సాక్షి, సిటీబ్యూరో: పాత నగరంలో రెండో దశ మెట్రో పనుల్లో మరో అడుగు పడింది. రోడ్డు విస్తరణలో భాగంగా ఆస్తులు కోల్పోయిన యజమానులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించడానికి ముహూర్తం ఖరారైంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. రెండో దశ కారిడార్–6లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ మార్గంలో 1,100 ఆస్తులు ప్రభావితం కానున్నాయి. యజమానులు స్వచ్ఛందంగా తమ స్థలాలను మెట్రో రైలు నిర్మాణం కోసం ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 169 మంది అనుమతి పత్రాలను అందజేశారని చెప్పారు. వీరిలో 40కి పైగా ఆస్తుల యాజమాన్యానికి సంబంధించిన ధ్రువీకరణ పూర్తయిందన్నారు. తొలి దశలో ఈ 40కి పైగా ఆస్తుల యజమానులకు నష్ట పరిహారాన్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెక్కుల రూపంలో అందజేస్తారని ఆయన తెలిపారు. ప్రభావిత ఆస్తులకు చదరపు గజానికి రూ.81,000 చొప్పున అందజేయనున్నారు. దీంతో పాటు రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ చట్టం ప్రకారం, పునరావాస పరిహారం, తొలగించే నిర్మాణాలకు కూడా నష్ట పరిహారాన్ని అర్హులైన ఆస్తుల యజమానులకు ఇవ్వనున్నట్లు ఎన్వీఎస్ స్పష్టం చేశారు. లక్డీకాపూల్‌లోని హైదరాబాద్ కలెక్టరేట్‌లో చెక్కులు అందజేస్తామని ఆయన తెలిపారు.
ప్రభావిత ఆస్తుల యజమానులకు చెక్కుల పంపిణీ నేడు
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment