ఇక్కడ పార్కింగ్ ప్రమాదం సుమీ!
అన్నవరం: రత్నగిరి పై కొలువైన సత్యదేవుని ఆలయానికి వివిధ వాహనాలలో వచ్చే భక్తులు సత్యగిరి పక్కన కొండను చదును చేసి ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో తమ వాహనాలను నిలుపుతున్నారు. అయితే అక్కడ ఒక వైపు లోయ ఉంది. లోయ వైపు బారికేడ్స్ లేకపోవడంతో వాహనాలను పార్క్ చేయడానికి వాహనదారులు భయపడుతున్నారు. కోవిడ్ తరువాత వాహనాలలో సత్యదేవుని ఆలయానికి విచ్చేసే భక్తులు పెరిగారు. సాధారణ రోజుల్లో సుమారు వేయికి పైగా వాహనాలలో వస్తుంటే పర్వదినాలలో ఐదు వేలకు పైగా వాహనాలలో విచ్చేస్తున్నారు. గతంలో ఈ వాహనాలకు పార్కింగ్ స్థలం తక్కువగా ఉండేది. దాంతో రెండు ఘాట్‌రోడ్డులకు ఇరువైపులా వాహనాలను నిలిపివేయడంతో తరచూ ట్రాఫిక్ జామ్ అయ్యేది. దీంతో వాహనదారులతో బాటు సామాన్య భక్తులు కూడా ఇబ్బంది పడేవారు. 2023లో ఈఓ గా పనిచేసిన ఎస్‌ఎస్ చంద్రశేఖర్ అజాద్ భక్తుల వాహనాలను నిలిపివేసేందుకు సత్యగిరి పక్కన కొండను చదును చేయించి మల్టీపర్పస్ పార్కింగ్ ప్లేస్ అభివృద్ధి చేశారు. ఇక్కడ సుమారు రెండు వేల వాహనాలను పార్క్ చేసే సదుపాయం కల్పించారు. ఈ పార్కింగ్ ప్లేస్‌లో ఒకవైపు కొండ మరో వైపు లోయ ఉన్నాయి. పార్కింగ్ చేసిన వాహనాలు పడిపోకుండా లోయ వైపు చిన్న గోడ లేదా బారికేడ్స్ నిర్మించాలని ఆయన ఇంజినీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. అయితే ఆయన 2023 నవంబర్‌లో బదిలీ అయ్యారు. అప్పటి నుంచి ఆ పార్కింగ్ ప్లేస్‌లో లోయవైపు ఎటువంటి గోడ లేదా బారికేడ్స్ నిర్మాణం జరగలేదు. సాధారణ రోజులలో ఇక్కడ కొండ వైపు వాహనాలను నిలుపుదల చేస్తున్నారు. శని, ఆదివారాలు, దశమి, ఏకాదశి, పౌర్ణిమ వంటి పర్వదినాలలో మాత్రం వాహనాలు ఎక్కువగా వస్తుండడంతో లోయ వైపు కూడా వాహనాలను నిలుపుదల చేస్తున్నారు. అయితే ఆ వాహనాలు నిలుపుదల చేయడంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా లోయలో పడిపోయే అవకాశం ఉంది. ఆ పార్కింగ్ స్థలంలో లోయ వైపు రక్షణ గోడ నిర్మించడం లేదా ఇనుప స్తంభాలతో బారికేడ్స్ ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
ఒక వైపు లోయ..ఇంకో వైపు కొండ
లోయ వైపు బారికేడ్స్ లేక
వాహనదారులకు ఇబ్బంది
Comments
Please login to add a commentAdd a comment