ప్రార్థనల కోసం చర్చికి వెళ్తండగా దుర్ఘటన
మరో మహిళ పరిస్థితి విషమం
మార్టూరు జాతీయ రహదారిపై ఘటన
భీతావహంగా మారిన ప్రమాద స్థలం
మార్టూరు: నూతన సంవత్సరంలో అంతా మంచే జరగాలని, తమకు కలిసి వచ్చిన చర్చికి వెళ్తుండగా లారీ రూపంలో మృత్యువు ఎదురొచ్చింది. దీంతో తోడల్లుళ్లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాదకర ఘటన మండలంలోని తాతపూడి, డేగరమూడి గ్రామాల మధ్య రహదారిపై సోమవారం జరిగింది. మార్టూరు ఏఎస్‌ఐ మహబూబ్ బాషా వివరాల మేరకు.. మార్టూరు మండలం బొల్లాపల్లి గ్రామానికి చెందిన పల్లపు గోపి (29), విజయనగరం జిల్లాకు చెందిన నాగలక్ష్మిని ఏడాది కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నాగలక్ష్మి అక్క ఉమకి పదేళ్ల కిందట విజయనగరం జిల్లా బాడంగి మండలం పీ వెంకంపేట గ్రామానికి చెందిన కొల్లు రాము (32)తో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అక్కాచెల్లెళ్ల రెండు కుటుంబాలు గత కొన్నేళ్లుగా విజయవాడలోని వాంబే కాలనీలో నివాసం ఉంటూ గ్రానైట్ సంబంధిత పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
తమకు కలిసి వచ్చిన చర్చికి వెళ్తూ..
మృతుడు పల్లపు గోపి మార్టూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో అతనికి గతంలో అద్దంకి మండలం రెడ్డిపాలెం గ్రామంలోని చర్చికి ప్రార్థనల నిమిత్తం వెళ్లే అలవాటు ఉంది. ఈ క్రమంలో నూతన సంవత్సర వేళ ప్రార్థనల కోసం మొత్తం ఎనిమిది మంది బంధువులు కలిసి నాలుగు బైకుల్లో విజయవాడ నుంచి రెడ్డిపాలెం చర్చికి బయలుదేరారు. ఒక బైకుపై రాము అతని భార్య ఉమ, తోడల్లుడు గోపి వెళ్తున్నారు. మరో బైకుపై గోపి భార్య నాగలక్ష్మి తన తమ్ముడితో ప్రయాణిస్తోంది. ఈక్రమంలో తాతపూడి, డేగరమూడి గ్రామాల మధ్య రహదారిపై ముందు వెళ్తున్న లారీని దాటే క్రమంలో రాము బైకు ప్రమాదవశాత్తు లారీ కింద పడిపోయింది. ప్రమాద తీవ్రతకు రాము తలపగిలింది. మెదడు రహదారిపై చెల్లాచెదురుగా పడటంతో వాతావరణం అంతా భీతావహంగా మారింది.
గోపి సైతం తీవ్రగాయాలతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తల పగిలి ముక్కు చెవుల నుంచి తీవ్ర రక్తస్రావం అవుతూ ఫిట్స్‌తో ఉన్న రాము, భార్య ఉమను స్థానికుల సమాచారంతో చిలకలూరిపేట 108 సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఉమ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు ఆమెను అదే వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న మార్టూరు పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం హైవే సిబ్బంది సహాయంతో ట్రాఫిక్ క్లియర్ చేశారు. మృతుడు గోపి భార్య నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రెండు బైకులు ఢీ : ఒకరు మృతి
అద్దంకి: రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటన మండలంలోని నాగులపాడు రోడ్డులో బుధవారం తెల్లవారుజామున జరిగింది. నాగులపాడు గ్రామానికి చెందిన బాపయ్య చౌదరి బైక్‌పై అద్దంకి నుంచి గ్రామానికి వెళ్తున్నాడు. ఈ సమయంలో అద్దంకిలోని గరటయ్య కాలనీకి చెందిన బిక్కి అజయ్ (40) బైక్‌పై నాగులపాడు వైపు నుంచి అద్దంకికి వస్తున్నాడు. ఈ క్రమంలో రెండు బైకులు నాగులపాడులోని ఎస్సీ శ్మశానవాటిక వద్ద ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో అజయ్‌కు తీవ్రగాయాలు అవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన బాపయ్యను మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. మృతుడు అజయ్ కారు డ్రైవర్‌గా పని చేస్తుంటాడు.
Comments
Please login to add a commentAdd a comment