●ఒంటిమిట్ట రామాలయానికి పోటెత్తిన భక్తులు
పాత దోస్తుల నయాసాల్ ముచ్చట్లతో..
కొత్త దుస్తుల్లో మెరిసిపోతూ..
కేరింతలు కొట్టే పిల్లల చప్పట్లతో..
తొలిరోజు సంబరంగా సాగింది...
నోరూరించే కేకులతో..
రోజంతా సోకులతో..
తొలిరోజు సరదాగా ముగిసింది...
మందిరాల్లో ప్రార్థనలతో..
మండపాల్లో ప్రత్యేక పూజలతో...
దైవ దర్శనాలతో..
ఆద్యంతం ఆధ్యాత్మికంగా గడిచింది..
అన్నదానాలతో.. ఆత్మీయ సన్మానాలతో...
అభాగ్యులకు ప్రేమతో పంచిన ఫలహారాలతో సామాజిక సేవ వెల్లివెరిసింది..
కిస్సిక్కు పాటలతో.. కిర్రాక్కు స్టెప్పులతో.. ఉత్సాహం ఉరకలెత్తింది..
నూతన సంవత్సరానికి జిల్లా ప్రజలు
ఘనంగా స్వాగతం పలికారు. అందరికీ
మంచి జరగాలని ఆకాంక్షించారు.
ఒంటిమిట్ట: ఆంధ్రా భద్రాద్రిగా పేరు గాంచిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయానికి నూతన సంవత్సరం సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. భక్తుల కోసం తిరుమల–తిరుపతి దేవస్థానం వారు బాలాలయం వద్ద ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. రామాలయం లోపల ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడింది. తిరుమల–తిరుపతి దేవస్థానం వారు భక్తులకోసం రుచికరమైన నైవేద్య ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ ప్రసాదం కోసం భక్తులు పొడవాటి క్యూలైన్‌లో బారులు తీరారు. అలాగే రామాలయం ఎదురుగా ఉన్న అన్న ప్రసాద కేంద్రానికి భక్తులు పోటెత్తారు.
దేవునికడపలో..
తిరుమలేశుని తొలి గడప దేవునికడపలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బుధవారం దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా కనిపించింది. ఆలయ ని ర్వాహకులు భక్తుల రద్దీని నియంత్రించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అందరికీ తిరుమలేశుని లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంచారు.
చర్చిలు, దర్గాలలో..
జిల్లాలోని మదనపల్లె, రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి, తంబళ్లపల్లె, పీలేరు తదితర ప్రాంతాల్లో అర్థరాత్రి నుంచి చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే పలు దర్గాలలో కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రార్థనలు జరిపారు.
సాక్షి, రాయచోటి: నూతన సంవత్సరానికి జిల్లా వాసులు ఘనంగా స్వాగతం పలికారు. విందులు, వినోదాలతో ఆనందంగా గడిపారు. జిల్లా అంతటా రూ. కోటి మేర కేకుల వ్యాపారం జరిగిందని, అదే స్థాయిలో రెస్టారెంట్లలోనూ వ్యాపారం జరిగిందని సమాచారం. పూలు, స్వీట్లకు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. స్వచ్ఛంద సంస్థలు తమ సభ్యులతో కలిసి కేక్ కట్‌చేసి కొత్త ఆశయాలతో, ఆదర్శంగా ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నారు.
● నూతన సంవత్సర వేడుకల్లో ప్రధానంగా కేకులకే ప్రథమ స్థానం దక్కింది. కార్పొరేట్ స్టైల్ కేకుల దుకాణాల్లో రూ. 2.50 లక్షల నుంచి 5 లక్షల మేర వ్యాపారం జరిగినట్లు సమాచారం. చిన్న దుకాణాలలో కూడా రూ. 50 వేల నుంచి లక్షన్నరకు పైగా వ్యాపారం జరిగిందని తెలుస్తోంది. కేకుల తర్వాత ప్రధానంగా యువత డిసెంబరు 31 రాత్రి రెస్టారెంట్లలో గడిపేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈసారి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా రెస్టారెంట్ల నుంచి ఆహారం తెప్పించుకునేందుకే మొగ్గు చూపారు. ఆన్‌లైన్ ద్వారా ఆహారం తెప్పించుకునే సౌకర్యం ఉండడం, రెండు రోజుల ముందునుంచి ఆఫర్ల గురించిన సమాచారం ప్రజలకు అందడంతో ఈ ఏడాది వ్యాపారం గణనీయంగా పెరిగింది.
● ఇవి కాకుండా పూలు, పుష్పగుచ్ఛాల వ్యాపారం ఓ మోస్తరుగానే జరిగినట్లు సమాచారం. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మరణంతో సంతాప దినాలు పాటిస్తుండడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు, బొకేలు, పండ్లు స్వీకరించేందుకు దూరంగా ఉంటామని ముందే ప్రకటించారు. దీంతో పూల వ్యాపారం ఆశించిన మేర లేకపోవడంతో వ్యాపారాలు మందగించినట్లు వారు పేర్కొన్నారు. స్వీట్ల వ్యాపారం కూడా జోరుగా సాగింది. ఆఫర్లతోపాటు పలు రకాల స్వీట్లను అందుబాటులోకి తెచ్చి ప్రత్యేకంగా పందిళ్లు వేసి ఆకర్శణీయంగా దుకాణాలను ఏర్పాటు చేయడంతో వీటి వ్యాపారం బాగానే సాగింది. మొత్తంపై జిల్లా అంతటా రూ. కోటి కేకుల వ్యాపారం, రెస్టారెంట్లలో రూ. కోటి మేరకు ఆహార పదార్థాల వ్యాపారం, రూ. 10 లక్షల మేరకు పూలు, అదేస్థాయిలో పండ్లు, స్వీట్ల వ్యాపారం జరిగినట్లు ఆయా వ్యాపార వర్గాల ద్వారా సమాచారం అందింది.
రూ. కోటి కేకులు హాం ఫట్
రెస్టారెంట్లకు మంచి వ్యాపారం
పూలు, స్వీట్లకు కూడా మంచి డిమాండ్
నగరంలో నూతన సంవత్సర సందడి
Comments
Please login to add a commentAdd a comment