Underground waters
-
జల దోపిడీల
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఓవైపు భూగర్భ జలాలు అడుగంటిపోతుండగా మరోవైపు కొద్దోగొప్పో బోరుబావుల నుంచి వస్తున్న నీటితో అక్రమార్కులు నీటి వ్యాపారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉచిత కరెంట్‌ను దుర్వినియోగం చేస్తూ.. వ్యవసాయ బావుల నుంచి అడ్డగోలుగా నీటిని తోడేస్తూ యథేచ్ఛగా జలదోపిడీకి పాల్పడుతున్నారు. ట్యాంకర్లలో పారిశ్రామిక ప్రాంతాలకు తరలిస్తూ లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. వీరి వ్యాపారం మూడు ట్యాంకర్లు.. ఆరు పరిశ్రమలు అన్న చందంగా జోరుగా సాగుతోంది. తూప్రాన్: తూప్రాన్ డివిజన్ కేంద్రం హైదరాబాద్ నగరానికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేషనల్హైవే, రైల్వే స్టేషన్ల లాంటి చక్కటి రవాణా సౌకర్యంతోపాటు ఈ ప్రాంతం అనేక పరిశ్రమలకు నెలవైంది. డివిజన్ పరిధిలోని కాళ్లకల్, ముప్పిరెడ్డిపల్లి, కూచారం, జీడిపల్లి తదితర ప్రాంతాలు పారిశ్రామిక ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతో ఆయా గ్రామాల్లో ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు వెలిశాయి. వీటిలో రసాయనిక, విత్తన, ఐరన్, లిక్కర్ తదితర పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలే ఆసరాగా అనేక పారిశ్రామికవాడలు నెలకొన్నాయి. వేలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్న ఈ పరిశ్రమల్లోని కార్మిక కుటుంబాల అవసరాలను ఆసరా చేసుకొని అక్రమ వ్యాపారులు నీటి వ్యాపారానికి తెరలేపారు. బోరుబావులను లీజుకు తీసుకొని.. వ్యాపారులు రైతుల వ్యవసాయ పొలాల్లోని బోరుబావులను లీజుకు తీసుకొని వాటి నుంచి ట్యాంకర్ల ద్వారా రేయింబవళ్లు నీటిని పరిశ్రమలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో సుమారు 40కిపైగా ట్యాంకర్లు, 10 లారీలు, 15 మినరల్ వాటార్ ప్లాంట్లు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక్కో ట్యాంకర్ రోజుకు 10 నుంచి 15 ట్రిప్పుల వరకు తిరుగుతుంది. ట్రాక్టర్ ట్యాంకర్లకు రైతుకు కేవలం రూ.200 చెల్లించి పరిశ్రమలకు రూ.500 నుంచి అవసరాలకు అనుగుణంగా రూ.800 వరకు విక్రయిస్తూ లక్షలు గడిస్తున్నారు. 24 గంటల ఉచిత కరెంట్ పుణ్యమా అని వ్యాపారుల పంట పండింది. ఇదంతా రెవెన్యూ, విద్యుత్ అధికారుల కనుసన్నల్లో సాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. విద్యుత్ లైన్‌మన్, లైన్ ఇన్స్పెక్టర్లకు ఒక్కో ట్రాక్టర్ ట్యాంకర్‌కు నెలకు రూ.వెయ్యి చొప్పున ట్యాంకర్ల యజమానులు ముట్టజెప్తున్నట్లు సమాచారం. మినరల్ పేరుతో దోపిడీ.. ఉమ్మడి మండలంలోని గ్రామాల్లో 40 వరకు కొనసాగుతున్న మినరల్ వాటర్ ప్లాంట్ల యజమానులు మినరల్ పేరుతో రసాయనాలు కలుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఏ ఓక్క ప్లాంటుకు ఐఎస్ఐ లేదు. ప్రతీ నెల అధికారులు మామూళ్లు తీసుకొని చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ గోదావరి జలాలను అందిస్తున్నా గ్రామాల్లో మినరల్ వాటర్ప్లాంట్ల హవా కొనసాగుతోంది. 20 లీటర్ల క్యాన్‌కు రూ.15 నుంచి రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క ప్లాంటును సీజ్ చేసిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. అడుగంటుతున్న భూగర్భ జలాలు.. తూప్రాన్ డివిజన్ పరిధిలోని మనోహరాబాద్ మండలంలో పరిశ్రమలు వెలుస్తుండడంతో ఈ ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటాయి. ప్రస్తుత వేసవి తీవ్రత కారణంగా నీటిమట్టం రోజురోజుకూ పడిపోతోంది. బోరుబావుల్లో కొద్దిపాటి నీటితో పంటలు పండించి నష్టాలపాలయ్యే బదులు నీటిని అమ్ముకుని లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామాల్లో 700 అడుగుల లోతు బోరుబావులు తవ్వించినా చుక్కనీరు లభించని పరిస్థితి నెలకొంది. అయినా రైతులు భగీరథ ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. అప్పు తెచ్చి బోరుబావులు తవ్వుతున్నారు. మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో 8 వేలకు పైగా బోరుబావులున్నాయి. వీటిలో 1,300 పైగా మాత్రమే కాస్త నీళ్లు పోస్తున్నాయి. దీంతో పరిశ్రమ నిర్వాహకుల నీటి అవసరాలను గుర్తించిన అక్రమ వ్యాపారులు ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జలదోపిడీకి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం చట్టవ్యతిరేకంగా నీటిని అక్రమంగా ట్యాంకర్ల ద్వారా తరలించి విక్రయించినట్లైతే కేసులు నమోదు చేస్తాం. వ్యవసాయ రంగానికి వినియోగించాల్సిన బోరుబావులను వ్యాపారంగా మార్చడం చట్టరీత్యానేరం. భూగర్భ జలాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – శ్యాంప్రకాశ్, ఆర్డీఓ, తూప్రాన్ దుర్వినియోగం చేయొద్దు వ్యవసాయ బోరుబావుల నుంచి ఉచిత కరెంట్ ద్వారా ట్యాంకర్లలో నీటిని వ్యాపారానికి వినియోగిస్తే విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తాం. వ్యాపార రంగానికి కమర్షియల్ మీటర్లను తప్పనిసరిగా వినియోగించాలి. ఇలా వినియోగించని వారిని గుర్తించి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – వీరారెడ్డి, ట్రాన్స్‌కో ఏడీఈ, తూప్రాన్ -
నీళ్లు రాని కుళాయిలు.. నోళ్ళు తెరిచిన బోర్లు
పొద్దుపొద్దున్నే.. నిద్ర లేవంగానే..కుళాయిలో నీళ్లు రావని తెలిసిందనుకోండి.ఎలా ఉంటుంది? ఎక్కడలేని చికాకు తన్నుకొచ్చేస్తుంది కదూ! మరి.. ఒక రోజుకే అంత ఇబ్బంది పడిపోతే.. వారం పాటు నీళ్లు లేవంటే? నెల గడిచినా చుక్క నీరు దక్కకపోతే? అబ్బో.. ఆ పరిస్థితిని అసలు ఊహించుకోలేం! ఇంకో ఏడాది గడిస్తే.. ఇదే వాస్తవం కానుందని అంటోంది నీతిఆయోగ్ నివేదిక ఒకటి! నీటికోసం ట్యాంకర్ల చుట్టూ వందల వేల బిందెలు.. కుళాయిల వద్ద కొండవీటి చాంతాడంత క్యూ.. నగరాల్లోని బస్తీల్లో, కొన్ని గ్రామాల్లోనూ సాధారణంగా కనిపించే దృశ్యం. జనాభా పెరిగిపోతోంది.. అవసరాలూ ఎక్కువవుతున్నాయి. అందుకే ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయని కొంతమంది చెప్పవచ్చుగానీ.. వాస్తవం వేరే ఉంది. భూగర్భంలో దాగున్న జలసిరులు వంద లీటర్లనుకుంటే. మనం వాడుకుంటున్నది 150 లీటర్లు! అందుకే హైదరాబాద్ లాంటి నగరాల్లో బోరుబావుల లోతులు ఏటికేటికీ పెరిగిపోతూ వందల అడుగులకు చేరుకున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాల్లోనైతే ఈ సంఖ్య వెయ్యి కంటే ఎక్కువైపోయింది. గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా.. గత నాలుగేళ్లుగా కురిసిన వర్షాలు అరకొరగానే ఉండటంతో ప్రాజెక్టులూ నోళ్లు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ గతేడాది సిద్ధం చేసిన నివేదిక ఒకటి అందరినీ ఆందోళనకు గురిచేసే స్థాయిలో ఉందంటే అతిశయోక్తి ఏమీ కాదు. దీని ప్రకారం.. వచ్చే ఏడాదికల్లా దేశంలోని ప్రధాన నగరాల్లో నీటి సమస్య అత్యంత ప్రమాదకరమైన స్థాయికి చేరుకోనుంది. గత ఏడాది దక్షిణాఫ్రికా నగరం కేప్‌టౌన్‌లో మాదిరిగానే నీటికుళాయిల నుంచి నీళ్లు రాని పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యం లేదన్నది ఈ నివేదిక సారాంశం. ఇంకేం ఉన్నాయి? హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలతోపాటు మొత్తం 21 నగరాల్లో తాగునీటి ఎద్దడి గణనీయమైన స్థాయిలో పెరగనుంది. ఫలితంగా ఆయా నగరాల్లోని పేద, బలహీన వర్గాల వారికి సమస్యలు ఎక్కువ కానున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో వాననీటి సంరక్షణ, సుదూర ప్రాంతాల్లోని నదుల నుంచి గొట్టాల ద్వారా నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతాయి. అయితే ఇవేవీ సమస్యను పరిష్కరించవు. ప్రజలు దశాబ్దాలుగా అటు వ్యవసాయానికి, ఇటు దైనందిన అవసరాలకూ భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉండటం దీనికి కారణం. దక్షిణాదిలోనే పది కోట్ల మందికి గుక్కెడు నీరు కూడా దక్కని దారుణ నీటి కటకట ఏర్పడబోతోందని హెచ్చరిస్తోంది. భూగర్భ జలాలు అడుగంటితే నగరవాసులు ప్రైవేట్ కంపెనీలు అక్రమంగా తవ్వితీసే నీటిపై ఆధారపడటం మొదలుపెడతారు. పరిస్థితి మరింత దిగజారిపోయేందుకు ఇదో కారణం కానుంది. దేశంలోని 130 కోట్ల ప్రజల్లో నీటి లభ్యత లేనివారి సంఖ్య 16 కోట్ల పైమాటేనని 2018 నాటి వాటర్ ఎయిడ్ రిపోర్ట్ చెబుతోంది. ఇంతటి దారుణమైన పరిస్థితి ఇంకెక్కడా లేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. డిమాండ్ రెట్టింపు 2030 కల్లా దేశంలో అందుబాటులో ఉన్న నీటికి రెండు రెట్లు ఎక్కువ డిమాండ్ ఏర్పడబోతోందని.. ఎద్దడిని అధిగమించేందుకు ప్రజలు పెట్టే ఖర్చు కారణంగా స్థూల జాతీయోత్పత్తిలో 6 శాతం కోత పడనుందని నీతి ఆయోగ్ హెచ్చరించింది. ఒకవేళ కొంతమందికి నీళ్లు అందుబాటులో ఉంటే అది కలుషితాలతో నిండినవే అయి ఉంటాయని.. ఆ నీరు తాగడం ద్వారా అనారోగ్యం పాలై ఏటా 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి ఉందని తెలిపింది. స్వచ్ఛమైన నీరు లభించే విషయంలో 122 దేశాల జాబితాలో భారత్ ర్యాంకు 120 కావడం ఇక్కడ చెప్పుకోవల్సిన విషయం. ఆహార భద్రతకూ చేటు.. నీటి లభ్యత విషయంలో ఇప్పటికిప్పుడు తగిన చర్యలు యుద్ధ ప్రాతిపదికన తీసుకోకుంటే దాని ప్రభావం దేశ ఆహార భద్రతపై కూడా పడనుంది. రాష్ట్రాలు అందుబాటులో ఉన్న నీటి వనరులను కాపాడుకోవడంతోపాటు అత్యంత సమర్థంగా నీటిని వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. జాతీయ స్థాయిలో అందుబాటులో ఉన్న నీరు.. సమర్థ వాడకంపై ఇటీవలే కేంద్రం కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్‌ను సిద్ధం చేసింది. దీని ప్రకారం సమర్థమైన నీటి యాజమాన్య పద్ధతులను పాటించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడోస్థానంలో ఉండగా.. తెలంగాణ 8వ స్థానంలో ఉంది. అయితే మిషన్ భగీరథ, కాకతీయ వంటి పథకాల కారణంగా తెలంగాణ తన పరిస్థితిని వేగంగా మెరుగుపరుచుకుంటోంది. భూగర్భజలాలతో పాటు సాగునీటి వసతులు, వాడకం వంటి 28 అంశాల ఆధారంగా సిద్ధం చేసిన ఈ సూచీలో మొత్తం 24 రాష్ట్రాలకు మార్కులేయగా.. 14 రాష్ట్రాలు 50 కంటే తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లోనే దాదాపు 60 కోట్ల జనాభా ఉండటం గమనిస్తే.. భవిష్యత్తులో ఏర్పడబోయే నీటి ప్రభావం ఆహార భద్రత, లభ్యతలపై తీవ్ర ప్రభావం చూపనుంది. రుతుపవనాల ఆలస్యంతో పరిస్థితి జటిలం.. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో నైరుతి రుతుపవనాల ద్వారానే 80 శాతం ఉపరితల నీరు మనకు అందుబాటులోకి వస్తుంది. అయితే కొన్నేళ్లుగా సరైన వర్షాల్లేక దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల్లో నీరు సగానికిపైగా తగ్గిపోయింది. ఈ ఏడాది కూడా నైరుతి దీర్ఘకాలిక సగటులో 94 నుంచి 96 శాతం వర్షాన్ని మాత్రమే తేనుందన్న సమాచారం ఆందోళన కలిగించే అంశం. 1970తో పోలిస్తే 2015 నాటికి ఖరీఫ్ వర్షపాతం 1,050 మిల్లీమీటర్ల నుంచి 1,000 మిల్లీమీటర్లకు తగ్గిపోగా, రబీ వర్షపాతం కూడా 150 నుంచి 100 మిల్లీమీటర్లకు చేరుకుంది. రుతుపవనాల సీజన్లో వానలు కురిసే రోజుల మధ్య ఎడం కూడా 40 నుంచి 45 శాతం వరకూ పెరిగిందని వాతావరణ నిపుణుల అంచనా. ఏం చేయాలి? నగరాల్లో పైపులైన్ల ద్వారా సరఫరా అవుతున్న నీరు 30 నుంచి 50 శాతం వృథా అవుతోందన్న అంచనాల నేపథ్యంలో వాటి స్థానంలో కొత్తవాటిని వేసుకోవడం ద్వారా నీటిని ఆదా చేయవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వాడేసిన నీటిని శుద్ధి చేసుకుని దైనందిన అవసరాలకు వాడుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు. పారిశ్రామిక అవసరాలకు రీ సైకిల్ చేసిన నీటిని అందించడం ద్వారా విలువైన భూగర్భ జలాలను కాపాడుకోవచ్చు. నగరాల్లో వాననీటి సంరక్షణను విస్తృతంగా చేపట్టడం, ఎండిన బోర్లను వాననీటిని మళ్లీ భూమిలోకి పంపే సాధనాలుగా వాడుకోవచ్చు. దేశంలో సాగునీటి వసతి ఉన్న భూ విస్తీర్ణం 14 కోట్ల హెక్టార్లు కాగా.. ఇందులో కనీసం సగం సూక్ష్మ సేద్యం కిందకు తీసుకు రావాల్సిన అవసరముంది. ప్రస్తుతం దేశం మొత్తమ్మీద బిందు, తుంపర సేద్యాల కింద సాగవుతున్న విస్తీర్ణం 77 లక్షల హెక్టార్లు మాత్రమే కావడం గమనార్హం మిగిలిన భూమిని కూడా బిందు, తుంపర సేద్యాల కిందకు తీసుకొస్తే.. సగటున 50 శాతం సాగునీటిని ఆదా చేయొచ్చు. -
ఐదేళ్ల అలక్ష్య పాలన.. తీవ్ర దుర్భిక్షం
కరువుకాటకాలతో గ్రామాలు అల్లాడుతున్నాయి..గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు లేవు..తినడానికి తిండిలేదు.. చేయడానికి పని లేదు..మనుషులు వలసబాట పడుతున్నారు..కనీస గ్రాసమూ దొరక్క పశువులు కబేళా దారిలో కనిపిస్తున్నాయి..వేసవికి ముందే తీసుకోవలసిన జాగ్రత్తల ఊసేలేదు..ఖరీఫ్‌లో వర్షాభావం దెబ్బతీసినా రబీకి ఏం చేయాలనేదానిపై కసరత్తు లేదు..కమీషన్ల కక్కుర్తే తప్ప సాగునీటి ప్రాజెక్టులపై చిత్తశుద్ధి లేదు..ఇలాంటి అత్యవసర సమయంలో గ్రామీణ నిరుపేదలకు ఎంతో ఉపయోగపడే ఉపాధిహామీకి మంగళం పలికేశారు..ఆ పథకం నిధులన్నీ కైంకర్యం చేసి కూలీల కడుపుకొట్టారు.. అనాలోచిత నిర్ణయాలు.. అస్తవ్యస్థ పాలన ఫలితమే ఇది..ఐదేళ్లుగా ఇదే పరిస్థితి.. ఈ వేసవిలో రాష్ట్రమంతటా పరిస్థితి మరింత విషమించింది.. అనంతపురం జిల్లాలో మేత లేక కబేళాకు తరలించడానికి సిద్ధంగా ఉంచిన లేగదూడలు, గేదెలు - గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. అడుగంటిన బోర్లు (చేతిపంపులు) నుంచి నీటిని తోడుకోవాలన్నా, కిలోమీటర్ల నుంచి కాలినడకన, సైకిళ్లపై నీరు తెచ్చుకోవాలన్నా, ఎప్పుడో వచ్చే ట్యాంకర్ల వద్ద వరుసలో నిలబడి బిందెడు నీరు దక్కించుకోవాలన్నా యుద్ధమే చేయాల్సి వస్తోంది. నీటి క్యాన్ కొనుగోలు చేయాలన్నా ఎదురు చూడాల్సి వస్తోంది. - మా ఊళ్లో చిన్నబావి దగ్గర 1,170 అడుగులు రిగ్గు వేయిస్తే చెంబెడు నీళ్లు కూడా రాలేదు, ఏ బావి, బోరులో కూడా నీళ్లు లేవు, ఏడెనిమిది గంటలు దఫదఫాలుగా మోటార్లు వేస్తున్నా ఒక ఎకరం కూడా తడవడం లేదు, అరటి తోటలు మాడిపోతున్నాయి అని వాపోయాడు కడప జిల్లా పుల్లంపేట మండలం అనంతయ్యగారిపల్లె రైతు. - పదిహేనేళ్ల బత్తాయి తోట సార్. బాగా దిగుబడి ఇవ్వాల్సిన తోటలో ఎండిపోతున్న కొమ్మలను రోజుకు కొన్ని చొప్పున కొట్టేయలేక మొత్తం తోటే నరికేయాల్సి వచ్చిందని కంటతడి పెట్టాడు ప్రకాశం జిల్లా పెద్దారవీడుకు చెందిన రైతు వెంకటేశ్వర్లు. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి/సాక్షి నెట్వర్క్: ఎండిపోయిన చెరువులు, కాలువలు, బోర్లు.. పంటలు సాగు చేయక బీళ్లుగా మారిన భూములు.. కబేళాలకు తరలిపోతున్న పశువులు.. పొట్ట చేతపట్టుకుని వలస వెళ్తున్న రైతులు, వ్యవసాయ కూలీలు.. ఇళ్లకు వేలాడుతున్న తాళాలు.. జనం లేక బోసిపోతున్న పల్లెలు.. రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులన్నీ కొత్తగా ఈ రోజే తలెత్తినవి కాదు. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా కరువు కాటకాలు కొనసాగుతున్నాయి. తాగు, సాగునీటి సమస్య వేధిస్తోంది. పశుగ్రాసం కొరతతో పశువుల డొక్కలు ఎండుతున్నాయి. దుర్భిక్షాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి ముందుచూపు, సరైన ప్రణాళిక లేకుండా పోయాయి. ఉన్నదల్లా కమీషన్ల కక్కుర్తి, అవినీతి, అక్రమాలు, వనరులను ఇష్టారాజ్యంగా కొల్లగొట్టడం. ఐదేళ్లుగా ప్రజలను గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి అంటూ భ్రమలు కల్పించడంలోనే కాలం గడిపేసింది. రాజధాని నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సర్కారు ఆడని డ్రామాలే లేవు. ప్రాజెక్టులపై సమీక్షలు అంటూ పాలకులు కమీషన్లు వసూలు చేసుకోవడంలో తీరిక లేకుండా గడిపారు. నీరు–చెట్టు పేరిట అధికార పార్టీ నాయకులు రూ.వేల కోట్లు మింగేశారు తప్ప భూగర్భ జలాలు అంగుళం కూడా పెరగలేదు. వరుస కరువుల వల్ల పల్లెలు, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంటుందని తెలిసినా ముందస్తు చర్యల్లేవు. పశువులకు మేత అందించాలన్న ఆలోచన సైతం ప్రభుత్వానికి లేకపోవడం గమనార్హం. వర్షాల్లేక వ్యవసాయ పనులు లేకపోవడంతో ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించి, వలసలను నియంత్రించాలన్న స్పృహ సర్కారులో కొరవడింది. ఐదేళ్లుగా దుర్భిక్షంతో బాధలు పడుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదని, తమను కనీసం ఆదుకున్న పాపాన పోలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాతాళానికి చేరిన భూగర్భ జలాలు రాష్ట్రంలో కరువు ధాటికి భూగర్భ జలాలు సగటున 14.71 మీటర్ల లోతుకు పడిపోయినట్లు ఈ నెలారంభలోనే లెక్కతేలింది. 208 మండలాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. 1.65 లక్షలకు పైగా బోరు బావులు ఎండిపోయాయి. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గత ఏడాది ఏప్రిల్ నెలతో పోల్చితే ఈ ఏడాది రాయలసీమ జిల్లాల్లో భూగర్భ జల మట్టాలు మరింత లోతుకు పడిపోయాయి. సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లోనూ వేసవి ఆరంభంలోనే నీరు అడుగంటిపోయింది. రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీలు ఉండగా, 4,982 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 3,494 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నట్టు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. ఇక నగరాలు, పట్టణాల్లో తాగునీటి కొరత వేధిస్తోంది. పలు కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రెండు, మూడు రోజులకోసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. రైతన్నలను ముంచేసిన ఖరీఫ్, రబీ ప్రస్తుత రబీ సీజన్లో 257 మండలాలను అధికారికంగా కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి నయాపైసా సాయం కూడా అందలేదు. కరువు సహాయక చర్యలు కనుమరుగయ్యాయి. పంటల నష్ట పరిహారం అటకెక్కింది. గత ఖరీఫ్‌లో 347 మండలాలను కరవు మండలాలుగా సర్కారు ప్రకటించింది. ఏడు జిల్లాల్లో తీవ్ర దుర్భిక్షం ఉన్నట్లు వెల్లడించింది. వరుస కరువులతో అల్లాడుతున్న రాష్ట్రం ప్రత్యేకించి 2018 రబీ నుంచి గత 20 ఏళ్లలో ఎన్నడూ చూడని తీవ్ర దుర్భిక్షాన్ని చవిచూసింది. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 32 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా అటు ఖరీఫ్, ఇటు రబీ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కరువు నుంచి రైతులు కష్టపడి కాపాడుకున్న పంటలకు కూడా కనీస మద్దతు ధరలు దక్కడం లేదు. రైతుబజార్లు, మార్కెట్లలో కూరగాయల ధరలు మండిపోతుంటే ఉత్పత్తిదారులకు మాత్రం కనీస ఆదాయం రావడం లేదు. కాగా, కరవు పరిస్థితుల్లో ప్రజలకు ఉపాధి చూపాల్సిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రమంగా నీరుగారిపోతోంది. దాదాపు 1,307 గ్రామాల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూలీలకు పనులు కల్పించలేదని సమాచారం. ఉన్న ఊళ్లో వ్యవసాయ పనులు లేక, ఉపాధి హామీ పథకం అమలు కాక ఆయా గ్రామాల నుంచి నిరుపేదలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. వేధిస్తున్న పశుగ్రాసం కొరత పాలకుల ఉదాసీనత, పశు సంవర్థక శాఖ మొద్దునిద్ర పశువుల పాలిట శాపంగా మారింది. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర దుర్భిక్షం మనుషులనే కాదు, పశువులను సైతం కాటేస్తోంది. ఆకలి తీర్చుకోవడానికి కాసింత మేత, గొంతు తడుపుకోవడానికి చుక్క నీరు లేక పశువులు విలవిల్లాడుతున్నాయి. ఇన్నాళ్లూ సొంత కుటుంబ సభ్యుల్లాగా పెంచుకున్న పశువుల ఆకలి కేకలు వినలేక రైతులు వాటిని అయినకాడికి అమ్మేస్తున్నారు. పాడి ఆవులు, గేదెలను సైతం పోషించలేక దళారులకు విక్రయిస్తున్నారు. మార్కెట్ యార్డులు, సంతల నుంచి పశువులు లారీల్లో కబేళాలకు తరలిపోతున్న దృశ్యాలు రాష్ట్రమంతటా కనిపిస్తున్నాయి. రైతుల నుంచి దళారీలు తక్కువ ధరకే పశువులను కొనేసి కేరళ, తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో వేసవి ప్రారంభంలోనే పశుగ్రాసం కొరత తీవ్రమైంది. గుంటూరు జిల్లా మొదలు రాయలసీమలోని అన్ని జిల్లాలను పశుగ్రాసం కొరత వేధిస్తోంది. ఆయా ప్రాంతాల్లో లారీ వరిగడ్డి ధర రూ.30 వేల నుంచి రూ.40 వేలు పలుకుతోంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి ప్రతిరోజూ వందల సంఖ్యలో వరిగడ్డి లారీలు రాయలసీమకు రవాణా అవుతున్నాయి. అంత ధర పెట్టి వరి గడ్డిని కొనలేని రైతులు పశువులను అమ్ముకుంటున్నారు. కబేళాలకు తరలిన పశువుల సంఖ్య మూడు నెలల్లోనే రెండు లక్షలకు చేరుకుంది. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల గేదెలు, 12 లక్షల ఆవులు, 40 లక్షల గొర్రెలు, 8 లక్షల మేకలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ వేసవిలో గ్రాసం కొరత లేకుండా చూస్తామంటూ ప్రవేశపెట్టిన ‘ఊరూర పశుగ్రాస క్షేత్రాల పథకం’ ఆచరణలో విఫలమైంది. అనంతపురం జిల్లాలోని 63 మండలాల్లో కేవలం 10 మండలాల్లోనే పశుగ్రాసం లభ్యమవుతున్నట్లు సమాచారం. పిట్టల్లా రాలుతున్న ‘ఉపాధి’ కూలీలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేసే కూలీలు ఎండల తీవ్రతను తట్టుకోలేక కన్నుమూస్తున్నారు. రాష్ట్రంలో ఈ వేసవిలో పదుల సంఖ్యలో కూలీలు మృత్యువాత పడ్డారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే ఐదుగురు మరణించారు. ‘ఉపాధి’ పనులు చేస్తున్న ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవడం వల్ల కూలీలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. నిబంధనల ప్రకారం.. వేసవిలో పనులు చేసే కూలీలకు కచ్చితంగా నీడ కల్పించాలి. ఇందుకోసం టార్పాలిన్ షెడ్లు వేయాలి. కానీ, క్షేత్రస్థాయిలో ఇది ఎక్కడా అమలు కావడం లేదు. కూలీల దాహం తీర్చేందుకు మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాల్సి ఉన్నా.. ఇవి అందుబాటులో ఉండడం లేదు. ఉదయం ఇళ్ల వద్ద నుంచి బిందెలు, సీసాల్లో తీసుకెళుతున్న నీళ్లు కొద్దిసేపటికే అయిపోతుండడంతో దాహంతో కూలీల గొంతులు ఎండుతున్నాయి. కూలీల తాగునీరుకు ప్రత్యేకంగా ఎలాంటి బడ్జెట్‌ను విడుదల చేయలేదు. పనుల ప్రాంతంలో ప్రథమ చికిత్స చేసేందుకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా అందుబాటులో ఉండడం లేదు. నిలువ నీడ లేదు.. నీరు లేదు ఎండలు మండిపోతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పనులు చేస్తున్న ప్రాంతంలో సేద తీరేందుకు చెట్లు లేవు. అధికారులు కనీసం టార్పాలిన్ టెంట్లు కూడా వేయడం లేదు. ఎండలకు తట్టుకోలేకపోతున్నాం. తాగేందుకు మంచినీరు సైతం అందుబాటులో ఉంచడం లేదు. – రంగప్ప, కూలీ, తెర్నేకల్, కర్నూలు జిల్లా గ్లూకోజ్ నీరు ఒక్కరోజే ఇచ్చారు ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న మాకు కేవలం ఒక్కరోజు మాత్రమే గ్లూకోజ్ నీటిని అందించారు. తాగునీరు లేకపోవడం వల్ల దూరంగా ఉన్న వ్యవసాయ బోర్ల దగ్గరకు వెళ్లి బిందెతో తెచ్చుకుంటున్నాం. ఎండలు తట్టుకోలేక చాలామంది అస్వస్థతకు గురవుతున్నారు – వేణుగోపాల్, కూలీ, రాంపురం, కర్నూలు జిల్లా పల్నాడులో ఊళ్లకు ఊళ్లే ఖాళీ ఆర్థిక ప్రగతిలో ఇతర జిల్లాల కంటే గుంటూరు జిల్లా ముందంజలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం కాగితాలపై వృద్ధి రేటు గణాంకాలను గొప్పగా చూపిస్తోంది. కానీ, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు సర్కారు గణాంకాలను వెక్కిరిస్తున్నాయి. జిల్లాలో పల్నాడు సహా ఇతర ప్రాంతాల్లో కరువు విలయ తాండవం చేస్తోంది. మండు వేసవిలో గుక్కెడు తాగునీరు దొరక్క జనం అల్లాడిపోతున్నారు. కృష్ణానది పక్కనే ఉన్నప్పటికీ సాగు, తాగు నీరు లేక పల్నాడు ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక రైతులు, రైతు కూలీలు ఊళ్లకు ఊళ్లే ఖాళీ చేసి వలస పోతున్నారు. కరువు నివారణ చర్యలు చేపట్టడంతో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. కనీసం ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం సున్నా. పల్నాడు ప్రాంతంలోని వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం గండిగనుమల గ్రామంలో 600 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామంలో ఆరు బోర్లు ఉండగా, ప్రస్తుతం ఏ ఒక్క బోరులోనూ సరిపడా తాగునీరు లభించడం లేదు. దీంతో గ్రామంలో 400 కుటుంబాలు వలస వెళ్లాయి. చక్రాయపాలెం తండాలో 275 కుటుంబాలు నివసిస్తుండగా, ఇక్కడ తాగునీటికి తీవ్ర కటకట నెలకొంది. మేకలదిన్నె తండా, మన్నేపల్లి తండా, రెవిడిచెర్ల తదితర గ్రామాల్లోనూ బోర్లు పనిచేయడం లేదు. మండలంలో 17కు పైగా పంచాయతీల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. ఇదే మండలం పమిడిపాడు గ్రామంలో వాటర్ ట్యాంకుల వద్ద రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదంలో ఒక వ్యక్తి మరణించాడంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. బోర్లు వేసి అప్పుల పాలయ్యాం... గ్రామాల్లో ఉన్న బోర్లన్నీ ఎండిపోయాయి. తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకడం లేదు. సాగు నీరు లేక పత్తి, మిర్చి పంటలు ఎండిపోయాయి. నీళ్ల కోసం బోర్ల మీద బోర్లు వేసి అందరం అప్పుల పాలయ్యాం. ఈ దుర్భిక్ష పరిస్థితులను ఎన్నడూ చూడలేదు. – బి.గురువయ్య, రైతు, షోలాయేపాలెం, బొల్లాపల్లి గ్రామాల్లో వృద్ధులు, పిల్లలే ఉన్నారు నేను ఎంటెక్ చదువుతున్నా. ప్రస్తుతం సెలవుల్లో సొంతూరికి వచ్చా. కరువు పరిస్థితుల వల్ల గ్రామంలో అందరూ వలస వెళ్లారు. మా తల్లిదండ్రులు కూడా వేరే ప్రాంతాలకు వెళ్లారు. వృద్ధులు, వేసవి సెలవుల్లో ఇళ్లకు వచ్చిన పిల్లలు మాత్రమే ఊళ్లో ఉన్నారు. – బాణావత్ వెంకటేశ్ నాయక్, గంగుపల్లి తండా -
వే‘గంగా’ పడిపోతోంది..!
సాక్షి, హైదరాబాద్: పాతాళగంగ రోజురోజుకూ పడిపోతోంది. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. వేసవి తీవ్రత పెరగడం, చివరిదశలో ఉన్న పంటలకు బోర్ల ద్వారా భూగర్భ జల వినియోగం ఎక్కువ కావడంతో భగూర్భమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్ర సగటు భూగర్భ నీటిమట్టం 13.40 మీటర్లకు అడుగంటింది. గతేడాది మార్చి మట్టాలతో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 1.52 మీటర్ల దిగువకు పడిపోయాయి. ఈ ఏడాది మార్చిలో సాధారణ వర్షపాతం 865 మిల్లీమీటర్లు ఉండగా, కేవలం 724 మిల్లీమీటర్ల మేర మాత్రమే వర్షపాతం నమోదైంది. ఏకంగా 16 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. 33 జిల్లాలకు గానూ 16 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, 17 జిల్లాలో 20 నుంచి 59 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ ప్రభావంతో చాలా జిల్లాలో చెరువులు నిండలేదు. ప్రాజెక్టుల్లోనూ నీటి చేరిక తక్కువగా ఉండటంతో కాల్వల ద్వారా నీటి విడుదల జరగలేదు. ఈ కారణంగా భూగర్భమట్టాల్లో పెద్దగా పెరుగుదల కనిపించలేదు. రాష్ట్రంలో 5 మీటర్ల కన్నా తక్కువమట్టంలో భూగర్భజలాల లభ్యత కేవలం 4.6 శాతం ప్రాంతాల్లో మాత్రమే ఉండగా, 5 నుంచి 10 మీటర్ల పరిధిలో 33.5 శాతం, 10 నుంచి 15 మీటర్ల పరిధిలో 27 శాతం, 15 నుంచి 20 శాతం పరిధిలో 19.2 శాతం, 20 మీటర్లకు ఎక్కువన 15.6 శాతం మేర భూగర్భ మట్టాలున్నాయి. 4 మీటర్ల కంటే లోతుకు భూగర్భ జలమట్టం రాష్ట్రంలోని 584 మండలాల పరిధిలో భూగర్భమట్టాలను పరిశీలించగా గతేడాది మార్చిలో రాష్ట్ర సగటు నీటిమట్టం 11.88 మీటర్లు ఉండగా, ఈ ఏడాది అది 13.40 మీటర్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే 1.52 మీటర్ల మేర తగ్గుదల కనిపించింది. గతేడాదితో పోలిస్తే 4 మీటర్ల కంటే లోతుకు భూగర్భ జలమట్టం పడిపోయిన జిల్లాల్లో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్ , నారాయణపేట, మేడ్చల్, హైదరాబాద్ ఉన్నాయి. వికారాబాద్ మండల బట్వారంలో ఏకంగా 41.51 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పడిపోగా, మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట, షాద్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్‌లో 40 మీటర్ల మేర భూగర్భమట్టం పడిపోయింది. రాష్ట్రంలోని 69 శాతం బోరుబావుల్లో నీరు ఇంకిపోయినట్లు భూగర్భ జలవిభాగ నివేదిక వెల్లడిస్తోంది. -
భయపెడుతున్న.. భూగర్భ జలమట్టం !
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : భూగర్భ జలాలు లోలోతుకు పడిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భూగర్భ జలాలు మరీ లోతుకుపోయాయి. ఖరీఫ్ గట్టెక్కినా రబీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారు కానుంది. దాంతో పాటు తాగునీటికీ ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. జిల్లాలో గత సంవత్సరం జనవరిలో భూగర్భజలాలు 10.20 మీటర్ల వద్దనే లభ్యం కాగా.. ఈ ఏడాది జనవరిలో 13.83 మీటర్లకు పడిపోయాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే నీటి లభ్యత 3.63 మీటర్లకు పడిపోయింది. 2018 జూన్ 1 నుంచి ఇప్పటి వరకూ 660.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 412.0 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదయ్యింది. అంటే 38 మిల్లీమీటర్ల వర్షపాతం లోటులోనే ఉంది. ఈ ప్రభావం భూగర్భ జలమట్టంపై పడిందని అధికారులు పేర్కొంటున్నారు. ఖుదాపక్షపల్లిలో 63 మీటర్లకు పడిపోయిన నీటిమట్టం.. మర్రిగూడ మండలంలోని ఖుదాపక్షపల్లి గ్రామంలో భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోయాయి. జిల్లాలో ఏ గ్రామంలో లేనివిధంగా ఇక్క డ 63 మీటర్ల నుంచి 64 మీటర్ల వరకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఇప్పటికే ఆ గ్రామం తీవ్ర ఫ్లోరైడ్ సమస్యతో సతమతమవుతోంది. ఉపరితల నీటిని సరఫరా చేయడం మినహా మరో మార్గం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూగర్భ జలాలు అత్యంత లోతుకు పడిపోవడంతో, ఆ నీ టిని వినియోగించడం కూడా సరికాదని పేర్కొం టున్నారు. కాగా, జిల్లాలో అత్యధికంగా మర్రిగూ డ మండలంలో 26.42 మీటర్లకు భూగర్భ జలం చేరింది. ఇదే మండలంలో గత ఏడాది జనవరిలో 13.77 మీటర్ల వద్దనే భూగర్భ జలాలు లభ్యమవ్వగా, అదే ఏడాది మేలో 17.51 మీ టర్లకు చేరా యి. గతేడాది డిసెంబర్ నాటికి 24.57 మీరట్లకు పడిపోగా ప్రస్తుతం అది 26.42 మీట ర్లకు చేరిం ది.గత సంవత్సరం జనవరి నుంచి ఈ సంవత్స రం జనవరి వరకు ప్రతినెలా భూగర్భ జలాలు పడిపోవడమే తప్ప పెరగలేదు. జిల్లాలోని 10 మండలాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి చేరాయి. వర్షాభావ పరిస్థితులు ఈ విధంగానే ఉంటే భూగర్భ జలమట్టం మరింతగా పడిపోయి నీటి ఎద్దడి తప్పదని ప్రజలు ఆందోళన చెం దుతున్నారు. -
పల్నాటి రైతుల కన్నీటి కష్టాలు
గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం బోదలవీడుకు చెందిన ముప్పాళ్ల నాగేశ్వరరావుకు 16 ఎకరాల భూమి ఉంది. అందులో మిర్చి, పత్తి పంటలు వేశాడు. వర్షాలు కురవకపోవడంతో ఎనిమిది బోర్లు వేశాడు. అయితే ఒక్క బోరులో కూడా నీరు పడలేదు. నిరుత్సాహపడకుండా 1200 అడుగుల లోతు వరకూ తవ్వించినా ఫలితం శూన్యం. ఎనిమిది బోర్లకు రూ.10 లక్షలు ఖర్చవడంతో అప్పులపాలై మూడెకరాల భూమిని అమ్మి అప్పు తీర్చాడు. నీరు పడకపోవడంతో 13 ఎకరాల్లోని పంటలు ఎండిపోయి మరో రూ.10 లక్షల వరకూ నష్టం వచ్చింది. అప్పులు తీర్చేందుకు తిరిగి మరో మూడెకరాలు బేరం పెట్టాడు. అయితే అప్పటికే పల్నాడులో కరువు విలయతాండవంతో భూముల ధరలు సగానికి పడిపోయాయి. పొలాలు అమ్ముకునేవారు తప్ప కొనేవారులేక వడ్డీలు పెరిగిపోతున్నాయని కన్నీటిపర్యంతమవుతున్నాడు. వెల్దుర్తి మండలం పాపిరెడ్డికొండ తండాకు చెందిన చిన్నా నాయక్ తన మూడెకరాల పొలంలో మిర్చి పంట సాగు చేశాడు. తీవ్ర వర్షాభావంతో పొలంలో ఉన్న ఒక్క బోరు ఎండిపోయింది. చేతికొచ్చిన పంటలు ఎండిపోతుండటం చూడలేక ఇటీవల రెండు కొత్త బోర్లు వేశాడు. 1000 అడుగులకు పైన తవ్వినా నీరు పడలేదు. దీనికోసం రూ.2.5 లక్షలు ఖర్చు పెట్టాడు. మరోవైపు పంట పెట్టుబడికి చేసిన అప్పులు, పిల్లల బడి ఫీజులు తడిసిమోపిడయ్యాయి. దీంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పులకు వడ్డీలు కట్టలేక పొలం అమ్మకానికి పెడితే కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదని వాపోతున్నాడు. సాక్షి, గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పంట కుంటలు తవ్వించి భూగర్భ జలాలను పైకి తెచ్చామని, తద్వారా కరువును జయించామని సీఎం చంద్రబాబు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా పల్నాడులో భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోవడంతో రైతులు 1000–1200 అడుగుల లోతు వరకూ బోర్లు వేసినా చుక్కనీరు కూడా పడటం లేదు. మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ముఖ్యంగా.. మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, బొల్లాపల్లి, నూజెండ్ల, శావల్యాపురం, వినుకొండ, ఈపూరు మండలాల్లో భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయాయి. బోర్లు వేసినా చుక్కనీరు పడకపోవడంతో పంటలన్నీ ఎండిపోయి రైతులు తీవ్ర నష్టాలపాలై అప్పులపాలవుతున్నారు. ఒక్కో రైతు ఐదు బోర్లు వేసినా.. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డి గూడెంలో 350 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామ రైతులు తమ పొలాల్లో ఉన్న బోర్లు ఎండిపోవడంతో ఈ ఏడాది మరో 300 వరకూ కొత్త బోర్లను వేశారు. వీటిలో 5 శాతం బోర్లలో కూడా నీరుపడలేదు. కొందరు తమ పొలాల్లో 5–10 వరకూ బోర్లు వేసినా నిరాశే ఎదురైంది. దీంతో రైతులు పంటలు ఎండిపోయి అప్పులపాలై అందినకాడికి పొలాలను తెగనమ్ముకోవాల్సి వచ్చింది. కండ్లకుంట, గుండ్లపాడు, ఉప్పలపాడు, బోదలవీడు, శిరిగిరిపాడు, వెల్దుర్తి వంటి గ్రామాల్లో సైతం వందలాది మంది రైతులు 1000–1200 అడుగుల మేర బోర్లు వేసినా చుక్క నీరూ పడకపోవడంతో అప్పులపాలై ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. ఒక్క వెల్దుర్తి మండలంలోనే బోర్లకు సుమారు రూ.20 కోట్ల వరకూ రైతులు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. వెల్దుర్తి మండలంలో 12 వేల హెక్టార్లలో పత్తి, 4 వేల హెక్టార్లలో మిర్చి, 500 ఎకరాల్లో కంది పంటలను రైతులు సాగు చేశారు. నీరందక పంటలు ఎండిపోవడంతో రూ.200 కోట్ల మేర నష్టపోయారని అంచనా. ఒక్క మండలంలోనే ఇంత నష్టం వాటిల్లితే పల్నాడు ప్రాంతంలోని మిగతా మండలాల్లో సంభవించిన నష్టం వేల కోట్లలో ఉంటుందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. రైతులు ఈ స్థాయిలో నష్టాలపాలై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. మండిపడుతున్న రైతు సంఘాలు గుంటూరు జిల్లాలో సాగర్ చివరి ఆయకట్టు కింద ఉన్న రైతుల పరిస్థితి సైతం దుర్భరంగానే ఉంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రత్తిపాడు, పెదగొట్టిపాడు, నడింపాలెం, పాతమల్లాయపాలెం, కోయవారిపాలెం రైతులు ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొలాల్లో ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని కొంటున్నారు. కృష్ణా నది నిండా నీళ్లున్నా సాగుకు నీళ్లందించలేని అసమర్థ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టీడీపీ ప్రభుత్వమేనని రైతులు, రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. గత 50 ఏళ్లలో ఇంతటి దుర్భిక్షం ఎన్నడూ చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వోల్టా చట్టంపై అవగాహన కల్పించని ప్రభుత్వం వోల్టా కమిటీలను ఏర్పాటు చేసి వోల్టా చట్టంపై రైతులకు అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుండటం వల్లే ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ చట్టం ప్రకారం.. రైతు బోరు వేయాలనుకుంటే ముందుగా సంబంధిత మండల తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవడంతోపాటు డీడీ చెల్లించి భూమికి సంబంధించిన వివరాలను నమోదు చేయించాలి. రెండు బోరు బావుల మధ్య కనీసం 200 మీటర్ల దూరం ఉండాలి. అలా ఉందా? లేదా? అనేది తహసీల్దార్ నిర్ధారణ చేసుకున్నాక క్షేత్ర స్థాయి పరిశీలన కోసం జిల్లా భూగర్భ జలశాఖకు రిఫర్ చేయాలి. జియోహైడ్రాలజిస్ట్ సదరు భూమిలో నీటి లభ్యతను సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా తెలుసుకుని.. నీటి లభ్యత ఉంటే బోరు బావి తవ్వుకోవడానికి అనుమతి ఇస్తారు. కానీ జిల్లాలో ఈ ప్రక్రియ ఎక్కడా అమలు కాకపోవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా దగ్గర దగ్గర బోర్లు వేసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇది ముప్పాళ్ల నాగేశ్వరరావు, చిన్నా నాయక్‌ల పరిస్థితే కాదు.. అక్కడ ఏ రైతును కదిల్చినా క‘న్నీటి’ గాథలే. పక్కనే కృష్ణానది పారుతున్నా పంటలకు నీరందని దుస్థితి. కనీసం బోర్లుతోనైనా పంటలు సాగు చేసుకుందామనుకుంటే అడుగంటిన భూగర్భ జలాలు పైకి రానంటున్నాయి. ఇవన్నీ కరువు జిల్లా అయిన అనంతపురంలో అనుకుంటే పొరపాటే. ‘విశ్వనగరం’ అమరావతి కొలువైన గుంటూరు జిల్లా పల్నాడులో రైతులు పడుతున్న కన్నీటి కష్టాలు. పల్నాడు ప్రాంతంలో నెలకొన్న కరువుపై ప్రత్యేక కథనం.. -
వేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా భూగర్భ జలాలు అడుగింటి పోతున్నాయి. లోటు వర్షపాతం కారణంగా చాలా జిల్లాల్లో ఖరీఫ్ పంటల సాగుకు రైతులు బోర్లపై ఆధారపడటంతో మట్టాల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. గతేడాది నవంబర్ మట్టాలతో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 2.54 మీటర్ల దిగువకు పడిపోయాయి. మెదక్ జిల్లాలో ఏకంగా 20.71 మీటర్లకు భూగర్భ నీటిమట్టం పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది 19 శాతం మేర లోటు వర్షపాతం తక్కువగా నమోదైంది. ఈ ఏడాది నవంబర్‌లో భూగర్భ జల శాఖ 584 మండలాల పరిధిలో భూగర్భ మట్టాలను పరిశీలించింది. గతేడాది నవంబర్‌లో రాష్ట్ర సగటు నీటి మట్టం 8.36 మీటర్లు ఉండగా, ఈ ఏడాది అది 10.90గా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే 2.54 మీటర్ల మేర తగ్గుదల కనిపించింది. కేవలం 8 జిల్లాల్లో మాత్రమే 0.34 మీటర్ల నుంచి 1.64 మీటర్ల పెరుగుదల కనిపించగా, 23 జిల్లాల్లో 7.85 మీటర్ల నుంచి 0.15 మీటర్ల వరకు తగ్గాయి. ముఖ్యంగా సంగారెడ్డి, రంగారెడ్డి, గద్వాల, మెదక్, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లోమట్టాలు ఊహించని రీతిలో పడిపోయాయి. ఏకంగా కొన్ని జిల్లాలో 7 మీటర్లు పడిపోగా, మరికొన్ని జిల్లాలో 6 మీటర్లకు పైగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వేసవికి మరో 4 నెలల ముందే ఇలాంటి పరిస్థితులు ఉంటే.. ఇక నిండు వేసవిలో ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయన్న గుబులు కలిగిస్తోంది. -
కందకాల వల్లే పుష్కలంగా నీరు
మెదక్ జిల్లా శివంపేట్ మండలం రత్నాపూర్‌కు చెందిన పట్నూరి నింబాద్రిరావు గత వేసవిలో తన 9 ఎకరాల పొలంలో మామిడి, జామ, టేకు మొక్కలు నాటడానికి ముందు బోరు వేయించారు. నీరు పడింది. కానీ, నీరు చాలా తక్కువగా పోస్తోంది. భవిష్యత్తులో నీటి ఎద్దడి వస్తుందని భయపడిన దశలో ‘సాక్షి’ ద్వారా కందకాల ద్వారా నీటి భద్రత సాధించవచ్చని నింబాద్రిరావు తెలుసుకున్నారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంగెం చంద్రమౌళి(98495 66009), మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి (99638 19074)లను సంప్రదించి.. వారి సలహా మేరకు కందకాలు తవ్వించారు. మీటరు లోతు, మీటరు వెడల్పున వాలుకు అడ్డంగా గత మేలో కందకాలు తవ్వించారు. కందకాలు తవ్విన వారంలోనే తొలి వర్షం పడి, కందకాలు నిండాయి. ఆ తర్వాత వర్షాలకు కందకాలు ఐదారు సార్లు నిండాయి. రెండు వర్షాల తర్వాత బోరు 70 అడుగుల్లోనే నీరు అందుబాటులోకి వచ్చేంతగా భూగర్భ జలాలు పెరిగాయి. బోరు ఒకటిన్నర ఇంచుల నీరు పోస్తోంది. ఇటీవల కాలంలో మా ప్రాంతంలో భూగర్భ జల మట్టం బాగా తగ్గిపోయింది. కొందరి బోర్లు నీటి కొరత వల్ల ఆగి ఆగి పోస్తున్నాయి. కానీ, మా బోరు నిరంతరాయంగా ఇంచున్నర నీరు పోస్తోంది. ఇదంతా కందకాల వల్ల భూమిలోకి వర్షం నీరు ఇంకడమే కారణమని తాను భావిస్తున్నానని నింబాద్రిరావు (95150 21387) తెలిపారు. -
జలం జాడేది?
సాక్షి,సిటీబ్యూరో: మహానగరానికి నీటి కరువు ముంచుకొస్తోంది. భూగర్భ జలాలు శరవేగంగా పడిపోతున్నాయి. శీతాకాలంలోనే ఈ ప్రభావం అధికంగా కనిపిస్తుండడం గమనార్హం. ఈ సారి నైరుతి రుతుపవన సీజన్లో నగరంలో 31 శాతం తక్కువ వర్షపాతం నమోదుకావడం.. కురిసిన అరకొర వర్షపు నీరు సైతం భూగర్భంలోకి ఇంకే అవకాశం లేకపోవడంతో అక్టోబర్ మాసంలోనే పాతాళగంగ అథఃపాతాళంలోకి పడిపోయింది. ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంటే రాబోయే వేసవిలో భూగర్భజలాల లభ్యతపై ఇప్పటి నుంచే ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా గ్రేటర్లో అక్టోబర్ నాటికి సరాసరిన 3.28 మీటర్ల లోతున భూగర్భ జలాల జాడ కనిపిస్తుంది. కానీ ఈసారి ఏకంగా 7.39 మీటర్ల లోతునకు వెళితేగాని నీటి ధారల జాడ కనిపించని పరిస్థితి. అంటే సాధారణం కంటే 4.11 మీటర్ల లోతుకు నీటిమట్టాలు పడిపోవడం గమనార్హం. పొరుగునే ఉన్న రంగారెడ్డి జిల్లాలో గతేడాది 10.28 మీటర్ల లోతున నీరు ధారలు టిలభించగా.. ఈసారి 17.12 మీటర్ల లోతుకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ జిల్లాలోనూ సరాసరిన 6.84 మీటర్ల మేర నీటిమట్టాలు పడిపోవడంగమనార్హం. పాతాళంలోకి భూగర్భజలాలు గ్రేటర్ పరిధిలో పలు మండలాల్లో గతేడాది అక్టోబర్ నెలతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో నీటిమట్టాలు అనూహ్యంగా తగ్గిపోయాయి. ప్రధానంగా నైరుతి సీజన్లో నమోదు కావాల్సిన వర్షపాతంలో 31 శాతం మేర తగ్గిపోవడం.. కురిసిన అరకొర వర్షం నీరు సైతం నేలలోకి ఇంకించేందుకు అవసరమైన ఇంకుడు గుంతలు లేకపోవడంతో భూగర్భ జలమట్టాలు అథఃపాతాళంలోకి చేరడానికి ప్రధాన కారణమని భూగర్భ జలశాఖ నిపుణులు ‘సాక్షి’కి తెలిపారు. మహానగరం పరిధిలో ఆస్తిపన్ను చెల్లిస్తున్న భవనాల సంఖ్య 14 లక్షలుకాగా.. ఇంకుడు గుంతలు లక్షకు మించి లేకపోవడం.. మరోవైపు విచక్షణా రహితంగా బోరుబావులు తవ్వి భూగర్భ జలాలను తోడేస్తుండడంతో ఈ పరిస్థితికి ప్రధాన కారణమని విశ్లేషిస్తున్నారు. నిరాశాజనకంగా నైరుతి.. ఈసారి నైరుతి రుతుపవనాలు గ్రేటర్‌ను నిరాశపరిచాయి. రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు నగరాన్ని ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లాలో జూన్–సెప్టెంబర్(నైరుతి రుతుపవనాల కాలం) మధ్యలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో ఈ రెండు జిల్లాల పరిధిలోని పలు జలాశయాల్లో వర్షపునీరు చేరే దారిలేక చిన్నబోయి కనిపిస్తున్నాయి. హైదరాబాద్ జిల్లాలో సాధారణంగా నైరుతి సీజన్లో 580.9 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదవడం పరిపాటి. అయితే, ఈసారి మాత్రం 401.7 మిల్లీమీటర్లు మాత్రమే వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 31 శాతం తక్కువగా నమోదైంది. ఇక రంగారెడ్డి జిల్లాలో సాధారణ వర్షపాతం 525.9 మిల్లీమీటర్లు కాగా.. ఈ సీజన్లో కేవలం 386.8 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదవడం గమనార్హం. పెరుగుతోన్న వేడిమి.. నైరుతి రుతుపవనాలను తిరోగమించడంతో ప్రస్తుతం వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. గురువారం నగరంలో 32.4 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 10 గంటల నుంచే ఎండవేడి ప్రభావం కనిపించింది. మరోవైపు గాలిలో తేమశాతం 65 శాతం నుంచి 50–55 శాతానికి పడిపోయింది. దీంతో వాతావరణంలో వేడిమి పెరిగి చర్మం, కళ్ల మంటలు, శ్వాసకోశ సమస్యలతో గ్రేటర్ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. -
కందకాలే మామిడి చెట్లను బతికించాయి!
కరువుతో భూగర్భ జలాలు అడుగంటి పెద్దలు నాటిన మామిడి చెట్లు ఒకటొకటీ నిలువునా ఎండిపోతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కని సంక్షోభ సమయంలో ‘సాక్షి సాగుబడి’ స్ఫూర్తితో, తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం పెద్దల సాంకేతిక సలహాల మేరకు కందకాలు తవ్వి తాతల నాటి మామిడి చెట్లను విజయవంతంగా కాపాడుకోగలిగామని చిత్తూరు జిల్లాకు చెందిన రైతు బాపు ప్రసాద రెడ్డి సంబరంగా చెబుతున్నారు. బాపు ప్రసాద రెడ్డి కుటుంబ ఉమ్మడి సేద్యం కింద పాకాల మండలం దామలచెరువు గ్రామపరిధిలో తాతల నాటి మామిడి తోటలున్నాయి. 2016లో తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో పెద్ద మామిడి చెట్లు కొన్ని ఎండిపోయాయి. ఆ దశలో ‘సాక్షి సాగుబడి’ పేజీలో ‘చేను కిందే చెరువు’ శీర్షికన ప్రచురించిన కథనం ద్వారా తక్కువ ఖర్చుతోనే కందకాలు తవ్వుకుంటే భూగర్భ జలాలను పెంచుకొని నీటి భద్రత సాధించవచ్చని తెలుసుకొని, ప్రాణం లేచి వచ్చిందని ఆయన తెలిపారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాదరెడ్డి, అధ్యక్షులు సంగెం చంద్రమౌళి (98495 66009) లను ఫోను ద్వారా సంప్రదించి, వారి సూచనల ప్రకారం వాలుకు అడ్డంగా మీటరు లోతు, మీటరు వెడల్పున జేసీబీతో కందకాలు తవ్వించామని బాపు రెడ్డి వివరించారు. కందకం పొడవు 25 మీటర్ల తర్వాత 5 మీటర్లు ఖాళీ వదిలి, అదే వరుసలో 25 మీటర్ల పొడవున మరో కందకం తవ్వించామని తెలిపారు. జేసీబీతో తవ్వించడానికి ఎకరానికి రూ. 2,500 వరకు ఖర్చయిందన్నారు. ఆ తర్వాత వర్షాలు పడినప్పుడు వర్షపు నీరు పూర్తిగా ఇంకి భూగర్భ జలాలు పెరిగాయని, ఆ తర్వాత నుంచి ఒక్క మామిడి చెట్టు కూడా ఎండిపోలేదన్నారు. అంతేకాదు, ఈ రెండేళ్లలో మామిడి తోట చాలా కళగా ఉంది. పంట దిగుబడి కూడా బాగా వచ్చిందని ఆయన సంతోషంగా చెప్పారు. అయితే, ధర అంత బాగాలేదు. ధర బాగుంటే మరింత లాభదాయకంగా ఉండేదన్నారు. చనిపోయిన చెట్ల స్థానంలో సీతాఫలం, జామ మొక్కలు నాటాలని భావిస్తున్నామన్నారు. కందకాల వల్ల నిజంగా ఎంతో మేలు జరుగుతున్నదని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదని బాపురెడ్డి(90301 81344) అన్నారు. -
కుంగుతున్న‘ధాన్యాగారం’
సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా – గోదావరి బేసిన్... 23 లక్షల ఎకరాల్లో పచ్చని పంటలతో కళకళలాడే అన్నపూర్ణ... రాష్ట్ర ప్రజలకు అన్నం పెట్టే కంచం. ఇప్పుడా కంచం మెల్లమెల్లగా కుంగుతోంది. గోదావరి బేసిన్లో విచక్షణారహితంగా సహజవాయువు నిక్షేపాల తవ్వకాలతో డెల్టా అంతకంతకూ కిందకు జారుతోంది. 20 ఏళ్లలో ఏకంగా అడుగున్నర నుంచి 5అడుగుల వరకు భూమి కుంగిందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడికావడం ఆందోళన కలిగిస్తోంది. పర్యావరణాన్ని నాశనం చేస్తూ... పంటలను దెబ్బతిస్తూ... భవిష్యత్‌లో ఆహార, తాగునీటి కొరత దుస్థితిని కలిగిస్తూ పెనుప్రమాదం ముంచుకొస్తోంది. అయినా సరే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఎందుకు కుంగుతోందంటే... భూగర్భంలో భారీగా గడ్డకట్టి ఉండే రాతి పొరల కింద సహజవాయువు ద్రవరూపంలో నిక్షిప్తమై ఉంటుంది. సున్నపురాయి, ఇసుకరాయి అనే రెండు రకాల రాళ్లు భూగర్భంలో ఉంటాయి. సున్నపురాతి పొరల కింద ఉండే సహజవాయువును వెలికితీస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు. సున్నపురాతి గుట్టలు తమంతటతాముగా సర్దుబాటు చేసుకుంటాయి. రాష్ట్రంలో గోదావరి బేసిన్ భూగర్భంలో 3కి.మీ. నుంచి 4కి.మీ. లోపల ఇసుకరాతి గుట్టల పొరల్లో సహజవాయు నిక్షేపాలు ఉన్నాయి. భూగర్భంలోని ఇసుకరాతిలో జియో స్టాటిక్ ప్రెషర్ అనే ఒత్తిడి ఉంటుంది. ఇసుకరాతి పొరల్లో ద్రవరూపంలో ఉండే సహజవాయువులో హైడ్రో స్టాటిక్ ప్రెషర్ అనే ఒత్తిడి ఉంటుంది. ఈ ప్రెషర్లు భూ ఉపరితలాన్ని మోస్తూ ఉంటాయి. సహజవాయువును వెలికితీసినప్పుడు హైడ్రో స్టాటిక్ ప్రెషర్ తొలగిపోయి ఖాళీ ఏర్పడుతుంది. ఫలితంగా భూఉపరితలం కిందకు కుంగుతుంది. 20 ఏళ్లలో అడుగున్నర నుంచి 5 అడుగులు కుంగింది... 20 ఏళ్లలో డెల్టాలో అడుగున్నర నుంచి 5 అడుగుల వరకు కుంగిందని ప్రొఫెసర్ కృష్ణారావు అధ్యయనంలో వెల్లడైంది. తీరం నుంచి 20కి.మీ. వరకు ఈ పరిస్థితి ఉన్నట్లు గుర్తించారు. శాస్త్రీయ అధ్యయనం ప్రకారం వెయ్యి మీటర్లు భూగర్భంలోకి తవ్వితే వంద కేజీ సెంటీమీటర్ల ఒత్తిడి ఉంటుంది. గోదావరి బేసిన్లో దాదాపు 4కి.మీ. వరకు తవ్వుతున్నారు. అంటే అక్కడ దాదాపు 400 కేజీ సెంటీమీటర్ల ఒత్తిడి ఉంటుంది. అక్కడ ఉన్న సహజవాయువును తీసివేయడంతో ఆమేరకు భూమి కుంగుతోంది. ఒక్కో చమురు బావిలో తవ్వకాల ప్రభావం ఆ పరిసరాల్లో కొన్ని చ.కి.మీ. వరకు ఉంటుంది. ఇవిగో తార్కాణాలు... తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి గుంటూరు జిల్లా బాపట్ల వరకు భూమి కుంగుతున్న ప్రభావం కనిపిస్తోంది. కాకినాడ– భీమవరం ఇది మరింత ఎక్కువుగా ఉంది. ఆ ప్రాంతంలో భూ ఉపరితలం ఒకప్పుడు సముద్ర మట్టానికంటే 3అడుగుల నుంచి 7అడుగుల వరకు ఎత్తులో ఉండేది. ప్రస్తుతం దాదాపు సరిసమానం కావడంతో సముద్రం తరచూ భూమిపైకి చొచ్చుకు వచ్చేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, ఉప్పాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని బొండాడ, సఖినేటిపల్లి, నరసాపురం, మొగల్తూరు, పి.గన్నవరం మొదలైన ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రత ఎక్కువుగా ఉంది. 1986లో వరదల సమయంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 23.60 అడుగలకు నీటిమట్టం చేరితే పశ్చిమ గోదావరి జిల్లా పి.గన్నవరం వద్ద అక్విడెక్ట్‌పై నుంచి వరదనీరు పారింది. కానీ 2009 వరదల సమయంలో ధవళేవ్వరం బ్యారేజీ వద్ద 19అడుగులకు నీరు చేరగానే పి.గన్నవరం వద్ద అక్విడెక్ట్పైకి నీరు చేరింది. అంటే ఆ ప్రాంతంలో భూమి నాలుగు అడుగల వరకు కుంగిందనే విషయం నిర్ధారణ అవుతోందని ప్రొఫెసర్ కృష్ణారావు చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే పదేళ్లలో సముద్ర మట్టం కంటే భూ ఉపరితలం కిందకు దిగిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికా విధానం ఆదర్శం కావాలి అమెరికాలోని కాలిఫోర్నియాలో కూడా భూగర్భంలో ఇసుక రాతి పొరల్లో ఉన్న సహజవాయువును వెలికితీస్తున్నారు. అయితే అక్కడ సహజవాయువును వెలికితీయగానే... ఎక్కువ పీడనంతో నీటిని ఆ ఇసుకరాతి పొరల్లోకి పంపి హైడ్రో స్టాటిక్ ప్రెషర్ తగ్గకుండా చేస్తున్నారు. ఫలితంగా భూ ఉపరితలం కుంగడం లేదు. మన ప్రభుత్వం మాత్రం ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా మేల్కోనకపోతే వినాశనమే: ప్రొఫెసర్ జి.కృష్ణారావు, శాస్త్రవేత్త ‘విచక్షణారహితంగా సహజవాయువు వెలికితీయడంతో డెల్టాలో భూమి అంతకంతకూ కుంగుతూ ముప్పు ముంచుకొస్తోంది. దీనిపై 1998లోనే అప్రమత్తం చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటికైనా శాస్త్రీయంగా తగిన నివారణ చర్యలు చేపట్టకుపోతే భవిష్యత్ తరాలకు తీవ్రహాని చేసినవారమవుతాం.’ శాస్త్రవేత్తల సూచనను పట్టించుకోని చంద్రబాబు విచక్షణారహితంగా సహజవాయు నిక్షేపాల వెలికితీతపై శాస్త్రవేత్తలు, కృష్ణా– గోదావరి డెల్టా పరిరక్షణ సమితి మొదటి నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తునే ఉన్నాయి. 1998లోనే ఆంధ్రా విశ్వవిద్యాలయం(ఏయూ) భూవిజ్ఞాన విభాగం ప్రొఫెసర్ జి.కృష్ణారావు దీనిపై లేఖ రాసినా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై డెల్టా పరిరక్షణ సమితి ఆందోళనలు నిర్వహించీ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది. దాంతో ఓఎన్జీసీ ఏయూకు చెందిన డెల్టా స్టడీస్ విభాగంతో పరిశోధనలు నిర్వహించింది. మరోవైపు రిటైర్డ్ ప్రొఫెసర్ కృష్ణారావు నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం కూడా అధ్యయనం కొనసాగించింది. ఆరు నెలల పాటు పరిశోధనలు నిర్వహించిన డెల్టా స్టడీస్ విభాగం 2017లో నివేదిక సమర్పించింది. ఇవీ నష్టాలు – 23లక్షల ఎకరాల ఆయకట్టుతో రాష్ట్రానికి ధాన్యాగారంగా ఉన్న గోదావరి–కృష్ణా డెల్టాకు పెనుముప్పు వాటిల్లుతోంది. – సముద్రం తీరప్రాంతాన్ని దాటి భూమిపైకి చొచ్చుకు వస్తే వేలాది ఎకరాలు మునిగిపోతాయి. మరెన్నో భూములు ఉప్పునీటి కయ్యలుగా మారిపోతాయి. ఫలితంగా ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది. – భూగర్భ జలాలు కలుషితమై తాగునీటి సమస్య ఏర్పడుతుంది. ఇప్పటికే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో సముద్రతీరానికి 20కి.మీ.వరకు బావులు తవ్వుతుంటే ఉప్పునీరే వస్తోంది. – నదులు, కాలువల్లో నీటి ప్రవాహ వేగం బాగా తగ్గిపోయి ఆయకట్టు శివారు ప్రాంతాలకు సాగునీరు సరిగా అందదు. – తీరప్రాంతానికి సమీపంలో నిర్మించే రోడ్లు, పరిశ్రమలు, ఇతర నిర్మాణాలు దెబ్బతింటాయి. -
కందకాలతో నీటి లభ్యత పెరిగింది!
కందకాలు తవ్వించుకోమని చెబితే వినిపించుకుని అనూహ్యమైన రీతిలో సాగు నీటి భద్రత సాధించిన సొంత భూముల రైతులు చాలా మంది కనిపిస్తున్నారు. అయితే, కౌలు రైతులు కూడా కందకాలు తవ్వించుకోవడం అరుదైన విషయం. రామిశెట్టి వెంకటేశ్వరరావు(95020 50975), డా. కంచర్ల ప్రవీణ్(87128 45501).. అనే మిత్రులు చాలా సంవత్సరాలు విదేశాల్లో ఉద్యోగాలు చేసి స్వదేశం వచ్చేసి ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం షారాజిపేటలో 12 ఎకరాల భూమిని పదేళ్ల పాటు కౌలుకు తీసుకున్నారు. 3 బోర్లు వేస్తే 2 ఇంచుల నీళ్లు వచ్చాయి. అయితే, ఇసుకపాళ్లు ఎక్కువగా ఉన్న ఎర్ర నేల కావడంతో మంచి దిగుబడులు తీయాలంటే వాన నీటి సంరక్షణ ద్వారా సాగు నీటి భద్రత సాధించడం అతిముఖ్యమని భావించారు. గూగుల్ సెర్చ్ చేస్తే.. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం, సాక్షి ఆధ్వర్యంలో సాగు భూమిలో అంతటా కందకాలు తవ్వుకునే పద్ధతి గురించి తెలిసింది. సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి(99638 19074)ని సంప్రదించి.. 2017 మే/జూన్‌లో ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో మీటరు లోతు, మీటరు వెడల్పున కందకాలు తవ్వించారు. పుష్కలంగా వర్షాలు పడడంతో అనేకసార్లు కందకాలు నిండాయి. ఆరు నెలల్లో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. కలబంద+ఉల్లి, ఆపిల్ బెర్, చెరకు, మునగాకు, పందిరి కూరగాయలను సాగు చేస్తున్నారు. ‘అంతకుముందు డ్రిప్ ద్వారా 3 వాల్వులకు సరిపోని నీటి ప్రెజర్, 6–7 వాల్వులకు పెరిగింది. పక్క తోటల వాళ్లను అడిగితే తమకు తేడా లేదన్నారు. అప్పుడు మాకు అర్థమైంది. కందకాలు తవ్వి వర్షపు నీటిని ఇంకింపజేయడం వల్లనే ప్రెజర్ రెట్టింపైంది. డ్రిప్ నీటి ప్రెజర్ ఈ ఎండాకాలంలో కూడా తగ్గలేదు..’ అని వెంకటేశ్వరరావు ఇటీవల ‘సాగుబడి’తో చెప్పారు. -
ఆ బాధ్యత సాధికార మిత్రలదే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్న వారిని గుర్తించి, వారికి ప్రభుత్వం పట్ల సానుకూలత ఏర్పడేలా నచ్చజెప్పే బాధ్యత సాధికార మిత్రలదేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి 35 ఇళ్లకు ఒక డ్వాక్రా మహిళను సాధికార మిత్రలుగా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు బుధవారం ఉండవల్లిలోని తన అధికార నివాసం నుంచి 500 మంది సాధికార మిత్రలతో ప్రత్యక్షంగా, మిగిలిన 4.60 లక్షల మంది సాధికార మిత్రలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘‘మీకు కేటాయించిన 35 కుటుంబాల దగ్గరకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ అందుతున్నాయో లేదో తెలుసుకోవాలి. ప్రభుత్వం పట్ల ప్రజలు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారో గుర్తించాలి. రాష్ట్రంలో 99 శాతం మంది ప్రజలు ప్రభుత్వం పట్ల సంతృప్తి చెందేలా నచ్చజెప్పాల్సిన బాధ్యత మీదే’’ అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సాధికార మిత్రలకు త్వరలో ప్రభుత్వం స్మార్ట్ఫోన్లు అందజేస్తుందని, ఫోన్ బిల్లులు సైతం చెల్లిస్తుందని చెప్పారు. ఫోన్లోని ప్రత్యేక యాప్‌లో ప్రభుత్వ పథకాల వివరాలుంటాయని, సాధికార మిత్రలు ఆ వివరాలను ఇంటింటికీ వెళ్లి తెలియజేయాలని, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని సూచించారు. కేటాయించిన 35 కుటుంబాలకు సాధికార మిత్రలు తోడ్పాటు అందిస్తే, సాధికార మిత్రలకు అండగా నిలిచే బాధ్యత తనదేనని చంద్రబాబు వెల్లడించారు. రైతులకు రెట్టింపు ఆదాయం అందేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం కేవలం మాటలే చెబుతోందని.. కానీ, రెండింతల ఆదాయం ఎలా పెంచాలన్నది రాష్ట్రంలో మనం చేసి చూపించామని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.125 కోట్లు ఖర్చు పెట్టి, మహిళలకు తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్స్ అందజేస్తోందని తెలిపారు. ఈ ప్యాడ్స్‌కు ‘రక్ష’ పేరు ఖరారు చేస్తున్నామన్నారు. కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేస్తాం ఏటా జూన్ 1వ తేదీనే కృష్ణాడెల్టాకు నీరు విడుదల చేసి కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేస్తామని సీఎం చంద్రబాబుఅన్నారు. ప్రకాశం బ్యారేజీ కింద ఉన్న తూర్పు కాలువపై కొత్తగా నిర్మించిన రెగ్యులేటరీ ద్వారా కృష్ణా డెల్టాకు సీఎం బుధవారం నీరు విడుదల చేశారు. కృష్ణా కాలువలో గంగపూజ నిర్వహించిన అనంతరం కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనుల పైలాన్‌ను ఆవిష్కరించారు. రోజుకు వెయ్యి క్యూసెక్కుల నీటిని బ్యారేజీ నుంచి తరలిస్తారు. సీఎం మాట్లాడుతూ గతేడాది కంటే వారం ముందే కాలువలకు నీరు విడుదల చేశామని తెలిపారు. తద్వారా కృష్ణా తూర్పు డెల్టాలో 7.36లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. 160 ఏళ్లలో మొదటిసారిగా ఈ ఏడాది కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ నుంచి జీరో అవుట్ ఫ్లో ఉందన్నారు. వర్షాభావ పరిస్థితులు, కృష్ణానదిపై ఎగువ ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టుల కారణంగా గడిచిన 15ఏళ్లలో కృష్ణా డెల్టాలో అదను తప్పి సాగు చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని పట్టిసీమ నిర్మాణం, కృష్ణా–గోదావరి నదుల అనుసంధానం ద్వారా ఈ సమస్య అధిగమించామన్నారు. భూగర్భ జలాలు పెంచేలా చర్యలు చేపట్టామన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రతిపక్షం పనిగా పెట్టుకుందని ఆరోపించారు. -
వాన నీటి సుల్తాన్
రాబోయేది వానా కాలం. వాన వస్తుంది... వెళుతుంది అనుకుంటున్నారా? మధ్యలో చాలా పని చేయవచ్చు. వానను వాగు చేయొచ్చు. వరద చేయొచ్చు. బంధించి సంవత్సరం పొడవునా పనికి వచ్చే గింజలు ఇచ్చే జీవజలం కూడా చేయవచ్చు. అనంతపురం జిల్లా నీటి వసతి లేని జిల్లా అని అందరూ అంటారు. కాని ఈ రైతు తన పొలంలో నీటిని బంధించాడు. వాన నీటినే దాహానికీ సేద్యానికీ నిలువ చేయగలిగాడు. ఇవాళ అక్కడ మామిడి పండుతోంది. అంతేనా... చుట్టు పక్కల అడవుల నుంచి పక్షులు, పశువులు వచ్చి నట్ట నడెండలో ఈ వయాసిస్సులో దప్పిక తీర్చుకొని పోతున్నాయి. నూర్ మహమ్మద్ ఇది ఎలా సాధించాడో ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రశ్న: నూర్‌మహమ్మద్ గారూ.. ఎడతెగని కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాలో మీ తోటను ఎడారిలో ఒయాసిస్సుగా మార్చారు గదా.. మీ కృషి ఎప్పుడు ప్రారంభమైంది..? నూర్ మహమ్మద్: నేను వ్యవసాయ శాఖలో విస్తరణాధికారిగా పనిచేస్తుండగా బుక్కపట్నం మండలంలో 8 ఎకరాల భూమి కొన్నాను. అప్పట్లో అది బీడు భూమి. ఈ బీడు ఎందుకు తీసుకున్నారు? అని అందరూ అనేవారు. నీళ్లు చుక్క లేకుండా ఈ భూమిని ఏం చేసుకుంటావు? అని అడిగేవారు. నిజమే, నీటి వసతి లేని భూమి వృధానే. కానీ, ఫ్రయత్నిస్తే ఎడారిలో కూడా నీళ్లు సాధించవచ్చు. మబ్బుల్లో వాన ఉంటుంది కదా.. చాలు అనుకున్నాను. డిపార్ట్మెంట్లో నేను భూవనరుల సంరక్షణ విభాగంలో పనిచేసే వాడిని కనుక, ప్రతి నీటి బొట్టు విలువ తెలుసు కనుక ఎవరేమన్నా పట్టించుకోకుండా పదేళ్ల క్రితం నుంచి నీటి సంరక్షణ పనులు మొదలుపెట్టాను. అప్పట్లోనే లక్షన్నర రూపాయల వరకు ఖర్చు చేశా. భూగర్భంలో నీటిని దాచుకోవడానికి స్టెప్ బై స్టెప్ పని చేయడం మొదలుపెట్టా. ప్రశ్న:ఎలా మొదలుపెట్టారు..? మా బీడు భూమిలో నుంచి ఒక వంక వెళుతూ ఉంది. మొదట దానిపైన చెక్‌డ్యాం నిర్మించాం. తర్వాత తోట మధ్యలో అక్కడక్కడా 2.5 మీటర్ల వెడల్పు, మీటరు లోతులో మట్టికట్టలు కట్టాం. మట్టికట్ట చివరన మలుపులో నీటి కుంట తవ్వాం. అవి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. మాకు జూన్, జూలై నెలల్లోనే వర్షం ఎక్కువ పడుతుంది. పది రోజుల వాన ఒకేసారి పడుతూ ఉంటుంది. అంత పెద్ద వర్షానికి వచ్చే నీటి వరదను ఆపగలిగేలా మట్టి కట్టలు వేశాం. ప్రశ్న:కందకాలు ఎప్పుడు తవ్వారు? సాక్షి టీవీ, పేపరు ద్వారా కందకాల గురించి చదివి తెలుసుకున్న తర్వాత గత ఏడాది తవ్వాం. రెండు మీటర్ల లోతు, రెండు మీటర్ల వెడల్పున తోట చుట్టూ తవ్వాం. ప్రశ్న:మీరు చేపట్టిన వాన నీటి సంరక్షణ పనుల ప్రభావం ఎలా ఉంది? చాలా బాగుంది. నేను పెట్టిన ప్రతి రూపాయికీ కొన్ని వందల రెట్లు ప్రతిఫలం దక్కింది. మా దిగువన కిలోమీటరున్నర వరకూ భూగర్భ జలాలు రీచార్జ్ అయ్యాయి. దిగువ రైతులకూ నీటి భద్రత చేకూరింది. ప్రశ్న:మీ తోటకు ఎంత మేలు జరిగింది? మా 8 ఎకరాల తోటలో 9 రకాల మామిడి చెట్లు 500 వరకు ఉంటాయి. మా తోట ఎంతో బాగుంది. పచ్చగా, ఆరోగ్యంగా మంచి దిగుబడి వస్తోంది. ఏటా నికరంగా రూ. పది లక్షల ఆదాయం వస్తున్నది. మాకు ఎప్పుడూ నీటి కరువు లేదు. మా మండలంలో గత ఏడాది 250 ఎకరాల్లో మామిడి తోటలు నీరు లేక నిలువునా ఎండిపోయాయి. మా పొలంలో కురిసిన వానలో నుంచి చినుకు కూడా బయటకు పోకుండా జాగ్రత్త పడటం వల్లనే ఇది సాధ్యమైంది. ప్రశ్న:మీ తోట దగ్గర పశువులకు, అటవీ జంతువులకూ నీరు అందుబాటులో ఉంచారట కదా..? అవును సార్. మాకు చాలా సంతోషం కలిగించే సంగతి ఇది. మా తోట దగ్గర్లో ఉన్న అడవిలో కూడా జంతువులు తాగడానికి నీరు లేదు. తోట ఎదుట సిమెంటు తొట్టిని నిర్మించాం. అందులో ఎప్పుడూ నీళ్లు ఉండేలా చూస్తున్నాం. పక్షులు కూడా వచ్చి దప్పిక తీర్చుకుంటాయి. రాత్రుళ్లు అటవీ జంతువులు వచ్చి దాహం తీర్చుకుంటుంటాయి. ప్రశ్న:రైతులు ఎలా స్పందిస్తున్నారు..? పది మందికీ ఉపయోగపడే పని చేస్తున్నాం కాబట్టి ఆ ప్రాంత రైతులంతా మాతో బాగుంటారు. చాలా మంది వచ్చి చూసి వెళుతూ ఉంటారు. మా తోట గురించి ఎవరైనా కొత్తవారు వచ్చి అడిగితే.. సాయిబు తోట అనో మరోటో అనరు. ఆప్యాయంగా ‘సార్ తోట’ అని చెబుతారు. కరువు నేలలో సిరులు పండించవచ్చంటున్న నూర్ మహమ్మద్, ఇంత వేసవిలోనూ ఇన్ని నీళ్లున్నాయి ఎడారిలో ఒయాసిస్సు! ఎడారీకరణ ముప్పును ఎదుర్కొంటున్న అనంతపురం జిల్లాలో కొత్తచెరువు, బుక్కపట్నం మండలాలు నిరంతర కరువు మండలాలు. రబీ కాలంలో జిల్లా సగటు వర్షపాతం 100 ఎం.ఎం. ఉంటుంది. ఈ మండలాల్లో 20 ఎం.ఎం.కు మించదు. ఈ కారణంగా కరువు మండలాల జాబితాలో గత నాలుగైదేళ్లుగా ఈ మండలాలు క్రమం తప్పకుండా చోటుచేసుకుంటున్నాయి. గత ఏడాది ఈ ప్రాంతంలో 250 ఎకరాల్లో మామిడి తోటలు నిలువునా ఎండిపోయాయి. కటిక కరువు తాండవించే అటువంటి ప్రాంతంలో మామిడి రైతు నూర్‌మహమ్మద్, అతని కుమారుడు అజీజ్ ఎడారిలో ఒయాసిస్సును సృష్టించారు. ముందుచూపుతో పదేళ్ల క్రితం నుంచి చేపట్టిన నీటి సంరక్షణ పనులు ఈ అద్భుతాన్ని ఆవిష్కరింపజేశాయి. కొత్తచెరువుకు చెందిన నూర్‌మహమ్మద్, ఆయన కుమారుడు అజీజ్ బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి సమీపంలోని తమ 8 ఎకరాల తోటలో మామిడి సాగు చేస్తున్నారు. వాన నీటి సంరక్షణ చర్యల ద్వారా జలసిరులను ఒడిసిపడుతున్నారు. గత పదేళ్లుగా తమ పొలంలో కురిసిన ఒక్క చుక్కను కూడా బయటకు పోకుండా పూర్తిగా భూమిలోపలికి ఇంకింపజేస్తున్నారు. ఫలితంగా వీరి తోటలో నీటి కుంటల్లో పుష్కలంగా నీరు ఉంది. సేంద్రియ పద్ధతుల్లో సాగవుతున్న మామిడి చెట్లు నిండైన పండ్ల కాపుతో కళకళలాడుతూ లాభాల సిరులు తెచ్చిపెడుతున్నాయి.అంతేకాదు, కిలో మీటరు దూరం వరకు భూగర్భ జలాలు 250 అడుగుల్లోనే అందుబాటులోకి వచ్చాయి. అడవిలో కూడా తాగడానికి చుక్క నీరు దొరకని పరిస్థితుల్లో వీరి తోట బయట నీటి తొట్టిని ఏర్పాటు చేసి పశువులు, అటవీ జంతువుల దాహం తీర్చుతుండడం ప్రశంసనీయం. నూర్‌మహమ్మద్ వ్యవసాయ శాఖలో విస్తరణాధికారిగా ఉద్యోగం చేసి రిటైరయ్యారు. ఉద్యోగంలో ఉండగానే పాతికేళ్ల క్రితం 8 ఎకరాల మామిడి తోటను కొనుగోలు చేశారు. కరువు తీవ్రమవుతున్న దశలో పదేళ్ల క్రితం నుంచి ముందుచూపుతో వాన నీటి సంరక్షణ పనులు చేపట్టారు. తోట చుట్టూ 2 మీ. లోతు, 2 మీ. వెడల్పుతో కందకాలు తవ్వారు. తోట మధ్యలో నుంచి వెళ్తున్న వంకపై చెక్ డ్యాం నిర్మించారు. 40 మీటర్లకు ఒకచోట వాలుకు అడ్డంగా మట్టికట్టలు వేశారు. తోట నాలుగు వైపులా నాలుగు నీటి కుంటలు తవ్వించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఒక్క చుక్క నీరు కూడా బయటకుపోకుండా నేలలో ఇంకిపోయేలా పకడ్బందీగా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. ఎండాకాలంలో సైతం చెక్‌డ్యామ్ వద్ద నీరు నిల్వ ఉండటం విశేషం. మామిడి తోట ఎలాంటి పరిస్థితుల్లోనూ దెబ్బ తినకుండా నీటి భద్రత నెలకొంది. రెండు బోర్లలోనూ నీళ్లు పుష్కలంగా ఉండటం వలన డ్రిప్ కూడా లేకుండా చెట్టు పాది నిండా నీళ్లు పెడుతున్నారు. 25 సంవత్సరాల వయస్సుగల చెట్టుకు 40 నుంచి 50 కిలోల పశువుల ఎరువు వేస్తున్నారు. దీంతోపాటు, కుమారుడు అజీజ్ సహాయంతో వర్మీ కంపోస్ట్(ఎర్రల ఎరువు)ను తోటలోనే తయారు చేసి వేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. చీడపీడల నివారణ కోసం పుల్లని మజ్జిగను చెట్టు మొత్తం తడిసే విధంగా పిచ్చికారీ చేస్తున్నారు. 8 ఎకరాలలో సంవత్సరానికి ఖర్చులు పోను రూ. 10 లక్షల వరకు నికరాదాయం వస్తోందని నూర్‌మహ్మద్ తెలిపారు. సేంద్రియ ఎరువుల వాడకం, పుష్కలంగా నీటి తడులు ఇవ్వటం వల్ల కాయలు బాగా పెద్దవిగా ఉండటంతో పాటు అధిక దిగుబడులు వస్తున్నాయని తెలిపారు. ‘తలమార్పిడి’తో చెట్లకు పునరుజ్జీవం! కాత రాని, పనికిరాని చెట్లను 3 మీటర్ల ఎత్తున కోసి.. మల్లిక, బాదుషా వంటి మేలు జాతి మొక్కలను అంటు కట్టి మంచి ఫలితాలు సాధిస్తున్నాం. ఒక చెట్టుకు 10–15 వరకు అంట్లు కడుతున్నాం. ఇలా ‘తలమార్పిడి’తో అంటుకట్టిన చెట్లు మూడేళ్లలోనే పూర్తిస్థాయి కాపును ఇస్తున్నాయి. ఇతర రైతులు కూడా ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు మాత్రమే వాడుతున్నాం. రసాయనిక ఎరువులు ఎన్నడూ వాడలేదు. కాయ మంచి సైజు వస్తున్నది. ఖర్చులన్నీ పోను ఏడాదికి రూ. 10 లక్షల నికరాదాయం వస్తున్నది. – నూర్‌మహ్మద్ (94409 83644), కొత్తచెరువు, అనంతపురం జిల్లా కుమారుడు అజీజ్‌తో నూర్‌మహమ్మద్ – కడప గంగిరెడ్డి, సాక్షి, బుక్కపట్నం, అనంతపురం జిల్లా -
నీటి కొలను.. చింత తీరెను!
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లక్ష్మాతండాకు చెందిన రైతు బానోత్ రాములు ఈయన. ఈజీఎస్ పథకంలో భాగంగా మంజూరు చేసిన ఫాంపాండ్ (నీటిగుంత)ను సొంతంగానే తవ్వుకున్నాడు. పంటలు ఎండిపోకుండా గుంతల్లోని నీటిని అవసరమైనప్పుడు ఆయిల్ ఇంజన్‌తో పెట్టుకొని కాపాడుకుంటున్నాడు. రూ.20 వేలు మాత్రమే ఖర్చు అయిందని తెలిపాడు. నీటిగుంతల వల్ల నీరు భూమిలో ఇంకిపోతోందని, దీంతో పక్కనే ఉన్న బోరులో సైతం నీటి సామర్థ్యం తగ్గలేదని చెప్పుకొచ్చాడు. ఈ పథకంతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందని ఆనందం వ్యక్తం చేశాడు. సాక్షి నెట్వర్క్: ఫాంపాండ్స్ (నీటిగుంతలు) సత్ఫలితాలిస్తున్నాయి. భూగర్భ జలాల పెంపునకు రైతుల పొలాల్లో ఉపాధి హామీ కింద చేపట్టిన ఫాంపాండ్స్‌తో ప్రయోజనం చేకూరుతోంది. ఈ గుంతలతో వేసవిలో నీటి కొరత తీరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ కూలీలకు పని దొరకడంతోపాటు వ్యవసాయ బావులు, బోరు బావుల్లో నీటి నిల్వ పెరుగుతున్నాయి. మరోవైపు పథకం లక్ష్యం.. ఫలాలు బాగానే ఉన్నా అధికారులు ఆచరణలో విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వ్యవసాయ శాఖల ద్వారా రైతులకు నీటి గుంతల నిర్మాణంపై అవగాహన కల్పించాల్సి ఉండగా, ఇప్పటికీ ఎలాంటి అవగాహన కల్పించలేదు. దీంతో రాష్ట్రంలో వీటి నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. మరో పది రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుండటంతో, ఇక ఈ గుంతల నిర్మాణం చేపట్టడం కష్టంగా మారనుంది. వర్షాకాలానికి ముందే నీటి గుంతల నిర్మాణ పనులను పూర్తి చేసేలా అధికారులు పనులను వేగవంతం చేయాల్సి ఉంది. అవగాహనా లోపంతో రైతుల వెనుకడుగు ఫాంపాండ్స్పై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన లేదు. దీంతో కొన్నిచోట్ల వీటిని తవ్వుకునేందుకు విముఖత చూపుతున్నారు. దాదాపు ఒక గుంట మేర ఫాంపాండ్స్‌ను తవ్వుతుండటంతో భూమి వృథాగా పోతుందంటూ ముందుకు రావడం లేదు. మరికొన్ని చోట్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. సూర్యాపేట జిల్లాకు 5,047 గుంతలు మంజూరు కాగా, వీటిలో 2,064 గుంతల పనులు ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా పూర్తి కాలేదు. కామారెడ్డి జిల్లాలో 8,513 ఫాంపాండ్స్ నిర్మించాలన్న లక్ష్యం ఉండగా, 5,344 గుంతల నిర్మాణం ఇప్పటి వరకు మొదలుపెట్టనేలేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు 51,345 నీటి గుంతలు మంజూరయ్యాయి. కానీ ఇప్పటి వరకు 484 నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీతోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో 404 ఫాంపాండ్స్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేశారు. వీటిలో 167 పనులు కొనసాగుతుండగా.. 150 పూర్తయ్యాయి. పనులు సరిగా జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గజ్వేల్‌లో నీటిగుంతను తవ్వుతున్న దృశ్యం ఫాంపాండ్స్ నిర్మాణమిలా.. రైతుల భూముల్లో తవ్వాల్సిన ఫాంపాండ్స్ ఇలా ఉన్నాయి. 2/2 సైజు సుమారు రూ.6 వేలతో చేపడుతుండగా.. 6/6 సైజు రూ.18,079, 8/8 సైజు రూ.80,795, 20/20 సైజుకు రూ.2.55 లక్షలు వెచ్చి స్తున్నారు. పొడవు, వెడల్పు, లోతు ఆధారంగా చెల్లింపులు ఉంటాయి. అనాసక్తికి కారణాలివీ.. - ఎండాకాలం కావడంతో లోతుగా తవ్వాల్సిన నీటి గుంతల పనులకు ఉపాధి హామీ కూలీలు ముందుకు రావడం లేదు. - అలాగే చిన్న కమతాలు ఉన్న రైతులు నీటి గుంతకే భూమి మొత్తం పోతే సాగుకు ఏం మిగులుతుందంటూ ఆసక్తి చూపడం లేదు. - రైతులకు అవగాహన కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా మరో కారణం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దాశిరెడ్డిగూడేనికి చెందిన రైతు గోదుమగడ్డ మల్లారెడ్డి ఈయన. తనకున్న 9 ఎకరాల భూమిలో మూడెకరాల్లో మొక్కజొన్న, ఆరు ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నాడు. గతంలో సాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడేవాడు. ప్రభుత్వం నుంచి గతేడాది ఫాంపాండ్ మంజూరైంది. వ్యవసాయ క్షేత్రంలో 25 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు, 6 అడుగుల లోతు కలిగిన ఫాంపాండ్‌ను నిర్మించారు. అప్పటి నుంచి నీటి సమస్య తీరింది. వేసవిలో రాత్రి వేళ పాండ్‌లో నీటిని నింపుతాడు. చేనుకు ఉదయాన్నే మోటార్ ద్వారా నీళ్లు అందిస్తున్నాడు. అవగాహన కల్పించాలి సరైన అవగాహన లేక నీటిగుంతలు నిర్మించుకునేందుకు రైతులు ముందుకు రావడం లేదు. నాకున్న ఆరు ఎకరాల్లో మామిడి తోట ఇతర పంటలను సాగు చేశాను. ఉపాధి హామీ ద్వారా నీటిగుంత నిర్మించుకుంటున్నాను. దీంతో భూగర్భ జలాలు పెంపొందించుకునేందుకు చాలా ఉపయోగపడుతుంది. అధికారులు రైతులకు అవగాహన కల్పించాలి. – మద్ద మధు, లంబడిపల్లి, చెన్నూరు మండలం, ఆదిలాబాద్ -
కరువును తరిమిన పల్లె!
సాక్షి, హైదరాబాద్: పళ్లు తోముకునేందుకు ఓ మగ్గు నీళ్లు.. కాళ్లు, చేతులు కడుక్కునేందుకు మరో రెండు మగ్గులు.. స్నానానికి ఓ బకెట్.. మరుగుదొడ్డికి మరో బకెట్ నీళ్లు.. తాగటానికి 10 చెంబులు.. బట్టలు ఉతకటానికి 4 బకెట్లు.. కామారెడ్డి జిల్లాలోని గర్గుల్ గ్రామ ప్రజలు నిత్యం వాడుకునే నీళ్ల లెక్కలే ఇవి. ఈ ఊళ్లో లెక్కకు మించి ఒక్క చుక్క నీటిని కూడా వృథా చేయరు. వర్షపు నీటికి ఒడిసి పట్టుకోవటమే కాదు.. భూగర్భం నుంచి తోడిన జలాన్ని కూడా పొదుపుగా వాడుకుని కరువును జయించారు. నిండు వేసవిలోనూ నీటి కష్టం తెలియకుండా జీవిస్తున్నారు. వాడిన ప్రతి నీటి బిందువు వృథా కాకుండా ఇంకుడు గుంతలోకి జారే ఏర్పాటు చేసుకున్నారు. దీంతో భూగర్భ జల మట్టం పెరుగుతోంది. గృహ అవసర జలాల వృథాను అరికట్టడంతో విజయం సాధించిన వీరు.. ఇప్పుడు పొలాల వద్ద కూడా సాగునీటి వృథాను నిలువరించటంపై దృష్టి పెట్టారు. 2,250 మంది జనాభా 2,250 మంది జనాభా ఉన్న గర్గుల్.. ఒకప్పుడు అన్ని గ్రామాల్లాగానే వేసవిలో నీళ్ల కోసం ఇబ్బంది పడేది. సమస్యను పరిష్కరించేందుకోసం.. భూగర్భ జలాలను వేగంగా తోడేసే బోరు బావుల తవ్వకాన్ని గ్రామంలో నిషేధించారు. ఈ నిర్ణయంతో రెండు పరిష్కారాలు దొరికాయి. నీళ్ల కోసం బోర్ల మీద బోర్లు వేసి అప్పుల పాలై, ఆత్మహత్య చేసుకునే ముప్పు నుంచి రైతులు బయటపడ్డారు. నీటిని ఇబ్బడిముబ్బడిగా తోడేసే పరిస్థితి అదుపులోకి వచ్చింది. చేదబావి నీళ్లతోనే.. తొలుత గ్రామ సర్పంచు మొగుల్ల శ్యామల.. మహిళలను సంఘటితం చేశారు. నీటిని పొదుపుగా వాడుకునే మార్గాలను అన్వేషించి, అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. తాగునీరు, స్నానం తదితర అవసరాలకు మాత్రమే బోరు నీరు, మిగిలిన అన్ని అవసరాలకు చేదబావి నీళ్లు వాడుకోవాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో 85 చేద బావులు ఉన్నాయి. ఉదయం ఒక గంట మాత్రమే నల్లా నీళ్లు వస్తాయి. ఇక మిగిలిన నీటి అవసరాలు అన్నీ కూడా చేద బావులే తీరుస్తాయి. ఇంకుడు గుంతలతో.. గ్రామంలో 640 కుటుంబాలు ఉండగా.. ఉపాధి హామీ పథకం కింద 595 ఇళ్లలో ఇంకుడు గుంతలు నిర్మించుకున్నారు. ఇంటి అవసరాలకు వాడిన నీరు కాలువ ద్వారా గుంతలోకి వెళ్లేటట్లు చేశారు. దీంతో భూగర్భ జలాలు వృద్ధి చెందుతున్నాయి. గ్రామంలోని 85 చేద బావుల్లో మూడు గజాల లోతులోనే నీళ్లు అందుతున్నాయి. ఇది మహిళల విజయం మాకు నీళ్ల విలువ తెలుసు. నీటి సంరక్షణ కోసం కలసి పని చేద్దామని గ్రామస్తులను అడిగినప్పుడు అందరూ సహకరించారు. ఇప్పడు నీళ్లకు ఇబ్బంది లేదు. అనవసరంగా నీళ్లను తోడేసి వాడుకునే పద్ధతికి స్వస్తి పలికాం. అందరి కృషితోనే ఈ పని సాధ్యమైంది. ఇది మహిళల విజయం. – మొగుల్ల శ్యామల, సర్పంచ్, గర్గుల్ -
'బోరు'మంటున్నాయి
సరైన వానలు లేక యేటేటా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో బోర్లు, బావులు, చెరువులు ఎండిపోతున్నాయి. వేసవికాలం వచ్చిందంటే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. కొన్ని గ్రామాల్లో తాగేందుకు గుక్కెడు మంచి నీరు కూడా దొరకని పరిస్థితి. కనీసం చేతిపంపు నీటితోనైనా గొంతు తడుపుకుందామనుకుంటే అవి మొరాయిస్తున్నాయి. యేటా వీటి మరమ్మతులకు నిధులు మంజూరువుతున్నాయి. వాటిని అధికారులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో ఏమో తెలియదు కానీ స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి. ఆళ్లగడ్డ: చేతిపంపుల మరమ్మతుల పేరుతో అధికారులు ధన దాహం తీర్చుకుంటున్నారు. కొంత మంది నాయకులు వీరికి సహకరిస్తున్నారు. జిల్లాలో 54 మండలాల్లో 821 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కర్నూలు కార్పొరేషన్‌తో పాటు ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, డోన్, ఆత్మకూరు, మున్సిపాలిటీలు, ఆళ్లగడ్డ, గూడూరు, కోడుమూరు, నందికొట్కూరు నగర పంచాయతీలున్నాయి. వీటన్నింటిలో మొత్తం 25,542 చేతిపంపులున్నాయి. వీటితో పాటు మోటార్ల ద్వార నీరందించే బోర్లు మరో 1000 దాకా ఉన్నాయి. వాస్తవంగా ప్రతి 250 బోర్లకు ఒక మెకానిక్ ఉండాలి. 500 బోర్లకు కూడా ఒక మెకానిక్ లేడు. 54 మండలాలలకు కలిపి 14 మందే ఉన్నారు. దీంతో చేతిపంపుల నీటిపైనే ఆధారపడే ఆళ్లగడ్డ, కోవెంలకుంట్ల, నంద్యాల వంటి ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ మరమ్మతులకు గురైన చేతిపంపులు బాగు చేయాలంటే సంవత్సరాలు పడుతోంది. మోకానిక్‌ల కొరత ఒక కారణమైతే వచ్చిన నిధులు కొందరు అధికారులు, అధికారపార్టీ నాయకులు మధ్యలోనే స్వాహా చేయడం మరో కారణంగా కనిపిస్తోంది. నిధులు కరిగిపోయినా.. మెరుగవ్వని బోర్లు జిల్లాలో మొత్తం 25 వేల దాక బోర్లుండగా వీటిలో చాలా బోర్లు చిన్నచిన్న మరమ్మతులతో నిరుపయోగంగా మారాయి . అయితే వీటిని ఉపయోగం లోకి తీసుకొచ్చి వేసవిలో నీటి ఎద్దడిని తీర్చాలనే లక్ష్యంతో ఒక్కో బోరుకు ఏడాదికి రూ. 2 వేల ( ఆరు నెలల కోసారి 1000) చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఈ సీజన్‌కు సంబంధించి ఒక్కో బోరుకు రూ. 1000 చొప్పున జనవరి నెలలోనే ఎంపీడీఓల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. జిల్లా మొత్తానికి రూ. 2.5 కోట్లు నిధులు విడుదలైనట్లు సమాచారం. వీటితో అదనపు పైపులు, బోరు మరమ్మతులు, మెకానిక్ (కాంట్రాక్ట్)ల కూలీ ఖర్చులకు వెచ్చించాలి. కానీ చాలా చోట్ల బోర్ల మరమ్మతులు చేయకుండానే చేసినట్లు చూపి బిల్లులు మింగేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొంత అవసరాలకు సామగ్రి జిల్లాలోని అనేక మంది అధికార పార్టీకి చెందిన సర్పంచులు చేతిపంపులకు అదనపు పైపులు అవసరమని తీసుకెళ్తున్నారు. తర్వాత వాటిని వేయకుండా తమ సొంతానికి వాడుకుంటున్నారు. కొందరు పశువుల పాకలకు, రేకుల షెడ్డుకు ఉపయోగించుకుంటున్నారు. ఈవిషయం అధికారులు తెలిసినా చూడనట్టు వ్యవహరిస్తుండటం గమనార్హం. -
పడిపోతున్న భూగర్భ జలాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూగర్భజల మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది 9 శాతం లోటు వర్షపాతంతో మట్టాలు తగ్గిపోగా ప్రస్తుతం యాసంగి పంటల సాగు పెరగడంతో పాటుగా వేసవి ఉధృతి తోడు కావడంతో భూగర్భ జలాలు మరింత వేగంగా అడుగంటిపోతున్నాయి. ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో నీటి వినియోగం పెరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా సగటున 0.94 మీటర్ల మేర భూగర్భ మట్టం కిందకి దిగజారింది. పూర్తి స్థాయిలో పంటలకు నీటి వినియోగం పెరిగితే అది మరింత తీవ్రంగా ఉంటుందని భూగర్భ జల విభాగం హెచ్చరించింది. రాష్ట్రంలో 70 శాతం ప్రజలు 23 లక్షల బోర్ల ద్వారా భూగర్భ నీటిని వినియోగిస్తున్నారు. డిసెంబర్ నాటికే పడిపోయిన మట్టాలు ఈ ఏడాది మెదక్, అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో 35 నుంచి 21 శాతం వరకు తక్కువ వర్షపాతం కురిసింది. దీంతో చాలా జిల్లాల్లో డిసెంబర్ నాటికే 0.5 మీటర్ల నుంచి 5.07 మీటర్ల వరకు నీటి మట్టాలు పడిపోయాయి. గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర సగటు భూగర్భమట్టం 10.17 మీటర్లు ఉండగా, ఈ ఏడాది సగటు మట్టం 10.97 మీటర్లుగా ఉంది. అంటే గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది 0.80 మీటర్ల మేర మట్టాలు పడిపోయాయి. ఇక గత ఏడాది డిసెంబర్లో సగటు మట్టాలు 9.18 మీటర్లు ఉండగా, ప్రస్తుతం ఉన్న మట్టం 10.17తో పోలిస్తే ఏకంగా 0.99 మీటర్లు మేర మట్టాలు తగ్గిపోయాయి. భూగర్భ జల వనరుల శాఖ తాజా నివేదిక ప్రకారం గత ఏడాది ఫిబ్రవరి మట్టాలతో పోలిస్తే అత్యధికంగా సిరిసిల్ల జిల్లాలో 4.09 మీటర్లు దిగువకు పడిపోగా, తర్వాతి స్థానాల్లో పెద్దపల్లి 3.85, నిజామాబాద్ 3.61, మెదక్ 3.61, నిర్మల్ 3.40 మీటర్లు మేర మట్టాలు పడిపోయాయి. -
అడుగంటిన ఆశలు
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో వేసవికి ముందే నీటి కష్టాలు మొదలయ్యాయి. మార్చి తొలివారంలోనే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి.. బోర్లు, బావులు ఎండిపోయాయి. నీటి కష్టాలపై ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ ఆందోళనకర పరిస్థితులు వెల్లడయ్యాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురం భీం, ఖమ్మం జిల్లాల్లోని గిరిజన తండాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. జనం కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బావుల నుంచి, వాగులు, ఒర్రెల్లో చెలిమెలు తవ్వి నీళ్లు తెచ్చుకుంటున్నారు. వేసవి మొదలవుతున్నా ప్రభుత్వం ‘వాటర్ యాక్షన్ ప్లాన్’ను సిద్ధం చేయకపోవడం, ఆర్డబ్ల్యూఎస్ పథకాలు మరమ్మతులతో మూలన పడడంతో మిగతా జిల్లాల్లోనూ తాగునీటి కటకట మొదలైంది. తాగునీటి కోసం çపలు గ్రామా ల్లో ప్రజలు ఆందోళనలకు కూడా దిగుతున్నారు. కొనుక్కుంటేనే నీళ్లు రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల నీటి కష్టాలు మొదలయ్యాయి. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. జనం తాగడానికే కాదు, ఇతర అవసరాలకూ నీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. నిర్మల్ జిల్లాలో గత మేలో 11.25 మీటర్ల లోతులో భూగర్భ జలాలుండగా.. ఈసారి ఫిబ్రవరిలోనే 11.85 మీటర్ల లోతుకు పడిపోయాయి. కుమురం భీం జిల్లాలో డిసెంబర్లో సగటున 7.95 మీటర్ల లోతున ఉన్న నీటిమట్టాలు.. జనవరిలోనే 8.35 మీటర్లకు తగ్గిపోయాయి. మంచిర్యాల జిల్లాలో 6,234 బోర్లు ఉండగా.. అందులో ఇప్పటికే 713 పనిచేయడం లేదు. వేమనపల్లి, నెన్నెల, కోటపల్లి, కన్నెపల్లి మండలాల్లో నీటి సమస్య ఏర్పడింది. పాతాళానికి నీటి మట్టాలు కామారెడ్డి జిల్లాలో జనవరిలో 12.14 మీటర్ల లోతులో ఉన్న భూగర్భజలాలు ఫిబ్రవరి నాటికి 13.89 మీటర్ల లోతుకు.. అంటే ఒక్క నెలలోనే 1.75 మీటర్ల లోతుకు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో 38.21 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం గిరిజన తండాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోనూ భూగర్భజలాలు భారీగా తగ్గిపోయాయి. జిల్లాలో ఏడు పథకాల మరమ్మతులకు ఈ ఏడాది రూ.1.72 కోట్లు కేటాయించినా పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేకపోయారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని తండాల్లో జనం నీటి కోసం అవస్థలు పడుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని రాజాపూర్, కురుమూర్తి, జడ్చర్లలలో భూగర్భజలాలు ప్రమాదకర స్థాయిలో 31.80 మీటర్లకు పడిపోయాయి. గతేడాది నీటి ఎద్దడి నెలకొనగా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేశారు. కానీ చాలామంది ట్యాంకర్ల యజమానులకు ఇంకా బిల్లులు చెల్లించకపోవడంతో.. ఈసారి వారు ముందుకొచ్చే పరిస్థితి లేదు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో 35.73 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది. 80 శాతం బోర్లు వట్టిపోవడంతో కేఎల్ఐ కాల్వ సమీపంలోని ప్రైవేటు బోర్ల నుంచి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని ఆత్మకూరు(ఎస్), తిప్పర్తి, మోటకొండూరు, బొమ్మలరామారం, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో నీటి సమస్య తలెత్తింది. అడుగంటిన బోర్లు.. జనగామ జిల్లా వడ్లకొండలో ఆరు వేల జనాభాకు 24 బోర్లు ఉన్నాయి. అందులో ఆరు బోర్ల నుంచి నేరుగా, మరో 4 బోర్ల నుంచి ఓవర్ హెడ్ ట్యాంకుకు, మిగతా 14 సింగిల్ ఫేస్ బోర్ల ద్వారా అధికారులు నీటి సరఫరా చేస్తున్నారు. కానీ భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లలో నీళ్లు తగ్గిపోయాయి. దీంతో గ్రామస్తులు వ్యవసాయ బోర్లు, బావుల వద్ద నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. రోజు సంపాదన రూ.150.. నీళ్ల ఖర్చు రూ.40 ఈమె పేరు మధునమ్మ. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఎన్టీఆర్ కాలనీ. నలుగురున్న కుటుంబాన్ని పోషించుకోవాల్సిన బాధ్యత ఆమెదే. రోజు కూలీకి వెళితే రూ.150 వస్తాయి. కానీ అందులో రోజుకు రూ.40 కేవలం నీటి కోసమే ఖర్చవుతున్నాయి. కాలనీలోని బోరు ఎండిపోవడంతో ప్రైవేట్ ట్యాంకర్ల వద్ద నీళ్లు కొనుక్కోక తప్పడం లేదు. ఇంట్లో డ్రమ్ము నీళ్లు సరిపోవని, మరో డ్రమ్ము నీళ్లు కొందామంటే తిండికి తిప్పలవుతుందని ఆమె వాపోయింది. చందాలతో బావి తవ్వుకున్నారు కుమురం భీం జిల్లా జైనూర్ మండలం శివనూర్‌లో ఏటా వేసవి ప్రారంభంలోనే నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చుతోంది. అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకుంటున్నా ఫలితం లేదు. దాంతో ఇటీవల గ్రామస్తులంతా కలసి చందాలు వేసుకుని బావిని తవ్వించుకున్నారు. ఇంతా చేసీ ఆ బావిలో నీళ్లు పడలేదు. సమీపంలోని వాగుల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. మూడు నెలల కిందే వట్టిపోయిన బోర్లు ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం భూతాయి(కే) గ్రామ పంచాయతీ పరిధిలోని గిరిజాయిలో 102 కుటుంబాలకు చెందిన 800 మంది జనాభా ఉన్నారు. కానీ ఉన్నది రెండు చేతి పంపులు మాత్రమే. భూగర్భ జలాలు అడుగంటడంతో మూడు నెలల నుంచి చేతి పంపుల్లో నీరు రావడం లేదు. ఈ గ్రామంలో ప్రతి ఇంటి ముందు ఎడ్లబండి, దానిపై నీళ్ల డ్రమ్ము కనిపిస్తాయి. రెండు కిలోమీటర్ల దూరంలోని ఓ వ్యవసాయ బావి నుంచి ఎడ్ల బండ్లపై నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఒర్రె నీరే దిక్కు కుమురం భీం జిల్లా వాంకిడి మండలం సాలేగూడలో 25 కుటుంబాలకు ఒకే చేతిపంపు ఉంది. అదీ మరమ్మతులతో మూలనపడింది. గ్రామస్తులు చేసేదేమీ లేక సమీపంలోని ఒర్రె నీరు తెచ్చుకుంటున్నారు. ఎండలు ముదిరితే ఆ నీరూ దొరకదని.. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. నీటి కోసం తండా తండ్లాట మెదక్ జిల్లా చిల్‌పచెడ్ మండలం పానాది తండాలో వేసవికి ముందే నీటి ఇక్కట్లు మొదలయ్యాయి. నీటి కోసం కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాల్సి వస్తోంది. 300 మంది వరకు జనాభా ఉన్నా ఎలాంటి నీటి పథకాలు లేవు. అధికారులు తమ కష్టాలను పట్టించుకోవడం లేదని తండాకు చెందిన నిర్మల వాపోయారు. ఏటా వ్యవసాయ బావుల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నామని తెలిపారు. -
‘వాల్టా’తో బోరు బావులకు చెక్ !
భూగర్భ జలాలు బాగా అడుగంటిన గ్రామాల్లో వాల్టా చట్టం అమలుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల పరిధిలోని 1,227 గ్రామ పంచాయతీల్లో వాల్టా చట్టం – 2002 అమలులో ఉంటుందంటూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి జనవరి 25న ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో భాగంగా గుంటూరు జిల్లాలోని 18 గ్రామాలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం ప్రకటించిన గ్రామాల్లో కొత్తగా వ్యక్తిగత బోర్లు, బావుల తవ్వకాలపై ఆంక్షలు వర్తిస్తాయి. ఇప్పటికే ఉన్న బోర్లు, బావుల నుంచి నీటి తోడకంపైనా ఆంక్షలు ఉంటాయి. వాల్టా చట్టంలోని ఛాప్టర్ – 3 సెక్షన్ 8 (2) ప్రకారం బోర్లు, బావుల నుంచి నీటి తోడకానికి ఉపయోగించే మోటార్లకు విద్యుత్ వినియోగంపైన ఆంక్షలు వర్తిస్తాయి. ఈ చట్టం అమలయ్యే గ్రామాల పరిధిలోని ఇసుక తవ్వకాలపైన కూడా నిషేధం ఉంటుంది. సామూహిక తాగునీటి అవసరాలకు భూగర్భ జల వనరుల శాఖ అధికారుల అనుమతితో మాత్రమే తవ్వకాలకు అవకాశం ఉంటుంది. చిలకలూరిపేట : వాల్లా చట్టం అమలులో ఉన్న గ్రామాల్లో భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఆయా గ్రామాల్లో వాల్టా (వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్) చట్టం అమలులో ఉంటుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు వర్షాలు కురవని సందర్భాలలో భూగర్భ జలాలు అడుగంటిపోయి కరువుకాటకాలు ఏర్పడుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో రోజువారీ అవసరాల కోసం మనుషులతో పాటు పశువులకు తాగేందుకు సరిపడ నీరు దొరకని పరిస్థితులు ఉంటాయి. చెరువులు, వాగులు ఎండిపోవటంతో ప్రత్యామ్నాయం లేని పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి ప్రమాదాన్ని అంచనా వేసి ముందస్తు చర్యల్లో భాగంగా వాల్టా చట్టాన్ని ఆయా గ్రామాలలో అమలు చేస్తుంటారు. అమలుకాని మార్గదర్శకాలు.. ఆయా గ్రామాల పరిధిలో భూగర్భ జలాలు అట్టడుగు స్థాయికి చేరాయని, భవిష్యత్‌లో నీటి కష్టాలు తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని భూగర్భ జల వనరుల శాఖ అంచనా వేసింది. ఉదాహరణకు వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో గత ఏడాది ఫిబ్రవరిలో 16.728 మీటర్ల అడుగున ఉన్న నీటి నిల్వలు ఈ ఏడాది ఫిబ్రవరిలో 22.435 మీటర్లకు దిగజారాయి. మాచర్లలో 19.327 మీటర్ల అడుగున ఉన్న జలాలు ఈ ఏడాది 31.202 మీటర్ల అడుగుకు పడిపోయాయి. భూగర్భ జలాల వినియోగంపై సుప్రీం కోర్టు గతంలో కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం బోరు వేయటానికి 15 రోజుల ముందు సంబంధిత యజమాని భూగర్భ జల వనరుల అధికారులకు సమాచారం అందజేయాలి. వారి అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేటు బోర్వెల్ తవ్వకం యంత్రాలు కలిగి ఉన్న నిర్వాహకులు విధిగా తమ పేర్లను సంబంధిత అధికారుల వద్ద నమోదు చేసుకోవాలి. గ్రామాలవారీగా బోర్ల వివరాలు పంచాయతీలు సేకరించాలి. అయితే వీటిలో ఏ ఒక్కటి అమలుకు నోచుకోకపోవటంతో అవస్థలు తప్పటం లేదు. జిల్లాలో సుమారు 50 వేల పైచిలుకు బోర్లు ఉన్నాయి. వర్షాభావంతో రైతులు భూగర్భ జలాల పైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో భూగర్భ జలాల లభ్యత అడుగంటుతోంది. పట్టణ ప్రాంతాలలో అపార్ట్మెంట్లకు సైతం విచ్చలవిడిగా బోర్లు వేసి భూగర్భ జలాలను తోడేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా ప్రైవేటు వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి యథేచ్ఛగా భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు. విచ్చలవిడిగా వివిధ అవసరాలకు బోర్లు వేయకుండా ప్రజలను చైతన్యం చేయటం ద్వారానే భూగర్భ జలాలు పడిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ శాఖలపై ఉంది. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వాగుల నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు అధికం అయ్యాయని తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ చట్టం ప్రకారం ఇసుక తవ్వకాలు నిలిపివేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో 18 గ్రామాలలో మాత్రమే భూగర్భ జలాలను దృష్టిలో ఉంచుకొని వాల్టా చట్టం అమలుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ తీరు మారని పక్షంలో జిల్లాలోని మరెన్నో గ్రామాలకు భూగర్భ జలాల లభ్యత లేకుండాపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి చేతులు దులుపుకుంటుందా... వాగులు వట్టిపోకుండా ఇసుక రవాణా నియంత్రించి భూగర్భ జలాల పెంపునకు సహకరిస్తుందా అనేది వేచి చూడాలి. తవ్వకాలు చేయరాదు.. సంబంధిత 18 గ్రామాల్లో కొత్తగా బోర్లు, బావుల కోసం ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదు. ఇసుక తవ్వకాలు చేయరాదు. సామూహిక తాగునీటి అవసరాల కోసం అనుమతితో మాత్రమే కొత్త బోర్లు వేయాల్సి ఉంటుంది. – ఎం. రామ్‌ప్రసాద్, డీడీ, భూగర్భ జల వనరుల శాఖ -
తోడేస్తున్నారు..!
నల్లగొండ : నిరంతర విద్యుత్ సరఫరా రైతాంగాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. గతంలో రెండు విడతలుగా వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేసిన రోజులతో పోలిస్తే నిరంతర విద్యుత్ సరఫరా ఒడిదుడుకులు ఎదుర్కొటోంది. కోతలు లేకుండా విద్యుత్ సరఫరా వివిధ కేటగిరీలకు చెందిన వర్గాలకు మేలు జరుగుతోంది కానీ, వ్యవసాయరంగాన్ని మాత్రం ఇరకాటంలోకి నెట్టేస్తోంది. నిరంతర విద్యుత్ తాకిడికి వ్యవసాయ మోటార్లు బోరున మొత్తుకుంటున్నాయి. ఆటోమేటిక్ స్టార్టర్లు తొలగించకుండా నీటి వాడకాన్ని బట్టి పంపుసెట్లు ఆన్‌చేసేందుకు రైతులు సిద్ధపడుతున్నారు. కానీ ఒకే సమయంలో పంపుసెట్లన్నీ పనిచేస్తుండటంతో ఆ ప్రభావం భూగర్భ జలాలపైన పడుతోంది. గతంలో రెండు విడతలుగా విద్యుత్ సరఫరా చేసిన రోజుల్లో వ్యవసాయ ఫీడర్లను రెండు గ్రూపులుగా విభజించి, పగలు, రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా చే శారు. ప్రస్తుతం నిరంతర విద్యుత్ అమల్లోకి వచ్చిన తర్వాత రైతులు పగటిపూటనే ఎక్కువ వినియోగిస్తున్నారు. దీంతో రాత్రి వేళల్లో వ్యవసాయానికి విద్యుత్ డిమాండ్ అంతగా ఉండటం లేదు. నిరంతర్ విద్యుత్ అమల్లోకి వచ్చిన 12 రోజుల్లో విద్యుత్ డిమాండ్ ఓసారి పరిశీలిస్తే....ఈ నెలలో జిల్లాకు కేటాయించిన విద్యుత్ కోటా 18.30 మిలియన్ యూనిట్లు కాగా...వినియోగం రోజుకో రకంగా ఉంటోంది. ఈ నెల ఒకటో తేదీన 26.911 మిలియన్ యూనిట్లు, 4 తేదీన 26.33 ఎం.యూ, 7వతేదీన 25. 02 ఎం.యూ, 12న 24.55 మిలియన్ యూనిట్లు విద్యుత్ వాడకం జరిగింది. కోటాకు మి ంచి సగటున 6.25 ఎం.యూ పెరిగింది. ఉదయం 8 గంటల నుంచే... నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నప్పటి నుంచి పగటి పూటనే విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 11, 12 గంటల వరకు విద్యుత్ వినియోగం భారీగా ఉంటోంది. ఉదాహరణకు ఈ నెల 12న ఉదయం 8 గంటలకు 1068 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తే రాత్రి 11 గంటల సమయంలో 808 మెగావాట్లకు తగ్గిపోయింది. కోతల్లేని విద్యుత్ కారణంగా వ్యవసాయంతో పాటు, పరిశ్రమలకు కూడా మేలు జరుగుతోంది. పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ వాడకం రికార్డు స్థాయికి చేరింది. నల్లగొం డ, హుజూర్నగర్, భువనగిరి ప్రాంతాల్లో పారిశ్రామిక సంస్థలు అత్యధికంగా ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతాల్లో విద్యుత్ కోటాకు మించి వినియోగం పెరిగింది. నల్లగొండ డివిజన్‌కు కేటాయించిన కోటా 3.04 మిలియన్ యూనిట్లు కాగా, వాడకం 4.30 ఎం.యూ. అదేవిధంగా హుజూర్ నగర్ డివిజన్‌కు కేటాయించిన కోటా 4.56 ఎం.యూ కాగా వాడకం 5.12 ఎం.యూ, భువనగిరి డివిజన్ కోటా 3.18 ఎం.యూకు గాను రూ.4.63 ఎం.యూకు చేరింది. అడుగంటిన జలం... జిల్లాలో సాధారణంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు తోడు, నిరంతర విద్యుత్ సరఫరా కారణంగా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 3,85,105 ఉన్నాయి. వీటిల్లో 3,61,165 కనెక్షన్లకు ఆటోస్టార్టర్లు ఉంచారు. స్టార్టర్లు లేని కనెక్షన్లు 23,940 ఉన్నాయి. విద్యుత్ డిమాండ్ పగటి పూటనే ఎక్కువగా ఉన్నందున భూగర్భ జలాలు క్రమేపీ తగ్గుతూ వస్తోన్నాయి. భూగర్భ జల వనరుల శాఖ నివేదిక ప్రకారం నల్లగొండ జిల్లాలో నవంబర్‌లో భూగర్భ జల మట్టాలు 8.64 అడుగుల లోతులో ఉండగా డిసెంబర్లో 9.17 అడుగులకు పడిపోయాయి. అంటే నీటిమట్టం 0.53 అడుగులకు తగ్గింది. సూర్యాపేట జిల్లాలో నవంబర్‌లో 8.11 అడుగులు ఉండగా డిసెంబర్లో 8.82 అడుగులకు పడిపోయాయి. 0.71 అడుగులకు నీటి మట్టాలు తగ్గాయి. యాదాద్రి జిల్లాలో నవంబర్‌లో 9.58 అడుగులకు నీటి మట్టాలు ఉండగా, డిసెంబర్లో 10.13 అడుగులకు పడి పోయాయి. 0.55 అడుగుల లోతుకు నీటి మట్టాలు తగ్గాయి. అవసరం మేరకు విద్యుత్ వాడుకోవాలి నిరంతర విద్యుత్ వద్దని, పాత పద్ధతిలోనే విద్యుత్ ఇవ్వాలని రైతుల నుంచి వినతులు వస్తున్నాయి. బోరుబావులు, ఆయకట్టు రైతుల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. రైతులు అవసరం మేరకు విద్యుత్ వాడుకోవాలి. నిరంతరం విద్యుత్ వద్దని చెప్పకుండా ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాత్రమే మోటార్లు నడుపుకోవాలని సూచిస్తున్నాం. రైతులు స్వచ్ఛందంగా ఆటోమేటిక్ స్టార్టర్లు తొలగించుకోవాలని కోరుతున్నాం. ప్రస్తుతం వ్యవసాయ పనులు సీజన్ కావడంతో విద్యుత్ వినియోగం పెరిగింది. ఈ నెల మొదటి వారంలో ఉన్నంత డిమాండ్ ఆ తర్వాత తగ్గుతూ వస్తోంది. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరా యాలు లేవు. కృష్ణయ్య, ఎస్ఈ -
బోర్ల వినియోగం రాష్ట్రంలోనే అధికం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగంలో భూగర్భ జలాలను తెలంగాణ లోనే అధికంగా వినియోగిస్తున్నారని కేంద్ర జల వనరుల శాఖ వెల్లడించింది. భూగర్భ జలాల వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, ఆ నీటిని తీసుకునేందుకు అధిక సంఖ్యలో బోర్లను వేస్తోందని తెలిపింది. రాష్ట్రంలో ఒక్కో బోరు ఏర్పాటు చేసేందుకు సగటున రూ.41,960 మేర ఖర్చు చేస్తున్నారని, ఏటా వాటి నిర్వహణకు రూ.4,193 ఖర్చు పెడుతున్నారని వెల్లడించింది. తమిళనాడు, రాజస్తాన్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలతో పోలిస్తే ఇది తక్కువేనని తెలిపింది. దేశవ్యాప్తంగా చిన్న నీటి వనరుల ద్వారా నీటి వినియోగంపై కేంద్ర జల వనరుల శాఖ అధ్యయనం చేసింది. గతంతో పోలిస్తే వ్యవసా యానికి భూగర్భజలాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారని తెలిపింది. 2013–14 నాటికి తెలంగాణలో ఉన్న 14.56 లక్షల బోరు మోటార్ల పరిధిలో అధ్యయనం చేయగా.. ఇందులో 13.55 లక్షల బోర్లే పనిచేస్తున్నాయంది. వీటి కింద ఖరీఫ్‌లో గరిష్టంగా 10.12 లక్షల హెక్టార్లు, రబీలో 7.17 లక్షల హెక్టార్ల భూమి సాగవుతోందని తెలిపింది. -
భూమికి ‘రీచార్జ్’
మానవ శరీరంలో నీటి శాతం పడిపోయి నీరసం వస్తే ఏం చేస్తాం.. పండ్ల రసాలు తాగుతాం, లేదా సెలైన్ బాటిల్ ఎక్కించుకుంటాం.. లేదంటే ఓ ఇంజెక్షన్ తీసుకుంటాం. అలా తిరిగి రీచార్జ్ అవుతాం. అదే భూగర్భంలో నీటి శాతాలు పడిపోతే ఏం చేయాలి.. ఏ విధంగా రీచార్జ్ చేయాలి.. అనే దానికి సమాధానమే ‘రీచార్జ్ షాఫ్ట్’. ఇంచుమించు మనిషికి ఇచ్చే ఇంజెక్షన్ మాదిరే ఈ విధానం కూడా. భూగర్భంలోకి బోర్వెల్ ద్వారా నీరు పంపించి రీచార్జ్ చేస్తారు. రాష్ట్రంలో పడిపోతున్న భూగర్భ జలాలు, కొన్ని జిల్లాల్లో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడికి ఇది పరిష్కారం చూపుతుందని భూగర్భ జల విభాగం ఆశిస్తోంది. రాష్ట్రంలో మొదట 65 గ్రామాల్లో అమలు చేయాలని ప్రణాళికలు వేస్తోంది. – సాక్షి, హైదరాబాద్ దిగుడు బావుల కంటే మేలు.. సాధారణంగా భూమి పొరల్లో మొదట మట్టి పొరలు, అనంతరం రాతి పొరలు ఉంటాయి. మట్టి పొరల్లో నీటి నిల్వ సామర్థ్యం అత్యంత ఎక్కువగా.. రాతి పొరల్లోని పగుళ్లలో నీటి లభ్యత తక్కువగా ఉంటుంది. రాతి పగుళ్లతో పోలిస్తే మట్టి పొరల్లో వంద నుంచి రెండు వందల రెట్లు అధికంగా నీటి లభ్యత ఉంటుంది. దిగుడు బావుల వల్ల మట్టి పొరల్లో ఉండే నీరంతా భూ ఉపరితలం వరకూ తేవచ్చు. వర్షం పడినప్పుడు ఎక్కువ నీటిని లభ్యతగా పెట్టుకోవాలంటే దిగుడు బావులతో సాధ్యమవుతుంది. అయితే దిగుడు బావులకు వీలైనంత ఎక్కువ డ్రైనేజీ పరివాహకం (క్యాచ్మెంట్) ఉండాలి. అదీగాక దిగుడు బావులు పూర్తిగా రీచార్జ్ అయ్యే ప్రాంతాల్లో కాకుండా ఎత్తైన (అప్ల్యాండ్) ప్రాంతాల్లో ఉంటాయి. అయితే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో బావులున్నా నీళ్లు లేవు. బావులతో రీచార్జ్ అయ్యే భూగర్భ శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే రీచార్జ్ షాఫ్ట్‌లను భూగర్భ జల విభాగం తెరపైకి తెచ్చింది. దీని ద్వారా నేరుగా 60 మీటర్ల వరకు బోర్‌వేసి నీటి తరలించడం ద్వారా 500 మీటర్ల వరకు భూగర్భ ప్రాంతాన్ని రీచార్జ్ చేయవచ్చు. మామూలు రీచార్జ్ విధానాలతో 10 నుంచి 11 శాతం ఫలితాలుంటే ఈ విధానం ద్వారా 15 శాతం వరకు భూగర్భం రీచార్జ్ అవుతుంది. ఈ విధానం అమలులో భాగంగా ఒక్కో రీచార్జ్ షాఫ్ట్‌కు గరిష్టంగా రూ.లక్ష వరకు ఖర్చు వస్తోంది. ఆ 1,358 గ్రామాలే టార్గెట్.. రాష్ట్రంలో భూగర్భ జలాలను ఇష్టానుసారంగా తోడేస్తున్నారు. రాష్ట్రంలో 15 లక్షల బోర్లు ఉన్నట్లు ఓ అంచనా. ఏటా వాటి సంఖ్య పెరుగుతోంది. భూగర్భ జలాలను 45 శాతానికి మించి వినియోగించకూడదు. కానీ ప్రస్తుత వినియోగం 58 శాతంగా ఉంది. ఈ మేరకు రాష్ట్రంలో 1,358 గ్రామాలు భూగర్భ జలాలను అధికంగా వినియోగిస్తున్నట్లు భూగర్భ జల శాఖ రికార్డుల్లో నమోదైంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామాల్లో బోర్లు వేయడాన్ని, బావులు తవ్వడాన్ని నిషేధించింది. దీంతో ఆ ప్రాంతాల్లో సాగు, తాగునీటికి కటకట ఏర్పడింది. వచ్చే వేసవికి మరింత క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. దీని దృష్ట్యా ఈ గ్రామాల్లో ఇప్పటికే చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టింది. చెక్‌డ్యామ్‌లు ఉన్న ప్రాంతాల్లోనే రీచార్జ్ షాఫ్ట్‌ల ద్వారా భూగర్భ మట్టాలు పెంచే యత్నాలకు దిగింది. సెప్టెంబర్ చివరి వారం నుంచి 65 గ్రామాల్లో 181 రీచార్జ్ షాఫ్ట్‌లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది. రెండో విడతలో 550 గ్రామాల్లో గ్రామానికి 2 షాఫ్ట్‌ల చొప్పున 1,110 షాఫ్ట్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రీచార్జ్ ఎలా చేస్తారంటే.. భూగర్భ జల వినియోగం ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ఇప్పటికే చాలా చోట్ల చెక్‌డ్యామ్‌ల నిర్మాణం జరిగింది. నిర్మాణం పూర్తయిన ప్రాంతాల్లో ఒక్కో చెక్‌డ్యామ్ పరిధిలో రెండు షాఫ్ట్‌లు ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఎంపిక చేసిన చెక్‌డ్యామ్ పరిధిలో 20 నుంచి 60 మీటర్ల లోతు వరకు బోర్వెల్ వేస్తారు. 180 మిల్లీమీటర్ డయా ఉన్న పీవీసీ పైపునకు పూర్తిగా జౌళి సంచి మాదిరి రంధ్రాలు చేసి ఉంటాయి. ఈ పీవీసీ పైపు ద్వారానే నీరు భూగర్భంలోకి చేరుతుంది. అయితే రీచార్జి చేయడానికి ఫిల్టర్ బెడ్ తరహా ఇంకుడు గుంతలు బోర్వెల్ చుట్టూ ఏర్పాటు చేయాలి. ఇంకుడు గుంతలో 1.50 మీటర్ల మట్టంతో 40 ఎంఎం కంకర నింపాలి. దానిపైన 0.75 మీటర్ మట్టంతో 200 ఎంఎం కంకర, దానిపైన 0.75 మీటర్ మట్టంలో ఇసుక నింపాలి. ఈ విధానం వల్ల భూమిలోకి చేరే నీరంతా ఫిల్టర్ అవుతుంది. ఈ మొత్తం విధానానికి రూ.60 వేల నుంచి రూ.లక్ష ఖర్చు అవుతుండగా, 500 మీటర్ల వరకు భూగర్భం రీచార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విధానం నల్లగొండ జిల్లాలోని చండూరులో విజయవంతమైంది. ఈ విధానం ద్వారా ఫ్లోరైడ్ శాతం కూడా చాలా తగ్గిందని పలు అధ్యయనాలు తేల్చినట్లు భూగర్భ జల వనరుల విభాగం డైరెక్టర్ లక్ష్మయ్య ‘సాక్షి’కి తెలిపారు. భూగర్భ అతి వినియోగం ఉన్న మొదటి పది జిల్లాలు, గ్రామాలు.. సిద్దిపేట 175 , రంగారెడ్డి 120 , జగిత్యాల 116 ,నల్లగొండ 97 ,సంగారెడ్డి 89 ,యాదాద్రి 86 ,భూపాలపల్లి 82 ,మహబూబ్‌నగర్ 77 ,కరీంనగర్ 62,సిరిసిల్ల 57 -
చింత తీర్చని చినుకు
► కరుణిస్తున్న వరుణుడు ► సాధారణ వర్షపాతానికి చేరువుగా గణాంకాలు ► వరుస కరువుతో చల్లారని భూతాపం ► ఇంకిపోతున్న జలాలు ► సాగుపై రైతన్న ఊగిసలాట కొద్దిరోజులుగా అడపాదడపా వరుణుడు కరుణిస్తున్నాడు. గతేడాది ఇదే సీజనుతో పోల్చితే ఇప్పుడు కురుస్తున్న వర్షాలు రైతులకు ఆశాజనకమే. కానీ క్షేత్రస్థాయి పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. వరుస కరువుతో నెర్రెలిచ్చిన నేలకు ఈ తడి సరిపోవడం లేదు. భూగర్భ జలాలు అందనంత లోతుకు పోయాయి. అందుకే నీరందడం లేదు. సాగు చేద్దామంటే రైతుకు ధైర్యం చాలడం లేదు. మరికొంత వర్షం పడితే తప్ప పరిస్థితిలో మార్పు రాదు. చిత్తూరు, సాక్షి: వరుసగా రెండేళ్ల కరువుతో భూగర్భజలాలు అథఃపాతాళానికి పడిపోయాయి. సాగునీరే కాదు తాగునీటికి కూడా ఇబ్బంది పడ్డారు ప్రజలు. వర్షాకాలం వచ్చి రెండు నెలలకు పైగా అవుతోంది. ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి. కానీ భూతాపం ఇంకా చల్లారలేదు. పడిన నీరు పడినట్లే ఇంకిపోతోంది. ఫలితంగా చెరువులు, కుంటలు నిండటం లేదు. బోర్లలో నీటి మట్టాలు పెరగడం లేదు. జిల్లాలోని చిన్నాచితక రిజర్వాయర్లన్నీ నిండుకున్నాయి. జిల్లాలోని తూర్పు మండలాల్లో అధికంగా సాగయ్యే వరిఈసారి సగం కూడా సాగవలేదు. కాకుంటే కొన్ని మండలాల్లో తాగునీటి కష్టాలు మాత్రతీరే అవకాశం ఉంది. మరో రెండు నెలలు వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే ఇప్పుడు వేసిన పంట, రబీపై ఆశలు పెట్టుకోవచ్చు. 25.36 మీటర్ల లోతులో నీటి మట్టాలు.. జూన్ మొదటి నుంచి ఇప్పటి వరకు సగం వర్షాకాలం ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఆగస్టు మొదటి వారం వరకు సాధారణ వర్షపాతం 117.4 మిల్లీమీ టర్లు కాగా 100.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురి సింది. 32 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గుడిపల్లి, చిత్తూరు, కార్వేటినగరం, పెనుమూరు, కేవీబీ పురం, పెదమండ్యం, ములకలచెరువు, తిరుపతి అర్బన్, రూరల్ మండలాల్లో సాధారణం కన్నా 20 శాతం అధికంగా వర్షం కురిసింది. జీడీ నెల్లూరు మండలంలో మాత్రమే సాధారణ వర్షపాతం కంటే 67 శాతం తక్కువ కురిసింది. గణాం కాలు చూస్తే సీజన్ అనుకూలంగానే ఉన్నాయి. కానీ భూగర్భజల వనరుల శాఖ జులై నెలాఖరుకు ఇచ్చిన తాజా నివేదిక పరిశీలిస్తే జిల్లాలో దుర్భర పరిస్థితులు వెంటాడుతూనే ఉన్నాయని చెప్పవచ్చు. జూన్ కంటే ముందు 25.36 మీటర్ల లోతులో ఉన్న భూగర్భజలం ఇప్పుడు 24.29 మీటర్లలో ఉంది. ఇది 60 శాతానికి తగ్గితే కానీ కష్టాలు తీరవు. గుడిపాల, నిమ్మనపల్లి, పాలసముద్రం, సోమల మండలాల్లో మంచి వర్షం కురిసింది. మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు నియోజకవర్గాల్లో భూగర్భజలాలు ఇంకా సరాసరి 50 మీటర్ల లోతులోనే ఉన్నాయి. గుడిపాల, నిమ్మనపల్లి, పాలసముద్రం మండలాల్లో 27 మీటర్ల నుంచి 22 మీటర్ల వరకు వచ్చింది. అయితే తాగునీటి సమస్య మాత్రం కొంతమేర తగ్గింది. సంక్షోభంలో వరిసాగు.. జిల్లాలోని తూర్పు మండలాల్లో వరి గణనీ యంగా సాగవుతుంది. జిల్లాలో వరి సాధారణ విస్తీర్ణం 17 వేల హెక్టార్లు. ఈ సంవత్సరం మాత్రం ఇప్పటి వరకు కేవలం ఆరు వేల హెక్టార్లలో మాత్రమే సాగయింది. తాజా వర్షాల వల్ల కొన్ని చోట్ల కుంటల్లో నీరు చేరింది. బోర్లు రీచార్జయ్యాయి. ఈ సీజన్‌కు వరకు కొంతమేర పంట సాగు చేసుకునేందుకు ఏ ఇబ్బందీ లేదు. అయినా రైతుల ముఖంలో మాత్రం ఆనందం కనిపించడం లేదు. జిల్లాలో పంటలు సాగయ్యే సాధారణ విస్తీర్ణం 2.11 లక్షల హెక్టార్లు. ఇప్పటి వరకు 1.50 లక్షల హెక్టార్ల మేరకు సాగయింది. 1.04 లక్షల హెక్టార్లు ఆరుతడి పంటలైన వేరుశనగ, ఇతరాలు సాగయ్యాయి. పంటల సాగు సగానికి తగ్గడానికి కారణం ప్రధానంగా భూగర్భజలాలు పాతాళానికి చేరుకోవడమే. -
పొంగుతోంది.. పాతాళగంగ!
- రాష్ట్రంలో భూగర్భ జలాల మట్టం (సగటు) 11.27మీటర్లు - గతేడాది కంటే ఎత్తుకు పెరిగిన నీటి మట్టం 3.76మీటర్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూగర్భ జలాల మట్టం గతేడాదితో పోల్చితే కాస్త మెరుగుపడింది. 2016లో ఇదే సమయంలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పాతాళగంగ మరింత కిందికి వెళ్లిపోయింది. తర్వాత ఆగస్టు నుంచి వర్షాలు ఆశాజనకంగా కురిసినా భూగర్భ జల మట్టాల్లో మార్పులు పెద్దగా కనిపించలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 584 మండలాల్లోని పరిస్థితిపై భూగర్భ జల శాఖ నివేదిక విడుదల చేసింది. ఇందులో 266 మండలాల్లో 10 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భ జలాలున్నాయి. 175 మండలాల్లో పదిహేను మీటర్ల లోతులో నీటిమట్టాలుండగా.. 83 మండలాల్లో ఇరవై మీటర్ల లోతులో ఉన్నాయి. 20 మీటర్ల కంటే ఎక్కువ లోతులో నీటి మట్టాలున్న మండలాలు 60 ఉన్నట్లు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది జూన్‌లో రాష్ట్రంలో సగటున 15.03 మీటర్ల లోతులో నీరు లభ్యమవగా... ప్రస్తుతం 11.27 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నాయి. అతి తక్కువ లోతులో జగిత్యాల జిల్లా (7.33 మీటర్లు), ఎక్కువ లోతులో సంగారెడ్డి (17.03 మీటర్లు) జిల్లాలో నీటి లభ్యత ఉంది. ప్రస్తుతం నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సగటు కంటే ఎక్కువ లోతులో నీరున్నట్లు అధికారులు చెబుతున్నారు. జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వరంగల్ ఆర్బన్, ఖమ్మం జిల్లాల్లో సగటున 8 మీటర్ల కంటే తక్కువ లోతులో భూగర్భ జలం లభ్యమవుతోంది.