వాటర్ బేస్ కంపెనీ ఉద్యోగులపై టీడీపీ నేతల దాడి
16 మందికి గాయాలు
తమ అనుచరులకే ఉద్యోగాలివ్వాలని డిమాండ్
సోమిరెడ్డి ఒత్తిడితో ఫిర్యాదు చేసేందుకు జంకుతున్న యాజమాన్యం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేతల దురాగతాలు పెచ్చుమీరాయి. ఇప్పటివరకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడి ఆస్తుల్ని ధ్వంసం చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు పారిశ్రామిక రంగంపై కన్నేశారు. పరిశ్రమల యాజమాన్యాల నుంచి సొమ్ములు దండుకునేందుకు భయబ్రాంతుల్ని చేస్తున్నారు. తాజాగా.. టీపీ గూడూరు మండలం అనంతపురంలోని వాటర్ బేస్ కంపెనీ ఉద్యోగులపై టీడీపీ నేతలు దాడికి పాల్పడి 16 మందిని తీవ్రంగా గాయపరిచారు.
పథకం ప్రకారమే దాడి
జిల్లాలోని సముద్ర తీరం వెంబడి రొయ్యల ప్రాసెసింగ్, మేత తయారీ యూనిట్లు ఉన్నాయి. టీపీ గూడూరు మండలం అనంతపురం వద్ద ది వాటర్‌బేస్ లిమిటెడ్ కంపెనీని దశాబ్దం కిందట నెలకొల్పారు. రొయ్యల ఫీడ్ ఉత్పత్తి చేసే ఈ కంపెనీ ఏటా రూ.200 కోట్ల వరకు టర్నోవర్ చేస్తుంది. అందులో 200 మంది ఉద్యోగులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి 150 మంది వరకు రోజువారీ లేబర్‌గా పనిచేస్తున్నారు. ఆ కంపెనీపై టీడీపీ నేతల కన్ను పడింది. ప్రస్తుతం కంపెనీలో పనిచేసే డైలీ లేబర్ పోస్టులు తమ కార్యకర్తలు సూచించిన వారికే ఇవ్వాలనే డిమాండ్ తెరమీదకు తెచ్చారు.
10 రోజుల్లో ఆ కూలీలను తొలగించి తాము చెప్పిన వారినే పెట్టుకోవాలని బెదిరించారు. ప్రస్తుతం పనిచేస్తున్న లేబర్‌ను తొలగించేందుకు న్యాయపరమైన చిక్కులున్నాయని యాజమాన్యం కొంత సమయం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసి యాజమాన్యంపై ఒత్తిడి పెంచేందుకు గురువారం టీడీపీ మండల అధ్యక్షుడు సన్నారెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులకు స్కెచ్ వేశారు.
నిత్యం నెల్లూరు నుంచి అనంతపురం వద్ద ఉన్న కంపెనీకి ఉద్యోగులను తీసుకొచ్చే వాహనాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు వరకయపూడి వద్ద అడ్డుకుని అందులో ప్రయాణిస్తున్న ఉద్యోగులను కిందికి దించి కర్రలతో దాడి చేశారు. దాడిలో 16 మంది గాయపడ్డారు. కంపెనీ హెచ్‌ఆర్ హెడ్ ఉత్తమ్‌కుమార్‌కు తీవ్రగాయాలు కావడంతో ఆయనను చికిత్స కోసం నెల్లూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఉద్యోగుల ఆందోళన
ఉద్యోగులపై పథకం ప్రకారం టీడీపీ నేతలు దాడులకు తెగబడటంపై ఉద్యోగులు ఆందోళనకు దిగారు. టీడీపీ నాయకుల నుంచి రక్షణ కలి్పంచి న్యాయం చేయాలని కోరుతూ వరకయపూడి రచ్చబండ వద్ద ధర్నా నిర్వహించారు. కంపెనీ యాజమాన్యంపై ఉన్న అక్కసుతో ఉద్యోగులపై దాడులు చేయడం ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
16 మంది ఉద్యోగులకు గాయాలైనప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కంపెనీ యాజమాన్యం జంకుతోంది. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆ కంపెనీ యాజమాన్యాన్ని బెదిరింపులకు గురిచేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment