ఉక్రెయిన్‌లో యుద్ధం భారత విదేశీ విధానంపై రెండు ప్రశ్నలు లేవనెత్తింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితిలో చేసిన తీర్మానాలపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరు అయింది. అమెరికా వైఖరిని తోసిరాజని రష్యా నుంచి ముడిచమురు కొనాలని భారత్ నిర్ణయం తీసుకుంది. ఇది భారత్ స్వతంత్ర విదేశీ విధానాన్నీ, దాని వ్యూహాత్మక స్వయంప్రతిపత్తినీ సూచిస్తుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఉక్రెయిన్‌పై సైనిక దాడి విషయంలో తన వైఖరిని అమెరికా పలు సందర్భాల్లో వెల్లడిస్తూనే ఉంది. భారత్ అన్ని సందర్భాల్లోనూ అమెరికాకు నచ్చజెబుతూనే ఉంది. అమెరికాతో రక్షణరంగంలో పొత్తు కొనసాగుతున్నంతవరకూ భారత్ తనదైన స్వతంత్ర విదేశీ విధానాన్ని అవలంబించే ఆస్కారమే లేదని గ్రహించాలి.
ఉక్రెయిన్‌లో సైనిక ఘర్షణలకు సంబంధించి మోదీ ప్రభుత్వం తీసుకున్న వైఖరిని పరిశీలిస్తే అమెరికాకు ఆధీనురాలైన మిత్రదేశంగా భారతదేశం ఉందని భావించడం తప్పవుతుందని కొంతమంది వాదిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితిలో చేసిన తీర్మానాలపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరు అయింది. రష్యా నుంచి ఏ దేశం కూడా చమురు, సహజ వాయువును కొన కూడదన్న అమెరికా వైఖరిని తోసిరాజని రష్యా నుంచి ముడిచమురు కొనాలని భారత్ నిర్ణయం తీసుకుంది. ఇది భారత్ స్వతంత్ర విదేశీ విధానాన్నీ, దాని వ్యూహాత్మక స్వయంప్రతిపత్తినీ సూచిస్తుందని వీరు చెబుతున్నారు.
ఇది పరిస్థితిని కృత్రిమంగా అంచనా వేయడమే తప్ప మరేమీ కాదు. భారత్ ఒకటిన్నర దశాబ్దం క్రితం అమెరికాతో వ్యూహాత్మక పొత్తు కుదుర్చుకుంది. రక్షణ సహకార ఒప్పందం దీంట్లో కీలకమైనది. మోదీ ప్రభుత్వ హయాంలో 2016లో లాజిస్టిక్స్ అగ్రిమెంట్స్ (లెమోవా), 2018లో సమ్మిళిత కమ్యూనికేషన్ నెట్‌వర్క్ (కోమ్‌కాసా), 2020లో బేసిక్ ఎక్స్‌చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ (బెకా) అనే మూడు మౌలిక ఒప్పందాలను అమెరికాతో కుదుర్చుకున్నారు. అమెరికా తన అత్యంత సన్నిహిత మిత్ర దేశాలతో సైనిక ఒప్పందాలు కుదుర్చుకోవడంతో ఇవి సమానం.
అలాగే జపాన్, ఆస్ట్రేలియాలతో అమెరికా కుదుర్చుకున్న ఇండో–పసిఫిక్ వ్యూహంలో భాగమైన క్వాడ్ దేశాల కూటమిలో భారత్ కూడా భాగమైంది. 2020 జూన్‌లో లదాఖ్‌లో వాస్తవాధీన రేఖ వద్ద చోటుచేసుకున్న ఘర్షణలకంటే ముందుగానే క్వాడ్ కూటమిలో భారత్ చేరిందని గుర్తుంచుకోవాలి. అలాగే భారత్, అమెరికా రెండు దేశాల మధ్య రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖలతో కూడిన 2+2 మంత్రిత్వ చర్చల వేదిక కూడా 2018 సెప్టెంబర్‌లో ఏర్పడి రెగ్యు లర్‌గా సమావేశాలు జరుపుకొంటున్న విషయమూ తెలిసిందే.
అమెరికాతో ఈ విధమైన సామీప్యత పెరుగుతూ వస్తున్న పరిస్థి తుల మధ్యనే ఉక్రెయిన్‌పై భారత్ వైఖరిని చూడాలి. నాటో కూటమి వెలుపల తన ప్రధాన పొత్తుదారైన భారత్... రష్యా వ్యతిరేక బృందంలో చేరనందుకు అమెరికా సంతోషంగా అయితే లేదు. క్వాడ్ భాగస్వాములైన ఆస్ట్రేలియా, జపాన్ తనతో పూర్తిగా ఏకీభవిస్తున్నప్పటికీ భారత్ మాత్రం కాస్త తేడాగా ఉంటోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. అందుకే అమెరికా, యూరోపియన్ యూనియన్‌లు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా విధించిన ఆంక్షలను భారత్ కూడా పాటించాలంటూ అమెరికా ఒత్తిడి పెంచుతోంది. ప్రత్యేకించి చమురు వాణిజ్యం కోసం రూపీ–రూబుల్ మార్పిడిని భారత్, రష్యా అమలు చేస్తాయని వస్తున్న వార్తల పట్ల అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అమెరికా జాతీయ భద్రత డిప్యూటీ సెక్రటరీ దిలీప్ సింగ్ ఢిల్లీని సందర్శించి రష్యాకు వ్యతిరేకంగా ఆంక్షలను ధిక్కరించడానికి భారత్ ఎలాంటి ప్రయత్నాలు చేసినా పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ అమెరికా వైఖరిని వివరించి వెళ్లారు. అయితే యూరో పియన్ దేశాలు ఇప్పటికీ భారీ మొత్తంలో రష్యా నుంచి చమురు, సహజవాయువును కొంటూనే ఉన్నాయని భారత్ గుర్తు చేసింది. ఏప్రిల్ 12న భారత్, అమెరికా మధ్య 2+2 మంత్రుల సమావేశం జరగడానికి కొద్ది గంటల ముందు మోదీతో బైడెన్ వర్చువల్ భేటీలో పాల్గొంటూ, రష్యా నుంచి మరింతగా చమురు దిగుమతి చేసుకోవడం భారత్‌కు ప్రయోజనకరం కాదని మరోసారి చెప్పారు.
భారత రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రులు వాషింగ్టన్ సందర్శించినప్పుడు భారత్‌ను ఒత్తిడికి గురిచేయడానికి అమెరికా చేసిన ప్రయత్నాలను కూడా ఈ కోణంలోనే చూడాలి. భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ మధ్య జరిగిన భేటీలో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని ముందుకు తీసుకుపోవడంపై అవలంబించాల్సిన మార్గాల గురించి చర్చించారు. రెండు దేశాల రక్షణ పరిశ్రమల మధ్య సన్నిహిత సహకారం ఉంటుందని ఈ భేటీ తర్వాత ఇరుదేశాల మంత్రులు చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రష్యన్ మిలటరీ సరఫరాలు, విడి భాగాలపై ఆధారపడటాన్ని అర్థం చేసుకోవాలని భారత్ అభ్యర్థించగా, ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని అమెరికన్ ఆయుధాలను, రక్షణ సామగ్రిని మరింతగా భారత్ కొనుగోలు చేయాలని అమెరికా ప్రతిపాదించింది.
ఇరుదేశాల మధ్య 2+2 మంత్రిత్వ స్థాయి చర్చల తర్వాత అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ, రష్యా నుంచి ఎస్–400 మిస్సైల్ సిస్టమ్‌ను కొనుగోలు చేసినందుకు భారత్‌పై ఆంక్షలు విధించడం గురించి ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. అయితే లాజిస్టిక్స్ ఒప్పందం మేరకు భారత్ యుద్ధ ఓడ లకు సంబంధించి నిర్వహణ, మరమ్మతు, ఓవర్ హాల్ ఫెసిలిటీని నెల కొల్పాలని కూడా అమెరికా భావిస్తోంది. కాబట్టి ఎరవేస్తూ కర్ర పెత్తనం చేసే విధానాన్ని అమెరికా కొనసాగిస్తోంది. రష్యా నుంచి సైనిక సామగ్రిని కొనుగోలు చేయడాన్ని భారత్ కొనసాగిస్తే ఆంక్షలు విధిస్తామని బెదిరిస్తూనే తన వద్ద నుంచి ఆయుధ వ్యవస్థలను కొను గోలు చేస్తే ప్రోత్సాహకాలు కూడా అందిస్తామని అమెరికా అన్యా పదేశంగా చెబుతూ వస్తోంది.
బైడెన్‌తో తన భేటీ సందర్భంగా అమెరికాకు నచ్చజెప్పడానికి మోదీ ప్రయత్నించారు. మనం సహజసిద్ధ భాగ స్వాములమనీ, గత కొన్ని సంవత్సరాలుగా ఇరుదేశాలూ ఎంతో పురోగతి సాధించాయనీ, పదేళ్ల క్రితం ఇలాంటిది సాధ్యమవుతుందని ఊహించడానికి కూడా కష్టమయ్యేదనీ మోదీ చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ ఎపిసోడ్ జరుగు తున్నప్పటికీ, అమెరికాతో పొత్తు కొనసాగుతున్నందున భారత్ తనదైన స్వతంత్ర విదేశీ విధానాన్నీ, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తినీ అవలంబిస్తుందనటానికి ఎలాంటి ఆస్కారమూ లేదని దీన్నిబట్టి స్పష్టమవుతోంది.
పాశ్చాత్య సైనిక కూటమి నాటో అధినేతగా అమెరికాకు తన మిత్రదేశాలతో సందర్భానుసారం విభేదాలు పుట్టుకొస్తుంటాయి. ఉదాహరణకు టర్కీని చూద్దాం. సిరియా వంటి కీలక అంశాలపై అమెరికాకు వ్యతిరేక వైఖరిని టర్కీ చేపడుతుంటుంది. అమెరికా ఆకాంక్షలకు వ్యతిరేకంగా నోర్డ్ స్ట్రీమ్–2 గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణం చేపట్టే లక్ష్యంతో జర్మనీ ముందుకెళ్లింది. ఉక్రెయిన్‌పై రష్యన్ సైనిక దాడి ప్రారంభమయ్యాక ఈ ఒప్పందం ముగిసిపోయిందనుకోండి!
రష్యాతో భారత్ లింకును బలహీనపర్చడానికి అమెరికా తన వంతు ఒత్తిడిని కొనసాగిస్తూ ఉంటుంది. దీనికోసం అది చైనా కార్డును కూడా ప్రయోగిస్తుంది. సరిహద్దు సమస్యలో భారత్ వైపున అమెరికా నిలుస్తుందని అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్ పేర్కొన్నారు. మోదీ– బైడెన్ భేటీ తర్వాత చేసిన అధికారిక ప్రకటనలో, రష్యా–చైనా మధ్య అనుసంధానం భారత్‌పై ప్రభావం చూపుతుందని అమెరికా సన్నాయి నొక్కులు నొక్కింది. భారత్‌పై ఒత్తిడి పెట్టడానికి అమెరికా ఈ పద్ధ తులను అవలంబిస్తూనే ఉంటుంది. ఇండో–పసిఫిక్ వ్యూహానికి భారత్‌ని సన్నిహితం చేయడం, భారత్‌కు కీలక సైనిక సామగ్రిని అమ్మే ప్రధాన సరఫరాదారుగా తాను మారడమే అమెరికా ప్రధాన లక్ష్యం.
ఉక్రెయిన్ ఘర్షణపై రష్యాకు వ్యతిరేకంగా అమెరికా దూకుడు వైఖరి, ఇండో–పసిఫిక్ వ్యూహం రెండూ పరస్పర సంబంధంలో ఉంటున్నాయి. తన ప్రాభవం పతనమవుతున్న నేపథ్యంలో ప్రపంచాధిపత్యాన్ని ఎలాగోలా నిలుపుకోవడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో ఇవి రెండూ భాగం. అమెరికా అంతిమ లక్ష్యం చైనాయే కాబట్టి ఈ ప్రాజెక్టులో భారత్ పాత్ర కీలకం. ఉక్రెయిన్ ఘర్షణలో రష్యాతో ఎలా వ్యవహరించాలనే సమస్య ఉన్నప్పటికీ, భారత్‌ను తన విధేయ భాగస్వామిగా అమెరికా కొనసాగిస్తూనే ఉంటుంది. అమెరికా మొత్తం పథకంలో ఇది అతి చిన్న చికాకు మాత్రమే.
ప్రకాశ్ కారట్ ,వ్యాసకర్త సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment