రెండోసారీ పోక్సో కేసు | - | Sakshi
Sakshi News home page

రెండోసారీ పోక్సో కేసు

Published Fri, Jan 12 2024 6:06 AM | Last Updated on Fri, Jan 12 2024 6:06 AM

 చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలింజిన్‌ను పరిశీలిస్తున్న అరుణ్‌కుమార్‌ జైన్‌   - Sakshi

చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలింజిన్‌ను పరిశీలిస్తున్న అరుణ్‌కుమార్‌ జైన్‌

జైలుకెళ్లొచ్చినా బుద్ధి మారలే

వెంగళరావునగర్‌: బాలికను కిడ్నాప్‌ చేసిన కేసులో ఒకసారి పోక్సో కేసు జైలుకు వెళ్లొచ్చాడు. బెయిల్‌పై బయటికి వచ్చి మళ్లీ అవే వెకిలి చేష్టలకు పాల్పడుతున్న వ్యక్తిపై మరో పోక్సోకేసు నమోదైంది. ఈ ఘటన మధురానగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రహమత్‌నగర్‌ డివిజన్‌ ఎస్‌పీఆర్‌హిల్స్‌లో నివసిస్తున్న కానిస్టేబుల్‌ కుమార్తెను గత ఏడాది సెప్టెంబర్‌లో ఆంజనేయులు, ఆయన భార్య రామేశ్వరి (రమ) కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. ఈ కేసు విషయంలో రామేశ్వరిపై కిడ్నాప్‌ కేసు, ఆంజనేయులుపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం వారిని పట్టుకుని బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితులు కొంతకాలం జైలుశిక్ష అనుభవించాక బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ నెల 10న సదరు బాలికను భరోసా సెంటర్‌కు కౌన్సెలింగ్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆ బాలిక మూడురోజులుగా ఆంజనేయులు, రామేశ్వరిలు తాను స్కూల్‌కు వెళ్లొచ్చే సమయంలో వెకిలి చేష్టలు చేస్తూ, ఫోన్‌ చేయాలని సైగలు చేస్తూ మానసికంగా హింసిస్తున్నట్టుగా అధికారులకు దృష్టికి తీసుకువచ్చింది. గురువారం మధురానగర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో మరోసారి ఆ దంపతులపై (ఆంజనేయులుపై పోక్సో) కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ శివకుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నాంపల్లి స్టేషన్‌ను పరిశీలించిన రైల్వే జీఎం

నాంపల్లి: దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ గురువారం నాంపల్లి రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. బుధవారం ఉదయం చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ నాంపల్లి రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్‌లోని ఫ్లాట్‌ఫారం–5 మీదకు చేరుకున్న ఆయన.. చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొట్టిన గోడను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం కోచింగ్‌ షెడ్‌లో మరమ్మతుల కోసం ఉంచిన ఎస్‌2, ఎస్‌3, ఎస్‌6 బోగీలను, ఐఓ షెడ్‌లో జరుగుతున్న పనులను, ట్రిప్‌ షెడ్‌ లో ఉన్న ఇంజిన్‌ను పరిశీలించారు. ఘటన తీరుపై రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన విధానాన్ని రైల్వే అధికారులు జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌కు వివరించారు. ఆయనతో డీఆర్‌ఎం బి.కె.జైన్‌, ఇతర శాఖలకు చెందిన పలువురు అధికారులు ఉన్నారు.

త్వరలో ‘అన్‌బ్రేకబుల్‌ స్పిరిట్‌’ పుస్తకావిష్కరణ: ఫరీదా రాజ్‌

లక్డీకాపూల్‌: మెదడు, వెన్నెముక, కంటి నరాలను దెబ్బతీసే దీర్ఘకాలిక వ్యాధి (మల్టీపుల్‌ స్క్లెరోసిస్‌)పై ‘అన్‌ బ్రేకబుల్‌ స్పిరిట్‌’ పేరుతో ఆంగ్ల పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు మల్టీపుల్‌ స్క్లెరోసిస్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌ చాప్టర్‌ (ఎంఎస్‌ఎస్‌ఐ) సభ్యురాలు, రంజీ క్రికెటర్‌ విజయ్‌ మోహన్‌ సతీమణి ఫరీదా రాజ్‌ పేర్కొన్నారు. ఈ నెలాఖరులో ఈ పుస్తకాన్ని విడుదల చేస్తామని ఆమె తెలిపారు. రక్తనాళాలు గట్టిపడడం (ఎంఎస్‌) సమస్యకు సంబంధించిన దిక్సూచిగా ఈ పుస్తకం ఉంటుందని గురువారం ఒక ప్రకటనలో ఫరీదా పేర్కొన్నారు. సరైన రోగనిర్ధారణ, సకాలంలో చికిత్స, సంరక్షణతో బాధితులు ఆరోగ్యకరమైన జీవితాలను గడపవచ్చని ప్రజలకు తెలియజేయడమే తన లక్ష్యమన్నారు.

ఆమ్రపాలికి మరిన్ని బాధ్యతలు

సాక్షి, సిటీబ్యూరో: హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌ ఆమ్రపాలికి పరిపాలనా విభాగంతో పాటు మరిన్ని బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు హెచ్‌ఎండీఏ భూసేకరణ పథకం (ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌)తో పాటు చెరువుల రక్షణ కమిటీని ఆమెకు కేటాయించారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల రక్షణకు సంబంధించిన అంశాలను కూడా ఆమె పర్యవేక్షించనున్నారు. ఈ రెండింటితో పాటు హెచ్‌ఎండీఏలోని ఎస్టేట్‌ విభాగం.అర్బన్‌ ఫారెస్ట్రీ విభాగాన్ని ఆమెకు కేటాయించారు. అర్బన్‌ ఫారెస్ట్రీలో చేపట్టాల్సిన పనులపై ఆమెకు పూర్తి అధికారాలను అప్పగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement