సాక్షి, అమరావతి: అవసరంలేని ప్రజల వ్యక్తిగత, సున్నితమైన సమాచారాన్ని ఏమాత్రం సేకరించడంలేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ‘సంక్షేమ పథకాలలో అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకుండా సంతృప్త స్థాయిలో ఆయా పథకాలను అర్హులందరికీ అందజేసేందుకు.. ఆయా పథకాల అమలులో అవినీతి అన్నదే లేకుండా పూర్తి పారదర్శకంగా వాటిని అందించేందుకు అవసరమయ్యే సమాచారాన్ని మాత్రమే ప్రభుత్వం సేకరిస్తుంది. కానీ.. ‘ఈనాడు’, ఆ సంస్థ యజమాని తమకు నచ్చని జగన్ ప్రభుత్వంపట్ల ప్రజల్లో విషబీజాలు నాటేందుకు అబద్ధపు రాతలనే నమ్ముకుంది.
నిజానికి.. ప్రభుత్వ పథకాల అమలులో ఏ సంబంధంలేని ప్రజల ఓటరు ఐడీ, ఎవరు ఏ మొబైల్ ఫోన్లు వాడుతున్నారు, పాన్‌కార్డు వివరాలు ఏంటి, ఎవరికెంత అప్పు ఉంది వంటి ప్రజల సున్నిత సమాచారాన్ని సైతం చంద్రబాబు తన హయాంలో ప్రజాసాధికారిత సర్వే పేరుతో సేకరించింది. ఈ డేటాను సరిగ్గా ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే ‘సంఘమిత్ర’ ప్రతినిధుల మొబైల్ ఫోన్లలో ప్రత్యక్షమయ్యాయి. ఆ యాప్ వినియోగించే ఐటీ సంస్థలపై అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం పోలీసులు కేసు నమోదు చేయడం పెద్ద రాజకీయ దుమారం రేపింది.
రాష్ట్ర ప్రజల వ్యక్తిగత గోప్యత నిజంగా ప్రమాదంలో పడిన ఆ సమయంలో ప్రజల పక్షాన నిలబడాల్సిన ‘ఈనాడు’ కళ్లు మూసేసుకుంది. తమకేమి తెలీదన్నట్లు చోద్యం చూసింది. కానీ, అదే ‘ఈనాడు’ ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఓటరు ఐడీ తదితర వివరాలేవీ సేకరించకపోయినా, సేకరించి రాజకీయ దురి్వనియోగానికి పాల్పడుతున్నట్లు నానా యాగీ చేస్తూ మెదడు చిట్లినట్లు రంకెలు వేస్తోంది. ‘ప్రమాదంలో వ్యక్తిగత గోప్యత’ అంటూ తప్పుడు రాతలతో జగన్ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకుంది’.. అంటూ రాష్ట్ర ప్రభుత్వం మీడియాకు ‘ఫ్యాక్ట్‌చెక్’ను విడుదల చేసింది. ఆ వివరాలివీ..
ఈనాడు ఆరోపణ: ప్రజల డేటా సేకరణకు సంబంధించి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు చేసి, ఇప్పుడు తనూ ప్రజల సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు..
వాస్తవం: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రజా సాధికార సర్వే పేరుతో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలకు సంబంధంలేని అనేక వ్యక్తిగత వివరాలను సేకరించారు. ఓటరు ఐడీ, ఒక్కో ఇంట్లో ఎన్ని మొబైల్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వివరాలు, ఇంటి విస్తీర్ణం ఎంత, ఎన్ని గదులున్నాయి, ఒక్కో ఇంట్లో ఉన్న బ్యాంకు లోన్లు వంటి అతి సున్నిత సమాచారం సేకరించింది.
పథకాలకు సంబంధంలేని ప్రజల వ్యక్తిగత డేటా అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం సేకరించినా ‘ఈనాడు’ ఏనాడూ దానిని తప్పుపట్టలేదు. కానీ, అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సాధికార సర్వేలో సేకరించిన ఈ డేటా ఇతరుల చేతికి వెళ్లింది. ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పథకాల అమలుకు సంబంధంలేని ఓటరు ఐడీ వంటి వివరాలను సేకరించలేదు.
ఈనాడు ఆరోపణ: ప్రజలకు సంబంధించిన సమాచారం ఈ ప్రభుత్వం ఎందుకు సేకరిస్తోంది?
ప్రభుత్వం సమాధానం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలు–సేవల కోసం లబి్ధదారుల గుర్తింపు ప్రక్రియకు అవసరమైన సమాచార సేకరణ మాత్రమే జరుగుతోంది. ఇందులో ఏ సమాచారం ఎందుకంటే..
- కుటుంబ సభ్యుల వివరాలు: పథకాల అమలులో ఆయా కుటుంబాల్లో అర్హులను గుర్తించేందుకు..
- కులం: కాపునేస్తం, ఈబీసీ నేస్తం వంటి కులం ఆధారిత పథకాల్లో అర్హుల గుర్తింపునకు.. కుల ధ్రువీకరణ పత్రాలు వంటివి జారీ కోసం..
- ఆధార్ నెంబరు (ముసుగు ఫార్మాట్‌లోనే): పథకాల అమలులో అక్రమాలకు తావులేకుండా బయోమెట్రిక్ ఆధారంగా లబ్దిదారుల గుర్తింపునకు..
- మతం: వైఎస్సార్ షాదీ తోఫా వంటి మత ఆధారిత పథకాల అమలుకు..
- అడ్రసు: లబ్దిదారులకు ఇంటి వద్దే పథకాల అమలుకోసం..
- మొబైల్ నెంబరు: పారదర్శకత ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ పథకాల సమాచారం నేరుగా ఆ లబ్దిదారులకే ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్ రూపంలో తెలియజేసేందుకు..
- వృత్తి: ప్రభుత్వం అమలుచేస్తున్న నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా వంటి వృత్తి ఆధారిత పథకాల్లో లబ్ధిదారుల గుర్తింపు కోసం..
- పుట్టిన తేదీ: వివిధ పథకాల అమలులో లబి్ధదారుల వయస్సు నిర్ధారణ కోసం..
- లింగం (మగ లేదా ఆడ వివరాలు): కేవలం మహిళల కోసమే ప్రభుత్వం ప్రత్యేకంగా అమలుచేస్తున్న పథకాల కోసం..
- కుటుంబంలో మిగిలిన సభ్యుల బంధుత్వం వివరాలు: పుట్టిన తేదీ, ఆదాయ ధ్రువీకరణ, మరణ ధ్రువీకరణ వంటి పత్రాల జారీకోసం..
- వివాహ పరిస్థితి: వైఎస్సార్ కళ్యాణమస్తు పథకం ద్వారా లబ్దిదారుల గుర్తింపునకు..
ఈనాడు ఆరోపణ: సేకరించిన సమాచారం ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్తుంది..
వాస్తవం: అందుకు అవకాశమేలేదు. సేకరించిన సమాచారం వెంటనే పూర్తి భద్రత ఉండే ప్రభుత్వ డేటా సర్వర్‌కు మాత్రమే నేరుగా చేరుతుంది. సర్వే పూర్తయిన తర్వాత ఆ వివరాలు కూడా వలంటీర్ల యాప్‌లో ఉండవు. ‘ఈనాడు’ పేర్కొన్నట్లు గృహ సర్వేలో ఇచి్చన వివరాలను ఉపయోగించి భూమి యాజమాన్యాన్ని మార్చడం వంటివి ఎట్టి పరిస్థితిలోనూ సాధ్యపడదు. లబి్ధదారుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేయడం ఎట్టిపరిస్థితుల్లో సాధ్యపడదు.
ఈనాడు ఆరోపణ: పౌరుల నుండి బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. ఈ వివరాలు సేకరణ సురక్షితం కాదు..
వాస్తవం: ఆధార్ నెంబరు ఆధారంగా లబ్ధిదారుని బయోమెట్రిక్ తీసుకునే సమయంలో ఈ బయోమెట్రిక్‌లు మొబైల్ పరికరంలో లేదా స్టేట్ డేటాబేస్‌లో నిల్వచేయబడవు.
కట్టుదిట్టంగా డేటా సేకరణ..
గ్రామ, వార్డు సచివాలయాల శాఖ పటిష్ట భద్రతా చర్యలతో రూపొందించిన యాప్‌ల ద్వారానే ప్రభుత్వ కార్యక్రమాలకు అవసరమైన డేటాను సేకరిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టంచేసింది. వలంటీర్ల ద్వారా వివరాలు సేకరించాక అవి నేరుగా ప్రభుత్వ డేటా సెంటరుకు చేరతాయని.. అవి వలంటీర్ల యాప్‌లో కూడా నిల్వఉండవని తేలి్చచెప్పింది.
అలాగే, ప్రభుత్వ డేటా సెంటరు నుంచి ఆ డేటాను గుర్తింపు పొందిన ప్రభుత్వ అధికారులు అనుమతి పొందిన కంప్యూటర్ ద్వారా మాత్రమే వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని.. అది కూడా వ్యక్తి సమాచారం మొత్తం కాకుండా పరిమిత పరిధిలోనే ఆ డేటాను వినియోగించుకునేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లున్నాయని ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు.. అన్ని యాప్‌లు హైలెవల్ సెక్యూరిటీ ఫీచర్లతో డెవలప్ చేయబడ్డాయని, సైబర్ దాడులకు సైతం అవకాశంలేకుండా భద్రతా చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment