అమరచింత: తమ పాలిట శాపంగా మారిన కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్ట రికవరీ విధానాన్ని రద్దు చేయాలంటూ కృష్ణవేణి చెరుకు రైతుల సంఘం ఆధ్వర్యంలో చెరుకు రైతులు సోమవారం కొత్తకోట నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం సమస్యల వినతిపత్రాన్ని సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లుకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చెరుకు మద్దతు ధర టన్నుకు రూ.ఆరు వేలు చెల్లించాలని, సన్నరకం వరి ధాన్యానికి ఇస్తున్నట్లుగా చెరుకు కూడా బోనస్ ప్రకటించాలన్నారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఫీల్డ్‌మెన్‌లను వేధిస్తున్న జీఎం రూపేష్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని, పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి న్యాయం చేయాలని కోరారు. రవాణా సమయంలో ఆర్టీఓ, పోలీసుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను నివారించాలని విన్నవించారు. ఏళ్లుగా కొత్త వంగడాలను ఫ్యాక్టరీ యాజమాన్యం పరిచయం చేయడం లేదని.. దీంతో దిగుబడి లేక రైతులు నష్టపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. వేరుపురుగు సోకిన పంటలకు ఫ్యాక్టరీనే పూర్తిస్థాయిలో పరిహారం ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో వాసారెడ్డి, తిరుపతయ్య, నారాయ, రాజు, అరుణ్, చారి, శ్రీనివాస్‌రెడ్డి, చంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment