‘దున్నపోతు ఈనిందంటే దూడని గాటికి కట్టేయమన్నాడట’ వెనుకటికి ఒక ప్రబుద్ధుడు. ఈనాడు రామోజీరావు తీరు అచ్చం అలానే ఉంది. గత ప్రభుత్వ పాలనలో మూగజీవాలు మృత్యువాత పడుతున్నా... పశువైద్య కేంద్రాల్లో సిబ్బంది కరువైనా... అవసరమైన మందులు అందించకపోయినా... సరైన వైద్యం అందకపోయినా రామోజీ కళ్లకు కనిపించలేదు. ఈనాడు కలాలకు పదును పెట్టలేదు. ఇప్పుడే ఆ శాఖపై అమాంతంగా అభిమానం పుట్టుకొచ్చేసింది. అవాస్తవాలతో జనాన్ని పక్కదారి పట్టించేందుకు కంకణం కట్టుకుంది.
లెక్కకు మిక్కిలిగా పోస్టులు భర్తీ చేసి రైతు ముంగిటకే పశువైద్యం తీసుకెళ్తుంటే తట్టుకోలేకపోతోంది. ఈ ప్రభుత్వం మంచి పాలన అందిస్తుంటే కుళ్లుకుంటోంది. ఎక్కడ ప్రజల్లో మంచి పేరొస్తుందేమోనని భయపడిపోతోంది. అదే పనిగా విమర్శిస్తూ... అడ్డగోలు రాతలతో అభాసుపాలు చేయాలని చూస్తోంది. వాస్తవాలకు పాతర వేస్తోంది. రోజుకో అంశంతో అబద్ధపు వార్తలు వండి వారుస్తోంది. పశువైద్యం కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కనిపించాలంటే రామోజీ కళ్లద్దాలు మార్పించుకుని చూడాలి.
సాక్షి, అమరావతి: గ్రామానికో పశుసంవర్థక సహాయకుడు... రెండు మండలాలకో వెటర్నరీ అంబులెన్స్... గ్రామ స్థాయిలో ఆర్బీకేల ద్వారా పశుగ్రాసం, సర్టిఫై చేసిన నాణ్యమైన సంపూర్ణ మిశ్రమ దాణా పంపిణీ... పాడి రైతు ముంగిటకే నాణ్యమైన పశువైద్య సేవలు... నియోజకవర్గ స్థాయిలో పశువ్యాధి నిర్థారణ ప్రయోగశాలలు... నాణ్యమైన పాల ఉత్పత్తి లక్ష్యంగా ఆర్బీకేల ద్వారా పశువిజ్ఞాన బడులు... మూగజీవాలకు బీమా రక్షణ... జనరిక్ పశుఔషధ కేంద్రాల ఏర్పాటు... జగనన్న పాలవెల్లువ ద్వారా పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పన.. ఇలా గడచిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో వచ్చిన ఎన్నో విప్లవాత్మక మార్పులు.
దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని రీతిలో మూగజీవాల ఆరోగ్య పరిరక్షణకు ఈ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. తద్వారా కేంద్రంతో సహా పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు.. అవార్డులు.. రివార్డులు అందుకుంది. పంజాబ్, రాజస్థాన్, కేరళ వంటి పలు రాష్ట్రాలు ఇక్కడి విధానాలను స్ఫూర్తిగా తీసుకున్నాయి. ఇప్పుడు వాటినే ఆచరిస్తున్నాయి.
పొరుగు రాష్ట్రాల కంటే మిన్నగా...
దేశంలో పొరుగు రాష్ట్రాల కంటే మిన్నగా మూగజీవాలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. గతంలో సకాలంలో నాణ్యమైన, అత్యవసర వైద్య సేవలు అందక ప్రతీ ఏటా పెద్ద సంఖ్యలో మూగజీవాలు మృత్యువాతపడేవి. రాష్ట్రంలో 1577 పశువైద్యశాలలు, 323 ప్రాంతీయ పశువైద్యశాలలు, 12 వెటర్నరీ పోలీ క్లీనిక్స్ ద్వారా పశు పోషకులకు చేరువలో అత్యాధునిక పశువైద్యం అందుతోంది.
రాష్ట్ర స్థాయిలో 2 సూపర్ స్పెషాలిటీ పశువైద్యశాలల ద్వారా పశువులకూ 24 గంటలు పశువైద్యం అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలో 1.66 కోట్ల పశుగణ యూనిట్లు ఉండగా, 1527 పశు వైద్య సహాయ శస్త్ర చికిత్సకులు విధులు నిర్వíßరి్తస్తున్నారు. ఖాళీగా ఉన్న 264 పశువైద్యుల పోస్టుల నియమకానికి చర్యలు చేపట్టారు.
రైతు ముంగిటకే అత్యవసర వైద్యసేవలు
ప్రతి నియోజకవర్గానికి రెండు చొప్పున రూ.240.69 కోట్ల వ్యయంతో 340 సంచార పశువైద్య అంబులెన్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతీ అంబులెన్స్‌లో వెటర్నరీ డిప్లమో చేసిన సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్లను ఏర్పాటు చేశారు. వీటిలో 295 స్పెషలిస్ట్ పశువైద్యులతో పాటు 337 పశువైద్య సహాయకులు సేవలందిస్తున్నారు. ప్రతీ వాహనంలో 51 రకాల వైద్యపరికరాలు ఉంచారు. 20 రకాల పేడ సంబంధిత, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా చిన్నపాటి లేబొరేటరీని సమకూర్చారు. ప్రతీ అంబులెన్స్‌లో రూ.30వేల విలువైన 81 రకాల మందులు అందుబాటులో ఉంచారు. వీటి సేవల కోసం 1962తో టోల్ ఫ్రీ నెంబర్‌తో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు.
కచ్చితమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు
దేశంలో మరెక్కడా లేనివిధంగా నియోజక వర్గస్థాయిలో రూ.24.14కోట్లతో 154 పశు వ్యాధి నిర్ధారణ ల్యాబ్‌్సను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతీ లేబొరేటరీలో ఒక టెక్నీషియన్, ఒక అటెండర్‌ని నియమించింది. వీటి ద్వారా పేడ పరీక్షలు, రక్త పరీక్షలు, పాల పరీక్షలు, మూత్ర పరీక్షలు, చర్మ సంబంధ వ్యాధి పరీక్షలు, యాంటీ బయోటిక్ సెన్సిటివిటీ, జీవక్రియ వ్యాధి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
గ్రామానికో గ్రాడ్యుయేట్ ఉద్యోగి
రైతులకు గ్రామస్థాయిలో నాణ్యమైన సేవలందించే సంకల్పంతో 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న 1218 గ్రామీణ పశుగణ కేంద్రాలతో పాటు 7396 ఆర్బీకే క్లస్టర్స్ ద్వారా పశువైద్య సేవలందించేందుకు గ్రాడ్యుయేట్ చదివిన పశువైద్య నిపుణులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రెండు విడతల్లో 4652 మంది గ్రాడ్యుయేట్స్‌ను నియమించగా మరో 1896 పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ ఇచ్చారు. ఆర్బీకేల్లో ట్రావిస్‌ను ఏర్పాటు చేసి, ప్రథమ చికిత్స అందజేస్తున్నారు. ఆర్బీకేలకు రూ.3వేల విలువైన మందులు, వైద్య పరికరాలు సమకూర్చారు.
అత్యధికంగా పశువైద్యులు
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే అత్యధికంగా పశువైద్యులు సేవలందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో 51,772, గుజరాత్‌లో 36,540, బీహార్‌లో 32,138, తెలంగాణలో 32,127, ఉత్తరప్రదేశ్‌లో 27,480, రాజస్థాన్‌లో 20,821 జీవాలకు ఒక గ్రాడ్యుయేట్ పశువైద్యుడు సేవలు అందిస్తుంటే, మన రాష్ట్రంలో ప్రతీ 17,808 జీవాలకు ఒక వైద్యుడు సేవలు అందిస్తున్నారు. అయినా ఇంకా ఏమీ చేయలేదన్నట్టు ఈనాడు అసత్య కథనాలు ప్రచురిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. పదిమందిలో ఆ పత్రికే చులకనవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment