రిజర్వేషన్లపై ఉత్కంఠ..!
● కేడర్‌తో పాటు అధిష్టానం ఆశీస్సుల కోసం ప్రయత్నాలు
● పల్లెల్లో మొదలైన సందడి
● జిల్లాలో 7.61లక్షల మంది ఓటర్లు
జనగామ: జిల్లాలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీచేసే ఆశావహులు ప్రభుత్వం ప్రకటించే రిజర్వేషన్ల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పలు పంచాయతీల్లో సర్పంచ్ పదవికి పోటీచేసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. వచ్చే నెల రెండోవారంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో పోటీలో నిలబడనున్న నాయకులు కేడర్‌తో పాటు అధిష్టానం ఆశీస్సుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అన్నీ కలిసొచ్చినా.. రిజర్వేషన్లు ఎలా ఉండబోతున్నాయనే టెన్షన్ పట్టుకుంది. అధిష్టానం గ్రీన్ సిగ్నల్‌తో పాటు రిజర్వేషన్లు సైతం కలిసి రావాలని కోరుకుంటున్నారు.
జిల్లాకు చేరుకున్న ఎన్నికల సామగ్రి
గత ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన సర్పంచ్, జూలై 4న ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి స్పెషలాఫీసర్ల పాలన కొనసాగుతోంది. ఇప్పటికే జిల్లాకు ఎన్నికల సామగ్రి చేరుకుంది. ప్రిసైడింగ్, రిటర్నింగ్ అధికారులకు సంబంధించిన ప్రింటింగ్ పేపర్లు సిద్ధం చేశారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రతీ విభాగానికి ఒక జిల్లా స్థాయి అధికారితో పాటు ప్రత్యేక అధికారిగా కలెక్టర్ నియమించారు.
మూడు పంచాయతీల్లో ఎన్నికలు లేనట్టే?
స్టేషన్‌ఘన్‌పూర్(శివునిపల్లి, ఛాగల్)ను మున్సిపాలిటీగా ప్రకటిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో స్థానిక పోరులో ఈ మూడు జీపీల పరిధిలో సర్పంచ్ ఎన్నికలు ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయంపై అధికారుల నుంచి పూర్తిస్థాయి క్లారిటీ రావాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారికి నిరాశే మిగిలినా.. కౌన్సిలర్‌గా పోటీ చేసే అవకాశం ఉంటుంది. అదృష్టం కలిసొచ్చి రిజర్వేషన్లు అనుకూలిస్తే చైర్మన్, వైస్ చైర్మన్ అయ్యే అవకాశం లేకపోలేదు.
మూడు నియోజకవర్గాలు
జిల్లాలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో కొత్తగా 7,500మంది ఓటర్లు ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. దీంతో జిల్లాలో మొత్తంగా 7,61,642మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 23మంది ఉండగా సర్వీసు ఓటర్లు 464మంది ఉన్నారు.
నిర్ణయ యాప్‌లో ఓటరు జాబితా..
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయ అనే యాప్‌ను రూపొం దించింది. ఈ యాప్‌లో టీ పోల్ పోర్టర్‌లో ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలు వివరాలను అందుబా టులో ఉంచారు. ఎలక్షన్ పకడ్బందీగా నిర్వహించేందుకు 12 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. గతంలో 14మంది సర్పంచ్‌లు మృతి చెందగా, నలుగురు వివిధ కారణాల చేత పదవి నుంచి తొలగింపబడ్డారు. అదే విధంగా ఓ ఉప సర్పంచ్‌ను రిమూవ్ చేశారు.
కేడర్‌కు విందులు..
అధికారులు ఎలక్షన్ నిర్వహణకు బిజీలో ఉండగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఎంల నుంచి పోటీకి సై అంటున్న ఆశావహులు నోటిఫికేషన్, రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్లుగా పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్న అభ్యర్థులు కేడర్‌కు విందులు ఇస్తూ మచ్చిక చేసుకుంటున్నారు. పలు గ్రామాల్లో మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తున్నారు. యువతకు ఆట వస్తువులు ఇవ్వడంతో పాటు నిరుపేద కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తూ మార్కులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా సర్పంచ్ ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు. కులాల వారీగా ఓట్ల లెక్క వేస్తూ.. పోటీకి సిద్థఽమైన సమయంలో ఎలా ముందుకు వెళ్లాలనే ముందస్తు ప్లాన్ చేసుకుంటున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులతో రహస్య మంతనాలు సాగిస్తూ ఊళ్లలో తమ పరపతి ఎలా ఉందో ఒకటికి, రెండు పర్యాయాలు చెక్ చేసుకుంటున్నారు. వ్యతిరేకత ఉన్న చోట అనుకూలంగా మలుచుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఈ సారి ఎన్నికల బరిలో నిలబడే ఆశావహులకు రిజర్వేషన్లు కలిసివస్తాయో లేదో కొద్ది రోజుల్లో తేలిపోనుంది. రిజర్వేషన్ల మార్పుతోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించబోతున్నామని ఇటీవల ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment