ఉచితంగా దోచేస్తున్నారు
●
● ట్రాక్టర్‌కు రూ.1,000, లారీకి
రూ.6,500 వరకూ వసూళ్లు
● లారీ ఇసుకకు రూ.5 వేలు పైగా అ‘ధనం
● కాంట్రాక్టర్లకు రూ.లక్షలు
● ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్న అధికారులు
పెరవలి: ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఉచిత ఇసుక విధానం కాంట్రాక్టర్లకు కాసులు కురిపిస్తోంది. లారీ (20 టన్నులు) ఇసుకను గుట్టల వద్దే రూ.6,500కు యథేచ్ఛగా అమ్ముకుంటున్నా అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. నిడదవోలు నియోజకవర్గంలోని కానూరు – పెండ్యాల, పందలపర్రు, తీపర్రు ఇసుక ర్యాంపుల్లో అధికారుల కళ్లెదుటే ఈ వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ఫలితంగా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు, క్షేత్ర స్థాయిలో జరుగుతున్న వసూళ్లకు పొంతన లేకుండా పోతోంది.
దోపిడీ సాగుతోందిలా..
● జిల్లాలో ఇసుక లభ్యత ఉన్న 17 ఓపెన్ రీచ్‌లను అధికారులు గుర్తించి, టెండర్లు పిలిచి తక్కువకు కోట్ చేసిన కాంట్రాక్టర్లకు వాటని అప్పగించారు. ఇసుక పూర్తిగా ఉచితం కాగా, తవ్వకానికి ఒక్కో రీచ్‌లో ఒక్కోవిధంగా ధరలు నిర్ణయించారు.
● దీని ప్రకారం టన్ను ఇసుక తవ్వకానికి కానూరు – పెండ్యాల ర్యాంపులో రూ.68.96, తీపర్రు–2లో రూ.96.02, జీడిగుంటలో రూ.81.32 చొప్పున కొనుగోలుదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కల ప్రకారం లారీ (20 టన్నులు) ఇసుకకు కానూరు – పెండ్యాల ర్యాంపులో రూ.1,380, తీపర్రులో రూ.1,921 మాత్రమే వసూలు చేయాలి.
● కానీ, ఆయా ర్యాంపుల్లో 20 టన్నుల లారీకి రూ.6,500 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ విధంగా ఒక్క కానూరు – పెండ్యాల రీచ్‌లోనే 20 టన్నులకు రూ.5,120 అదనంగా గుంజుతున్నారు. ట్రాక్టర్ (4 టన్నులు) ఇసుకకు రూ.275.84 మాత్రమే చెల్లించాల్సి ఉండగా ఏకంగా రూ.రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు.
● కానూరు – పెండ్యాల ర్యాంపులో ఉదయం నుంచి సాయంత్రం వరకూ 250 నుంచి 300 లారీలు, 150 వరకూ ట్రాక్టర్లపై ఇసుక ఎగుమతులు జరుగుతున్నాయి. ఒక్కో లారీకి అదనంగా రూ.5,120 చొప్పున 250 లారీలకు రూ.12.80 లక్షలు, 150 ట్రాక్టర్ల ద్వారా సుమారు రూ.1.09 లక్షలు కలిపి సుమారు రూ.13.90 లక్షలు కాంట్రాక్టర్ జేబుల్లోకి వెళ్లిపోతోంది. పందలపర్రు ర్యాంప్‌లో 150 నుంచి 200 లారీలు, 100 ట్రాక్టర్లతో ప్రతి రోజూ ఇసుక ఎగుమతులు జరుగుతూండగా ఇక్కడ కాంట్రాక్టర్‌కు రూ.8 లక్షల వరకూ అదనంగా వస్తోంది. తీపర్రు ర్యాంపు ఎప్పుడు తెరుస్తారో, ఎప్పుడు మూసివేస్తారో తెలియని పరిస్థితి. దీంతో కానూరు – పెండ్యాల, తీపర్రు ర్యాంపుల నుంచి భారీగా ఇసుక ఎగుమతులు జరుగుతున్నాయి.
● మరోవైపు నదీగర్భం నుంచి ఇసుక తీసుకువస్తున్న ట్రాక్టర్లకు, ఎగుమతి కూలీలకు అతి తక్కువగా చెల్లిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ రెక్కలు ముక్కలు చేసుకుంటే రూ.500 నుంచి రూ.700 వరకూ మాత్రమే వస్తోందని కూలీలు వాపోతున్నారు.
ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదు
ప్రభుత్వం చెప్పిన ధరలకు ఇసుక పాయింట్ల వద్ద ఎగుమతి చేయటం లేదు. ఒక్కో లారీకి అదనంగా రూ.5 వేలు తీసుకుంటున్నారు. ఇవ్వబోమని అంటే ఇసుక ఎగుమతి చేయటం లేదు. ఇంత దారుణం ఎక్కడా, ఎప్పుడూ చూడలేదు.
– ఆర్.సత్యనారాయణ, లారీ డ్రైవర్, భీమవరం
నిలువు దోపిడీ చేస్తున్నారు
కాంట్రాక్టర్ మనుషులు అడిగిన సొమ్ము చెల్లించకపోతే ఇసుక ఇవ్వడం లేదు. రోజంతా ఇసుక కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఎంత ఎక్కువ సొమ్ము ఇస్తే అంత ముందుగా లోడ్ చేస్తున్నారు. ఇసుక కోసం ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నిలువుదోపిడీ చేస్తున్నారు.
– వి.సుబ్బారావు, లారీ డ్రైవర్, తాడేపల్లిగూడెం
Comments
Please login to add a commentAdd a comment