ఆరాంసే రయ్ రయ్
నేడు ఆరాంఘర్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్న సీఎం
రూ.799.74 కోట్ల ఎస్‌ఆర్‌డీపీ నిధులతో నిర్మాణం
6 లేన్లు, 4 ర్యాంపులతో 4.04 కి.మీ పొడవు
చార్మినార్: ఆరాంఘర్ ఫ్లై ఓవర్ ప్రారంభం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వాహనదారులకు శుభవార్త. జూపార్కు నుంచి ఆరాంఘర్ వరకు 6 లేన్లతో నిర్మించిన ఫ్లై ఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించనున్నారు. ఫ్లై ఓవర్‌ను గత డిసెంబర్‌లోనే ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ.. కొన్ని సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. ప్రజా పాలన విజయోత్సవాలను పురస్కరించుకుని గత నెల 8న అంటూ ఒకసారి.. కాదు కాదు 9 అంటూ మరోసారి ఏర్పాట్లు చేసినప్పటికీ వీలు పడలేదు. ఎట్టకేలకు నేడు ఆరాంఘర్ ఫ్లై ఓవర్ ప్రారంభానికి మోక్షం వచ్చింది.
మూడేళ్లుగా తప్పని తిప్పలు..
స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఎస్‌ఆర్‌డీపీ) కింద 2021 డిసెంబర్‌లో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను ప్రారంభించారు. రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ.. పలు సాంకేతిక కారణాలతో జాప్యం ఏర్పడింది. మూడేళ్లుగా పనులు కొనసాగడంతో వాహనదారులు పలు ఇబ్బందులకు గురయ్యారు. పూర్తిగా శిథిలావస్థకు చేరిన రోడ్లతో పడరాని పాట్లు పడ్డారు. 4.04 కిలో మీటర్ల పొడవుతో నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఆయా ప్రాంతాల్లోని వాహనదారులు ఇబ్బందులకు గురవుతూ వచ్చారు.
తీరనున్న ట్రాఫిక్ కష్టాలు..
నగరంలో ఇప్పటికే ఆరు లేన్ల ఫ్లై ఓవర్‌లున్నప్పటికీ.. 4.04 కిలో మీటర్ల పొడవుతో ఉన్న ఈ ఫ్లై ఓవర్ వీటిలో మరొకటి. పీవీఎన్‌ఆర్, బహదూర్‌పురా, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు.. ఇలా పొడవైన ఫ్లై ఓవర్లున్నప్పటికీ.. 6 లేన్లతో 4 అప్ అండ్ డౌన్ ర్యాంపులతో జూ పార్కు– ఆరాంఘర్ ఫ్లై ఓవర్‌ను నిర్మించడం గమనార్హం. రూ.799.74 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ ఫ్లై ఓవర్ ఆరాంఘర్, శాసీ్త్రపురం, మీరాలం ఫిల్టర్, కాలాపత్తర్, శివరాంపల్లి, హసన్‌నగర్ తదితర ప్రాంతాల ప్రజలకు ఎంతో అనుకూలంగా మారనుంది. బెంగళూరు జాతీయ రహదారిలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
ఆదివారం రాత్రి విద్యుత్ వెలుగుల మధ్య ఆరాంఘర్– జూ పార్కు ఫ్లై ఓవర్
Comments
Please login to add a commentAdd a comment