చేబ్రోలు: కొత్త సంవత్సరం రోజున కూటమి ప్రభుత్వం చిరుద్యోగులపై ప్రతాపం చూపింది. సర్కార్ తీరుపై బాధితులు నిరసన వ్యక్తం చేసిన సంఘటన చేబ్రోలులో బుధవారం జరిగింది. చేబ్రోలు మేజర్ గ్రామ పంచాయతీలో 20 సంవత్సరాలుగా కార్మికులుగా పనిచేస్తున్న వారిలో 12 మందిని బుధవారం నుంచి విధుల్లోకి రావద్దని పంచాయతీ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరు గ్రీన్ అంబాసిడర్స్, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, నైట్ వాచ్‌మెన్, వాటర్ వర్కర్‌గా పనిచేస్తున్న మొత్తం 12 మంది టెండర్ వర్కర్స్‌కు ఉద్వాసన పలుకుతూ ఆదేశాలు ఇచ్చారు. కార్మికులు ఉదయం 6 గంటల నుంచి విధులకు వెళ్లకుండా చేబ్రోలు మెయిన్ రోడ్డులోని లైబ్రరీ సెంటర్‌లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహసీల్దారు కె. శ్రీనివాసశర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. కార్మికులను చట్ట విరుద్ధంగా పనుల నుంచి తొలగించటం అన్యాయమన్నారు. వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment