ముగ్గుర్ని కబళించిన కంటైనర్
మేడ్చల్‌రూరల్: ప్రమాదానికి గురై ఆపదలో ఉన్న వారిని పరామర్శించేందుకు వెళ్తున్న ఓ కుటుంబంలోని ముగ్గుర్ని కంటైనర్ వాహనం కబళించింది. ఈ విషాదకర ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ కాకినాడలోని ఎర్రవరంనకు చెందిన సాగి బుల్లబ్బాయ్ (35), భార్య లావణ్య (25), కూతురు హర్షితాదేవి (8), కుమారుడు సిద్ధేశ్వర్ (6)లతో కలిసి బతుకుదెరువు కోసం కొన్నాళ్ల క్రితం నగరానికి వలస వచ్చి ఉప్పల్ ప్రాంతంలో ఉంటున్నారు. బుల్లబ్బాయ్ ఉదయం పూట ఇడ్లీ (టిఫిన్స్) అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కాకినాడ ప్రాంతానికే చెందిన బుల్లబ్బాయ్ స్నేహితుడైన జోక వెంకటేశ్వర్‌రావు కుటుంబం మేడ్చల్ మండలం ఎల్లంపేట్ గ్రామంలో నివాసం ఉంటూ టిఫిన్స్ వ్యాపారం చేస్తోంది. కొన్ని రోజుల క్రితం వెంకటేశ్వర్‌రావు భార్య ప్రమాదానికి గురై చేతికి ఫ్రాక్చర్ అయింది. వీరిని పరామర్శించేందుకు ఆదివారం బుల్లబ్బాయ్ కుటుంబం (నలుగురు) తమ టీవీఎస్ ఎక్స్‌ఎల్ ద్విచక్ర వాహనంపై ఉప్పల్ నుంచి ఎల్లంపేట్‌కు వెళ్తోంది. మేడ్చల్ చెక్‌పోస్ట్ సమీపానికి చేరుకున్న వీరి ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ వాహనం ఢీకొట్టింది. దీంతో టీవీఎస్‌పై ఉన్న బుల్లబ్బాయ్, ఆయన భార్య లావణ్య, కూతురు హర్షితా దేవి, కుమారుడు సిద్ధేశ్వర్ రోడ్డుపై పడిపోయారు. వీరిపై నుంచి కంటైనర్ వెళ్లడంతో దంపతులతో పాటు కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. సిద్ధేశ్వర్ రెండు కాళ్లూ నుజ్జునుజ్జ య్యాయి. బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మేడ్చల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాద స్థలంలో మృతదేహాలు
మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద రోడ్డు ప్రమాదం
దంపతులు సహా కుమార్తె దుర్మరణం
కుమారుడి పరిస్థితి విషమం
మిత్రుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా విషాదం
Comments
Please login to add a commentAdd a comment