సార్‌..బందోబస్తులో ఉన్నారు.. | - | Sakshi
Sakshi News home page

సార్‌..బందోబస్తులో ఉన్నారు..

Published Mon, May 1 2023 7:12 AM | Last Updated on Mon, May 1 2023 7:37 AM

- - Sakshi

బంజారాహిల్స్‌: వరుస బందోబస్తుల నేపథ్యంలో బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదుదారులు, బాధితులకు ఉన్నతాధికారులు, ఎస్సైలు అందుబాటులో ఉండటం లేదు. ఫలితంగా పిటీషన్లు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. బాధితులకు సకాలంలో న్యాయం జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్టేషన్‌కు వస్తున్న పిటీషన్‌దారులకు సంబంధిత ఎస్సైలు బందోబస్తులో ఉన్నారనే సమాధానం వినిపిస్తుండటంతో ఉసూరుమంటూ తిరుగుముఖం పడుతున్నారు. వారం రోజుల వ్యవధిలో బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్ల నుంచి దాదాపు ఐదు రోజులు ఒక్కో స్టేషన్‌ నుంచి ఐదురుగు ఎస్సైలు బందోబస్తు విధులకు పరిమితమయ్యారు.

జోన్ల విభజన అనంతరం ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. వెస్ట్‌జోన్‌ పరిధిలో ప్రస్తుతం బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఎస్సార్‌నగర్‌, పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. గతంలో 13 పోలీస్‌ స్టేషన్లు ఉండగా 9 పోలీస్‌ స్టేషన్లను వేర్వేరు జోన్లలో కలిపారు. దీంతో ప్రగతిభవన్‌, సచివాలయం ప్రారంభం, అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ, వైఎస్సార్‌టీపీ కార్యాలయం, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, మినిస్టర్‌ క్వార్టర్స్‌, తెలంగాణ భవన్‌, రాజ్‌భవన్‌, రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ నివాసం ఇక్కడే ఉండటంతో ఈ ప్రాంతంలో ఎలాంటి ఘటన చోటు చేసుకున్నా ఈ నాలుగు పోలీస్‌ స్టేషన్ల నుంచి ఎస్సైలను బందోబస్తుకు వినియోగించాల్సి వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఐలు సైతం ఇటీవలి కాలంలో సమీప ఠాణాల పరిధిలో బందోబస్తుకు వెళ్లాల్సిన పరిస్థితి నెతకొంది. ఇక బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ఠాణాల నుంచి ఒక్కో ఎస్సైని వారం రోజులపాటు బందోబస్తుకు కేటాయిస్తున్నారు.

దీంతో ఆ ఎస్సై సెక్టార్‌ పరిధిలో ఒక్క పిటీషన్‌ కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఏ చిన్న ఘటన జరిగినా ఒక్కో పోలీస్‌ స్టేషన్‌నుంచి నలుగురు ఎస్సైలను పంపుతున్న ఘటనలు గతంలో ఎప్పుడూ లేవు. ఇటీవల కాలంలోనే ఠాణాలో ఎస్సై కూర్చీలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పేరుకు మాత్రం 10 మంది ఎస్సైలున్నా బందోబస్తుల కారణంగా కుర్చీల్లో కనీసం అడ్మిన్‌ ఎస్సై సైతం అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఈ వ్యవహారంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement