ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లను బయటపెట్టాలనే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆయా వివరాలను వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది. దాంతో భారతీయ స్టేట్ బ్యాంక్ సమర్పించిన డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచింది. మొత్తం 763 పేజీలతో ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో వివరాలను అప్‌లోడ్ చేసింది. అయితే ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన కొన్ని సంస్థలపై గతంలో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేశాయని పలువురు గుర్తు చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు అత్యధిక విరాళాలిచ్చిన టాప్ 30 కంపెనీల్లో 15 కంపెనీలకుపైగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ, ఇన్‌కమ్ ట్యాక్స్ (ఐటీ)వంటి సంస్థల దర్యాప్తు ఎదుర్కొన్నవే కావడం గమనార్హం.
ఈ వ్యవహారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ప్రముఖ మీడియా సంస్థతో జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. విరాళాలకు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల దాడులకు సంబంధం ఉందంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు. ఈడీ కంపెనీలపై రైడ్ చేస్తేనే ఆత్మరక్షణ కోసం ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశారనుకోవడం ఊహాగానమే అవుతుందన్నారు. బాండ్లు కొనుగోలు చేసిన తర్వాత కూడా ఆయా సంస్థలపై దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఆ విరాళాలు మొత్తం భాజపాకే వెళ్లాయని చాలా మంది భావిస్తున్నారని, కొన్ని ప్రాంతీయ పార్టీలకు కూడా జమైనట్లు తెలిపారు.
ఎన్నికల బాండ్లకు సంబంధించి సమగ్ర సమాచారంతో పూర్తి వివరాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించించింది కదా అని ప్రస్తావించగా ప్రస్తుతం ఆ అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. తనకంటే ముందు ఆర్థిక మంత్రిగా పనిచేసిన అరుణ్‌జైట్లీ మునుపటి కంటే మెరుగైనదిగా భావించి ఈ ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌ను తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు కొనుగోలు చేసిన బాండ్లు నేరుగా రాజకీయ పార్టీల ఖాతాల్లోనే పడుతున్నాయన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ముందుకెళ్లాలన్నారు.
ఇదీ చదవండి: ఎన్నికల బాండ్లను భారీగా కొనుగోలు చేసిన కంపెనీలివే..
ఎలక్షన్ కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎన్నికల బాండ్ల విరాళాల్లో ఎక్కువ మొత్తం బీజేపీకి వెళ్లగా ఆ తర్వాతి స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తదితర పార్టీలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment