సురక్షిత చెల్లింపులకు ‘డాక్ పే’
డిజిటల్ లావాదేవీలకు తపాలా శాఖ ప్రోత్సాహం
లక్ష్మీపురం: తపాలా శాఖ వినియోగదారుల కోసం ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేసుకునేందుకు డాక్ పే సురక్షిత యాప్‌గా మారింది. దాదాపు మూడేళ్ల క్రితం కేంద్రం దీనిని అందుబాటులోకి తెచ్చింది. ఈ డాక్ పే ద్వారా డిజిటల్ ఫైనాన్స్ సేవలు పొందడంతోపాటు ఇండియా పోస్టు, ఐపీపీబీ, బ్యాంకింగ్ సేవల విషయమై సాయం పొందవచ్చు. డబ్బు పంపడం, క్యూఆర్ కోడ్ స్కాన్, డిజిటల్ రూపంలో వ్యాపారులకు నగదు చెల్లించడం వంటి పనులను చక్కబెట్టుకోవచ్చు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో యూపీఐ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేలా చిరు వ్యాపారులు ఈ డాక్ పే ద్వారా వినియోగదారుల నుంచి డిజిటల్ చెల్లింపులు స్వీకరించవచ్చు. ఏ బ్యాంకు ఖాతా అయినా సరే అనుసంధానం చేసుకునే వెలుసుబాటు కల్పించారు. తాజాగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ప్రవేశ పెట్టిన వర్చువల్ డెబిట్ కార్డును వినియోగించి ఈ ● కామర్స్ వెబ్‌సైటులో ఆన్‌లైన్ క్రయ విక్రయాలు కూడా చేసుకోవచ్చు. దీని కోసం ఐపీపీబీ (ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు) మొబైల్ బ్యాకింగ్ యాప్‌ను ఖాతాదారులు తమ స్మార్డ్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. పెన్షనర్లు ప్రతి ఏడాది డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను రూ.70కే తమ ఇంటి వద్దగానీ, పోస్ట్ ఆఫీస్‌లోగానీ, పోస్ట్‌మాన్ ద్వారా గానీ పొందే సదుపాయం కూడా ఇటీవల ప్రవేశపెట్టింది.
తక్కువ ప్రీమియంతో బీమా....
ఖాతాదారుకు కేవలం రూ.330తో రూ.2 లక్షల బీమా సదుపాయం కూడా పీఎంజేజేబీవై (ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన) ద్వారా సంవత్సరం చెల్లుబాటయ్యేలా బీమా సదుపాయాన్ని కల్పిస్తారు. ఇప్పటి వరకు పలు యాప్‌లలో నగదు లావాదేవీలకు సంబంధించి సమస్యలు ఎదురైతే ఫిర్యాదు చేయడానికి కార్యాలయాలు, బ్రాంచ్‌లు ఎక్కడా లేవు. డాక్ పే యాప్ ద్వారా నగదు బదిలీ సమయంలో ఏ ఇబ్బంది వచ్చినా పరిష్కరించుకునేందుకు తపాలా శాఖ వెసులుబాటు కల్పించింది. వివరాలకు ఐపీపీబీ టోల్‌ఫ్రీ నంబర్ 155299ను వినియోగదారులు సంప్రదించవచ్చు.
సమస్యల పరిష్కారం బాధ్యత మాదే
ఇతర ఆన్‌లైన్ ఆర్థిక లావాదేవీల యాప్‌లకు ప్రత్యేకంగా కార్యాలయాలు, బ్రాంచ్‌లు లేవు. కానీ తపాలా శాఖ ప్రవేశ పెట్టిన డాక్ పే యాప్ ద్వారా నగదు బదిలీ సమయంలో అవకతవకలు జరిగినా, నగదు జమ కాకపోయినా, ఇతత సమస్యలెదురైనా పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంది. డాక్ పే అనే యాప్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తుంది.
– యలమందయ్య,
పోస్టల్ సూపరింటెండెంట్, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment