొగ్గు నిల్వలు విస్తారంగా ఉన్న నేపథ్యంలో అత్యధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలే ఉండేవి. గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు అయినా.. వాటికి సరిపడా గ్యాస్ లభ్యత లేని కారణంగా నామమాత్రంగా తయారయ్యాయి. ఇక సంప్రదాయేతర ఇంధనంలో ఒకప్పుడు ప్రధానంగా జల ఆధారిత, స్వల్పంగా బయోమాస్‌తో విద్యుదుత్పాదన జరిగేది. డ్యామ్‌లు, రిజర్వాయర్లు ఉన్నచోట మాత్రమే జల విద్యుత్ ఉత్పత్తి జరిగేది. ఇది కూడా వర్షాలపై ఆధార పడి ఉండడంతో.. రిజర్వాయర్లలో నీటి లభ్యత తక్కువైన సమయంలో విద్యుత్ ఉత్పాదన సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే పవన, సౌర విద్యుత్ తెరపైకి వచ్చాయి. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో సంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదన స్థాపిత సామర్థ్యం గణనీయంగా పెరుగుతోంది. సంప్రదాయ ఇంధనాల కంటే సుస్థిర, పర్యావరణ హితమైన సంప్రదాయేతర ఇంధనాలతో విద్యుత్ ఉత్పత్తి చేయడమే సరైనదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి ఆ దిశగా ముందుకెళ్తున్నాయి. పడిపోతున్న థర్మల్ ఉత్పాదన సామర్థ్యం.. థర్మల్ విద్యుత్ కేంద్రాల విద్యుదుత్పాదన సామర్థ్యంలో తగ్గుదల నమోదు అవుతోంది, ఇందుకు ప్రధాన కారణాల్లో బొగ్గు కొరత ఒకటైతే, స్టేషన్ల బ్యాక్‌డౌన్ (వినియోగం తక్కువగా ఉన్న ప్పుడు లేదా సంప్రదాయేతర ఇంధన విద్యుదుత్పాదన అధికంగా ఉన్నప్పుడు, థర్మల్ కేంద్రాల ఉత్పత్తి నిలిపివేయడం/ తగ్గించడం) మరొకటి. యంత్రాల కాలపరిమితి ముగిసినా అలాగే ఉత్పత్తి చేయడం, బొగ్గులో నాణ్యత లోపించడం వంటి అంశాలతో ఉత్పాదన ఈ సామర్థ్యం తగ్గుతోంది. తాజాగా కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ ప్రకటించిన లెక్కల ప్రకారం 57.69 శాతం విద్యుత్ ప్లాంట్లు మాత్రమే తమ స్థాపిత సామర్థ్యంలో 35 శాతం కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాయని, మిగిలిన 42.31 శాతం విద్యుత్ ప్లాంట్లు 35 శాతం కంటే తక్కువ ఫీఎల్‌ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్)తో నడుస్తున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల, ప్రభుత్వ రంగ సంస్థల్లోని థర్మల్ కేంద్రాలు మాత్రం ఏకంగా 90% పీఎల్‌ఎఫ్‌తో పనిచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వేగంగా.. సంప్రదాయేతర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటులో తెలంగాణ, ఏపీ వేగంగా పురోగతి సాధిస్తున్నాయి. కేంద్ర గణాంకాల ప్రకారం ఏపీలో పవన విద్యుత్ 4,096.95 మెగావాట్లు, సౌర విద్యుత్ 4,390.48 మెగావాట్లు, భారీ జల విద్యుత్ ప్రాజెక్టులు1,610 మెగావాట్లు, బయోమాస్ 566 మెగావాట్లు, స్మాల్హైడ్రో 162 మెగావాట్లుగా ఉంది. కాగా తెలంగాణలో 5748 మెగావాట్ల సౌర విద్యుత్, 128 మెగవాట్ల పవన విద్యుత్ , 287 మెగావాట్ల రూఫ్‌టాప్, 2381.76 మెగావాట్ల జల విద్యుత్ ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పరిశ్రమలదే సింహభాగం.. పారిశ్రామిక రంగ అభివృద్ధి ముఖ్యంగా విద్యుత్ రంగంపైనే ఆధారపడి ఉంది. దేశంలో విద్యుత్ వినియోగంలో సింహభాగం పరిశ్రమల రంగానిదే. అయితే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో పారిశ్రామిక విద్యుత్ వినియోగం తక్కువే. అధికార గణాంకాల ప్రకారం ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో పరిశ్రమల రంగానికి 41.36%, గృహావసరాలకు 26.89% , వ్యవసాయానికి 17.99 శాతం, వాణిజ్య అవసరాలకు 7.07% వినియోగిస్తున్నట్లు కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తలసరి విద్యుత్ వినియోగం దాదాపు 1,255 యూనిట్లుగా ఉంది. -
సింగరేణిలో తొలి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ప్రారంభం
జైపూర్ (చెన్నూర్)/ సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ (ఎస్టీపీపీ) కేంద్రానికి సంబంధించిన జలాశయంపై ఏర్పాటు చేసిన 5 మెగావాట్ల నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను శనివారం ప్రారంభించారు. సింగరేణి సంస్థ డైరెక్టర్ డి.సత్యనారాయణరావు ఈ ప్లాంట్‌ను ప్రారంభించి తెలంగాణ ట్రాన్స్‌కో గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. దీంతో సింగరేణి సంస్థ సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 224 మెగావాట్లకు చేరింది. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఉద్యోగులు, అధికారులను అభినందించారు. ఇక్కడే ఏర్పాటు చేస్తున్న మరో 10 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్‌ను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, 3 దశల్లో మొత్తం 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కు సింగరేణి సంస్థ మూడేళ్ల కార్యాచరణ ప్రారంభించింది. మొదటి రెండు దశల్లో 219 మెగావాట్ల సామర్థ్యం గల 8 ప్లాంట్లను మణుగూరు, కొత్తగూడెం, ఇల్లందు, రామగుండం–3, మందమర్రి ఏరియాల్లో నిర్మించింది. వీటి ద్వారా 540 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా, సంస్థ విద్యుత్ ఖర్చుల్లో రూ.300 కోట్లను సింగరేణి సంస్థ ఆదా చేసింది. మూడో దశ కింద 81 ప్లాంట్ల నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయింది. దీనిలో భాగంగా మొత్తం 15 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లను సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రాంగణంలోని రెండు జలాశయాలపై నిర్మించే బాధ్యతలను నోవస్ గ్రీన్ ఎనర్జీ సిస్ట మ్స్ సంస్థకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ సీటీసీ సంజయ్‌కుమార్, జీఎం డీవీఎస్ఎన్ సూర్యనారాయణ రాజు, జీఎం (సోలార్) జానకి రాం, ఎస్వోటు డైరెక్టర్ సూర్యకు మార్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శేషారావు, జీఎం పీసీఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఏజీఎం సత్యనారాయణప్రసాద్, సీఎంవో ఏఐ కేంద్ర ఉపాధ్యక్షుడు సముద్రాల శ్రీనివాస్, టీబీజీ కేఎస్ ఉపా«ధ్యక్షుడు చుక్కల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వచ్చేస్తోంది ‘పాతాళ విద్యుత్’.. ఎండుగడ్డితోనూ ఇంధనం
భూమికి 20 కిలోమీటర్ల అడుగున ఉద్భవించే ఉష్ణానికి రాళ్లు కూడా కరిగిపోతాయి. అక్కడ జనించే వేడిని శక్తివంతమైన తరంగాల ద్వారా బయటకు తెచ్చి విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చంటున్నారు అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు. ఇప్పటికే ప్రయోగాలను పూర్తి చేసిన ఆ శాస్త్రవేత్తలు వచ్చే ఏడాది నుంచి ‘పాతాళ విద్యుత్’ ఉత్పత్తి చేసేందుకు వేగంగా ముందుకెళ్తున్నారు. మరోవైపు టర్కీలో రోడ్లపై వచ్చీపోయే వాహనాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. ఇస్తాంబుల్ నగరంలో వీధి లైట్లను వెలిగిస్తున్నారు. మన దేశంలోని పంజాబ్‌లో గడ్డి, ఇతర పంట వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. భారత్, అమెరికా, టర్కీ దేశాల్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఉత్పత్తి కోసం కొత్త ప్రయోగాలపై ఓ లుక్కేద్దాం పదండి. సాక్షి, అమరావతి: జల విద్యుత్.. థర్మల్ విద్యుత్.. పవన విద్యుత్.. సౌర విద్యుత్.. హైడ్రోజన్ విద్యుత్.. అణు విద్యుత్.. ప్రపంచం మొత్తం మీద విద్యుత్ ఉత్పత్తి కోసం ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాలివి. వీటికి తోడు కొత్త రకం విద్యుత్ ఉత్పత్తి విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూనే.. పరిమిత వనరులను వినియోగించుకుని.. అధిక ఫలితాలను సాధించే దిశగా చేస్తున్న ప్రయోగాలు ఫలిస్తున్నాయి. భూమి పొరల మధ్య వేడిని ఒడిసిపట్టి.. ఉపరితలం నుంచి భూమి లోపలికి 20 కిలోమీటర్ల మేర రంధ్రం చేసి.. అక్కడ ఉండే అపరిమిత వేడిని బయటకు తీసుకువచ్చి నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేయడమే జియో థర్మల్ విద్యుత్ విధానం. భూమి పొరల్లోకి అంత లోతున రంధ్రం చేస్తే అక్కడ ఉష్ణోగ్రత దాదాపు 500 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. అంత వేడికి రాళ్లు కూడా కరిగిపోతాయంటారు. అంత వేడిని తట్టుకుని పనిచేసే డ్రిల్స్ ప్రపంచంలో ఎక్కడా అందుబాటులో లేవు. అందుకే డ్రిల్స్ స్థానంలో శక్తిమంతమైన తరంగాలను వాడాలని నిర్ణయించారు. అక్కడి నుంచి ఉష్ణాన్ని పైకి రప్పించి.. భూమి ఉపరితలంపై ప్రత్యేక ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. చీకటైతే సోలార్ పవర్ ఉండదు. నదులు ఎండిపోతే జలవిద్యుత్ ఉండదు. బొగ్గు లేకపోతే థర్మల్ ఉత్పత్తి జరగదు. కానీ, ఇవేమీ లేకపోయినా జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ఆగదు. ఈ ప్రాజెక్టుకు ఎక్కువ స్థలం కూడా అవసరం ఉండదు. కాబట్టి అడవులు, ప్రకృతి వనరులను ధ్వంసం చేయాల్సిన అవసరం రాదు. భూమిపై ఎక్కడైనా.. సమయంలోనైనా కరెంటును ఉత్పత్తి చేయొచ్చు. ఈ టెక్నాలజీపై అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని ప్రయోగశాలలో పరీక్షలు కూడా పూర్తి చేశారు. 2024 నాటికి జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలనుకుంటున్నారు. ట్రాఫిక్ నుంచీ విద్యుత్ ఉత్పత్తి టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో ట్రాఫిక్‌తో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. రోడ్ల మధ్యలోని డివైడర్ దగ్గర ప్రత్యేక పరికరాన్ని ఉంచుతున్నారు. ఆ పరికరంపై సోలార్ పవర్ ప్లేట్ అమర్చుతున్నారు. వాహనాలు వెదజల్లే వేడి ద్వారా ఆ సోలార్ ప్లేట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అదే పరికరానికి ఫ్యాన్ రెక్కల లాంటి వంపు తిరిగిన మూడు రెక్కలు అమర్చి, వాటికి టర్బైన్స్ పెడుతున్నారు. ఏదైనా వాహనం రోడ్డుపై వేగంగా వెళ్లినప్పుడు వచ్చే అధిక గాలి తగలగానే ఆ రెక్కలు గుండ్రంగా తిరుగుతున్నాయి. వాటికి సెట్ చేసిన టర్బైన్ కూడా తిరుగుతుంది. దాంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇలా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌తో వీధి లైట్లను వెలిగిస్తున్నారు. మిగిలిన కరెంటును ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారు. ఈ పరికరాల్లో వాతావరణాన్ని పరిశీలించే సెన్సార్లు కూడా ఉన్నాయి. ఇవి భూకంపాల్ని కూడా గుర్తిస్తాయట. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయి ఎంత ఉందో కూడా కనిపెడతాయట. వ్యవసాయ వ్యర్థాలతో విద్యుత్ మన దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో పంట వ్యర్థాలను విద్యుత్ ఉత్పత్తికి ఇంధనంలా వినియోగిస్తున్నారు. ఇన్నాళ్లూ ఇక్కడి రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టేవారు. దీనివల్ల ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కాలుష్య సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో ఆ వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల కాలుష్య సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు రైతులకు ప్రయోజనం చేకూరుతోంది. ముందుగా పంట వ్యర్థాలను పొగ రాకుండా మండించి బాయిలర్ నుంచి ఉత్పత్తి అయ్యే నీటి ఆవిరి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ విద్యుత్‌తో పంజాబ్‌లో పరిశ్రమలను నడిపిస్తున్నారు. -
రాత్రిపూటా సౌర విద్యుత్!
థర్మల్ విద్యుత్‌తో కాలుష్యం.. జల విద్యుత్ నిరంతరం అందుబాటులో ఉండదు.. ప్రత్యామ్నాయంగాసౌర విద్యుత్ ఉన్నా.. సోలార్ ప్యానెల్స్‌తో పగటి పూట మాత్రమే కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ సమస్యకు చెక్‌పెట్టేలా.. పగలూరాత్రీ కూడా విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. రెండు సాంకేతికతలను కలిపి.. సాధారణంగా సౌర ఫలకాలు సూర్యరశ్మిని గ్రహించి విద్యుత్‌గా మార్చుతాయి. దీనిని ఫొటో వోల్టాయిక్ టెక్నాలజీ అంటారు. మరోవైపు కొన్నిరకాల పదార్థాలు తాము గ్రహించిన వేడిని తిరిగి వదిలేసే సమయంలో శక్తిని ఉత్పత్తి చేయగలుగుతాయి. దీనిని థర్మోరేడియేటివ్ ప్రాసెస్ అంటారు. సాధారణ ఫొటో వోల్టాయిక్ పదార్థాలతో థర్మోరేడియేటివ్ మెటీరియల్‌ను కలిపి.. సోలార్ ప్యానెల్స్‌ను తయారు చేస్తే.. సూర్యరశ్మి తగ్గిన సమయంలో, రాత్రి పూట కూడా విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలవని ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ఫోబి పియర్స్ తెలిపారు. నైట్ విజన్ గాగుల్స్ తరహాలో.. సైన్యం, రక్షణ విభాగాల సిబ్బంది రాత్రిపూట కూడా చూడగలిగే ఇన్ఫ్రారెడ్ (పరారుణ) నైట్ విజన్ గాగుల్స్‌ను, ఇతర పరికరాలను వినియోగిస్తుంటారు. స్వల్పస్థాయి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్‌కు కూడా స్పందించే ‘మెర్క్యురీ కాడ్మియం టెల్లూరైడ్ (ఎంసీటీ)’ మెటీరియల్ వాటిలో ఉంటుంది. ఏదైనా సరే.. వేడిగా ఉన్న వస్తువు, పదార్థం నుంచి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వెలువ డుతూ ఉంటుంది. ఇదే తరహాలో చీకట్లో కూడా మనుషులు, జంతువులు, ఎలక్ట్రిక్, మెకానికల్ పరికరాల నుంచి వెలువడే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్‌ను నైట్ విజన్ పరికరాలతో గుర్తిస్తారు. ►తాజాగా శాస్త్రవేత్తలు ఈ పదార్థాన్నే ఫొటో వోల్టాయిక్ సెల్స్‌తో అనుసంధానించి సోలార్ ప్యానెల్‌ను రూపొందించారు. దీనిని ఇటీవలే ప్రయోగాత్మకంగా పరిశీలించామని.. అయితే స్వల్పస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అయిందని శాస్త్రవేత్త ఫోబి పియర్స్ వెల్లడించారు. ఈ విధానంలో విద్యుత్ ఉత్పత్తి చేయగలమన్నది స్పష్టమైందని.. దీనిని మెరుగుపర్చి సాధారణ వినియోగానికి తగినట్టుగా సిద్ధం చేయడం అసలు లక్ష్యమని తెలిపారు. ఈ సాంకేతికతతో కేవలం సోలార్ ప్యానెల్స్‌తో మాత్రమేకాకుండా.. వేడి వెలువడే ఏ చోట అయినా విద్యుత్ ఉత్పత్తికి వీలవుతుందని పేర్కొన్నారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
కరెంటుకు కటకట
న్యూఢిల్లీ: మండే ఎండలతో ఓవైపు అల్లాడుతున్న జనానికి కరెంటు కోతలు చుక్కలు చూపిస్తున్నాయి. ఢిల్లీ, రాజస్తాన్, పంజాబ్, యూపీ సహా 16కి పైగా రాష్ట్రాల్లో డిమాండ్ పీక్స్‌కు చేరింది. సరిపడా కరెంటు పంపిణీ చేయలేకపోవడంతో గంటల తరబడి కోతలు కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకోవడంతో దేశవ్యాప్తంగా కరెంటు వాడకం భారీగా పెరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 2:50 గంటలకు దేశ చరిత్రలోనే అత్యధికంగా 207.11 గిగావాట్లకు చేరిందని కేంద్ర విద్యుత్ శాఖ ట్వీట్ చేసింది. కేంద్రం చేతగానితనమే విద్యుత్ సంక్షోభానికి కారణమంటూ కాంగ్రెస్ నేత రాహుల్ మరోసారి దుయ్యబట్టారు. ‘‘మోదీ జీ! దేశమన్నా, ప్రజలన్నా మీకు అస్సలు పట్టదా?’’ అంటూ నిలదీశారు. ఇకనైనా విద్వేషపు బుల్డోజర్లను ఆపి విద్యుత్కేంద్రాలను నిరంతరాయంగా నడపడంపై దృష్టి పెట్టాలన్నారు. ఢిల్లీలో ఒక్క రోజు బొగ్గు నిల్వలే థర్మల్ విద్యుత్‌పైనే అత్యధికంగా ఆధారపడ్డ నేపథ్యంలో విద్యుత్కేంద్రాలకు బొగ్గు సకాలంలో అందక సంక్షోభం ముంచుకొచ్చింది. ఢిల్లీలో ఒక్క రోజుకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలున్నాయి. బొగ్గు అందకుంటే ఆస్పత్రులకు, మెట్రోకు కరెంటివ్వలేమని కేజ్రివాల్ ప్రభుత్వం పేర్కొంది. ‘‘ఇప్పటిదాకా ఎలాగోలా సర్దుబాటు చేశాం. పరిస్థితులు చెయ్యి దాటుతున్నాయి’’ అంటూ కేజ్రివాల్ ట్వీట్ చేశారు. విద్యుత్కేంద్రాలకు బొగ్గు పంపిణీకి వీలుగా 657 పాసింజర్ రైళ్లను కేంద్రం నిరవధికంగా రద్దు చేసింది. వాటికి బదులు యుద్ధప్రాతిపదికన బొగ్గు వాగన్లను రవాణా చేస్తామని రైల్వే శాఖ పేర్కొంది. 165 థర్మల్ విద్యుత్కేంద్రాలకు గాను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రోజువారీ బొగ్గు నిల్వల నివేదిక ప్రకారం 56 కేంద్రాల్లో 10% బొగ్గు నిల్వలే ఉన్నాయి. 26 కేంద్రాల్లోనైతే 5% కంటే తక్కువకు పడిపోయాయి. బొగ్గు నిల్వలు 21 రోజులకు సరిపడా లేకుంటే నిరంతరాయ విద్యుత్ పంపిణీ వీలు పడదు. కేంద్రం వర్సెస్ కేజ్రివాల్ ఢిల్లీలో డిమాండ్ రోజుకు 6 వేల మెగావాట్లకు పెరగడంతో పంపిణీ కష్టంగా మారింది. బొగ్గు నిల్వలు ఒక్క రోజుకు సరిపడా మాత్రమే ఉన్నాయని ఢిల్లీ ప్రభుత్వం చెప్పగా, అదేమీ లేదంటూ ఎన్టీపీసీ ట్వీట్ చేసింది. ‘‘ఢిల్లీకి కరెంటు సరఫరా చేసే ఉంచహార్, దాద్రి విద్యుత్కేంద్రాలు 100% సామర్థ్యంతో పని చేస్తున్నాయి. బొగ్గు పంపిణీ సక్రమంగానే జరుగుతోంది. దాద్రిలో 1.4 లక్షల మెట్రిక్ టన్నులు, ఉంచహార్లోని ఐదు యూనిట్లలో 95 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి’’ అని చెప్పింది. -
‘వెదురు’తో విద్యుత్! 50 ఏళ్లపాటు ఎకరాకు రూ.2 లక్షల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: అసలే కొన్నేళ్లుగా తీవ్రంగా బొగ్గు కొరత.. ధరలు కూడా చుక్కలను తాకుతూ విద్యుదుత్పత్తి వ్యయం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గుతోపాటు వెదురునూ కలిపి విద్యుదుత్పత్తి చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ఉద్యానశాఖ వినూత్న ప్రతిపాదనలను తెర పైకి తెచ్చింది. వెదురును నేరుగా కాకుండా పెల్లెట్ల రూపంలోకి మార్చి వినియోగిస్తారు. ఇప్పటికే చైనా, జర్మనీ, బ్రిటన్, అమెరికా సహా పలు దేశాల్లో వెదురు, బయోమాస్ పెల్లెట్లను థర్మల్ కేంద్రాల్లో ఇంధనంగా వినియోగిస్తున్నారు. మన దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలోనే దీనిని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో తొలి రెండేళ్లపాటు 5శాతం, ఆ తర్వాత 7 శాతం బయోమాస్ పెల్లెట్లను బొగ్గుతో కలిసి ఇంధనంగా వినియోగించాలని కేంద్రం ఇటీవలే అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో వెదురుతో పెల్లెట్లను రూపొందించి థర్మల్ కేంద్రాల్లో వినియోగించేందుకు ఉద్యానశాఖ రంగం సిద్ధం చేసింది. పైలెట్ ప్రాజెక్టు కింద భైంసా వద్ద 15 ఎకరాల్లో వెదురుసాగును చేపట్టింది. వెదురును పెల్లెట్స్‌గా మార్చే యంత్రాలనూ సిద్ధం చేసింది. కొంతమేర పెల్లెట్స్‌ను తయారుచేసి ఎన్టీపీసీకి పరిశీలన నిమిత్తం పంపించింది. మొత్తంగా రాష్ట్రంలో 2.80 లక్షల ఎకరాల్లో వెదురు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. 67 లక్షల టన్నుల పెల్లెట్స్ అవసరం.. రాష్ట్రంలో 8,703 మెగావాట్ల ఐదు జెన్కో ప్లాంట్లు, 1,200 మెగావాట్ల సింగరేణి ప్లాంట్, ఎన్టీపీసీకి చెందిన 4,200 మెగావాట్ల ప్లాంట్లు కలిపి మొత్తం 14,102 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి 870 కిలోల బొగ్గును వినియోగిస్తారు. కేంద్రం నిర్దేశించినట్టుగా ఏడు శాతం బయోమాస్ పెల్లెట్లు వినియోగించాలంటే.. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తికి 67 లక్షల టన్నుల పెల్లెట్లు అవసరమని ఉద్యానశాఖ వర్గాలు తెలిపాయి. ఎకరానికి 30 టన్నుల వెదురు వస్తే.. దాని నుంచి 20 టన్నుల పెల్లెట్స్ వస్తాయని వెల్లడించాయి. ఎకరాకు రూ. 2 లక్షల ఆదాయం రాష్ట్రంలో సాధారణ వెదురు కాకుండా భీమా రకం వెదురుతో పెల్లెట్స్ తయారు చేయాలని నిర్ణయించారు. ఈ రకం వెదురు ఎలాంటి నేలల్లోనైనా, సరిగా నీళ్లు లేకున్నా పెరుగుతుందని.. దానిని రెండేళ్లలోనే నరికి పెల్లెట్స్ తయారు చేయవచ్చని ఉద్యానశాఖ వర్గాలు చెప్తున్నాయి. చేలల్లో, గట్లమీద, బీడు భూముల్లో ఎక్కడైనా వేయొచ్చని అంటున్నాయి. మొదట్లో ఎకరాకు రూ.50 వేలు ఖర్చు చేసి నాటితే.. తర్వాత దాదాపు 50 ఏళ్లపాటు ఏటా ఆదాయం వస్తుందని అంటున్నాయి. వేసిన రెండేళ్ల నుంచే ఏటా ఎకరాకు రూ.2 లక్షల ఆదాయం సమకూరుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం హరితహారం కింద కోట్ల మొక్కలు నాటుతున్నారని.. ఆ స్థానంలో వెదురు వేస్తే అన్నివిధాలా ఉపయోగమని అంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని చెప్తున్నారు. భవిష్యత్తులో మరింత డిమాండ్.. ప్రస్తుతం ఏడు శాతం పెల్లెట్స్‌ను బొగ్గుతో కలిపి వినియోగించాలని కేంద్రం ఆదేశించినా.. 2030 నాటికి 20 శాతం కలపాలన్నది లక్ష్యమని అధికారులు చెప్తున్నారు. అంటే భవిష్యత్తులో వీటికి డిమాండ్ మరింతగా పెరుగుతుందని అంటున్నారు. పైగా వెదురు పెల్లెట్స్‌తో విద్యుత్ ధర కాస్త తగ్గుతుందని, కాలుష్యాన్నీ కొంత నివారించవచ్చని పేర్కొంటున్నారు. వెదురు చెట్లతో సాధారణ చెట్ల కంటే 33 శాతం మేర ఎక్కువ ఆక్సిజన్ వస్తుందని చెప్తున్నారు. రైతులకు అదనపు ఆదాయం దేశంలోనే మొదటిసారిగా వెదురు పెల్లెట్స్ పైలెట్ ప్రాజెక్టును చేపట్టాం. ఇప్పటికే పెల్లెట్స్‌ను తయారుచేసి ఎన్టీపీసీ పరిశీలనకు పంపాం. వెదురు సాగుతో రైతుకు నిర్వహణ భారం లేకుండా ఏటా ఎకరానికి రూ. 2 లక్షల దాకా అదనపు ఆదాయం సమకూరుతుంది. రాష్ట్రంలో భవిష్యత్తులో ఒకవైపు ఆయిల్‌పాం, మరోవైపు వెదురు సాగు చేపట్టేలా ప్రోత్సహిస్తాం. – వెంకట్రామ్రెడ్డి, ఉద్యానశాఖ సంచాలకుడు ఏమిటీ పెల్లెట్లు? వృక్ష, జంతు పదార్థాలనే బయో మాస్‌గా పరిగణిస్తారు. జంతువుల అవశేషాలు, చెట్లు, మొక్కల భాగాలు, పంట వ్యర్థాలు వంటివాటిని ఒక్కచోట చేర్చి ఎండబెడతారు. వాటన్నిం టిని పొడిచేసి.. మండే రసాయనాలు కలుపుతారు. తర్వాత అత్యంత వేడి, ఒత్తిడిని కలిగించే యంత్రాల సాయంతో స్థూపాకార (చిన్న గొట్టం వంటి) గుళికలుగా రూపొందిస్తారు. వాటినే బయోమాస్ పెల్లెట్స్ అంటారు. రకరకాల వ్యర్థాలతో రూపొందిన బయోమాస్ పెల్లెట్లను వివిధ ఇంధనాలుగా వినియోగించవచ్చు. అయితే రాష్ట్రంలో పూర్తి వెదురుతో పెల్లెట్లను తయారు చేయాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది. -
దివాలా ముంగిట్లో రఘురామ కంపెనీ
సాక్షి, అమరావతి: బ్యాంకులకు రూ.వెయ్యి కోట్లకుపైగా రుణం ఎగవేత కేసులో ఎంపీ రఘురామ కృష్ణరాజుకు చెందిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ కంపెనీ దివాలా ముంగిట నిలిచింది. ఆస్తులను విక్రయించో, కంపెనీని ఏకమొత్తంగా విక్రయించో రుణదాతల అప్పులు తీర్చడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు దివాలా పరిష్కార నిపుణుడిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇండ్ భారత్ థర్మల్ పవర్ దివాలా ప్రక్రియకు అనుమతిస్తూ హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ బెంచ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దివాలా పరిష్కార నిపుణుడిగా శ్రీకాకుళం వంశీకృష్ణను ని యమించడమే కాకుండా ప్రక్రియకు సంబంధించి న వివరాలను తెలియచేసే ఫారం–2ను మూడు రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించింది. థర్మల్ కేంద్రం పేరుతో... బొగ్గు ఆధారిత విద్యుత్ తయారీ కేంద్రం ఏర్పాటు పేరుతో ఇండ్ భారత్ థర్మల్ పవర్ వివిధ బ్యాంకుల నుంచి రూ.1,383.07 కోట్ల రుణాలను తీసుకొని చెల్లించకుండా ఎగవేసింది. ఈ రుణాలకు తనఖా రూపంలో చూపించిన ఆస్తులు కేవలం రూ.872 కోట్లు మాత్రమే కావడంతో ఈ మొత్తాన్ని నిరర్థక ఆస్తులుగా ప్రకటించిన బ్యాంకులు తనఖా ఆస్తుల స్వాధీన ప్రక్రియను ప్రారంభించాయి. రూ.327 కోట్ల రుణాలను ఇచ్చిన బ్యాంకుల కన్సార్షియంలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్.. ఇండ్ భారత్‌ను దివాలా సంస్థగా ప్రకటించాలంటూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ వివాదం న్యూఢిల్లీలోని డెట్ రికవరీ ట్రిబ్యునల్‌లో ఉన్నందున ఈ పిటిషన్‌ను కొట్టివేయాలన్న ఇండ్ భారత్ వాదనను న్యాయమూర్తి తిరస్కరించారు. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్–2016 సెక్షన్ 13 కింద పంజాబ్ నేషనల్ బ్యాంక్ దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దివాలా ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో తెలియచేసే ఫారం–2ను మూడు రోజుల్లోగా దాఖలు చేయాల్సిందిగా స్పష్టం చేశారు. రుణం ఎగ్గొట్టిన సంస్థపై సీఐఆర్‌పీ కింద తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలుగా ఈ ఉత్తర్వుల కాపీలను హైదరాబాద్‌లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు అందించాలని రిజిస్ట్రీని ట్రిబ్యునల్ ఆదేశించింది. దీంతో ఇండ్ భారత్ తనఖా పెట్టిన ఆస్తులు బ్యాంకుల పరం కానున్నాయి. -
రాష్ట్రంలో పెరిగిన బొగ్గు నిల్వలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు మెరుగుపడ్డాయి. దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో 52,800 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉంది. ఇది నాలుగు రోజుల ఉత్పత్తికి సరిపోతుంది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో ఉన్న 35,300 మెట్రిక్ టన్నుల బొగ్గు ఒక రోజుకే సరిపోతున్నప్పటికీ.. రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్లో 76 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉండటంతో ఇక్కడ ఐదు రోజులపాటు విద్యుత్ ఉత్పత్తి ఆటంకం లేకుండా జరపవచ్చు. ప్రతిరోజూ దాదాపు 22 ర్యాకుల బొగ్గు రాష్ట్రానికి వస్తుండగా.. మరికొంత నిల్వలు జత చేరుతుండటంతో రాష్ట్రంలో ప్రస్తుతానికి బొగ్గు కొరత చాలావరకూ తగ్గినట్టేనని ఏపీ జెన్కో అధికారులు చెబుతున్నారు. విదేశాల నుంచి, ఇతర మార్గాల్లో భవిష్యత్ అవసరాల కోసం దాదాపు 10 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలను సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నామని, త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామని వెల్లడించారు. ఏపీ జెన్కో భాగస్వామ్యం 36 శాతం 2020–21 ఆర్థిక సంవత్సరంలో గ్రిడ్ వినియోగం 62,080 మిలియన్ యూనిట్లు. అంటే రోజుకి సగటున 170 మిలియన్ యూనిట్లు. ఇందులో ఏపీ జెన్కో 35 శాతం విద్యుత్‌ను అందించింది. ప్రస్తుత 2021–22 ఆర్థిక సంవత్సరంలో 71,252 మిలియన్ యూనిట్ల గ్రిడ్ డిమాండ్ ఉంటుందని ఇంధన శాఖ అంచనా వేసింది. ఇది రోజువారీగా చూస్తే సగటున 195 మిలియన్ యూనిట్లు. ఇందులో గత సెప్టెంబర్ వరకూ ఏపీ జెన్కో 90 మిలియన్ యూనిట్లు (46 శాతం) సమకూర్చేది. తరువాత బొగ్గు కొరత ఏర్పడి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఇబ్బందులు తలెత్తడంతో జెన్కో భాగస్వామ్యం తగ్గింది. ప్రస్తుతం 36 శాతం విద్యుత్‌ను రాష్ట్ర అవసరాలకు ఏపీ జెన్కో అందించగలుగుతోందని ఇంధన శాఖ వర్గాలు వెల్లడించాయి. దేశంలోనూ మెరుగుపడుతోంది బొగ్గు కొరత కారణంగా దేశవ్యాప్తంగా మూతపడ్డ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. విద్యుత్ ఉత్పతి రంగాలకు మినహా ఇతర అవసరాలకు ఇప్పటికే బొగ్గు సరఫరా నిలిపివేసిన కేంద్రం, పరిస్థితి పూర్తిగా మెరుగుపడకపోవడంతో ఇంకా సరఫరా పునరుద్ధరించలేదు. మరోవైపు కోల్ ఇండియా లిమిడెడ్ ఆధ్వర్యంలోనే దేశవ్యాప్తంగా బొగ్గు సరఫరా మొదలుపెట్టడంతో పాటు విద్యుత్, బొగ్గు, రైల్వే శాఖల కేంద్ర మంత్రులు స్వయంగా ప్రతిరోజూ థర్మల్ కేంద్రాలకు బొగ్గు కేటాయింపులు జరుపుతున్నారు. మొత్తం 135 థర్మల్ కేంద్రాల్లో 93 కేంద్రాలు బొగ్గు కొరత ఎదుర్కొంటున్నాయి. వీటిలో 14 కేంద్రాల్లో ఒక రోజు, 23 కేంద్రాల్లో రెండు రోజులు, 15 కేంద్రాల్లో 3 రోజులు, 16 కేంద్రాల్లో 4 రోజులు, 12 కేంద్రాల్లో 5 రోజులు, 12 కేంద్రాల్లో 6 రోజులు, ఒక కేంద్రంలో 7 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి. 8 కేంద్రాలు ఇప్పటికీ మూతపడే ఉన్నాయి. అన్ని కేంద్రాలకు ఎంతోకొంత బొగ్గు అందించేలా కేంద్ర విద్యుత్, బొగ్గు, రైల్వే శాఖ మంత్రులు నేరుగా పంపకాలు చేపడుతున్నట్టు ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు. సొంత బొగ్గు గనులున్న 16 కేంద్రాల్లో ప్రస్తుతానికి 6 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. వీటినుంచే ఇతర కేంద్రాలకు సర్దుబాటు చేస్తుండటంతో ఎక్కడా ఆరేడు రోజులకు మించి నిల్వలు ఉండటం లేదు. గతంలో కనీసం 15 రోజులకు సరిపడా బొగ్గు దిగుమతి చేసుకుని నిల్వ ఉంచే థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ప్రస్తుతం ఆ అవకాశాన్ని కేంద్రం ఇవ్వడం లేదు. ఏడు రోజులకు మించి ఎక్కడైనా నిల్వలు ఉంటే వాటిని ఇతర ప్లాంట్లకు మంత్రుల సూచనలతో అధికారులు తరలిస్తున్నారు. -
Andhra Pradesh: ఫుల్‌గా ‘పవర్’
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గు కొరత నేపథ్యంలో రాష్ట్రానికి కావాల్సిన విద్యుత్‌ను సమీకరించుకోవాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో కరెంట్ పరిస్థితులతో పాటు బొగ్గు సరఫరా, విద్యుత్ కొరత రాకుండా అమలు చేస్తున్న అత్యవసర ప్రణాళికలు, దీర్ఘకాలిక వ్యూహాలపై సీఎం సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, జెన్కో ఎండీ శ్రీధర్ సహా పలువురు అధికారులతో దీనికి హాజరయ్యారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. సింగరేణి సహా కోల్ ఇండియా తదితర సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. బొగ్గు తెప్పించేందుకు సరుకు రవాణా ఓడల వినియోగం లాంటి ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచన చేయాలని, దీనివల్ల రవాణా ఖర్చులు కలసి వస్తాయన్నారు. అవసరమైతే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాలని సూచించారు. దీనికోసం సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవాలన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా.. తాత్కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక విద్యుదుత్పత్తి వ్యూహాలపైనా దృష్టి సారించాలని సీఎం జగన్ ఆదేశించారు. 6,300 మెగావాట్ల రివర్స్ పంపింగ్ విద్యుదుత్పత్తి ప్రాజెక్టు నిర్మాణంపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టి వేగంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని, ఇలాంటి ప్రాజెక్టుల వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని సీఎం పేర్కొన్నారు. సీలేరులో ప్రతిపాదిత 1,350 మెగావాట్ల రివర్స్ పంపింగ్ ప్రాజెక్టుపైనా దృష్టిపెట్టాలన్నారు. ఈ ప్రాజెక్టులు సాకారమయ్యేలా వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. నాన్ పీక్ అవర్స్‌లో నీటిని వెనక్కి పంపేందుకు (రివర్స్ పంపింగ్) సౌర విద్యుత్ వాడుకుని అనంతరం ఆ నీటినే వినియోగించి విద్యుదుత్పత్తి చేసే ప్రతిపాదిత ప్రాజెక్టు తొలిదశలో 6,300 మెగావాట్ల ఉత్పత్తికి డీపీఆర్‌లు ఇప్పటికే తయారయ్యాయి. సోలార్‌తో రివర్స్ పంపింగ్‌కు యూనిట్ రూ.2.49 దాకా ఖర్చు కానుంది. అనంతరం డిమాండ్, అవసరాన్ని బట్టి పీక్ అవర్స్‌లో అదే నీటితో జలవిద్యుదుత్పత్తి చేస్తారు. దీనికి రూ.3 వరకు వ్యయం అవుతుంది. దీన్ని పీకింగ్ ప్లాంట్ అని వ్యవహరిస్తారు. పీక్ అవర్స్‌లో డిమాండ్ అధికంగా ఉండటంతో విద్యుత్తు కొనుగోలుకు యూనిట్‌కు రూ.10 నుంచి రూ.12 వరకు వెచ్చించాల్సి వస్తోంది. అలాంటి పరిస్థితి లేకుండా రివర్స్ పంపింగ్ వల్ల అవసరాన్ని బట్టి చౌకగా విద్యుదుత్పత్తి చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. అవాంతరాలు లేకుండా సరఫరా రాష్ట్రంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా చేస్తున్నామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుంటూ తగిన చర్యలతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి 2 ర్యాక్‌ల బొగ్గు అదనంగా వచ్చిందని, రాష్ట్రంలో జెన్కో ఆధ్వర్యంలో థర్మల్ విద్యుదుత్పత్తిని 50 మిలియన్ యూనిట్ల నుంచి 69 మిలియన్ యూనిట్లకు పెంచామని అధికారులు తెలిపారు. పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ నుంచి 170 మెగావాట్ల విద్యుత్ కూడా అందుబాటులోకి వస్తోందని చెప్పారు. -
బొగ్గు కొరతపై కేంద్ర హోంమత్రి అమిత్ షా సమీక్ష
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరతపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. బొగ్గు సరఫరా సరిపోని కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ కొరత ఏర్పడుతుందని అనేక రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బొగ్గు, విద్యుత్ మంత్రిత్వ శాఖల ఇన్ఛార్జిగా ఉన్న మంత్రివర్గ సహచరులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి సీనియర్ బ్యూరోక్రాట్లతో పాటు ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ లిమిటెడ్ అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో దేశంలోని విద్యుత్ ఉత్పత్తికి తీసుకోవాల్సిన చర్యలు, బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. చదవండి: ‘ఈతరం స్త్రీ పిల్లల్ని కనాలనుకోవడం లేదు’ కాగా దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు ఇతర నగరాల్లో తక్షణం ఏర్పడే విద్యుత్ అంతరాయం భయాలను తొలగించడానికి విద్యుత్ ప్లాంట్ల డిమాండ్‌ను తీర్చడానికి తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే విద్యుత్ అంతరాయాల గురించి అనేక రాష్ట్రాలు కేంద్రాన్ని హెచ్చరిస్తున్నాయి. దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో ప్రస్తుత ఇంధన నిల్వ దాదాపు 7.2 మిలియన్ టన్నులు ఉందని, నాలుగు రోజులకు సరిపోతాయని బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ యాజమాన్యంలోని మైనింగ్ దిగ్గజం కోల్ ఇండియాలో 40 మిలియన్ టన్నులకు పైగా బొగ్గు నిల్వ ఉన్నాయని, ఇవి విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందనే భయం పూర్తిగా తప్పని కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది. -
పెరుగుతున్న ఏపీ జెన్కో సామర్థ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థ.. ఏపీ జెన్కో ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరగబోతోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం (కృష్ణపట్నం)లో కొత్తగా 800 మెగావాట్లు అందుబాటులోకి రానుంది. మే 20 నాటికి ఈ ప్లాంట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి మొదలవుతుంది. దీన్ని గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. జూన్ నెలాఖరు నాటికి వాణిజ్య ఉత్పత్తి (సీవోడీ)కి సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 5,010 మెగావాట్లు . కృష్ణపట్నం కొత్త యూనిట్‌ను కూడా కలుపుకుంటే ఇది 5,810 మెగావాట్లు అవుతుంది. వాస్తవానికి ఇబ్రహీంపట్నంలోని మరో 800 మెగావాట్ల ప్లాంట్ కూడా ఇదే సమయానికి అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ కాంట్రాక్టు సంస్థ నిర్మాణ పనుల్లో ఆలస్యం చేసింది. రెండేళ్లుగా పుంజుకున్న వేగం ► కృష్ణపట్నంలో మొదటి దశలో 800 మెగావాట్ల రెండు సూపర్ క్రిటికల్ (అత్యాధునిక టెక్నాలజీ) థర్మల్ యూనిట్లను నిర్మించారు. రెండో దశలో మరొక ప్లాంట్‌ను 2015లో ప్రారంభించారు. వాస్తవానికి ఇది 2018లోనే పూర్తవ్వాలి. కానీ గత టీడీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా కాంట్రాక్టులు ఇవ్వడం, సకాలంలో ప్రాజెక్టు పూర్తవ్వని కారణంగా వ్యయం పెరిగింది. ► కొత్తగా ఏర్పడ్డ ఈ ప్లాంటుకు మహానది కోల్ ఫీల్డ్ (ఎంసీఎల్) నుంచి ఏడాదికి 3.54 మిలియన్ టన్నుల బొగ్గు లింకేజీ కూడా ఉంది. రెండు ప్రాజెక్టులను ఒకే కాంట్రాక్టు సంస్థకు కాకుండా.. సివిల్ బాయిలర్, టరై్బన్, జనరేటర్ (బీటీజీ)ని ప్రభుత్వ రంగ సంస్థ.. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)కు ఇచ్చారు. సివిల్ కాంట్రాక్టు పనులను టాటా సంస్థకు అప్పగించారు. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రెండు థర్మల్ ప్లాంట్ల పనులపై దృష్టి పెట్టింది. జాప్యం చేస్తే నిర్మాణ వ్యయం పెరిగి, విద్యుత్ ధర ఎక్కువయ్యే ప్రమాదం ఉండటంతో ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియలో వేగం పెంచింది. ఒక్కోదానికి రూ. వెయ్యి కోట్ల చొప్పున ప్రభుత్వమే గ్యారెంటీగా ఉండి అప్పు ఇప్పించేందుకు ముందుకొచి్చంది. దీంతో పలు ఆర్థిక సంస్థలు ముందుకొచ్చాయి. రాష్ట్రానికి ఉపయోగాలివే.. ► జెన్కో కొత్త ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తే బయట నుంచి విద్యుత్‌ను కొనాల్సిన అవసరం తప్పుతుంది. ► అలాగే డిమాండ్ (పీక్) టైమ్‌లో కోతలకు ఆస్కారం లేకుండా విద్యుత్‌ను అందించవచ్చు. ► ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి నూటికి నూరు శాతం విద్యుత్ లభ్యతకు గ్యారెంటీ ఉంటుంది. ► అత్యధిక పీఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) వచ్చే అవకాశం ఉంది. జూన్‌లో ఉత్పత్తి కృష్ణపట్నం 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్‌ను జూన్ చివరి నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తిలోకి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే స్టీమ్‌లైన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు ఫ్యూల్ గ్యాస్ డీ సల్ఫరైజేషన్ (ఎఫ్‌జీడీ) ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. కింది భాగం నుంచే బూడిద విడుదలయ్యే కొత్త టెక్నాలజీని ఈ ప్లాంట్‌లో ఉపయోగిస్తున్నాం. ఈ ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభిస్తే రాష్ట్రానికి రోజుకు మరో 35 మిలియన్ యూనిట్ల విద్యుత్ అదనంగా అందుతుంది. – చంద్రశేఖర్‌రాజు, థర్మల్ డైరెక్టర్, జెన్కో -
'కష్టమైనా' కొంటున్నాం
సాక్షి, అమరావతి: ప్రైవేట్ రంగానికి చెందిన పవన, సౌర విద్యుత్‌ను తీసుకోవడంలేదంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవంలేదని రాష్ట్ర విద్యుత్ శాఖ స్పష్టంచేసింది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ తగ్గుతున్నప్పటికీ పవన, సౌర విద్యుత్‌ను వచ్చినంతా తీసుకుంటున్నామని తెలిపింది. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలవల్ల కోత పెట్టలేని పరిస్థితి ఉందని వివరించింది. సాధ్యమైనంత వరకూ థర్మల్ విద్యుత్‌ను తగ్గించిన తర్వాతే వాటి వైపు వెళ్లాల్సి వస్తోందని పేర్కొంది. అదికూడా నిబంధనలకు అనుగుణంగా, గ్రిడ్ నిర్వహణను దృష్టిలో ఉంచుకునే కేవలం 4 శాతంలోపే కోత పెడుతున్నామని తెలిపింది. ఈ సందర్భంగా.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ విద్యుత్ లభ్యత, తీసుకున్నదీ గణాంకాలతో సహా ఇంధన శాఖ బుధవారం మీడియాకు వెల్లడించింది. ఆ వివరాలు.. మా విద్యుత్ తీసుకోవాల్సిందే.. ► సాధారణంగా సెప్టెంబర్‌లో రోజుకు 175 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుంది. కానీ, ఈ ఏడాది వర్షాలవల్ల ఒక్కసారిగా పడిపోయింది. 14న ఏకంగా 143 ఎంయూలకు.. 26న 146 ఎంయూలకు పడిపోయింది. నెలాఖరు వరకూ పెద్దగా మార్పులేదు. ► ఒక్కసారే రోజుకు 30 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ తగ్గితే.. ఉత్పత్తి తగ్గించడం తప్ప మరో మార్గంలేదని రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ తెలిపింది. ఈ నిర్ణయం తీసుకోకపోతే గ్రిడ్‌కు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ► కేంద్ర నిబంధనల ప్రకారం రాష్ట్రంలో కేవలం 16 శాతం మాత్రమే సంప్రదాయేతర ఇంధన వనరులను అనుమతించాల్సి ఉంది. కానీ, గత ప్రభుత్వం అంతకన్నా ఎక్కువ మొత్తంలో పీపీఏలు చేయడంవల్ల 26 శాతం ఈ విద్యుత్ వస్తోంది. డిమాండ్ లేకపోయినా తమ విద్యుత్ తీసుకోవాలని సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిదారులు ఒత్తిడి చేస్తున్నారు. ప్రజలపై భారం పడకూడదనే స్వల్పంగా ఉత్పత్తి తగ్గింపు నిబంధనల ప్రకారం కేవలం 3.78 శాతం మాత్రమే పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిని తగ్గించాం. దీనివల్ల ఆ సంస్థలకు ఎలాంటి నష్టం ఉండదు. ముందుగా జెన్కో థర్మల్ ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గించిన తర్వాతే.. ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉండబట్టే అలా చేశాం. ఇది పీపీఏలకు ఏమాత్రం వ్యతిరేకం కాదు. విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాన్ని ప్రైవేటు సోలార్, విండ్ ఉత్పత్తిదారులు అర్థం చేసుకోవాలి. అవసరం లేకున్నా తీసుకుంటే, ప్రజలపై భారం పడుతుంది. – శ్రీకాంత్, ఇంధన శాఖ కార్యదర్శి -
విద్యుత్ కొనడమే బెటర్!
సాక్షి, అమరావతి: ఏపీ విద్యుత్ సంస్థలు వేసవి విద్యుత్ ప్రణాళికపై సరికొత్త విధానాన్ని అనుసరిస్తున్నాయి. మార్కెట్లో లభించే చౌక విద్యుత్‌నే ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయాలని భావిస్తున్నాయి. రాష్ట్రంలో లభించే థర్మల్ విద్యుత్ కన్నా ఇది చౌకగా ఉండటంతో ఈ దిశగా వెళ్తున్నామని ఇంధనశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. పవర్ ఎక్స్చేంజ్లో చౌకగా విద్యుత్ లభిస్తున్న దృష్ట్యా ఈ వ్యూహాన్ని మార్చుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. - కోవిడ్ ప్రభావంతో పలు వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయి దేశంలో 5 శాతం విద్యుత్ డిమాండ్ తగ్గింది. దీనికి తోడు గ్యాస్, విదేశీ బొగ్గు లభించడంతో విద్యుత్ లభ్యత పెరిగింది. ఫలితంగా పవర్ ఎక్స్చేంజ్లో విద్యుత్ యూనిట్ గరిష్టంగా రూ. 2.52లకే లభిస్తోంది. ఈ కారణంగా మార్చిలో మార్కెట్లో లభించే విద్యుత్‌నే తీసుకోవాలని నిర్ణయించారు. - కొన్ని థర్మల్ ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గించారు. డిమాండ్‌ను బట్టి దీన్ని పెంచుతారు. అయితే థర్మల్ విద్యుత్ సగటున యూనిట్ రూ. 5.53 వరకూ ఉంటోంది. - ఒప్పందాలున్న థర్మల్ విద్యుత్ తీసుకోకపోతే ఆ ప్లాంట్లకు స్థిర వ్యయం (ఫిక్స్డ్ ఛార్జీలు) రూ. 1.20 వరకూ చెల్లించాలి. దీన్ని కలుపుకున్నా మార్కెట్ విద్యుత్ ధర యూనిట్ రూ. 3.72 వరకూ ఉంటుంది. ఈ లెక్కన యూనిట్‌కు రూ. 1.81 వరకూ విద్యుత్ సంస్థలకు లాభమే ఉంటుంది. - ప్రస్తుతం రోజుకు గరిష్టంగా 10 మిలియన్ యూనిట్ల వరకూ మార్కెట్ నుంచి చౌక విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. ఏపీ జెన్కో ఉత్పత్తిని తగ్గించిన కారణంగా ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు 10 లక్షల టన్నులకు చేరుకున్నాయని థర్మల్ డైరెక్టర్ చంద్రశేఖర్‌రాజు తెలిపారు. ఈస్థాయిలో నిల్వలు పెరగడం గత ఐదేళ్లలో ఇదే మొదటిసారని ఆయన వివరించారు. -
భలే చౌక విద్యుత్
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో 2018 అక్టోబర్ 4న ఒక్కో యూనిట్ కరెంటు కొనుగోలుకు ఎంత వెచ్చించారో తెలుసా? అక్షరాలా రూ.6.56. అప్పటి ప్రభుత్వ పెద్దలు అస్మదీయ విద్యుత్ సంస్థల నుంచే కరెంటు కొనేసి, విచ్చలవిడిగా దోచిపెట్టారు. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే కరెంటు దొరుకుతున్నా అటువైపు చూడలేదు. సరిగ్గా ఏడాది తర్వాత 2019 అక్టోబర్ 4న యూనిట్ కేవలం రూ.3.38 చొప్పున అధికారులు కొన్నారు. అంటే ఒక్కో యూనిట్‌కు రూ.3.18 చొప్పున మిగులుతోందన్నమాట. గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనాన్ని ఏస్థాయిలో దోచేశారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఏపీ విద్యుత్ సంస్థలు(డిస్కమ్‌లు) కారుచౌకగా లభించే విద్యుత్‌నే కొనుగోలు చేస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో తెలుసుకుని మరీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. గత కొన్ని రోజులుగా యూనిట్ కరెంటును కేవలం రూ.3.15 చొప్పున కొనుగోలు చేస్తుండడం విశేషం. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ధర యూనిట్‌కు రూ.4.50 పడుతోంది. బహిరంగ మార్కెట్లో అంతకంటే చౌకగా లభిస్తున్న విద్యుత్ కొనుగోలుకు అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతిరోజూ డిస్కమ్‌లు 12 మిలియన్ యూనిట్ల మేర చౌకైన విద్యుత్ తీసుకుంటున్నాయి. గతంలో ఇదే విద్యుత్‌ను యూనిట్ రూ.6.56 వరకూ చెల్లించి కొనుగోలు చేశారు. ఇప్పుడు ధర సగానికి సగం తగ్గడం వల్ల నిత్యం రూ.3 కోట్ల వరకూ ప్రజాధనం ఆదా అవుతుండడం గమనార్హం. బొగ్గు నిల్వల పెంపుపై దృష్టి థర్మల్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు పెంచుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మార్కెట్లో విద్యుత్ ధరలు పెరిగినప్పుడు ఈ బొగ్గు నిల్వలను ఉపయోగించుకుని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుందో, ఉత్పత్తి ఎప్పుడు తగ్గుతుందో తెలుసుకునే దిశగా కసరత్తు చేస్తున్నారు. కొన్ని నెలలుగా దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ తగ్గినప్పుడు బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధరలు పడిపోతాయి. ఈ పరిస్థితిని ఏపీ డిస్కమ్‌లు చక్కగా ఉపయోగించుకుంటున్నాయి. తక్కువ ధరకే కరెంటును కొనుగోలు చేస్తున్నాయి. ధర పెరిగినప్పుడు రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌పై ఆధారపడుతున్నారు. ఈ ప్రయోగం మంచి ఫలితాలనిస్తోందని అధికారులు విశ్లేషించారు. గత ప్రభుత్వ హయాంలో నెలకు రూ.100 కోట్ల భారం ఏడాది క్రితం వరకూ విద్యుత్ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉండేది కాదు. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలను అమలు చేయాల్సి వచ్చేది. దీంతో బహిరంగ మార్కెట్లో విద్యుత్ లభ్యతపై అధికారులు అంచనాలు రూపొందించే అవకాశం చిక్కలేదు. ప్రభుత్వ పెద్దల సన్నిహితులకు చెందిన ప్రైవేటు ప్లాంట్లు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను విధిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఆ సమయంలో తక్కువ ధరకే విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ ఖరీదైన ప్రైవేటు విద్యుత్‌ను కొనుగోలు చేశారు. యూనిట్‌కు రూ.6.56 వరకూ వెచ్చించాల్సి వచ్చింది. ఫలితంగా డిస్కమ్‌లపై నెలకు రూ.100 కోట్ల వరకూ భారం పడేది. అప్పటికీ, ఇప్పటికీ భారీ వ్యత్యాసం కనిపిస్తోందని విద్యుత్ వర్గాలు పేర్కొంటున్నాయి. 2018 అక్టోబర్‌లో యూనిట్ రూ.5.99 చొప్పున 9.92 మిలియన్ యూనిట్ల కరెంటు కొన్నారు. 2019 అక్టోబర్ 1న 23.1 మిలియన్ యూనిట్లను యూనిట్ కేవలం రూ.3.38 చొప్పునే కొనుగోలు చేశారు. 2018 అక్టోబర్ 4న గరిష్టంగా యూనిట్ రూ.6.56 చొప్పున కొనగా, 2019 అక్టోబర్ 4న యూనిట్ కేవలం రూ.3.38 చొప్పున కొనుగోలు చేశారు. నవంబర్ 1వ తేదీ నాటికి దీన్ని రూ.3.15కు తగ్గించగలిగారు. మంచి ఫలితాలొస్తున్నాయ్ ‘‘చౌక విద్యుత్‌కే ప్రాధాన్యం ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ పడిపోయినప్పుడు తక్కువ ధరకు లభిస్తున్న కరెంటు కొంటున్నాం. అదే సమయంలో థర్మల్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు పెంచుతున్నాం. ఈ ప్రయోగం సత్ఫలితాలిస్తోంది’’ – శ్రీకాంత్ నాగులపల్లి,ఇంధన శాఖ కార్యదర్శి -
హైడ్రో పవర్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జల విద్యుదుత్పత్తి ఉరకలు పెడుతోంది. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో లక్ష్యానికి మించి ఉత్పత్తి సాధించింది. కర్ణాటక, మహారాష్ట్రల్లో ఏకధాటి వర్షాలతో ఇప్పటి వరకు కృష్ణా నదికి 1,345 టీఎంసీల వరద వచ్చింది. రాష్ట్రంలోని అన్ని జల విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 2019–20లో 3,050 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుదుత్పత్తి జరపాలని రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) లక్ష్యం పెట్టుకోగా, గత మంగళవారం నాటికే 2,883.61 ఎంయూల ఉత్పత్తి జరిపింది. కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రధాన జలాశయాల్లో మరో 1,953.8 ఎంయూల జల విద్యుదుత్పత్తికి సరిపడా జల నిల్వలున్నాయి. జలాశయాలకు గత కొంతకాలంగా కొనసాగుతున్న నిరంతర వరద ప్రవాహం దీనికి అదనం. ఈ అంకెలు పరిగణనలోకి తీసుకుంటే దశాబ్ద కాలం తర్వాత ఈ ఏడాది రాష్ట్రంలో రికార్డు స్థాయిలో జల విద్యుదుత్పత్తి సాధించనుందని జెన్కో ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కృష్ణా బేసిన్లో వరద ప్రవాహం మరికొన్ని రోజులు కొనసాగితే 5 వేల ఎంయూల మైలురాయిని సైతం తొలిసారిగా దాటి రాష్ట్రం కొత్త చరిత్రను సృష్టించనుంది. ఎగువ డ్యామ్‌లతో తగ్గిన ఉత్పత్తి తెలంగాణ ప్రాంతం పరిధిలోని జల విద్యుదుత్పత్తి కేంద్రాలు 2006–07లో 4,800 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి చేశాయి. ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణ చరిత్రలో సైతం జల విద్యుదుత్పత్తిలో ఇప్పటివరకు ఇదే రికార్డు. ఆ ఏడాది శ్రీశైలం ఎడమ జల విద్యుదుత్పత్తి కేంద్రం నుంచే 2,511 ఎంయూల ఉత్పత్తి జరగడంతో ఇది సాధ్యమైందని జెన్కో హైడల్ డైరెక్టర్ వెంకటరాజం అన్నారు. ఆ తర్వాత కృష్ణా నదిపై కర్ణాటకలో ఆల్మట్టి, ఎగువ కృష్ణా తదితర జలాశయాలు నిర్మించడంతో దిగువన ఉన్న రాష్ట్రానికి వరద నీటి ప్రవాహం తగ్గిందని, దీంతో జల విద్యుదుత్పత్తి పడిపోయిందని పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయానికి గేట్లు ఏర్పాటు చేయడానికి ముందు, 1991–92లో నాగార్జునసాగర్ జల విద్యుదుత్పత్తి కేంద్రం రికార్డు స్థాయిలో 3,011 ఎంయూల ఉత్పత్తిని సాధించింది. ఎగువ కర్ణాటకలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచి్చన డ్యాంల కారణంగానే మూడు దశాబ్దాలు దాటినా ఆ రికార్డు అలాగే ఉంది. ఈ ఏడాది శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో 2100 ఎంయూలు, నాగార్జున సాగర్ విద్యుత్ కేంద్రంలో 2000 ఎంయూల ఉత్పత్తికి అవకాశముంది. డిస్కంలకు భారీ ఊరట.. తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఈ ఏడాది జల విద్యుదుత్పత్తి భారీ ఊరట కలిగిస్తోంది. సగటున థర్మల్ విద్యుత్ ధర యూనిట్‌కు రూ.6 అవుతుండగా, జల విద్యుత్ సగటున ధర యూనిట్‌కు రూ.2.94 మాత్రమే. భారీ స్థాయిలో జల విద్యుదుత్పత్తి వస్తుండటంతో థర్మల్ విద్యుత్‌ను డిస్కంలు పక్కన పెట్టి ఆర్థిక భారం నుంచి బయటపడ్డాయి. వర్షాభావంతో గత నాలుగేళ్లలో లక్ష్యం మేరకు జల విద్యుదుత్పత్తి కాకపోవడంతో ఏటా డిస్కంలపై రూ.2 వేల కోట్లకు పైగా భారం పడింది. ఈ సారి లక్ష్యానికి మించి ఉత్పత్తి జరగనుండటంతో నష్టాలకు బ్రేక్ వేయొచ్చు. రూ.వెయ్యి కోట్ల వరకు అదనపు ప్రయోజనం కలగనుంది. విద్యుత్ వినియోగదారులపై భవిష్యత్తులో పడనున్న చార్జీల పెంపు భారం తగ్గనుందని అధికారవర్గాలు తెలిపాయి. డిమాండ్ పతనం ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురవడంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ వినియోగం భారీగా తగ్గిపోయింది. రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌లో 45 శాతం వాటా వ్యవసాయ విద్యుత్‌దే కావడంతో మొత్తం డిమాండ్ పతనమైంది. గతేడాది అక్టోబర్‌లో అత్యధిక డిమాండ్ 10,600 మెగావాట్లు, రోజుకు 216.9 మిలియన్ యూనిట్లు (ఎంయూ) నమోదు కాగా, ఈ అక్టోబర్‌లో అత్యధిక డిమాండ్ 8,532 మెగావాట్లు, రోజుకు 166.35 ఎంయూలకు పడిపోయింది. ఖరీఫ్ నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అత్యధిక విద్యుత్ డిమాండ్ ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్‌లో దక్షిణాదిలో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడుతుంది. కానీ ఈ ఏడాది ఖరీఫ్‌లో భారీ వర్షాలతో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ తగ్గిపోయింది. దీంతో ప్రైవేటు థర్మల్ విద్యుత్ కేంద్రాలను బ్యాకింగ్ డౌన్ చేసుకోవడం ద్వారా ఉత్పత్తి తగ్గించుకుని, జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట సామర్థ్యం మేర ఉత్పత్తి చేస్తున్నామని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. -
ఇతర రాష్ట్రాల్లో కొత్త బొగ్గు బ్లాకులు
సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో లాభదాయక బొగ్గు నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో 6 నుంచి 10 బ్లాకుల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ వెల్లడించారు. వీటిని కేటాయిస్తే రానున్న ఐదేళ్లలో సింగరేణి ఏడాదికి 85 మిలియన్ టన్నుల నుంచి 100 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే స్థాయికి చేరుతుందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో గుర్తింపు కార్మిక సంఘం నేతలతో జరిగిన 37వ సీఎండీ స్థాయి స్ట్రక్చర్డ్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడతూ రానున్న 5 ఏళ్ల కాలంలో బొగ్గు పరిశ్రమ కొత్త సవాళ్లను ఎదుర్కోనుందని, 50కి పైగా ప్రైవేటు బొగ్గు సంస్థలతో సింగరేణి, కోలిండియా సంస్థలు పోటీ పడాల్సి వస్తుందని అన్నారు. దీంతో ఉత్పత్తి వ్యయం భారీగా తగ్గించుకుంటేనే మార్కెట్లో నిలబడి మనుగడ సాధించగలమని తెలిపారు. సింగరేణి సంస్థ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని థర్మల్ విద్యుత్‌తోపాటు సోలార్ విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేయడానికి రంగం సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరికల్లా 130 మెగావాట్లు, వచ్చే ఏడాది మరో 80 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి సన్నాహాలు చేశామన్నారు. సంస్థ మనుగడ, వృద్ధికి సహకరించాలి.. కార్మికులకు కంపెనీకి సంబంధించిన వాస్తవాలు వివరించాలని, తద్వారా నిర్మాణాత్మక ఆలోచనలతో కంపెనీని ముందుకు తీసుకుపోవాలని కార్మికులకు, కార్మిక సంఘాలకు పిలుపునిచ్చారు. సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారంపై ఎప్పుడూ సానుకూల వైఖరితోనే ఉంటుందన్నారు. గత ఐదేళ్లలో అనేక దీర్ఘకాలిక సమస్యలపై పలు చారిత్రక ఒప్పందాలు చేసుకుని అమలు చేసిందని తెలిపారు. ఎక్కడాలేనన్ని సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గుర్తింపు కార్మిక సంఘంతో కొత్త కేడర్ స్కీం, బదిలీ రెగ్యులరైజేషన్, అలవెన్సుల పెంపుదల వంటి వాటిపై చారి త్రక ఒప్పందాలు జరిగాయని తెలిపారు. ఒప్పం దాల్లో అన్ని అంశాలు వెంటనే అమలు చేశామని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే మెడికల్ బోర్డు ద్వారా అన్‌ఫిట్ అయిన కార్మికుల వారసులు దాదాపు 5 వేల మందికి ఉద్యోగాలిచ్చామని తెలి పారు. సీఎండీ ముందు డిమాండ్లు.. గుర్తింపు కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బి.వెంకట్రావు, జనరల్ సెక్రటరీ మిరియాల రాజి రెడ్డి మాట్లాడుతూ దేశంలో నంబర్ 1గా నిలిచిన సింగరేణిని ఇలాగే ముందుకు తీసుకెళ్లడంలో కార్మికులను సమాయత్తం చేస్తామన్నారు. పెర్కు మీద ఇన్‌కంటాక్స్ రీయింబర్స్మెంట్, సర్ఫేస్కు అన్‌ఫిట్ మీద వచ్చిన ఉద్యోగులకు డిపెండెంట్ ఉద్యోగాల అవకాశం, సీపీఆర్ఎంఎస్ స్కీంకు డబ్బు చెల్లింపును కార్మికుడి ఇష్టానికి వదిలేయడం వంటి డిమాండ్లను కార్మిక నాయకులు వినిపించారు. -
విద్యుత్ కొను‘గోల్మాల్’ అంతు తేలుద్దాం
సాక్షి, అమరావతి: గాడి తప్పిన విద్యుత్ శాఖను దారిలో పెట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గడచిన ఐదేళ్లుగా ఈ రంగంలో జరిగిన అవినీతి కార్యకలాపాలపై అధికారులు చెప్పిన వివరాలు విని విస్తుబోయారు. ఇందుకు బాధ్యులైన ఏ ఒక్కరినీ విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి బుధవారం విద్యుత్ రంగంపై ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష జరిపారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖలో జరిగిన అక్రమాల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. చౌకగా లభించే థర్మల్ పవర్ అందుబాటులో ఉన్నప్పటికీ ప్రైవేటు సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిదారులకు దోచిపెట్టారని, దీని వల్ల రూ.2,636 కోట్ల మేర విద్యుత్ సంస్థలకు నష్టం వాటిల్లిందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన జగన్.. పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అడ్డగోలు పీపీఏలు జరిగాయని, ఫలితంగా విద్యుత్ పంపిణీ సంస్థలు ఘోరంగా నష్ట పోయాయని విద్యుత్ అధికారులు తెలిపారు. తక్కువకే జీఎంఆర్ గ్యాస్ విద్యుత్ లభిస్తున్నా, పీపీఏ గడువు ముగిసిన ల్యాంకో, స్పెక్ట్రం నుంచి అధిక రేటుకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల రూ.276 కోట్ల నష్టం వచ్చిందని అధికారులు తెలిపారు. ఇన్ని అక్రమాలు జరిగాయని తెలుసుకున్న ముఖ్యమంత్రి అన్నింటిపైనా వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఇన్ని స్కాములకు పాల్పడి ప్రభుత్వం చేసిన పీపీఏలపై పునః సమీక్షించాలని సూచించారు. ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని నియమించిందని, విద్యుత్ రంగంలోని అవినీతిని కూడా సమీక్షిస్తుందని, అన్ని వివరాలు కమిటీ సభ్యులకు ఇవ్వాలని సూచించారు. విండ్, సోలార్ పవర్ ధరలు తగ్గించేందుకు సంప్రదింపుల కమిటీ చర్చలు జరుపుతుందని చెప్పారు. అవినీతిని ప్రోత్సహించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ విద్యుత్ శాఖ మంత్రి, ఇందులో పాత్రధారులైన అధికారులనూ చట్ట ప్రకారం విచారించాలని ఆదేశించారు. అడ్డూ అదుపులేని దోపిడీ చౌకగా థర్మల్ విద్యుత్ అందుబాటులో ఉన్నా ప్రైవేట్ పవన, సౌర విద్యుత్ సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా దోచిపెట్టిందో ఇంధన శాఖ సవివరంగా సీఎం ముందుంచింది. వాస్తవానికి మెరిట్ ఆర్డర్ ప్రకారం చౌకగా లభించే విద్యుత్‌కు ముందు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని ఆ శాఖ అధికారులు వివరించారు. ఈ లెక్కన రాష్ట్రానికి కేంద్రం అందించే థర్మల్ విద్యుత్ స్థిర (ఫిక్స్డ్) వ్యయం యూనిట్‌కు రూ.1.10 అని, చర (వేరియబుల్) వ్యయం రూ.3.10 ఉంటుందని, మొత్తం కలిపినా యూనిట్ రూ.4.20కే లభిస్తుందని తెలిపారు. ఇంత తక్కువకు లభించే విద్యుత్‌ను పక్కన పెట్టి యూనిట్ రూ.4.84 చొప్పున పవన విద్యుత్ కొనుగోలుకు ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. అదీ ఏకంగా 5,900 మెగావాట్ల మేర ప్రోత్సహించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో డిమాండ్ లేకపోవడం వల్ల విండ్ సోలార్ కోసం థర్మల్ విద్యుత్‌ను నిలిపి వేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ కారణంగా పీపీఏలున్న థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు యూనిట్‌కు రూ.1.10 స్థిర వ్యయం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. విండ్‌కు చెల్లించేది రూ.4.84 అయితే, విండ్ తీసుకోవడం వల్ల థర్మల్‌కు చెల్లించే స్థిర వ్యయం రూ.1.10 కలుపుకుంటే, పవన విద్యుత్ ధర యూనిట్ రూ.5.94 పడుతోందని తెలిపారు. థర్మల్ విద్యుత్ యూనిట్ రూ.4.20కే లభిస్తుంటే పవన విద్యుత్ రూ. 5.94 చొప్పున కొనడం వల్ల యూనిట్‌కు రూ. 1.74 ఎక్కువ చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. సోలార్కు ఏకంగా యూనిట్‌కు రూ.5 నుంచి రూ.6 చెల్లించారని సీఎంకు వివరించారు. యూనిట్ రూ.5 సోలార్కు ఇచ్చి, థర్మల్ స్థిర వ్యయం రూ.1.10 ఇస్తే అప్పుడు సోలార్ విద్యుత్ ధర యూనిట్‌కు రూ.6.10 అయినట్టు అని, రూ.4.20కే లభించే థర్మల్ కన్నా ఇది యూనిట్‌కు రూ.1.90 ఎక్కువని తెలిపారు. అదే యూనిట్‌కు రూ.6 చొప్పున చెల్లించిన సౌర విద్యుత్ థర్మల్ స్థిర వ్యయంతో కలుపుకుని రూ.7.10 అవుతుందన్నారు. ఈ లెక్కన యూనిట్‌కు రూ.2.90 అధికం అవుతుందని తెలిపారు. ఇలా అధికంగా చెల్లించడం వల్ల ఈ ఐదేళ్ల కాలంలో పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిదారులకు ప్రజాధనం రూ.2,636 కోట్లు చెల్లించినట్టుగా అధికారులు సీఎంకు వివరించారు. క్రిమినల్ కేసులు పెట్టాలి.. అధికారులు తన దృష్టికి తెచ్చిన వివరాలపై సీఎం జగన్ సీరియస్‌గా స్పందించారు. పవన, సౌర విద్యుత్‌ను ఈ స్థాయిలో ప్రోత్సహించాల్సిన అవసరం ఎవరికి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఈ రేట్లకు కొన్నది ఎవరు? ఇలా కొనాలని నిర్ణయించింది ఎవరు? వీరందరిమీదా క్రిమినల్ కేసులు పెట్టి విచారణ చేయాలి.. ప్రజల సొమ్మును ఇలా దోచిపెడతారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా రెండు రకాలుగా డిస్కంలు తీవ్రంగా నష్టపోయాయని అన్నారు. సోలార్ విండ్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలపై సంప్రదింపులు చేయడానికి ఒక కమిటీని వేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ఈ కమిటీ కంపెనీలతో సంప్రదింపులు జరిపి, విద్యుత్ కొనుగోలు రేట్లను తగ్గించేలా చూడాలని, అధికంగా చేసిన చెల్లింపుల రికవరీపై దృష్టి పెట్టాలని చెప్పారు. సోలార్, విండ్ విద్యుత్ కంపెనీలతో ఒప్పందాలు కుదిరిన సమయంలో ఇతర రాష్ట్రాల్లో, దేశంలోని ఇతర ప్రాంతాల్లో అప్పటి సోలార్, విండ్ విద్యుత్ రేట్లను పరిశీలించాలని సీఎం స్పష్టం చేశారు. ఒకవేళ కంపెనీలు దారికి రాకుంటే ఒప్పందాలు రద్దు చేయాలని, ఆ మేరకు ప్రత్యామ్నాయంగా తక్కువ రేటుకు ఎక్కడ దొరుకుతుందో అక్కడ విద్యుత్ కొనుగోలుకు ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. కాగా, ఐదేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని దోచుకోవడం వల్ల డిస్కమ్‌లకు కలిగిన నష్టాలేంటో అధికారులు సీఎంకు తెలిపారు. డిస్కమ్‌లకు 2019 మే నాటికి రూ.18,375 కోట్ల బకాయిలు ఉన్నాయని, ఈ మొత్తం.. డిస్కమ్‌లు విద్యుత్ ఉత్పత్తిదారులకు చెల్లించాల్సిన సొమ్మని తెలిపారు. ఇన్ని వేల కోట్ల బకాయిలతో మొత్తంగా విద్యుత్తు రంగం మునిగే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. థర్మల్ మాటేంటి? జెన్కో నిర్మించే కొత్త థర్మల్ ప్లాంట్లలోనూ అవినీతి ఏరులై పారిందనే ఆరోపణలున్నాయి. దీనిపై సీఎం లోతుగా సమీక్షించారు. కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నంలో నిర్మించే 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాల కాంట్రాక్టులపై అవినీతి గురించి అధికారులు సీఎం దృష్టికి తేవడంతో వాటిపై సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని కోరారు. బయట రాష్ట్రాల్లో ఒక మెగావాట్ తయారీకి రూ.4.49 – రూ.4.64 కోట్లు ఖర్చు చేస్తుంటే, అంతకంటే తక్కువ సామర్థ్యం ఉన్న విద్యుత్ కేంద్రాల్లో మెగావాట్ ఉత్పాదక సామర్థ్యం కోసం దాదాపు రూ.7 కోట్లు ఎందుకు వెచ్చించాల్సి వచ్చిందని సీఎం ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో కూడా భారీగా దోచేశారని, ఇప్పటికైనా ఖజానాకు ఎంత మిగులుతుందో పరిశీలించాలని, త్వరలోనే రివర్స్ టెండరింగ్‌కు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్యాస్ పేరుతోనూ లూటీ వాస్తవానికి మన రాష్ట్రంలో జీఎంఆర్ సంస్థ చౌకగా గ్యాస్ విద్యుత్ అందించేందుకు ముందుకొచ్చిందని అధికారులు సీఎంకు తెలిపారు. ఇది యూనిట్ కేవలం రూ.3.29కే ఇస్తానందని, కానీ గ్యాస్ కేటాయింపులు లేవనే సాకుతో పీపీఏలు ముగిసినా ల్యాంకో, స్పెక్ట్రం గ్యాస్ ఆధారిత విద్యుత్ సంస్థలను ప్రోత్సహించినట్టు చెప్పారు. నిజానికి ల్యాంకో స్పెక్ట్రంతో 2016 నాటికి విద్యుత్ కొనుగోలు ఒప్పందం ముగిసింది. కానీ స్వల్ప కాలిక పీపీఏలు అప్పటికప్పుడు కుదుర్చుకుని, యూనిట్ కరెంటుకు 40 పైసలు అదనంగా పెట్టి రూ.3.70 తో కొనుగోలు చేశారని అధికారులు తెలిపారు. అదే సమయంలో జీఎంఆర్ వేమగిరి సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం యూనిట్‌కు రూ.3.29తో కొనే అవకాశం ఉన్నా, ఆ సంస్థకు గ్యాస్ సరఫరా చేయాలని కేంద్రానికి లేఖ రాయలేదన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏటా రూ.92 కోట్ల మేర అదనపు భారం పడిందని, మూడేళ్లలో రూ.276 కోట్లకుపైగా ఖజానాకు నష్టం వాటిల్లిన అంశాన్ని సీఎం దృష్టికి తెచ్చారు. అధికారుల వివరాలు విన్న సీఎం ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుంభకోణాలకు పాల్పడిన అప్పటి ఉన్నతాధికారి, విద్యుత్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రిపైన విచారణ చేయాలని ఆదేశించారు. జరిగిన విషయాలను వివరిస్తూ కేంద్రానికి ఒక లేఖ రాసి, గ్యాస్ అందుబాటులోకి వచ్చేలా చూడాలన్నారు. బాగు చేద్దాం.. తోడుగా ఉండండి వ్యవస్థను బాగు చెయ్యాలన్న తన ఆకాంక్షకు అధికారులు చేయూతనివ్వాలని సీఎం జగన్ కోరారు. మనకు ప్రజలు ముఖ్యమన్న విషయాన్ని అందరూ గుర్తించాలని చెప్పారు. ఎక్కడ డబ్బు మిగిల్చగలమో గుర్తించడానికి సహకరించాల్సింది అధికారులేనని పదేపదే చెప్తున్నానన్నారు. అవినీతిని నిర్మూలించి వ్యవస్థలను సరిచేసుకోవడానికి అందరం కలిసికట్టుగా వెళదామని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి రూ.2.58 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, దీనిపై వడ్డీలు, ఇతర రూపంలో రూ.40 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో చూడాలని, బాగు చేసేందుకు ముందుకు రావాలని కోరారు. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 60 శాతం ఫీడర్లలో పగటి విద్యుత్ అందించాలని సీఎం ఆదేశించారు. వచ్చే ఏడాది జూలై 30 నాటికి మిగిలిన 40 శాతం ఫీడర్లలో పనులు పూర్తి చేసి పగటి పూట కరెంటు ఇవ్వాలని ఆదేశించారు. ఈ పీడర్లలో చేపట్టాల్సిన పనులకోసం రూ.1,700 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. -
థర్మల్.. డేంజర్ బెల్!
సాక్షి, అమరావతి: థర్మల్ విద్యుత్ కేంద్రాలు వెదజల్లే విషవాయువులు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతు న్నాయని కేంద్ర పర్యావరణ శాఖ మరోసారి రాష్ట్రాలను హెచ్చరించింది. కాలుష్య నియంత్రణ దిశగా ఆంధ్రప్రదేశ్‌లో ఏమాత్రం చర్యలు చేపట్టకపోవడాన్ని ప్రశ్నించింది. పర్యావరణ శాఖ తాజాగా పంపిన నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. రాజధాని నగరం అమరావతికి అతి సమీపంలోని నార్లతాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీటీపీ)లో దశాబ్దాల క్రితం థర్మల్ యూనిట్లు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇవి జనావాసాలకు దూరంగా ఉన్నాయి. ఇప్పుడు అతి సమీపంలోనే రాజధానితో పాటు పెద్ద ఎత్తున కాలనీలు వెలిశాయి. దీంతో ప్రజలు అతి భయంకరమైన విషవాయువుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అదీగాక నైట్రోజన్, సల్ఫ్యూరిక్ యాసిడ్స్ వల్ల భయంకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తేల్చి చెప్పింది. కడపలోని ఆర్టీపీపీ, నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంతో పాటు పలు ప్రైవేటు విద్యుత్ కేంద్రాలకు సమీపంలోనూ ఇలాంటి ప్రమాదకర పరిస్థితి ఉన్నట్టు తెలిపింది. 10 కిమీ వరకూ డేంజరే థర్మల్ విద్యుత్ కేంద్రాలకు 10 కిలోమీటర్ల పరిధిలో భయంకరమైన పరిస్థితులున్నాయని పర్యావరణ శాఖ అధ్యయనంలో వెల్లడైంది. థర్మల్ కేంద్రాల్లో కాల్చే బొగ్గు నుంచి వెలువడే కాలుష్యం గుండె జబ్బులు, దీర్ఘకాలిక శ్వాసకోస వ్యాధులు, ఆస్తమా తదితర రుగ్మతలకు కారణమవుతుందని తెలిపింది. గడచిన ఐదేళ్లుగా రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద దాదాపు 90 వేల మంది ఆస్తమాకు గురైనట్టు తేలింది. ప్రాణాంతక వ్యాధుల వల్ల మృత్యువాత పడే ఐదేళ్లలోపు పిల్లల సంఖ్య గడచిన నాలుగేళ్లుగా ఎక్కువగా ఉందని పేర్కొంది. కాలుష్యం బారిన పడి ఆనారోగ్యానికి గురవుతున్న వారిలో పేదలు, మైనార్టీలు, వృద్ధులు, చిన్నారులు ఎక్కవగా ఉన్నారు. వీరు ఆరోగ్యం కోసం చేసే వ్యయం కోట్లలో ఉంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ బొగ్గు వినియోగం వల్ల పార్టిక్యులేట్ మ్యాటర్ – 2.5 (పిఎం 51,500 టన్నులు), పిఎం 10 (1,07,500 టన్నులు), సల్ఫర్‌డై ఆక్సైడ్ 1,99,500 టన్నులు), నైట్రిక్ ఆక్సైడ్ (1,87,500 టన్నులు), కార్బన్‌మోనాక్సైడ్(1,04,000 టన్నులు) వెలువడినట్టు నివేదిక వెల్లడించింది. గాలిలో కలిసిన ధూళికణాలు 2.5 మైక్రాన్స్ (మనిషి వెంట్రుక మందంలో 30వ వంతు కన్నా చిన్నవి), పరిమాణంలో ఉంటే, నేరుగా ఊపిరితిత్తులోకి వెళ్ళి ఆ తర్వాత రక్తంలో కలుస్తాయి. అనారోగ్యానికి కారణమవుతాయి. సముద్ర జీవులకూ ముప్పే రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పాటైన థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే విష రసాయనాలను సముద్రంలోకే విడుస్తున్నారు. దీని వల్ల మత్స్య తదితర జీవులకూ తీవ్ర నష్టం వాటిల్లుతోంది. థర్మల్ విద్యుత్ కేంద్రాల పరిధిలో అసాధారణంగా 40–50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. దీని వల్ల ఆ పరిసరాల్లోని వరి, మామిడి, జీడిమామిడి, కొబ్బరి తోటలు అంతరించిపోతున్నాయి. చిమ్నీ పొగ ద్వారా వెలువడిన వాయువులతో ఆమ్ల వర్షాలు వస్తున్నాయి. ఇవి పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పర్యావరణ శాఖ పేర్కొంది. ప్లాంట్ నుంచి వచ్చే బూడిదను 30 ఏళ్ల వరకూ నిల్వ చేయడం వల్ల మత్స్య సంపద, సహజ నీటి వనరులకు నష్టం వస్తోంది. ఈ నేపథ్యంలో అత్యధికంగా కాలుష్యం వెదజల్లే థర్మల్ ప్లాంట్లలో ఉత్పత్తి ఆపివేయాలని సూచించింది. వీలుకాని పక్షంలో సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. దీనికి వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని, ఇంత మొత్తం ఏపీ జెన్కో సమకూర్చుకునే స్థితిలో లేదని అధికారులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ కాలుష్య నియంత్రణ దిశగా తీసుకునే చర్యలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ శాఖ రాష్ట్ర విద్యుత్ సంస్థలను కోరింది. -
సింగరేణి పీఎల్ఎఫ్ 82.75 శాతం!
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 2018–19లో గణనీయ సామర్థ్యంతో విద్యుదుత్పత్తి జరిపింది. గతేడాది 82.75 శాతం పీఎల్‌ఎఫ్‌తో 8,698 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. అందులో 8,211 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను రాష్ట్రానికి సరఫరా చేసింది. ఒక ఏడాది ఓ విద్యుత్ కేంద్రం స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యంతో పోల్చితే వాస్తవంగా జరిపిన విద్యుదుత్పత్తిని ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) అంటారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం సరఫరా చేసిన 8 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ రాష్ట్ర అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండుసార్లు అనగా సెప్టెంబర్ 2018, ఫిబ్రవరి 2019లో 100 శాతానికి పైగా పీఎల్ఎఫ్ సాధించింది. 600 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లు పలు మార్లు నూరుశాతం పైబడి పీఎల్ఎఫ్ సాధించాయి. యూనిట్–2 గత ఆర్థిక సంవత్సరంలో 5 సార్లు అనగా జూలై, సెప్టెంబర్, అక్టోబర్‌లతో పాటు 2019 జనవరి, ఫిబ్రవరి నెలల్లో నూరుశాతం పీఎల్ఎఫ్ సాధించింది. స్టేషన్లో గల యూనిట్–1 గత ఆర్థిక సంవత్సరంలో 3 సార్లు అనగా సెప్టెంబర్ 2018, నవంబర్ 2018, ఫిబ్రవరి 2019లో నూరుశాతం పీఎల్ఎఫ్ సాధించడం విశేషం. 2018–19లో ప్లాంటులోని మొదటి యూనిట్ 4,455.09 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగా దీనిలో 4,203.42 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేసింది. రెండో యూనిట్ 4,243.39 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగా దీనిలో 4,007.60 మిలియన్ యూనిట్ల విద్యుత్తును గ్రిడ్‌కు సరఫరా చేసింది. ఈ విద్యుత్ కేంద్రం ప్రారంభమైన నాటినుండి ఇప్పటివరకూ 22,523.11 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేయగా దానిలో 21,161.17 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను రాష్ట్రానికి అందించింది. ఈ క్రమంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 2017–18లో జాతీయ స్థాయిలో 5వ ర్యాంకును సాధించింది. 2018–19లో స్టేషన్ సాధించిన ప్రగతిపై సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.