సోమందేపల్లి : తక్కువ ధరకే మేలిమి బంగారాన్ని అందజేస్తామని నమ్మబలికి నకిలీ బంగారం అంటగట్టి డబ్బుతో ఉడాయించిన కేసులో పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి పోలీసు స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. అన్నమయ్య జిల్లాకు చెందిన రాణా కృష్ణబాబు, కర్ణాటకకు చెందిన శాంతరాజు, నయాజ్ అహమ్మద్, ఈరన్న, బాబు, అర్జున్, ఆనంద్‌బాబు, బంగారి, ఈడిగ హరిప్రసాద్ ఓ ముఠాగా ఏర్పడి నకిలీ బంగారం దందా చేపట్టారు. ఈ క్రమంలోనే నకిలీ బంగారపు పూసల దండలు సేకరించుకుని, అందులో కొన్ని మేలిమి బంగారం పూసలను చేర్చారు. అనంతరం కొనుగోలుదారులు పరీక్షించుకునే సమయంలో మేలిమి బంగారం పూసలను మాత్రమే చూపించేవారు. ఇటీవల అనంతపురం జిల్లా విడపనకల్లుకు చెందిన ఈశ్వరన్న, చిత్తూరు జిల్లా కుప్పం నివాసి ముని వెంకటేష్‌కు ముఠా సభ్యులు ఫోన్ చేసి మాట్లాడారు. తమకు తవ్వకాల్లో మేలిమి బంగారం లభ్యమైందని, తక్కువ ధరకే వాటిని విక్రయిస్తామని నమ్మబలికారు. వారి మాయలో చిక్కుకున్న ఇద్దరినీ ఈ నెల 9న సోమందేపల్లి బ్రాహ్మణపల్లి వద్దకు రప్పించుకున్నారు. తొలుత ఈశ్వరన్న వద్ద రూ.8 లక్షలు తీసుకున్నారు. అనంతరం ముని వెంకటేష్ వద్ద రూ.13 లక్షలు తీసుకుని ఇద్దరికీ నకిలీ బంగారం పూసల దండలు చేతిలో పెట్టి గుట్టుచప్పుడు కాకుండా ఉడాయించారు. కాసేపటి తర్వాత వాటిని పరిశీలించుకున్న ఈశ్వరన్న, ముని వెంకటేష్ అవి నకిలీవని నిర్ధారించుకుని వెంటనే సీఐ రాఘవన్‌కు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్‌ఐ రమేష్‌బాబు బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలింపు చేపట్టి బుధవారం పక్కా ఆధారాలతో మొత్తం పది మందినీ అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.21 లక్షలతో పాటు ఐదు సెల్‌ఫోన్లు, ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇదే కేసులో మరికొందరు పరారీలో ఉన్నారని, త్వరలో వారిని కూడా అరెస్ట్ చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. తక్కువ మొత్తానికి బంగారం ఇస్తామని ఫోన్లు చేసి ఆశ చూపితే ఆకర్షణకు గురి కావద్దని ప్రజలకు సూచించారు.
రూ.21 లక్షలు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment