బల్క్ డ్రగ్ పార్కు పనులు ప్రారంభం
● లేఅవుట్ వేసి ఇంటర్నల్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం ● పనులు జరిగే చోట 50 మందితో పోలీసు బందోబస్తు ● అడ్డుకోకుండా సీపీఎం నాయకుల గృహ నిర్భందం
నక్కపల్లి : మండలంలో రాజయ్యపేట పరిసర ప్రాంత గ్రామాల్లో బల్క్ డ్రగ్ పార్క్ పనులు సోమవారం భారీ బందోబస్తు మధ్య ప్రారంభమయ్యాయి. పలు రాష్ట్రాలతో పోటీపడి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సాధించిన బల్క్ డ్రగ్ పార్క్‌నకు వచ్చే జనవరి 8న భారత ప్రధాని నరేంద్రమోదీతో శంకుస్థాపన చేయించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జనవరిలో ప్రధాని మోదీ అనకాపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు రానున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా నక్కపల్లి మండలంలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే బల్క్ డ్రగ్‌పార్క్‌కు కూడా శంకుస్థాపన చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పారిశ్రామిక ఖిల్లాగా పేరొందిన అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటకు గత ఏడాది సెప్టెంబరులో రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ పార్క్ ఏర్పాటయితే ప్రత్యక్షంగా , పరోక్షంగా 10 వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
గత ప్రభుత్వంలోనే భూముల కేటాయింపు...
ఈ బల్క్‌డ్రగ్‌పార్క్‌ను తొలుత కాకినాడలో ఏర్పాటు చేయాలని తలపెట్టారు. రూ.2190 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయబోయే ఈ పరిశ్రమకు 2000 ఎకరాల భూమి అవసరమవుతుంది. కాకినాడ జిల్లాలో ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి గత ఏడాది ప్రతిపాదన వెళ్లింది. అయితే ప్రభుత్వ భూములు ఉన్న చోట మాత్రమే ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సూచించింది. ఈ పార్క్‌ను తమకు కేటాయించాలంటూ పలు రాష్ట్రాలు పోటీ పడ్డాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఏపీఐఐసీ ద్వారా ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు కోసం 4500 ఎకరాలు సేకరించిన విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ఇక్కడ బల్క్‌డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అనుమతిస్తే 2000 ఎకరాలు కేటాయిస్తామని ప్రతిపాదనలు పంపింది. దీంతో కేంద్రం ఈ పార్క్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేటాయించిన 2వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ కోసం 750 ఎకరాలు, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ సదుపాయం, తాగునీరు, వాడుక నీరు వంటి మౌలిక సదుపాయాలకు తోడు వ్యర్థాలను శుద్ధి చేసే ప్లాంట్ల ఏర్పాటుకు 1250 ఎకరాలు వినియోగిస్తారు. మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా కల్పిస్తుంది. ఈ పనుల్లో భాగంగా రాజయ్యపేటలో సర్వే నంబరు 292లో సేకరించిన 244 ఎకరాల జిరాయితీ భూముల్లో పనులు ప్రారంభమయ్యాయి. 30 అడుగుల వెడల్పు కలిగిన ఇంటర్నల్ రోడ్లు 28 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. దీనికి భూములు చదును చేయడం కోసం పొక్లెయిన్‌తో కొబ్బరి తోటలను తొలగిస్తున్నారు. అయితే ఏపీఐఐసీకి భూములు ఇచ్చిన రైతులకు సంబంధించిన సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ భూములు సాగు చేస్తున్న వారికి, డీ ఫారం రైతులకు పరిహారం, ప్యాకేజీ చెల్లించాల్సి ఉందని రైతులు ఆందోళన చేస్తున్నారు.
ముందే హెచ్చరికలు...
ఏపీఐఐసీ చేపట్టిన పనులు అడ్డుకుంటారనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. నిర్వాసితులకు అండగా నిలుస్తున్న సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. అప్పలరాజు, మండల కన్వీనర్ రాజేష్ తదితరులను హౌజ్ అరెస్టు చేశారు. నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం మండలాలకు చెందిన సీఐలు కుమార స్వామి, అప్పన్న, ఎల్.రామకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 50 మందితో పనులు జరిగే చోట బందోబస్తు ఏర్పాటు చేసారు. పనులు ప్రారంభించే భూములకు పరిహారం చెల్లించినందున పనులు అడ్డుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ముందుగా హెచ్చరికలు జారీ చేయడంతో రైతులు, నిర్వాసితులు ఆ దరిదాపుల్లోకి రాలేదు. దీంతో పనులు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment