●తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మదనపల్లె: నూతన సంవత్సర వేళ సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు సిద్ధమయ్యారు.సైబర్‌మోసాలకు గురైన బాధితులు తమకు జరిగిన మోసంపై ఫిర్యాదుచేసేందుకు ముందుకు రావడం లేదు. జరుగుతున్న నేరాల్లో అతి తక్కువ శాతం మాత్రమే ముందుకు వచ్చి కేసులు నమోదు చేస్తున్నారు. కొత్త సంవత్సర శుభాకాంక్షల పేరుతో మొబైల్ ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు, వాట్సప్‌ల ద్వారా సందేశాల లింక్‌లు సైబర్ కేటుగాళ్లు పంపిస్తున్నారు. గుర్తు తెలియని నంబర్ల ద్వారా వచ్చే ఈ లింక్‌లను ఏమాత్రం క్లిక్‌చేసినా మీ బ్యాంకు ఖాతాల్లో నగదును క్షణాల్లో సైబర్ నేరగాళ్లు మాయం చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఫోన్ల మెసేజ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
మోసం చేసేది ఇలా.....
ఈ రోజు సాయంత్రం ముగిస్తే చాలు. అర్ధరాత్రికి కొత్త సంవత్సరం 2025లోకి అడుగుపెడుతున్నాం. సాయంత్రం నుంచే నూతన సంవత్సర హంగామా మొదలవుతుంది. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పడానికి ప్రతి ఒక్కరూ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. కొందరు వినూత్నంగా ఆలోచిస్తూ మొబైల్‌లో వచ్చే రకరకాల చిత్రాలు, సందేశాలను తమ పేర్లతో సహా తయారుచేసుకుని పంపుతారు. అయితే ఈ అవకాశాన్ని సైబర్ నేరగాళ్లు వినియోగించుకునే వ్యూహరచన చేశారు. మీకు నచ్చే విధంగా మీ పేరుతో గ్రీటింగ్స్, సందేశాలను పంపుకోవచ్చని, మీరు చేయవలసిందల్లా ఈ కింది లింక్‌పై క్లిక్‌చేసి వివరాలు నమోదుచేస్తే...మిగిలిందంతా తామే చూసుకుంటామని కేటుగాళ్లు మస్కా కొడతారు. మన మొబైల్‌లోని టెలిగ్రామ్, వాట్సప్‌లకు ఏపీకే(ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్) ఫైల్స్ రూపంలో మెసేజ్‌లు పంపుతారు. పొరపాటున ఆ లింక్‌ను క్లిక్ చేస్తే... అంతే సంగతులు. మన ఫోన్‌లో సమాచారమంతా కేటుగాళ్లకు వెళ్లిపోతుంది. కాంటాక్ట్ నంబర్లు, ఫోటోలు, వీడియోలు, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలే గాక డాక్యుమెంట్ ఫైళ్లు సైతం ఆ కేటుగాళ్లకు చేరిపోతాయి.
శుభాకాంక్షల పేరుతో ఫోన్లకు ఏపీకే ఫైల్స్, లింక్‌లు
ఒక్క క్లిక్‌తో బ్యాంకు ఖాతాలు ఖాళీ
అప్రమత్తతతో వ్యవహరించాలంటున్న పోలీసులు
అప్రమత్తంగా ఉండాలి
అపరిచిత వ్యక్తులు పంపించే ఏపీకే ఫైల్స్, లింక్ మెసేజ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేస్తారు. శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే నేరుగా చెప్పడం లేదంటే సందేశాన్ని పంపండి. వీలైతే వ్యక్తిగతంగా కలుసుకోవడం మంచిది. నూతన సంవత్సరాన్ని అందరూ ఆనందంగా జరుపుకోవాలి. సైబర్ వలలో మాత్రం చిక్కకుండా అప్రమత్తంగా ఉండండి. – కళా వెంకటరమణ,
తాలూకా సీఐ, మదనపల్లె
అపరిచితుల వ్యక్తుల నుంచి వచ్చే ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు.
ఫోన్‌లోని సెట్టింగ్‌లో ఇన్‌స్టాల్ ఫ్రమ్ అన్‌నోన్ సోర్సెస్ అనే ఆప్షన్‌ను డిజేబుల్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకు తెలియకుండా యాప్స్ ఇన్‌స్టాల్ కాకుండా ఉంటాయి.
మొబైల్ సెట్టింగ్‌లో ఫోన్ నెంబర్లను యాక్సెస్ చేసే అనుమతి ఇవ్వరాదు.
తెలియని ఏపీకే ఫైల్స్, మాల్‌వేర్ ఇన్‌స్టాల్ అయితే ఫోన్‌లో రీసెట్ ఆప్షన్ కొట్టాలి.
ఈ–మెయిల్స్, టెక్ట్స్ ఇతర సోషల్‌మీడియా యాప్‌ల ద్వారా నకిలీ లింక్స్‌ను గుర్తించాలి. వాటిపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయరాదు.
గివ్‌అవేస్ పోటీల ద్వారా వినియోగదారులను ట్రాప్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని దోచేస్తారు. మన వివరాలను సేకరించి డార్క్‌వెబ్‌కు అమ్మేస్తారు.
మన మొబైల్ లేక ల్యాప్‌టాప్, కంప్యూటర్‌లలో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్, యాంటీ వైరస్ ప్రోగ్రామ్, అధికారిక యాప్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. ఎందుకంటే సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా సంబంధిత సంస్థలు ఎప్పటికప్పుడు తమ వ్యవస్థల్లో మార్పులు చేస్తుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment