హార్బర్‌లో బోట్ల ప్రమాద బాధితులకు మూడు రోజుల్లోపే పరిహారం
రూ.7.11 కోట్లు అందించి ఆదుకున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
కన్నీళ్ల స్థానంలో పెల్లుబికిన ఆనంద బాష్పాలు
సీఎం జగన్ సాయాన్ని మరవబోమంటున్న మత్స్యకారులు
వెలుగులు
సాక్షి, విశాఖపట్నం : పార్టీలను చూడలేదు.. పక్షపాతమూ చూపలేదు.. బాధితులను ఆదుకోవాలన్న దృఢ నిశ్చయం. అదే సంకల్పంతో ఫిషింగ్ హార్బర్ బోట్ల దగ్ధం ప్రమాద బాధితులకు గంటల వ్యవధిలోనే పరిహారాన్ని అందించారు. ఆ పరిహారం మొక్కుబడిగా కాదు.. వారు ఊహించనంత.. ఉక్కిరి బిక్కిరయ్యేటంత! దీంతో ఈ మత్స్యకారులంతా కష్టకాలంలో తక్షణమే తమను ఆదుకున్న దేవుడంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కొనియాడుతున్నారు. ఆయన చేసిన సాయాన్ని మరవబోమంటున్నారు. ఆయనకు ఎల్లప్పుడూ అండగా ఉంటామంటున్నారు.
అసలేం జరిగింది?
గత ఏడాది నవంబరు 19వ తేదీ అర్ధరాత్రి ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 49 బోట్లు ఆహుతయ్యాయి. వీటిలో 30 బోట్లు పూర్తిగా, 19 బోట్లు పాక్షికంగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో తమ పట్ల ప్రభుత్వం ఎలా స్పందిస్తుందోనని బాధిత మత్స్యకారులు ఎంతగానో కలత చెందారు. రూ.లక్షల విలువైన మరపడవలు కాలి పోవడంతో తమ భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళనకు గురయ్యారు. పిల్లా పాపలతో రోడ్డెక్కి రోదించారు. జరిగిన నష్టంలో ఎంతో కొంత పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటారేమోనని భయపడ్డారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ ప్రమాదాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూశారు. ఈ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో సాయం చేయదంటూ బాధితులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. కానీ బాధితుల భయాందోళనలకు ఫుల్‌స్టాప్ పెడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వెనువెంటనే స్పందించి అత్యంత ఉదారమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.
పరిహారం.. అనూహ్యం
వాస్తవానికి జరిగిన నష్టంలో 50 శాతానికి మించి ప్రభుత్వం పరిహారం ఇవ్వదని భావించారు. అయితే సీఎం జగన్ ఏకంగా 80 శాతం సొమ్ము చెల్లించే సరికి బాధిత మత్స్యకారుల ఆనందానికి అవధుల్లేవు. ప్రతిపక్ష నాయకుల నోట నుంచి మాటల్లేవు. అప్పటిదాకా కన్నీళ్లు ఉబికిన బాధితుల కళ్ల నుంచి ఆనందభాష్పాలు కురిశాయి. తాము ఊహించిన దానికంటే ఎక్కువ పరిహారం ఇచ్చారని కొనియాడుతున్నారు. ఇప్పుడు వీరంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమ పాలిట దేవుడని, జీవితాలు నిలిపిన ఆయనకు జీవితాంతం అండగా ఉంటామంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment