● ఎక్కడికక్కడే ఒంటరి పోరాటం ● నియోజకవర్గాల్లో పొసగని పొత్తు ● తలోదారిలో టీడీపీ, జనసేన, బీజేపీ క్యాడరు ● అభ్యర్థుల ప్రచారానికి ఆమడ దూరం ● బరిలో నిలిచిన కూటమి అభ్యర్థుల్లో ఓటమి భయం
సాక్షి, విశాఖపట్నం : తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమిలో పొత్తులు పొసగడం లేదు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ఒకరికొకరు సహకరించుకోవడం లేదు. ఆ పార్టీల ముఖ్య నేతలు, శ్రేణులు ఈ ఎన్నికల్లో తామంతా కలిసి ముందుకు వెళ్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల కూటమి అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించినా వారి తరఫున ప్రచారానికి కార్యకర్తలు దూరంగా ఉంటున్నారు. అక్కడక్కడ మొక్కుబడిగా కనిపిస్తున్నారు. దీంతో అభ్యర్థులు ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పేరుకే పొత్తులు తప్ప లోలోపల ‘మిత్రులకు’ సహాయ నిరాకరణను కొనసాగిస్తున్నారు. దీంతో ఇప్పట్నుంచే కూటమి అభ్యర్థులకు ఓటమి భయం వెంటాడుతోంది.
● పొత్తులో విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌కు కేటాయించారు. ఈయన అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీలో సీటును ఆశించిన ముగ్గురు ముఖ్య నేతలు సాధిక్, కందుల నాగరాజు, మూగి శ్రీనివాసరావులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీరు వంశీకి సహకరించే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. ఈ సీటుపై టీడీపీ నుంచి అక్కడ ఇన్‌చార్జి గండి బాబ్జీ గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ జనసేనకు ఖరారు చేయడంతో రాజీనామా చేస్తానని బెదిరించారు. ఆ తర్వాత చంద్రబాబు బుజ్జగించడంతో మెత్తబడినా పూర్తి స్థాయిలో వంశీ కోసం పనిచేస్తారన్న నమ్మకం లేదు. ప్రస్తుతం వంశీకృష్ణ తన అనుచరులతోనే దక్షిణలో ప్రచారం చేసుకుంటున్నారు.
● విశాఖ ఉత్తరం పొత్తులో బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్‌రాజుకు దక్కింది. ఆ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన క్యాడరు ఆయన వెంట ప్రచారానికి సుముఖత చూపడం లేదు. ఈ సీటు ఆశించిన పసుపులేటి ఉషాకిరణ్, బొడ్డేటి రఘులను ఇప్పుడు ప్రసన్నం చేసుకునే పనిలో విష్ణుకుమార్‌రాజు ఉన్నారు. అక్కడ అంతంతమాత్రంగా ఉన్న టీడీపీలో సరైన నాయకుడే లేడు. ఉన్న అరకొర నాయకులూ బీజేపీ అభ్యర్థి వెంట నడవడం లేదు.
● విశాఖ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వెలగపూడికి బీజేపీ, జనసేన శ్రేణులు దూరంగా ఉంటున్నారు. దీంతో తన అనుచరులతోనే వెలగపూడి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
● విశాఖ ‘పశ్చిమ’లో టీడీపీ అభ్యర్థి గణబాబుకు మద్దతుగా బీజేపీ, జనసేన సీనియర్లు ప్రచారంలో పాల్గొనడం లేదు. తమకు సహకరించాలని గణబాబు తన వర్గీయులను పంపుతున్నా అటు నుంచి ఆశించిన స్పందన కనిపించడం లేదు.
● పెందుర్తి సీటును జనసేనకు కేటాయించడంతో ఆ సీటు తనకే ఖాయమనుకున్న టీడీపీకి చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తన అనుచరులను రోజూ రోడ్డెక్కించి ఆందోళనలు చేయిస్తున్నారు. దీంతో అక్కడ జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబుకు టీడీపీ నుంచి సహకారం కనుచూపు మేరలో కనిపించడం లేదు. దీంతో జనసేన క్యాడరుతోనే ఒంటరిగా ప్రచారం చేసుకుంటున్నారు.
● ఇక చోడవరంలోనూ అదే పరిస్థితి. టీడీపీ అభ్యర్థి కేఎస్‌ఎన్ రాజుకు టికెట్టు ఇవ్వడాన్ని అక్కడ జనసేన, బీజేపీ నాయకులకు ఇష్టం లేదు. అందువల్ల రాజు ఎన్నికల ప్రచారానికి వెళ్లడానికి వీరు సుముఖత చూపడం లేదు.
● పాయకరావుపేట టీడీపీ టికెట్టు అనితకిచ్చారు. ఆమె అభ్యర్థిత్వాన్ని అక్కడ జనసేన నాయకుడు గెడ్డం బుజ్జి వర్గీయులతో పాటు టీడీపీలోని ఒక వర్గం ఎప్పట్నుంచో ససేమిరా అంటోంది. ఇటీవలే బుజ్జి వర్గాన్ని బుజ్జగించినా ప్రచారంలో పాల్గొనడంపై ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు. బీజేపీ ముఖ్య నాయకులు కూడా ఆమె వెంట కనిపించడం లేదు.
● ఇక రంపచోడవరం సీటు టీడీపీ అభ్యర్థి శిరీషకు దక్కింది. ఆమెకు టికెట్టు ఇవ్వడంపై అక్కడ మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, వెంకటేశ్వరరావులు గుర్రుగా ఉన్నారు. దీంతో శిరీషకు సొంత పార్టీ వారి మద్దతు ప్రశ్నార్థకంగా మారింది.
యలమంచిలి సీటును జనసేన అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌కు కేటాయించారు. ఈయన అభ్యర్థిత్వాన్ని అక్కడ సీటును ఆశించిన టీడీపీ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు అంగీకరించడం లేదు. ప్రగడ అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి పార్టీ కార్యాలయంలో ఫర్నిచరును కూడా ధ్వంసం చేశారు. జనసేన అభ్యర్థికి మద్దతుగా ప్రచారానికి ముందుకు రావడం లేదు.
మాడుగులలో విచిత్రమైన పరిస్థితి ఉంది. అక్కడ పైలా ప్రసాద్‌కు టీడీపీ సీటు ఇవ్వడాన్ని ఆ పార్టీకే చెందిన మాజీ ఎమ్మెల్యే రామానాయుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన వర్గీయులెవరూ ప్రసాద్ ప్రచారంలో పాల్గొనడం లేదు. ఇక జనసేన, బీజేపీ నాయకులూ ప్రచారానికి వెళ్లడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment