సాక్షి,మహబూబాబాద్: మిర్చి ఏరేందుకు కూలీలను తీసుకెళ్తున్న ఓ ట్రాక్టర్ ప్రమాదానికి గురికావడంతో 26 మంది కూలీలు గాయపడిన ఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. డ్రైవర్ ట్రాక్టర్‌ను అతివేగంగా నడపడంతో పాటు డెక్‌లో పాటలు పెట్టుకుని వింటూ డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ మండలం ఆమనగల్ గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన 30 మంది కూలీలు ఓ ట్రాక్టర్‌లో అదే గ్రామం పక్కన ఉన్న గుండాలగడ్డ తండాలో మిర్చి ఏరేందుకు బయలుదేరారు. మరోపది నిమిషాల్లో పొలానికి చేరుకుంటామనగా, ట్రాలీకి, ఇంజిన్‌కు మధ్య ఉండే లింక్ రాడ్ తెగిపోయింది.
ఈ విషయాన్ని గమనించకుండా డ్రైవర్ అలాగే ముందుకెళ్లిపోగా.. ట్రాలీ కొంత దూరం దూసుకెళ్లి రోడ్డుపై దిగబడి ఆగిపోయింది. ఈ కుదుపునకు ట్రాలీలోని కూలీలందరూ ఒకరిపై ఒకరు పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. రూరల్ ఎస్‌ఐ రమేశ్‌బాబు, పోలీసు సిబ్బందితో పాటు స్థానికుల సాయంతో క్షతగాత్రులను మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో 14 మంది కూలీలు తీవ్రంగా గాయపడగా.. మరో 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఇంజిన్‌పై కూర్చున్న నలుగురు కూలీలు క్షేమంగా బయటపడ్డారు. ఆరెపల్లి లక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. ఆరెపల్లి వసుమతికి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
చదవండి: విశాఖ కార్పొరేటర్ ఆకస్మిక మృతి
Comments
Please login to add a commentAdd a comment