YSRCPకి 13 ఏళ్లు పూర్తి.. విశ్వసనీయతకు ప్రతీక | YSR Congress Party Completes 13 Years Of Political Career, Special Story In Telugu - Sakshi
Sakshi News home page

13 Years For YSRCP: వైఎస్సార్‌సీపీకి 13 ఏళ్లు పూర్తి.. విశ్వసనీయతకు ప్రతీక

Published Tue, Mar 12 2024 6:25 AM | Last Updated on Tue, Mar 12 2024 10:00 AM

YSR Congress Party Completes 13 Years of Political Career - Sakshi

సవాళ్లనే సోపానాలుగా మలుచుకుని తిరుగులేని శక్తిగా వైఎస్సార్‌సీపీ..

నేడు 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని.. 14వ వసంతంలోకి అడుగులు

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైఎస్‌ జగన్‌ పోరాటం

2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన వైఎస్సార్‌సీపీ

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసి విశ్వసనీయతను చాటుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించడం ఖాయమంటోన్న డజనుకుపైగా సర్వేలు

సాక్షి, అమరావతి: వరుస ఓటములతో జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్‌కు ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రతో జీవం పోసి.. టీడీపీ దుర్మార్గపు పాలనకు తెరదించుతూ 2004 ఎన్నికల్లో ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికీ, అటు కేంద్రానికీ మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒంటిచేత్తో అధికారాన్ని అందించారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ప్రజల మనసు దోచుకున్న ఆయనకు దన్నుగా నిలుస్తూ 2009­లోనూ తిరిగి అధికారాన్ని కట్టబెట్టారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న క్రమంలో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2009, సెప్టెంబరు 2న హెలీకాప్టర్‌ ప్రమాదంలో హఠాన్మ­రణం చెందారు. ఈ విషాదాన్ని తట్టుకోలేక వంద­లాది మంది అభిమానులు మరణించడం వైఎస్‌ జగన్‌ను, ఆయన కుటుంబీకులను కలచివేసింది. వారిని పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర చేపడతానని కర్నూలు జిల్లా నల్లకాలువ వద్ద 2009, సెప్టెంబరు 25న నిర్వహించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి సంస్మరణ సభలో వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. 

ప్రజలకు ఇచ్చిన మాట కోసం
నల్లకాలువ సభలో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడిన వైఎస్‌ జగన్‌ 2010, ఏప్రిల్‌ 9న ఓదార్పు యాత్రను పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రారంభించారు. యాత్రను ఆపేయాలని కాంగ్రెస్‌ అధి­ష్టానం ఆదేశించింది. ఓదార్పు యాత్ర ఉద్దేశా­న్ని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి వైఎస్‌ జగన్‌ వివరించినా లాభం లేకపోయింది. ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్‌ జగన్‌ ఓదార్పు యాత్ర కొనసాగించారు. ఓదార్పు యాత్రకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది.  ఓర్వలేకపోయిన కాంగ్రెస్‌­లోని కొన్ని శక్తులు, టీడీపీతో కుమ్మక్కై కుట్రలకు తెరతీశాయి.

వైఎస్‌ జగన్‌ ఆస్తులపై విచారణ జరిపిం­చాలని నాటి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శంకర్‌­రావుతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కాంగ్రెస్‌ అధిష్టానం లేఖ రాయిస్తే.. కాంగ్రెస్‌ కనుసైగల మేరకు నాటి ఎంపీ కె.ఎర్రన్నాయుడితో టీడీపీ లేఖ రాయించింది. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కుట్రలు చేస్తుండటంతో తన తల్లి విజయమ్మతో కలిసి వైఎస్‌ జగన్‌ కాంగ్రెస్‌కు, పులివెందుల ఎమ్మె­ల్యే, కడప ఎంపీ స్థానాలకు రాజీనామాలు చేశారు. ఆ తర్వాత ఓ వైపు ఓదార్పు యాత్రను కొనసాగి­స్తూనే.. మరో వైపున ప్రజా సమస్యల పరిష్కారం కోసం జగన్‌ ఉద్యమబాట పట్టారు. ఈ క్రమంలోనే రైతులు, చేనేత కార్మికులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ 2010, డిసెంబర్‌ 21న విజయవాడలో కృష్ణా నదీ తీరాన ‘లక్ష్యదీక్ష’ చేపట్టారు.

మహానేత ఆశయ సాధనే లక్ష్యంగా
కాంగ్రెస్‌ను వైఎస్‌ జగన్‌ వీడిన తర్వాత జగతి పబ్లికేషన్స్‌కు ఆదాయపు పన్ను శాఖతో నోటీసులు జారీ చేయించడం ద్వారా సోనియా­గాంధీ వేధింపుల పర్వాన్ని ప్రారంభించింది. అయినా వాటిని లెక్క చేయని వైఎస్‌ జగన్‌.. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా.. రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా 2011, మార్చి 11న వైఎస్సార్‌సీపీ పేరును ప్రకటించారు. ఆ మరుసటి రోజే వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో మహానేత వైఎస్‌ సమాధి వద్ద వైఎస్సార్‌సీపీ పతాకాన్ని ఆవిష్కరించి.. పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. 

మొగ్గలోనే తుంచేందుకు కుట్రలు
వైఎస్‌ జగన్, విజయమ్మల రాజీనామాతో ఖాళీ అయిన కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభ స్థానానికి ఎన్నికలు నిర్వహించడానికి 2011, ఏప్రిల్‌ 12న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. కడప లోక్‌సభ స్థానం నుంచి  వైఎస్‌ జగన్, పులివెందుల శాసనసభ స్థానం నుంచి వైఎస్‌ విజయమ్మ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా పోటీ చేశారు. రెండు చోట్లా రికార్డు మెజార్టీతో గెలిచారు. ఈ రికార్డు విజయాలతో వైఎస్సార్‌సీపీ బలీయమైన శక్తిగా ఎదుగుతుందని గ్రహించిన కాంగ్రెస్‌ అధి­ష్టానం, టీడీపీ అధినేత చంద్రబాబుతో కుమ్మక్కై.. మొగ్గలోనే తుంచేందుకు కుట్రలు చేసింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శంకర్‌రావుతో వైఎస్‌ జగన్‌పై హైకోర్టులో కేసు వేయించారు. ఈ కేసులో టీడీపీ నేతలు ప్రతివాదులుగా చేరడంతో.. దానిపై హైకోర్టు విచారణ చేపట్టింది. 2011, ఆగస్టు 10న జగన్‌ ఆస్తులపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది.

నైతిక విలువలే పునాదిగా
నైతిక విలువలతో రాజకీయాలు చేయాలన్నది వైఎస్‌ జగన్‌ సిద్ధాంతం. వైఎస్సార్‌సీపీలో ఎవరైనా చేరాలంటే.. వారు తామున్న పార్టీకి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి రావాలని షరతు విధించారు. దానికి కట్టుబడిన 19 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ మేకపాటి రాజమోహన్‌­రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఖాళీ అయిన 19 శాసనసభ, నెల్లూరు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలను నిర్వహించడానికి 2012, ఏప్రిల్‌ 24న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్రంలో 19 శాసనసభ, నెల్లూరు లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో, ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని గ్రహించిన కాంగ్రెస్‌–టీడీపీ అధిష్టానవర్గాలు కుమ్మక్కై కుట్రకు తెరతీశాయి. ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్‌ జగన్‌ను విచారణ పేరుతో పిలిపించిన సీబీఐ 2012, మే 27న అరెస్టు చేసింది. అయినా ఉప ఎన్నికల్లో 17 శాసనసభ, నెల్లూరు లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించింది.

ప్రజలపక్షాన ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌
రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో ఎన్నికల్లో ఒంటరిగా వైఎస్సార్‌సీపీని వైఎస్‌ జగన్‌ బరిలోకి దించారు. టీడీపీ–బీజేపీ–జనసేన జట్టుకట్టి బరిలోకి దిగాయి. నరేంద్ర మోదీ ప్రభంజనంలో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారానికి దూరమైంది. 67 శాసనసభ స్థానాలు, ఏడు లోక్‌సభ స్థానాలు గెలుచుకున్న వైఎస్సార్‌సీపీ బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. టీడీపీ అరాచకాలను నిలదీస్తూ ప్రజల పక్షాన ప్రతిపక్ష నేతగా ఇటు శాసనసభలోనూ అటు బయటా రాజీలేని పోరాటాలు చేశారు. 

చరిత్రాత్మకం.. ప్రజాసంకల్పం
తన తండ్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి 2017, నవంబర్‌ 6న ప్రజా సంకల్ప పాదయాత్రను వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. ఎముకలు కొరికే చలిలో.. మండుటెండలో.. కుంభవృష్టిలో 14 నెలలపాటు 3,648 కి.మీ.ల దూరం సాగిన పాదయాత్రను 2019, జనవరి 9న శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం వద్ద ముగించారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రల్లో పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. టీడీపీ దుర్మార్గపు పరిపాలనను కూకటివేళ్లతో పెకలిస్తూ.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి అఖండ విజయాన్ని ప్రజలు అందించారు. 50 శాతానికిపైగా ఓట్లతో 151 శాసనసభ(87 శాతం), 22 లోక్‌సభ(88 శాతం) స్థానాలను గెలుచుకుంది.  

సామాజిక న్యాయమంటే ఇదీ
వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించడంతో 2019, మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తొలి మంత్రివర్గంలో 56 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి 2022, ఏప్రిల్‌ 11న పునర్‌వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులు ఆ వర్గాలకు సామాజిక మహా విప్లవాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. ఐదు డిప్యూటీ సీఎం పదవుల్లో నాలుగు ఆ వర్గాలకే ఇచ్చి.. హోంశాఖ మంత్రిగా తొలి సారిగా ఎస్సీ మహిళను నియమించారు. నామినేటెడ్‌ పదవుల్లో, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు.. మహిళలకు రిజర్వు చేసేలా చట్టం తెచ్చి మరీ ఆయా వర్గాలకు పదవులు ఇచ్చారు.  ఎమ్మెల్సీ, రాజ్యసభ, స్థానిక సంస్థల పదవుల్లోనూ ఆ వర్గాలకే పెద్దపీట వేశారు. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశారు. ఈ అయిదేళ్లలో అది 99 శాతానికి చేరింది. దీంతో వైఎస్‌ జగన్‌కు జనం జేజేలు పలుకుతున్నారు. స్థానిక సంస్థల అన్ని ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీకి భారీ విజయాలను అందించారు.

రాజకీయంగా వైరిపక్షాలైన కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై ఒక మనిషిని, ఒక పార్టీని అణగదొక్కడానికి చేయని కుట్ర లేదు.. పన్నని కుతంత్రం లేదు. నలువైపుల నుంచి ఊపిరి సలపనివ్వని రీతిలో దాడులు చేశాయి. అయినా సరే ఆ మనిషి.. ఆ పార్టీ వెనక్కు తగ్గలేదు. ఇచ్చిన మాటను వీడలేదు. ప్రజల పక్షాన పోరాటాన్ని ఆపలేదు. విలువలకు ప్రాధాన్యం ఇచ్చే, విశ్వసనీయతకు ప్రాణం ఇచ్చే ఆ మనిషి.. ఆ పార్టీ వెంట జనం నడిచారు. ప్రభంజనం సృష్టించారు. ప్రజల హృదయాలు గెలుచుకున్న ఆ మనిషి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. జనం గుండెల్లో నాటుకుపోయిన ఆపార్టీ వైఎస్సార్‌సీపీ. సవాళ్లే సోపానాలుగా మలుచుకుని.. ఇద్దరితో మొదలై తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిన వైఎస్సార్‌సీపీ 13 ఏళ్లు పూర్తి చేసుకుని మంగళవారం 14వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆపార్టీ ప్రస్థానాన్ని ఓ సారి తరచి చూద్దాం.

ఎన్నికలకు ముందే కన్పిస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభంజనం
ఇచ్చిన మాటను నిలబెట్టుకుని.. సుపరిపా­లన అందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ అంటే ప్రజలకు ఆకాశమంత నమ్మకం. వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలకు పోటెత్తిన ప్రజాసముద్రమే అందుకు నిదర్శ­నం. వచ్చే ఎన్నికల్లో 21 నుంచి 22 లోక్‌సభ స్థానా­లను చేజిక్కించుకుని వైఎస్సార్‌సీపీ ఘన­విజ­యం సాధిస్తుందని టైమ్స్‌ నౌ–­ఈటీజీ సర్వే వెల్లడించింది. డజనుకుపైగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థల సర్వేల్లోనూ వైఎస్సార్‌సీపీదే విజయమని స్పష్టమైంది. ఇద్దరితో మొదలైన రాజకీయ­పార్టీ చరిత్రలో ఏపార్టీ ఎదుర్కో­నన్ని సవాళ్లు, ఆటుపోట్లు, దాడులకు ఎదు­ర్కొని నిలబడి.. తిరుగులేని రాజకీయ శక్తిగా ఆవిర్భవించిన దాఖలాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేవని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

నేడు వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం 
ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేంద్ర కార్యాలయం పిలుపు
సాక్షి, అమరావతి:  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవి­ర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు పలు సేవా కార్యక్రమా­ల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. పార్టీ ముఖ్య నేతలు పాల్గొనే ఈ కార్యక్రమాలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయి. పార్టీ మంగళవారం 14వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేంద్ర కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో సూచించింది. నియోజ­కవర్గాల్లో పార్టీ జెండాలు ఎగురవేయడంతో పాటు మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను పూలతో అలంకరించి, సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచి్చంది. పార్టీ రీజినల్‌ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, జేసీఎస్‌ రాష్ట్ర కో ఆర్డినేటర్లు, అసెంబ్లీ నియోజక­వర్గ పరిశీలకులు, సమన్వయకర్తలు పార్టీ ఆవి­ర్భా­వ గొప్ప­త­నాన్ని చాటిచెప్పాలని సూచించింది.  

జతకట్టిన జెండాలన్నీ కనుమరుగు: అప్పిరెడ్డి 
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమ రాజ్యాన్ని నడిపిస్తోందని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకుడు, శాసనమండలిలో విప్‌ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోనన్ని సవాళ్లు, దాడులను వైఎస్సార్‌సీపీ ఎదుర్కొందని తెలి­పారు. వాటన్నింటినీ ఎదుర్కొంటూ వైఎస్‌ జగన్‌ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరా­టం చేశారని తెలిపారు. అధికారంలోకి వచ్చా­క సంక్షేమాభివృద్ధి పథకాలు, విప్లవాత్మక సంస్కరణలతో సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో జతకట్టిన జెండాలన్నీ కనుమరుగవుతాయని అప్పిరెడ్డి జోస్యం చెప్పారు. 2019కి మించిన మెజారిటీతో వైఎస్సార్‌సీపీ గెలుస్తుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement