దంపతులు నాగదుర్గ, సాత్విక (ఫైల్)
తుని రూరల్: ఆనందమయ జీవనం.. అన్యోన్య దాంపత్యం.. హాయి హాయిగా సాగిపోతున్న పయనం.. ఇంతలో అనుకోని మలుపు వారి జీవితాన్నే మార్చేసింది.. ఆ దాంపత్య బంధాన్ని వీడదీసింది. దైవ దర్శనానికి దంపతులు వెళ్తుండగా లారీ మృత్యువు రూపంలో దూసుకొచ్చి భర్త మృతికి కారణమైంది. భార్య తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటన తుని మండలం ఎస్.అన్నవరం శివారు జగన్నాథగిరి జంక్షన్‌లో 16వ నంబరు జాతీయ రహదారిపై జరిగింది. తుని రూరల్ ఎస్సై వి.దేవుడు కథనం ప్రకారం.. ఉప్పాడ కొత్తపల్లి మండలం నాగులాపల్లికి చెందిన కొంతమంది కుటుంబ సభ్యులు లోవ దేవస్థానికి వ్యాన్‌లో బయలు దేరారు. ఇందులో దార్ల నాగదుర్గ (24), అతని భార్య సాత్వికతో కలసి మోటార్ సైకిల్‌పై పయనమయ్యారు.
చెట్టాపట్టాలేసుకుని సరదాగా వారు ముందుకు సాగారు. బీచ్ రోడ్డు నుంచి వచ్చిన వీరు తునిలో ఇటీవల కొత్తగా ప్రారంభించిన అండర్‌పాస్ వంతెన మీదుగా జగన్నాథగిరి జంక్షన్‌కు చేరుకున్నారు. అక్కడ బంధువుల వ్యాన్ వెళ్లిన తర్వాత మోటార్ సైకిల్‌పై ఆ దంపతులు హైవేను దాటుతుండగా, అన్నవరం వైపు నుంచి విశాఖ పట్నం వెళ్తున్న లారీ ఢీకొంది. దీంతో నాగదుర్గ రోడ్డుపై బలంగా పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సాత్విక లారీ టైరులో చిక్కుకోవడంతో కొంతదూరం ఈడ్చుకుపోయింది. దీంతో సాత్విక తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రురాలిని 108 అంబులెన్సులో తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. రూరల్ ఏఎస్సై వి.దేవుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగదుర్గ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అనంతరం బంధువులకు అప్పగించారు.
విషాదం నింపిన ప్రమాదం
ఉప్పాడ కొత్తపల్లి మండలం నాగులాపల్లి గ్రామానికి చెందిన దార్ల నాగదుర్గ వాకలపూడి వద్ద కోరమాండల్ ఫెర్టిలైజర్స్ కంపెనీలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. సంబంధం కుదరడంతో ఈ ఏడాది మే 10న పామగుంటకు చెందిన సాత్వికను వివాహం చేసుకున్నాడు. వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. కుటుంబ సభ్యులంతా సంతోషంగా దైవ దర్శనానికి బయలుదేరిన కొంత సేపటికే మృత్యుశకటంలా వచ్చిన లారీ ఆ కుటుంబంలో పెను విషాదాన్ని మిగిల్చింది.
నాగదుర్గ మృతితో పాటు అపస్మారక స్థితిలో ఉన్న సాత్మికను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. నాగదుర్గ, సాత్వికల కుటుంబ సభ్యులు, ఆయా గ్రామస్తులు ఆస్పత్రికి చేరుకోవడంతో ఆ ప్రాంగణంలో విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment