అక్షరాలా రూ. 2,739 కోట్లు! | - | Sakshi
Sakshi News home page

అక్షరాలా రూ. 2,739 కోట్లు!

Published Mon, Jan 6 2025 8:10 AM | Last Updated on Mon, Jan 6 2025 6:04 PM

 ‘వైట్‌ కాలర్‌’ మోసగాళ్లు

‘వైట్‌ కాలర్‌’ మోసగాళ్లు

నగరంలో ‘వైట్‌ కాలర్‌’ మోసగాళ్లు కాజేసిన మొత్తమిది

2023, 2024 గణాంకాల్లో వెల్లడి

చక్కదిద్దేందుకు చర్యలు అన్వేషిస్తున్న పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: రోజుకు రూ.3.8 కోట్లు.. వారానికి రూ.26.6 కోట్లు... నెలకు రూ.114.1 కోట్లు... ఏడాదికి రూ.1,369.5 కోట్లు. నగరంలో ‘వైట్‌ కాలర్‌’ నేరగాళ్లు కాజేసిన మొత్తమిది. 2023, 2024లలో నమోదైన మోసాల కేసుల్లో నగర వాసులు కోల్పోయింది అక్షరాలా రూ.2,739 కోట్లు. ‘వైట్‌ కాలర్‌’ మోసగాళ్లు రెచ్చిపోవడానికి అనేక అంశాలు కలిసి వస్తుండటం గమనార్హం.

ఆశ, నమ్మకాలే పెట్టుబడి...

‘వైట్‌ కాలర్‌’ మోసగాళ్లు ఎదుటి వారిలో ఉన్న ఆశ, వారి నమ్మకాలే పెట్టుబడిగా చేసుకుని దండుకుంటుంటారు. ఎదుటి వ్యక్తులనో, సంస్థనో పక్కాగా నమ్మించగలిగితే చాలు. ఒక్కోసారి వీరి ‘లాభం’ రూ.కోట్లలోనూ ఉంటుంది. ఈ కారణంగానే వైట్‌కాలర్‌ అఫెండర్లు ఓ పక్క నేరుగా, మరోపక్క సైబర్‌ నేరగాళ్లు ఆన్‌లైన్‌ ద్వారా అందినకాడికి దండుకుంటున్నారు.

చిక్కినా శిక్షలు తక్కువే..

ఈ మోసగాళ్లకు చట్టంలో ఉన్న లొసుగులే కలిసి వస్తున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న చట్ట ప్రకారం రూ.లక్ష మోసం చేసినా... రూ.10 కోట్లు మోసం చేసినా చీటింగ్‌ ఆరోపణలపై ఒకే సెక్షన్‌తో కేసులు నమోదవుతాయి. ఆ మోసం చేయడానికి అనుసరించిన మార్గాన్ని బట్టి ఇంకొన్ని సెక్షన్లు అదనంగా వచ్చి చేరే అవకాశం ఉంటుంది. ఎదుటి వారిని మోసం చేయడానికి పత్రాలు తయారు చేసినా, ఇతర గుర్తింపులు చూపించినా ఫోర్జరీ, ఇంపార్సినేషన్‌ తదితరాలను జోడిస్తారు. న్యాయస్థానంలో నేరం నిరూపితమైనప్పుడు అది నమోదైన సెక్షన్‌ ప్రకారమే శిక్ష ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎంత పెద్ద మొత్తం కాజేసినా మోసగాళ్లు తక్కువ శిక్షలతో బయటపడుతున్నారు.

చక్కదిద్దే చర్యలు ప్రారంభం...

ఈ పరిస్థితుల్ని బేరీజు వేసిన పోలీసు విభాగం కొన్ని చక్కదిద్దే చర్యల్ని ప్రారంభించింది. ఇటీవల కాలంలో సైబర్‌ నేరగాళ్లు నానాటికీ పేట్రేగుతుండటం, ఆర్థిక నేరాల వల్లే ప్రజలు ఎక్కువ నష్టం పోవడాన్ని పరిగణనలోకి తీసుకుని అనేక చర్యలకు ఉపక్రమించారు. ప్రాథమికంగా అధికారులకు దర్యాప్తు తీరుతెన్నుల్లో మెలకువలు నేర్పిస్తున్నారు. సీసీఎస్‌ అధికారులకు అనుభవజ్ఞులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. సైబర్‌, ఎకనమిక్‌ నేరాల దర్యాప్తుపై తర్ఫీదు ఇవ్వడంతో పాటు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నారు. తీవ్రమైన నేరాల్లో ఆదాయపుపన్ను శాఖతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు సమాచారం ఇస్తున్నారు.

నగరంలో నమోదైన నేరాల గణాంకాలు..

● 2023లో సీసీఎస్‌ పోలీసులు నమోదు చేసిన 361 వైట్‌ కాలర్‌ అఫెన్సెస్‌ రూ.1355 కోట్లు, 2984 సైబర్‌ నేరాల్లో బాధితులు రూ.147 కోట్లు నష్టపోయారు.

● 2024లో (నవంబర్‌ వరకు) సీసీఎస్‌ పోలీసులు నమోదు చేసిన 248 వైట్‌ కాలర్‌ అఫెన్సెస్‌లో రూ.1036 కోట్లు, 2868 సైబర్‌ నేరాల్లో రూ.38 కోట్లు బాధితులు కోల్పోయారు.

కొత్త తలనొప్పులు..

‘వైట్‌ కాలర్‌’ నేరాల్లో సైబర్‌ క్రైమ్‌ కూడా ఒకటి. సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న నేరగాళ్లు చిక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎన్ని వ్యయ ప్రయాసలకోర్చినా పాత్రధారులు, దళారులు తప్ప సూత్రధారులు చిక్కట్లేదు. కొన్ని సందర్భాల్లో ఈ నేరాలపై ఎవరికి ఫిర్యాదు చేయాలన్నది సామాన్యులకు స్పష్టంగా తెలియక, స్థానిక పోలీసుల నుంచి సరైన స్పందన లేక అనేక కేసులు నమోదు కావట్లేదు. నమోదైనా అవసరమైన స్థాయిలో దర్యాప్తు ఉండట్లేదు. ఇంటర్నెట్‌ కేంద్రంగా చోటు చేసుకుంటున్న సైబర్‌ నేరాల్లో 50 శాతం కూడా నమోదు కావట్లేదు. నమోదైన నేరాల్లో సగానికి సగం కూడా కొలిక్కి రావట్లేదు. ఇక వీరి నుంచి నగదు రికవరీ అనేది దుర్లభం. కేసు నమోదై, దర్యాప్తు పూర్తి అయినప్పటికీ... కోర్టు విచారణ ప్రక్రియ ముగియడానికి చాలా సమయం పడుతోంది. అప్పటి వరకు వేచి ఉండేందుకు ఆసక్తి చూపని బాధితులు మధ్యలోనే మోసగాళ్లతో రాజీ పడుతున్నారు.

కఠిన చట్టం అవసరం

మోసగాళ్లను కట్టడి చేయడానికి మరిన్ని కఠిన చట్టాలు అవసరం. ప్రస్తుతం కేవలం డిపాజిటర్స్‌ ప్రొటెక్షన్‌్‌ యాక్ట్‌తో నమోదైన కేసులతో పాటు మనీ లాండరింగ్‌ యాక్ట్‌ కింద కేసుల్లో మాత్రమే నిందితుల ఆస్తులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా ప్రతి ఆర్థిక నేరంలోనూ ఈ విధానం అమలయ్యేలా మార్పులు రావాలి. దీనికితోడు చోరీలు, దోపిడీలు చేసే వారితో పాటు ఇలాంటి వైట్‌ కాలర్‌ నేరగాళ్ల పైనా నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. మోసగాళ్లు కాజేసిన మొత్తం ఆధారంగా శిక్షలు ఉండేలా చర్యలు తీసుకోవాలి.

– ప్రభాకర్‌, మాజీ డీఎస్పీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement