మూసీ నది దుస్థితికి గత పాలకులే కారణం
సెమినార్‌లో వక్తల ఆరోపణ
కాచిగూడ: మూసీ నది ప్రస్తుత దుస్థితికి గత 70 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలే ప్రధాన కారణమని పలువురు మేధావులు, సామాజిక కార్యకర్తలు, సీపీఐ నేతలు స్పష్టం చేశారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన ‘ హైడ్రా కార్యకలాపాలు–మూసీ నది ప్రక్షాళన–పేద, మధ్య తరగతి బాధితులకు ప్రత్యామ్నాయం’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్‌రావు, ప్రొఫెసర్ జి.హరగోపాల్, సీనియర్ జర్నలిస్ట్ కె.శ్రీనివాస్, సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. గత పాలకులు ఎలాంటి ప్రణాళికలు లేకుండా ఇష్టానుసారంగా హైదరాబాద్ రూపు రేఖలు, భవిష్యత్ నిర్ణయించే విధానాలు అమలు చేసిన కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. మూసీని, హైదరాబాద్‌ను విడదీసి చూడలేమని, హైదరాబాద్ జలవ్యవస్థ అంతా మూసీపై ఆధారపడి ఉందన్నారు. అందుకే మూసీ ప్రక్షాళనను హైడ్రాను వేరు చేసి చూడలేమని పేర్కొన్నారు. మూసీ నదిని పునరుజ్జీవింప చేయాల్సిందేనని, ఇందుకు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.
వ్యూహాత్మక చర్యలు తీసుకోవాలి..
అయితే మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా చర్యలు తీసుకోవాలనే కాని..అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తామని వక్తలు పేర్కొన్నారు. మూసీ బాధితుల సమస్యలు, బాధలు పూర్తిగా మానవీయ కోణంలో ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ప్రతి బాధితుడికి సంపూర్ణమైన పరిహారం చెల్లించడంతో పాటు జీవనోపాధిని చూపిన తర్వాతే మూసీ పునరుజ్జీవన ప్రక్రియ చేపట్టాలన్నారు. మూసీని పునరుద్ధరించడం అంటే కేవలం మూసీని బాగు చేయడమే కాదని, మూసీ నదిపై ఆధారపడిన వారందరికి మెరుగైన జీవన పరిస్థితులను అందజేయాలన్నారు. మూసీ పునరుజ్జీవనం ఎంత అవసరమో ప్రజలకు ముందు అవగాహన కల్పించి, వారిని చైతన్యం చేయాలని సూచించారు. బాధిత ప్రజలకు ప్రత్యామ్నాయం చూపడంతో పాటు వారికి జీవనోపాధి లభించే వరకు నెలకు రూ.10 వేల చొప్పున అందజేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్లపల్లి శ్రీనివాస్, ఎన్.బాలమల్లేష్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీఎస్ బోసు, ఈటి నరసింహ, బాధిత ప్రజలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment