‘కుంభమేళా’పై సైబర్ నేరగాళ్ల కన్ను!
● టికెట్ల బుకింగ్, వసతి పేరిట యాత్రికులకు వల
● నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌లతో మోసాలు
● డిస్కౌంట్లు, ఆఫర్లను చూసి తొందరపడొద్దు
● అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసుల సూచన
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కుంభమేళా–2025కు వెళ్లాలని మీరు ప్లాన్ చేస్తున్నారా? కుంభమేళా ప్రయాణ టికెట్లు, వసతి తదితర సేవల మాటున సైబర్ నేరగాళ్ల ప్రమాదం పొంచి ఉంది. డిస్కౌంట్లు, ఆఫర్లు ఉన్నాయని అత్యాశతో తొందరపడ్డారో అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఉంది. ఏమరుపాటుగా ఉంటే సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి జేబులు ఖాళీ చేసుకునే ప్రమాదం ఉంది. నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌లతో యాత్రికులు, భక్తులకు వల వేసే ప్రమాదం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కుంభమేళా టికెట్ల బుకింగ్ పేరుతో యాత్రికులను మోసం చేసిన పలు కేసులు ప్రయాగ్‌రాజ్‌లో నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. నగరంలో ఈ తరహా కేసులు నమోదు కాకపోయినప్పటికీ యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
నకిలీ వెబ్‌సైట్లు, యాప్స్..
కుంభమేళాకు లక్షలాది మంది యాత్రికులు వెళుతుంటారు. దీన్ని సైబర్ నేరస్తులు మోసాలకు అవకాశంగా మలుచుకునే ప్రమాదం ఉంది. కుంభమేళా ప్రయాణ టికెట్లు, వసతి ఇతరత్రా సేవల కోసం నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌లను సృష్టించి సామాజిక మాధ్యమాలలో పోస్టు చేస్తున్నారు. భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటిస్తూ యాత్రికులను ఆకర్షిస్తున్నారు. కాటేజీలు, టెంట్లు, హోటళ్లను అద్దెకు తీసుకునేందుకు నకిలీ బుకింగ్ వెబ్‌సైట్‌లతో యాత్రికులను లక్ష్యంగా చేసుకునే సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా.. ప్రత్యేక వీఐపీ స్నానపు గదులు, ప్రీమియం ఏర్పాట్లతో నకిలీ ప్లాట్‌ఫారమ్‌లను సృష్టించి భక్తులను మోసం చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్ లు, ప్రత్యేక ఏర్పాట్ల ముసుగులో యాత్రికులను మోసం చేస్తూ భారీగా డబ్బులు దండుకుంటున్నారు.
అధీకృత ఫ్లాట్‌ఫామ్‌లనే ఎంచుకోవాలి..
కుంభమేళాకు వెళ్లే యాత్రికులు బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లను క్షుణ్ణంగా ధ్రువీకరించుకోవాలని, రిజర్వేషన్‌ల కోసం ప్రభుత్వ అధీకృత వెబ్‌సైట్‌లపై మాత్రమే ఆధారపడాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానాస్పద, గుర్తు తెలియని వెబ్‌సైట్లు, లింక్‌లను ఎట్టి పరిస్థితులను క్లిక్ చేయకూడదు. అలాగే.. అయాచిత లింక్‌లు లేదా నమ్మశక్యం కాని డిస్కౌంట్లను అందించే ప్రకటనలను విశ్వసించకూడదు. సురక్షిత చెల్లింపు పద్ధతులను వినియోగించాలి. అంతేకాకుండా.. రిజర్వేషన్ల బుకింగ్ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులతో బ్యాంక్ వివరాలు, ఇతరత్రా వ్యక్తిగత వివరాలను సమర్పించకూడదు.
Comments
Please login to add a commentAdd a comment