వినాయకనగర్‌లో వర్షానికి కొట్టుకుపోయిన చదును చేసిన మట్టి రోడ్డు
హైదరాబాద్: ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికి మూడుసార్లు జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్‌లోని వినాయకనగర్ బస్తీలోని చదును చేసిన మట్టి రోడ్డు వర్షానికి వచ్చిన వరద తాకిడికి కొట్టుకుపోయింది. వినాయనగర్ బస్తీలో వరద నీటి కాల్వ నిర్మించిన అనంతరం దానిపై సీసీ రోడ్డు వేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తలపెట్టారు. ఇందులో భాగంగా వారం రోజుల క్రితం ఇక్కడ మట్టితో రోడ్డును చదును చేసి సిద్ధంగా ఉన్నారు. ఇంతలోనే వర్షానికి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. రెండు రోజుల విరామం ఇచ్చి మళ్లీ రోడ్డును చదును చేశారు.
అదే రోజు రాత్రి భారీ వర్షం రావడంతో రోడ్డు కొట్టుకుపోయింది. గత మూడు రోజులుగా వర్షాలు రావడం లేదని భావించిన అధికారులు గురువారం రాత్రి రోడ్డును చదును చేసి సీసీ రోడ్డు వేసేందుకు పూర్తిగా ఏర్పాట్లు చేశారు. కాగా రాత్రి 10 గంటల సమయంలో ఒక్కసారిగా కుంభవృష్టిలా వానరావడంతో మరోసారి రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ఏం చేయాలో జీహెచ్‌ఎంసీ అధికారులకు, బస్తీవాసులకు తోచడం లేదు. వానలు పూర్తిగా ఆగిపోయిన తర్వాతే రోడ్డు పనులు మొదలు పెట్టాలని బస్తీవాసులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment