క్యూ లైన్‌కి బై.. క్యూఆర్ కోడ్‌కి జై!
కడప కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారులకు కరెంటు బిల్లులు చెల్లించడం చాలా సులువు కానుంది. కరెంటు బిల్లులు చెల్లించేందుకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య క్యూ లైన్లలో నిలబడి, మన సమయాన్నంతా వృథా చేసుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(ఏపీఎస్‌పీడీసీఎల్) నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చింది. బిల్లుతోపాటు క్యూఆర్ కోడ్ ముద్రించి వినియోగదారులకు ఇవ్వనున్నారు. వినియోగదారులు తమ యూపీఐ యాప్‌లైన ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా విద్యుత్ బిల్లులను అతి సులువుగా చెల్లించేందుకు అవకాశం కల్పించారు. కడప డివిజన్‌లో జనవరి మాసం నుంచి దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇక్కడ ఈ ప్రక్రియ విజయవంతమైతే జిల్లావ్యాప్తంగా అమలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
● గతంలో ఫోన్‌పే, గూగుల్ పే, పే టీఎం ద్వారా కరెంటు బిల్లులు చెల్లించేవారు. కొన్ని సాంకేతిక కారణాలతో ఆ యాప్‌లలోంచి ఏపీఎస్పీడీసీఎల్‌ను తొలగించారు. ఫలితంగా వినియోగదారులు మళ్లీ విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రాలకు క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఏపీఎస్‌పీడీసీఎల్ అధికారులు ప్రతి కరెంటు బిల్లుకు క్యూఆర్ కోడ్ కేటాయించి దాని ద్వారా ఎవరి ఇంటికి వచ్చిన కరెంటు బిల్లును వారే చెల్లించుకునేలా ఏర్పాట్లు చేశారు. చాలా ప్రైవేటు సంస్థల్లో ఈ క్యూఆర్ కోడ్ ద్వారా నగదు చెల్లించే ప్రక్రియ అమలవుతుండగా, ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీఎస్‌పీడీసీఎల్‌లో ఈ విధానాన్ని తొలిసారి తీసుకువచ్చారు. ఇందులోని లోటుపాట్లు అన్నీ సరిచేశాక జిల్లా వ్యాప్తంగా అమలు చేయనున్నారు.
● ఏపీఎస్‌పీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్‌లో కడప డివిజన్‌లో కడప, చెన్నూరు, వల్లూరు, సీకేదిన్నె, పెండ్లిమర్రి, ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలు ఉన్నాయి. ఇందులో 36 సబ్‌స్టేషన్లు ఉన్నాయి. కడప డివిజన్‌లో మొత్తం 1.90లక్షల కనెక్షన్లు ఉండగా, 1.69లక్షల మంది గృహ వినియోగదారులు, 23,793 వాణిజ్య పరమైన కనెక్షన్లు ఉన్నాయి. జనవరి మాసం నుంచి వీరందరికీ కరెంటు బిల్లుతోపాటు క్యూఆర్ కోడ్ ప్రింట్ చేసి ఇవ్వనున్నారు. దాన్ని స్కాన్ చేసి ఎవరికి వారు కరెంటు బిల్లును సులువుగా చెల్లించవచ్చు.
బిల్లులు చెల్లించడానికి క్యూలైన్లలో నిల్చోవాల్సిన పనిలేదు
ఈ నెల బిల్లుతోపాటే క్యూఆర్ కోడ్
ఫోన్‌పే, పేటీఎం, జీ పే ద్వారా స్కాన్‌న్‌చేసి చెల్లించేందుకు అవకాశం
కడప డివిజన్‌లోప్రయోగాత్మకంగా అమలు
క్యూఆర్ కోడ్‌తో కరెంటు బిల్లులు చెల్లించండి
ఈఈ గంగాధరం
మదనపల్లె: ఏపీఎస్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారులు జనవరి నెలకు సంబంధించిన విద్యుత్‌బిల్లులను, బిల్లులో ముద్రించిన క్యూఆర్ కోడ్ ఆధారంగా చెల్లించవచ్చునని ఈఈ గంగాధరం అన్నారు. బుధవారం మీడియాకు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో... జనవరిలో విద్యుత్ మీటర్ల రీడింగ్‌కు సంబంధించి జారీ చేసే బిల్లుల్లో నూతనంగా క్యూఆర్ కోడ్ ముద్రించడం జరుగుతోందన్నారు. వినియోగదారులు తమ మొబైల్‌ఫోన్లలో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా సులభంగా విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చన్నారు. వినియోగదారులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment