troy
-
తగ్గిన టెలికం యూజర్ల సంఖ్య
న్యూఢిల్లీ: టెలికం యూజర్ల సంఖ్య ఈ ఏడాది మే నెలలో 116.3 కోట్లకు తగ్గింది. ఏప్రిల్ నెలతో పోలిస్తే 0.49 శాతం క్షీణించింది. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ బుధవారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ పూర్తి స్థాయిలో అమలైన ఏప్రిల్‌లో టెలికం యూజర్ల సంఖ్య 85.3 లక్షల మేర క్షీణించి 116.94 కోట్లకు తగ్గింది. ఏప్రిల్‌తో పోలిస్తే మేలో యూజర్ల సంఖ్య తగ్గుదల 57.6 లక్షలకు పరిమితమైంది. మొబైల్ టెలిఫోనీ విభాగంలో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు చెరి 47 లక్షల యూజర్లను కోల్పోయాయి. ఎయిర్టెల్ వైర్లెస్ కస్టమర్ల సంఖ్య 31.7 కోట్లు, వొడాఫో¯Œ ఐడియా యూజర్ల సంఖ్య 30.9 కోట్లకు క్షీణించింది. జియో, బీఎస్ఎన్ఎల్ జోరు..: జియో 36 లక్షల కొత్త కనెక్షన్లు జారీ చేసింది. మొత్తం మీద 39.2 కోట్ల యూజర్లతో అగ్రస్థానంలో ఉంది. అటు ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య సైతం 2 లక్షలు పెరిగి 11.9 కోట్లకు చేరింది. పట్టణ ప్రాంతాల్లో క్షీణత..: పట్టణాల్లో మొబైల్ యూజర్ల సంఖ్య 92.3 లక్షల మేర తగ్గగా, గ్రామీణ ప్రాంతాల్లో 36.2 లక్షలు పెరిగింది. మే నెలాఖరు నాటికి మొత్తం మొబైల్ సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 114.39 కోట్లుగా, ల్యాండ్‌లైన్ యూజర్ల సంఖ్య 1.97 కోట్లుగా ఉంది. బీఎస్ఎన్ఎల్ ఫిక్స్డ్ లైన్ కస్టమర్ల సంఖ్య తగ్గుదల మేలోనూ కొనసాగింది. మొత్తం 1.34 లక్షలు క్షీణించింది. అటు జియో మాత్రం 90,000 కొత్త కస్టమర్లను సంపాదించుకుంది. పెరిగిన బ్రాడ్‌బ్యాండ్... మొత్తం టెలికం యూజర్ల సంఖ్య తగ్గినప్పటికీ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు మాత్రం పెరిగారు. వీరి సంఖ్య ఏప్రిల్‌లో 67.3 కోట్లుగా ఉండగా 1.13 శాతం పెరిగి 68.3 కోట్లకు చేరింది. వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు అత్యధికంగా 66.37 కోట్లుగా ఉండగా, వైర్‌లైన్ కనెక్షన్లు 1.93 కోట్లుగా ఉన్నాయి. -
తెలుగు రాష్ట్రాల్లో జియో జోష్..
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా జియో సృష్టించిన డిజిటల్ విప్లవం వల్ల డాటా శక్తిని ప్రతి ఒక్క పౌరుడు పొందగలిగిన విషయం తెలిసిందే. సమగ్ర మొబైల్ నెట్వర్క్ కు ప్రాధాన్యమిస్తున్న ఆంధ్రప్రదేశ్ జియో డిజిటల్ విప్లవంతో తెలుగు ప్రజానికానికి మరింత చేరువకానుంది. తాజాగా కొత్త మొబైల్ టవర్ల వల్ల, తెలంగాణ లో 10,000 టవర్ల కీలక మైలురాయిని జియో చేరుకుని నెట్‌వర్క్‌ల పరంగా మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జియో వినియోగదారులు జియో డిజిటల్ లైఫ్ సేవలను వేగంగా అందిపుచ్చుకున్నారు. కోటి మందికి పైగా చందాదారులు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ సేవలను పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల జియో అన్ని జిల్లాల నుంచి అనేక మంది చందాదారులను తన ఖాతాలో జమచేసుకుంటూ దుసుకెళ్తోంది. డాటా ద్వారా ప్రతి భారతీయున్ని శక్తివంతుడిని చేయాలన్న జియో సంకల్పం స్పూర్తిదాయకం, ఈ క్రమంలో అనేక అద్భుతాలను సృష్టించాలనే లక్ష్యంతో 35 నెలల క్రితం జియో సేవలు ప్రారంభమయ్యాయి. భారతదేశ డిజిటల్ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేయడంలో జియో అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. జియో అరంగేట్రం ద్వారా ప్రపంచంలోనే అతి ఎక్కువ మొబైల్ డాటా వినియోగదారుల్లో భారతదేశం నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. భారతదేశంలో ఉచిత వాయిస్ కాల్ సేవల కలను జియో నిజం చేసింది. డాటా వైపు ఈ మార్కెట్ వేగంగా సాగింది. ఈ డిజిటల్ విప్లవంలో వినియోగదారులు విజేతగా నిలిచారు. ప్రపంచంలోనే అతిపెద్ద డాటా నెట్వర్క్ కంపెనీగా జియో నిలిచింది. జూన్ 2019 ట్రాయ్ గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 33.12 కోట్ల మంది చందాదారులను జియో కలిగి ఉంది. కాగా ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ లో (ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు కలిపి) జియో వినియోగదారుల సంఖ్య 2 .64 కోట్లకు చేరుకుంది. ఈ రెండు రాష్ట్రాల్లో జియో 20000 కు పైగా టవర్లను ఇప్పటికే ఏర్పాటు చేసి సేవలు అందిస్తోంది. జియో నెట్వర్క్ పరిధి విశేషంగా పెంచుకున్న నేపథ్యంలో, రాష్ట్రంలోని ప్రతి ఇంటిని చేరుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. వారందరికీ జియో డిజిటల్ లైఫ్ ప్రయోజనాలు అందించాలని ఆకాంక్షిస్తోంది. ఆయా ప్రయోజనాలు ఇవి. ► జియో వినియోగదారులందరికీ సాటిలేని కనెక్టివిటీ సౌలభ్యం, 4జీ నెట్వర్క్ యొక్క శక్తివంతమైన మరియు విస్తృత శ్రేణి నెట్ వర్క్‌తో ఉత్తమ సేవలు. ► జియో యొక్క అన్లిమిటెడ్ వాయిస్, డాటా ప్రయోజనాలు ► జియో ప్రీమియం యాప్స్ ప్రయోజనాలు పొందే అవకాశం, జియో టీవీ (అత్యంత జనాదరణ పొందిన క్యాచ్ ఆప్ టీవీ యాప్), జియో మ్యూజిక్, జియో సినిమా సహా మరెన్నింటినో ఆనందించవచ్చు. ► జియో సిమ్ కార్డులను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉంచడం. ► జియో సేవలను సులభంగా, సౌకర్యవంతంగా పొందేలా తీర్చిదిద్దడం. -
ఆదాయంలో ‘జియో’ అగ్రస్థానం
న్యూఢిల్లీ: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో.. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) పరంగా టాప్ స్థానంలో నిలిచినట్లు ట్రాయ్ తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. టెలికం సబ్స్క్రైబర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటోన్న ఈ సంస్థ.. ఏజీఆర్ విషయంలోనూ ఇతర కంపెనీలను వెనక్కునెట్టి అగ్రస్థానానికి చేరింది. సంస్థకు మొబైల్ ఫోన్ సేవల నుంచి అందే ఆదాయం గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో 3.76 శాతం వృద్ధి చెంది రూ.9,839 కోట్లుగా నమోదైంది. అయితే, ఏడాది ప్రాతిపదికన ఈ స్థాయి వృద్ధి నమోదుకాగా, త్రైమాసికం పరంగా మాత్రం వృద్ధిలో వేగం నెమ్మదించింది. డిసెంబర్ త్రైమాసికంలో ఏకంగా 14.6 శాతం వృద్ధిని సాధించిన సంస్థ.. క్వార్టర్ ఆన్ క్వార్టర్ పరంగా ఆశించినస్థాయి వేగాన్ని అందుకోలేకపోయింది. ఇక చందాదారుల సంఖ్య పరంగా దేశీ అతిపెద్ద టెలికం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా ఏజీఆర్ త్రైమాసికం పరంగా 1.25 శాతం తగ్గి రూ.7,133.4 కోట్లుగా ఉంది. భారతీ ఎయిర్టెల్ ఏజీఆర్ ఎనిమిది శాతం తగ్గి రూ.5,920.2 కోట్లుగా నిలిచింది.ప్రభుత్వానికి చెందాల్సిన లైసెన్స్, ఇతర రుసుముల వాటా ఏజీఆర్ ఆధారంగానే నిర్ణయంకానుండగా.. మొత్తం టెలికం సర్వీసెస్ ఏజీఆర్‌లో యాక్సిస్ సేవల వాటా 72 శాతంగా ఉంది. మార్చి క్వార్టర్లో లైసెన్స్ ఫీజు రూ.2,888 కోట్లు కాగా, అంతక్రితం త్రైమాసికంలో రూ.2,890 కోట్లుగా ఉంది. పెరిగిన ఏఆర్పీయూ మార్చి త్రైమాసికంలో ఈ రంగ పనితీరును లెక్కకట్టడంలో భాగంగా ట్రాయ్ ‘భారత టెలికం సర్వీసెస్ పనితీరు సూచిక’ పేరిట నివేదికను విడుదలచేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. మార్చి చివరినాటికి 118.35 కోట్లకు సబ్స్క్రైబర్ల సంఖ్య తగ్గిపోయింది. డిసెంబర్ త్రైమాసికంతో పోల్చితే 1.20 శాతం, ఏడాది ప్రాతిపదికన 1.88 శాతం క్షీణించింది. 2018 డిసెంబర్లో 91.45 వద్ద ఉన్న మొత్తం టెలీడెన్సిటీ గతేడాది డిసెంబర్ నాటికి 90.11 వద్దకు పడిపోయింది. ఒక్కో చందాదారు సగటు ఆదాయం (ఏఆర్పీయూ).. వైర్లెస్ సేవల పరంగా మార్చి త్రైమాసికానికి 1.80 శాతం పెరిగి రూ.71.39 వద్దకు చేరుకుంది. అంతక్రితం త్రైమాసికంలో ఇది రూ.70.13 వద్ద ఉంది. -
ఫిబ్రవరిలో జియో, బీఎస్ఎన్ఎల్దే హవా
న్యూఢిల్లీ: దేశీ టెలికం సబ్స్క్రైబర్ల సంఖ్య ఫిబ్రవరి చివరినాటికి 120.50 కోట్లకు చేరింది. జనవరిలో ఈ సంఖ్య 120.37 కోట్లుగా ఉన్నట్లు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) వెల్లడించింది. రిలయన్స్ జియో, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ జోరు కారణంగానే వినియోగదారుల సంఖ్య ఈమేరకు పెరిగినట్లు ట్రాయ్ పేర్కొంది. ఈ రెండు దిగ్గజ సంస్థలు కలిపి ఫిబ్రవరిలో 86.39 లక్షల కస్టమర్లను జోడించగా.. మిగిలిన టెలికం కంపెనీలు 69.93 లక్షల వైర్లెస్ కస్టమర్లను కోల్పోయాయి. అత్యధికంగా వినియోగదారులను కోల్పోయిన కంపె నీల జాబితాలో.. వొడాఫోన్ ఐడియా తొలి స్థానంలో ఉన్నట్లు తేలింది. ఒక్క జియోనే ఫిబ్రవరిలో 77.93 లక్షల వినియోగదారులను జోడించి.. అనతికాలంలోనే ఏకంగా 30 కోట్ల సబ్స్క్రైబర్ల రికార్డును సొంతం చేసుకుంది. ఇదే సమయంలో బీఎస్ఎన్ఎల్ 9 లక్షల మందిని జోడించి కస్టమర్ల బేస్‌ను 11.62 కోట్లకు చేర్చింది. ఈ అంశంపై బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ‘మా సేవల పట్ల కస్టమర్లకు ఉన్న విశ్వాసం వల్లనే బేస్ పెరిగింది. సంస్థ 3జీ నెట్వర్క్ మరింత మెరుగుపడింది’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు వొడాఫోన్ ఐడియా 57.87 లక్షల సబ్స్క్రైబర్లను కోల్పోయింది. ఫిబ్రవరి చివరినాటికి ఈ సంస్థ వినియోగదారుల సంఖ్య 40.93 కోట్లకు తగ్గినట్లు ట్రాయ్ తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. -
‘కేబుల్ చానళ్ల ఎంపిక’పై హైకోర్టులో ముగిసిన వాదనలు
సాక్షి, హైదరాబాద్: కేబుల్ టీవీ చానళ్ల ఎంపికకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) తీసుకొచ్చిన కొత్త నిబంధనల అమలుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్న నేపథ్యంలో, వాటి అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న స్థానిక కేబుల్ ఆపరేటర్ల అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా, ట్రాయ్ ఏకపక్షంగా కొత్త నిబంధనలను రూపొందించిందని, అందువల్ల ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ స్థానిక కేబుల్ ఆపరేటర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు గురువారం విచారణ జరిపారు. కొత్త నిబంధనల వల్ల నష్టపోయేది తామేనని పిటిషనర్లు వివరిం చారు. ట్రాయ్ కొత్త నిబంధనలను రూపొందించేటప్పుడు తమను సంప్రదించలేదన్నారు. ఈ వాదనలను అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) తోసిపుచ్చారు. వీక్షకుల ప్రయోజనాల మేరకే ట్రాయ్ కొత్త నిబంధనలను తీసుకొచ్చిందన్నారు. వీక్షకులు తమకు నచ్చిన చానళ్లనే ఎంపిక చేసుకుంటారని, దీని వల్ల వారు తక్కువ మొత్తాన్ని చెల్లిస్తారని తెలిపారు. -
నిలచిన కేబుల్ ప్రసారాలు
సాక్షి, హైదరాబాద్ : కేబుల్ ప్రసారాలపై తాజాగా ట్రాయ్ విధించిన నిబంధనలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో శనివారం హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ప్రసారాలను నిలిపేసి ఆపరేటర్లు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ, ఏపీ ఎంఎస్ఒ, కేబుల్ ఆపరేటర్ల జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిపి తమ నిరసనతో పాటు కార్యాచరణను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంఎస్ఒ అసోసియేషన్ అధ్యక్షుడు కిశోర్, కేబుల్ టీవీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేంద్రలు మాట్లాడుతూ పే చానల్స్‌ను గతంలో ఉన్న ధరకే ఇవ్వాలని, గరిష్ట ధరను రుద్దవద్దని, జీఎస్టీని ఎత్తేయాలని డిమాండ్ చేశారు. గడువు, సమాచారం ఇవ్వకుండా ట్రాయ్ రెండో విడతగా పే చానల్స్‌ను కనిష్టంగా రూ.1 నుంచి 19 వరకు ప్రకటించడం సహేతుకం కాదన్నారు. గతంలో రూ.1 ఉన్న చానల్స్ కూడా ప్రస్తుతం రూ. 19 గా ప్రకటించడంతో వినియోగదారులపై మోయలేని భారం పడుతుందన్నారు. ఇలా ఒక్కో చానల్‌కు రూ.19 వంతున చెల్లిస్తే ప్రస్తుతం ఉన్న కేబుల్ చార్జీలు 200 నుంచి 800 దాటే అవకాశం ఉందన్నారు. ఇలా రేట్లు పెంచితే వినియోగదారులు తమను నిలదీయడమే కాకుండా డబ్బులు చెల్లించేందుకు నిరాకరించే పరిస్థితి వస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ రూపంలో 18 శాతం వసూలు చేస్తున్నాయని దాన్ని పూర్తిగా ఎత్తేయాలని కిశోర్, జితేంద్రలు డిమాండ్ చేశారు. బ్లాకవుట్ ఎప్పుడూ లేదు.. కేబుల్ చరిత్రలో బ్లాకవుట్ ఎప్పుడూ జరగలేదని, కేబుల్ రంగంలో ఇంతపెద్ద సమస్య ఎప్పుడూ రాలేదన్నారు. 2012లో డిజిటలైజేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించటంతో కేబుల్ ఆపరేటర్లు రూ.లక్షలు వెచ్చించి సెటప్ బాక్సులు పెట్టారన్నారు. 2015 కన్నా ముందు రూ.3 నుంచి 5 ఒక్కొ పే చానల్ ధర ఉండగా ప్రస్తుతం ట్రాయ్ ఒక్కసారిగా పెంచేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇదే అదనుగా ప్రతీ బ్రాడ్‌కాస్టర్ గతంలో తక్కువ ధర ఉన్న తమ చానల్ రేటును రూ.19కి పెంచి ఆ రేటుకే ఇస్తామని చెపుతున్నారన్నారు. ట్రాయ్ కొత్త టారిఫ్‌ను నియంత్రించాలని గతంలో ఉన్న టారిఫ్‌కే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తాము రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో రిట్ పిటీషన్ వేశామన్నారు. పే చానల్స్ ఏవో, ఫ్రీ చానల్స్ ఏవో వినియోగదారులకు తెలియకుండా తాము రూ.200 వసూలు చేసి అన్ని చానల్స్ ప్రసారం చేశామన్నారు. ఇలా చూపడంద్వారానే బ్రాడ్కాస్టర్లకు రేటింగులు పెరిగాయన్న విషయాన్ని వారు గుర్తుంచుకోవాలన్నారు. కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ గ్రేటర్ అధ్యక్షుడు హరిగౌడ్, గ్రేటర్ గౌరవాధ్యక్షుడు జి. భాస్కర్ రావు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.పి.రాంబాబు, సునీల్, సురేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాయ్ కొత్త టారిఫ్ పెంపుదలకు గడువు ఇవ్వండి
విజయవాడ: ట్రాయ్ కొత్త టారిఫ్ పెంపుదలకు కొంత గడువు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల ఎంఎస్ఓల ఫెడరేషన్ ప్రతినిధులు కోరారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి రాజ్వర్ధన్ సింగ్‌కు తెలుగు రాష్ట్రాల ఎంఎస్ఓ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. కొత్త టారిఫ్‌ను ఈనెల 29న అర్ధరాత్రి నుంచి అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. సుప్రీం తీర్పును అడ్డం పెట్టుకుని పే చానళ్ల ప్రతినిధులు అమాంతం ధరలు పెంచుతున్నాయన్నారు. దీనిపై చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల ఎంఎస్‌వోల ప్రతినిధులు టీవీ.రమేష్ బాబు, శ్రీనివాసరావు, సుభాష్ రెడ్డి నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజుతో కలిసి కేంద్ర మంత్రికి వినతిపత్రమిచ్చారు. -
నాలుగేళ్లలో... 5జీ: ట్రాయ్
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 5జీ టెలికం సర్వీసులపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో 2022 నాటికల్లా దేశీయంగా కూడా ఈ సర్వీసులు ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నట్లు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కార్యదర్శి ఎస్.కె.గుప్తా చెప్పారు. ఆ పై ఐదేళ్లలో డిజిటల్ మాధ్యమం మరింతగా అందుబాటులోకి వస్తుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటివి వినియోగదారుల ధోరణుల్లో మార్పులు తేగలవని గుప్తా చెప్పారు. ‘‘కొన్నాళ్లుగా మీడియా పరిశ్రమలో నాటకీయ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆయా సంస్థలు నిలదొక్కుకోవడానికి కొత్త టెక్నాలజీని వినియోగించటమనేది కీలకంగా మారుతోంది’’ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో గుప్తా వ్యాఖ్యానించారు. స్మార్ట్ఫోన్ల వాడకం పెరుగుతుండటంతో మీడియా కంటెంట్ స్వరూపంలో మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణమైన కంటెంట్‌ను అందించడంపై మీడియా పరిశ్రమ మరింతగా దృష్టి పెడితే, కంటెంట్ వినియోగం గణనీయంగా పెరగగలదని గుప్తా తెలిపారు. మరింత వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీసులకు 5జీ సేవలు ఉపయోగపడతాయి. అలాగే, తయారీ, రిటైల్, విద్య, వైద్యం తదితర రంగాల వృద్ధికి గణనీయంగా తోడ్పడే అవకాశం ఉంది. 5జీతో జీడీపీ రెట్టింపు: అరుణ సుందరరాజన్ స్థూల దేశీయోత్పత్తిని రెట్టింపు చేయగలిగే సత్తా 5జీ సేవలకుదన్న అంచనాల నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ టెలికం ఇన్ఫ్రాపై భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ చెప్పారు. అంతర్జాతీయంగా టెలికం రంగంపై పెట్టుబడులు 4 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరనున్నాయని, ఒక్క చైనాయే డిజిటల్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రా ఏర్పాటుపై ఏటా 188 బిలియన్ డాలర్లు వెచ్చిస్తోందని ఆమె తెలిపారు. కేవలం 5జీకే చైనా బడ్జెట్ సుమారు 500 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉందన్నారు. బ్రాడ్ బ్యాండ్ ఇండియా ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అరుణ ఈ విషయాలు చెప్పారు. మరోవైపు, నిర్దాక్షిణ్యమైన పోటీ వల్ల భారత టెలికం పరిశ్రమ పెను సవాళ్లమయంగా మారిందని అరుణ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ భారీ పెట్టుబడులను ఆకర్షించేంత లాభదాయకత, వ్యాపార అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయని చెప్పారామె. ‘‘దేశీ టెలికం పరిశ్రమమ ఇప్పుడిప్పుడే విప్లవాత్మకమైన మార్పులను చూస్తోంది. రాబోయే రోజుల్లో ఇలాంటివి మరెన్నో చూడాల్సి వస్తుంది’’ అని ఆమె వ్యాఖ్యానించారు. నిలకడగా మూడు దశాబ్దాల పాటు భారత్ 9– 10 శాతం మేర వృద్ధి చెందాలంటే డిజిటల్ వైపు మళ్లాల్సిన అవసరం ఉందని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. ఇందుకోసం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పటిష్టం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. వచ్చే ఏడాది వన్ ప్లస్ 5జీ ఫోన్.. 5జీ టెక్నాలజీ సేవలకు ఉపయోగపడే స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే ఏడాది ఆవిష్కరించనున్నట్లు చైనా హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్ వెల్లడించింది. ముందుగా యూరప్‌లో దీన్ని ప్రవేశపెడతామని స్నాప్‌డ్రాగన్ టెక్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా వన్‌ప్లస్ సీఈవో పీట్ లౌ తెలిపారు. టెలికం ఆపరేటర్ ఈఈ భాగస్వామ్యంతో దీన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలియజేశారు. మరింత శక్తిమంతమైన స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌తో ఇది రూపొందుతుందని పీట్ చెప్పారు. -
బ్యాలెన్స్ ఉన్నా సేవలు ఎలా ఆపేస్తారు..
న్యూఢిల్లీ: టెలికం సర్వీసులను యథాప్రకారం పొందాలంటే ప్రతి నెలా తప్పనిసరిగా కనీస రీచార్జ్ చేసుకోవాలంటూ యూజర్లకు టెల్కోలు మెసేజీలు పంపిస్తుండటంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పందించింది. తమ ప్రీ–పెయిడ్ అకౌంట్స్‌లో తగినంత బ్యాలెన్స్ ఉన్నా టెల్కోలు ఈ తరహా మెసేజీలు పంపిస్తున్నాయంటూ సబ్‌స్క్రయిబర్స్ నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో ఆపరేటర్లకు ట్రాయ్ అక్షింతలు వేసింది. అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నా సర్వీసులు డిస్కనెక్ట్ ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. తగినంత ప్రీ–పెయిడ్ బ్యాలెన్స్ ఉన్న కస్టమర్లకు సర్వీసులను తక్షణమే డిస్కనెక్ట్ చేయొద్దంటూ టెల్కోలను ఆదేశించింది. ‘టారిఫ్‌లు, ప్లాన్ల విషయంలో సాధారణంగా మేం జోక్యం చేసుకోము. కానీ అకౌంట్లో తగినంత బ్యాలెన్స్ ఉన్నా కూడా సర్వీసులు నిలిపివేస్తామంటూ యూజర్లను టెల్కోలు హెచ్చరిస్తుండటం.. మాత్రం సరికాదు’ అని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి టెలికం సంస్థలకు మంగళవారమే ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఆపరేటర్లతో గతవారమే భేటీ అయిన ట్రాయ్.. ఈ వివాదాన్ని సమగ్రంగా పరిశీలిస్తోంది. ఈలోగా ‘ప్రస్తుత ప్లాన్ వేలిడిటీ ఏ రోజుతో ముగిసిపోతుందన్నది, మినిమం రీచార్జ్ ప్లాన్ సహా అందుబాటులో ఉన్న ప్లాన్స్ అన్నింటి గురించీ సబ్స్క్రయిబర్స్కు స్పష్టంగా, పారదర్శకంగా తెలియజేయాలి. ప్రీ–పెయిడ్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే దానితో సదరు ప్లాన్స్ ఎలా కొనుగోలు చేయొచ్చ న్నదీ వివరంగా తెలపాలి‘ అని టెల్కోలను ట్రాయ్ ఆదేశించింది. 72 గంటల్లోగా ఈ విషయాలను ఎస్ఎంఎస్ ద్వారా యూజర్లకు తెలియజేయాలని సూచించింది. అప్పటిదాకా కనీస రీచార్జ్ మొత్తానికి సరిసమానంగా అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్న పక్షంలో సర్వీసులు డిస్కనెక్ట్ చేయరాదంటూ ఆదేశించింది. -
కాల్ కనెక్షన్ టైమ్‌పైనా ట్రాయ్ దృష్టి
న్యూఢిల్లీ: టెల్కోలు మరింత మెరుగైన సర్వీసులు అందించేలా టెలికం రంగ నియంత్రణ ట్రాయ్ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. తాజాగా కాల్ కనెక్షన్ టైమ్, కాల్ మ్యూట్ అంశాలను కూడా నాణ్యతా ప్రమాణాల జాబితాలోకి చేర్చింది. అక్టోబర్ 1 నుంచి వీటికి సంబంధించిన డేటాను సేకరిస్తున్నట్లు, తగు పరిష్కార మార్గాలను కనుగొనడంపై దృష్టి పెట్టనున్నట్లు ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. నంబర్ డయల్ చేసిన తర్వాత కాల్ కనెక్ట్ అవడానికి పట్టే వ్యవధిని కాల్ కనెక్షన్ టైమ్‌గా వ్యవహరిస్తారు. ఇటీవలి కాలంలో కొన్ని సందర్భాల్లో డయల్ చేసిన 30 సెకన్ల దాకా కూడా కాల్ కనెక్ట్ కాకపోతుండటాన్ని గుర్తించిన ట్రాయ్ .. తగు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు శర్మ తెలిపారు. -
మరింత సులువుగా నంబరు పోర్టబిలిటీ
న్యూఢిల్లీ: మొబైల్ నంబర్ పోర్టబిలిటీని (ఎంఎన్‌పీ) మరింత సులభతరం చేసే క్రమంలో ఇందుకు సంబంధించిన నిబంధనలను సడలించే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రతిపాదనలు చేసింది. వీటి ప్రకారం ఇకపై యూనిక్ పోర్టింగ్ కోడ్ (యూపీసీ)ని జనరేట్ చేసే బాధ్యతను ఎంఎన్‌పీ సర్వీస్ ప్రొవైడర్ (ఎంఎన్‌పీఎస్‌పీ)కి అప్పగించింది. ప్రస్తుత విధానం ప్రకారం టెలికం సంస్థే దీన్ని జనరేట్ చేసి సబ్‌స్క్రయిబర్‌కి పంపుతోంది. అయితే, నంబర్ పోర్ట్ చేసుకోవడానికి అర్హులా కాదా అన్నది సదరు సబ్‌స్క్రయిబర్‌కి తెలియడానికి నాలుగు రోజుల దాకా పట్టేస్తోంది. కొన్ని సందర్భాల్లో బిల్లుల బకాయిలు ఉన్నాయనో లేదా ప్రత్యేక స్కీమ్స్ కింద కనెక్షన్ ఇచ్చామనో టెలికం సంస్థలు ఎంఎన్‌పీ అభ్యర్ధనను తిరస్కరిస్తున్నాయి. ఎంఎన్‌పీఎస్‌పీలు సమర్పించిన నివేదిక ప్రకారం.. మొత్తం పోర్టింగ్ అభ్యర్ధనల్లో దాదాపు 11 శాతం అభ్యర్ధనలను టెలికం సంస్థలు వివిధ కారణాలతో తిరస్కరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త సవరణలను ట్రాయ్ ప్రతిపాదించింది. యూపీసీ వ్యవధి ముగిసిపోయిందని, సరిపోలడం లేదన్న కారణాలతో కూడా టెల్కోలు పోర్టింగ్ అభ్యర్ధనలను తిరస్కరిస్తుండటాన్ని కూడా ట్రాయ్ పరిగణనలోకి తీసుకుంది. దీంతో.. ఇకపై టెలికం యూజరు గానీ నంబర్ పోర్టబిలిటీ అభ్యర్ధిస్తే వారి టెలికం సంస్థ .. దాన్ని ఎంఎన్‌పీఎస్‌పీకి పంపుతుంది. ఆ తర్వాత యూజర్ వివరాలన్నీ పరిశీలించిన మీదట పోర్టబిలిటీకి అర్హులని భావించిన పక్షంలో ఎంఎన్‌పీఎస్‌పీనే వారికి యూపీసీని సత్వరం జారీ చేస్తుంది. తద్వారా ఈ ప్రక్రియకు పట్టే సమయం తగ్గనుంది. అలాగే జారీ అయిన యూనిక్ కోడ్ వర్తించే కాలావధిని ఏడు పని దినాల నుంచి నాలుగు పనిదినాలకు ట్రాయ్ తగ్గించింది. ఈ ప్రతిపాదనలపై అక్టోబర్ 24 దాకా ప్రజలు తమ అభిప్రాయాలను ట్రాయ్‌కి తెలియజేయొచ్చు. వేరే టెలికం సంస్థకు మారినా.. పాత మొబైల్ నంబరునే కొనసాగించుకునే వెసులుబాటు నంబర్ పోర్టబిలిటీతో లభిస్తుందన్న సంగతి తెలిసిందే. జరిమానాలు కూడా.. ట్రాయ్ ప్రతిపాదనల ప్రకారం నిర్దేశిత గడువు నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో టెలికం సంస్థకు రూ. 5,000 జరిమానా విధిస్తారు. ఒకవేళ అర్హతపరమైన నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో జరిమానా రూ. 10,000గా ఉంటుంది. మరోవైపు, నిబంధనలను అమలు చేయడానికి పెనాల్టీలు విధించడమొక్కటే మార్గం కాదని.. సమన్వయంతో కలిసి పనిచేయడం ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం శ్రేయస్కరమని సెల్యులార్ ఆపరేటర్స్ సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ అభిప్రాయపడ్డారు. ఎయిర్‌సెల్, టెలినార్, ఆర్‌కామ్ మూతబడిన తర్వాత ఎంఎన్‌పీకి డిమాండ్ గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. -
సాధారణ పౌరుడిగానే సవాలు విసిరా
న్యూఢిల్లీ: తన ఆధార్ వివరాలు దుర్వినియోగం చేసి చూపాలని నెటిజన్లకు సవాలు విసిరిన టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్) చైర్మన్ ఆర్ఎస్ శర్మ ఆదివారం వెనక్కు తగ్గారు. తాను ఓ సాధారణ భారతీయుడిగానే ఈ సవాలు విసిరాననీ, ట్రాయ్ చైర్మన్‌గా కాదని వివరణ ఇచ్చారు. సమాచార గోప్యతపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ శుక్రవారం ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో.. పౌరుల వ్యక్తిగత సమాచార పరిరక్షణకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకోసం ఆధార్ చట్టానికి సవరణలు చేయాలని ఆదేశించింది. దీంతో తన ఆధార్ నెంబర్‌ను బయటకు వెల్లడించిన శర్మ.. దమ్ముంటే దాన్ని దుర్వినియోగం చేయాలని సవాలు విసిరారు. శర్మ సవాలుకు స్పందించిన పలువురు హ్యాకర్లు.. ఆధార్‌తో లింక్ అయిన 2 ఈ–మెయిల్స్, ఫోన్ నంబర్, పాన్, వ్యక్తిగత చిరునామా, ఎయిర్ఇండియా ఆయనకు కేటాయించిన ఫ్రీక్వెంట్ ఫ్లయర్ నంబర్(103546250)ను బయటపెట్టారు. కొందరైతే ఆయన నంబర్‌తో నకిలీ ఆధార్‌ను తయారుచేసి ఫేస్బుక్, అమెజాన్ క్లౌడ్ సర్వీసెస్‌లో రిజిస్టర్ కాగా, మరికొందరు ఆయనకు ఖరీదైన మొబైల్ ఫోన్లను క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ పెట్టి కసి తీర్చుకున్నారు. -
నెట్ న్యూట్రాలిటీకి ఓకే..
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ కంటెంట్ అందించే విషయంలో సర్వీస్ ప్రొవైడర్లు పక్షపాత ధోరణితో వ్యవహరించకుండా నియంత్రించే దిశగా నెట్ న్యూట్రాలిటీ నిబంధనలకు టెలికం కమిషన్ (టీసీ) ఆమోదముద్ర వేసింది. ఇందుకు సంబంధించి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చేసిన సిఫార్సులను బుధవారం జరిగిన సమావేశంలో ఆమోదించింది. రిమోట్ సర్జరీ, అటానామస్ కార్లు మొదలైన కీలక అప్లికేషన్స్, సర్వీసులకు మాత్రం నెట్ న్యూట్రాలిటీ నిబంధనల నుంచి మినహాయింపు లభించనుంది. టెలికం కమిషన్ చైర్మన్ అరుణ సుందరరాజన్ ఈ విషయాలు వెల్లడించారు. ‘నెట్ న్యూట్రాలిటీపై ట్రాయ్ చేసిన సిఫార్సులను టెలికం కమిషన్ (టీసీ) ఆమోదించింది. కొన్ని క్రిటికల్ సేవలకు మాత్రం ఈ నిబంధనల నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉంది‘ అని ఆమె పేర్కొన్నారు. ఈ నిబంధనల అమలు, పర్యవేక్షణ కోసం టెలికం శాఖ (డాట్) ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందులో ప్రభుత్వ అధికారులు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రొవైడర్స్, టెలికం ఆపరేటర్లు, పౌర సమాజ సభ్యులు, వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థల ప్రతినిధులు మొదలైన వారు సభ్యులుగా ఉంటారు. కీలకమైన సర్వీసులకు సంబంధించిన డేటా ట్రాఫిక్ నిర్వహణ విషయంలో అనుసరించాల్సిన విధానాల గురించి టెలికం శాఖ .. ట్రాయ్ సిఫార్సులు కోరనుంది. సర్వీస్ ప్రొవైడర్లు కొన్ని వెబ్సైట్లు, సర్వీసులకే ప్రాధాన్యమిస్తూ మిగతా వాటిని బ్లాక్ చేయడం లేదా నెట్ వేగాన్ని తగ్గించేయడం వంటి పక్షపాత ధోరణులతో వ్యవహరించకుండా తటస్థంగా ఉండేలా చూడటం .. నెట్ న్యూట్రాలిటీ ప్రధాన ఉద్దేశం. ఇంటర్నెట్ కంటెంట్‌ను అందించడంలో వివక్ష ధోరణులకు దారి తీసేలా.. ఏ సంస్థలతోనూ సర్వీస్ ప్రొవైడర్లు ఒప్పందాలు కుదుర్చుకోకూడదని ట్రాయ్ సిఫార్సు చేసింది. అలాగే నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కంటెంట్‌ను బట్టి ఇంటర్నెట్ వేగాన్ని నియంత్రించడం వంటి పక్షపాత దోరణులకు పాల్పడకుండా నిర్దిష్ట ఆంక్షలు ఉండేలా లైసెన్సింగ్ నిబంధనల్లోనూ మార్పులు చేయాలని కూడా సూచించింది. ‘డిజిటల్ కమ్యూనికేషన్స్’కు ఆమోదం కొత్త టెలికం విధానానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తీసుకునే దిశగా జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్స్ విధానం (ఎన్డీసీపీ) 2018కి కూడా టెలికం కమిషన్ ఆమోదముద్ర వేసినట్లు సుందరరాజన్ తెలిపారు. ‘భౌతిక మౌలిక సదుపాయాల కన్నా డిజిటల్ మౌలిక సదుపాయాలు ప్రస్తుతం దేశానికి చాలా కీలకమని సమావేశంలో సభ్యులంతా అభిప్రాయపడ్డారు. సాధ్యమైనంత త్వరగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చెప్పారు. సంస్కరణల ఊతంతో 2022 నాటికి డిజిటల్ కమ్యూనికేషన్స్ రంగంలో రూ. 6.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు కొత్తగా 40 లక్షల ఉద్యోగాల కల్పన, సెకనుకు 50 మెగాబిట్ వేగంతో ప్రజలందరికీ బ్రాడ్‌బ్యాండ్‌ను అందుబాటులోకి తేవడం మొదలైన లక్ష్యాలను ఎన్‌డీసీపీలో నిర్దేశించుకున్నారు. పంచాయతీల్లో 12.5 లక్షల వై–ఫై హాట్‌స్పాట్స్ సుమారు రూ. 6,000 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌తో 2018 డిసెంబర్ ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో సుమారు 12.5 లక్షల వై–ఫై హాట్‌స్పాట్స్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కూడా కమిషన్ ఓకే చెప్పినట్లు సమావేశంలో పాల్గొన్న అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద పోలీస్ స్టేషన్లు, పోస్టాఫీసులు, ప్రాథమిక వైద్య కేంద్రాలు, పాఠశాలలను వై–ఫై సర్వీసులతో అనుసంధానించనున్నారు. రోజంతా ప్రజల వినియోగానికి 1–2 వైఫై హాట్‌స్పాట్స్ అదనంగా అందుబాటులో ఉంటాయి. మరోవైపు, టెలికం ఆపరేటర్ల నుంచి టాక్‌టైమ్, డేటా మొదలైనవి కొనుగోలు చేసి తమ బ్రాండ్ కింద రిటైల్‌గా విక్రయించే వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్స్ (వీఎన్‌వో)పై విధిస్తున్న ద్వంద్వ పన్నులను నివారించే ప్రతిపాదనను కూడా టెలికం కమిషన్ ఆమోదించింది. -
సీవోఏఐ ఆరోపణలకు అర్థం లేదు: ట్రాయ్
న్యూఢిల్లీ: టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజాగా సెల్యులర్ ఆపరేటర్స్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) ఆరోపణలను కొట్టిపారేసింది. నిరూపించలేని ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించింది. జియో పేరు ప్రస్తావించకుండానే ట్రాయ్ ఆర్డర్లు ఒక ఆపరేటర్‌కు మాత్రమే లబ్ధి కలిగించేలా ఉన్నాయని సీవోఏఐ ఆరోపించిన విషయం తెలిసిందే. ‘రెగ్యులేటరీ పారదర్శకంగా పనిస్తోంది. సీవోఏఐకి ట్రాయ్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం అలవాటుగా మారింది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి’ అని ట్రాయ్ సెక్రటరీ ఎస్కే గుప్తా చెప్పారు. సీవోఏఐ చేసిన ఆరోపణలకు అర్థం లేదని, నిరాధారమైనవని తెలిపారు. తగిన మార్గాలను అన్వేషిస్తున్నాం: సీవోఏఐ ట్రాయ్ రియాక్షన్‌పై సీవోఏఐ స్పందించింది. ‘చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తున్నాం. ప్రిడేటరీ ప్రైసింగ్‌కు (ఒక కంపెనీ ఇతర కంపెనీలు పోటీపడలేని స్థాయిలో తన సర్వీసులను తక్కువ ధరకు అందించడం. దీని వల్ల మిగిలిన కంపెనీలు చివరకు బలవంతంగా వాటి కార్యకలాపాలు మూసివేయాల్సి వస్తుంది) సంబంధించి ట్రాయ్ నిర్ణయాలకు వ్యతిరేకంగా మేం చేసిన ఫిర్యాదుల విషయమై వీలైతే టెలికం విభాగం, పీఎంవో కార్యాలయాలను సంప్రదిస్తాం’ అని పేర్కొంది. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి తమ ఆపరేటర్లు ఒకటి లేదా రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు. కాగా సీవోఏఐ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో.. గత 12–18 నెలల్లో ట్రాయ్ తీసుకున్న నిర్ణయాలు ఒక ఆపరేటర్‌కు మాత్రమే అనుకూలముగా, మిగిలిన వాటికి ప్రతికూలముగా ఉన్నాయని ఆరోపించింది. -
నంబర్ పోర్టబిలిటీ చార్జీలు ఇక 4 రూపాయలే
న్యూఢిల్లీ: టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) చార్జీలను ఏకంగా 79 శాతం తగ్గించింది. గరిష్టంగా రూ. 4కి పరిమితం చేసింది. ఇప్పటిదాకా ఎంఎన్‌పీ పోర్టబిలిటీ గరిష్ట రేటు రూ. 19గా ఉంది. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ సర్వీస్ ప్రొవైడర్స్ (ఎంఎన్‌పీఎస్‌పీ) వ్యయాలు గణనీయంగా తగ్గడంతో పాటు ఎంఎన్‌పీ అభ్యర్ధనలు పెరిగిన నేపథ్యంలో పోర్టింగ్ లావాదేవీల చార్జీలను తగ్గించాలని నిర్ణయించినట్లు ట్రాయ్ తెలిపింది. ఎంఎన్‌పీ చార్జీల సవరణపై డిసెంబర్లో ట్రాయ్ చర్చల ప్రక్రియ ప్రారంభించింది. 2015 జులై 3 నుంచి పెరిగిన పోర్టింగ్ అభ్యర్ధనలు, ఎంఎన్‌పీఎస్‌పీల ఆర్థిక ఫలితాలను బట్టి చూస్తే వ్యయాలు, చార్జీలపరంగా రూ. 19 గరిష్ట పరిమితి చాలా ఎక్కువేనని భావించిన ట్రాయ్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. -
కొత్త టెలికం పాలసీపై కసరత్తు
న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చిలోగా కొత్త జాతీయ టెలికం విధానాన్ని (ఎన్టీపీ) ఖరారు చేసే ప్రక్రియ మరింత వేగం పుంజుకుంది. ఇందులో భాగంగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ బుధవారం చర్చాపత్రాన్ని విడుదల చేసింది. టెలికం ఆపరేటర్లు, పరికరాల తయారీ సంస్థలు, పరిశ్రమ వర్గాలు, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లు మొదలైన వారితో ప్రాథమికంగా సంప్రతింపులు జరిపిన అనంతరం తమ అభిప్రాయాలను క్రోడీకరించి ఈ చర్చాపత్రాన్ని రూపొందించినట్లు ట్రాయ్ తెలిపింది. జాతీయ టెలికం విధానంలో భాగంగా నిర్దేశించుకున్న కోటి బహిరంగ వై–ఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటు, 2 ఎంబీపీఎస్ కనీస డౌన్లోడ్ స్పీడుతో 90 కోట్ల బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు, వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీకి సంబంధించి సగటున 20 ఎంబీపీఎస్ స్పీడు సాధించడం తదితర లక్ష్యాలను చర్చాపత్రంలో ట్రాయ్ పొందుపర్చింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ)పై ప్రధానంగా దృష్టి సారించడంతో పాటు కమ్యూనికేషన్స్ రంగంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యాలు కూడా ఉన్నాయి. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం చార్జీలను పునఃసమీక్షించడం, దేశవ్యాప్తంగా సర్వీసులకు ఒకే లైసెన్సు విధానం, మౌలిక రంగం స్థాయిలో కమ్యూనికేషన్ ఇన్ఫ్రా ప్రాజెక్టులకు రుణ సదుపాయం అందుబాటులో ఉంచడం తదితర వ్యూహాల ద్వారా ఈ లక్ష్యాలు సాధించవచ్చని చర్చాపత్రంలో ట్రాయ్ వివరించింది. చర్చాపత్రంలో పొందుపర్చిన అంశాలపై సంబంధిత వర్గాలు జనవరి 19లోగా తమ అభిప్రాయాలు రాతపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది మార్చి నాటికి కొత్త టెలికం విధానాన్ని ఖరారు చేయాలని టెలికం శాఖ యోచిస్తోంది. -
కేబుల్ టీవీ ప్రసారాలపై పిల్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: కేబుల్ టీవీ ప్రసారాల రంగంలోకి అడుగుపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరోధించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సిఫార్సులు మాత్రమే పిటిషనర్ తన వాదనకు మద్దతుగా చూపారని, ఇతర బలమైన ఆధారాలు చూపలేదని తెలిపింది. ట్రాయ్ చేసినవన్నీ సిఫార్సులేనని, వాటిని అమలు చేయాలని చట్టంలో ఎక్కడా లేదని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ట్రాయ్ సిఫారసులను ఆమోదించి చట్టం చేసి ఉంటే వాటిని అమలు చేయమని ఆదేశించేందుకు ఆస్కారం ఉండేదని తెలిపింది. ప్రభుత్వమే కేబుల్ నెట్‌వర్క్‌లోకి ప్రవేశిస్తే టీవీ ప్రసారాలు ఏకపక్షంగా ఉంటాయని, విపక్షాల గొంతు నొక్కే ప్రమాదం ఉందంటూ మంగళగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిల్‌ను దాఖలు చేశారు. -
కేబుల్ టీవీ ప్రసారాల్లో సర్కారు జోక్యాన్ని నిరోధించండి
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టులో పిటిషన్ సాక్షి, హైదరాబాద్: కేబుల్ టీవీ ప్రసారాల రంగంలోకి అడుగుపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరోధించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం కేబుల్ టీవీ ప్రసారాల రంగంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకునేలా టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)తో పాటు ఆర్థిక, పెట్టుబడుల శాఖలను ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ వ్యాజ్యాన్ని వేశారు. సర్కారు జోక్యం రాజ్యాంగ విరుద్ధం రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా కేబుల్ టీవీ ప్రసారాల రంగంలోకి దిగరాదని సర్కారియా కమిషన్ 2008లో కేంద్ర ప్రసారశాఖకు సిఫారసులు పంపిందని రామకృష్ణా రెడ్డి తెలిపారు. బ్రాడ్‌కాస్టింగ్ మీడియా ప్రభుత్వ నియంత్రణలో ఉండకూడదంటూ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా సర్కారియా కమిషన్ ఈ సిఫారసులు చేసిందన్నారు. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపే అవకాశం ఉంది. -
గతవారం బిజినెస్
121 కోట్లు దాటిన టెలికం సబ్స్క్రైబర్లు దేశంలో టెలికం సబ్స్క్రైబర్ల సంఖ్య జూన్ నెల చివరకు 121 కోట్ల మార్క్‌ను అధిగమించింది. మే నెల చివరిలో 120.49 కోట్లుగా ఉన్న టెలికం యూ జర్ల సంఖ్య జూన్ చివరకు 121.08 కోట్లకు పెరిగింది. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ ఈ విషయాలను వెల్లడించింది. మొబైల్ సబ్స్క్రైబర్ల సంఖ్య నికరంగా 60 లక్షలకుపైగా పెరుగుదలతో 118.6 కోట్లకు చేరింది. వీరిలో 102.27 కోట్ల మంది యాక్టివ్‌గా ఉన్నా రు. ఇక ల్యాండ్‌లైన్ సబ్స్క్రైబర్ల సంఖ్య 2.4 కోట్లకు క్షీణించింది. రిలయన్స్, బీపీకి 1,700 కోట్ల జరిమానా గత ఆర్థిక సంవత్సరం కేజీడీ–6 క్షేత్రాల నుంచి నిర్దేశిత లక్ష్యాలకన్నా తక్కువగా గ్యాస్ ఉత్పత్తి చేసినందుకు గాను రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్య సంస్థలపై కేంద్రం మరో 264 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,700 కోట్లు) జరిమానా విధించింది. దీంతో 2010 ఏప్రిల్ 1 నుంచి దాదాపు ఆరేళ్లుగా లక్ష్యాలను సాధించలేకపోవడం వల్ల విధించిన మొత్తం పెనాల్టీ సుమారు 3.02 బిలియన్ డాలర్లకి (దాదాపు రూ. 19,500 కోట్లు) చేరిందని చమురు శాఖ తెలిపింది. బంగారం ఎగుమతులపై కేంద్రం నిషేధం కేంద్రం 22 క్యారెట్లకుపైన స్వచ్ఛత గల బంగారం ఉత్పత్తుల ఎగుమతులను నిషే ధించింది. బంగారం ఉత్పత్తుల రౌండ్ ట్రి ప్పింగ్‌ను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 8 క్యారెట్లు నుంచి 22 క్యారెట్ల వరకు స్వచ్ఛత గల బంగారం ఎగుమతులకే అనుమతులున్నాయి. కొత్త ప్రీమియం ఆదాయంలో 47% వృద్ధి దేశంలోని మొత్తం 24 జీవిత బీమా కంపెనీల కొత్త ప్రీమియం ఆదాయంలో జూలై నెలలో 47.4% వృద్ధి నమోదయ్యింది. ఇది రూ.20,428 కోట్లకు చేరింది. కాగా గతేడాది ఇదే కాలంలో సంస్థల కొత్త ప్రీమియం ఆదాయం రూ.13,854 కోట్లుగా ఉంది. ఐఆర్డీఏ గణాంకాల ప్రకారం.. ప్రభుత్వ రంగ ఎల్ఐసీ ప్రీమియం ఆదాయం 51% వృద్ధితో రూ.10,738 కోట్ల నుంచి రూ.16,255 కోట్లకు పెరిగింది. ఇక మిగిలిన 23 ప్రైవేట్ సంస్థల ప్రీమియం ఆదాయం 34% వృద్ధితో రూ.3,117 కోట్ల నుంచి రూ.4,173 కోట్లకు ఎగిసింది. త్వరలో కొత్త రూ.50 నోట్లు ఆర్బీఐ త్వరలో మహాత్మా గాంధీ నూతన సిరీస్‌లో కొత్త రూ.50 నోట్లను తీసుకురానుంది. ఇవి నీలి (ఫ్లోరోసెంట్ బ్లూ) రంగులో ఉంటాయి. వీటిపై ఒకవైపు భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా హంపీ రథం, స్వచ్ఛ్ భారత్ లోగో.. మరొకవైపు మహాత్మా గాంధీ, అశోక స్తంభం చిహ్నం ఉంటాయి. ఉద్దేశపూర్వక ఎగవేతలు 92,000 కోట్లు ప్రభుత్వ బ్యాంకులకు ఉద్దేశపూర్వక రు ణ ఎగవేతలు 20% పెరిగిపోయాయి. 2016–17 ఆర్థిక సంవత్సరం చివరికి 9,000 మంది రూ.92,376 కోట్ల మేర బ్యాంకులకు ఎగ్గొట్టారు. 2016 మార్చి నాటికి ఇలా ఉద్దేశ పూర్వకంగా చెల్లించని రుణాల మొత్తం రూ.76,685 కోట్లుగానే ఉంది. ఇక ఉద్దేశపూర్వక ఎగవేత కేసులు ఈ ఏడాది మార్చి నాటికి 8,915కు పెరిగాయి. కాల్డ్రాప్స్ ఉదంతాల్లో కఠిన చర్యలు కాల్డ్రాప్స్ సమస్య పరిష్కారంపై ట్రాయ్ మరింతగా దృష్టి సారించింది. వరుసగా మూడు త్రైమాసికాలు ఆపరేటర్లు గానీ ప్రమాణాలు పాటించకపోతే రూ. 10 లక్షల దాకా జరిమానా చెల్లించాల్సి వచ్చేలా కఠినతరమైన మార్గదర్శకాలు జారీ చేసింది. -
ఎంఎన్‌పీ సమస్యలకు ట్రాయ్ చెక్
న్యూఢిల్లీ: నంబర్ పోర్టబిలిటీ అభ్యర్థనలు తిరస్కరణకు గురవుతున్న ఉదంతాలను నియంత్రించే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎంఎన్‌పీ క్లియరింగ్ హౌస్ (ఎంసీహెచ్) ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. నంబర్ పోర్టబిలిటీ ప్రక్రియకు సంబంధించిన వివరాలన్నీ ఎంసీహెచ్‌లో అందుబాటులో ఉండేలా చూడాలని ప్రతిపాదించింది. ప్రస్తుత విధానం ప్రకారం నెట్వర్క్ మారదల్చుకున్న వారి గత బిల్లింగ్ బకాయిల వివరాలు, అందుకున్న నోటీసులు, విశిష్ట పోర్టింగ్ కోడ్ (యూపీసీ) ఆఖరు తేదీ మొదలైనవి కొత్త ఆపరేటరు (ఆర్వో)కి అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఆయా అంశాలను ధ్రువీకరించు కోలేక పలు నంబర్ పోర్టబిలిటీ అభ్యర్థనలను ఆపరేటర్లు తిరస్కరించాల్సి వస్తోంది. తిరస్కరణకు గురైన కేసుల్లో దాదాపు 40 శాతం అభ్యర్ధనలు యూపీసీ సరిపోలకపోవడం, యూపీసీ గడువు ముగిసిపోవడం వంటి అంశాల కోవకి చెందినవే ఉంటున్నాయి. ఇది గుర్తించిన ట్రాయ్.. ప్రస్తుత పోర్టబిలిటీ ప్రక్రియలో ఎంసీహెచ్‌ని కూడా చేర్చాలని భావించింది. దీనిపై ఆగస్టు 31 దాకా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను ట్రాయ్‌కి తెలియచేయొచ్చు. -
ట్రాయ్ ఎఫెక్ట్: ఎయిర్టెల్, ఐడియా షేర్లు రయ్
ముంబై: ఉచిత ఆఫర్లతో సునామిలా దూసుకొచ్చిన రిలయన్స్ జియోకు టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ అనూహ్యంగా చెక్ పెట్టడం దేశీయ టెలికాం ఆపరేటర్లకు బాగా కలిసి వచ్చింది. జియో తాజా సమ్మర్ సర్ప్రైజ్ ఉచిత ఆఫర్లను నిలిపివేయాలంటూ ట్రాయ్ ఆ దేశించడంతో ప్రత్యర్థి సంస్థలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా భారతి ఎయిర్ టెల్, ఐడియా తదితర మేజర్ కంపెనీలు పండగ చేసుకుంటున్నాయి. శుక్రవారం నాటిమార్కెట్లో మదుపర్లు టెలి కాం ఇండెక్స్ లో కొనుగోళ్లవైపు మొగ్గు చూపారు. ఒకవైపు దలాల్ స్ట్రీట్ నష్టాల పాలవుతుండగా టెలికాం షేర్లు మాత్రం లాభాలనార్జించడం విశేషం. భారతి ఎయిర్ టెల్ దాదాపు 3 శాతంపైగా జంప్‌చేసిటాప్ గెయినర్‌గా నిలిచింది. ఇదే బాటలో ఐడియా సెల్యులర్ పయనిస్తూ 2 శాతానికిపైగా పుంజుకుంది. మరోవైపు ఇటీవలి రికార్డ్‌స్తాయి లాభాలను పొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 1 శాతానిపైగా నష్టపోయింది. కాగా ఇటీవల టారిఫ్లలోకి ఎంట్రీ ఇచ్చిన జియో తన ప్రైమ్ మెంబర్షిప్ పథకంలో ఉచిత ఆఫర్‌ను మూడు నెలలపాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించి ప్రత్యర్థి కంపెనీలపై బాంబు వేసింది. అయితే జియో తాజా ఆఫర్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, తక్షణమే నిలిపివేయాలని ట్రాయ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. -
ట్రాయ్‌కు.. కాల్ ట్రాఫిక్ డేటా
అందజేసిన ఎయిర్టెల్, వొడాఫోన్, జియో న్యూఢిల్లీ: టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశాల మేరకు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, రిలయన్స్ జియో, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లు తమ నెట్వర్క్ పరిధిలో కాల్ ట్రాఫిక్ వివరాలను సమర్పించాయి. ఇన్కమింగ్, అవుట్గోయింగ్ కాల్ మినిట్స్ వివరాలు ఇందులో ఉన్నాయి. ఇంటర్ కనెక్షన్ వినియోగ చార్జీ (ఒక నెట్ వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు వెళ్లే కాల్స్‌పై చెల్లించే చార్జీ) అంశంపై సంప్రదింపుల్లో భాగంగా ట్రాయ్ ఈ వివరాలు కోరింది. వీటి ఆధారంగా అసాధారణ ట్రాఫిక్ తీరును పరిశీలించనుంది. అయితే ఆపరేటర్లు సమర్పించిన ఈ వివరాలు జూలై నెలకు సంబంధించినవని ట్రాయ్ వర్గాలు తెలిపాయి. ఇన్కమింగ్ కాల్స్, అవుట్గోయింగ్ కాల్స్ ట్రాఫిక్ ఒకే స్థాయిలో ఉండాలి. కానీ, కొందరు ఆపరేటర్లు ఇది అసాధారణ స్థాయి (ఒకవైపు ఎక్కువ)లో ఉన్నట్టు ట్రాయ్ దృష్టికి తీసుకొచ్చాయి. రెండు నెలలు గడువు పొడిగించండి: సీఓఏఐ ఇంటర్ కనెక్షన్ యూసేజీ చార్జీ(ఐయూసీ)కి సంబంధించి ట్రాయ్ విడుదల చేసిన సంప్రదింపుల పత్రాలపై తమ అభిప్రాయాలు తెలిపేందుకు రెండు నెలలకు పైగా గడువు పొడిగించాలని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్(సీఓఏఐ) ట్రాయ్‌ను కోరింది. ఆపరేటర్లు రానున్న స్పెక్ట్రమ్ వేలం వ్యవహారంపై దృష్టి సారించినందున, వేలం గడువు ముగిసిన దగ్గర్నుంచి రెండు నెలల పాటు అదనపు గడువు ఇవ్వాలని కోరినట్టు సీఓఏఐ డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ తెలిపారు. దీనిపై ట్రాయ్‌కు లేఖ రాశామన్నారు. జియో మార్కెట్ ప్రవేశం చేయడంతో, తమ అభిప్రాయాలు తెలిపేముందు పూర్తి స్థాయి విశ్లేషణ చేయాల్సి ఉంటుందన్నారు. ఐయూసీపై అభిప్రాయాలకు ట్రాయ్ ఈ నెల 19వరకు గడువు ఇచ్చింది. సేవల నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు: ట్రాయ్ సేవల నాణ్యత విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని టెల్కోలను ట్రాయ్ హెచ్చరించింది. నెట్వర్క్ పరిధిలో రద్దీపై వివరాలు ఇవ్వాలని కోరింది. తమ నెట్‌వర్క్‌కు మారాలనుకుంటున్న కస్టమర్ల మొబైల్ నంబర్ పోర్టబిలిటీ దరఖాస్తులను తిరస్కరిస్తున్నాయంటూ ప్రత్యర్థులపై రిలయన్స్ జియో చేసిన ఫిర్యాదుపైనా ట్రాయ్ స్పందించింది. ఈ విషయంలో వివరణ ఇవ్వాలని టెల్కోలను కోరింది. ఢిల్లీలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమం అనంతరం ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ మాట్లాడుతూ... ఈ నెల 15 -19 తేదీల మధ్య ఆపరేటర్లు ఎన్ని కాల్స్‌ను స్వీకరించింది, ఎన్ని కాల్స్ ఫెయిల్ అయ్యిందీ వివరాలు ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. తమ నెట్వర్క్ నుంచి వెళ్లే కాల్స్‌కు సరిపడా ఇంటర్‌కనెక్ట్ పాయింట్లు కల్పించకపోవడంతో కాల్స్ ఫెయిల్ అవుతున్నాయంటూ జియో ఆరోపించిన విషయం తెలిసిందే. -
‘సాక్షి’ ప్రసారాలంటే భయమెందుకో?
పునరుద్ధరించకుంటే ట్రాయ్‌కు ఫిర్యాదు మాల మహానాడు నిరసన నందిగామ రూరల్ :ప్రజాహిత కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న సాక్షి చానల్‌ను చూసి బెంబేలెత్తిపోతున్న ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ రాజకీయ దురుద్దేశంతో సాక్షి ప్రసారాలను నిలిపివేసిన ఎంఎస్‌వోలపై ట్రాయ్‌కు ఫిర్యాదు చేయనున్నామని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు తుమ్మల ఫ్రాన్సిస్ తెలిపారు. సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతకు నిరసనగా గురువారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. నందిగామాలో జరిగిన కార్యక్రమంలో ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఫ్రాన్సిస్ మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, ప్రజలకు చేస్తున్న మోసాలను బయటపెడుతున్నందునే సాక్షి ప్రసారాలను సర్కారు నిలిపి వేయించిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు నమ్మి ప్రసారాలు నిలిపివేసిన ఎంఎస్‌వోలు నష్టపోవాల్సి ఉంటుం దని, గురువారం సాయంత్రం 5 గంటల లోపు ప్రసారాలు పునరుద్ధరించేందుకు సమయం ఇస్తున్నామని, దీనికి వారు స్పందించకుంటే శుక్రవారం ట్రాయ్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. గతంలో ఓటుకు కోట్లు కేసు విషయంలో సైతం చంద్రబాబు సర్కారు ఇదే తీరుతో వ్యవహరించిందన్నారు. మీడియా గొంతు నొక్కితే నష్టం ప్రభుత్వానికేనన్న వాస్తవాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. ఫోర్త్ ఎస్టేట్‌గా ఉన్న మీడియాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తారా?... ఇబ్రహీంపట్నం : పత్రికాస్వేచ్ఛను రాష్ట్రప్రభుత్వం హరించడంపై రాష్ట్ర బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సభ్యులు స్థానిక మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నోటికి నల్ల రిబ్బన్లు ధరించి మౌన ప్రదర్శన జరిపారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు వి.రామారావు, ఏపీబీజేఏ రాష్ర్ట సంయుక్త కార్యదర్శి వి.ఆనందరరావు అధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ నుంచి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి వైఎస్సార్ సీపీ నేతలు, ఎంపీటీసీ సభ్యులు తమ సంఘీభావం తెలిపారు. ఆనందరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ సమస్యలపై అనేక మంది ఉద్యమాలు చేస్తున్నారని వాటిని ప్రసారం చేస్తున్న సాక్షి, నంబర్ వన్ న్యూస్ చానెల్స్ ప్రసారాలు నిలిపేయడం అత్యంత ధారుణమైన చర్య అన్నారు. రామారావు మాట్లాడుతూ చానల్స్‌ను నిలిపేయడం వలన సంస్థలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు, సిబ్బంది జీవనోపాధి కోల్పోతారని తెలిపారు. తక్షణమే సాక్షి,నంబర్ వన్ చానల్స్‌ను పునరుద్ధరించాలని అసోసియేషన్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం డెప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. పలువురు ప్రింట్, ఎలక్ట్రానిక్స్ మీడియా సభ్యులు, వైఎస్సార్ సీపీ నాయకులు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. నున్నలో నిరసన... నున్న(విజయవాడరూరల్): రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా సాక్షి చానల్ ప్రసారాలను నిలివేసినందుకు నిరసనగా నున్న గ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు.సీఎస్ఐ చర్చి సెంటర్లో వైఎస్సార్సీపీ మండల కమిటీ సభ్యుడు పరసా చైతన్య,పంచాయతీ 4వ వార్డు సభ్యుడు తగరం యోహాను పార్టీ కార్యకర్తలు నిరసన తెలుపుతూ ప్రదర్శన చేశారు. చంద్రబాబు చట్టవ్యతిరేక చర్యలను ప్రజలకు కళ్లకు కట్టినట్టు ప్రసారం చేయడం వలనే సాక్షి చానల్లో ప్రసారాలను నిలిపివేశారని విమర్శించారు. సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాల్సిందే పైపుల రోడ్డులో కొవ్వొత్తుల ప్రదర్శన గాంధీనగర్ (అజిత్‌సింగ్‌నగర్) : సాక్షి చానల్‌పై ప్రభుత్వానికి ఎందుకింత అక్కసు అంటూ అభిమానులు మండిపడ్డారు. ముద్రగడ దీక్ష సాకుతో సాక్షి ప్రసారాలను నిలిపివేసి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి చానల్ ప్రసారాలను నిలిపివేయడాన్ని నిరసిస్తూ అజిత్‌సింగ్‌నగర్ పైపుల రోడ్డులో సింగ్‌నగర్, ప్రకాష్‌నగర్, పాయకాపురానికి చెందిన సాక్షి అభిమానులు గురువారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నగర అధికార ప్రతినిధి బి.జానారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంలో జరిగే అవినీతిని సాక్షి చానల్ కళ్లకు కట్టినట్టు చూపినందుకే కక్షసాధింపులకు పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటినుంచి సాక్షిపై కక్ష పెంచుకున్నారన్నారు. ముద్రగడ దీక్షను సాకుగా చూపి చానల్ ప్రసారాలు నిలిపివేయడం దుర్మార్గమన్నారు. కార్పొరేటర్ అవుతు శ్రీశైలజ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు. సాక్షి ప్రసారాలను అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ చేష్టలను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన బుద్ధిచెబుతారని హెచ్చరించారు. ఈ ప్రదర్శనలో సాక్షి అభిమానులు, మాజీ కార్పొరేటర్ వీర్ల వరలక్ష్మి, దుర్గారావు, పెద్దిరెడ్డి శివారెడ్డి, టెక్యం కృష్ణ, కిషోర్, కంచి ధనశేఖర్, నాగిరెడ్డి, పూర్ణ, దుర్గారావు పాల్గొన్నారు. చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించండి అంబేడ్కర్‌కు వినతి విజయవాడ(భవానీపురం) : నిలిపివేసిన ‘సాక్షి’, నంబర్ వన్ టివి ప్రసారాలను పునరుద్ధరించాలని కోరుతూ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి బీజేపీ నేతలు గురువారం వినతి పత్రం సమర్పించారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తరువాత వినతిపత్రం సమర్పించారు. ఎస్సీ మోర్చా నాయకులు మాట్లాడుతూ భావ స్వేచ్ఛ అనేది పత్రికల హక్కని, ఆ హక్కును కాలరాసే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కాపుల ఉద్యమాన్ని సాకుగా చూపుతూ చానల్స్ గొంతునొక్కడం అప్రజాస్వామికమన్నారు. ఎస్సీ మోర్చా నగర ప్రధాన కార్యదర్శులు పుట్ల రమణ, కొమర కిరణ్‌కమార్, ఇన్చార్జ్ సర్వశుద్ధి రాజు, ఉపాధ్యక్షుడు కొమర యల్లారావు, కార్యదర్శులు మాతంగి ప్రకాష్, పి.దుర్గాప్రసాద్, ఎం.శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు దాసరి జాన్‌బాబు పాల్గొన్నారు. ‘సాక్షి’ ప్రసారాలు నిలిపివేయడం తగదు ఎమ్మెల్యే రక్షణనిధి తిరువూరు : ప్రసారసాధనాలపై ప్రభుత్వం పెత్తనం చెలాయించాలని చూడడం తగదని తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధి అభిప్రాయపడ్డారు. గురువారం తిరువూరులో ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. కాపు ఉద్యమాన్ని అన్ని చానల్స్ ప్రసారం చేస్తుండగా కేవలం సాక్షి చానల్‌ను నిలిపివేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. జననేత వై.ఎస్.జగన్హన్రెడ్డిపైన, సాక్షి మీడియాపైన ఎప్పటినుంచో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకున్న అక్కసు ఈ విధంగా వెళ్లగక్కుతున్నారని రక్షణనిధి విమర్శించారు. ఇటువంటి కుయుక్తులతో పాలన చేద్దామని చూస్తే ప్రజలే తిరగబడతారని, వెంటనే సాక్షి చానల్‌ను పునరుద్ధరించకపోతే ప్రజా ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు చలమాల సత్యనారాయణ, పార్టీ నాయకులు రేగళ్ళ మోహనరెడ్డి, తంగిరాల వెంకటరెడ్డి, ఏరువ ప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు. -
రూ. 12 వేల కోట్లతో60 వేల టెలికం టవర్లు
న్యూఢిల్లీ: టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు మరిన్ని అధికారాలు అప్పగించడంతోనే కాల్ డ్రాప్ సమస్యకు అంతిమ పరిష్కారం లభించదని టెలికం కార్యదర్శి జేఎస్ దీపక్ తెలిపారు. టెల్కోలపై రూ.10 కోట్ల వరకు జరిమానా, వాటి ఎగ్జిక్యూటివ్‌లకు రెండేళ్ల వరకు జైలు శిక్ష విధింపు వంటి తదితర అంశాలకు సంబంధించి అధికారాలను అప్పగించాలని ట్రాయ్ ప్రభుత్వాన్ని కోరింది. దీపక్ దీనిపై స్పందిస్తూ.. అధికారాల అప్పగింతే సమస్యకు అంతిమ పరిష్కారం కాదని చెప్పారు. మొబైల్ ఆపరేటర్స్ 60,000 టవర్ల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఒక్కో టవర్‌కు రూ.20 లక్షల చొప్పున మొత్తం టవర్ల ఏర్పాటుకు రూ.12,000 కోట్లు అవుతుందని పేర్కొన్నారు. -
కాల్ డ్రాప్స్ కు పరిహారం కుదరదు..
♦ టెల్కోలపై ట్రాయ్ ఆదేశాలను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు ♦ చట్ట విరుద్ధ ఏకపక్ష చర్యని స్పష్టీకరణ న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్ విషయంలో సుప్రీంకోర్టు టెలికం కంపెనీలకు ఊరటనిచ్చింది. కాల్ డ్రాప్స్‌కు వినియోగదారులకు పరిహారం చెల్లించాల్సిందేనని ట్రాయ్ జారీ చేసిన ఆదేశాలను తోసిపుచ్చింది. ఈ నిబంధన చట్ట విరుద్ధమైనదని, ఏకపక్షంగా ఉందని, తగిన కారణాలు లేవని, పారదర్శకత లోపించిందని కూడా న్యాయమూర్తులు కురియన్ జోసెఫ్, ఆర్ఎఫ్ నారీమన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కాల్డ్రాప్స్ ఒక్కింటికీ రూ.1 చొప్పున వినియోగదారులకు పరిహారం చెల్లించాలని గత ఏడాది అక్టోబర్ 16వ తేదీన ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను భారత్ టెలికం సర్వీస్ ప్రొవైడర్ల అత్యున్నత సంస్థ- సీఓఏఐ (సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. అయితే ఈ ఏడాది మొదట్లో ఢిల్లీ హైకోర్టులోనూ తీర్పు ప్రతికూలంగా వచ్చింది. దీనితో తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజా సుప్రీంకోర్టు రూలింగ్‌తో కాల్ డ్రాప్స్ విషయంలో టెలికం సంస్థలకు పెద్ద ఊరట లభించినట్లయ్యింది. సీఓఏఐలో వొడాఫోన్, భారతీ, రియలన్స్ వంటి సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. ఇప్పటికే కష్టాల్లో ఉన్నాం: టెలికం కంపెనీలు ఈ కేసులో టెలికం కంపెనీలు తమ వాదనలు వినిపిస్తూ... ఈ రంగం ఇప్పటికే తీవ్ర రుణ సంక్షోభంలో ఉన్నట్లు తెలిపాయి. స్పెక్ట్రమ్‌కు పెద్ద ఎత్తున డబ్బు చెల్లిస్తున్నట్లు వివరించాయి. ఈ రంగంలో భారీ లాభాలను పొందుతున్నట్లు ట్రాయ్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చుతూ... మౌలిక రంగంపైనే భారీ ఖర్చులు చేస్తున్నట్లు తెలిపాయి. ఇదీ కాకుండా కాల్ డ్రాప్స్ దేశంలో అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడే ఉన్నట్లు టెలికం కంపెనీల తరఫున వాదనలు వినిపించిన కపిల్ సిబల్ అత్యున్నత న్యాయస్థానానికి వివరించారు. తాజా తీర్పు పట్ల సీఓఏఐ, అసోసియేషన్ ఆఫ్ యూనిఫైడ్ టెలికం సర్వీస్ ప్రొవైడర్స్ ఒక సంయుక్త ప్రకటనలో హర్షం వ్యక్తం చేశాయి. వినియోగదారులకు పటిష్ట, నాణ్యమైన సేవలు అందాలన్న ట్రాయ్ ఆలోచనలను అర్థం చేసుకున్నామని, ఈ లక్ష్య సాధనకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నాయి. సేవలు మెరుగుపడాలి: కేంద్రం సుప్రీం తీర్పుపై టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆచితూచి స్పందించారు. కోర్టు ఉత్తర్వుల తదనంతర పరిణామాలను, సేవల పెంపును మెరుగుపరిచే మార్గాలను ట్రాయ్ పరిశీలిస్తుందని అన్నారు. టెలికం కంపెనీలు సేవల మెరుగుదలపై మరింత దృష్టి సారిస్తాయని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో ఇంకా టెలికం సేవలు బలహీనంగా ఉన్న విషయం సుస్పష్టమన్నారు. కాగా సుప్రీం ఉత్తర్వుపై కేంద్రం రివ్యూ పిటిషన్‌ను వేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.