పింఛన్ల పంపిణీలో అవినీతికి పాల్పడితే చర్యలు
కలెక్టర్ జె.వెంకట మురళి
బాపట్ల: పింఛన్ల పంపిణీలో అవినీతికి పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం వికలాంగుల పెన్షన్ల పంపిణీపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో యద్దనపూడి మండలం పూనూరులో వికలాంగుల పెన్షన్‌లపై జరిగిన సర్వేపై ఆరా తీశారు. జిల్లాలో ప్రతినెలా పింఛన్ల కింద రూ. 95 కోట్లు విడుదల అవుతున్నాయని తెలిపారు. పూనూరులో జరిగిన సర్వే మాదిరిగా జిల్లా మొత్తం సర్వే జరిపితే సుమారు 18 శాతం పింఛన్లు తగ్గుతాయన్నారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీపై ఆరా తీశారు.జిల్లాలో పింఛన్ల పంపిణీలో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని 13 శాతం మంది తెలిపారన్నారు. తొమ్మిది శాతం మంది ఇంటి వద్ద పెన్షన్లు ఇవ్వడం లేదని, 11 శాతం మంది పింఛన్ అందించిన అధికారి ప్రవర్తన బాగోలేదని తెలిపారని పేరొన్నారు. మండల ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు వారి మండలాలలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో సమావేశాలు ఏర్పాటు చేసి అవినీతికి పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, జిల్లా కోఆర్డినేటర్, ఆసుపత్రిల సేవా అధికారి శేషకుమార్, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి పాల్గొన్నారు.
ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకు స్వస్తి పలుకుదాం
పర్యావరణానికి హానిచేసే క్యారీ బ్యాగులు విడనాడి, గుడ్డ సంచులు వాడటాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని జిల్లాకలెక్టర్ కె.వెంకట మురళి పిలుపునిచ్చారు. గుడ్డ సంచులతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదామని ఆయన తెలిపారు. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో గురువారం గుడ్డ సంచుల ఉచిత పంపిణీని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, ఫ్రెండ్స్ సంస్థ నిర్వాహకులు నాళం శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు పంపిణీ నిమిత్తం 400 సంచులను పురపాలక సంఘానికి అందజేస్తున్నట్లు ఫోరం కార్యదర్శి పి.సి. సాయిబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment