కాటారం: సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కేంద్రాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దళారులతో కుమ్మకై ్క వారికి పెద్దపీట వేస్తూ రైతులను కొల్లగొడుతున్నారు. సీసీఐ నిర్వాహకుల అండదండలతో దళారులు స్థానిక పత్తి మిల్లుల్లో తమ ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. సీసీఐ అధికారుల నిర్వాహకంతో జిన్నింగ్ మిల్లులకు పత్తి విక్రయించడానికి వచ్చే రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దళారులు ఇచ్చే కమీషన్‌కు కక్కుర్తిపడి సీసీఐ నిర్వాహకులు రైతులు తెచ్చిన పత్తిని పక్కన పెడుతూ దళారుల పత్తిని కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో మూడు సీసీఐ కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటివరకు సుమారుగా 3,51,560 క్వింటాల పత్తిని కొనుగోలు చేశారు.
రైతుల పత్తి కొనుగోలుకు సాకులు..
దళారులు విక్రయానికి తెచ్చే పత్తి ఎలా ఉన్నా అభ్యంతరం చెప్పని సీసీఐ కేంద్రాల నిర్వాహకులు సాధారణ రైతులు విక్రయించడానికి తెచ్చే పత్తికి మాత్రం అడ్డగోలు నిబంధనలు విధిస్తున్నారు. పత్తి సరిగా లేదు, తేమ శాతం ఎక్కువగా ఉంది అనే కుంటిసాకులు చెపుతూ పత్తిని కొనుగోలు చేయడానికి విముఖత చూపుతున్నారు. తిరిగి ఏదైనా దళారులతో సీసీఐ నిర్వాహకులకు చెప్పించి కమీషన్ మాట్లాడిన తర్వాతనే పత్తిని కొనుగోలు చేస్తున్నారని పలువురు రైతులు చెబుతున్నారు. అంతేకాకుండా రైతులు పత్తి లోడ్‌తో తీసుకొచ్చిన వాహనాలు క్యూలో ఉన్నప్పటికీ దళారుల పత్తి వాహనాలను సీసీఐ నిర్వాహకులు దిగుమతి చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఫేక్ పట్టా రైతుల పేరిట విక్రయాలు..
దళారులు సీసీఐ కేంద్రాలకు తీసుకొచ్చిన పత్తిని పలువురి పేరుపై ఫేక్ రైతు పట్టాలు సృష్టించి వారి కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట కౌలుకు తీసుకున్నట్లు నమోదు చేసి విక్రయిస్తున్నట్లు తెలిసింది. దీంతో సీసీఐ ద్వారా విక్రయించిన పత్తి నగదు వారి ఖాతాలో జమ అవుతున్నట్లు సమాచారం. దీంతో చిక్కులు లేకుండా వారి వ్యాపారం సజావుగా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment