గడువు ముగిసిన తర్వాత జిల్లాలో వీఆర్వో, వీఆర్‌ఏలు రెవెన్యూశాఖకు వచ్చేందుకు ఎంత మంది ఆప్షన్లు అందించారనే వివరాలను ప్రభుత్వం కలెక్టర్‌కు పంపించింది. రెవెన్యూ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. సొంత శాఖకు వచ్చేందుకు వీఆర్‌ఏలు అంతగా ఆసక్తి చూపనట్లుగా తెలుస్తోంది. 325 మంది వీఆర్‌ఏలు వివిధ శాఖల్లో సర్దుబాటు కాగా అందులో కేవలం 78 మంది మాత్రమే తిరిగి మాతృశాఖలో చేరేందుకు సుముఖంగా ఉన్నారు. మిషన్ భగీరథ, విద్యాశాఖ, సాగునీటి పారుదల శాఖల్లో సర్దుబాటు అయిన వీఆర్‌ఏలు తిరిగి రెవెన్యూకు వచ్చేందుకు విముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. రెవెన్యూ శాఖ కంటే తమ విద్యార్హతల ప్రకారం ఆయా శాఖల్లోనే త్వరితగతిన పదోన్నతులు లభించే అవకాశముండటంతో వారు తిరిగి రెవెన్యూకు వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపలేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే వీఆర్‌వోలు మాత్రం రెవెన్యూశాఖపైనే తమ మమకారాన్ని చాటుకున్నారు. వివిధ శాఖల్లో 110 మంది సర్దుబాటు కాగా అందులో ఇద్దరు మృతి చెందారు. మిగతా 108 మంది వివిధ శాఖల్లో పనిచేస్తుండగా వారంతా తిరిగి రెవెన్యూలో చేరేందుకే ఆసక్తి చూపించారు. ఆప్షన్లను అందజేసిన వారందరికి సంక్రాంతిలోపు నియామక ఉత్తర్వులు అందించే అవకాశముందనే ప్రచారం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment